తేనెటీగల పెంపకం ఓ “తియ్యని” కథ
గ్రీస్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
ఉదయ కాంతి ఆకాశంలో నెమ్మదిగా సన్నగా ప్రసరిస్తోంది. వేకువజామున, చలిలో, పొగమంచులో పర్వతం క్రిందిభాగానవున్న రోడ్డు ప్రక్కన ఒక చిన్న ట్రక్కు నెమ్మదిగా ఆగుతుంది. చేతితొడుగులను, బూట్లను, కాటన్ వస్త్రాలను ధరించిన, ముసుగు వేసుకుని ఉన్న, వెడల్పైన అంచులు గల టోపీలను ధరించిన అస్పష్టమైన రెండు ఆకారాలు బయటకు వచ్చాయి. చాలా జాగ్రత్తగా అయితే చురుగ్గా కదులుతూ వాళ్ళు అనేక చెక్కపెట్టెలను ట్రక్కుమీదకి ఎక్కించారు. వారిరువురూ సులభంగా ఏదో దొంగిలించడానికి ప్రయత్నిస్తున్న దొంగలా? లేదు, వాళ్ళు ఇద్దరు తేనెటీగల పెంపకందారులు. ఆ వ్యక్తులు తమ విలువైన తేనెటీగల సైన్యాల విషయంలో చాలా మంచి జాగ్రత్త తీసుకుంటున్నారు—మకరందాన్ని ఉత్పత్తి చేసే మొక్కలున్న మరో సుదూర ప్రాంతానికి వాటిని తీసుకుని వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.
తేనెటీగల పెంపకందారులు ఓ ప్రత్యేక తరహా ప్రజలు. ఒక ప్రత్యేకరకమైన కీటకంతో తమకు గల అన్యోన్య సంబంధాన్ని గూర్చి గొప్పగా చెప్పుకునే ప్రజలు. ఒక విషయమేమిటంటే, తేనెటీగలు బహుశా కీటకాలన్నింటిలోకెల్లా ఆర్థిక సంబంధంగా అత్యంత విలువైనవి అన్నదే. అవి తేనెను తేనెమైనాన్ని ఉత్పత్తిచేస్తాయి, అనేక పంటలకు పుప్పొడిని వెదజల్లుతాయి. మరొకటేంటంటే, కొందరు తేనెటీగల పెంపకం ద్వారా నిత్యావసర ఖర్చులకవసరమైనది సంపాదిస్తారు, అదే సమయంలో ఆ చిన్ని ప్రాణులను ప్రేమిస్తారు. వాళ్ళలో ఒకరు చెప్పినట్లు “వారు వాటిని అర్థంచేసుకుంటారు.”
“ప్రతిదిన ఆశ్చర్యాల” సంరక్షకుడు
తేనెటీగల పెంపకందారుడు కావడం—తేనెటీగల కాలనీలతో నిండివున్న అనేక తేనె తెట్టులను సంపాదించడం, మకరందం ఉత్పత్తి అయ్యే ప్రాంతంలో వాటిని ఉంచడం, కొన్ని నెలల తర్వాత దిగుబడిని తీసుకోవడానికి తిరిగివెళ్ళడం—చాలా సులభమని అనిపించవచ్చు. కానీ అది అంత సులభం కాదు. నిజానికి ఏమి ఇమిడి ఉందో కనుగొనేందుకు తేనెటీగల పెంపకాన్ని వృత్తిగా చేపట్టిన జాన్ మరియు మారియాలతో మేము మాట్లాడాం. తమ ప్రియమైన వృత్తిని గురించి వాళ్ళు చాలా సంతోషంగా చెప్పారు.
“ఒక వ్యక్తి తేనెటీగల పెంపకంలో ప్రతిరోజు ఆశ్చర్యకరమైన విషయాలను చూస్తాడు. ఉన్నతంగా క్రమబద్ధం చేయబడిన తేనెటీగల సామూహిక జీవితశైలిని, సమాచార వినిమయం చేయగల ఉన్నత నైపుణ్యాలను, ప్రజ్ఞాపాటవాలు గల పని అలవాట్లను గూర్చి ఇంతవరకూ ఎవరికీ స్పష్టంగా అర్థం కావడంలేదు” అని తెరిచివున్న తేనె తెట్టువైపు వంగి జాన్ అన్నాడు.
వృత్తిపరంగా తేనెటీగల పెంపకం యొక్క చరిత్రను పరిశీలించిన జాన్ చెప్పేదేమంటే, గతంలో, తేనెటీగల పెంపకందారులు బొంగు చెట్లపైనా, అలాగే ఇతర బొరియల్లోనూ నివసించే తేనెటీగలను నాశనం చేసి తేనెను తీసేవారు. అయితే, తేనెటీగలు మైనపు పెరలకు మధ్య ఆరు మిల్లీమీటర్ల ఎడం ఉంచుతాయని 1851లో, లరెన్‌జో లరేన్ లాంగ్‌స్ట్రోత్ అనే అమెరికా దేశస్థుడైన తేనెటీగల పెంపకందారుడు కనుగొన్నాడు. అలా, తెట్టెల చట్రాల మధ్య ఎంత ఎడం ఉంటుందో అంతే ఎడంతో మానవులు చేసిన కొయ్యతెట్టెలను ఉపయోగించవచ్చు. తేనెటీగల కాలనీనీ నాశనం చేయకుండానే ఒక తేనె తెట్టు నుండి ఒక్కో చట్రాన్ని, తేనెను, తేనెమైనాన్ని తీయడం ఇప్పుడు సాధ్యమౌతుంది.
“విజయవంతంగా తేనెటీగలను పెంచేందుకు, మీ తేనెటీగల కాలనీ ఎడల మీకు ఎంతో మక్కువ ఉండాలి. మీ తేనెటీగలకు మీరు తండ్రివంటివారు, అవి ఈ విషయాన్ని గ్రహించి దానికి తగ్గట్లు ప్రతిస్పందిస్తాయని నమ్ముతున్నాను. మీరు వాటి డాక్టరూ, వాటిపై శ్రద్ధతీసుకునేవారూ, కష్టతరమైన చలికాలంలో వాటిని పోషించేవారూ అవుతారు” అని కూడా జాన్ చెబుతున్నాడు.
“ఒక మంచి తేనెటీగల పెంపకందారుడు సాధారణంగా 8 వేల నుండి 80 వేల తేనెటీగలు గల తేనెతెట్టును ఒక్కసారి చూడడంతోనే వాటిని గురించిన చాలా విషయాలు చెప్పగలుగుతాడు. మీరూ అనుభవజ్ఞులైతే, తేనెటీగల కాలనీ పెరుగుతోందా, సంతానాభివృద్ధి బాగా జరుగుతుందా, ‘సంతోషంగా ఉందా’; ఆకలితో ఉందా; రాణి చనిపోయినందువల్ల ‘అనాథగా’ ఉందా; అసంతోషకరమైన దేనివల్లనైనా అది కలవరపడుతుందా అనే వివరాలనూ; మరెన్నో విషయాలనూ మీరు తేనె తెట్టును తెరిచినప్పుడు, వచ్చే ఝంకార ధ్వనే మీకు తెలియజేస్తుంది” అని చెబుతూ మారియా జతచేస్తోంది.
తేనెటీగలను విజయవంతంగా పెంచేందుకు ముఖ్యమైన కారకాలు
జాన్ ఇలా వివరిస్తున్నాడు: “తేనెటీగల పెంపకందారుడు తన తేనె తెట్టులను ఎక్కడ ఉంచాలన్నది జాగ్రత్తగా నిర్ణయించడం అన్నది చాలా కష్టమైన పని. తేనెటీగలు ఆహారాన్ని కనుగొనగల్గేలా పూలు పూసే మొక్కలుండే ప్రాంతాన్ని కనుగొనడానికి మేము చాలా శ్రమపడతాం.
“తన తేనెటీగల కాలనీని రద్దీగా ఉంచేందుకు నారింజ, బాస్‌వుడ్ పూల ప్రాంతాల కొరకు తేనెటీగల పెంపకందారుడు వెదకవచ్చు. మార్కెట్‌లో బాగా అమ్ముడుపోయే, స్వచ్ఛమైన ఎరుపు రంగులోని నాణ్యత గల తేనె తయారు చేసేందుకు వేసవిలోను, శరదృతువులోను, పైన్ మరియు ఫర్ చెట్లతో నిండిన ప్రాంతం సహాయపడుతుంది. అడవి థైమస్ పువ్వుల రకాలు అతి శ్రేష్ఠమైన తేనెను—పెంపకందారులు చెప్పినట్లు తేనెల్లో రాజును—తయారు చేస్తాయి. తేనెటీగలు వైట్ క్లోవర్, ఎల్లో స్వీట్ క్లోవర్ మరియు ఆల్ఫాల్ఫా మీద కూడా ఆహారాన్ని వెదుకుతాయి.”
ఇంగిత జ్ఞానం అన్నది చాలా ముఖ్యం. మారియా ఇలా వివరిస్తుంది: “తేనె తెట్టులను మనం పర్వత ప్రాంతంలో ఉంచేటట్లయితే, వాటిని పర్వతాల క్రింది భాగాన పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలా తేనెటీగలు కొండమీదికి ఎగిరి, పువ్వులున్న చెట్లను దర్శించి, తర్వాత మకరందంతో తమ తెట్టులకు తిరిగి వెళ్ళేందుకు క్రిందికి దిగడం సులభంగా ఉంటుంది. తెట్టులు ఎంతో ఎత్తున ఉన్న చెట్ల మీద ఉన్నట్లయితే, తేనెటీగలకు బాగా అలసట కలిగి, కాలనీలోని ఉత్పత్తి ప్రతికూలంగా ప్రభావితం చేయబడుతుంది.”
“కాలనీ క్షేమానికి, ఉత్పత్తికి రాణి తేనెటీగ నిర్వహించే ప్రముఖ పాత్రను ప్రతి తేనెటీగల పెంపకందారుడూ అర్థం చేసుకుంటాడు. కొన్ని తేనెటీగలకు మాత్రమే జన్మనిచ్చే, కొంచెం తేనెనే ఉత్పత్తి చేసే తేనె తెట్టుల్లోని రాణిని చంపి, దానికి బదులు మరొక రాణిని ఉంచాలి. యువరాణులతో ఉన్న కాలనీలే ఎక్కువ తేనెను తయారు చేస్తాయి. అలాగే, మనం క్రొత్త కాలనీలను తయారు చేయాలనుకున్నప్పుడు తేనెటీగలకు జన్మనిస్తున్న ఆరోగ్యంగా ఉన్న రెండు తట్టులుగా ఉన్న తేనె తెట్టును తీసుకుని పై పెట్టెను క్రింది పెట్టెను వేరుచేస్తాం. సగం తెట్టులో రాణి ఉంటుంది, కనుక గర్భిణియైన ఒక యువరాణిని మరో సగం తెట్టులో ఉంచుతాం. పువ్వులు పూసే సమయానికల్లా క్రొత్త రాణి గ్రుడ్లు పెట్టి, తెట్టును యువ శ్రామిక తేనెటీగలతో నింపుతుంది” అని మధ్యభాగంలో యువరాణి తేనెటీగ గూడుకట్టుకుని ఉన్న తేనె తెట్టు చట్రాల్లో ఒకదాన్ని జాగ్రత్తగా ఎత్తి పట్టుకుంటూ జాన్ అన్నాడు.
ఒక తేనెటీగ ఎంతకాలం జీవిస్తుంది? శ్రామిక తేనెటీగ ఆయుస్సు అనేది అది ఎంత కష్టపడి పనిచేస్తుందో దానికి విరుద్ధ అనుపాతంలో ఉంటుంది అని మాతో చెప్పారు. వేసవిలో, ఒక తేనెటీగ రోజుకు దాదాపు 15 గంటలు ఆహారాన్వేషణలో పువ్వుల మీదకు వెళ్ళేటప్పుడు గంటకు దాదాపు 21 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. అలాంటప్పుడు అది కేవలం ఆరు వారాలు జీవిస్తుంది. చలికాలంలో తేనెటీగలు రోజుకు కేవలం రెండు మూడు గంటలే పనిచేస్తాయి కనుక, ఎక్కువ శారీరక శ్రమ ఉండదు, అలా అవి అనేక నెలలు జీవించగలుగుతాయి.
వేర్వేరు ఉత్పత్తులు
మనం తేనెటీగల పెంపకం గురించి మాట్లాడేటప్పుడు మన మనస్సులో మొదట మెదిలేది కచ్చితంగా తేనే. శ్రామిక తేనెటీగ మకరందాన్ని మార్చినప్పుడు ఏర్పడే ఈ మధురమైన, బంకలా ఉండే ద్రవపదార్థమే తేనె. ఒక వాణిజ్య తేనె తెట్టు సంవత్సరానికి సగటున 29 కిలోగ్రాముల తేనెను తయారు చేయగలదు. తేనెమైనము అనేది తేనెటీగ చేసే పనివలన వచ్చే మరో విలువైన ఉప ఉత్పత్తి. ఒక తేనె పొర దాదాపు ఐదు నుండి ఆరు సంవత్సరాల వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అప్పటికెల్లా అనేక సూక్ష్మజీవులు మరితర పరాన్నజీవులు దాని మీద నివసించడం వల్ల దాని రంగు ముదురుగా మారుతుంది, కనుక దానిని తప్పకుండా మార్చాలి. ఉపయోగం అయిపోయిన తేనె పొరల నుండి తేనెమైనాన్ని తీసేందుకు ఆ తేనెపొరలను ఒక ప్రక్రియకు గురిచేస్తారు. ఒక టన్ను తేనె తీయబడితే సరాసరి 9 నుండి 18 కిలోగ్రాముల వాణిజ్య తేనెమైనము ఉత్పత్తి చేయబడుతుంది.
పుప్పొడి అన్నది రాణి తేనెటీగల, శ్రామిక తేనెటీగల, మగ తేనెటీగల అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్ల, విటమిన్ల, ఖనిజాల, క్రొవ్వు పదార్థాల ముఖ్య మూలమై ఉంది. పుప్పొడి అనేక శారీరక అనారోగ్యాలకు మంచి ప్రకృతి వైద్యమని కూడా కొందరు మెచ్చుకుంటున్నారు. ఒక తేనె తెట్టు సంవత్సరానికి దాదాపు ఐదు కిలోగ్రాముల పుప్పొడిని ఇవ్వగలదు. తేనెటీగలు తమ తెట్టుకు పూతపూసేందుకు తీసివేయలేనంత పెద్ద పరిమాణంలోనిదేదైనా ప్రవేశించకుండా మూసివుంచేందుకు ప్రొపొలిస్ అనే జిగురు పదార్థాన్ని ఉపయోగిస్తాయి.
నేరుగానైనా లేదా పరోక్షంగానైనా, మనం భుజించే ఆహారంలో నాలుగింట ఒక వంతు అనేది పైరు పై పుప్పొడిని వెదజల్లే తేనెటీగల సామర్థ్యంపై ఆధారపడివుంటుంది. ఆపిళ్ళు, బాదంకాయలు, పుచ్చకాయలు, రేగు పండ్లు, బేరి జాతి పండ్లు, దోసకాయలు, మరనేక నేరేడు జాతిపండ్లూ అన్నీ కూడా తేనెటీగలు పరాగాన్ని చల్లడంపై ఆధారపడి ఉంటాయి. క్యారెట్‌లు, ఉల్లిగడ్డలు, పొద్దుతిరుగుడు పువ్వులతో సహా వివిధ రకాల ధాన్యాల విషయమూ అంతే. పశువులకు ఆహారానికి గడ్డిలా ఉపయోగపడే ఆల్ఫాల్ఫా మొక్కకు పుప్పొడిని వెదజల్లే తేనెటీగలు మాంసమూ, పాల ఉత్పత్తుల మీద కూడా ప్రభావం చూపుతాయి.
“సహజంగా తెలివైనవి”
తేనెటీగల సామూహిక నిర్మాణంలోని సంకీర్ణతలను, వాటి సంశ్లిష్టమైన సామూహిక జీవితం యొక్క ఆసక్తికరమైన అభివృద్ధిని, నిర్దిష్ట దిశకు వెళ్ళే వాటి సామర్థ్యాలను, సమాచారాన్ని తెలుపుకునే సామర్థ్యాలను వివరించలేని మన అసమర్థతను మనకు గుర్తు చేస్తూ, “తేనెటీగల పెంపకందారులు చాలా మంది దేవుడున్నాడని విశ్వసిస్తారని నేను నమ్ముతున్నాను” అని మారియా అంటోంది. తేనెటీగలు “సహజంగా తెలివైనవి” కనుకనే, అలా చేయగలుగుతున్నాయని తేనెటీగలను అధ్యయనం చేసే అనేకులూ, వాటిని చూసుకునే అనేకులూ వెంటనే ఒప్పుకుంటారు. వాటికి అలాంటి సహజ జ్ఞానాన్ని మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు ఉదారంగా ఇచ్చాడు.—సామెతలు 30:24, NW పోల్చండి.
[16వ పేజీలోని బాక్సు/చిత్రం]
పువ్వుల నుండి మీ బల్ల మీదకు
1 పొలంలో పనిచేసే తేనెటీగ ఒక పువ్వును సందర్శించి మకరందాన్ని సేకరిస్తుంది
తేనెటీగలు పువ్వులను సందర్శించి, మకరందాన్ని తమ తేనెసంచుల్లో సేకరిస్తాయి. వాటి అన్నవాహికల పొడిగించబడిన భాగమే ఈ తేనె సంచులు. తేనెటీగ ఆ సంచిని నింపేందుకు ఒక్కో చిన్న పువ్వు దగ్గరకు 1,000 నుండి 1,500 సార్లు వెళ్ళాలి
2 తేనె తెట్టుకు తిరిగి వెళ్ళి మకరందాన్ని తేనెపొరలో నిల్వ ఉంచుతుంది
పొలంలో పనిచేసే తేనెటీగ తేనె తెట్టులోకి వెళ్లినప్పుడు తన తేనె సంచీలో ఉన్న దానిని యువ శ్రామిక తేనెటీగ నోట్లోకి పోస్తుంది. ఆ శ్రామిక తేనెటీగ ఆ మకరందాన్ని ఒక అరలో ఉంచుకుని మకరందాన్ని తేనెగా మార్చేందుకు అవసరమైన ప్రక్రియలను చేస్తుంది
3 తేనెటీగల పెంపకందారుడు తేనెను సేకరిస్తాడు
వేడి చేసిన బ్లేడుతో ఒక్కో చట్రంలోని అరలమీద ఉన్న మైనాన్ని తీసివేస్తాడు. ఆ తర్వాత ఆ చట్రాలను తేనెను తీసే యంత్రంలోకి వేస్తాడు, అది తేనెను బయటకు తీస్తుంది
4 తేనె జాడీల్లో లేదా చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేయబడుతుంది
తేనె జాడీలపైనున్న లేబల్‌లు తేనెటీగలు ఏఏ చెట్లపై వెదికాయో చెబుతాయి. జాడీలోనున్నది బయటికి కనబడుతున్నట్లయితే, తేనె రంగునుబట్టి దాని నాణ్యతను మీరు తెలుసుకోగల్గవచ్చు
5 తేనె మీ ఆరోగ్యానికి మంచిది!
తేనె మీ శరీరంలో సులభంగా కలిసిపోతుంది, అది త్వరగా శక్తిగా మార్చబడుతుంది. కాలిన గాయాలను మరియు వివిధ రకాలైన శరీర గాయాలను మాన్చేందుకు దానిని ఉపయోగించవచ్చు అని నివేదికలు చూపుతున్నాయి