బైబిలు ఉద్దేశము
మీరు మృతులకు భయపడాలా?
చనిపోయినవారి విషయం ఎత్తితే చాలా మంది దాని గురించి మళ్ళీ మాట్లాడకుండా జారుకుంటారు. అయితే, కొందరికి ఆ విషయం ఇబ్బందిగా అనిపించడమే కాదు; వారికి భయం పట్టుకుంటుంది కూడా. కనుక చనిపోయిన వారికి భయపడడం వల్ల చేసే ఆచారాలను ఆచార కర్మలను కనుగొనడం అసాధారణమేమీ కాదు. ఉదాహరణకు, ఆఫ్రికాలోని సబ్-సహారాలో కనబడే ఆచారాలను పరికించుదాం.
పశ్చిమ ఆఫ్రికాలోని ఒక నగరంలోని ఒక స్త్రీ తన కుటుంబంలోని ఒకరు చనిపోయిన తర్వాత ఏమి జరిగిందో స్పష్టంగా గుర్తు చేసుకుంటుంది. “ఒక బంధువు చనిపోయిన వ్యక్తి కొరకు ఒక ప్లేటు భోజనం క్రమంగా తయారు చేసి, దానిని అతని పడక గదిలో జాగ్రత్తగా పెట్టేది. ఆమె అక్కడ చుట్టుప్రక్కల లేనప్పుడు నేను వెళ్ళి భోంచేసేదాన్ని. ఆ బంధువు తిరిగి వచ్చి, ఎంతో సంతోషించేది! చనిపోయిన వ్యక్తి ఆ పసందైన ఆహారాన్ని భుజించాడు అని ఆమె నమ్మింది. నేను రోగినయ్యే వరకు కొంత కాలం ఇదిలాగే కొనసాగింది. నా ఆకలి చచ్చిపోయింది, నేను ఏ ఆహారమూ భుజించలేకపోయాను. ఇది నాకు నిజంగా భలే భయం కలిగించింది! మా బంధువులు చాలా మంది నేను జబ్బుపడింది చనిపోయిన మా బంధువు వల్లనేనన్న అభిప్రాయానికి వచ్చారు. మా కుటుంబంలో ఎవరో ఒకరి మీద ఆయన కోపంగా ఉన్నాడేమో అని వాళ్ళు అనుకున్నారు” అని ఆమె వివరిస్తుంది.
అదే నగరంలో, ఒక కుటుంబంలో కవల పిల్లలు ఉండి, ఒకరు చనిపోతే, ఇంట్లో ఎవరూ కూడా చనిపోయిన వ్యక్తిని గూర్చి మాట్లాడకపోవచ్చు. కవల పిల్లల్లో చనిపోయిన వ్యక్తిని గూర్చి ఎవరైనా అడిగితే, “ఆయన లేక ఆమె ఉప్పు కొనడానికి వెళ్ళారు” అని ఆచారం ప్రకారం కుటుంబంలోనివారు చెబుతారు. నిజం చెబితే బ్రతికి ఉన్న బిడ్డ ప్రాణం తీసుకోబడుతుందని వారు గట్టిగా నమ్ముతారు.
తరువాత, ఈ దృశ్యాన్ని ఊహించుకోండి: ముగ్గురు భార్యలున్న ఒక వ్యక్తి చనిపోయాడు. శవసంస్కారం జరిగిన మరుసటి రోజు భార్యల కోసం ప్రత్యేకంగా తెల్లని వస్త్రాలు కుట్టించబడ్డాయి. అదే సమయం, కొయ్యతోను తడికతోను చేసిన ఒక ప్రత్యేక గది నిర్మించబడింది, ఈ స్త్రీలు అందులో స్నానం చేసి, తెల్లని దుస్తులు వేసుకుంటారు. వారు, వారికి సహాయం చేసేందుకు నియమించబడిన స్త్రీ తప్ప ఎవరూ అందులోకి ప్రవేశించకూడదు. ఆ స్త్రీలు ఈ ప్రత్యేక స్నానాల గది నుండి బయటికి వచ్చిన తర్వాత, ముఖంపై ముసుగు వేసుకుంటారు. ఆ స్త్రీలు “రక్షణ” కొరకు సెబె అనే తాడు నెక్లేసు కూడా పెట్టుకుంటారు. ఆచారకర్మతో సంబంధం గల ఈ స్నానం ప్రతి శుక్రవారం మరియు సోమవారం 100 రోజుల వరకు జరుగుతుంది. ఈ సమయంలో వారు ఏ పురుషుడి నుండి నేరుగా ఏమి తీసుకోలేరు. ఏ పురుషుడైనా వారికి ఏమైనా ఇవ్వాలనుకుంటే, అతడు మొదట దానిని నేలపైన లేదా బల్లపైన ఉంచాలి. తర్వాత ఆ స్త్రీ దానిని అక్కడి నుండి తీసుకుంటుంది. ఎవరూ ఈ స్త్రీల పడకపై కూర్చోవడమో పడుకోవడమో చేయడానికి అనుమతించబడరు. వారు ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడెల్లా, వారిలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక కర్రను తప్పక పట్టుకు వెళ్ళాలి. ఈ కర్ర దగ్గర ఉంటే చనిపోయిన తమ భర్త తమపై దాడిచేయడాన్ని అది నివారిస్తుందని వారు అనుకుంటారు. పై ఉపదేశాలు అనుసరించనట్లైతే, మరణించిన తమ భర్త క్రోధంగలవాడై తమకు హాని చేస్తాడని వారు భావిస్తారు.
ఈ భూభాగంలో అలాంటి అనుభవాలు సర్వసాధారణం. అయినప్పటికీ, ఇలాంటి ఆచారాలు కేవలం ఆఫ్రికాకే పరిమితం కాదు.
చనిపోయినవారిని గూర్చి అంతటా ఉన్న భయం
చనిపోయిన తమ పూర్వికులను అనేక జాతుల ప్రజలు ఎలా దృష్టిస్తారు అనేదానిని గూర్చి, “చనిపోయిన బంధువులు . . . శక్తిమంతులైన ఆత్మ జీవులుగా మారుతారని లేదా, చాలా అరుదుగా దేవుళ్ళ స్థానాన్ని చేరుకుంటారని నమ్మబడుతుంది. [ఈ తలంపు] పూర్వికులు జీవిస్తున్న తమ బంధువుల విషయాల్లో ఇప్పటికీ శ్రద్ధ కలిగివుంటున్న సమాజంలోని చురుకైన సభ్యులు అనే నమ్మకంపై ఆధారపడి ఉంది. అది పశ్చిమాఫ్రికా సమాజాల్లో . . . , పోలినేషియా మరియు మెలనేషియావారిలో (డోబూ మరియు మానుస్), చాలా మంది ఇండో యూరోపియన్ ప్రజల్లోను (ప్రాచీన స్కాండినావ్యన్‌లు మరియు జర్మనీ దేశస్థుల్లోను), మరి ముఖ్యంగా చైనా మరియు జపాన్‌లలోను చాలా విస్తృతంగా ఉన్నట్లు నమోదు చేయబడింది. సాధారణంగా, పూర్వికులు ఎంతో అధికారాన్ని చెలాయిస్తారని, సంఘటనలు కలిగేందుకు ప్రభావితం చేసే లేక జీవిస్తున్న తమ బంధువుల క్షేమాన్ని అదుపు చేసే ప్రత్యేక శక్తులు వారికి ఉంటాయని నమ్మబడుతుంది. కుటుంబ కాపుదల అనేది వారి ముఖ్య చింత అయి ఉంటుంది. వారు ఉన్నతుడైన దేవునికి లేదా దేవుళ్ళకు, ప్రజలకు మధ్య మధ్యవర్తులని జీవిస్తున్నవారితో కలల ద్వారా మరియు మానసిక నియంత్రణ ద్వారా సంభాషణ కొనసాగిస్తారని తలంచబడుతుంది. వారి ఎడల గల దృక్పథం భయం మరియు గౌరవం కలగలిసి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే, పూర్వికులు వ్యాధులను లేదా మరితర కష్టాలను కలిగించవచ్చు. సమాధానపడడం, విజ్ఞాపనము, ప్రార్థన మరియు బలి అనే విభిన్న మార్గాల ద్వారా జీవిస్తున్నవారు తమ పూర్వికులతో మాట్లాడగలరు” అని ఎన్‌కార్టా అనే ఒక విజ్ఞాన సర్వస్వం చెబుతుంది.
నిజానికి, చనిపోయినవానిని గూర్చిన భయం వల్ల కుటుంబ ఆదాయం తరిగిపోగలదు. ఆహార పానీయాలు, బలియర్పణ కొరకు సజీవమైన జంతువులు, ఖరీదైన ఆడంబరాలు అవసరమయ్యే పెద్ద ఆచారకర్మలను నిర్వహించాలని చనిపోయినవారికి భయపడాలని గట్టిగా నమ్మేవారు తరచూ కోరతారు.
కాని, చనిపోయిన బంధువులు లేదా పూర్వికులు నిజానికి భయాన్ని, గౌరవాన్ని కోరే స్థితిలో ఉన్నారా? దేవుని వాక్యమైన బైబిలు ఏమి చెబుతుంది?
చనిపోయిన వ్యక్తి మీకు హాని చేయగలడా?
అలాంటి నమ్మకాలను బైబిలు గుర్తిస్తుంది అని తెలుసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు. ద్వితీయోపదేశకాండము అనే పుస్తకంలో, మృతులను గూర్చిన భయంతో సంబంధం గల ఆచారాలు పేర్కొనబడ్డాయి. అదిలా చెబుతుంది: “మాంత్రికునినైనను, ఇంద్రజాలికునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు.”—ద్వితీయోపదేశకాండము 18:10-12, (ఇటాలిక్కులు మావి).
యెహోవా దేవుడు అలాంటి ఆచారకర్మలను ఖండించాడు అని గమనించండి. ఎందుకని? ఎందుకంటే అవి అబద్ధం ఆధారితమైనవి. చనిపోయినవారికి సంబంధించిన అతి పెద్ద అబద్ధమేమిటంటే ప్రాణము జీవిస్తూనే ఉంటుందన్నదే. ఉదాహరణకు, ది స్ట్రెయిట్ పాత్ అనే పత్రిక చనిపోయినవారికి ఏమి సంభవిస్తుంది అనే దానిని గూర్చి ఇలా చెబుతుంది: “మరణమంటే ప్రాణము వెడలిపోవడం తప్ప మరేమీ కాదు. . . . సమాధి అంటే ప్రాణాన్ని కాదు గాని శరీరాన్ని మాత్రం దాచి ఉంచే స్థలం.”
బైబిలు దానిని ఒప్పుకోదు. మీ కొరకు మీరే యెహెజ్కేలు 18:4 చదువుకోండి: “చూడుడి, అన్ని ప్రాణములు నావే; తండ్రి ప్రాణము అలాగే కుమారుని ప్రాణము నాదే: పాపం చేసే ప్రాణము చనిపోతుంది.” (కింగ్ జేమ్స్ వర్షన్) అలాగే, చనిపోయినవారి పరిస్థితిని గూర్చి, “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు” అని దేవుని వాక్యంలో ప్రసంగి 9:5లో స్పష్టం చేయబడింది. చనిపోయినవారి కొరకు పెట్టిన ఆహారం జీవిస్తున్న ఒకరు తినకపోతే అది ఎందుకు భుజించబడదో ఇది వివరిస్తుంది.
అయినప్పటికీ, సమాధిలో ఉన్నవారిని గూర్చి నిరీక్షణ రహితులుగా మనలను బైబిలు వదిలిపెట్టడం లేదు. వారు మళ్ళీ జీవించగలరు! బైబిలు “పునరుత్థానము” గురించి మాట్లాడుతుంది. (యోహాను 5:28, 29; 11:25; అపొస్తలుల కార్యములు 24:15) ఇది దేవుని సముచితమైన సమయంలో సంభవిస్తుంది. అంతవరకు, చనిపోయినవారు తమను ‘మేల్కొల్పే’ దేవుని సమయం వరకు స్పృహలేకుండా సమాధుల్లో ‘నిద్రిస్తూ’ ఉంటారు.—యోహాను 11:11-14; కీర్తన 13:3.
ప్రజలు సాధారణంగా తెలియనివారికి భయపడతారు. కచ్చితమైన జ్ఞానం ఆధారరహిత మూఢనమ్మకాల నుండి ఒక వ్యక్తిని స్వతంత్రుడినిగా చేయగలదు. సమాధిలో ఉండేవారి పరిస్థితిని గూర్చిన సత్యాన్ని బైబిలు మనకిస్తుంది. టూకీగా చెబితే మీరు చనిపోయినవారికి భయపడనవసరం లేదు!—యోహాను 8:32.