కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 3/8 పేజీ 29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • మీ చేతులను కడుగుకోండి సుమా!
  • వెనుదిరిగి చూడడంవల్ల ప్రగతి
  • నవ్వుతూవుంటే ఎక్కువ కాలం జీవించవచ్చునా?
  • డాల్ఫిన్లు ప్రాణరక్షకులు
  • “ఫాస్ట్‌ ఫుడ్‌” ప్రభు రాత్రి భోజనం
  • ప్రయాణించే పావురాలు
తేజరిల్లు!—1997
g97 3/8 పేజీ 29

ప్రపంచ పరిశీలన

మీ చేతులను కడుగుకోండి సుమా!

ఎంతమంది ప్రజలు చేతులు కడుగుకుంటున్నారో తేల్చేందుకు అమెరికన్‌ సొసైటీ ఫర్‌ మైక్రోబయాలజీ ఓ పరిశోధనను ఏర్పాటు చేసిందని ది న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిస్తోంది. అందరం చేతులు కడుగుకోవాలన్నది ఇంచుమించు అందరికీ తెలిసిన విషయమే. ఓ టెలిఫోన్‌ సర్వేలో 1,004 మంది పెద్దల్లో 94 శాతంమంది, పబ్లిక్‌ మరుగుదొడ్లను ఉపయోగించిన తర్వాత తాము ఎల్లప్పుడూ చేతులు కడుగుకుంటున్నామని చెప్పుకున్నారు. కానీ వాళ్లు నిజంగానే కడుక్కునేవారా? అమెరికాలోని అయిదు పెద్ద నగరాల్లో మరుగుదొడ్లను పర్యవేక్షించే పరిశోధకులు 6,333 వ్యక్తుల్లో కేవలం 61 శాతంమంది పురుషులూ 74 శాతం మంది స్త్రీలు మాత్రమే మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత చేతులు కడుగుకునేవారని కనుగొన్నారు. మురికిగా ఉన్న చేతులు సులభంగా రోగాలను వ్యాపింపజేస్తాయి, మరి హోటళ్లలో చేతులు కడుగుకోని ఒక్క సర్వర్‌ అనేకమందిని అనారోగ్యులను చేయగలడు. ఈ సమస్యకు ఒక కారణం తలిదండ్రుల నడిపింపు లేకపోవడం కావచ్చు. “నేటి తల్లులు తమ పిల్లలకు చేతులు కడుక్కోమని చెప్పడం లేదు” అని డాక్టరు గెయిల్‌ కాస్సెల్‌ చెబుతూ, “పాఠశాలలు పిల్లలకు దాన్ని గూర్చి చెప్పడం లేదు. ఇది ప్రాముఖ్యం అన్న విషయం మనకు జ్ఞాపకం చేయబడాలి” అని అన్నాడు.

వెనుదిరిగి చూడడంవల్ల ప్రగతి

ట్రాన్‌సిస్టర్లులేని కాలంలో వాక్యూమ్‌ ట్యూబులు ఉండేవి. ఇప్పుడు పరిశోధకులు వెనుదిరిగి చూస్తున్నారు. “మేము మరలా 1940లోని వాక్యూమ్‌ ట్యూబులను పునఃపరిశీలిస్తున్నాము. అయితే రాడార్‌ మరియు సెల్యులార్‌ ఫోన్లలో అత్యున్నత పౌనఃపున్య సమయాల్లో అవి ఎలా పనిచేస్తాయో కనుగొనేందుకు కొత్త వస్తువులనూ కంప్యూటర్‌ నిర్మిత పరికరాలనూ ఉపయోగిస్తున్నాము” అని ఉత్తర కారొలీనా రాష్ట్ర విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్రవేత్తయైన గ్రిఫ్‌ బిల్బ్రో అన్నారు. కొత్త ట్యూబులూ పాత ట్యూబుల్లోని ఒక తేడా, వాటి సైజు. కొత్త ట్యూబులు చిన్నగానూ మరి అగ్గిపుల్ల ముందు భాగం సైజులోనూ ఉంటాయి. “వజ్రంలో ఎలక్ట్రోడ్లను బంధించి దాని లోపలి భాగం నుండి గాలిని తీసివేయడం ద్వారా” వాటిని తయారుచేయడం జరుగుతుంది అని సైన్స్‌ న్యూస్‌ పత్రిక చెబుతోంది. “కొత్త వజ్రపు వాక్యూమ్‌ ట్యూబులకూ 50 సంవత్సరాల క్రితం నాటి పెద్ద గాజు బల్బులకూ మధ్య ఉన్న పెద్ద తేడా ఏమిటంటే వేడి. ఎలక్ట్రాన్‌ల ప్రవాహాన్ని ప్రసారం చేసేందుకు పాత ట్యూబులు ఎర్రగా మండవల్సివచ్చేది. కొత్త ట్యూబులైతే గది ఉష్ణోగ్రతలో విద్యుచ్ఛక్తిని ప్రసారం చేస్తాయి.” సెమీకండక్టర్లూ కంప్యూటర్‌ చిప్స్‌ కన్నా ఎక్కువ కాలం మన్నడమే కాకుండా ఉష్ణోగ్రత, వోల్టేజీ అలాగే వికిరణలు ఎక్కువ మోతాదుల్లో ఉన్నప్పుడు ఈ కొత్త ట్యూబులు వాటికన్నా ఎంతో మిన్నగా పనిచేయగలవు.

నవ్వుతూవుంటే ఎక్కువ కాలం జీవించవచ్చునా?

నవ్వు ఎంతో మంచి ఔషధం అని ఎంతో కాలంగా నమ్మడం జరుగుతోంది. పది సంవత్సరాల క్రితం న్యూయార్క్‌ రాష్ట్ర విశ్వవిద్యాలయంలోని వైజ్ఞానికులు దాని కారణాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు. ఒకరి రోగనిరోధకతను బలపర్చే శక్తివంతమైన హార్మోన్లు విడుదలయ్యేలా ఈ నవ్వు సహాయపడుతుందని తాము కనుగొన్న విషయాన్ని వారు వెల్లడించారు. సైటోకైన్‌లు అనే ఒక విధమైన హార్మోన్లు తెల్ల రక్త కణాల చర్యను ఉత్తేజపరుస్తాయని కనుగొనడం జరిగింది, మరి ఈ కణాలు సూక్ష్మజీవులూ, అతి సూక్ష్మజీవులూ కలిగించే ఇన్‌ఫెక్షన్‌ని త్రిప్పికొట్టేందుకు అవసరం అంతేకాకుండా క్యాన్సర్‌ కణాలుగా తయారయ్యే అవకాశమున్న కణాలను కూడా అవి నాశనం చేస్తాయి. “నవ్వడంవల్ల, మోతాదు ఎక్కువయ్యే పదార్థాల్లో ఇది కేవలం ఒకటి మాత్రమే” అని లండన్‌కు చెందిన ది సండే టైమ్స్‌ చెప్పింది. సైటోకైన్లకూ నవ్వుకూ మధ్య ఉన్న సంబంధాన్నిబట్టి కొందరు పరిశోధకులు దాన్ని ఆనంద హార్మోన్లు అని పిలుస్తుంటారు. ఆ విధంగా, నవ్వు “ఎక్కువకాలం జీవించేందుకున్న గుప్తౌషధం” అని ఆ పేపరు పేర్కొంటోంది.

డాల్ఫిన్లు ప్రాణరక్షకులు

ఎర్ర సముద్రంలో ఈదుతున్న ఓ వ్యక్తిని బహుశ కొన్ని డాల్ఫిన్‌లు రక్షించివుండవచ్చు అని జర్నల్‌ ఆఫ్‌ కామర్స్‌ నివేదిస్తుంది. బ్రిటన్‌కు చెందిన మార్క్‌ రిచర్డ్‌సన్‌ ఈజిప్టు సముద్ర తీరాన ఈదుతున్నప్పుడు ఓ షార్క్‌ అతనిపై దాడిచేసింది. తన ప్రక్క భాగాన్ని చేతిని అది కొరికేసిన తర్వాత, మూడు పార్‌ పాయిస్‌ (సీసా వంటి మూతిగల డాల్ఫిన్‌)లు “ఆ షార్కును భయపెట్టేందుకు తమ తోకలనూ రెక్కలను వడిగా ఊపుతూ” అతన్ని చుట్టుముట్టాయి. “మిస్టర్‌ రిచర్డ్‌సన్‌ స్నేహితులు అతన్ని కాపాడేందుకు వచ్చేంతవరకూ” ఆ డాల్ఫిన్లు “అతని చుట్టే ఉన్నాయి.” జర్నల్‌ ప్రకారం, “తల్లి డాల్ఫిన్‌ తన పిల్లలను కాపాడేటప్పుడు ఇలా ప్రవర్తించడం సాధారణమే.”

“ఫాస్ట్‌ ఫుడ్‌” ప్రభు రాత్రి భోజనం

ఔత్సాహిక పారిశ్రామికవేత్తయైన జిమ్‌ జాన్సన్‌, చర్చిలోని ప్రభు రాత్రి భోజన సేవలకు డిస్పోజబుల్‌ ప్యాకెట్లలో ముందే ప్యాక్‌ చేసిన ప్రసాదాలను ఉత్పత్తి చేస్తున్నాడని క్రిస్టియానిటీ టుడే అనే పత్రిక నివేదిస్తోంది. చిన్న కప్పు సైజులో ఉన్న నీలలోహిత వర్ణ ప్లాస్టిక్‌ కప్పులో గుటికెడు ద్రాక్షారసం లేక ద్రాక్షామద్యం ఉంటుంది. ఈ కప్పుల్లో తీసేయగల రెండు మూతల్లో పులియని రొట్టె కూడా ఉంటుంది. జాన్సన్‌ ప్రకారం, వీటిని త్వరగా తయారుచేయవచ్చు, శుభ్రంచేసేందుకు ఎక్కువ సమయం అవసరంలేదు, చౌకగానూ శుభ్రంగానూ ఉండేటువంటి ప్రయోజనాలు ఈ ఉత్పాదనకు ఉన్నాయి. ప్రభు రాత్రి భోజనాన్ని “హోల్‌సేల్‌ వ్యాపారానికి” ఉపయోగిస్తున్నారని కొందరు ఫిర్యాదులు చేసినప్పటికీ 4,000 చర్చీలు ఇప్పటికే ఈ క్రొత్త ఉత్పాదనను ఉపయోగిస్తున్నాయి. అందుకు జాన్సన్‌ సమర్థించుకుంటూ ఇలా అన్నాడు: “వేలమందికి భోజనాలు పెట్టిన సమయంలో యేసే మొదట ఫాస్ట్‌ ఫుడ్‌ను ఇచ్చాడు.”

ప్రయాణించే పావురాలు

లండన్‌లోని పావురాలు ప్రయాణీకులతో సబ్‌వేలలో టికెట్టు లేకుండా ప్రయాణిస్తున్నాయని గమనించడం జరిగిందని న్యూ సైంటిస్ట్‌ పత్రిక నివేదిస్తోంది. దానికి తోడు, అవి ఏ స్టేషన్లలో దిగాలోకూడా వాటికి తెలుసునని కొందరు ప్రజలు చెబుతున్నారు. తమ అనుభవాలను చెప్పమని ఈ పత్రికవారు చదువరులను ఆహ్వానించిన మీదట ఈ రెక్కల ప్రయాణీకులతో తమకు కలిగిన అనుభవాలను గూర్చి చెబుతూ అనేకమంది చదువరులు రాశారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇలా రాశాడు: “1974-76 మధ్య కాలంలో కొద్దిగా ఎర్రగా ఉన్న ఓ పావురం భూగర్భ రైలుమార్గంలో పాడింగ్టన్‌ దగ్గిర ఎక్కి, తర్వాతి స్టేషన్లో దిగిపోవడాన్ని నేను తరచూ చూసేవాణ్ణి.” మరో వ్యక్తి 1965లో కూడా ఇలాంటి విషయాన్నే చూశాడు. సుమారు 30 ఏళ్లుగా ఈ పావురాలు లండన్‌ రవాణా వ్యవస్థను డబ్బులు చెల్లించకుండానే వాడుకుంటున్నట్లుంది!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి