ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్
తాను దత్తతు తీసుకోబడ్డాడని తెలుసుకున్నప్పుడు డేనా ఫాల్జ్ ఎనిమిది సంవత్సరాలవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఆయన ‘నా తల్లి ఎవరు? ఆమె ఎలా ఉంటుంది? ఆమె నన్ను దత్తతుకు ఎందుకు ఇచ్చివేసింది? నాకు అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెండ్రు ఉన్నారా?’ అని ఆలోచించడం మొదలుబెట్టాడు. తర్వాత ఆయన చివరికి తన కన్నతల్లిని ఎలా కనుగొన్నాడు, దాని తర్వాత ఎదురైన ఒక నాటకీయమైన సర్‌ప్రైజ్ ఏమిటీ అన్నదానిగురించి డేనా వృత్తాంతాన్ని చదవండి.
నేను అమెరికానందలి అలాస్కాలోని కెచికాన్‌లో 1966, ఆగస్టు 1న పుట్టాను. మా అక్క పామ్ నాకన్నా రెండు సంవత్సరాలు పెద్దది. మా నాన్న బ్యూరో ఆఫ్ ఇండియన్ అఫైర్స్‌లో ఒక సంఘ సేవకుడు, ఆయనకు తరచూ బదిలీ అయ్యేది. మేము అలాస్కాలో ఒక చోటినుండి మరో చోటికి మారుతుండేవాళ్లం. తర్వాత, మేము అయోవా, ఓక్లహామా, అరిజోనా, ఓరెగాన్ రాష్ట్రాలలో నివసించాము.
1975 వేసవిలో మేము విస్‌కాన్సిన్‌లోని మా బంధువులను సందర్శిస్తుండగా, మా చిన్నాన్న పిల్లలు కొందరు మరో చిన్నాన్న పిల్లవాడిని గురించి కొన్ని నిర్దయతోకూడిన మాటలు అన్నారు. “ఆ అబ్బాయిని దత్తతు తీసుకున్నారు, అందుకని ఆయన నిజంగా ఫాల్జ్ కుటుంబానికి చెందినవాడు కాదు” అని వారన్నారు. మేము ఇంటికి తిరిగివచ్చిన తర్వాత, నేను దీని గురించి మా అమ్మను అడిగాను, ఆమె ముఖంపై విభ్రాంతితో కూడిన వ్యక్తీకరణను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె దత్తతు అంటే ఏమిటో వివరించింది. ఆ రాత్రి ఆమె కళ్లవెంట నీరు కారుతుండగా, నేనూ అక్క ఇద్దరమూ దత్తతు తీసుకోబడ్డామని ఆమె నాకు చెప్పింది.
అప్పట్లో దత్తతు అనేది నాకంత ప్రాముఖ్యమైన విషయం కాదు, తర్వాత కొంతకాలం వరకు నేను దాన్నిగూర్చి ఎక్కువగా ఆలోచించలేదు. నాకు అమ్మానాన్నలున్నారు, జీవితం ఎలా ఉండాలో అలాగే ఉందని అనుకున్నాను. నా తల్లిదండ్రులు స్థలాలు మారుతూ ఉండకుండా ఒక్కచోట స్థిరపడాలని నిశ్చయించుకున్నారు. నాకు తొమ్మిది సంవత్సరాలున్నప్పుడు మేము వాషింగ్టన్‌లోని వాంకోవర్‌లో స్థిరపడ్డాము. నేనూ, నాన్నా చాలా సన్నిహితంగా ఉండేవారం, అమ్మతో అంత సన్నిహితంగా ఉండేవాన్నికాను. నేను కొన్నిసార్లు స్వతంత్రంగానూ, ఎదురుతిరిగేవానిగానూ ఉండేవాడిని, మా ఇద్దరి మధ్య అగాధం ఎక్కువౌతున్నట్లు ఎందుకు అనిపిస్తోందన్న విషయం నా ప్రవర్తనవల్ల మా అమ్మకు కలిగే మానసిక వ్యథనుబట్టి అర్థమౌతుంది.
రోమాన్స్, కాలేజీ
నేను హైస్కూల్లో ఉన్నప్పుడు ట్రీనాని కలిశాను. మేము వెంటనే స్నేహితులమైపోయాము. గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఓరెగాన్‌లోని కార్‌వాలిస్‌లోవున్న ఓరెగాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో అకాడమిక్ స్కాలర్‌షిప్‌ని స్వీకరించాను. ట్రీనాతో సమయం గడపడానికి నేను నా ఖాళీ సమయాన్ని వాంకోవర్‌కు వెళ్లి, తిరిగి వెనక్కి రావడానికి ఉపయోగించాను, ఆమె హైస్కూలులో ఇంకా ఒక సంవత్సరం చదవాల్సివుంది. నేను ఎక్కువగా చదివేవాడిని కాదు, అయినా నేను కాలేజీలో నెగ్గుకురాగలనని అనుకున్నాను. నా మొట్టమొదటి రిపోర్టు కార్డు నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది, అది నాకు వచ్చిన వాటిలో అత్యంత ఘోరమైనది! నేను చాలా సిగ్గుపడ్డాను. కానీ నేను ట్రీనాని కలవడం ఆపలేదు; నేను అక్కడికి వెళ్లినప్పుడు చదువుకోవచ్చని నాతోపాటు నా పుస్తకాలు మాత్రం తీసుకెళ్లాను.
అప్పుడు, ఒకరోజు నేను నా మోటార్‌సైకిల్‌మీద వాంకోవర్‌నుండి స్కూలుకు తిరిగి వస్తున్నప్పుడు నాకు ఘోరమైన దుర్ఘటన సంభవించింది. దానితర్వాత కొంతకాలానికే, నేను క్రాస్‌వాక్‌మీదుగా వీధిని దాటుతుండగా ఒక కారు వచ్చి గుద్దడం మూలాన అంతకంటే తీవ్రంగా గాయపడ్డాను. నేను పనిచేయడం మొదలుపెట్టాను, ఇక కాలేజీకి తిరిగివెళ్లాలనే కోరిక అడుగంటిపోయింది.
మతంలో ఆసక్తి
కొంతకాలానికి నేనూ, ట్రీనా కలిసి జీవించడం మొదలుపెట్టాము. మాకు దేవునిలో నమ్మకముంది, ఆయనను తెలుసుకోవాలని ఉండేది. అయితే, చర్చీలు వేషధారణతో కూడినవని మేము భావించాము. అందుకని మేము బైబిలును మాకైమేమే చదవడానికి ప్రయత్నించాము, కానీ మాకు తలా తోకా అర్థం కాలేదు.
ఒకరోజు, నేను ఓరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో పని చేస్తున్నప్పుడు, నా తోటి పనివాళ్లు ఒక వ్యక్తిని ఏడిపించడం మొదలుపెట్టారు, నేను కలిసిన చక్కని ప్రజల్లో ఈయన ఒకడని నేను పరిగణించేవాడిని. రాండీ ఈ వేధింపుని ప్రశాంతంగా భరించేవాడు. ఆ రోజు కొంతసేపయ్యాక నేను ఆయన్ని అడిగాను: “మీరు పరిచారకులని నేను వింటున్నాను. అంటే ఏమిటి?”
“అది నిజమే, నేను పరిచారకుడినే” అన్నాడాయన.
“ఏ మతసంస్థలో?” నేనడిగాను.
“నేను ఒక యెహోవాసాక్షిని.”
“యెహోవాసాక్షులెవరు?”
“మీకు నిజంగా తెలియదా?” సంభ్రమంతో అడిగాడాయన.
“అవును” నేనన్నాను. “యెహోవాసాక్షులు ఎవరు? నేను తెలుసుకోవల్సినవారా?”
“అవును” అన్నాడాయన చిరునవ్వు నవ్వుతూ, “మీరు తెలుసుకోవాలి. మీరు మధ్యాహ్నం ఏమి చేస్తున్నారు?”
మధ్యాహ్న సమయాల్లో జరిపిన ఎన్నో బైబిలు చర్చల్లో అది మొదటిది. నేనొకరోజు రాత్రి ట్రీనాకు వాటి గురించి చెప్పాను. “యెహోవాసాక్షులతో మాట్లాడకు!” ఆమె వెంటనే అంది. “వాళ్లు చాలా చిత్రమైనవాళ్లు! వాళ్లు క్రైస్తవులే కారు. వాళ్లు క్రిస్టమస్ కూడా జరుపుకోరు.” ఆమె యెహోవాసాక్షుల గురించి తాను విన్నదంతా చెప్పడం మొదలుబెట్టింది.
“ఎవరో నీకు ఏమాత్రం నిజం కాని విషయాలెన్నింటినో చెప్పారు” నేనన్నాను. చాలాసేపు సంభాషించిన తర్వాత, తాను విషయమంతా వినలేదని నేను ఒప్పించగల్గాను. దాని తర్వాత, నేను రాండీని ప్రశ్నలు అడిగేలా ఆమె చేసేది, నేను ఒకదాని తర్వాత మరొక స్పష్టమైన లేఖనాధార సమాధానాలను తెచ్చేవాడిని. చివరికి, ట్రీనా ఇలా అంది: “ఇదంతా బైబిలులో ఉందని నాకసలు తెలియనే తెలియదు, కానీ నేనిప్పటికీ వారు చాలా చిత్రమైనవారని అనుకుంటున్నాను. నీవు ఆయనతో బైబిలు గురించి మాట్లాడుతూ ఉండాలనుకుంటే నాకనవసరం; కానీ ఇంటికొచ్చి దాన్నంతా నామీద రుద్దాలని ప్రయత్నించకు.”
విషాదభరితమైన కాలం
నేను బైబిలునుండి నేర్చుకుంటున్నదాన్లో నేను నమ్మకముంచాను, కానీ నేను దానికి తగ్గట్టుగా జీవించడం లేదని భావించాను. ట్రీనా, నేనూ మరీ ఎక్కువగా పోట్లాడుకుంటున్నట్లు అనిపించింది. అందుకని మా గర్ల్‌ఫ్రెండ్స్‌ని వదిలిపెట్టి, ఓక్లహామాలో ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలని నేనూ, ఒక స్నేహితుడూ, కలిసి నిర్ణయించుకున్నాము. నేను పనినుండి గైరు హాజరు సెలవు కొరకు ఏర్పాటు చేసుకున్నాను. కొంచెం సమయంలోనే, నేనూ, నా స్నేహితుడూ కలిసి టెక్సస్ సరిహద్దు దగ్గర ఒక చిన్న పట్టణంలో ఒక అపార్ట్‌మెంటులో స్థిరపడ్డాము. ట్రీనా సహవాసంలోని ఆనందాన్ని నేను ఎంతగా కోల్పోతున్నానో గ్రహించడానికి ఎంతో కాలం పట్టలేదు, కానీ నాకై నేను జీవితాన్ని అనుభవించాలని నిర్ణయించుకున్నాను.
టెక్సస్‌లో మద్యపానీయాలు తాగడానికి చట్టబద్ధమైన వయస్సు 19 అని తెలుసుకున్నాను, నా స్నేహితుడు అలా తిరిగిరావడానికి వెళ్లినప్పుడు, నేను ఒక రాత్రి సమయంలో సరిహద్దు దాటి ప్రసిద్ధ రాకెన్‌రోల్ బార్‌కి వెళ్లాను. నేను బాగా తాగేశాను, బార్ విడిచి వస్తుండగా, నేను నా కారును తీసుకెళ్లి ఒక బిల్డింగు మూలకి గుద్దేశాను. నన్ను తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆ తర్వాత, నేను మా నాన్నని కాంటాక్ట్ చేయగల్గాను, ఆయన బెయిలిచ్చి నన్ను విడిపించాడు. ట్రీనా నన్ను తిరిగి స్వీకరించింది, అందుకు నేను కృతజ్ఞుడను! నేను నా పాత ఉద్యోగానికి తిరిగి వెళ్లి, రాండీతో నా బైబిలు చర్చలను తిరిగి ప్రారంభించాను.
నా జీవితాన్ని అదుపులోకి తెచ్చుకోవడం
నేను యెహోవాసాక్షుల గురించి విన్నది మొదలు ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలైంది, నేను నా బైబిలు పఠనంలో ఇంకా ఎక్కువగా నిమగ్నమవ్వాలని నిర్ణయించుకున్నాను. నాకిప్పుడు 20 సంవత్సరాలు, ఈ శీర్షిక ఆరంభంలో నేను నా దత్తతు గురించి పేర్కొన్న ప్రశ్నలు నన్ను తొలవడం మొదలుపెట్టాయి. అందుకని నేను నా కన్నతల్లి కోసం తీవ్రంగా గాలించడం ప్రారంభించాను.
నేను పుట్టిన అలాస్కాలోని ఆసుపత్రికి ఫోను చేసి, ముందుకి ఎలా వెళ్లాలో అడిగాను. ఏం చెయ్యాలో తెలుసుకున్న తర్వాత, నేను నా అసలు పుట్టుక తేదీ ధృవపత్రం కాపీని సంపాదించాను, దాని ద్వారా నా తల్లి పేరు సాండ్రా లీ హెర్ష్ అని తెలుసుకున్నాను; కానీ మా నాన్నని గురించిన రికార్డు ఏమీ లేదు. నేను పుట్టినప్పుడు సాండ్రాకు కేవలం 19 సంవత్సరాలే, దాన్నిబట్టి ఆమె పెళ్లి కాకుండానే గర్భవతియైన భయస్థురాలైన ఒక ఒంటరి అమ్మాయి అయివుండవచ్చనీ, ఆమె చాలా కష్టతరమైన నిర్ణయాన్ని తీసుకోవల్సి వచ్చిందనీ తలంచాను. నా కన్న తల్లిని కనుగొనడానికి సరిపడినంత సమాచారం నా పుట్టుక తేదీ ధృవపత్రంపై లేదు.
ఈలోగా, నేను రాండీతో బైబిలు పఠనం చేయడం ఫలితంగా, నేను సత్య మతాన్ని కనుగొన్నానని ఒప్పించబడ్డాను. కానీ శరీరాన్ని కల్మషపర్చే పొగత్రాగే అలవాటును విసర్జించకుండా ఉండడంలో నేను మళ్లీ మళ్లీ విఫలుడనయ్యాను. (2 కొరింథీయులు 7:1) యెహోవాకు నాలో నమ్మకం లేదని భావించాను. అప్పుడు, రాజ్యమందిరం దగ్గర ఒక సాక్షి చెప్పింది నాకు నిజంగా సహాయపడింది. మనం విఫలులం కావాలని సాతాను కోరుకుంటాడనీ, కృషి చేయకుండా వెనుదిరగడంద్వారా ఎవరైనా నిత్యజీవానికైన పోటీలో విఫలులు కావడాన్ని చూడడం చాలా విషాదకరమనీ ఆయన అన్నాడు. “మనం మన భారాల్ని యెహోవాపై మోపాల్సిన అవసరం ఉంది, అలా చేసి, కష్టకాలాల్లో మనకు సహాయం చేస్తాడని ఆయనపైన పూర్తిగా ఆధారపడాలి” అని ఆయన అన్నాడు.—కీర్తన 55:22.
నేను వినాలని అనుకున్నది సరిగ్గా అదే! నేను ఆయన చెప్పింది అన్వయించడం మొదలుపెట్టి, సహాయార్థం తరచూ యెహోవాకు ప్రార్థించాను. త్వరలోనే, నేను పొగత్రాగడం మానేశాను, ట్రీనా, నేనూ పెళ్లి చేసుకున్నాము, మరి నేను నా బైబిలు పఠనాల్లో క్రమంగా భాగం వహించడం మొదలుపెట్టాను. త్వరలోనే, ట్రీనా కూడా పఠించడం మొదలుపెట్టింది. 1991, జూన్ 9న నేను నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యెహోవాకు నేను చేసుకున్న సమర్పణను సూచించాను. తర్వాత రెండు వారాలకు మా మొదటి కుమార్తె బ్రీయన్నా జీన్ పుట్టింది.
నాన్నతో నా సంబంధం
నేనూ, మా నాన్న సన్నిహితంగా ఉండేవారం. ఆయన చాలా దయాపూర్వకమైన వ్యక్తి, నేను బాధతో ఉన్నప్పుడల్లా ప్రోత్సాహాన్నిచ్చేవాడు. అయితే, నాకు క్రమశిక్షణ అవసరమైనప్పుడు ఆయన కఠినంగా ఉండేవాడు. అందుకని, 1991 తొలి భాగంలో నాన్నకు ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. అప్పటికే మా అమ్మా నాన్నలు మోంటాన్నాలోని హామిల్టన్‌కు మారారు. మేము తరచూ ఆయనను చూడడానికీ, అమ్మకు భావోద్రేకపరమైన మద్దతునివ్వడానికీ అక్కడికి వెళ్లేవారము.
మేము మా నాన్నకు జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? అనే పుస్తకాన్ని ఇవ్వగల్గాము. తాను దాన్ని చదువుతాడని ఆయన వాగ్దానం చేశాడు, తాను తన కుటుంబ సంక్షేమం నిమిత్తం చింతిస్తున్నాడని నాతో చెప్పాడు. నేను చివరిసారిగా సందర్శించినప్పుడు, ఆయన నన్ను తన కుమారునిగా కల్గివున్నందుకు ఎంతో గర్విస్తున్నాడనీ, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడనీ చెప్పాడు. దాంతో కన్నీళ్లు పైకి ఉబికి వస్తుండగా, ఆయన తన ముఖాన్ని కిటికీవైపుకు తిప్పుకున్నాడు. నేను విడిచి వచ్చే ముందు ఎన్నోసార్లు మేము ఒకరినొకరం హత్తుకున్నాము. నాన్న 1991, డిశంబరు 21న చనిపోవడానికి ముందు ఆ పుస్తకంలో దాదాపు మూడవ వంతు చదివాడు.
నాన్న మరణించిన తర్వాత, మేము వాషింగ్టన్‌లోని మోజెస్ లేక్‌కి మారిన తర్వాతా నా గతం గురించి నేర్చుకోవాలనే నా కోరిక మరింత ప్రగాఢమయ్యింది. కానీ నేను గాలించడానికి సమయాన్ని వెచ్చించినా మేము ఆత్మీయ ఆసక్తులను నిర్లక్ష్యం చేయలేదు. ట్రీనా 1993, జూన్ 5న బాప్తిస్మం పొందింది, ఆరు నెలల తర్వాత మా రెండవ కుమార్తె సీయెరా లిన్‌కు జన్మనిచ్చింది.
నేను నా కన్నతల్లిని కనుగొన్న విధానం
నేను సమాచారం కోసం అలాస్కా చట్ట వ్యవస్థని పదే పదే అడిగాను, వివిధ ఏజెన్సీలకు ఒకదాని తర్వాత మరో ఉత్తరం వ్రాశాను, వీటన్నింటితోపాటుగా నేను నా స్వంత కంప్యూటర్ ద్వారా స్వయంగా గాలించడం మొదలుపెట్టాను. ఇదంతా ఏమాత్రం విజయవంతం కాలేదు. అప్పుడు, 1995 చివర్లో నేను వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు గుండె క్రమంగా కొట్టుకోవడంలేదని తెలిసింది. నాకు కేవలం 29 సంవత్సరాలే, మా డాక్టరు నా వైద్యపర పూర్వరంగాన్ని గురించి తాను తెలుసుకోవాలని కోరాడు.
నా ఆరోగ్యానికి నా దత్తతు ఫైళ్లు ఎంతో అవసరమని నొక్కిచెబుతూ వైద్యుడు సమగ్రమైన, కచ్చితమైన రిక్వెస్టును వ్రాశాడు. సకాలంలో మాకు ప్రత్యుత్తురం వచ్చింది. దానిలో నా వైద్య సమస్య ఫైళ్లను తెరవాల్సినంత గంభీరమైనది కాదని తాను భావిస్తున్నాడని చెప్పిన ఒక జడ్జి నిర్ణయం ఉంది. నేను కుప్పకూలిపోయాను. కానీ కొన్ని వారాల తర్వాత, రెండో జడ్జినుండి ఒక ఉత్తరం వచ్చింది. నా దత్తతు ఫైళ్లను పొందడానికి నాకు అనుమతినిస్తూ ఒక కోర్టు ఉత్తర్వును జారీచేసింది!
నా అసలు దత్తతు ఫైళ్లు 1996 జనవరి ప్రారంభంలో వచ్చాయి. అవి నా కన్నతల్లి స్వంత పట్టణం పేరును, కుటుంబ సంగతులను తెలిపాయి. వెంటనే, నేను సాండ్రా పేరును ఆమె స్వంత పట్టణం పేరుతో కలిపి కంప్యూటర్ ద్వారా గాలించాను, చివరికి ఆరు టెలిఫోన్ నంబర్లు దొరికాయి. ట్రీనాయే ఫోన్ కాల్స్ చేయడం మంచిదని ట్రీనా నేనూ కలిసి నిర్ణయించాము. మూడవ కాల్‌లో ఒక స్త్రీ సాండ్రా తన సోదరుని కుమార్తెయని చెప్పి, ట్రీనాకి సాండ్రా ఫోను నంబరును ఇచ్చింది.
ఫోన్ కాల్, సర్‌ప్రైజ్
ట్రీనా ఆ నెంబరుకు ఫోన్ చేసినప్పుడు అవతల ఉన్న స్త్రీ తనెవరో చెప్పేందుకు నిరాకరించింది. చివరికి ట్రీనా సూటిగా చెప్పింది: “నా భర్త అలాస్కాలోని కెచికాన్‌లో 1966, ఆగస్టు 1న పుట్టాడు, నేను వెదుకుతున్నది మీ కోసమేనేమో తెలుసుకోవాలి.” చాలాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది, తర్వాత, కంపిస్తున్న స్వరంతో ఆ స్త్రీ ట్రీనా పేరును, ఫోన్ నెంబరును అడిగింది, తాను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది. ఆమె వెంటనే ఫోన్ చేయదని అనుకుని, నేను మాకు అవసరమైన కొన్ని వస్తువులను షాపునుండి తీసుకురావడానికి లేచాను.
నేను తిరిగివచ్చినప్పుడు, ట్రీనా అశ్రునయనాలతో ఫోనులో మాట్లాడుతూవుంది. ఆమె ఫోనును నా చేతికిచ్చింది. మా అమ్మా, నేనూ ఒకరికొకరం హల్లో చెప్పుకుని కాస్సేపు సంభాషించుకునేంతలోనే, ట్రీనా వెంటనే చెవిలో, “ఆమె నిజంగా నిన్ను వదులుకోవాలనుకోలేదు” అని మెల్లిగా చెప్పింది. అమ్మ తన గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు నాకెంతో జాలేసింది. “నీవు నాకిచ్చిన జీవం కొరకు నేను కృతజ్ఞుణ్ణి” అన్నాను, “నేను మంచి జీవితాన్ని గడుపుతున్నాను, నాకు కావల్సినవన్నీ నాకున్నాయి. నాకు మంచి నాన్నవుండేవాడు, మంచి అమ్మవుంది, ఎంతో ప్రేమ ఉంది, చక్కని భార్యవుంది, ఇద్దరు అందమైన కూతుళ్లున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.”
తాను ఏడ్వడం మొదలుబెట్టింది. మేము మాట్లాడడం కొనసాగిస్తుండగా, తాను మానభంగానికి గురవ్వడం గురించి, గర్భవతియై దత్తతు ఇచ్చివేయమనే ఒత్తిడికి లోనవ్వడం గురించి చెప్పింది; తర్వాత తాను పెళ్లి చేసుకుందని, కొంతకాలానికి తాను సర్జరీనుండి కోలుకుంటూ ఆసుపత్రిలో ఉండగా తన పాపా, తన తల్లీ అగ్ని ప్రమాదంలో మరణించారని చెప్పింది. తాను తన కుమారున్ని దత్తతుకు ఇచ్చివేసినందుకు దేవుడు శిక్షగా తన ఆత్మీయులను తీసుకుపోయాడని ఆ క్షణంలో తాను భావించిదని చెప్పింది. “లేదు” అంటూ నేను వెంటనే ప్రతిస్పందించాను, “దేవుడు ఆ విధంగా చేయడు!” తనకు ఆ విషయం ఇప్పుడు తెలుసని చెప్పింది, ఎలాగంటే ఆ దుస్సంఘటన తర్వాత తాను “బైబిలు సత్యం కొరకు వెదకడం” మొదలుపెట్టిందనీ, ఇప్పుడు ఒక “బైబిలు విద్యార్థి” అయ్యిందని చెప్పింది.
‘ఇది నిజమైవుండదు’ అని నేను ఆలోచిస్తూ, ఇలా అడిగాను: “నీవు ఎవరితో పఠించావు?” చాలాసేపుటి మౌనం తర్వాత ఆమె అన్నది: “యెహోవాసాక్షులతో.” నేను ఎంతగా కదిలిపోయానంటే నాకు నోటివెంట మాట రాలేదు. కన్నీళ్లు కారుస్తూ, చివరికి, “నేను కూడా యెహోవాసాక్షినే” అని నోరు పెగల్చుకుని చెప్పాను. నేను దాన్ని మరింత స్పష్టంగా మళ్లీ చెప్పినప్పుడు ఆమె ఆనందంతోనూ, ఉత్తేజంతోనూ నిండిపోయింది. అదంతా చాలా అద్భుతంగా ఉన్నది!
తన పాప మరణానికి కొంతకాలం తర్వాత నా కన్నతల్లి 1975లో సాక్షి అయ్యింది. తన భర్త ఆత్మీయంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టినప్పుడు ఆమె ఆయనకు నా గురించి చెప్పింది. ఆయన ఆమెను ఓదార్చి, తామంతా కలిసి నాకోసం వెదుకుతామని చెప్పాడు. కానీ దాని తర్వాత ఎంతోకాలం గడవకముందే, ఆయన ఒక కారు ప్రమాదంలో చనిపోయాడు, ఆమె ముగ్గురు చిన్న పిల్లల్ని ఒంటరిగా పెంచాలి. మేమా తర్వాత ఎన్నో సాయంకాలాలు గంటలకొద్దీ మాట్లాడుకున్నాము. చివరికి, మేము అరిజోనాలోని ఫీనిక్స్‌లో 1996 ఫిబ్రవరిలో కలుసుకుందామని నిర్ణయించుకున్నాము. నా కన్నతల్లి అప్పటికే అక్కడికి వేరే క్రైస్తవ సహోదరితో కలిసి రావాలని అనుకుంది.
చిరస్మరణీయమైన కలయిక
నేనూ, ట్రీనా ఈ ప్రయాణంలో మా పిల్లల్ని ఇంటిదగ్గరే విడిచిపెట్టాము. నేను విమానం దిగి నడుస్తూండగా నా కన్నతల్లిని చూశాను, చివరికి ఆమెను కావులించుకోగల్గాను. మేము ఆలింగనం చేసుకున్నప్పుడు నన్ను అలా పట్టుకోవడానికి తాను 29 సంవత్సరాలు వేచివుందని చెప్పి, నన్ను చాలా సేపు అలాగే పట్టుకునివుండిపోయింది. మా సందర్శనం అద్భుతంగా ఉంది, మేం ఫోటోలను కలిసి చూశాము, ఒకరి కథలను ఒకరికి చెప్పుకున్నాము. అయితే, వీటన్నింటినీ మించినది నా తల్లితో ఫీనిక్స్‌లోని రాజ్యమందిరంలో ఆమె ప్రక్కన కూర్చోవడం! మేము కూటంలోని కార్యక్రమాన్ని కలిసి విని, రాజ్య గీతాలను ఒకరిప్రక్కన ఒకరం నిలబడి పాడాము. అది నేను కలకాలం గుర్తుంచుకునే అద్భుతమైన అనుభూతి.
1996 ఏప్రిల్‌లో తానుండే అయోవానుండి నా చెల్లి లార మమ్మల్ని సందర్శించడానికి వచ్చింది. ఆమెతో కలిసి హృదయానందకరమైన క్రైస్తవ సహవాసాన్ని ఆనందించడం ఎంత అద్భుతంగా ఉందో! క్రొత్తగా నేను పొందిన నా ఇద్దరు సహోదరులతో నేను ఫోనులో మాట్లాడాను కూడా. నా కుటుంబంతో తిరిగి ఐక్యమవ్వడం అనేది ఒక అద్భుతం, కానీ యెహోవా సంస్థలోపలే ప్రేమలో ఐక్యమైవుండడం అనేది మన గొప్ప దేవుడైన యెహోవా మాత్రమే ఇవ్వగల్గే ఒక బహుమానం.—డేనా ఫోల్జ్ చెప్పినది.
[23వ పేజీలోని చిత్రం]
నా కన్నతల్లితో