విత్తనాలు మొలకెత్తి, ఎదగాలంటే నీళ్లు పోయాలి
1. ఎదగాలంటే వేటికి నీళ్లు అవసరం?
1 తోటలో నాటిన విత్తనాలు మొలకెత్తి, వృద్ధి పొందాలంటే వాటికి నీళ్లు పోయాలి. మన ప్రాంతంలోని ప్రజల హృదయాల్లో నాటిన సత్యపు విత్తనాల విషయంలో కూడా అది నిజం. (1 కొరిం. 3:6) ఈ సూచనార్థక విత్తనాలకు వేళ్లు వచ్చి, పెరిగి, వృద్ధి పొందాలని మనం కోరుకుంటే మనం పునర్దర్శనాలు చేస్తూ, దేవుని వాక్యం సహాయంతో వాటికి నీళ్లు పోయాలి.
2. పునర్దర్శనం కోసం ఎలా పునాది వేయవచ్చు?
2 ఒక ప్రశ్న అడగండి: పరిచర్య కోసం సిద్ధపడుతున్నప్పుడు, పునర్దర్శనంలో జవాబు చెప్పగల ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచించండి. మొదటిసారి కలిసినప్పుడే మాటల ముగింపులో ఆ ప్రశ్న వేసి, తిరిగి వెళ్లి దాని గురించి చర్చించేందుకు ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకోండి. బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని ప్రశ్నను అడగడం వల్ల బైబిలు అధ్యయనాన్ని ప్రదర్శించే అవకాశం దొరుకుతుందని చాలామంది తెలుసుకున్నారు.
3. ఆసక్తి చూపించిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వివరాలు రాసిపెట్టుకోవాలి?
3 వివరాలు రాసిపెట్టుకోండి: మొదటిసారి మాట్లాడడం పూర్తయిన వెంటనే వీలైనంత త్వరగా దానికి సంబంధించిన వివరాలు రాసుకోండి. ఆ వ్యక్తి పేరు, చిరునామా రాయండి. ఏ తేదీన, ఎన్నింటికి ఆయనతో మాట్లాడారో, దేని గురించి మాట్లాడారో, ఏ ప్రచురణ ఇచ్చారో వంటి వివరాలు రాసిపెట్టుకుంటే మంచిది. తనది ఫలానా మతం అని ఆయన చెప్పాడా? ఆయనకు కుటుంబం ఉందా? ఆయన తన ఇష్టాల గురించి, చింతల గురించి ఏమైనా చెప్పాడా? అలాంటి వివరాలు రాసుకోవడం వల్ల మళ్లీ కలిసినప్పుడు ఆయనకు తగినట్లు మాట్లాడగలుగుతాం. మీరు మళ్లీ ఎప్పుడు కలుస్తారని చెప్పారో, ఏ ప్రశ్నకు జవాబిస్తారని చెప్పారో కూడా రాసిపెట్టుకోండి.
4. ఆసక్తి చూపించిన వాళ్లను మళ్లీ కలుసుకోవడానికి మనం ఎందుకు పట్టుదలగా ప్రయత్నించాలి?
4 పట్టుదలగా ఉండండి: ఒక వ్యక్తి హృదయంలో విత్తిన ‘వాక్యమును ఎత్తికొనిపోవాలని’ సాతాను అలుపు లేకుండా ప్రయత్నిస్తుంటాడు. (మార్కు 4:14, 15) కాబట్టి మీరు వెళ్తున్నప్పుడు ఆసక్తి చూపించిన వ్యక్తి ఇంటి దగ్గర లేకపోతున్నప్పటికీ పట్టుదలగా ప్రయత్నిస్తూనే ఉండండి. వీలైతే వాళ్లకు ఉత్తరం రాయవచ్చు లేదా చిన్న కాగితంపై రాసి తలుపు దగ్గర పెట్టవచ్చు. ఒక పయినీరు ఒక స్త్రీతో బైబిలు అధ్యయనం ప్రారంభించింది, కానీ తర్వాత వెళ్లినప్పుడు ఆమె లేకపోవడంతో ఒక ఉత్తరం రాసింది. చివరకు సహోదరి ఆ స్త్రీని ఇంటి దగ్గర కలిసినప్పుడు, తన పట్ల సహోదరి చూపించిన వ్యక్తిగత శ్రద్ధకు తాను ఎంతో చలించిపోయానని చెప్పింది. సత్యపు విత్తనాలకు మనం నీళ్లు పోస్తుండగా, అవి మొలకెత్తి, వృద్ధి చెంది “ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను” ఫలించడం చూసినప్పుడు ఎంతో ఆనందిస్తాం.—మార్కు 4:20.