ఏక రీతిగా ఉండే దేశంలో అల్పసంఖ్యాకుల విజయం
జపాన్‌లోని తేజరిల్లు! విలేఖరి
ఒసాకా ఉన్నత న్యాయస్థాన ప్రెస్ క్లబ్‌లో 19 ఏండ్ల కునిహిటో కోబయాషి మరియు అతని తలిదండ్రులు బాగా నవ్వుతూ సమావేశ గదిలో ప్రవేశించినప్పుడు ఏడు దూరదర్శిని కెమేరాలు అలాగే డజన్ల చొప్పున నివేదకులు యౌవనస్థుడైన వాది రాక కొరకు ఎదురు చూస్తున్నారు. వారు ప్రశ్నలకు జవాబులిస్తుండగా కెమెరాలు ఎడతెగక ఫ్లాషయ్యాయి.
“నా కేసులో నిష్పక్షపాతమైన జవాబును పొందినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎవరైనా సరే ఆయన లేక ఆమె మత విశ్వాసాల ప్రసక్తి లేకుండా ఉన్నత పాఠశాలలో చేరి, పై తరగతులకు వెళ్ళి, విద్యనభ్యసించగల లోకాన్ని చూడాలని నేను ఆశిస్తున్నాను” అని కునిహిటో చెప్పాడు.
ఒసాకా ఉన్నత న్యాయస్థానం క్రింది కోబ్ జిల్లా న్యాయస్థానం చేసిన తీర్మానాన్ని మార్చివేసి, కునిహిటో మత సంబంధమైన విశ్వాసాలేవైనా సరే విద్యాభ్యాసాన్ని పొందే తన హక్కును గూర్చి అతడు కోరిన దానిని మంజూరు చేసింది.
వివాదం
మత సంబంధమైన కారణాల వల్ల కెండో (జపానీయుల ఖడ్గప్రదర్శన) డ్రిల్లులో పాల్గొననందుకు కోబ్ పురపాలక పారిశ్రామిక సాంకేతిక కళాశాల నుండి (క్లుప్తంగా కోబ్ టెక్ అని పిలువబడుతుంది) అతనిని బహిష్కరించడమే ఈ దావాలో ఇమిడి ఉన్న వివాదం. కునిహిటోను పై తరగతికి పంపించకుండా ఉండడంలో అతనిని పాఠశాలనుండి బహిష్కరించడంలో పాఠశాల తీసుకున్న చర్యను త్రోసిపుచ్చుతూ ఒసాకా న్యాయస్థానం తీసుకున్న తీర్మానం ప్రకారం అతడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో తన పఠనాన్ని పునఃప్రారంభించాలన్న కోరికను వ్యక్తం చేశాడు. ఈ కళాశాలలోని ఐదు సంవత్సరాల్లోని మొదటి మూడు సంవత్సరాలు ఉన్నత పాఠశాలలోని మూడు సంవత్సరాలకు సమానం.
కునిహిటో శరీరాభ్యాస తరగతిలో భాగంగా కెండో డ్రిల్లులో పాల్గొనాలని కోబ్ టెక్ కళాశాల బలవంతం చేసింది. అయితే, అతడు యెహోవాసాక్షుల్లో ఒకడు కనుక అతని బైబిలు శిక్షిత మనస్సాక్షి సమరోచిత కళా డ్రిల్లులో పాల్గొనడానికి అతనిని అనుమతించలేదు. పత్రికా విలేఖరుల సమావేశంలో నివేదకుల కొరకు కునిహిటో బైబిలును తెరచి, తన స్థానాన్ని వివరించాడు: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—యెషయా 2:4.
అయితే, ఒక యౌవన విద్యార్థి మత స్వాతంత్ర్యాన్ని మరియు విద్యావంతుడయ్యే హక్కును పొందేందుకు చట్టం వైపుకు ఎందుకు తిరగవలసి వచ్చింది? సుకుబా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ కోజి టోనమీ ఈ విధంగా అభిప్రాయపడ్డారు: “నిర్లక్ష్యం మరియు అవగాహన లేమి వలన విశ్వాసుల నమ్మకాలపై అపేక్షించని ప్రతిబంధకాలు వేయబడి ఉండవచ్చు.” ప్రభుత్వం లేదా సమాజం ఒక మతాన్ని కావాలని అణగద్రొక్కకపోయినప్పటికి, తెలియకనే అణచివేసిన సందర్భాలుండవచ్చు.
అల్పసంఖ్యాకుల హక్కుపై అలాంటి “అపేక్షించని ప్రతిబంధకాలు” ఎందుకు వేయబడ్డాయి? “ఎందుకంటే అల్ప సంఖ్యాకులు అధిక సంఖ్యాకులకు అనురూపంగా మారాలని బలవంతం చేసే సామాజిక వ్యవస్థను జపానీయుల సమాజం గొప్పగా ఎంచింది” అని ఆవోయామా గాకూయిన్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ హెటోషి సెరెజావా జవాబిచ్చారు. మొత్తం మీద సమాజానికి అనురూపంగా మారాలన్న ఒత్తిడి జపాన్‌లో నిజంగా బలీయంగా ఉంది.
భిన్నంగా ఉండేవారిని ఒంటరిగా చేసే పాఠశాల వ్యవస్థలో ఉండడమనేది యౌవనస్థులకు అంత సులభమైనది కాదు. అయినప్పటికీ, ఇది కేవలం మతపరంగా అల్పసంఖ్యలో ఉన్నవారికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. కేసు ఆరంభం నుండి దానిని పరిశీలించి, వివాదమేమిటో, ఈ తీర్మానం సాధారణ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం.
అల్పసంఖ్యాకుల హక్కును స్థాపించడం
కోబ్ టెక్ 1990 వరకు సమరోచిత కళలను అభ్యసించాలని తన విద్యార్థులను కోరలేదు. అయితే సమరోచిత కళల డ్రిల్ హాల్‌తో పాటు వ్యాయామశాల పని ముగిసిన తరువాత, కెండో డ్రిల్ అభ్యసించాలని తన విద్యార్థులను కోరడం మొదలుపెట్టింది. పాఠశాలలోని శరీరాభ్యాస విభాగం 1990లో 16 ఏండ్ల వయస్సులో కోబ్ టెక్‌లో చేరిన యెహోవాసాక్షుల గురించి రాజీపడని ఒక తీర్మానాన్ని తీసుకుంది. కెండో డ్రిల్లుల నుండి తమను మినహాయించాలని వారు అభ్యర్థించినప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఈ విధంగా చెప్పాడు: “పాఠశాల చెప్పేది మీరు చేయలేనట్లయితే, పాఠశాల విడిచిపెట్టి వెళ్ళండి!”
తమ విశ్వాసం కొరకు స్థిరంగా నిలబడ్డ సాక్షులైన యౌవనస్థులకు తరువాతి గ్రేడులకు వెళ్ళే ఆశ అడియాశయైపోయింది. మరొక ఉపాధ్యాయుడు ఈ విధంగా చెప్పాడు: “మీరు ఇతర [శరీరాభ్యాస] విషయాల్లో బాగా కృషి చేసినా మీకే గుర్తింపు లభించదు.” ఖడ్గములు వెదురుతో చేసినవే అయినప్పటికీ కూడా వాటిని తీసుకోకుండా ఉండడం ద్వారా ఐదుగురు విద్యార్థులు బైబిలు బోధనలోని తమ విశ్వాసాన్ని గట్టిగా హత్తుకున్నారు. వారిలో ముగ్గురు బాప్తిస్మం పొందిన యెహోవాసాక్షులు, ఇద్దరు బాప్తిస్మం పొందనివారు, కాని వారందరూ బైబిలులోని తమ విశ్వాసాన్ని నొక్కి చెప్పారు. తమ ఉపాధ్యాయులు చేయమని కోరే ప్రత్యామ్నాయ పనులేవైనా చేసేందుకు సిద్ధమయ్యారు.
వారు తీసుకున్న స్థానాన్ని బట్టి వారు తరువాతి గ్రేడులను పొందకుండా నిషేధించబడ్డారు. మరుసటి పాఠశాల సంవత్సరం 1991లో ఆరంభమైనప్పుడు, శారీరకాభ్యాస ఉపాధ్యాయులు కెండో డ్రిల్లులో పాల్గొనని ఐదుగురు విద్యార్థులను, అలాగే అదే విశ్వాసాన్ని కలిగి ఉన్న తొమ్మిది మంది క్రొత్త విద్యార్థులను సమావేశపరచి ఈ విధంగా చెప్పారు: “మీరు మరో గ్రేడుకు వెళ్ళాలనుకుంటున్నట్లయితే చాలా ఎక్కువ మార్కులు పొందాలి. మీలో ఎవరూ అలాంటి మార్కులు పొందలేరు.” ఆ ఉపాధ్యాయులు ఇంకా ఇలా చెప్పారు: “ఇది తప్పనిసరి విద్యాభ్యాసం కాదు. [జపాన్‌లో ఒకటవ గ్రేడు నుండి తొమ్మిదవ గ్రేడు వరకు మాత్రమే తప్పనిసరి విద్యాభ్యాసం.] ‘ఇక్కడి నుండి వెళ్ళిపోండి’ అని మేము మీతో చెప్పగలం.”
పాఠశాల తీసుకున్న చర్యలు రాజ్యాంగం ప్రకారం ఆరాధనా స్వాతంత్ర్యం మరియు విద్యాభ్యాసాన్ని పొందే హక్కును అతిక్రమించాయి అని వాదిస్తూ ఐదుగురు విద్యార్థులు పాఠశాలకు వ్యతిరేకంగా కోబ్ జిల్లా న్యాయస్థానంలో దావా వేశారు. అదే సమయంలో, కేసు జరుగుతున్న కాలవ్యవధిలో పాఠాలకు హాజరయ్యేందుకుగాను, పై గ్రేడుకు పంపించడాన్ని నిషేధించే చర్యను అమలు పరచకుండా ఆపాలని ఆ ఐదుగురు విద్యార్థులు కోబ్ జిల్లా న్యాయస్థానంలోను ఆ తర్వాత ఒసాకా ఉన్నత న్యాయస్థానంలోను అర్జీలు వేశారు. అయితే, ఆ రెండు న్యాయస్థానాలు కూడా ఆ అర్జీలను నిరాకరించాయి.
తరువాతి పాఠశాల సంవత్సరంలో ఆ ఐదుగురిలో ఇద్దరు విద్యార్థులు బహిష్కరించబడతారని బెదిరించడం జరిగింది. దాని ఫలితంగా, ఒకరు పాఠశాల బలవంతాన పాఠశాలను వదిలిపెట్టవలసి వచ్చింది. తాను పాఠశాలను వదిలిపెట్టాలన్న పాఠశాల సూచనను అంగీకరించడానికి మరొక విద్యార్థి నిరాకరించారు. కునిహిటో కొబాయాషి అనే ఆ విద్యార్థి పాఠశాల నుండి బహిష్కరించబడ్డాడు.
ఒక గ్రేడులో రెండు సార్లు తప్పిన విద్యార్థిని “గ్రాడ్యుయేషన్‌కు పనికిరానివానిగా చదువుకు అసమర్థునిగా” ఎంచి వెంటనే పంపివేయాలని పాఠశాల నియమాలు చెప్పాయి. మరి కునిహిటో “చదువుకు అసమర్థుడా”? కెండో వివాదం వల్ల 100కు 48 మార్కులతో తప్పాడు, కాని శారీరకాభ్యాసంతో సహా అన్ని విషయాల్లో అతనికి లభించిన సరాసరి మార్కులు 90.2. అతడు తన తరగతిలోని 42 మంది విద్యార్థుల్లో అందరి కన్నా బాగా చదివేవాడు! అతడు మంచి ప్రవర్తన గలవాడు మరి నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు.
అతడు కోబ్ జిల్లా న్యాయస్థానంలో అర్జీలు పెట్టుకున్నాడు, తరువాత ఈ బహిష్కరణ చర్య అమలును ఆపాలని ఒసాకా ఉన్నత న్యాయస్థానంలో అర్జీ పెట్టుకున్నాడు. కాని రెండు న్యాయస్థానాలూ అర్జీలను నిరాకరించాయి.
జిల్లా న్యాయస్థాన తీర్మానం
ఫిబ్రవరి 22, 1993న ఐదుగురు పిల్లలు దావా వేసిన దాదాపు రెండు సంవత్సరాల తరువాత కోబ్ జిల్లా న్యాయస్థానం పాఠశాలకు అనుగుణంగా అధికారికంగా తన తీర్మానాన్ని తెలిపింది. “కెండో డ్రిల్లులో పాల్గొనాలనే పాఠశాల ఆంక్షలు ఒకవిధంగా వాదియొక్క ఆరాధనా స్వాతంత్ర్యాన్ని కొంతమేరకు అరికట్టడమేనన్న విషయాన్ని కాదనలేము” అని పర్యవేక్షణలో ఉన్న టాడో సుజీ అనే న్యాయమూర్తి ఒప్పుకున్నాడు. అయితే “పాఠశాల తీసుకున్న చర్యలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు” అన్న నిర్థారణకు ఆయన వచ్చాడు.
విద్యార్థులు వెంటనే ఒసాకా ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకున్నారు. అయితే, జిల్లా న్యాయస్థానం తీసుకున్న తీర్మానం ఆలోచనాపరులైన అనేక మందిని కలతపరచింది. మైనీచీ షీంబూన్ అనే వార్తాపత్రికలోని పాఠకుల కాలమ్‌లో ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తపరచాడు: “ఈ సారి తీసుకున్న తీర్మానం ‘కెండో పాఠాల్లో పాల్గొనకపోవడాన్ని సహించవలసిన మతపరమైన తటస్థతను మత సంబంధమైన కారణాల వల్ల ఇది అతిక్రమిస్తుంది’ అనే తీర్పుపై కేంద్రీకరించబడి ఉంది. అయినప్పటికీ, తటస్థత అంటే వివాదంలోని ఏ పక్షాన్ని వహించకుండా ఉండడమే. మత సంబంధమైన తటస్థత విషయానికొస్తే, అధిక సంఖ్యాకుల నుండి అల్పసంఖ్యాకుల విశ్వాసాన్ని కాపాడాలన్నదే వివాదం. కనుక, ఈ తీర్మానం మత స్వాతంత్ర్యాన్ని నిజంగా నిషేధిస్తుంది, న్యాయస్థానం తానే మత తటస్థతను అతిక్రమించింది.”
చాలా మంది రానున్న విపత్తు సూచనను పసిగట్టి, తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు కదిలించబడ్డారు. నాజాన్ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ సబ్జెక్ట్ ప్రొఫెసర్ డా. టాకీషి కొబాయాషి ఈ కేసును గూర్చిన తన అభిప్రాయాన్ని ఒసాకా ఉన్నత న్యాయస్థానానికి పంపిస్తూ ఈ విధంగా చెప్పారు: “మన దేశంలోని న్యాయస్థానాలను అల్పసంఖ్యాకుల హక్కులను ఎలా కాపాడవచ్చు అన్న సవాలుతో అవి ఎలా వ్యవహరిస్తాయి అని వివాదంలో ఉన్న ఈ కేసు కచ్చితంగా అడుగుతుంది. . . . ఈ కళాశాల ప్రజల విద్యాభ్యాసం యొక్క తటస్థ స్థానంతోపాటు మతం మరియు రాష్ట్రాల వేర్పాటు అనే ముసుగులో అధిక సంఖ్యాకుల సాధారణ అభిప్రాయం ఆధారంగా అల్పసంఖ్యాకులు మత స్థానాన్ని సహించడాన్ని ఖండితంగా నిరాకరిస్తుంది. క్రింది న్యాయస్థానం చేసిన తీర్మానం అలాంటి చర్యలు చట్టబద్ధమైనవని, రాజ్యాంగ ప్రకారమైనవేనని ఆశీర్వదించాయి. అయినప్పటికీ, సాధారణంగా మతసంబంధమైనవిగా అంగీకరించబడినవాటి దృష్ట్యా అల్పసంఖ్యాకుల విశ్వాసాలు అర్థం చేసుకోలేనివిధంగా ఉన్నప్పటికీ, ఆ విశ్వాసాలు యథార్థమైనవైనట్లయితే వాటిని గౌరవించాలి. న్యాయమూర్తి అల్పసంఖ్యాకుల తుది రక్షకుడన్న విషయాన్ని గుర్తుంచుకొని తీర్పు తీర్చవలసిన అవసరముంది.”
సుకుబా విశ్వవిద్యాలయంలోని మరో న్యాయకోవిదుడు ప్రొఫెసర్ టెట్సూవో షిమోమురా ఈ విధంగా చెప్పారు: “పాఠశాల యొక్క క్రూరమైన ధోరణులు ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నది కలతపరచే విషయం.” విద్యార్థికి ప్రత్యామ్నాయ పద్ధతులను ఏమీ చెప్పకుండా అతడ్ని పంపించివేసిన విద్యావేత్తల లోపాన్ని అది చూపిస్తుంది, అలాగే విద్యార్థుల సంక్షేమంపై శ్రద్ధలేమిని అది చూపిస్తుంది అని ఒక దూరదర్శిని ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
ఫిబ్రవరి 22, 1994న కోబ్ బార్ అసోసియేషన్ కునిహిటోను తిరిగి చేర్చుకోవాలని కోబ్ టెక్ ప్రధానోపాధ్యాయునికి అధికారికంగా సిఫారసు చేసింది. కునిహిటోను పై గ్రేడ్‌కు పంపించడానికి నిరాకరించి, అతనిని బహిష్కరించడంలో పాఠశాల తీసుకున్న చర్య అతని ఆరాధనా స్వాతంత్ర్యాన్ని మరియు విద్యనార్జించే అతని హక్కును అతిక్రమిస్తున్నాయి అని అది ప్రకటించింది.
నిష్పక్షపాత తీర్మానం
అప్పీలు విచారణలు జరుగుతుండగా, కునిహిటో కాకుండా మరో నలుగురు అప్పీలుదారులు తమ కేసును ఉపసంహరించుకోవాలని తీర్మానించుకున్నారు. ఎందుకంటే ముగ్గురు అప్పటికే తరువాయి తరగతికి పంపించబడ్డారు, ఒకరేమో వదిలిపెట్టడానికి బలవంతపెట్టబడ్డారు. దీని ఫలితంగా వివాదాంశం కునిహిటోతో వ్యవహరిస్తున్న పాఠశాలపై కేంద్రీకృతమైంది.
అయినప్పటికీ, కునిహిటో యొక్క మునుపటి నలుగురు తోటి విద్యార్థులు విచారణా సమయాల్లో అన్నివేళలా అక్కడ ఉంటూ అతనికి నైతిక మద్దతునిచ్చారు. కునిహిటో చట్టపరంగా పోరాడేందుకు సహాయపడేలా పాఠశాలను వదిలిపెట్టడానికి బలవంతం చేయబడ్డ విద్యార్థి పార్ట్ టైమ్ ఉద్యోగం చేసి సంపాదించిన కొద్దిపాటి డబ్బును అంటే 1,00,000 యెన్లను కునిహిటోకు ఇచ్చాడు.
డిశంబరు 22, 1994న ఒసాకా ఉన్నత న్యాయస్థానంలో రాసుకీ షీమాద అనే ప్రధాన న్యాయమూర్తి మాటల కొరకు మిగిలిన విద్యార్థులతో పాటు కునిహిటో ఎదురు చూశాడు.
“మొదటి తీర్మానం కొట్టివేయబడింది” అని న్యాయమూర్తియైన షీమాద ప్రకటించారు.
న్యాయమూర్తి షీమాద అతి ప్రాముఖ్యమైన తన తీర్మానంలో కెండో డ్రిల్లులను నిరాకరించడంలో కునిహిటోకుగల కారణం యథార్థమైనదేనని ప్రకటించారు. ప్రజలందరి కొరకు తెరువబడిన విద్యా సంస్థగా తన విద్యార్థుల ఎడల విద్యాభ్యాసపరమైన బాధ్యత కోబ్ టెక్‌కు ఉందని న్యాయమూర్తి ప్రస్తావించారు. కెండో డ్రిల్లులో పాల్గొనడానికి నిరాకరించినందుకు కునిహిటోకు జరిగిన నష్టం చాలా ఎక్కువని, అతనిని బహిష్కరించడం విద్యాభ్యాసాన్ని పొందే అతని అవకాశాలనన్నింటినీ దోచుకోవడమే తప్ప మరేమి కాదని కూడా ఆయన ప్రస్తావించారు.
పాఠశాల ప్రత్యామ్నాయ పద్ధతులను చూపించవలసిందని న్యాయమూర్తి షిమాద ప్రకటించారు. అలాంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఏ మాత్రం అర్జీ పెట్టినవారి మతాన్ని పెంపొందించడం కాని, ఇతర విద్యార్థులను అణగద్రొక్కడం కాని చేయదు అని ఆయన చెప్పారు. “ప్రతివాది [పాఠశాల] ప్రత్యామ్నాయ పద్ధతుల కొరకు జాగ్రత్తగా ఆలోచించిందన్న రుజువేమీ లేదు. బదులుగా, . . . ప్రతివాది కెండో డ్రిల్లును నిరాకరించడాన్ని సహించేది లేదనే పాలసీని మొండిగా పట్టుకుని కూర్చుంది, ప్రత్యామ్నాయ పద్ధతులను చూపించే అవకాశాలను గూర్చి కనీసం ఆలోచించడం కూడా మొదలు పెట్టలేదు” అని న్యాయమూర్తి ప్రస్తావించారు.
తీర్మానం మిమ్మల్నెలా ప్రభావితం చేస్తుంది
అల్పసంఖ్యాకులకు చెందిన ఒక యౌవనస్థుని ఈ విజయంలో మీరెందుకు ఆసక్తి కల్గి ఉండాలి? మునుపటి వాటర్‌గేట్ కుంభకోణ స్పెషల్ ప్రాసిక్యూటర్ ఆర్కిబాల్డ్ కాక్స్ ద కోర్ట్ అండ్ ద కాన్‌స్టిట్యూషన్ అనే తన పుస్తకంలో అమెరికాలోని పతాక వందనాన్ని గూర్చిన వివాదంలో యెహోవాసాక్షులను గూర్చి అలాంటి ప్రశ్ననే అడిగాడు: “ఆ చిన్ని అల్పసంఖ్యాకుల ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని గూర్చి మనమెందుకు కలత చెందాలి?”
ఈ ప్రశ్నకు జవాబు చెబుతూ కాక్స్ ఈ విధంగా చెప్పారు: “జవాబులో కొంత భాగం మన సమాజం ఆధారపడే వ్యక్తిగత గౌరవాన్ని గూర్చి అంటే సంప్రదాయాలను అనుసరించేవారి, అలాగే అనుసరించనివారి గౌరవాన్ని గూర్చిన నైతిక బోధనలో ఉంది. దేశం నేడు యెహోవాసాక్షుల మాటలను ఆపివేస్తే. . . , రేపు ఆపివేసేది మన స్వంత మాటలనే కావచ్చు అని తెలుసుకోవడంలో జవాబులోని మిగతా భాగం ఉంది.”
ర్యూకోకో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ టాకీషి హీరానో, కాక్స్‌తో ఏకీభవిస్తూ కెండో కేసు గురించి ఈ విధంగా చెప్పారు: “అమెరికాలోని ప్రజలు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నట్లే, తమ హక్కుల కొరకు న్యాయస్థానాల్లో అనేక కేసుల్లో పోరాడిన యెహోవాసాక్షులకు తాము కూడా ఆరాధనా స్వాతంత్ర్యాన్నివ్వబద్ధులై ఉన్నారని ఆలోచనాపరులైన ప్రజలు ఇప్పుడు తలస్తున్నారు. మన దేశం [జపాను]లో కూడా ఇలాంటి కేసుల ద్వారా ఆరాధనా స్వాతంత్ర్యాన్ని స్థాపించి, వృద్ధిపరచాలని ఆశిద్దాం.”
చట్టబద్ధంగా తమ విశ్వాసాలను కాపాడుకోవడానికి యెహోవాసాక్షులు తమకు సాధ్యమైనదంతా చేశారు, 20వ శతాబ్దంలో మానవుల ప్రాథమిక హక్కులను స్థాపించడంలో వారు ఎంతో తోడ్పడ్డారు. తమకు లభించబోయే చికిత్స గురించి తెలుసుకునే రోగుల హక్కు కొరకు, జాతీయ పతాకానికి ఎలా గౌరవం చూపాలనేదానిని గూర్చి తీర్మానించుకునే ప్రజల హక్కు కొరకు, ఇతరులతో తన స్వంత విశ్వాసాలను తెలుపుకునే వ్యక్తిగత హక్కు కొరకైన చట్టబద్ధమైన పోరాటాలకు అనేక దేశాల్లోని యెహోవాసాక్షులు నాయకత్వం వహించారు. ఒసాకా ఉన్నత న్యాయస్థానంలోని విజయం అల్పసంఖ్యాకుల హక్కులను స్థాపించడంలో యెహోవాసాక్షుల తోడ్పాటును గూర్చిన చరిత్రలో మరో అధ్యాయాన్ని జత చేసింది.
భిన్నమైన విలువలుగల ఇతరులను గౌరవించడం
అల్పసంఖ్యాకుల నమ్మకాలను సహించడమనే వివాదం మానవ హక్కులకు తోడ్పడడమే కాక, మరొక విధంగా మీ జీవితంతో సంబంధం కలిగి ఉంది. కొమాజావా వనితా విశ్వవిద్యాలయంలో ప్రొఫసర్ కానామా సారుయా ఈ కేసును పేర్కొంటూ ఈ విధంగా చెప్పాడు: “[విద్యార్థులు] భిన్నంగా ఉన్నందుకే రాజ్యాంగం అంగీకరించిన మత స్వాతంత్ర్యం నిర్లక్ష్యం చేయబడింది. భిన్నంగా కనిపించే దేనినైనా ఎదిరించడం అనేది జపాన్‌లో సర్వసాధారణం.”
నేటి సమాజంలో భిన్నమైన దానిని లేదా సహజమైన దానికి వ్యత్యాసమైనదానిని లేకుండా చేయాలనే ఒత్తిడి చాలా బలీయమైనది. జపాన్‌లోనూ మరితర దేశాల్లోని పాఠశాలల్లోనూ నెలకొనివున్న సర్వసాధారణమైన బెదిరింపు సమాజంలో భిన్నమైనదానిని ఒంటరిగా చేసే ఈ ధోరణికి ఉదాహరణ. పాఠశాల బెదిరింపుల సమస్యను గూర్చి వ్యాఖ్యానిస్తూ టోక్యోలోని ప్రధాననగర పోలీసు సూపరింటెండెంట్ జనరల్ హిరోషి యోషినో ఏమని చెప్పారంటే, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అండ్ సైన్స్ జరిపిన సర్వే ప్రకారం, వేధింపుకు గురయ్యే వారి వ్యక్తిత్వాలు మరియు ప్రవర్తనలు వేధించేవారి నుండి భిన్నంగా ఉండడమే వేధించబడడానికి ముఖ్య కారణం. ఆయన ఈ విధంగా ముగించారు: “జపాన్ సమాజంలో లోతుగా దాగి ఉన్న భయంకరమైన దుర్గుణం అంటే, వ్యక్తిగత ప్రత్యేక నడవడికను లేదా శారీరకంగాను మానసికంగాను భిన్నమైనదానిని ఎదిరించే స్వభావం ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రబలమౌతుందని నేననుకుంటున్నాను.”
సమాజానికి భిన్నమైనదానిని కలుపుకోకుండా ఉండడమన్నది, జపాన్‌లో మాత్రమేకాక, అంతటా కనిపిస్తుంది. అయితే, భిన్నమైన విలువలను సహించడం అనేది శాంతియుత సహజీవనానికి కీలకం. దీనిని గురించి, కోబ్ జిల్లా న్యాయస్థానం మరియు ఒసాకా ఉన్నత న్యాయస్థానం చేసిన తీర్మానాలు “పూర్తి భిన్నంగా ఉన్నాయి” అని ఆసాహీ షీంబన్‌లోని ఒక సంపాదకీయం చెబుతుంది. ఆ వార్తాపత్రిక ఇలా చెప్పింది, “రెండు తీర్మానాలు రెండు రకాల ఆలోచనా సరళులకు ప్రాతినిధ్యం వహిస్తాయి,” ఒకటి పాలకవర్గం యొక్క నిరంకుశ క్రూరత్వం మరొకటి భిన్నమైన విలువలను సహించడం.
మీరు భిన్నమైన విలువలను సహించడానికి సిద్ధమేనా? ఇతరుల దృక్పథం యొక్క విలువలను చూడడానికి మీరు ఇష్టపడతారా? ఆసక్తికరంగా, ఈ శీర్షికలో క్రితం పేర్కొనబడిన ఆర్కిబాల్డ్ కాక్స్ అల్పసంఖ్యాకులు కలతచెందడానికిగల మరో కారణాన్ని గూర్చి పేర్కొన్నారు: “అసాధారణంగా అల్పసంఖ్యాకులైన కొందరు సత్యాన్ని—కొంత కాలం వరకు నిలిపి వేయబడిన సత్యాన్ని లేదా అణచి వేయబడడం వలన శాశ్వతంగా కోల్పోయిన సత్యాన్ని—కనుగొని ఉండవచ్చునని తెలుసుకోవడం ఒక కారణం.”
స్పష్టంగా, కోబ్ టెక్‌వారు తాము అణచివేసిన సత్యంలో ఆసక్తి చూపించలేదు లేక వారు సహన శీలాన్ని చూపించలేదు. బదులుగా, వారు ఆ కేసును జపాన్ సుప్రీం కోర్టుకు అప్పీలు చేశారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఏ నిర్ణయాన్ని తీసుకుంటుందో? మనం వేచి చూడాలి.
[22వ పేజీలోని చిత్రం]
కునిహిటో (మధ్యలో) మరియు మొదటి నలుగురు వాదులు