విత్తనాలను మీరే మొలకెత్తించండి
హవాయిలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
తాజాగా లేతగా పోషకవిలువలున్న కూరగాయల కొరకు మీ ప్రాంతంలో ఉన్న మార్కెట్లో వెతికి విఫలమైన సందర్భాలున్నాయా? ఇక ఆ అన్వేషణ మానేయండి! సమయాన్నీ ప్రయత్నాన్నీ ఎక్కువగా వెచ్చించకుండానే మీరు ఉంటున్న ఇంట్లోగానీ అపార్ట్‌మెంటులోగానీ మీరు కూరగాయలను పెంచుకోవచ్చు. అదెలా? మొలకలను పెంచడం ద్వారానే!
వాటిని ఎంత సులభంగా పెంచవచ్చంటే వాటినో పిల్లవాడుకూడా పెంచగలడు. వాటికి కొంచెం స్థలం చాలు, తవ్వే పనిలేదు, కలుపుతీసే పనిలేదు, క్లిష్టమైన రసాయనాలతో పెద్ద తతంగం చేయాల్సిన పనిలేదు. అన్నిటికంటే మిన్నగా, అవి పెరగడం ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే వాటిని మీరు తినవచ్చు! అయితే వాటిని సులభంగా తయారు చేయడం మాత్రమే వాటి ప్రయోజనాలు కావు.
ఒక విషయమేమిటంటే, మొలకల్లో పోషక విలువలున్నాయి—బహుశ సాధారణ బీన్స్ గింజలూ లేక ఇతర విత్తనాలకన్నా ఎక్కువ పోషక విలువలుంటాయి. గే కోర్టర్ రాసిన ది బీన్‌స్ప్రౌట్ (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా అంటోంది: “విత్తనాలు మొలకెత్తడం ప్రారంభించాక వాటిలోని విటమిన్ మోతాదు కూడా పెరగడం ప్రారంభమౌతుంది. సోయాబీన్‌కు వచ్చే తొలి మొలకల్లో (100 గ్రాముల [సుమారు 4 ఔన్సులు] విత్తనాలకు) 108 మిల్లీగ్రాముల విటమిన్ సి మాత్రమే ఉందని పెన్సల్వేనియా విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశీలనలో తేలింది. అయితే 72 గంటల తర్వాత విటమిన్ సి మోతాదు 706 మిల్లీగ్రాములకు పెరిగింది!
మొలకలను పెంచడం చవక కూడా. బహుశ దానికి అవసరమైన పరికరాలన్నీ మీ దగ్గర ఉండేవుంటాయి.
సిద్ధం చేసుకోవడం
మొదట మీకు ఓ గిన్నె అవసరం. ఓ పెద్ద గాజు లేక ప్లాస్టిక్ జాడీగానీ, మట్టికుండగానీ, ఓ గాజులేక పింగాణీ పాత్రగానీ, లేక లోతు బాగా ఉన్న ఓ గిన్నె ఉన్నా సరిపోతుంది. లోతు ఎక్కువగా లేని ఏదైనా ఓ పాత్ర ఉన్నా ఇది సాధ్యమే, ముందు విత్తనాలు చల్లి రెండు మడతలేసిన పల్చటి కాటన్ బట్టనుగానీ లేక టిష్యూ పేపరునుగానీ తడి ఆరకుండా ఉంచేందుకు ఉపయోగించవచ్చు. మీరు ఏ గిన్నెను ఎన్నుకున్నా అది, విత్తనాలు మొలకెత్తేందుకూ అలా మొలకెత్తిన తర్వాత కూడా కొంచెం గాలి వాటి మధ్య ప్రసరించేందుకూ సరిపడేంత పెద్దగా ఉండాలి. అల్ఫాల్ఫా వంటి చిన్న విత్తనాలకు గాజు జాడీలు ఉపయుక్తంగా ఉన్నట్లు నేను కనుగొన్నాను. పెసర గింజలు వంటి మరికాస్త పెద్దగా ఉండేవాటిని లోతు బాగా ఉన్న గిన్నెలోగానీ కుండలో గానీ వేస్తే బాగా పెరుగుతాయి. వాటికి అవసరమైన అదనపు స్థలాన్ని అది అందిస్తుంది అంతేకాకుండ మొలకలు కుళ్లిపోకుండా పుల్లగా మారకుండా కాపాడుతుంది.
మీ గిన్నెకు మూత కూడా అవసరం. సన్నటి రంధ్రాలున్న ప్లాస్టిక్ ముక్క, ఓ పల్చని కాటన్ బట్ట, లేక పాత నైలాన్ సాక్సు ఉన్నా సరిపోతుంది. ఇందుకు కావల్సిందల్లా ఆ గిన్నెకు దాన్ని బిగించేందుకు ఓ గట్టి రబ్బర్‌బాండు లేక తాడు. రోజుకు కనీసం రెండుసార్లు ఆ విత్తనాలను కడగాలి కనుక నీళ్లూ అవసరమౌతాయి మరి బహుశ గిన్నెలో ఎక్కువైన నీటిని వడగట్టేందుకు ఓ జల్లెడా అవసరమౌతాయి.
చివరిగా మీకు కావాల్సింది విత్తనాలు. ఇంచుమించు భుజించగల ఏ విత్తనాన్నైనా మొలకెత్తించవచ్చు. (అయితే, రసాయనాలు ఉపయోగించబడిన విత్తనాలను వాడకుండా ఉండడం విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను.) మొదటిసారి వీటిని చేసేందుకు ప్రయత్నించే వ్యక్తికి పెసర్లు లేక అల్ఫాల్ఫా విత్తనాలు మంచివి. అవి సులభంగా మొలకెత్తుతాయి, ఎంతో రుచిగా ఉంటాయి! సరే, వాటిని ఎలా చేస్తారో చెప్పనివ్వండి.
విత్తనాలను మీరే మొలకెత్తించడం
మొదటి రోజు: మొదట విత్తనాలను జాగ్రత్తగా కడగండి. తర్వాత, విత్తనాలు లేక బీన్స్ గింజలు మునిగిన తర్వాత అయిదు సెంటీమీటర్ల ఎత్తువరకూ నీళ్లు ఉండేట్లుగా ఆ గిన్నెలోనికి నీళ్లు పోయాలి. ఆ విత్తనాలను కనీసం 8 నుండి 10 గంటలవరకూ నానబెట్టండి. రాత్రి నిద్రపోవడానికి కాస్త ముందుగా మీరు విత్తనాలను నానబెట్టవచ్చు. ఎనిమిది నుండి పది గంటల్లోగా, విత్తనాలు ఉబ్బి కొద్దిగా తెరుచుకుంటాయి. ఇప్పుడు మొలకెత్తేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి.
రెండవ రోజు: ఉదయం, దాని మూతను గట్టిగా పెట్టి గిన్నెలోని నీటిని తీసివేయండి. (ఆ నీళ్లలో విటమిన్లు ఉంటాయి కనుక సాధారణంగా వాటిని నేను నా మొక్కలకు పోస్తాను.) ఇప్పుడు, ఆ గిన్నెలో మరలా నీళ్లు పోయండి. దాన్ని కొన్నిసార్లు అటు ఇటు బాగా కదిపి, తిరగేసి ఎక్కువైన నీళ్లను తీసివేయండి. విత్తనాలను కడుగుతూ నీటిని తీసివేస్తూ మొత్తం మూడుసార్లు అలా చేయండి. మరలా మరలా ఆ పాత్రను కాస్త నీటితో నింపండి. నానబెట్టిన విత్తనాలను పళ్ళెంలోకి మీరు మార్చినట్లైతే, పల్చని కాటన్ బట్టమీద నెమ్మదిగా నీళ్లు పోసి, పాత్రను వంచి నీటిని తీసివేయండి. ఆ తర్వాత, విత్తనాలను రోజుకు రెండుసార్లు బాగా శుభ్రం చేస్తూ వాటిని పదేపదే కడగండి.
మూడవ రోజు: ఇప్పటికల్లా మీ విత్తనాలు మొలకెత్తడం చూస్తారు. రోజుకు రెండుసార్లు కడుగుతూనే ఉండండి.
నాలుగవ రోజు: మీరు ఆ మొలకలను ఇక తినడం ప్రారంభించవచ్చు! పెసర్ల మొలకలను బాగా పొడవుగా పెరగనివ్వవచ్చు, వాటిలో చేదు ఉండదు. అయితే ప్రతిరోజూ రెండుసార్లు తప్పక కడగండి. మీ మొలకలను మీరు సుమారు ఒక గంటసేపు ఎండలో కూడా పెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జిలో పెట్టవచ్చు. చిన్ని ఆకులు అందమైన ఆకుపచ్చరంగులోకి మారుతాయి—చూస్తేనే నోరూరుతుంది!
ఒకసారి విజయాన్ని రుచిచూసిన తర్వాత, ఇతర గింజలతో లేక విత్తనాలతో ప్రయోగం చేయాలని ఇష్టపడవచ్చు. ప్రతిదానికీ రుచిలోనూ మొలకెత్తేందుకు పట్టే సమయంలోనూ కాస్త తేడాలు ఉంటాయి. ఉదాహరణకు, పొట్టున్న ప్రొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలను మొలకెత్తించేందుకు మీరు ప్రయత్నించవచ్చు. రెండు రోజుల్లో ఈ మొలకలు అర్థ అంగుళం పెరుగుతాయి, ఆ తర్వాత తింటేనే చాలా బాగుంటాయి. అంతకంటే ఏమాత్రం కొద్దిగా పెరిగినా వాటి రుచి చేదుగా మారే అవకాశం ఉంది.
మొలకలను ఎలా వడ్డించాలి
మొలకల్లో అనేకమైన వాటిని సాలడ్‌లలో సాండ్విచ్‌లలో పచ్చిగానే తినవచ్చు లేక బీన్స్ గింజలనూ విత్తనాలనూ ఉపయోగించే వంటకాలతో తినవచ్చు. అయితే బీన్స్ మొలకలను తినేముందు 10 నుండి 15 నిమిషాలు ఆవిరితో ఉడకబెట్టవచ్చు. లేక కొంత నూనె, అల్లం, ఉప్పూ వేసి కొద్దిగా వేయించవచ్చు. ఇలా చేస్తే ఎంతో కమ్మని వంటకం తయారౌతుంది! గోధుమ మొలకలూ రై మొలకలూ తీయగా ఉంటాయి కనుక బ్రెడ్డుతో మఫ్ఫిన్స్‌తో తినేందుకు చాలా కమ్మగా ఉంటాయి.
కాబట్టి మొలకల పెంపకం ఎంతో ఆరోగ్యదాయకమైన లాభసాటియైన హాబీ. అలా చేయడం ఎంతో ఉత్సాహభరితంగానూ ప్రతిఫలదాయకంగానూ ఉంటుందని మీరు కనుగొంటారు. ఎంతైనా, సఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మరి దాని ఫలితాలు కమ్మగా ఉంటాయి!
[17వ పేజీలోని చిత్రసౌజన్యం]
Japanese Stencil Designs
[18వ పేజీలోని చిత్రం]
మొదటి రోజు: విత్తనాలను సమకూర్చి, వాటిని 8 నుండి 10 గంటలు నీటిలో నానబెట్టండి
[19వ పేజీలోని చిత్రం]
రెండవ మరియు మూడవ రోజు: రోజుకు రెండుసార్లు విత్తనాలను కడగండి
[19వ పేజీలోని చిత్రం]
నాలుగవ రోజు: మొలకలు (ఈ ప్రక్కనుండి పల్చటి కాటన్ గుడ్డమీద ఉన్నవి) తినేందుకు సిద్ధంగా ఉన్నాయి!