సవాలును ఎదుర్కోవడం
సంవత్సరాలుగా ADHD కొరకు ఎన్నో రకాల చికిత్సలు ప్రతిపాదించబడ్డాయి. వీటిలో కొన్ని ఆహార నియమాలపై కేంద్రీకరించబడ్డాయి. అయితే, తిండి పదార్థాల్లో కలిపే మిశ్రమాలు సాధారణంగా హైపర్‌యాక్టివిటీనీ కలుగజేయవనీ, పోషక సంబంధ పరిష్కారాలు తరచూ ప్రభావరహితంగా ఉన్నాయనీ కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మందులు తీసుకోవడం, ప్రవర్తనా పరివర్తన, దీన్ని గూర్చిన జ్ఞానాన్ని అందిస్తూ శిక్షణనివ్వడం వంటివి ADHDకి చికిత్స చేసే ఇతర పద్ధతులు.a
మందులు. స్పష్టంగా ADHDలో మెదడు సరిగ్గా పనిచేయకపోవడం అనేది ఇమిడివుంది గనుక, సరైన రసాయనిక సమతౌల్యాన్ని పునఃస్థాపించడానికి మందులు తీసుకోవడం అనేకమందికి సహాయకరంగా ఉన్నట్లు రుజువైంది.b అయితే, మందులు తీసుకోవడం అనేది నేర్చుకోవడంయొక్క స్థానాన్ని ఆక్రమించదు. అది క్రొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఒక పునాదిని వేస్తూ పిల్లవాడు కేవలం తన అవధానాన్ని కేంద్రీకరించడానికి సహాయపడుతుంది.
ADHDవున్న చాలామంది పెద్దవారు అదేవిధంగా మందులద్వారా సహాయం పొందారు. అయినా, ADHDకి చికిత్స చేయడానికి ఉపయోగించబడే కొన్ని ప్రేరేపక మందులు వ్యసనంగా తయారయ్యేవిగా ఉండగలవు గనుక యౌవనులూ, పెద్దలూ జాగ్రత్తగా ఉండడం మంచిది.
ప్రవర్తనా పరివర్తన. ఒక పిల్లవానికి ADHD ఉండడం క్రమశిక్షణనివ్వాల్సిన బాధ్యతనుండి వాని తలిదండ్రులను విముక్తులను చేయదు. ఈ విషయంలో పిల్లవానికి ప్రత్యేక అవసరతలు ఉన్నప్పటికీ, బైబిలు తలిదండ్రులను ఇలా ఉద్బోధిస్తుంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” (సామెతలు 22:6) మీ హైపర్‌యాక్టివ్ బిడ్డ (ఆంగ్లం) అనే తన పుస్తకంలో బార్బ్ర ఇంగర్‌సోల్ ఇలా అంటుంది: “ఒక తండ్రి చేతులెత్తేసి, హైపర్‌యాక్టివ్ పిల్లవాడు ‘విచ్చలవిడిగా’ ప్రవర్తించేందుకు విడిచిపెడితే అది వానికి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. వేరే పిల్లలందరిలాగానే హైపర్‌యాక్టివ్ పిల్లవానికి—ఒక వ్యక్తిగా ఆ పిల్లవాడి ఎడల గౌరవాన్ని ప్రదర్శిస్తూనే—నిరంతర క్రమశిక్షణ అవసరం. స్పష్టమైన పరిమితులూ, ఉచితమైన బహుమతులూ, జుర్మానాలూ అని దీనర్థం.”
తలిదండ్రులు స్పష్టమైన నియమాలను విధించాలనీ, పిల్లవాడి ప్రవర్తనను అదుపులో పెట్టడంలో కచ్చితంగా ఉండాలనీ దీనర్థం. అంతేగాక, దైనందిన కార్యకలాపాల్లో కచ్చితమైన రోటీను ఉండాలి. ఈ పట్టికను వేసుకోవడంలో పిల్లవానికి కాస్తంత స్వేచ్ఛనివ్వాలని తలిదండ్రులు కోరుకోవచ్చు, దీనిలో హోమ్‌వర్కు, చదువులు, స్నానాలు వగైరా పనుల కొరకు సమయం ఇమిడివుంది. తర్వాత దీనిని పాటించడంలో కచ్చితంగా ఉండేలా చూడండి. దైనందిన రోటీనును అనుసరిస్తున్నారని రూఢీపర్చుకోండి. ఫై డెల్టా కప్పా ఇలా అంటుంది: “ఒక పిల్లవానికి ADD లేక ADHDవున్నట్లు వర్గీకరించబడడం అనేది, క్రమశిక్షణ పొందకుండా ఏమైనా చేయడానికి వాడిని వదిలిపెట్టివేయడానికి ఒక లైసెన్సు కాదని పిల్లవానికీ, వాని తలిదండ్రులకూ వివరించవల్సిన బాధ్యత ఫిజీషియన్లకూ, మనస్తత్వశాస్త్రజ్ఞులకూ, స్కూలు అధికారులకూ, ఉపాధ్యాయులకూ ఉంది. దానికి బదులుగా ఆ వర్గీకరణ ADD లేక ADHDవున్న పిల్లవానికి తగిన సహాయం చేయడానికి నడిపించే వివరణగా పరిగణించబడాలి.”
జ్ఞానాన్ని అందిస్తూ శిక్షణనివ్వడం. ఇందులో తనను గురించీ, తన రుగ్మతను గురించీ తనకున్న దృష్టికోణాన్ని మార్చుకోవడానికి పిల్లవానికి సహాయం చేయడం ఇమిడి ఉంది. “అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ ఉన్నవారు తాము ఆకర్షణీయంగా, తెలివిగలవారిగా, సహృదయులుగా ఉన్నప్పటికీ ‘అసహ్యంగా, మూర్ఖులుగా, అయోగ్యులుగా’ ఉన్నట్లు భావిస్తారు” అని డా. రానల్డ్ గోల్డ్‌బర్గ్ చెబుతున్నాడు. అందువలన, ADD లేక ADHDవున్న పిల్లవాడు తన విలువను గురించిన సరైన దృక్కోణం కలిగివుండాల్సిన అవసరం ఉంది, అవధానం కనపర్చడంలో తాను పడే కష్టాలను ఎదుర్కోవచ్చని తెల్సుకోవల్సిన అవసరం ఉంది. కౌమారదశలో ఇది మరీ ప్రాముఖ్యం. ADHDవున్న పిల్లవాడు టీనేజ్ వయస్సుకు చేరుకునేటప్పటికి, తన తోటివారినుండీ, ఉపాధ్యాయులనుండీ, తోబుట్టువులనుండీ, బహుశ తలిదండ్రులనుండి కూడా ఎంతో విమర్శను ఎదుర్కొని ఉండవచ్చు. ఇప్పుడాయన వాస్తవిక లక్ష్యాలను పెట్టుకుని, తనను గురించి తాను కఠినంగా కాక, ఉచితమైన విధంగా అంచనా వేసుకోవల్సిన అవసరం ఉంది.
ADHDవున్న పెద్దలు కూడా పైనున్న చికిత్సా పద్ధతులను పాటించవచ్చు. “వయస్సు ఆధారంగా మార్పులు అవసరం, కానీ చికిత్సకు మూలాధారాలు—యుక్తమైనప్పుడు మందులు వాడడం, ప్రవర్తనా పరివర్తన, జ్ఞానాన్ని అందిస్తూ [శిక్షణనివ్వడం] వంటివి—పూర్తి జీవిత చక్రమంతటిలో సుస్థాపితమైన పద్ధతులుగా ఉండిపోతాయి” అని డా. గోల్డ్‌బర్గ్ వ్రాస్తున్నాడు.
మద్దతును అందించడం
ADHDవున్న కౌమారదశలోని ఒక వ్యక్తి తండ్రి అయిన జాన్, అటువంటి పరిస్థితిలో ఉన్న తలిదండ్రులతో ఇలా అంటున్నాడు: “ఈ సమస్యను గురించి మీకు సాధ్యమైనంత నేర్చుకోండి. జ్ఞానయుక్తమైన నిర్ణయాలు చేయండి. అన్నింటికీపైగా, మీ పిల్లవాడిని ప్రేమించండి, ఆయన ఆత్మగౌరవాన్ని వృద్ధిచేయండి. ఆత్మాభిమానం కొరవడడం ఆయన స్ఫూర్తిని నాశనం చేస్తుంది.”
ADHDవున్న పిల్లవానికి తగినంత మద్దతును ఇవ్వడానికి తలిదండ్రులు ఇద్దరూ సహకరించుకోవాలి. ADHDవున్న పిల్లవాడు “ఇంట్లో తాను ప్రేమించబడుతున్నాడనీ, ఆ ప్రేమ తన తలిదండ్రుల మధ్యనున్న ప్రేమనుండి ఉద్భవిస్తోందనీ” తెల్సుకోవాల్సిన అవసరం ఉంది అని డా. గోర్డన్ సెర్‌ఫోన్‌టైన్ వ్రాస్తున్నాడు. (ఇటాలిక్కులు మావి.) దుఃఖకరంగా, అటువంటి ప్రేమ అన్నివేళలా ప్రదర్శించబడడం లేదు. డా. సెర్‌ఫోన్‌టైన్ ఇలా కొనసాగిస్తున్నాడు: “[ADHDవున్న పిల్లవాడు] ఉన్న కుటుంబంలో మామూలు కుటుంబంలో కన్నా దాదాపు మూడువంతులు ఎక్కువగా వైవాహిక వైషమ్యాలూ, విచ్ఛిన్నాలూ ఉన్నాయన్నది సుస్థాపితమైన విషయం.” అటువంటి వైషమ్యాలను నివారించడానికి, ADHDవున్న పిల్లవాడిని పెంచడంలో తండ్రి ప్రాముఖ్యమైన పాత్రను పోషించాలి. ఆ బాధ్యత కేవలం తల్లిపై మాత్రమే మోపకూడదు.—ఎఫెసీయులు 6:4; 1 పేతురు 3:7.
కుటుంబ సభ్యులు కాకపోయినప్పటికీ సన్నిహిత మిత్రులు గొప్ప మద్దతును అందించగలరు. ఎలా? “దయాపూర్వకంగా ఉండండి” అంటున్నాడు ఇంతకు ముందు పేర్కొనబడిన జాన్. “మీ కళ్లు చూడగలదానికన్నా లోతుగా చూడండి. పిల్లవాడిని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. తలిదండ్రులతో కూడా మాట్లాడండి. వారెలా కొనసాగగల్గుతున్నారు? వారు ప్రతిదినం సమస్యల్ని ఎలా ఎదుర్కొంటున్నారు?”—సామెతలు 17:17.
క్రైస్తవ సంఘంలోని సభ్యులు ఇటు ADHDవున్న పిల్లవానికీ, అటు తలిదండ్రులకూ ఇద్దరికీ మద్దతుగా ఉండడానికి ఎంతో చేయవచ్చు. ఎలా? తాము అపేక్షించేదాని విషయమై సహేతుకంగా ఉండడం ద్వారా. (ఫిలిప్పీయులు 4:5) కొన్నిసార్లు, ADHDవున్న పిల్లవాడు భంగం కల్గించేవానిగా ఉండవచ్చు. వివేచనాయుక్తమైన తోటి విశ్వాసి, “మీరు మీ పిల్లవాడిని అదుపులో ఎందుకు పెట్టరు?” అనీ, లేక “వాడిని కాస్త క్రమశిక్షణలో ఎందుకు పెట్టరు?” అనీ నిర్దయగా వ్యాఖ్యానించడానికి బదులుగా, ADHDవున్న పిల్లవాడిని పెంచడంలో ఆ తలిదండ్రులు ప్రతిదినం ఎదుర్కోవలసివచ్చే కష్టతరమైన పనులతో ముంచెత్తబడుతున్నట్లు భావిస్తుండవచ్చని గ్రహిస్తాడు. నిజమే, పిల్లవాని భంగకరమైన ప్రవర్తనను పరిమితం చేయడానికి తలిదండ్రులు చేయగల్గినంతా చేయాలి. అయినప్పటికీ, చిరాకుతో కొరడా దెబ్బల్లాంటి మాటలు అనడానికి బదులుగా విశ్వాసగృహానికి చెందినవారు “యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి,” ‘దీవెనను’ ఇవ్వడానికి ప్రయత్నించాలి. (1 పేతురు 3:8, 9) నిజానికి, వాత్సల్యపూరితమైన తోటి విశ్వాసుల ద్వారా తరచూ దేవుడు ‘దీనులను ఆదరిస్తాడు.’—2 కొరింథీయులు 7:5-7.
నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలూ, ADHD వంటివాటితోపాటు మానవ అపరిపూర్ణత అంతా కూడా మొదటి మానవుడైన ఆదామునుండి వారసత్వంగా వచ్చిందని బైబిలు విద్యార్థులు గ్రహిస్తారు. (రోమీయులు 5:12) పీడించే రుగ్మతలు ఇక ఎంతమాత్రం ఉనికిలో ఉండని నీతియుక్త నూతన లోకాన్ని తాను తీసుకువస్తాడనే తన వాగ్దానాన్ని సృష్టికర్త అయిన యెహోవా నెరవేరుస్తాడని కూడా వారికి తెలుసు. (యెషయా 33:24; ప్రకటన 21:1-4) ADHDవంటి రుగ్మతలతో పీడించబడుతున్న వారికి ఈ హామీ నమ్మదగినది. “మా కుమారుడు తన రుగ్మతను అర్థం చేసుకోవడానికీ, దానితో సరైన విధంగా వ్యవహరించడానికీ వయస్సు, శిక్షణ, అనుభవం సహాయం చేస్తున్నాయి” అంటున్నాడు జాన్. “కానీ ఈ లోక విధానంలో అతను ఎప్పటికీ పూర్తిగా స్వస్థత పొందలేడు. మాకు ప్రతిరోజూ ఆదరణపూర్వకంగా ఉండే విషయం ఏమంటే నూతన లోకంలో యెహోవా మా కుమారుని రుగ్మతను సరిచేసి, జీవితాన్ని సంపూర్తిగా ఆనందించడం అతనికి సాధ్యమయ్యేలా చేస్తాడు.”
[అధస్సూచీలు]
a తేజరిల్లు! ఏ ప్రత్యేమైన చికిత్సా పద్ధతినీ సిఫార్సు చేయదు. తాము పొందే ఏ చికిత్స అయినా బైబిలు నియమాలకు విరుద్ధంగా ఉండకుండా క్రైస్తవులు జాగ్రత్త వహించాలి.
b మందులు తీసుకోవడంనుండి కొంతమంది అవాంఛనీయమైన సైడ్ ఎఫెక్టులను అనుభవిస్తారు, వీటిలో కలతపడడమూ, మరితర భావోద్రేక సమస్యలూ ఇమిడివున్నాయి. అంతేగాక, ప్రేరేపక మందులు తీసుకోవడం టోరట్ సిండ్రోమ్ వంటి ఈడ్పు రుగ్మతలుగల రోగుల్లో ఆకస్మిక కుదుపులను ఎక్కువ చేయగలదు. అందువలన మందులు తీసుకోవడం ఒక డాక్టరు పర్యవేక్షణలో జరగాలి.
[8వ పేజీలోని బాక్సు]
తలిదండ్రులకు ఒక హెచ్చరిక
దాదాపు పిల్లలు అందరూ అప్పుడప్పుడు అవధానాన్ని చూపలేకపోవడం, అనాలోచితంగా ఉండడం, అతి చురుకుగా ఉండడం వంటివి చేస్తారు. ఈ లక్షణాలు ఉండడం ADHD ఉందని అన్నిసార్లూ సూచించవు. మరీ ఆలస్యం కాకముందే (ఆంగ్లం) అనే తన పుస్తకంలో డా. స్టాంటన్ ఈ. సామ్‌నో ఇలా వ్రాస్తున్నాడు: “ఒక పనిచేయడం ఇష్టంలేని పిల్లవాడిని క్షమిస్తారు, ఎందుకంటే ఒక వైకల్యతతో లేక పరిస్థితితో ఆ పిల్లవాడు బాధపడుతున్నాడని అందులో అతని పొరపాటు ఏమీ లేదని వారు అనుకుంటారు. ఇటువంటి అసంఖ్యాకమైన కేసుల్ని నేను చూశాను.”
డా. రిచర్డ్ బ్రామ్‌ఫీల్డ్ కూడా జాగ్రత్తతో ఉండాల్సిన అవసరతను చూస్తున్నాడు. “కచ్చితంగా, ADHDవున్నట్లు వ్యాధినిర్ధారణ జరిగిన కొంతమందికి నాడీమండల సంబంధమైన లోపం ఉంది, వారికి మందులు అవసరం” అని ఆయన వ్రాస్తున్నాడు. “కానీ అన్నిరకాల దురాచారాలకీ, వేషధారణలకీ, నిర్లక్ష్యాలకీ, మరితర సామాజిక సమస్యలకీ ఈ రుగ్మతే దోషియని నిందించబడుతుంది, అనేక సందర్భాలలో వీటికి ADHDతో ఏమాత్రం సంబంధం లేదు. నిజానికి, ఆధునిక జీవనంలో విలువలు లేకపోవడం—విచక్షణారహితమైన హింస, మాదకద్రవ్యాల దుర్వినియోగం, వీటంత ఘోరం కానివైన క్రమశిక్షణారాహిత్యంగా, అల్లకల్లోలంగా ఉండే ఇళ్లు—ADHD వలన వచ్చే అవిశ్రాంతతలాంటి అవిశ్రాంతతను ఎక్కువచేయడానికి ఎటువంటి నాడీమండల సంబంధ లోపాలకన్నా మరింత ఎక్కువగా దోహదం చేస్తాయి.”
అందువలన డా. రానల్డ్ గోల్డ్‌బర్గ్ సరైన కారణంతోనే ADHDని “విశ్వాన్ని ఇముడ్చుకునేంతటి భావన”గా ఉపయోగించడానికి వ్యతిరేకంగా హెచ్చరిస్తున్నాడు. “సరైన ముగింపుకు చేరుకునేందుకు రోగనిర్ధారణ సరిగ్గా జరిగేలా చూసుకోమని” ఆయన సలహా ఇస్తున్నాడు. ADHDని పోలివున్న లక్షణాలు అనేకమైన భౌతిక, లేక భావోద్రేక సమస్యల్లో ఏదో ఒకదానిని సూచిస్తుండవచ్చు. అందువల్ల కచ్చితమైన రోగనిర్ధారణ చేయడానికి అనుభవజ్ఞుడైన ఒక డాక్టరు సహాయం ప్రాముఖ్యం.
రోగనిర్ధారణ జరిగినప్పటికీ, మందుల విషయంలో తలిదండ్రులు లాభనష్టాలను బేరీజు వేసుకోవడం మంచిది. రిటాలిన్ అవాంఛనీయమైన లక్షణాలను నివారించగలదు, కానీ అది నిద్రలేమి, పెరిగే చింత, ఉద్రిక్తత వంటి అప్రీతికరమైన సైడ్ ఎఫెక్టులను కూడా కలుగజేయగలదు. అందువలన, డా. రిచర్డ్ బ్రామ్‌ఫీల్డ్ పిల్లవాడికి వాడి లక్షణాలను నివారించడానికి మాత్రమే మందులు ఇవ్వడానికి త్వరపడకూడదని హెచ్చరిస్తున్నాడు. “చాలామంది పిల్లలకీ, చాలా చాలా మంది పెద్దలకీ రిటాలిన్‌ను అయుక్తంగా ఇస్తున్నారు” అంటున్నాడాయన, “నా అనుభవంలో, రిటాలిన్ ఉపయోగం అనేది ఎక్కువగా పిల్లవాడి ప్రవర్తనను సహించేందుకు తలిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉన్న సామర్థ్యంపైన ఆధారపడివున్నట్లు కనబడుతుంది. వారి అవసరాలను తీర్చడానికి కాక వారిని శాంతపర్చడానికి ఆ మందు ఇవ్వబడిన కొంతమంది పిల్లలు నాకు తెలుసు.”
అందువలన తలిదండ్రులు తమ పిల్లలకు ADHD ఉన్నదనీ, లేక నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్నదనీ నిర్ధారించడంలో త్వరపడకూడదు. బదులుగా, ఒక నిపుణతగల ప్రొఫెషనల్ సహాయంతో వారు సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక పిల్లవాడికి నేర్చుకోవడానికి సంబంధించిన ఒక అశక్తత ఉన్నట్లు లేక ADHDవున్నట్లు నిర్ధారించబడితే, తలిదండ్రులు ఈ సమస్యను గురించి సమాచారాన్ని పొందడానికి సమయం తీసుకోవాలి, ఆ విధంగా వారు తమ పిల్లల సంక్షేమం నిమిత్తం చర్యతీసుకోగలరు.
[9వ పేజీలోని చిత్రం]
ADHDవున్న పిల్లవానికి దయాపూర్వకమైనదే అయినప్పటికీ కచ్చితమైన క్రమశిక్షణ అవసరం
[10వ పేజీలోని చిత్రం]
తలిదండ్రుల ప్రశంస ఎంతో మేలును చేకూర్చగలదు