కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 3/8 పేజీలు 14-16
  • స్నైల్‌ ఫీవర్‌ దాని అంతం కనుచూపుమేరలో ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్నైల్‌ ఫీవర్‌ దాని అంతం కనుచూపుమేరలో ఉందా?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరాన్నజీవి జీవిత చక్రం
  • పరిష్కారాలూ, సమస్యలు
  • భవిష్యత్తు కొరకు ఏ నిరీక్షణ ఉంది?
  • మీ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు
    తేజరిల్లు!—2004
  • పరాన్న జీవుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి!
    తేజరిల్లు!—1999
  • మలేరియా గురించి మీరు తెలుసుకోవాల్సినవి
    తేజరిల్లు!—2015
తేజరిల్లు!—1997
g97 3/8 పేజీలు 14-16

స్నైల్‌ ఫీవర్‌ దాని అంతం కనుచూపుమేరలో ఉందా?

నైజీరియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

వైద్య, విజ్ఞాన రంగాల్లో దిగ్భ్రమ కలుగజేసే పురోభివృద్ధులు జరుగుతున్నప్పటికీ, మానవజాతి తరతరాలుగా వస్తున్న తన సమస్యలనెన్నింటినో పరిష్కరించుకోలేకపోతున్నది. ఇది స్నైల్‌ ఫీవర్‌ని అణచడానికై చేసిన ప్రయత్నాల విషయంలో కూడా వాస్తవమని రుజువైంది.

దీనికి చికిత్స చేయడానికి అన్ని మాధ్యమాలూ అందుబాటులో ఉన్నాయన్నట్లుగా కనబడుతోంది. ఇందులో ఇమిడివున్న పరాన్నజీవి జీవిత చక్రాన్ని డాక్టర్లు అర్థంచేసుకున్నారు. వ్యాధి నిర్ధారణ సులభంగా జరుగుతుంది. దానికి చికిత్సచేయడానికి ప్రభావవంతమైన మందులు దొరుకుతాయి. దానిని నివారించడానికైన ప్రయత్నాలను వేగిరం చేయడానికి ప్రభుత్వ అధికారులు ఆతురతతో ఉన్నారు. అయినా, ఆఫ్రికా, ఆసియా, కరీబియన్‌, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యాలలో కోట్లాదిమందిని పీడిస్తున్న ఈ వ్యాధికి అంతం కనుచూపుమేరలో కన్పించడం లేదు.

స్నైల్‌ ఫీవర్‌ (బిల్హర్జియాసిస్‌ లేక షిస్టోసోమియాసిస్‌ అని కూడా పిలువబడుతుంది) మానవున్ని వేల సంవత్సరాలుగా పీడించింది. ఈజిప్షియన్‌ మమ్మీలలో కనుగొనబడిన సున్నంగా మారిన గ్రుడ్లు ఫరోల కాలంలో ఈజిప్షియన్లను ఈ వ్యాధి బాధించిందనడానికి రుజువును అందిస్తున్నాయి. ముప్ఫై శతాబ్దాల తర్వాత, అదే వ్యాధి ఇప్పుడు ఈజిప్టులోని లక్షలాదిమంది నివాసుల ఆరోగ్యాన్ని పీల్చిపిప్పి చేస్తూ ఆ దేశాన్ని పట్టిపీడిస్తుంది. నైల్‌ డెల్టాలోని కొన్ని గ్రామాలలో, 10 మందిలో దాదాపు 9 మందికి ఇది సోకింది.

స్నైల్‌ ఫీవర్‌ స్థానపర వ్యాధిగావున్న మరితర 74 దేశాలలో ఈజిప్టు కేవలం ఒకటి మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంకెల ప్రకారం 20 కోట్లమందికి ఈ వ్యాధి సోకింది. 2 కోట్లమంది దీర్ఘకాల బాధితులలో దాదాపు 2,00,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతూవున్నారు. ఉష్ణమండలాల్లోని పరాన్నజీవుల వలన కలిగే వ్యాధుల్లో, దానిచే పీడించబడే వ్యక్తుల సంఖ్యాపరంగానూ, అది కలుగజేసే సాంఘిక, ఆర్థిక నష్ట సంబంధంగానూ స్నైల్‌ ఫీవర్‌ మలేరియాకు తర్వాత ఉందని చెప్పబడుతుంది.

పరాన్నజీవి జీవిత చక్రం

స్నైల్‌ ఫీవర్‌ గురించి తెలుసుకోవడమూ, తద్వారా దాన్ని నివారించి, చికిత్స చేయడం ఎలాగో తెలుసుకోవడమూ అంటే దాన్ని కలుగజేసే పరాన్నజీవిని అర్థం చేసుకోవడమనే అర్థం. కీలకమైన విషయం ఇదే: ఒక తరం తర్వాత మరో తరం గుండా జీవించడానికీ, వృద్ధిచెందడానికీ ఈ పరాన్నజీవికి రెండు ఆతిధేయులు కావాలి, అది రెండు జీవులలోపల జీవిస్తూ, భుజిస్తూ, అభివృద్ధి చెందుతూ ఉండాల్సుంటుంది. ఒకటి మానవునివంటి క్షీరదము; మరొకటి మంచినీటి నత్త.

ఇదీ జరుగుతుంది. ఈ పరాన్నజీవి సోకిన వ్యక్తి ఒక కొలను, చెరువు, వాగు, లేక ఒక నదిలోనికి మల లేక మూత్రవిసర్జన చేసినప్పుడు అతడు ఈ పరాన్నజీవి గ్రుడ్లను—బహుశ, రోజుకి దాదాపు పదిలక్షల గ్రుడ్లను విడుదల చేస్తాడు. ఈ గ్రుడ్లు మైక్రోస్కోప్‌ సహాయం లేకుండా చూడలేనంత అతిసూక్ష్మంగా ఉంటాయి. గ్రుడ్లు నీటిని తాకినప్పుడు, పరాన్నజీవులు గ్రుడ్లనుండి బయటికి వస్తాయి. ఈ పరాన్నజీవులు తమ శరీరంపైనున్న చిన్ని రోమాలను ఉపయోగిస్తూ ఒక మంచినీటి నత్త దగ్గరికి ఈది, దాన్లోకి చొచ్చుకుపోతాయి. నత్తలోపల అవి తర్వాతి నాలుగు నుండి ఏడు వారాల వరకు సంఖ్యాపరంగా అభివృద్ధిచెందుతాయి.

అవి నత్తను విడిచివెళ్లినప్పుడు, ఒక మానవున్ని లేక వేరే క్షీరదాన్ని కనుగొని లోపలికి ప్రవేశించడానికి వాటికి 48 గంటలు మాత్రమే ఉన్నాయి. లేకపోతే, అవి చచ్చిపోతాయి. నీట్లోకి వచ్చిన అటువంటి ఆతిధేయిని చేరిన తర్వాత ఆ పరాన్నజీవి చర్మంగుండా తొలుచుకునిపోయి రక్తప్రవాహంలోనికి ప్రవేశిస్తుంది. ఇది వ్యక్తికి కాస్త దురదను కలుగజేయవచ్చు, కొన్నిసార్లు అసలు దండయాత్ర అంటూ ఒకటి జరిగిందన్న విషయాన్ని గురించి ఎటువంటి సూచనా ఆయనకు దొరకదు. రక్తప్రవాహంలో, పరాన్నజీవి మూత్రాశయంలోని రక్త నాళాలలోపలికో లేక ప్రేవులలోకో వెళ్తుంది. దేనిలోకి వెళ్తుందన్నది దాని జాతిపై ఆధారపడివుంటుంది. కొన్ని వారాలలోపలే పరాన్నజీవులు పెరిగి 25 మిల్లీమీటర్ల పొడవునవున్న ఆడ, మగ పురుగులుగా తయారౌతాయి. సంపర్కం తర్వాత, ఆడజీవి ఆతిధేయి రక్తప్రవాహంలోనికి గ్రుడ్లను విడుదల చేయడం మొదలుపెడుతుంది, ఆ విధంగా చక్రం పూర్తౌతుంది.

దాదాపు సగం గ్రుడ్లు ఆతిధేయి శరీరాన్ని (ప్రేవుల సంబంధ స్నైల్‌ ఫీవర్‌ విషయంలో) మలం ద్వారా లేక (మూత్ర సంబంధ స్నైల్‌ ఫీవర్‌ విషయంలో) మూత్రం ద్వారా విడిచిపెడ్తాయి. మిగతా గ్రుడ్లు శరీరంలోనే ఉండిపోయి ముఖ్యమైన శరీరావయవాలకు నష్టాన్ని కలుగజేస్తాయి. వ్యాధి ముదురుతుండగా బాధితునికి జ్వరమూ, పొత్తికడుపు ఉబ్బడమూ, శరీరంలోపల రక్తస్రావమూ సంభవించగలవు. చివరికి వ్యాధి మూత్రాశయ క్యాన్సరుగా లేక కాలేయ క్షీణతకు లేదా మూత్రపిండాల క్షీణతకు దారితీయవచ్చు. కొంతమంది బాధితులు వ్యంధులౌతారు లేక పక్షవాతంగలవారిగా అవుతారు. ఇతరులు చనిపోతారు.

పరిష్కారాలూ, సమస్యలు

ఈ వ్యాధి వ్యాప్తిచెందడాన్ని నిరోధించడానికి కనీసం నాలుగు చర్యలను గైకొనవచ్చు. ఈ చర్యల్లో ఏ ఒక్కదాన్ని విశ్వవ్యాప్తంగా అన్వయించినా ఈ వ్యాధి తుడిచిపెట్టుకుపోతుంది.

మొట్టమొదటి చర్య ఏమంటే నీటి వనరుల్లోని నత్తల్ని నిర్మూలించాలి. ఈ పరాన్నజీవి అభివృద్ధిచెందడానికి నత్తలే కీలకం. నత్తలు లేవంటే, స్నైల్‌ ఫీవర్‌ లేదనే.

నత్తలను చంపేంత శక్తిగల విషాన్నీ, అదే సమయంలో పర్యావరణాన్ని కలుషితం చేయని విషాన్ని ఉత్పత్తి చేయడం ప్రధాన ప్రయత్నంగావుంది. 1960లలోనూ, 1970లలోనూ నత్తలను నిర్మూలించాలనే ప్రయత్నాలు, విస్తారమైన జలాల్లో పూర్తి జీవజాలాన్ని చంపడానికి దారితీశాయి. ఈజిప్టులోని టేయోడోర్‌ బిల్‌హార్జ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద ఇతర జీవాలకు హానిని కల్గించని ఒక మోల్లస్కసైడ్‌ (నత్తలను చంపే మందు)ను కనుగొనడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యక్షుడైన డా. ఆలీ జేన్‌ ఎల్‌ ఆబ్డీన్‌ అటువంటి మందును గురించి ఇలా అన్నాడు: “అది పంటలకు ఉపయోగించబడే, ప్రజలూ జంతువులూ త్రాగే, చేపలు జీవించే నీటిలో వేయబడుతుంది, అందుకని వీటిలో ఎవరికీ వేటికీ హానికల్గకుండా ఉండేలా మనం పూర్తిగా రూఢిపర్చుకోవాలి.”

రెండవ చర్య ఏమంటే మానవుల్లోని పరాన్నజీవులను చంపడం. 1970ల మధ్యభాగం వరకూ, ఎన్నో సైడ్‌ ఎఫెక్టులనూ, చిక్కులనూ తెచ్చిపెట్టే మందులను చికిత్సగా వాడారు. తరచూ, చికిత్సలో భాగంగా బాధాకరమైన ఇంజెక్షనులను ఇచ్చేవారు. చికిత్స, వ్యాధికన్నా ఘోరంగా ఉందని కొంతమంది ఫిర్యాదు చేశారు! అప్పటినుండీ, స్నైల్‌ ఫీవర్‌కి విరుద్ధంగా ప్రభావవంతంగా ఉన్న ప్రేజిక్వాంటెల్‌ వంటి క్రొత్త మందులు అభివృద్ధిచేయబడ్డాయి, వీటిని నోటిద్వారా తీసుకోవచ్చు.

ఈ మందులు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలోని క్షేత్ర ప్రాజెక్టులలో విజయవంతంగా ఉన్నట్లు రుజువైనప్పటికీ, అనేక దేశాల్లో ప్రధాన సమస్య ఏమంటే వాటికయ్యే ఖర్చు. 1991లో WHO ఇలా విలపించింది: “స్థానపర వ్యాధిగావున్న దేశాల్లో చికిత్సకయ్యే భారీ ఖర్చుల వలన పెద్దమొత్తంలోని [స్నైల్‌ ఫీవర్‌] నియంత్రణా కార్యక్రమాలతో ఆ దేశాలు ముందుకు కొనసాగలేకపోతున్నాయి; సాధారణంగా మందుల హార్డ్‌ కరెన్సీ ఖర్చులే ఆఫ్రికాలోని ఆరోగ్య శాఖల మొత్తం తలసరి బడ్జెటు కన్నా ఎక్కువగా ఉంటాయి.”

మందులు రోగికి ఉచితంగా అందుబాటులో ఉన్న చోట్లలో కూడా చాలామంది చికిత్స కొరకు వెళ్లరు. ఎందుకు? ఒక కారణం ఏమంటే ఈ వ్యాధివలన సంభవించే మరణాల రేటు సాపేక్షికంగా తక్కువగా ఉంటుంది, అందుకని కొంతమంది దీన్ని గంభీరమైన సమస్యగా పరిగణించరు. మరొక కారణం ఏమంటే ప్రజలు ఎల్లప్పుడూ వ్యాధి లక్షణాలను గుర్తించరు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, మూత్రంలో రక్తం రావడాన్ని (ఈ వ్యాధికున్న ప్రధాన లక్షణాల్లో ఒకటి) ఎంత సామాన్యంగా పరిగణిస్తారంటే అది పరిణతికి ఎదగడంలోని సహజమైన ఒక భాగం అని తలంచబడుతుంది.

మూడవ చర్య ఏమంటే నీటి వనరుల్లో గ్రుడ్లు లేకుండా చేయడం. స్థానిక నీటి వాగులూ, కొలనులూ వంటివాటిని కలుషితం చేయడాన్ని నివారించడానికై మరుగుదొడ్లు నిర్మించబడితే, అందరూ వాటిని ఉపయోగించినట్లైతే స్నైల్‌ ఫీవర్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

నీటిని పైపుల్లో సరఫరా చేసి, మరుగుదొడ్లను నిర్మించిన తర్వాత వ్యాధి సోకినవారి సంఖ్యలో పరిగణనీయమైన తగ్గుదల ఉన్నట్లు భూగోళవ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలు చూపిస్తున్నాయి. “చక్రాన్ని నిరంతరం కొనసాగించడానికి ఒక్క వ్యక్తి వాగులో మల విసర్జన చేస్తే చాలు” అని స్నైల్‌ ఫీవర్‌ని 20 సంవత్సరాలకుపైగా పరిశోధించిన అలన్‌ ఫెన్‌విక్‌ అనే శాస్త్రజ్ఞుడు అంటున్నాడు. మురుగునీటి పారుదల పైపులు పగిలి క్రిములున్న మలమూత్ర విసర్జన బయటికి వచ్చి నీటి వనరుల్లో కలిసే ప్రమాదం కూడా ఉంది.

నాలుగవ చర్య ఏమంటే పరాన్నజీవులతో కలుషితమైన నీటినుండి ప్రజలను దూరంగా ఉంచడం. ఇది చేయడం అనుకున్నంత సులభం కాదు. అనేక ప్రాంతాల్లో త్రాగు నీటిని సరఫరా చేసే చెరువులు, వాగులు, నదులు స్నానం చేయడానికీ, పంటలకు సాగునీటిని అందించడానికీ, బట్టలుతకడానికి కూడా ఉపయోగించబడుతున్నాయి. జాలర్లు ప్రతిదినం నీట్లోకి వెళ్తారు. ఉష్ణమండల ప్రాంతాల్లోని తీవ్రమైన వేడి, నీళ్లు కన్పిస్తే ఈతకొట్టాలనే అణుచుకోలేని కోరికను పిల్లల్లో పుట్టించగలదు.

భవిష్యత్తు కొరకు ఏ నిరీక్షణ ఉంది?

స్నైల్‌ ఫీవర్‌తో పోరాడడానికి నిజాయితీగల వ్యక్తులూ, సంస్థలూ శ్రద్ధాపూర్వకంగా పనిచేస్తున్నాయనీ, ఎంతో అభివృద్ధి సాధించబడిందనీ నిస్సందేహంగా అనవచ్చు. పరిశోధకులు దానికి విరుద్ధంగా టీకాను కూడా అభివృద్ధిచేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అయినప్పటికీ, ఈ వ్యాధిని నిర్మూలించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. ల రెవ్యూ డ్యూ ప్రాటీసియన్‌ అనే ఫ్రెంచి జర్నల్‌లో డా. ఎమ్‌. లారీవ్యెర్‌ ఇలా అంటున్నాడు: “విజయాలు సాధించినప్పటికీ . . . , ఈ వ్యాధి నిశ్చయంగా అదృశ్యమవ్వడం లేదు.” నివారణా, చికిత్సా అనేవి వ్యక్తులకు వాస్తవికమైనవైనప్పటికీ, స్నైల్‌ ఫీవర్‌కి విశ్వవ్యాప్తమైన పరిష్కారం దేవుని నూతన లోకం వచ్చేంతవరకూ కనుగొనబడకపోవచ్చు. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు” అని బైబిలు వాగ్దానం చేస్తుంది.—యెషయా 33:24.

[15వ పేజీలోని చిత్రం]

మనుషులు కలుషితమైన నీట్లోకి ప్రవేశించినప్పుడు, స్నైల్‌ ఫీవర్‌ని కలుగజేసే పరాన్నజీవులు వారిలోకి ప్రవేశించగలవు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి