అబద్ధమాడటాన్ని గురించిన నిజాలు
“నువ్వో అబద్ధాలకోరువి!” శూలాల్లా గుచ్చుకునే ఆ మాటలను మీ వైపు ఎవరైనా ఎప్పుడైనా విసిరారా? ఆలాగైతే, ఆ మాటలకుండే భావోద్రేక ప్రభావాన్ని మీరు గుర్తిస్తారనడంలో ఏ సందేహమూ లేదు.
ఎంతో అమూల్యంగా ఎంచే ఒక పూలజాడీని నేలకేసి కొడితే బద్దలైనట్లే, అబద్ధమాడడం ద్వారా ఒక అమూల్యమైన సంబంధమూ నాశనమవ్వగలదు. నిజమే, కాలం గడిచేకొద్దీ మీరు జరిగిన నష్టాన్ని మరమ్మతు చేసి పూడ్చగలుగుతారేమో, కానీ మీ మధ్య సంబంధం మొదట్లోలా ఎన్నడూ ఉండకపోవచ్చు.
“తమతో అబద్ధం చెప్పారని తెలుసుకున్నవారు, తమ బంధాన్ని పునర్నూతనం చేయడానికైన ప్రయత్నాల ఎడల అప్రమత్తతో ఉంటారు. క్రొత్తగా కనుగొన్న అబద్ధాల వెలుగులో గతంలోని తమ నమ్మకాల గురించీ, చర్యల గురించీ నెమ్మదిగా ఆలోచించడం మొదలుపెడతారు” అని అబద్ధమాడడం—పబ్లిక్ మరియు ప్రైవేట్ జీవితంలో నైతిక ఎంపిక (ఆంగ్లం) అనే పుస్తకం అంటుంది. కపటత్వం బయటపడిన తర్వాత, మనస్సు విప్పుకుని మాట్లాడుకోవడంతో, ఒకరిపట్ల మరొకరికిగల నమ్మకముతో వర్ధిల్లిన ఒకప్పటి సంబంధం ఇప్పుడు సంశయాలూ, సందేహాలలో కూరుకుపోవచ్చు.
అన్ని ప్రతికూల భావాలు అబద్ధమాడడంతో జతచేయబడివున్నాయి గనుక, మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘అటువంటి వక్రమైన అలవాటు అసలెలా మొదలైంది?’
మొట్టమొదటి అబద్ధం
యెహోవా దేవుడు మొదటి మానవజతయైన ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు, ఆయన వారిని అందమైన తోటవంటి గృహంలో ఉంచాడు. వారి గృహంలో ఏ విధమైన కపటత్వం లేక మోసం లేదు. అది నిజంగా పరదైసే!
అయితే, హవ్వ సృష్టించబడిన కొంతకాలానికి, అపవాదియైన సాతాను శోధనాత్మకమైన ఒక ప్రతిపాదనతో ఆమెను సమీపించాడు. ఆమె దేవుడు నిషేధించిన “వృక్ష ఫలము”ను తిన్నట్లైతే దేవుడు చెప్పినట్లుగా ఆమె మరణించదు అని హవ్వకు చెప్పడం జరిగింది. బదులుగా, ఆమె ‘మంచి చెడ్డలను ఎరిగినదై దేవతలవలె ఉంటుంది.’ (ఆదికాండము 2:17; 3:1-5) హవ్వ సాతానును నమ్మింది. ఆమె ఆ ఫలాన్ని తీసుకుని తిన్నది, తర్వాత తన భర్తకు కొన్నింటిని ఇచ్చింది. కానీ సాతాను వాగ్దానం చేసినట్లుగా దేవునివలె అవ్వడానికి బదులుగా, ఆదాము హవ్వలు అవిధేయులైన పాపులయ్యారు, భ్రష్టత్వానికి బానిసలయ్యారు. (2 పేతురు 2:19) ఆ మొదటి అబద్ధం చెప్పడం ద్వారా, సాతాను “అబద్ధాలన్నింటికీ తండ్రి”గా అయ్యాడు. (యోహాను 8:44, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్) కాలగమనంలో, పాపుల ఈ త్రయం అబద్ధమాడినా లేక అబద్ధంలో నమ్మకముంచినా ప్రయోజనం శూన్యం అని తెలుసుకున్నారు.
మరణకరమైన ప్రభావాలు
ఇష్టపూర్వక అవిధేయత శిక్షించబడకుండా పోదని పరలోకంలోనూ, భూమిపైనా ఉన్న తన సృష్టియంతా తెలుసుకోవాలని యెహోవా కోరాడు. తిరుగుబాటు చేసిన ఆత్మీయ ప్రాణిని తన శేష జీవితాన్ని దేవుని పరిశుద్ధ సంస్థకు వెలుపల జీవించుమని తీర్పుతీరుస్తూ ఆయన త్వరిత చర్యనుగైకొన్నాడు. అంతేగాక, యెహోవా దేవుడు సాతాను చివరికి పూర్తిగా నాశనమయ్యేలా చూస్తాడు. ఇది దేవుడు తాను అందజేస్తానని వాగ్దానం చేసిన “సంతానము,” తలమీద ప్రాణాంతకమైన దెబ్బకొట్టినప్పుడు ఇది సంభవిస్తుంది.—ఆదికాండము 3:14, 15; గలతీయులు 3:16.
ఆదాము హవ్వల విషయానికొస్తే, వారు ఏదెను వనంనుండి బహిష్కరించబడ్డారు. దేవుడు ఆదామును ఇలా చెబుతూ శిక్షించాడు: ‘నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.’ కాలగమనంలో, దేవుడు ముందే చెప్పినట్లు ఆయన చనిపోయాడు, ఆయనతోపాటు హవ్వ కూడా చనిపోయింది.—ఆదికాండము 3:19.
ఆదాము వంశస్థులుగా పూర్తి మానవ కుటుంబము “పాపమునకు అమ్మబడి”నది. మానవులందరూ మరణానికి నడిపించే అపరిపూర్ణతను వారసత్వంగా పొందారు. (రోమీయులు 5:12; 6:23; 7:14) ఆ మొదటి అబద్ధం యొక్క పరిణామాలు ఎంత భయభ్రాంతులను కల్గించేవిగా ఉన్నాయో కదా!—రోమీయులు 8:22.
వ్రేళ్లూనుకుపోయిన అలవాటు
సాతానూ, అతనితోపాటు దేవునికి విరుద్ధంగా చేసిన తిరుగుబాటులో అతనితో కలిసిన దూతలూ ఇంకా చంపబడకపోయినందున మనుష్యులు “అబద్ధికులు”గా అయ్యేలా వారు ప్రేరేపిస్తారన్నది మనను ఆశ్చర్యపరచకూడదు. (1 తిమోతి 4:1-3) దాని ఫలితంగా, అబద్ధాలాడడం మానవ సమాజంలో వ్రేళ్లూనుకుపోయింది. “అబద్ధాలాడడం సమాజంలో ఎంతగా నాటుకుపోయిందంటే, ఇప్పుడు సమాజం ఈ విషయంలో చాలామట్టుకు మొద్దుబారిపోయింది” అని లాస్ ఏంజిల్స్ టైమ్స్ గమనిస్తుంది. చాలామంది ఈనాడు రాజకీయాలనూ, రాజకీయవేత్తలనూ అబద్ధమాడడంతో జతచేస్తారు, కానీ అత్యంత ఘోరమైన అబద్ధాలు చెప్పేవారిలో మత నాయకులు ఉన్నారన్న విషయం మీకు తెలుసా?
యేసు భూ పరిచర్య సమయంలో ఆయన గురించి ఆయన మత వ్యతిరేకులు అబద్ధాలను వ్యాప్తిచేశారు. (యోహాను 8:48, 54, 55) ఆయన వారిని బహిరంగంగా అధిక్షేపిస్తూ ఇలా అన్నాడు: “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. . . . వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.”—యోహాను 8:44.
తన పునరుత్థానం తర్వాత యేసు సమాధి ఖాళీగా ఉన్నప్పుడు వ్యాప్తిచేయబడిన అబద్ధాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారా? ప్రధాన యాజకులు “ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి—మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి” అని చెప్పారని బైబిలు చెబుతుంది. ఈ అబద్ధం చాలా విస్తారంగా వ్యాపించింది, మరి అనేకమంది దానివలన మోసపుచ్చబడ్డారు. మత నాయకులు ఎంత దుష్టులుగా ఉన్నారు!—మత్తయి 28:11-15.
నేడు మతపరమైన అబద్ధాలు
నేడు మత నాయకులు చెప్పే ఒక ప్రధానమైన అబద్ధం ఏమిటో మీకు తెలుసా? అది సాతాను హవ్వతో చెప్పినదానిలానే ఉంది: “మీరు చావనే చావరు.” (ఆదికాండము 3:4, ఇటాలిక్కులు మావి.) కానీ హవ్వ చనిపోయింది, ఆమె తిరిగి నేలకు, తాను దేన్నుండైతే చేయబడిందో ఆ మంటికే చేరుకుంది.
అయితే, ఆమె కేవలం చనిపోయినట్లుగా కన్పించి, నిజానికి మరో రూపంలో జీవిస్తూ ఉండిందా? మరణం మరో జీవితానికి కేవలం ఒక ద్వారం మాత్రమేనా? హవ్వయొక్క ఒక చేతన భాగం జీవిస్తూ ఉండినదని బైబిలు ఏమాత్రం సూచననివ్వడం లేదు. ఆమె ప్రాణము బ్రతికిలేదు. దేవునికి అవిధేయురాలవ్వడం ద్వారా ఆమె పాపం చేసింది, బైబిలు ఇలా చెబుతుంది: “పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.” (యెహెజ్కేలు 18:4) హవ్వ, తన భర్తలానే ఒక జీవించు ప్రాణముగా సృష్టించబడింది, జీవించే ప్రాణముగా ఆమె జీవం ఆగిపోయింది. (ఆదికాండము 2:7) మృతుల స్థితిని గూర్చి బైబిలు ఇలా చెబుతుంది: “చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:5) అయితే చర్చీలు సాధారణంగా ఏమి బోధిస్తున్నాయి?
మానవులకు అమర్త్య ప్రాణము ఉందని అది మరో జీవితాన్ని—ఆశీర్వాదంతో కూడినదైనా లేక హింసతో కూడినదైనా—అనుభవించడానికి మరణం దానిని విడుదల చేస్తుందని చర్చీలు తరచూ బోధిస్తాయి. ఉదాహరణకు, కాథోలిక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా అంటుంది: “నరకం యొక్క బాధలు నిరంతరం ఉంటాయనే దాన్ని విశ్వాసం యొక్క సత్యంగా చర్చి స్పష్టంగా బోధిస్తుంది, దీనిని ఎవరూ కూడా ఖండించలేరు లేక ప్రశ్నించలేరు, ఇలా చేయడం స్పష్టంగా ధర్మవిరుద్ధమే.”—సంపుటి 7, పేజీ 209, 1913 ఎడిషన్.
బైబిలు స్పష్టంగా చెప్పేదానికి ఆ బోధ ఎంత భిన్నంగా ఉంది! ఒక వ్యక్తి మరణించినప్పుడు “వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును” అని బైబిలు బోధిస్తుంది. (కీర్తన 146:4) అందువలన, బైబిలు ప్రకారం మృతులు ఎటువంటి బాధనూ అనుభవించలేరు, ఎందుకంటే వారికి ఏవిధమైన స్పృహా ఉండదు. కాబట్టి, బైబిలు ఇలా ఉద్బోధిస్తుంది: “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు [మానవజాతి సామాన్య సమాధి] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”—ప్రసంగి 9:10.
జాగ్రత్తగా ఉండవలసిన అవసరత
యేసు కాలంలోని యాజకుల అబద్ధాలద్వారా ఎంతోమంది మోసపోయినట్లుగానే, నేటి మత నాయకుల అబద్ధ బోధలచే మోసపుచ్చబడే ప్రమాదం ఉంది. ఈ ప్రజలు “దేవుని సత్యమును అసత్యమునకు మార్చి,” మానవ ప్రాణము అమర్త్యమైనదనీ, మానవుల ప్రాణములు నరకాగ్నిలో హింసించబడతాయనే ఆలోచనావంటి అబద్ధ బోధలను వారు అభివృద్ధిచేస్తారు.—రోమీయులు 1:25.
దానికితోడుగా, నేటి మతాలు సాధారణంగా మానవ ఆచారాలనూ, తత్త్వజ్ఞానాన్నీ బైబిలు సత్యానికి సమాన స్థాయిలో ఉంచుతాయి. (కొలొస్సయులు 2:8) ఆ విధంగా నైతికతను గూర్చిన దేవుని చట్టాలు—వీటిలో నిజాయితీ, లైంగిక ప్రవర్తన వంటి వాటిని గురించిన చట్టాలు కూడా ఇమిడివున్నాయి, ఇవి—మార్చదగినవనీ, సంపూర్ణమైనవి కావనీ దృష్టిస్తున్నారు. దాని ఫలితం టైమ్ పత్రిక వర్ణించినట్లుగానే ఉంది: “ఒకరిపట్ల మరొకరు ప్రవర్తించే విధానాన్ని నిర్దేశించే నియమాలను ప్రజలు ఇక ఎంతమాత్రం అర్థం చేసుకోనప్పుడు, లేక వాటి విషయంలో అంగీకారాన్ని తెల్పనప్పుడు ఆ సామాజిక అనిశ్చితత్వంలో అబద్ధాలు వర్ధిల్లుతాయి.”—యెషయా 59:14, 15; యిర్మీయా 9:5 పోల్చండి.
సత్యం అనేది చాలా అల్పంగా ఎంచబడే వాతావరణంలో జీవించడం, అబద్ధాలు చెప్పవద్దనే దేవుని ప్రబోధకు అనుగుణ్యంగా నడుచుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. ఎల్లప్పుడూ సత్యవంతంగా ఉండడానికి మనకు ఏమి సహాయం చేయగలదు?
సత్యం కొరకు స్థానం వహించడం
సత్యవంతమైన సంభాషణను పెంపొందించుకోవడానికి మన సృష్టికర్తను మహిమపర్చాలనే మన కోరిక మనకు గొప్ప పురికొల్పునివ్వగలదు. గమనార్హంగా, బైబిలు ఆయనను ‘సత్యదేవుడు’ అని పిలుస్తుంది. (కీర్తన 31:5) అందుకని, “కల్లలాడు నాలుక”ను అసహ్యించుకునే మన సృష్టికర్తను ప్రీతిపర్చాలనే కోరిక మనకుంటే మనం ఆయనను అనుకరించడానికి పురికొల్పును పొందుతాము. (సామెతలు 6:17) దీన్ని మనం ఎలా చేయగలం?
దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించడం, ‘ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడడానికి’ కావలసిన నైతిక బలాన్నివ్వగలదు. (ఎఫెసీయులు 4:25) అయితే, దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడో కేవలం తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. మనం ఒకవేళ ఈ లోకంలోని అనేకమందివలె ఎల్లప్పుడు సత్యం పలకడానికి ఉన్ముఖులం కానట్లైతే మనం అలా చేయడానికి నిజమైన ప్రయత్నం చేయవల్సిన అవసరముంది. మనం అపొస్తలుడైన పౌలు ఉదాహరణను అనుసరిస్తూ మనతో మనం కఠినంగా వ్యవహరించవల్సిన అవసరం కూడా ఉండవచ్చు. “నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను” అని పౌలు వ్రాశాడు.—1 కొరింథీయులు 9:27.
అన్ని సమయాల్లో సత్యం పలకడానికి చేయాల్సివచ్చే పోరాటంలో ఒక అదనపు సహాయం ప్రార్థన. సహాయం కొరకు యెహోవాను అర్థించడంద్వారా మనము “బలాధిక్యము” కలిగి ఉండవచ్చు. (2 కొరింథీయులు 4:7) వాస్తవానికి, “నిజమాడు పెదవులు” కల్గివుండడం, “అబద్ధమాడు నాలుక”ను విసర్జించడం నిజంగా ఒక పోరాటంగా ఉండవచ్చు. (సామెతలు 12:19) కానీ యెహోవా సహాయంతో దాన్ని సాధించగలం.—ఫిలిప్పీయులు 4:13.
అబద్ధాలాడడం సాధారణ విషయం అన్నట్లు తలంచేలా చేసేది అపవాదియైన సాతాను అని ఎప్పుడూ జ్ఞాపకముంచుకోండి. ఆతడు మొదటి స్త్రీయైన హవ్వను మోసపుచ్చాడు, దుష్ట తలంపుతో ఆమెకు అబద్ధం చెప్పాడు. అయితే, సాతానుయొక్క అబద్ధ మార్గాల వినాశనకర పరిణామాలు ఏమిటో మనకు బాగా తెలుసు. ఒక్క స్వార్థపూరిత అబద్ధం వలనా, ఆదాము, హవ్వ, సాతాను అనే ముగ్గురు స్వార్థపరులైన వ్యక్తుల వలనా చెప్పలేనన్ని బాధలు మానవ కుటుంబంపైన వెల్లువలా వచ్చిపడ్డాయి.
అవును, అబద్ధమాడటాన్ని గురించిన నిజం ఏమంటే దాన్ని మరణకరమైన విషంతో పోల్చవచ్చన్నదే. అయితే దాని విషయంలో మనం కొంత చేయగలందులకు మనం కృతజ్ఞులం. మనం అబద్ధమాడే అభ్యాసాన్ని ఆపివేయవచ్చు, “విస్తారమైన కృపాసత్యములుగల” దేవుడైన యెహోవా అనుగ్రహాన్ని నిరంతరం ఆనందించనూవచ్చు.—నిర్గమకాండము 34:6.
[28వ పేజీలోని చిత్రం]
అబద్ధమాడటాన్ని మరణకరమైన విషంతో పోల్చవచ్చు
[26వ పేజీలోని చిత్రం]
అబద్ధాల ప్రభావాలు ఒక పూలజాడీ బ్రద్దలవ్వడంలా ఉంటాయి