అబద్ధమాడటం ఎందుకు అంత సులభం?
మరొకరు తనతో అబద్ధమాడాలని ఎవరూ కోరుకొనరు. అయినా ప్రపంచమంతటా అనేక కారణాలకు మనుష్యులు ఒకరితోఒకరు అబద్ధమాడుతుంటారు. జేమ్స్ పాటర్‌సన్, పీటర్ కిమ్ వ్రాసిన ది డే అమెరికా టోల్డ్ ది ట్రూత్ అనే పుస్తకంలోని సర్వే ప్రకారం అమెరికన్లలో 91 శాతం ప్రతినిత్యము అబద్ధమాడుతుంటారు. ఆ రచయితలు చెప్పేదేంటంటే: “మాలో ఎక్కువమంది, అబద్ధం చెప్పకుండా కనీసం ఒక్క వారం రోజులు జీవించటం చాలా కష్టం. అయిదుగురిలో ఒక్కరు అసలు అలా ఒక్కరోజు కూడా జీవించలేరు. అంటే మేము మనస్సాక్షి అనుమతించే, ముందే ఊహించుకున్న అబద్ధాలనుగూర్చే చెబుతున్నాము.”
ఆధునిక దిన జీవిత ప్రతి రంగంలోను అబద్ధము ఒక సాధారణ అలవాటైపోయింది. రాజకీయనాయకులు పరస్పరంగాను, ప్రజలతోను అబద్ధమాడుతుంటారు. అనేకసార్లు వారు కుంభకోణాల్లో నిజంగా కూరుకుపోయివున్నా, దూరదర్శిని తెరపైకొచ్చి దానిలో మాకు వంతేలేదన్నారు. సిసెలా బోక్ అనే ఆవిడ, లైయింగ్—మోరల్ ఛాయ్స్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రవేట్ లైఫ్ అనే తన పుస్తకంలో ఇలా తెలిపింది: “చట్టాలు, పత్రికా రచనలలో, ప్రభుత్వంలో, సామాజిక విజ్ఞాన శాస్త్రంలో, అబద్ధాలు చెబుతూనే మరోప్రక్క నియమాలు ఏర్పాటు చెయ్యాలనుకునేవారి దృష్టికి అవి క్షమించదగ్గవైతే మోసం ఆమోదయోగ్యమైందిగానే ఎంచబడుతుంది.”
అమెరికాలో రాజకీయ అబద్ధాలనుగూర్చి పేర్కొంటూ మే/జూన్ 1989 కామన్ కాజ్ మ్యాగజైన్: “వాటర్ గేట్ మరియు వియత్నాము ఇరాన్-కాంట్రాను ప్రభుత్వ మోసంగా, ప్రజల నమ్మకాన్ని పొగేట్టిదిలా పేర్కొంది. రీగన్ పాలనా కాలం అలాంటి చారిత్రాత్మక మార్పు చెందటానికి కారణమేంటి? దానిలో ఎక్కువమంది అబద్ధాలు చెప్పేవారే. ఎక్కువమంది తమ చర్యలకు పశ్చాత్తాపపడలేదు.” సామాన్య ప్రజలు రాజకీయనాయకులను నమ్మటం లేదంటే దానికి సరైన కారణమే ఉంది.
అంతర్జాతీయ సంబంధాలలో అటువంటి నాయకులు ఒకరినొకరు నమ్మటం చాలా కష్టతరమై పోయింది. గ్రీకు తత్త్వవేత్త ప్లేటో ఇలా అన్నాడు: “దేశ పాలకులు ఆ దేశ శ్రేయస్సు నిమిత్తమై అబద్ధమాడటానికి అభ్యంతరం లేదు.” అంతర్జాతీయ సంబంధాలలో అది దానియేలు 11:27లో బైబిలు ప్రవచించినట్లే ఉంది: “యేకభోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములాడెదరు.”
వ్యాపార రంగంలో ఉత్పత్తులనుగూర్చి, సేవలనుగూర్చి అబద్ధమాడటం సాధారణ అలవాటు. కొనుగోలుదార్లు పరస్పర బప్పందాలు వ్రాసుకొనేటప్పుడు వ్రాయబడిన పత్రాన్ని వ్రాయబడిన విధానాన్ని చదవాలి. నిజంగా హాని, మోసంతో నిండినదాన్ని కూడా, లాభకరం లేక హానిలేదని చేసే బూటకపు ప్రచారంనుండి ప్రజలను కాపాడేందుకు కొన్నిదేశాల్లో నియమావళులున్నవి. ఇన్ని ఉన్నా అబద్ధాలు చెప్పే వ్యాపారస్థులవలన ప్రజలింక ఆర్థికంగా నష్టపోతూనే ఉంటారు.
కొంతమంది ప్రజలకు అబద్ధమాడటం ఎంత సులభమంటే వారికదొక అలవాటై ఉంటుంది. మరికొందరు సహజంగా సత్యంగానే ఉన్నా, ఇబ్బందికర పరిస్థితుల్లో అబద్ధమాడతారు. ఏ పరిస్థితుల్లోను అబద్దమాడని వారు ఎక్కువ మంది ఉండరు.
అబద్ధము ఇలా నిర్వచింపబడుతుంది “1. ప్రత్యేకంగా మోసగించాలనే ఉద్దేశ్యంతోనే చెప్పే మాట లేక చేసే క్రియ . . . 2. అబద్ధపు భావాన్ని ముద్రించే ఏదైనా లేక ఆ ఉద్దేశముతో చేసేదేదైనా.” అబద్ధమాడేవాడు తనకు సత్యం కాదని తెలిసిన దాన్ని ఇతరులు నమ్మేలా చేయడం దీని ఉద్దేశం. అబద్ధాలు లేక సగం సత్యాల మూలంగా సత్యం తెలుసుకోవాల్సిన వారిని మోసంచేయడానికి అతడు ప్రయత్నిస్తాడు.
అబద్ధమాడటానికి కారణాలు
అనేక కారణాలు నిమిత్తం మనుష్యులు అబద్ధమాడుతుంటారు. పోటీ ప్రపంచంలో విజయ పధమందు ముందుకు పోవాలంటే వారి సామర్థ్యాలను గూర్చి అబద్ధమాడాల్సిన విధి ఏర్పడుతుందని కొందరనుకుంటారు. కొందరు వారి పొరపాట్లను, అపరాధాలను కప్పిపుచ్చుకోవటానికి అబద్ధాలాడుతారు. ఇంకొందరు వారు చేయని పనిని చేశామనే భావనను కలగజేయటానికి అబద్ధ రిపోర్టునిస్తుంటారు. ఇతరుల మంచి పేరును పాడుచేయడానికి, గందరగోళంలేకుండా చేసుకోడానికి, ముందు చెప్పిన అబద్ధాలను సమర్థించుకోడానికి, ఇతరులవద్ద డబ్బు మోసంగా తస్కరించడానికి అబద్ధాలు చెప్పేవారూ ఉన్నారు.
అబద్ధాన్ని సమర్థించుకోవడం సాధారణంగా అది మరొక వ్యక్తిని కాపాడుతుందనే ఉద్దేశంతో ఉంటుంది. ఇది న్యాయమైన అబద్ధమేనని కొందరు ఎంచుతారు. ఎందుకంటే ఇది ఎవరికీ హానిచెయ్యదని వారు భావిస్తారు. మరి అలా పైకి న్యాయబద్ధంగా కనిపించే అబద్ధాలవలన ఏ చెడు ఫలితాలు ఉండవా?
ఫలితాలను గమనించండి
న్యాయసమ్మతమైనవని పిలువబడే అబద్దాలు చివరకు గంభీర విషయాలకు చెందిన వాటిలోను అబద్ధమాడే అలవాటుకు మార్గాన్ని ఏర్పరచగలవు. సిసెలా బోక్ ఇలా వ్యాఖ్యానిస్తుంది: “‘న్యాయసమ్మతము’ అని సమర్థించబడే అబద్ధాలన్నింటిని సులభంగా త్రోసిపుచ్చలేము. అసలు అబద్ధములోను నిరపాయమే ఘోర వివాదస్పదమైంది. అబద్ధికుడు నిరపాయము, లేదా మేలుకరం అని భావించింది మోసిగించబడే వాని దృష్టికి అలా ఉండకపోవచ్చు.”
అబద్ధాలు, ఎంత నిష్కల్మషంగా కనిపించినప్పటికీ అవి మానవుల మంచి సంబంధాలను నాశనముచేసేవే. అబద్ధమాడేవాని మాటల్లోను నమ్మకత్వం చెదిరిపోతుంది. ఆ నమ్మకం శాశ్వతంగా బద్ధలౌతుంది. ప్రఖ్యాతిచెందిన వ్యాస రచయిత రాల్ఫ్ వాల్డో ఎమెర్‌సన్ ఇలా వ్రాశాడు: “సత్యాన్ని భంగపరచటం అబద్ధమాడే వాని ఆత్మహత్య లాంటిదే కాక, మానవ సమాజ శ్రేయస్సుపై అది కత్తిపోటైయుంది.”
అబద్ధమాడే ఒకవ్యక్తికి మరొక వ్యక్తిని గూర్చి అబద్ధపు మాట చెప్పడం సులభం. దానికి అతడు రుజువు చూపలేకపోయినప్పటికీ, అతని అబద్ధం సందేహాన్ని కలిగిస్తుంది. అనేకమంది అతని మాటను పరిశోధించకుండానే నమ్మేస్తారు. ఆ విధంగా నిర్దోషమైన వ్యక్తియొక్క మంచి పేరు చెడిపోతుంది. తన నిర్దోషత్వాన్ని రుజువుపరచుకోనే భారం అతనిపై పడుతుంది. ప్రజలు నిర్దోషిమాటకంటె అబద్ధికుని మాట నమ్మినప్పుడు అది కలతరేపుతుంది. అబద్ధికునితో నిర్దోషికున్న సంబంధం నాశనమౌతుంది.
ఒక అబద్ధికుడు అబద్ధమాడే అలవాటును సులభంగా పెంచుకుంటాడు. సర్వసాధారణంగా ఒక అబద్ధము మరో అబద్ధానికి దారితీస్తుంది. అమెరికా తొలి రాజకీయవేత్త థామస్ జెఫర్‌సన్ తెలియపరచేదేమంటే: “అంతకంటే నీచమైన, దయనీయమైన తృణీకారయోగ్యమైన దుర్గణము మరొకటి లేదు. ఒక వ్యక్తి ఒక్కసారి అబద్ధం చెప్పడానికి తెగిస్తే, రెండవసారి, మూడవసారి చెప్పడం, చివరకు అలవాటుగా మారేంతవరకు దాన్ని కొనసాగించడం అతనికి సులభమౌతుంది.” అది నైతిక పతనానికి మార్గము.
సులభంగా అబద్ధమాడటానికిగల కారణం
ఈ అబద్ధమాడటమనేది తిరుగుబాటు చేసిన దేవదూత మొదటి స్త్రీతో, తన సృష్టికర్తకు ఆమె అవిధేయురాలైనను చనిపోదని చెప్పడంతో ప్రారంభమయ్యింది. మానవజాతియంతటికి అది అసంపూర్ణత, వ్యాధి, మరణముతో చెప్పజాలనంత గొప్ప హానిని తెచ్చిపెట్టింది.—ఆదికాండము 3:1-4; రోమీయులు 5:12.
ఆదాము హవ్వల అవిధేయత కాలంనుండి, అబద్ధమునకు జనకుడైన ఇతని మోసపూరిత ప్రభావం మానవజాతితో నిండిన లోకంలో అబద్ధాన్ని ప్రేరేపించే వాతావరణాన్ని సృష్టించింది. (యోహాను 8:44) ఇది సత్యమనేది కేవలం పరిమితంగానే నెలకొనివున్న కుళ్లులోకము. ఈ అబద్ధపు సమస్యనుగూర్చి 1986 సెప్టెంబరు ది సాటర్‌డే ఈవ్‌నింగ్ పోస్టు పరిశీలన ఏమంటే, “అది వ్యాపారం, ప్రభుత్వం, విద్యా, వినోదం, తోటి పౌరులు, పొరుగు వారిమధ్య సాధారణ అనుదిన వ్యవహారాల్లోను దాని ప్రభావాన్ని కలిగి ఉంది. అసలు కచ్చితంగా సత్యాలనేవి ఏవీ లేవనే రిలేటివిజం సిద్ధాంతమే ఒక ఘోర అబద్ధము. (ఫలాందే సత్యమని దేనిగూర్చియైన చెప్పగల జ్ఞానము మనకు లేదనే సిద్ధాంతము) దాన్నే మనము స్వీకరించాము.”
మోసగించబడే వారిపట్ల ఏవిధమైన సానుభూతికూడా లేకుండా అలవాటుగా అబద్ధమాడేవారి దృక్కోణం అది. అబద్ధం వారికి అతి సులభంగా వస్తుంది. అది వారి జీవిత మార్గం. అయితే అలవాటు ప్రకారం అబద్ధమాడని ఇంకొందరు నిస్సంకోచంగా భయాన్నిబట్టి అనగా—బయటపడుదుమోమేనని, శిక్షపడుతుందేమోనని లేక ఇతర కారణాలనుబట్టి అబద్ధమాడవచ్చును. అది అసంపూర్ణ శరీర బలహీనత, అయితే సత్యమే మాట్లాడలనే తీర్మానంతో ఈ స్వభావాన్ని ఎలా తీసివేసికోవచ్చును?
సత్యవంతులుగా ఎందుకు ఉండాలి?
సత్యమనేది మన మహోన్నత సృష్టికర్త మనందరికి నియమించిన ప్రామాణికము. ఆయన లిఖిత వాక్యమైన బైబిలు హెబ్రీయులు 6:18లో ‘దేవుడు అబద్దమాడ జాలడని’ చెబుతుంది. దేవుని వ్యక్తిగత ప్రతినిధిగా భూమిపైనున్న ఆయన కుమారుడగు యేసుక్రీస్తు కూడా అదే ప్రమాణమును ఉన్నతపరచెను. ఆయనను చంపడానికి వెదకిన యూదా మతనాయకులతో యేసు ఇలా అన్నాడు: “దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; . . . నేనాయనను ఎరుగుదును, ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనైయుందును.” (యోహాను 8:40, 55) “ఆయన పాపముచేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు,” అనే విషయములో ఆయన మనకు మాదిరినుంచాడు.—1 పేతురు 2:21, 22.
యెహోవా అను నామముగల మన సృష్టికర్త అబద్ధమును ద్వేషిస్తున్నాడు. సామెతలు 6:16-19 స్పష్టముగా ఇలా చెబుతుంది: “యెహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు. ఏడును ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.”
సత్యవంతుడైన ఈ దేవుడు మనము ఆయన అంగీకారము పొందునట్లు ఆయన ప్రమాణముల మేరకు జీవించాలని మనలను కోరుతున్నాడు. ఆయన ప్రేరేపితమైన వాక్యము ఆజ్ఞాపించునదేమనగా: “ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడ పరిత్యజించుడి.” (కొలొస్సయులు 3:9) అబద్ధమాడే అలవాటును మానుకొనని ప్రజలు ఆయనకు అంగీకృతము కారు. అట్టివారు ఆయనిచ్చే జీవ వరమును పొందరు. కీర్తన 5:6 ఖండితంగా, ‘అబద్ధమాడువారిని దేవుడు నశింపజేయునని’ చెబుతుంది. ప్రకటన 21:8 “అబద్ధికులందరు” నిత్యనాశనమను “రెండవ మరణము”నకు లోనౌతారని చెబుతుంది. కాబట్టి అబద్ధముయెడల యెహోవా కలిగియున్న దృష్టిని అంగీకరించుట, సత్యమును మాట్లాడుటకు మనకు బలమైన కారణమైయుంది.
సత్యమనేది కలతపర్చే పరిస్థితిని లేదా చెడుభావాలను కలుగజేస్తుందేమోననే పరిస్థితులలో ఏమి చేయవచ్చును? అబద్ధమాడటం అందుకు పరిష్కారం కాదుగాని, కొన్నిసార్లు ఏమి చెప్పకుండానే ఉండవచ్చును. నీపైనున్న నమ్మికను పాడుచేసి, దేవుని తృణీకారానికి నిన్ను నడిపించే అబద్ధాన్ని చెప్పడమెందుకు?
ఒకవ్యక్తి భయంవల్లనో లేక మానవ బలహీనతవల్లనో ఒక అబద్ధమాడి తప్పించుకోవాలని శోధింపబడవచ్చు. అలా చేయడం చాలా సుళువైనది లేక మోసపూరితమైనది. అపొస్తులుడైన పేతురు యేసుక్రీస్తును ఎరుగనని మూడు సార్లు బొంకినప్పుడు, అటువంటి శోధనకే లోనయ్యాడు. కానీ అబద్ధమాడినందుకు ఆయన హృదయము తరువాత బ్రద్ధలైంది. (లూకా 22:54-62) ఆయనయొక్క నిజమైన పశ్చాత్తాపము దేవుని క్షమాపణ పొందునట్లు చేసింది, ఎందుకనగా తరువాత ఆయన అనేక సేవాధిక్యతలతో దీవించబడ్డాడు. అబద్ధమాడటం మానుకోవాలనే నిశ్చయతతో కూడిన తీర్మానం, దేవుడు ద్వేషించేదాన్ని చేసినందుకు దేవుని క్షమాపణను దయచేస్తుంది.
అయితే అబద్ధమాడి తదుపరి క్షమాపణగోరే దానికంటే, నీ సృష్టికర్తతో నీ సంబంధాన్ని కాపాడుకొని ఇతరులతో సత్యాన్ని మాట్లాడటం ద్వారా వారికి నీపైనున్న నమ్మకాన్ని కూడా కాపాడుకొనుము. కీర్తన 15:1, 2 చెప్పేదాన్ని గుర్తుంచుకొనాలి: “యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగినవాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.”