బైబిలు ఉద్దేశము
జలప్రళయం—వాస్తవమా, కల్పితమా?
‘జంతువులన్నీ జతజతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను.’—ఆదికాండము 7:8, 9.
నోవహు దినంలోని జలప్రళయాన్ని గూర్చి విననిదెవరు? బహుశ ఆ కథ మీకు మీ చిన్నతనం నుండి తెలిసి ఉండవచ్చు. ఈ జలప్రళయాన్ని గూర్చి పరిశీలించేందుకు మీరు స్థానిక గ్రంథాలయానికి వెళితే, ఈ విషయంపై పెద్దలకన్నా పిల్లల కొరకే ఎక్కువ పుస్తకాలు రాసివున్నట్లు మీరు కనుగొంటారు. అందుచేత, ఆ జలప్రళయ వృత్తాంతాన్ని పిల్లలను నిద్రపుచ్చేముందు చెప్పే కథలుగానే దృష్టించాలని మీరు నిర్ణయించవచ్చు. బైబిలులోని మిగిలిన భాగంతో సహా నోవహు జలప్రళయ వృత్తాంతాన్ని అనేకమంది కల్పితంగా లేక మహా అంటే మానవుడు రూపొందించిన ఓ నైతిక పాఠంగా భావిస్తారు.
ఆశ్చర్యకరమైనదేమిటంటే, తమ విశ్వాసం బైబిలుపై ఆధారపడిందని చెప్పుకునే కొందరు సహితం జలప్రళయం నిజంగా జరిగిందో లేదో అని అనుమానిస్తుంటారు. కాథోలిక్ మతనాయకుడైన ఎడ్వార్డ్ జె. మక్లేన్, నోవహు కథను చరిత్రగాకాక “రెండు భావాల కథగా లేక సాహితీ రచనగా” అర్థంచేసుకోవాలి అని ఒకసారి పేర్కొన్నాడు.
అయితే, బైబిలులో రాయబడిన జలప్రళయ వృత్తాంతాన్ని ఓ రెండు భావాల కథగానే దృష్టించాలా, దాన్ని వాస్తవంగా దృష్టించకూడదా? బైబిలే అలాంటి దృక్కోణాన్ని సమర్థించడంలేదా?
నమ్మదగిన వివరాలు
ఆదికాండము పుస్తకంలో మోషే రాసిన వృత్తాంతాన్ని మొదట పరిశీలించండి. అక్కడ, ఈ వరద ఎప్పుడు ప్రారంభమైందీ, ఓడ ఎప్పుడు నిలిచింది, మరి భూమి ఎప్పుడు ఆరింది అన్న వాటినిగూర్చి కచ్చితంగా సంవత్సరం, నెల, తేదీ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. (ఆదికాండము 7:11; 8:4, 13, 14) ఆదికాండములో ఇతర చోట్ల కచ్చితమైన తేదీలు ప్రతీసారీ రాసిలేకపోయినప్పటికీ, మోషే దీన్ని నిజమైన సంఘటనగా దృష్టించాడన్న వాస్తవాన్ని ఈ జలప్రళయానికి సంబంధించిన తేదీలు నొక్కి చెబుతున్నాయి. “అనగనగా ఒకరోజు. . . ” అనే సరళిలో ప్రారంభమయ్యే అనేక కథలకూ బైబిలు సత్యపు సరళికీ ఉన్న తేడాను చూడండి.
మరో ఉదాహరణగా ఆ ఓడనే తీసుకోండి. ప్రతీ మీటరు ఎత్తుకి 10 మీటర్ల పొడవూ, ప్రతీ మీటరు వెడల్పుకీ 6 మీటర్ల పొడవూ ఉన్న ఉన్న 133 మీటర్ల పొడవుగల ఓడను గూర్చి బైబిలు వర్ణిస్తోంది. (ఆదికాండము 6:15) మరి నోవహు ఓడలను నిర్మించేవాడు కాదు. మరి ఇది 4,000 సంవత్సరాలకన్నా ఎక్కువ కాలం క్రితం అన్న విషయాన్ని జ్ఞాపకముంచుకోండి! అయినప్పటికీ, తేలే వస్తువుగా ఉండేందుకు అది సరైన కొలతలతో నిర్మించబడింది. వాస్తవానికి, అలాంటి నిష్పత్తులు సముద్రంపై పయనించేందుకు అనువైనవని ఆధునిక ఆర్కిటెక్టులు ఇప్పుడు కనుగొన్నారు. నోవహు ఈ ఓడను నిర్మించేందుకు ఎంత సమయం తీసుకున్నాడన్న విషయాన్ని బైబిలు కచ్చితంగా చెప్పకపోయినప్పటికీ ఈ వృత్తాంతం ప్రకారం దానికి 50 నుండి 60 సంవత్సరాలు పట్టివుండవచ్చు. (ఆదికాండము 5:32; 7:6) ఎంతో ప్రాచుర్యంలో ఉన్న గిల్గామేష్ యొక్క బబులోను పురాణంలో ఉన్న కథకు ఈ విషయాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. కేవలం ఏడు రోజుల్లో నిర్మించిన ఓ ప్రచండమైన వికారమైన ఘనాకారాన్ని గూర్చి ఈ పురాణం వర్ణిస్తోంది, మరి దీని ప్రతి వైపు 60 మీటర్లుంటుంది. ఆ బబులోను కట్టుకథలా కాకుండా బైబిలు జలప్రవాహ వృత్తాంతం దాని ఖచ్చితత్వంలో విశ్వాసాన్ని కలిగించేదిగా ఉంది.
ఆదికాండములోని వృత్తాంతం కాకుండా నోవహు లేక ప్రపంచవ్యాప్త జలప్రవాహాన్ని గూర్చి లేఖనాలు పదిసార్లు ప్రస్తావించడం జరిగింది. ప్రేరేపిత రచయితలు ఈ జలప్రళయాన్ని నిజమైన చరిత్రగా దృష్టించారని సూచిస్తున్నాయా లేక కల్పితంగా దృష్టించారని సూచిస్తున్నాయా?
ప్రామాణికత స్థిరపర్చబడింది
లేఖనాల్లో, ఇశ్రాయేలు జనాంగపు రెండు వంశావళులలో నోవహు కనిపిస్తాడు, వీటిలో రెండవ వంశావళి యేసుక్రీస్తుతో ముగుస్తుంది. (1 దినవృత్తాంతములు 1:4; లూకా 3:36) ఈ వంశావళులను సమకూర్చిన ఎజ్రా, లూకా, ఇద్దరూ నిపుణులైన చరిత్రకారులు మరి నోవహు నిజమైన వ్యక్తి అని వారు నమ్మే ఉంటారు.
బైబిలులో మరో ప్రాంతంలో నోవహు చారిత్రాత్మక వ్యక్తుల జాబితాలో ఉన్నాడు, అక్కడ ఆయన్ను నీతి విశ్వాసాలున్న వ్యక్తిగా వర్ణించడం జరిగింది. (యెహెజ్కేలు 14:14, 20; హెబ్రీయులు 11:7) కల్పిత వ్యక్తిని మాదిరిగా అనుసరించేందుకుగాను బైబిలు రచయితలు ఒక పాత్రను సృష్టించడంలో అర్థముందా? లేదు, ఎందుకంటే మానవులకు విశ్వాసాన్ని కల్గివుండే శక్తిలేదని, మరి కథల పుస్తకాల్లోని పాత్రలు మాత్రమే అలాంటి విశ్వాసాన్ని కనపర్చగలవనే నిర్ణయానికి వచ్చేందుకు అది నడిపిస్తుంది. నోవహు మరి ఇతర విశ్వాస స్త్రీపురుషులను పేర్కొనేందుకుగల కారణం ఏమిటంటే వాళ్లు కూడా మనకున్నటువంటి లోపాలూ భావాలూ ఉన్న మానవులైనందుకే.—హెబ్రీయులు 12:1; యాకోబు 5:17 పోల్చండి.
మిగిలిన లేఖనాల్లో, నోవహు చుట్టూ ఉన్న విశ్వాసంలేని తరంపై దేవుడు తెచ్చిన వినాశనాన్ని గూర్చి చెప్పినప్పుడు నోవహు, జలప్రళయమూ ప్రస్తావించడం జరిగింది. లూకా 17:26, 27 నందు లిఖించినట్లుగా జల ప్రవాహాన్ని యేసు ప్రస్తావించడాన్ని గమనించండి: “నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనము చేసెను.”
యేసుక్రీస్తు భూమ్మీద జీవించకముందు పరలోకంలో ఉన్నాడు కనుక ఆయన వర్ణించిన సంఘటనలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. (యోహాను 8:58) ఈ జలప్రవాహం కేవలం ఓ కల్పితమైతే, యేసు భవిష్యత్ ప్రత్యక్షత ఊహాత్మకమైనా అయివుండాలి లేక ఆయన అబద్ధమైనా చెప్పివుండాలి. వీటిలో ఏదీ మిగిలిన లేఖనాలతో సమన్వయం కల్గిలేదు. (1 పేతురు 2:22; 2 పేతురు 3:3-7) కనుక, బైబిలు వృత్తాంతమైన ప్రపంచవ్యాప్త జలప్రళయం చారిత్రాత్మక ప్రామాణికతగలదని తన వ్యక్తిగత పరిశీలనవల్ల యేసు విశ్వసించాడు. నోవహు దినపు జలప్రళయం కల్పితం కాదు వాస్తవమే అనేందుకు నిజమైన క్రైస్తవులకు నిస్సందేహంగా ఇది మంచి రుజువు.
[24వ పేజీలోని చిత్రసౌజన్యం]
L. Chapons/Illustrirte Familien-Bibel nach der deutschen Uebersetzung Dr. Martin Luthers