విషాదభరితమైన యువత మరణాలు
“మన తరం అంతరించిపోతుందని నాకనిపిస్తుంది.”—జోహన్న పి, 18 సంవత్సరాలు, విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరం విద్యార్థిని, కనెక్టికట్, అమెరికా.
ఆస్ట్రేలియా ద్వీప రాష్ట్రమైన టాస్మేనియా ముఖ్య పట్టణమైన హోబార్ట్ శివార్లలోని ఒక పొలంలో ఒక భయంకరమైన దృశ్యం పోలీసు ఆఫీసర్ల కంటపడింది. ఒక ఇంట్లో 10 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సుగల నలుగురు అమ్మాయిలు ఉన్నారు. అందరూ చనిపోయివున్నారు, వాళ్లందరినీ వాళ్ల తండ్రే చంపేశాడు, ఆయన తలకు తుపాకి గుండు తగిలిన గాయంతో దగ్గర్లోనే పడివున్నాడు. ఆయన తన కుడిచేతిని గొడ్డలితో తెగవేసుకుని ఉన్నాడు. ఈ హత్య-ఆత్మహత్య మొత్తం టాస్మేనియా ప్రజానీకాన్ని కలవరపర్చింది. అది ప్రజల మనస్సుల్లో ఒక చిక్కు ప్రశ్నను లేవదీసింది, ఎందుకు—ఎందుకు నిరపరాధులైన ఆ నలుగురు అమ్మాయిలూ మరణించవలసి వచ్చింది అనే ప్రశ్నను లేవదీసింది.
తప్పించుకుని తిరుగుతున్న ఒక రేపిస్ట్ ఆరుగురు అమ్మాయిలను చెరిచి, వారిలో నలుగురిని హత్యచేసిన ఒక ఉదంతంతో బెల్జియం ఇంకా అతలాకుతలం అవుతూనే ఉంది. మళ్లీ అదే ప్రశ్న, ఎందుకా అమ్మాయిలు మరణించవలసి వచ్చింది అనే ప్రశ్న తలెత్తుతుంది. అసహ్యమైన యుద్ధం [డర్టీవార్] అని ఇప్పుడు పిలువబడుతున్న దానిలో 30,000 మంది ప్రజలు అదృశ్యమైపోయారని, వారిలో చాలామంది తమ కుమారులూ కుమార్తెలేనని అర్జెంటీనాలోని కొంతమంది తల్లులు విశ్వసిస్తున్నారు.a ఈ నిర్భాగ్యులలో కొందరు హింసించబడ్డారు, మత్తుమందులకు బానిసలుగా చేయబడ్డారు, తర్వాత విమానంలోనుండి సముద్రంలోకి పడద్రోయబడ్డారు. వారిలో చాలామంది ఇంకా సజీవంగా ఉండగానే అలా పడద్రోయబడ్డారు. వాళ్లెందుకు మరణించవలసి వచ్చింది? వాళ్ల తల్లులు ఇప్పటికీ సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు.
1955లో తల్లుల ప్రపంచ మహాసభ యుద్ధాన్ని నిరసించింది, ఆ మహాసభ “ఒక పెద్ద కేక, యుద్ధ దుష్పరిణామాల నుండి యుద్ధ సిద్ధపాట్ల దుష్పరిణామాల నుండి తమ పిల్లలను, అంటే వారు చిన్నవారైనా పెద్దవారైనా వారిని కాపాడుకోవడానికి పోరాడుతున్న స్త్రీలందరి తరఫున వెలువడుతున్న హెచ్చరికా కేక” అని అది ప్రకటించింది. హాస్యాస్పదంగా, ఆ మహాసభ జరిగినప్పటి నుండి రక్తపాత పోరాటాల్లో మరణించిన యువత సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది—మానవజాతి జన్యు సముదాయంలో నుండి ఒక తరం అంతరించిపోయింది.
యువత మరణాల సుదీర్ఘ చరిత్ర
చరిత్ర పుటలు యువత రక్తంతో తడిసిపోయాయి. జ్ఞానాభివృద్ధి చెందినదని పిలువబడుతున్న మన 20వ శతాబ్దంలో కూడా, జాతి వర్గ పోరాటాల్లో యువతే ప్రధానంగా వధకు గురౌతోంది. తమ పెద్దవాళ్లు చేసిన పొరపాట్లకు, వారి మనోవాంఛలకు యువత తమ జీవితాలను మూల్యంగా చెల్లించాల్సి వస్తోంది.
ఒక ఆఫ్రికా దేశంలో, తమను తాము ప్రభువు వ్యతిరేక సైన్యం అని పిలుచుకుంటున్న ఒక మతసంబంధ యువ సైనిక గుంపుకు, తుపాకి గుళ్లు తమకు హాని చేయవని విశ్వసించేలా బోధించబడిందని ది న్యూ రిపబ్లిక్ పత్రిక నివేదిస్తోంది. ఆ శీర్షిక పేరు “యౌవన బీడు భూమి” అని ఉందంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు! కాబట్టి, తుపాకీ గుళ్లకు అతీతులుకాని తమ కుమారులను కుమార్తెలను కోల్పోయిన కుటుంబాలు ఇలా అడగడం సబబే: మన యువత ఎందుకు మరణించవలసి వస్తుంది? అసలు దీనంతటి ఉద్దేశమేమిటి?
ఈ బాధలు వేదనలన్నిటికీ తోడు, ఆత్మహత్యల రూపంలో యువత మరణాల సంఖ్య పెరిగిపోతోంది.
[అధస్సూచీలు]
a డర్టీవార్ అని పిలువబడేది బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్న సైనికుల పరిపాలన (1976-83) కాలంలో జరిగింది. విధ్వంసకులుగా అనుమానించబడిన వేలాదిమంది దానిలో చంపివేయబడ్డారు. మరణించినవారి సంఖ్య 10,000 నుండి 15,000 మధ్య ఉండవచ్చునని ఇతర అంచనాలు తెలియజేస్తున్నాయి.