ప్రపంచ పరిశీలన
మత స్వాతంత్ర్యం ఉన్నతపర్చబడింది
సమరోచిత కళా తర్ఫీదులో పాల్గొనడాన్ని నిరాకరించినందుకు యెహోవాసాక్షి అయిన కునిహిటో కోబయాషిని బహిష్కరించడం ద్వారా కోబ్ పురపాలక పారిశ్రామిక సాంకేతిక కళాశాల చట్టాన్ని ఉల్లంఘించిందని మార్చి 8, 1996న జపాన్‌లోని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని టోక్యోలోని ది డెయిలీ యోమియూరి నివేదిస్తుంది. కళాశాల అలా చేయడంలో పెట్టుకున్న అప్పీలును తిరస్కరించి, భవిష్యత్తులోని కేసులకు జపాన్‌లోని ఒక ఉన్నత కోర్టు మాదిరినుంచింది. (వివరాల కొరకు దయచేసి నవంబరు 8, 1995 సంచిక తేజరిల్లు!ను చూడండి.) కెన్‌డో సమరోచిత ఆర్ట్స్ డ్రిల్‌లలో పాల్గొనడానికి విద్యార్థి నిరాకరించిన కారణం, “యథార్థమైనది మరియు” ఆయన విశ్వాసానికి “సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నది” అని కోర్టు గుర్తించగలిగింది. కోబయాషిని గూర్చి “ఒక విశిష్ట విద్యార్థి” అని అంటూ కెన్‌డోకు బదులుగా మరో ప్రత్యామ్నాయ వ్యాయామ విద్యను పాఠశాల అతనికి ప్రతిపాదించి ఉండవలసింది అని కోర్టు ప్రస్తావించింది.
నిస్సత్తువను నివారించండి!
అన్ని రకాల ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి, మరి ఎలన్ మాక్‌గ్రోత్ అనే మనస్తత్త్వశాస్త్రజ్ఞుడు అమెరికా పత్రికయైన హెల్త్‌లో ఒక శీర్షికను వ్రాస్తూ ఒత్తిడి మీ జీవితంలో నిస్సత్తువకు నడుపకుండా ఉండేందుకు ఈ క్రింది కొన్ని చిట్కాలను ప్రతిపాదించాడు.
▪ కొంత విరామం తీసుకోండి, అది ఎలాంటి విరామమైనా కావచ్చు: పది నిమిషాలు నడవండి లేదా ఐదు నిమిషాలు మౌనంగా ఉండి గాఢంగా ఊపిరి పీల్చుకోండి. ప్రతిరోజు ఆరంభంలోను ముగింపులోను 15 నిమిషాలు చదివేందుకు లేదా ధ్యానించేందుకు కేటాయించుకోండి.
▪ అదుపు చేసుకోండి: మిమ్మల్ని నవ్వించే ఫోటోలను పుష్పాలను లేదా జ్ఞాపకార్థ వస్తువులను మీ చుట్టూ ఉంచుకోండి. మీ పట్టికను తయారు చేసుకునేందుకు ముందడుగు వేయండి, అవసరమైన పనులను చేయడానికి తక్కువ ఒత్తిడి గల సమయాలను కేటాయించుకోండి.
▪ పోషకాహారాన్ని భుజించండి: మీరెంత పనితొందరలో ఉన్నా మీరు ఆకలితో నకనకలాడే వరకు పని చేయకండి, లేదా ఆకలి తీర్చుకునేందుకు కొంత చిరు తిండిని అల్పాహారంగా తీసుకోండి. ముఖ్యంగా పండ్లు కూరగాయలు గల ఆహారాన్ని తరచూ తీసుకోవడం అలసటను నివారించేందుకు మీకు సహాయపడుతుంది.
▪ కదులుతూ ఉండండి: శారీరక వ్యాయామం ఒత్తిడిని తగ్గించి, సంతృప్తితోకూడిన అనుభూతిని, అదుపు చేసుకుంటున్నామనే భావనను అధికం చేస్తుంది. వ్యాయామాన్ని ఆహ్లాదకరంగా చేసుకోండి!
కొంచెం పురుగులనిస్తారా!
అందరూ కాకపోయినా, చాలా మంది కీటకాలను తినడం ద్వారా రోగాలను స్వస్థపరచుకునే పద్ధతిని అసహ్యించుకుంటారు. అయినప్పటికీ, ఏసియావీక్ పత్రిక తెలిపిన ప్రకారం ఈ తలంపు క్రొత్తదేమీ కాదు. పోషక గుణానికే కాక, స్వస్థపరచే గుణానికి కూడా పేరు గాంచిన చీమలు మరియు తేళ్ళు వంటి మిశ్రమాలు గల ఆహార పదార్థాలను సింగపూర్‌లోని ఇంపీరియల్ హెర్బల్ రెస్టారెంట్ వడ్డిస్తుంది. కీళ్ళవాత రోగానికి చీమలు మంచివని, అయితే నరాల బిగువును సడలించేందుకు, తీవ్రమైన తలనొప్పి నుండి ఉపశమనాన్ని పొందేందుకు తేలు విషం మంచిదని చెప్పబడుతుందని ఆ రెస్టారెంట్ యజమానురాలైన శ్రీమతి టీ ఇన్గ్ వాన్గ్ లీ అన్నది. నొప్పి నుండి శమనం పొందేందుకైన గొంగళి పురుగు; లోపలి గ్యాస్‌కు బొబ్బలకు మశూచికి వ్యతిరేకంగా పోరాడేందుకైన ఇలకోడి గొంగళిపురుగు; మరి పరాన్నభుక్కులను చంపేందుకు ఎండిపోయిన కందిరీగల గూడూ కూడా ఇతర అకశేరుక మందుల పట్టికలో ఇమిడి ఉన్నాయి. ఈ ప్రాణుల రుచి ఎలా ఉంటుంది? చీమలు ఘాటుగా వినిగర్ వంటి రుచి కలిగి ఉంటాయి, తేళ్ళు నమిలే విధంగా ఉంటాయి. “తినగా తినగా రుచిస్తాయి” అని శ్రీమతి వాన్గ్ లీ తెలుపుతున్నారు.
బాల్యకాలంలో విషబాధకు గురి కావడాన్ని నివారించండి
చిన్న పిల్లలు తమ స్వంత ఇంట్లోనే తమ కొరకు ఉద్దేశించబడని చిన్న మాత్రను మింగడం ద్వారా కూడా విష బాధితులు కాగల అపాయముందని ఎఫ్‌డిఎ కన్‌స్యూమర్ పత్రిక చెబుతుంది. మందులను ఇంట్లో వాడే రసాయనాలను, మద్య పానీయాలను మ్రింగడం వల్ల చిన్న బిడ్డకు అనారోగ్యం కలుగవచ్చు, వస్తుంది, చివరకు మరణం కూడా సంభవించవచ్చు. కనుక, ఈ ఉత్పత్తులను వారి చేతికి, కంటికి అందనిచోట ఉంచాలి. చిన్న పిల్లల విటమిన్లతో సహా ఇనుము ప్రత్యామ్నాయ పదార్థాలను అధికంగా ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. “ఎందుకంటే [చిన్నపిల్లల విటమిన్లు] కలకండలా లేదా హాస్య చిత్ర పాత్రల్లా కనిపించేలా చేయబడి అమ్మబడుతున్నాయి, అవి మందులా కనిపించక కలకండలాగే కనిపిస్తాయి” అని అమెరికాలోని కెన్‌టుకీ రీజియనల్ పాయిసనింగ్ సెంటర్‌లోని డా. జార్జ్ రాడ్జర్స్ వివరించాడు. అసామాన్య విధమైన కంటి కదలిక, అమితంగా నిద్రపోవడం వంటి అసాధారణ లక్షణాలు ఒక బిడ్డలో వృద్ధి అయినట్లైతే, లేదా మాత్రల సీసా తెరిచి ఉన్నట్లు కనిపించినట్లైతే డాక్టరు దగ్గరికి లేదా పాయిసన్ కంట్రోల్ సెంటర్‌కు వెంటనే వెళ్ళండి, నిపుణులు సలహా ఇస్తారు, వారిచ్చే స్పష్టమైన ఉపదేశాలను అనుసరించండి.
క్రొత్త వస్త్రాలను గూర్చిన హెచ్చరిక
ఫ్రాన్స్, ఇంగ్లండ్ మరియు థాయ్‌లాండ్‌లలో వస్త్రాల తయారీలో ఉపయోగించబడే రసాయనాల ప్రమాదాలను గూర్చిన హెచ్చరికలు ఇవ్వబడ్డాయి అని ఏసియావీక్ అనే పత్రిక వివరిస్తుంది. రంగుల్లో ఉపయోగించే నిల్వనుంచే శక్తివంతమైన ఫోర్మల్‌డహైడ్ అనేక వస్త్రాలలో కనుగొనబడింది, అది చర్మము, కన్ను మరియు ఊపిరితిత్తుల సమస్యలకు కారణమౌతుందని చెప్పబడుతుంది. ఆ నివేదిక ప్రకారం, వస్త్ర పరిశ్రమల్లో బాగా వెలుతురు గాలి ప్రవేశించకుండా పొడిగా ఉన్నట్లైతే, అందులోని కార్మికులకు ముప్పు వాటిల్లవచ్చు, వినిమయదారులు ఎదురయ్యే ప్రతికూల పరిణామాలను నివారించేందుకు ఏ క్రొత్త వస్త్రాన్నైనా సరే ధరించక ముందు దానిని ఉతుక్కోవాలి.
కుటిలులైన సన్యాసులు
తాను ఆమ్‌ఫెటమైన్‌లకు బానిసై, 23 ఏండ్ల బ్రిటీష్ యాత్రికురాలిపై అత్యాచారం చేసి చంపానని థాయ్‌లాండ్‌లోని ఒక క్రొత్త బౌద్ధమత సన్యాసి ఒప్పుకున్నట్లు వర్ల్‌డ్ ప్రెస్ రివ్యూ నివేదిస్తుంది. అయితే, ఈ నేరం ఇటీవల బౌద్ధ అర్చక వర్గాన్ని బాధించిన “అపనిందల పరంపరల”లో కేవలం ఒకటి మాత్రమే. “బౌద్ధమతస్థుల నేరాక్రమణల పెరుగుదలే కాక వారిలో ఉన్న భౌతిక సంపద కొరకైన అత్యాశ కూడా ఆ మతాన్ని భ్రష్టపరుస్తుంది.” ఏ విధంగా? “మోటారు కారులో ప్రయాణించే కొందరు సన్యాసులకు ఆకర్షణీయమైన వ్యాపారం అదృష్ట తాయెత్తులను అమ్మడమే.” దాని ఫలితంగా, “ఒకప్పుడు గౌరవించబడిన బౌద్ధ మతాధికారుల్లో ప్రజలకున్న విశ్వాసం సవాలు చేయబడింది.” సన్యాసులు చేసే “మత్తుమందు దురుపయోగాన్ని” అదుపు చేసే ప్రయత్నంలో “సన్యాసి మఠాలు మాదక ద్రవ్యాల విముక్తి కేంద్రాలను ఆరంభించాయి” అని కూడా ఆ పత్రిక పేర్కొంటోంది.
ఖరీదైన ఇరుగుపొరుగు
బ్రిటన్‌లోని ఇంటి యజమానులు తమ ఇండ్లను అమ్మేటప్పుడు గతంలో తమ పొరుగువారితో వచ్చిన తగాదాల వివరాలను తెలపవలసిన చట్టబద్ధమైన బాధ్యత ఉందని లండన్‌లోని ది సన్‌డే టైమ్స్ నివేదిస్తుంది. అల్లర్లుచేసే తన పొరుగువారిని గూర్చి స్థానిక అధికారులకు తాను రెండుసార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని తన ఇంటిని కొనుక్కున్న వారికి తెలపకుండా తప్పుడు సమాచారమిచ్చినందుకు 80 ఏండ్ల విధవరాలిపై వేయబడిన దావా విజయవంతమయ్యింది. ఆమె ఇప్పుడు 45,000 డాలర్ల జరిమాన చెల్లించిన తర్వాత దివాలా తీసింది. ఆ ఇంట్లో తాము ఆరు సంవత్సరాలు ఉన్నామని, కాని తమ పొరుగువారి ప్రక్కన జీవించడం అసహనీయంగా మారిందని, ఇక అమ్మడం తప్ప వేరే మార్గం లేదని అనుకుంటున్నామని క్రొత్త యజమానులు కోర్టుకు చెప్పుకున్నారు. అలాంటి సమస్యలను నివారించేందుకు, కొందరు కొనుగోలుదారులు తమకు కాబోయే పొరుగువారి ప్రవర్తనను గూర్చి అన్వేషించేందుకు వ్యక్తిగతంగా డబ్బుచెల్లించి గూఢాచారులను పెట్టుకున్నారు. పై పై పరిశోధనకే 75 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది, కాని కొందరు కొనుగోలుదారులు నిశిత పరిశోధన కొరకు 1,500 డాలర్లు చెల్లించేందుకు కూడా ఇష్టపడ్డారు.
“గ్యాస్‌తో—వంట—మరియు పిల్లికూతలు”
ఈ శీర్షిక క్రింద, “పిల్లికూతలు రావడం, సరిగా ఊపిరి పీల్చుకోలేక పోవడం మరియు ఆస్మా యొక్క ఇతర లక్షణాలు రావడం వంటివి సంభవించే అవకాశం ఎలక్ట్రిక్ కుక్‌టాప్‌లతో మరియు ఓవన్‌లతో భోజనం తయారు చేసేవారి కన్నా గ్యాస్‌తో వంట చేసే వారికే రెండురెట్లు ఎక్కువగా ఉంది” అని బ్రిటీష్ పరిశోధకులు కనుగొన్నారని సైన్స్ న్యూస్ నివేదించింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉపయోగించినప్పటికి కూడా ఈ లక్షణాలు కలుగుతాయని లండన్‌లోని సెయింట్ థోమస్ ఆసుపత్రిలో జరిపిన అధ్యయనంలో గమనించడం జరిగింది. సర్వేలో స్త్రీపురుషులు ఇరువురూ పాల్గొనగా, ఆ “ప్రభావం స్త్రీల మీదే కనిపించింది—బహుశ వారే ఎక్కువ సమయం వంట గదిలో గడుపుతున్నందువల్ల కావచ్చు.”
సముద్ర ప్రయాణికులైన సీతాకోక చిలుకలు
ప్రతి మార్చిలోను మోనార్క్ అనే పెద్ద సీతాకోక చిలుకలు మెక్సికో నుండి 800 కిలో మీటర్ల పెద్ద సముద్రం మీదిగా ప్రయాణం చేసి, అమెరికాలోని లూసియానా నదీ తీరం యొక్క చిన్న భాగానికి వలస వెళ్తాయి. ఆ తర్వాత మోనార్క్‌లు ఉత్తరాన కెనడా వరకు కొనసాగుతాయి. ఆ తరువాత అక్టోబర్‌లో ముని-ముని మనమళ్ళు అదే మార్గంలో మెక్సికోకు చేరుకుంటాయి. కాని చిన్న మెదడుతో, సూది మొన అంత పరిమాణంలో ఉండే వాటికి ఎక్కడికెగరాలో ఎలా తెలుసు? అది ఇప్పటికీ మర్మమే. కీటకాలు ఆకర్షణశక్తి చేత నడిపించబడుతుండవచ్చని సీతాకోక చిలుకల పరిశోధకుడైన డా. గారీ నోవల్ రాస్ నమ్ముతున్నాడని కాలిఫోర్నియాలోని చికోలోని ఎంటర్‌ప్రైస్ రికార్డ్ నివేదిస్తుంది. అయితే మెక్సికోకు తిరిగి వచ్చే పథకాలు ఐదు తరాలలోను ఎలా తెలియజేయబడతాయి? అన్నది ఆశ్చర్యకరమైన ప్రశ్న. “వీటన్నింటిని గూర్చిన చిక్కు అనేది అర్థం చేసుకో శక్యం కానిది” అని డా. రాస్ అన్నాడు.
నమ్మకమైన సముద్రపు గుర్రాలు
సముద్ర గుర్రం తన జతతో జీవితాంతం నమ్మకంగా ఉంటుందన్నది స్పష్టమని ఆక్సఫర్డ్ జంతు శాస్త్రజ్ఞుడైన అమన్‌డా విన్‌సన్ట్ కనుగొన్నాడు. ఆస్ట్రేలియాలోని ఆగ్నేయ తీరంలో ఉండే పది సెంటీమీటర్ల పొడవున్న హిప్పోక్యాంపస్ విటీ జాతులను అధ్యయనం చేసిన డా. విన్‌సెన్‌ట్ చేపల్లో అలాంటి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడని లండన్‌లోని ది టైమ్స్ పేర్కొంటోంది. ప్రతి ఉదయం మగది తన జత కోసం ముందుగా ఏర్పాటు చేసుకున్న స్థలంలో వేచి ఉండడం గమనించబడింది. సముద్ర గుర్రాలు అలా కలుసుకున్న తరువాత రంగు మార్చుకుని నృత్యం చేస్తాయి. సంతానాన్ని ఉత్పత్తి చేయడమనేది కలిసి పంచుకునే అనుభవం. ఆడది గుడ్లు పెట్టిన తర్వాత, మగది వాటిని ఫలవంతం చేసి, తన తోకలో ఉండే పొదిగే సంచిలో వాటిని ఉంచుతుంది, అవి పుట్టే వరకు అక్కడే ఉంటాయి. జత చనిపోతే, బ్రతికివున్న సముద్ర గుర్రం జతలేని మరో సముద్ర గుర్రంతోనే జత కడుతుంది. లక్షలాదిమంది ప్రతి సంవత్సరం అక్వేరియమ్‌ల కొరకు మరియు సాంప్రదాయక ఆసియా మందు కొరకు ఈ ఆహ్లాదకరమైన ప్రాణులను పట్టుకుంటున్నారు గనుక వాటి మనుగడ అపాయంలో ఉందన్నది విచారకరం.
అమిత గురుత్వాకర్షణ గల లోహం కొరకైన ఉత్సుకత
నికిల్, సీసం, తుత్తునాగం, కాడ్‌మియమ్ వంటి అమిత గురుత్వాకర్షణగల లోహాలు నేలను మలినపరచినప్పుడు భూమి అపాయకరమైనదిగాను నిరుపయోగంగాను మారుతుంది. ప్రస్తుత శుద్ధీకరణ పద్ధతుల్లో భూమి ఉపరితల పొరను తీసి, గుంతలుగా ఉన్న ప్రదేశాల్లో దానిని వేయడం లేదా మలినపర్చబడిన మట్టిని తీసివేసి, లోపలికి చొచ్చుకునిపోయి ఉన్న లోహాలను వెలుపలికి తెచ్చే ఘాటైన ఆసిడ్‌ను దానిపై పోయవలసి ఉంటుంది. అయితే ఈ శుద్ధీకరణ పద్ధతులు చాలా ఖరీదైనవి. ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఈ సమస్యను పరిష్కరించేందుకు సహాయం చేయడానికి మరింత చౌకైన మరింత మేలురకమైన శుద్ధీకరణ పద్ధతుల కొరకు అధ్యయనం చేస్తున్నారు. దానిని ఫైటోరెమీడియేషన్ (మొక్కల ద్వారా సమస్యలను పరిష్కరించడం) అంటారు. ఈ ప్రక్రియలో నేల నుండి లోహాలను పీల్చుకుని, వాటిని మట్టి నుండి ఆకుల్లోకి, కాండంలోకి, మిగిలిన భాగాల్లోకి పంపించే మొక్కలను ఉపయోగించడం ఇమిడి ఉంది. గురుత్వాకర్షణగల ఆ లోహాలను మట్టిలో నుండి వెలుపలికి తీసిన తర్వాత, ఆ మొక్కలను ఈ ప్రక్రియలో ఉపయోగించి, మరింత విలువైన లోహాలను మళ్ళీ వెలుపలికి తీయవచ్చు అని సైన్స్ పత్రిక చెబుతుంది.