యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
నేను దేవుని స్నేహితునిగా ఎలా అవ్వగలను?
“యథార్థత.” “వ్యక్తిగత భక్తి.” ప్రజలు తరచూ తమ అత్యంత సన్నిహిత స్నేహితులతో తమకున్న అనురాగబంధాన్ని వర్ణించడానికి ఉపయోగించే మాటలివి. ఈ మాటలు ఈ అద్భుతమైన విశ్వానికి సృష్టికర్తైన వానితోగల అనురాగబంధాన్ని కూడా వర్ణించగలవని, దేవుడే మీ వ్యక్తిగత స్నేహితుడు కాగలడని మీకు తెలుసా? అవును, బైబిలు దైవభక్తిని కలిగివుండడం గురించి మాట్లాడుతుంది, మరి ఆ వ్యక్తీకరణలో విధేయత మాత్రమే కాదు గానీ, దేవునిపట్ల అనురాగబంధం కలిగివుండడంతోపాటు, ఒక ప్రశంసాపూర్వక హృదయం నుండి ఉద్భవించే సన్నిహితత్వం కూడా ఇమిడివుంది.
ఈ పరంపరలోని మునుపటి శీర్షికలు అటువంటి అనురాగబంధం సాధ్యమనీ, ప్రయోజనకరమైనదనీ చూపించాయి.a కానీ మీరు అసలు దేవునితో ఈ వ్యక్తిగత స్నేహాన్ని ఎలా సాధిస్తారు? అది మీకు పుట్టుకతో వచ్చేదీ కాదు లేక దైవభక్తిగల తలిదండ్రులనుండి ఉన్నదివున్నట్లు మీరు వారసత్వంగా పొందేదీ కాదు. దానికి బదులుగా, అది కేవలం నిజమైన ప్రయత్నం ద్వారా మాత్రమే వస్తుంది. అపొస్తలుడైన పౌలు ‘దేవభక్తి విషయములో తనకు తానే సాధకము చేసికోవాలని’ యౌవనుడైన తిమోతికి చెప్పాడు. అవును, సాధన చేసేటప్పుడు ఒక క్రీడాకారుడు చేసే కృషినే ఆయన చేయవలసివున్నాడు! (1 తిమోతి 4:7, 8, 10) దేవుడు మీ స్నేహితుడు కావాలంటే మీరు కూడా అదేవిధంగా చేయాలి. కానీ ఈ విషయంలో మీరు సాధన చేయడం ఎలా మొదలుబెట్టగలరు?
దేవునిగూర్చిన వ్యక్తిగత జ్ఞానము
దైవభక్తి హృదయంనుండి ఉద్భవిస్తుంది గనుక, మీరు మీ హృదయాన్ని దేవుని జ్ఞానంతో నింపుకోవాలి. విషాదకరమైన విషయమేమంటే, 500కంటే ఎక్కువమంది యౌవనులను “మీరు ఒంటరిగా ఉన్నప్పుడు బైబిలును ఎంత తరచుగా చదువుతారు?” అని అడిగినప్పుడు, 87 శాతంమంది “అప్పుడప్పుడూ” అనో లేక “చాలా తక్కువ” అనో లేక “అసలు చదవము” అనో చెప్పారు. స్పష్టంగా చాలామంది యౌవనులు బైబిలును చదవడం నిస్తేజంగాను, విసుగ్గాను ఉంటుందని అనుకుంటారు. కానీ అలా కానవసరం లేదు! ఆలోచించండి: కొంతమంది యౌవనస్థులు క్రీడలకు సంబంధించిన అన్ని రకాల గణాంకాలను ఎందుకు బట్టీపడతారు లేక తమకు నచ్చిన పాటలను ఎందుకు నేర్చుకుంటారు? ఎందుకంటే వారు ఆ విషయాల్లో ఆసక్తికలిగివున్నారు గనుక. అదేవిధంగా, బైబిలును పఠించడం అనేది, మీరు అందులో నిమగ్నులైతే ఆసక్తికరంగా తయారౌతుంది. (1 తిమోతి 4:15) అపొస్తలుడైన పేతురు ఇలా ఉద్బోధించాడు: “నిర్మలమైన వాక్యమను . . . పాలను అపేక్షించుడి.” (1 పేతురు 2:2-3) అవును, మీరు లేఖనాల్లో అటువంటి ఆసక్తిని కలుగజేసుకోవాలి, లేక పెంపొందించుకోవాలి. దీనికి కృషి అవసరం, కానీ దాని ద్వారా వచ్చే ప్రతిఫలాలు ఆ ప్రయత్నాలకు తగినంత విలువైనవే.b
ఒక ప్రయోజనం ఏమంటే, దేవుని వాక్యాన్ని, బైబిలు ఆధారిత ప్రచురణలను చదవడం, పఠించడం “యెహోవా ప్రసన్నతను” వెల్లడిచేస్తాయి. (కీర్తన 27:4) అమ్‌బర్ అనే ఒక క్రైస్తవ యౌవనురాలు పూర్తి బైబిలు చదవడాన్ని తన గురిగా పెట్టుకుంది. దీనికి దాదాపు సంవత్సరం పట్టింది. “నా జీవితంలో అంత సమయమూ, ప్రయత్నమూ అవసరమై, అన్ని ప్రతిఫలాలు తెచ్చే విషయాలు చాలా తక్కువున్నాయని నా నమ్మకం” అని అమ్‌బర్ వివరిస్తుంది. “నేను దాన్ని చదువుతున్నప్పుడు, ఒక తండ్రిలా యెహోవా నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని నాకు బోధిస్తున్నాడని నాకు అనిపించింది. నేను యెహోవా గురించి ఎంతో తెలుసుకున్నాను—నన్ను ఆయనకు సన్నిహితం చేసి, నా జీవిత పర్యంతం ఆయనకు భయపడాలనే కోరిక నాలో పుట్టించిన విషయాలను గురించి తెలుసుకున్నాను.”
మీరు బైబిలును చదువుతున్నప్పుడు, దేవుడు తన యథార్థ స్నేహితులకు మద్దతునిచ్చిన ఎన్నో సందర్భాలను గురించి మీరు నేర్చుకుంటారు. (కీర్తన 18:25; 27:10) ఆయన ప్రమాణాలు ఎల్లప్పుడూ శ్రేష్ఠమైనవని, మన నిరంతర క్షేమం కొరకైనవని మీరు కనుగొంటారు. (యెషయా 48:17) ప్రేమా, బుద్ధీ వంటి దేవుని సాటిలేని గుణాలను గురించి చదవడం ఆయనను అనుకరించేందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. (ఎఫెసీయులు 5:1) కానీ అటువంటి సమాచారం మీ హృదయాన్ని కదిలించాలంటే మీరు ధ్యానించాలి కూడాను. మీరు చదువుతుండగా మిమ్మల్నిలా ప్రశ్నించుకోండి: ‘ఇది నాకు యెహోవాను గురించి ఏమి చెబుతుంది? నేను దీన్ని నా ఆలోచనల్లోను, తీసుకునే చర్యల్లోను ఎలా అన్వయించుకోగలను? నేను కలిగివుండగల అత్యంత శ్రేష్ఠమైన స్నేహితుడు దేవుడేనని ఇది ఎలా చూపిస్తుంది?’
వ్యక్తిగత పఠనం ద్వారా, సంఘ పఠనం ద్వారా మీరు దేవుని గూర్చి పొందే జ్ఞానం ఆయనకు మరొక మార్గంలో మరింత దగ్గరయ్యేందుకు మీకు సహాయం చేస్తుంది. ఒక ఫ్రెంచి సామెత ఇలా చెబుతుంది: “నిజమైన స్నేహితులు ఒకే విధంగా ఆలోచిస్తారు.” కానీ మీరు దేవునితో ఎలా “ఒకే విధంగా ఆలోచిస్తారు”? యౌవనురాలైన డెనీస్ ఇలా వివరిస్తోంది: “ఒక విషయాన్ని మీరు ఎంత ఎక్కువగా పఠిస్తారో, దానిపై ఎంత ఎక్కువగా పరిశోధన చేస్తారో ఆ విషయంపై మీరు అంత ఎక్కువగా యెహోవా దృక్కోణాన్ని కనుగొంటారు. తద్వారా ఆయన ఒక విషయాన్ని గురించి ఎలా భావిస్తాడో తెలుసుకోవడం మీకు సహాయకరంగా ఉంటుంది.”
నీతియుక్తమైన ప్రవర్తన ముఖ్యం
తన నైతిక ప్రమాణాలను గౌరవించే వారినే దేవుడు తన స్నేహితులుగా ఎన్నుకుంటాడు. “యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును” అని సామెతలు 3:32 చెబుతుంది. నీతియుక్తంగా ఉండగోరే యౌవనుడు ‘యెహోవా నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించుటకు శ్రద్ధాభక్తులుగలవాడై’ ఉంటాడు. (2 రాజులు 10:31) అటువంటి విధేయతతో కూడిన ప్రవర్తన ఒక వ్యక్తిని దేవునికి ఎంత దగ్గరగా తెస్తుంది? యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.” (యోహాను 14:21-24) ఎంతటి హృదయానందకరమైన దృశ్యం! ఊహించండి, విశ్వంలోని ఇద్దరు అత్యంత గొప్ప వ్యక్తులు ఒక మానవుని గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ, శ్రద్ధను కనపరుస్తున్నారు! మీరు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి శ్రద్ధాభక్తులు గలవారైతే అది మీకు సంభవిస్తుంది.
నీతియుక్తంగా ఉండడమంటే మీరు పరిపూర్ణంగా ఉండాలనా? ఎంతమాత్రం కాదు! బలహీనత మూలాన ఒక పొరపాటు చేశారంటే మీరు ‘దేవుని ఆజ్ఞల జాడను’ విడనాడారని అర్థంకాదు. (కీర్తన 119:35) రాజైన దావీదు గురించి బైబిలు మనకు ఏమి చెబుతుందో పరిశీలించండి. దేవుని యథార్థమైన స్నేహితునిగా ఉన్నప్పటికీ, ఆయన బలహీనతవల్ల కొన్ని గంభీరమైన పొరపాట్లను చేశాడు. అయినప్పటికీ, ఆయన ‘యథార్థహృదయుడై నీతినిబట్టి నడుచుకొన్నాడని’ యెహోవా చెప్పాడు. (1 రాజులు 9:4) రాజైన దావీదు తాను చేసిన ప్రతివిధమైన పొరపాటుకు ఎల్లప్పుడూ హృదయపూర్వకమైన పశ్చాత్తాపాన్ని కనపర్చి, దేవున్ని ప్రీతిపర్చేది చేయడానికి గట్టి ప్రయత్నం చేశాడు.—కీర్తన 51:1-4.
దావీదు దేవున్ని ప్రేమించినప్పటికీ, కొన్నిసార్లు సరైనది చేయడం ఎంత కష్టంగా ఉండగలదో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన దేవునికి ఇలా ప్రాధేయపడ్డాడు: ‘నన్ను నీ సత్యమును అనుసరింపజేయుము.’ అవును, ఆయన దేవుని మనస్సును నొప్పించేందుకు నిష్కపటమైన భీతిని, లేక భయాన్ని అలవర్చుకున్నాడు. అందుకని దావీదు ఇలా చెప్పగల్గాడు: “యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది.” (కీర్తన 25:5, 14) ఇది వ్యాధిగ్రస్తమైన భయం కాదు గానీ సృష్టికర్త ఎడల ప్రగాఢమైన భక్తితో కూడిన భావము, ఆయనను అప్రీతిపరుస్తామనే ఆరోగ్యకరమైన భీతి. ఈ దైవిక భయమనే పునాదిపైనే సరైన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. దృష్టాంతముగా, జాషువా అనే ఒక క్రైస్తవ యౌవనుని ఉదాహరణను పరిశీలించండి.
తాను అతనిని ఇష్టపడిందని, తాను అతనితో “భావోద్రేక సంబంధం” పెట్టుకోవాలని కోరుకుంటుందని వ్రాసివున్న ఒక చిట్టీని జాషువా తన సహవిద్యార్థిని నుండి అందుకున్నాడు. జాషువా ఆమెవైపు ఆకర్షితుడైనప్పటికీ, అవిశ్వాసితో సహవసించడం అనైతికతకు దారితీయగలదని, యెహోవాతో తన స్నేహానికి హాని చేకూర్చగలదని గ్రహించాడు. అందుకని తాను ఆసక్తికలిగిలేడని ఆమెకు నిక్కచ్చిగా చెప్పేశాడు! తాను ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడో తర్వాత తన తల్లికి చెప్పినప్పుడు, ఆమె మొదట ఏమీ ఆలోచించకుండా, “ఓహ్, జాషువా, బహుశా నీవు ఆమె మనస్సును గాయపర్చివుంటావు!” అని అన్నది. జాషువా ఇలా ఉత్తరమిచ్చాడు: “కానీ అమ్మా, నేను యెహోవాను గాయపర్చడం కన్నా ఆమెను గాయపర్చడం భావ్యం కదా.” ఆయనకున్న దైవిక భయము, తాను తన పరలోక స్నేహితుని అప్రీతిపరుస్తాడనే భీతి ఆయన సరైన ప్రవర్తనను కలిగివుండడానికి కదిలించింది.
మంచి సహవాసుల కొరకు వెదకండి
అయితే లిన్ అనే ఒక యౌవనురాలు సమస్యల్లో చిక్కుకోవడం మొదలుబెట్టింది. సమస్యేమిటి? ఆమె చెడు గుంపుతో సహవసించడం మొదలుబెట్టింది. (నిర్గమకాండము 23:2; 1 కొరింథీయులు 15:33) పరిష్కారం? క్రొత్త స్నేహితులకొరకు వెదకడం! “మీ చుట్టూ యెహోవాను ప్రేమించే వ్యక్తులు ఉంటే, అది మీరు సున్నితమైన మనస్సాక్షిని కలిగివుండడానికి, సమస్యలనుండి దూరంగా ఉండడానికి సహాయపడుతుంది, తప్పిదం చేయడం ఎడల వారు ఏహ్యభావాన్ని వ్యక్తం చేసినప్పుడు, మీరు కూడా అదేవిధంగా భావించేలా చేస్తుంది” అంటూ లిన్ ముగిస్తోంది.
నిజానికి, మీరు స్నేహితులను సరిగ్గా ఎంపిక చేసుకోకపోవడం మీరు దేవునితో స్నేహాన్ని కల్గివుండడానికి అత్యంత పెద్ద అవరోధం కాగలదు. పద్ధెనిమిదేళ్ళ ఆన్ ఇలా ఒప్పుకుంటుంది: “మీ సహవాసులు మీపై గొప్ప ప్రభావాన్ని కల్గివుండగలరు. ఎప్పుడో ఒకప్పుడు మీరూ వారిలాగే ఉంటారు. వారు మిమ్మల్ని తమ ఆలోచనా విధానంలోకి మలిచివేస్తారు. సంభాషణలు ఎక్కువగా సెక్స్ గురించే కావచ్చు. అది మీలో జిజ్ఞాసను రేకెత్తించవచ్చు. అదసలు ఎలా ఉంటుందోనని మీరు ఆసక్తితో ఆలోచిస్తారు.” ఆన్ దీనిని ఒక చేదైన అనుభవం ద్వారా నేర్చుకుంది. ఆమె ఇలా అంటుంది: “ఇది నిజమని నాకు తెలుసు. నేను అనైతికతలో చిక్కుకుని 15 ఏండ్లప్పుడు గర్భవతినయ్యాను.”
ఆన్ చివరికి ఈ బైబిలు మాటల సత్యసంధతను ప్రశంసించనారంభించింది: “కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.” (యాకోబు 4:4) అవును, ఆన్ లోకానికి స్నేహితురాలవ్వాలని కోరుకుంది—నిశ్చయపర్చుకుంది. కానీ ఇది ఒకదాని తర్వాత మరొకటిగా మనస్తాపాలకు దారితీసింది. సంతోషకరంగా, ఆన్ స్పృహలోకి వచ్చింది. తన నడత విషయమై చాలా పశ్చాత్తాపపడి తన తలిదండ్రులనుండి, తన సంఘంలోని పెద్దలనుండి సహాయాన్ని కోరింది. ఆమె తన కొరకు క్రొత్త స్నేహితుల జట్టును కూడా కనుగొంది. (కీర్తన 111:1) తనవైపునుండి గొప్ప ప్రయత్నం చేసి ఆన్ మరల దేవుని స్నేహితురాలు కాగల్గింది. ఇప్పుడు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఇలా అంటుంది: “యెహోవాతో నాకు మరింత సన్నిహిత సంబంధం ఉంది.”
బైబిలును వ్యక్తిగతంగా పఠించడం, ధ్యానించడం, నీతియుక్త ప్రవర్తన, ఆరోగ్యకరమైన సహవాసాల ద్వారా మీరు కూడా దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోగలరు. అయితే, ఆ సంబంధాన్ని కొనసాగించడమనేది వేరే విషయం. కష్టాలూ, వ్యక్తిగత బలహీనతల నడుమ అలా చేయడం ఎలా సాధ్యం? ఈ పరంపరలో మున్ముందు రాబోయే శీర్షిక ఈ విషయాన్ని చర్చిస్తుంది.
[అధస్సూచీలు]
a ఆగస్టు 8, డిశంబరు 8, 1995 తేజరిల్లు! సంచికలను చూడండి.
b మా ఆగస్టు 8, 1985 (ఆంగ్లం) సంచికలోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . బైబిలును ఎందుకు చదవాలి?” అనే శీర్షికను చూడండి.
[13వ పేజీలోని చిత్రం]
దేవుని స్నేహితునిగా ఉండడానికి నా సహవాసులు నాకు సహాయం చేస్తారా?