కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 9/8 పేజీలు 20-22
  • ‘నత్తివారి నాలుక కూడా మాట్లాడును’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘నత్తివారి నాలుక కూడా మాట్లాడును’
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నామాట సమస్య
  • సహాయాన్ని అన్వేషించడం
  • యెహోవాసాక్షులను కలవడం
  • నమ్మకానికి మార్గం
  • ప్రత్యేక సవాళ్ళను ఎదుర్కోవడం
  • కమ్యూనిస్ట్‌ దేశంలో దేవునియందలి విశ్వాసం చేత పరిపాలించబడడం
    తేజరిల్లు!—1996
  • దేవుని కాపుదల నుండి నేనెలా ప్రయోజనం పొందాను
    తేజరిల్లు!—1995
  • సమస్యల నెదుర్కొనుటకు దేవునితోటి సన్నిహితత్వం నాకు సహాయపడింది
    తేజరిల్లు!—1993
  • నేను కూడా సహాయం చేయగలను అని ఇప్పుడు నాకనిపిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 9/8 పేజీలు 20-22

‘నత్తివారి నాలుక కూడా మాట్లాడును’

అది జెకోస్లోవేకియాలో (ఇప్పుడు జెక్‌ రిపబ్లిక్‌) యెహోవాసాక్షుల ప్రత్యేక సమావేశ దినంలో మధ్యాహ్నం తరువాతి భాగం, మరి బైబిలు ఉపదేశాన్ని పొందేందుకు వందలాది మంది సమావేశమయ్యారు. నేను స్టేజీ వెనుక నిలబడి నా భాగాన్ని పునఃసమీక్షిస్తున్నాను. నేను నిర్వహించవలసినది అంత పెద్ద భాగమేమీ కాదు. ఇద్దరు యౌవనస్థులైన సాక్షులు తమ అనుభవాలను చెబుతారు, నేను ఆ భాగానికి అధ్యక్షునిగా సహాయపడాలంతే. ఆ ఉదయం లోలోపల నాకు ఎంతో ఒత్తిడి కలిగింది, అది ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. నేను అక్షరాల నిస్త్రాణుడనయ్యాను, చాలా కృంగిపోయాను, మరి మాట్లాడలేకపోయాను.

అలాంటి పరిస్థితిలో దాదాపు అందరికి భయంగానే అనిపిస్తుందని మీరనుకుంటుండవచ్చు. కాని ఇది భయంకన్నా మించినదే. నేను వివరిస్తానుండండి.

నామాట సమస్య

12 ఏండ్ల వయస్సులో నేను క్రింద పడినప్పుడు నా తలకు మెడకు వెన్నెముకకు దెబ్బ తగిలింది. దాని తర్వాత, నేను అప్పుడప్పుడు నత్తిగా మాట్లాడేవాడిని లేదా పదాలను రూపొందించుకోవడం కష్టంగా ఉండేది, ముఖ్యంగా p, k, t, d మరియు m అనే అక్షరాలతో మొదలయ్యే పదాలను పలకడం కష్టంగా ఉండేది. కొన్నిసార్లు నేను అసలు మాట్లాడలేకపోయేవాడిని.

ఆ సమయంలో ఆ సమస్య నన్ను అంతగా బాధించలేదు; అది కేవలం ఒక అసౌకర్యంగా కనిపించేది. కాని సంవత్సరాలు గడిచిన కొలది, ఏ విధంగా అయిన సరే బహిరంగంగా మాట్లాడేందుకు నేను ఎక్కువ భయపడ్డాను. ఒకసారి పాఠశాలలో నివేదికను అందజేస్తున్నప్పుడు నేను అధైర్యపడ్డాను. మరి కొన్నిసార్లు నేను షాపింగ్‌ చేసేటప్పుడు, నాకు ఏమి కావాలి అని గుమస్తాలు అడిగినప్పుడు నేను వారికి జవాబు చెప్పలేకపోయేవాడిని. నేను మాట్లాడ్డానికి ప్రయాసపడుతుండగా “త్వరగా కానివ్వు. రోజంతా ఆగలేను. మిగిలిన వినియోగదారులు వేచి ఉన్నారు” అని వారు మరి ఎక్కువ కోపగించుకునేవారు. దాని ఫలితంగా, నేను నాకు అవసరమైన వస్తువులను కొనుక్కోలేకపోయేవాడ్ని.

నా పాఠశాల సంవత్సరాలు చాలా క్లిష్టమైనవిగా ఉండేవి. మాకు మౌఖిక నివేదికలు ఉన్నప్పుడు, తోటి పాఠశాల విద్యార్థులు నా నత్తిపై హాస్యాలాడేవారు. అయినప్పటికీ నేను ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేసి, 1979లో జెకోస్లోవేకియాలోని ప్రాగ్‌నందలి విశ్వవిద్యాలయంలో పఠించేందుకు వెళ్ళాను. నేను క్రీడల్లో చాలా ఆనందిస్తాను కనుక, నేను డ్రిల్‌ మాస్టర్‌ కోర్సును చేపట్టాను. కాని నా లక్ష్యాన్ని నేనెలా సాధించగలను? సందేహాలున్నప్పటికీ నేను ముందుకు సాగాను.

సహాయాన్ని అన్వేషించడం

నా మాట మాంద్యాన్ని పోగొట్టుకునేందుకు ఒక దారి ఉండాలి. కనుక విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడనైన తరువాత, నేను ప్రొఫెసనల్ల సహాయాన్ని పొందాలని నిశ్చయించుకున్నాను. మాట్లాడే సమస్యలకు చికిత్సనివ్వడంలో నిపుణులైన ప్రాగ్‌లోని ఒక క్లినిక్‌ను ఎంపిక చేసుకున్నాను. మొదట సంప్రదించినప్పుడు, ఒక నర్సు అకస్మాత్తుగా, “నీ నరాల రుగ్మత అసాధారణంగా ఉందే!” అన్నది. నత్తి అనేది నరాల వ్యాధి కాదని నిపుణులు ఒప్పుకుంటున్నప్పటికీ నేను నరాల వ్యాధి గలవాడినని ఆమె ఎంచిందన్న తలంపు నన్ను గాయపరచింది. నేను మాత్రమే 24 ఏండ్ల యువకుడను, మిగిలిన రోగులందరూ పిల్లలేనన్న మరో అతుల్య సవాలును ఎదుర్కొన్నానని గ్రహించేందుకు నాకు ఎంతో సమయం పట్టలేదు.

త్వరలోనే మనస్తత్త్వశాస్త్రజ్ఞునితో సహా సిబ్బంది అంతా నాకు సహాయపడడంలో నిమగ్నమయ్యారు. వారు ప్రతిదీ ప్రయత్నించారు. ఒకసారి, నేను ఐదు వారాల వరకు ఎవరితోనైనా మాట్లాడడాన్ని వారు నిషేధించారు. మరోసారి, చా. . .లా నెమ్మదిగా ఒకే స్వరంలో మాత్రమే మాట్లాడడానికి నన్ను అనుమతించారు. ఆ పద్ధతి నాకు సహాయపడింది, అలాగే అది నాకు పాములవాడు అనే పేరు తెచ్చిపెట్టింది, ఎందుకంటే నేను నివేదికలను తెలియజేస్తున్నప్పుడు చెబుతున్నప్పుడు చాలామంది నిద్రలోకి జారుకునేవారు.

యెహోవాసాక్షులను కలవడం

1984 వేసవిలో ఒకరోజున, నేను నగర శివార్లలో నడుస్తుండగా, ఇద్దరు యువకులు నా దగ్గరకు వచ్చారు. వారి బాహ్యరూపం కాదు గాని వాళ్ళు చెప్పిన విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది. దేవునికి ఒక ప్రభుత్వం ఉందని, అంటే మానవజాతి సమస్యలన్నింటిని అంతం చేసే ఒక రాజ్యం ఉందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు నాకు తమ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చారు, తర్వాత నేను వారికి ఫోన్‌ చేశాను.

ఆ సమయంలో జెకోస్లోవేకియాలో యెహోవాసాక్షులు చట్టబద్ధమైన మత సంస్థగా గుర్తించబడలేదు. అయినప్పటికీ, కొద్దికాలంలోనే నాకు ఆసక్తి ఎంతెక్కువ అయ్యిందంటే, నేను వారి కూటాలకు హాజరవ్వడం మొదలెట్టాను. సాక్షులకు ఒకరియెడల ఒకరికి గల ప్రేమను శ్రద్ధను గ్రహించగలిగాను.

నమ్మకానికి మార్గం

యెహోవాసాక్షుల ప్రతి సంఘంలో ప్రతివారం నిర్వహించబడే పాఠశాల, అంటే దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పేరట నా మాట మాంద్యానికి సహాయం లభించింది. నేను ఆ జాబితాలో చేరాలని కోరడం జరిగింది, నేను చేరాను. పాఠశాల యొక్క ఒక పాఠ్యపుస్తకమైన దైవపరిపాలనా పరిచర్య నిర్దేశక పుస్తకముa (ఆంగ్లం)లో ఇవ్వబడిన కొన్ని సూచనల ఆధారంగా, నేను ధారాళత్వం, సరియైన ఉచ్చారణ, భావాన్ని నొక్కిచెప్పడం, స్వరభేదం అనే ప్రసంగ లక్షణాలపై కృషి చేశాను.

నా మొదటి విద్యార్థి ప్రసంగమైన బైబిలు చదవడం విఫలమయ్యింది. నాకు భలే వణుకు పుట్టింది, చాలా కష్టంగా ఇంటికి చేరుకున్నాను. షవర్‌తో వేడి నీళ్ళు పోసుకోవడం వలన కలిగిన ఊరటకు నేనెంత కృతజ్ఞుడనో!

ఆ మొదటి ప్రసంగం తరువాత, పాఠశాల అధ్యక్షుడు దయాపూర్వకంగా నా ఎడల వ్యక్తిగత శ్రద్ధ చూపించాడు. ఆయన నాకు నిర్మాణాత్మక ఉపదేశాన్ని ఇవ్వడమే కాక, నన్ను మెచ్చుకున్నాడు కూడా. నేను నా ప్రయత్నాన్ని కొనసాగించేందుకు అది నాకు ధైర్యాన్నిచ్చింది. దాని తర్వాత త్వరలోనే, అంటే 1987లో నేను బాప్తిస్మం పొందిన సాక్షినయ్యాను. కొన్ని నెలల తర్వాత, నేను ప్రాగ్‌నుండి చాలా చిన్న పట్టణమైన స్డార్‌ నాడ్‌ సాజావోకు తరలి వెళ్ళాను. స్థానిక సాక్షుల చిన్న గుంపు నాకు ఆప్యాయంగా స్వాగతమిచ్చింది. అప్పటికీ నత్తినత్తిగా ఉండే నా మాటలను వారు అంగీకరించారు, అది నా స్వగౌరవాన్ని అధికం చేసింది.

తుదకు, నేను చిన్న బైబిలు పఠన గుంపును నిర్వహించనారంభించాను, తర్వాత నా మొదటి బహిరంగ బైబిలు ప్రసంగాన్ని ఇచ్చాను. చివరికి, జెకోస్లోవేకియాలోని ప్రభుత్వంలో మార్పు వచ్చిన తరువాత, నేను అలాంటి ప్రసంగాలను పొరుగు సంఘాల్లోను ఇవ్వనారంభించాను. అపరిచిత పరిసరాల్లో నా మాట మాంద్యం తిరిగి వచ్చింది. కాని నేను ఆపలేదు.

ప్రత్యేక సవాళ్ళను ఎదుర్కోవడం

ఒకరోజు ఒక క్రైస్తవ పెద్ద తన ఉద్యోగ స్థలానికి నన్ను ఆహ్వానించాడు. “పీటర్‌ నేను నీకొక మంచి వార్త చెప్పనా! రానున్న ప్రాంతీయ సమావేశంలో మీరు భాగం వహించాలని మేము ఇష్టపడుతున్నాము” అని ఆయన అన్నాడు. నాకు స్పృహ తప్పినట్లు అనిపించి, కూర్చోవలసి వచ్చింది. నేను ఆ ప్రతిపాదనను నిరాకరించి నా స్నేహితునికి నిరాశ కలిగించాను.

ఆ నిరాకరణ మళ్ళీ మళ్ళీ నాకు గుర్తుకొచ్చేది. నేను దానిని నా మనస్సు నుండి పారద్రోలలేకపోయాను. దేవునియందు నమ్మకముంచడాన్ని గురించి క్రైస్తవ కూటాల్లో పేర్కొనబడినప్పుడెల్లా నేను మళ్ళీ బాధతో ఆ నిరాకరణను గుర్తుచేసుకునేవాడిని. దేవుని నడిపింపుతో గిద్యోను మిద్యాను సైన్యాన్నింతటిని 300 మంది పురుషులతో ఎదుర్కున్న విషయం కొన్నిసార్లు కూటాల్లో సూచించబడేది. (న్యాయాధిపతులు 7:1-25) ఇదిగో తన దేవుడైన యెహోవాయందు నిజంగా నమ్మకముంచిన ఒక వ్యక్తి! నేను ఆ నియామకాన్ని నిరాకరించినప్పుడు నేను గిద్యోను మాదిరిని అనుసరించానా? నిజాయితీగా చెబితే నేను అలా చేశానని చెప్పలేను. నేను సిగ్గుపడ్డాను.

అయితే, క్రైస్తవ సహోదరులు నన్నలా వదిలిపెట్టడానికి నిరాకరించారు. వారు నాకు మరో అవకాశాన్ని ప్రతిపాదించారు. ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమంలో భాగం వహించేందుకు నేను ఆహ్వానించబడ్డానన్నమాట. నాకు ఈసారి నేను ఒప్పుకున్నాను. నాకు ఆ ఆధిక్యత లభించినందుకు నేను కృతజ్ఞుడను, నిర్మొహమాటంగా చెప్పాలంటే, హాలు నిండా ఉన్న ప్రజలతో మాట్లాడడం అనే తలంపు నన్ను స్థాణువుగా చేసింది. యెహోవాయందు నా నమ్మకాన్ని అధికం చేసుకునేందుకు నేను నిజంగా కృషి చేయవలసి ఉంది. కాని ఎలా?

మిగిలిన సాక్షులకు ఆయనయందు గల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిశితంగా పరిశీలించడం ద్వారా. ఇలా చేయడం నన్ను బలపరచింది. ఒక స్నేహితుని కూతురైన ఆరేండ్ల వేరుంగక వ్రాసిన ఉత్తరం కూడా నాకొక చక్కని మాదిరిగా పని చేసింది. “సెప్టెంబరులో నేను పాఠశాలకు వెళ్తున్నాను. జాతీయ గీతం విషయం ఎలాగో ఏమో నాకు తెలియదు. యెహోవా ఇశ్రాయేలు కోసం పోరాడినట్లు నా కోసం కూడా పోరాడుతాడని నేను నమ్ముతున్నాను” అని ఆమె వ్రాసింది.

అవును, మొదట నేను చెప్పిన ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమంలో మధ్యాహ్న భాగానికి నడిపిన సంఘటనల్లో ఇవి కొన్ని మాత్రమే. నేను ఎడతెగక ప్రార్థించాను. నేను ఇంత ఎక్కువ మంది ప్రేక్షకుల ముందు దేవుని గొప్ప నామాన్ని స్తుతించబోతుండగా, అనర్గళంగా మాట్లాడడాన్ని గూర్చి ఇప్పుడు నేను అంతగా చింతించడం లేదు.

కనుక నేను అక్కడ, నా ముందు మైక్రోఫోన్‌తో వందలాది మంది ప్రజల ఎదుట నేను నిలబడ్డాను. సందేశాన్ని తెలిపేవానికన్నా సందేశమే మరింత ముఖ్యమని గ్రహిస్తూ నేను గుండెనిండా గాలిపీల్చుకుని మొదలుపెట్టాను. తర్వాత, నేను విషయాలను తూచి చూసేందుకు సమయం లభించింది. నేను భయపడ్డానా? కచ్చితంగా, కొన్నిసార్లు నత్తినత్తిగా మాట్లాడాను కూడా. అయినప్పటికీ, దేవుని మద్దతు లేకపోతే నేను మాట్లాడగలిగి ఉండేవాడినేకాను అని నాకు తెలుసు.

“నీకు నత్తి సమస్య ఉన్నందుకు సంతోషించు” అని ఒకసారి ఒక క్రైస్తవ సహోదరుడు చెప్పిన విషయంపై నేను కొంత ధ్యానమివ్వనారంభించాను. ఆయన ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. ఆయన ఆ మాట ఎలా అనగల్గాడు? వెనుకకు తిరిగి చూస్తే నాకిప్పుడు ఆయన మాటల భావం అర్థం అయ్యింది. ఈ మాట మాంద్యం నేను నాపై కాక దేవునిని ఆశ్రయించేందుకు నాకు తోడ్పడింది.

ఆ ప్రత్యేక సమావేశ దినం మధ్యాహ్నం గడిచి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సంవత్సరాల్లో ప్రేక్షకుల పెద్ద గుంపు ముందు మాట్లాడడం ఇమిడి ఉన్న ఇతర ఆధిక్యతలు నాకు లభించాయి. స్డార్‌ నాడ్‌ సాజావోలో నేను క్రైస్తవ పెద్దగా, పూర్తికాల సేవకులైన యెహోవాసాక్షులు పిలువబడుతున్నట్లు పయినీరుగా నియమించబడ్డాను. ఊహించండి! నేను అప్పట్లో ప్రతినెల వందకన్నా ఎక్కువ గంటలు ఇతరులతో దేవుని రాజ్యాన్ని గూర్చి మాట్లాడేందుకు వెచ్చించేవాడిని, మన క్రైస్తవ కూటాల్లో బోధించేందుకు ప్రతి వారం నేను వెచ్చించే సమయాన్ని గూర్చి ఇక చెప్పనక్కరలేదు. నేను ఇప్పుడు ప్రతివారం వేర్వేరు సంఘాలకు ప్రసంగాలనిస్తూ ప్రాంతీయ కాపరిగా పనిచేస్తున్నాను.

బైబిలులోని యెషయా గ్రంథంలో “నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును” అనే ఈ ప్రత్యేక ప్రవచనాన్ని చదివినప్పుడెల్లా మెప్పుదలతో నా హృదయమెంతో ఉప్పొంగుతుంది. (యెషయా 32:4; నిర్గమకాండము 4:12) యెహోవా తన ఘనత, స్తుతి, మహిమల కొరకు ‘స్పష్టముగా మాట్లాడేందుకు’ నాకు సహాయపడుతూ నాతో ఉన్నాడని నిజంగా నిరూపించాడు. అత్యంత కరుణామయుడైన మన దేవున్ని స్తుతించగలుగుతున్నందుకు నాకు చాలా తృప్తిగాను సంతోషంగాను ఉంది.—పీటర్‌ కూన్స్‌ చెప్పినది.

[అధస్సూచి]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి