బైబిలు ఉద్దేశము
కార్నివల్ వేడుకలు—తప్పా ఒప్పా?
“మీరు అసలు ఆపలేరు సుమా. ఆ సంగీతం మీరు కుర్చీలోంచి గబాలున లేచేలా, మీ కాళ్లు కదిలేలా, ఉత్సాహంతో మీ తల ఊగేలా చేస్తుంది అంటే మీకూ కార్నివల్ (ఉపవాస కాలానికి ముందు జరిగే వేడుక) జ్వరం అంటుకుందన్నమాట” అని మైకెల్ అంటున్నాడు. వాస్తవానికి, ప్రతి సంవత్సరమూ ఈ కార్నివల్ ప్రపంచమంతటా ఉన్న కోట్లకొలది మంది గుండెలు మరింత వేగంగా కొట్టుకునేలా చేస్తోంది. అయితే, మైకెల్ నివసించే బ్రెజిల్ ప్రాంత వాసులకు ఉన్నంత పిచ్చి మరెక్కడా లేదు. ఆష్ వెడ్నస్‌డేకు ఒక వారం ముందు, బ్రెజిల్‌వారు తమ ఘనమైన దుస్తులను ధరించి, తమ విధులనూ పనులనూ మరచి, అమెజాన్ అడవులనుండి రియో డి జనీరియో సముద్ర తీరాలవరకు ఆ దేశాన్ని కుదిపేసే వినోదంలోకి దూకుతారు. అది పాటలు పాడే సమయం, సాంబా నృత్య సమయం, అన్నీ మరచే సమయం.
“అది అంత ప్రఖ్యాతినొందడానికి గల కారణాల్లో అది ఒకటి. ప్రజలు తమ బాధను మరిచిపోయేందుకు కార్నివల్ ఒక అవకాశాన్నిస్తుంది” అని అనేక సంవత్సరాలుగా కార్నివల్‌ను మానక జరుపుకుంటున్న మైకెల్ వివరిస్తున్నాడు. ప్రత్యేకంగా, సరిపడేన్ని నీళ్లు, విద్యుత్తు, ఉద్యోగాలు మరియు నిరీక్షణ లేకుండా జీవిస్తున్న కోట్లాదిమంది పేదలకు, మర్చిపోవాలకునే విషయాలు చాలా ఉన్నాయి. వారికి ఈ కార్నివల్ ఆస్ప్రిన్ మందు వంటిది: అది సమస్యలను తీసివేయదు కానీ కనీసం ఆ నొప్పిని తగ్గిస్తుంది. దానికి తోడు కొందరు కాథోలిక్కు మతనాయకులకు దీని విషయంలో ఓ దృక్పథం ఉంది; కార్నివల్ “ప్రజల మానసిక సమతుల్యానికి ఎంతో ఉపయుక్తం” అని ఓ బిషప్ అన్నాడు. కనుక కార్నివల్ ఎందుకు ఉపయోగకరమో మరియు అంగీకారయోగ్యమైన అన్యప్రవర్తనగా ఎందుకుందో వారు సులభంగా తెలుసుకోగలరు. అయితే కార్నివల్‌ను జరుపుకోవడం విషయంలో బైబిలు దృక్పథం ఏమిటి?
వేడుక చేసుకోవడమా లేక అల్లరి వినోదమా?
‘నవ్వుటకు సమయము కలదు; . . . నాట్యమాడుటకు సమయము కలదు’ అని దేవుని వాక్యం చెబుతోంది. (ప్రసంగి 3:4) “నవ్వుట” అనే హెబ్రీ పదం “వేడుక జరుపుకోవడం” అనే భావాన్ని కూడా ఇస్తుంది కనుక, మన సృష్టికర్త దృష్టిలో ఆరోగ్యదాయకమైన మంచి సమయాన్ని గడుపుకోవడంలో ఏ తప్పూ లేదు. (1 సముయేలు 18:6, 7 చూడండి.) వాస్తవానికి, మనం సంతోషంగా ఉండమని ఉల్లసించమని దేవుని వాక్యం చెబుతోంది. (ప్రసంగి 3:22; 9:7) కనుక సరైన రీతిలో వేడుక చేసుకోవడాన్ని బైబిలు అంగీకరిస్తుంది.
అయితే, బైబిలు అన్ని విధాల వేడుకలను అంగీకరించడం లేదు. అల్లరి లేక అసహ్యకరమైన వేడుకలు జరుపుకోవడం “శరీరకార్యముల”కు చెందినవని మరియు అల్లరి పనులు చేసేవారు “దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు” అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. (గలతీయులు 5:19-21) కనుక, ‘అల్లరితోకూడిన ఆటపాటలు . . . లేక . . . మర్యాదగా నడుచుకొందము’ అని పౌలు క్రైస్తవులను ఉద్బోధించాడు. (రోమీయులు 13:13) కనుక ఇప్పుడు ప్రశ్నేమిటంటే, కార్నివల్ దేనికి సంబంధించింది—ఏ తప్పులేని వేడుకలకు సంబంధించినదా లేక జుగుప్సాకరమైన అల్లరి వేడుకలకు సంబంధించినదా? దానికి జవాబుగా, అల్లరితోకూడిన ఆటపాటలను గూర్చి బైబిలు ఏమి చెబుతుందో మనం మొదట గమనిద్దాం.
“అల్లరితోకూడిన ఆటపాటలు” అన్న మాట లేక గ్రీకులో కోమోస్ అన్న మాట క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో మూడుసార్లు కనిపిస్తుంది, మరి అది ఎల్లప్పుడూ అననుకూల భావంలోనే కనిపిస్తుంది. (రోమీయులు 13:13; గలతీయులు 5:21; 1 పేతురు 4:3) మరి కొమోస్ గ్రీకు మాట్లాడే అనేకమంది తొలిక్రైస్తవులకు బాగా పరిచయమున్న ఏహ్యమైన వేడుకల నుండే వచ్చింది. అవి ఏవి?
చరిత్రకారుడు విల్ డ్యూరంట్ ఇలా వివరిస్తున్నాడు: “గ్రీకు పదమైన కొమోస్ లేక అల్లరితో కూడిన ఆటపాటలనే పదంలో పరిశుద్ధ శిశ్నాన్ని [పురుషాంగ చిహ్నాన్ని] పుచ్చుకుని, డియోనిసస్‌కు పాడే డిథిరాంబ్స్‌లు [మంత్రాలు] పాడుకుంటూ ఓ గుంపుగా ప్రజలు ఊరేగేవారు.” గ్రీకు పురాణ కథల్లోని ద్రాక్షారసానికి దేవుడైన డయోనిస్‌ను కొంతకాలం తర్వాత రోమన్లు దేవునిగా స్వీకరించిన తర్వాత, వారు అతన్ని బాకియస్ అనే పేరుతో పిలిచారు. అయినప్పటికీ, కొమోస్ సంబంధం దాని నామాన్ని మార్చినప్పటికీ కొనసాగింది. డా. జేమ్స్ మాక్నైట్ అనే బైబిలు విద్వాంసుడు ఇలా వ్రాస్తున్నాడు: ‘కొమోయిస్ [కొమోస్ బహువచనం] అనే మాట కొమస్ నుండి వస్తుంది, దాని భావం విందు మరియు అల్లరితో కూడిన ఆటపాటలకు దేవుడు. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు బక్కస్ గౌరవార్థం జరిగించబడేవి, ఈ కారణాన్నిబట్టి అతడు కాస్మాస్టస్ అనే నామకరణం చేయబడ్డాడు.’ అవును డయోనిసస్ మరియు బక్కస్‌లు అల్లరితో కూడిన వినోదానికి ప్రతీకలే. ఈ పండుగల్లో ఏమేమి జరిగేవి?
అల్లరితో కూడిన ఆటపాటలు దృశ్యీకరించబడడం
డ్యూరంట్ ప్రకారంగా, డియోనిసస్ గౌరవార్థంగా చేసే గ్రీకుల పండుగల సమయంలో, దాన్ని జరుపుకునే ప్రజల గుంపులు “అదుపు లేకుండా త్రాగేవారు, . . . త్రాగిన మైకంలో తుళ్లకుండావుండే వ్యక్తిని తెలివిమాలిన వానిగా చూసేవారు. వారు ఉన్మాదంతో ఊరేగింపుగా వెళ్లేవారు, . . . అంతేకాకుండ విశృంఖలముగా త్రాగుతూ నాట్యమాడుతూ తూలిపడిపోయేవారు.” అదే విధంగా, (బక్కానాలియా అని పిలువబడే) బక్కస్‌కు గౌరవార్థంగా చేసే రోమా పండుగలో త్రాగుడు మరియు జుగుప్సాకరమైన సంగీతం పాటలు అంతేకాకుండా “అత్యంత లజ్జాకరమైన ప్రవర్తన” ఉండేవని మాక్నైట్ వ్రాస్తున్నాడు. అలా ఈ గ్రీకు-రోమా అల్లరితో కూడిన ఆటపాటల్లో వెఱ్ఱెత్తిన గుంపులు, విపరీతంగా త్రాగడం, జుగుప్సాకరమైన సంగీత నృత్యాలు మరియు అనైతిక లైంగికతలు ముఖ్యమైన విషయాలయ్యాయి.
ఈ అల్లరితో కూడిన వినోదాన్నందించే క్రియలు నేటి కార్నివల్‌లో కూడా ఉన్నాయా? కార్నివల్ వేడుకలను గూర్చిన వార్తా నివేదికల్లో కొన్నింటిని పరిశీలించండి: “బొత్తిగా క్రమంలేని గుంపులు.” “నాలుగు రోజులు విచ్ఛలవిడిగా త్రాగి రాత్రంతా పార్టీ చేసుకోవడం.” “అల్లరితో కూడిన వినోదం చేసుకునే కొందరికి వదలని మైకం అనేక రోజులవరకూ ఉండవచ్చు.” “సమీపంలోని ఈ భీకరమైన శబ్దాలతో పోలిస్తే ‘హెవీ మెటల్’ గుంపుల శబ్దాలు చాలా తక్కువనిపిస్తాయి.” “సలింగ సంయోగులు లేని నేటి ఏ కార్నివల్ వేడుకైనా మిరియాలు లేని స్టీక్ ఓ ప్వావ్‌రేలా ఉంటుంది.” “కార్నివల్ పూర్తి దిగంబరత్వానికి మారుపేరైంది.” కార్నివల్ నాట్యాలలో “హస్తప్రయోగం, . . . వివిధ రకాలైన లైంగిక సంపర్క దృశ్యాలు” చోటుచేసుకున్నాయి.
వాస్తవానికి, నేటి కార్నివల్లకూ మరియు ఆ పురాతన విందులకూ మధ్య ఉన్న సామ్యం ఎంత స్పష్టంగా ఉందంటే అల్లరివాడును, వినోదాన్నందించే బాకస్, ఈ ఆధునిక కార్నివల్ పార్టీ సమయంలో తిరిగి లేస్తే దానికి సరిగ్గా సరిపోతాడు. అంతేకాక అది మనలను ఆశ్చర్యపర్చనవసరంలేదని బ్రెజిల్ దూరదర్శిని నిర్మాత క్లాడియో పెట్రాజిలియా వ్యాఖ్యానిస్తున్నాడు. ఎందుకంటే నేటి కార్నివల్ “డియోనిసస్ మరియు బాకియస్ విందులు నుండి పుట్టుకొచ్చాయి, మరి కార్నివల్ కూడా అలాంటిదే” అని ఆయన చెప్పాడు. పురాతన రోమాలోని అన్యమత సూర్యదేవత పండుగకు కార్నివల్ను జతచేయవచ్చని న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా పేర్కొంది. కనుక కార్నివల్, వేరేవారికి చెందిదదైనప్పటికీ, నిజానికది దాని మునుపటి కుటుంబానికి చెందినదే. మరి ఆ కుటుంబం పేరేమిటి? అల్లరితో కూడిన ఆటపాటలు.
నేడు ఈ జ్ఞానం క్రైస్తవులపై ఏ ప్రభావాన్ని చూపించాలి? గ్రీకుల ప్రభావానికి లోనై చిన్న ఆసియా ప్రాంతంలో నివసించిన తొలి క్రైస్తవులపై అది ఏ ప్రభావాన్ని చూపించిందో అదే ప్రభావాన్ని చూపిస్తుంది. క్రైస్తవులు కాకముందు వారు “పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు [కొమోస్], త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజల”లో పాల్గొన్నారు. (1 పేతురు 1:1; 4:3, 4) అయినప్పటికీ, అల్లరితో కూడిన ఆటపాటలను, “అంధకార క్రియలు”గా దేవుడు దృష్టిస్తున్నాడని వారు తెలుసుకున్న తర్వాత, కార్నివల్ వంటి వేడుకల్లో పాల్గొనడం మానుకున్నారు.—రోమీయులు 13:12-14.
ముందు ప్రస్తావించిన మైకెల్ అలాగే చేశాడు. అది ఎందుకో ఆయన వివరిస్తున్నాడు: “నా బైబిలు జ్ఞానం పెరుగుతున్న కొలది, కార్నివల్ వేడుకలూ మరియు బైబిలు సూత్రాలు నూనె నీళ్లు ఎన్నడూ కలవవని నేను కనుగొన్నాను” అని 1979లో మైకెల్ మనస్సు మార్చుకున్నాడు. మంచికొరకు అతను తన కార్నివల్ వేడుకలను విడిచి పెట్టాడు. మరి మీరు ఏ ఎంపికను చేసుకుంటారు?
[10వ పేజీలోని చిత్రం]
డియోనిసిస్‌ను చిత్రీకరిస్తున్న క్రీస్తు పూర్వపు పింగాణీ బొమ్మ (ఎడమ బొమ్మ)
[క్రెడిట్ లైను]
Courtesy of The British Museum