మీ టెలిఫోను మర్యాదలు ఎలా ఉన్నాయి?
“కుటుంబంలోని అనురాగం, ఆరోగ్యం, పనియెడల ప్రేమలతోపాటు ఆహ్లాదకరమైన జీవితానికి, మన స్వాభిమానాన్ని తిరిగి సంపాదించడానికీ, దాన్ని పెంచుకోవడానికి దయాపూర్వక సంభాషణ దోహదం చేసినంతగా దోహదపడేది ఏదైనా ఉందా?”
ఆ ప్రశ్నను అడగడంలో, ఇటీవలి రచయిత్రి లూసీ ఎలీయట్ కీలర్, తన సృష్టి సమయంలో మానవునికి ప్రేమపూర్వకంగా ఇవ్వబడిన సామర్థ్యమగు పరస్పర సంభాషణ నుండి పొందగలిగే వ్యక్తిగత ఆనందంపై, సంతుష్టిపై ఎంతో విలువను నిలుపుతుంది.—నిర్గమకాండము 4:11, 12.
గత 12 దశాబ్దాలుగా మానవ సంభాషణా ప్రవాహం ఎక్కువవ్వడానికి అత్యంత ఎక్కువగా దోహదపడినది అలెగ్జాండర్ గ్రహం బెల్ కనుగొన్న టెలిఫోను. నేడు, వందల కోట్ల భూ నివాసులకు, టెలిఫోన్‌ను వ్యాపారం నిమిత్తం ఉపయోగించినా లేక ఆహ్లాదం కొరకు ఉపయోగించినా, అది మానవుల మధ్య ఒక ప్రాముఖ్యమైన బంధాన్ని ఏర్పరుస్తుంది.
టెలిఫోను, మీరు
టెలిఫోను ఉపయోగం మీ జీవితపు శ్రేష్ఠతను ఎంతవరకు మెరుగుపరుస్తుంది? ఆ ప్రశ్నకు మీ జవాబు ఎక్కువగా ఆ ఉపకరణంపైన కన్నా అందులో ఇమిడి ఉన్న వ్యక్తులపైన ఆధారపడుతుందన్నది మీరు అంగీకరించరా? నిజానికి, మనం ఈ ప్రశ్నను అడగడం సమయోచితం, మీ టెలిఫోను మర్యాదలు ఎలా ఉన్నాయి?
మానసిక దృక్పథం, సంభాషణా నాణ్యత, వినే సామర్థ్యం వంటి విషయాలు టెలిఫోను మర్యాదలలో ఇమిడి ఉన్నాయి. టెలిఫోనును ఎలా ఉపయోగించాలనే విషయం, న్యూసెన్సు కాల్స్‌తో వ్యవహరించే విధానాలు కూడా టెలిఫోన్ మర్యాదలకు సంబంధించినవే.
ఇతరులను గూర్చిన ఆలోచనాపూర్వక పరిగణన
మానవ సంబంధమైన అన్ని ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో వలెనే, మంచి టెలిఫోను మర్యాదలు సహానుభూతి నుండి ఉత్పత్తి అవుతాయి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “కేవలం మీ స్వంత కార్యములనే గాక ఇతరుల కార్యములను చూచుకొనుడి.”—ఫిలిప్పీయులు 2:4, ద న్యూ ఇంగ్లీష్ బైబిల్.
“టెలిఫోను అమర్యాదలు అని చెప్పగలిగే అతి సామాన్య ఉదాహరణలుగా ఉండే వేటిని మీరు కనుగొన్నారు?” అని అడిగినప్పుడు అనుభవజ్ఞురాలైన ఒక టెలిఫోను స్విచ్‌బోర్డ్ ఆపరేటరు “అవతల ఉన్న వ్యక్తి ‘నేను రాణీని మాట్లాడుతున్నాను’ (మీకెంత మంది రాణీలు తెలుసు?) లేక, అంతకంటే ఘోరంగా ‘నేను మాట్లాడుతున్నాను,’ లేక ‘ఎవరో కనుక్కో చూద్దాం’ అని అనే వారు” తన లిస్టులో మొదట ఉన్నారని ప్రత్యుత్తరమిచ్చింది. అటువంటి ఆలోచనారహిత వ్యాఖ్యానాలు, బహుశ సదుద్దేశంతో చేసినవైనా సరే ఇబ్బందిని, అసహనాన్ని కలుగజేస్తాయి. ఆ ఆపరేటరు ఇలా కొనసాగించింది: “స్పష్టంగా మీరెవరో అవతలి వారికి తెలియజేయడమే కాకుండా పిలువబడిన వ్యక్తి ఎడల కొంత శ్రద్ధ కలిగివుండి ఒకవేళ మాట్లాడడానికది వీలైన సమయమో కాదో అడుగుతూ, ఎందుకు చక్కగా మొదలుపెట్టకూడదు?”
మీ ముఖ కవళికలు కనబడక పోయినా, మీ వైఖిరి స్పష్టంగా తెలుస్తుందని గుర్తుంచుకోండి. అదెలా? మీ కంఠస్వరం ద్వారా. అసహనం, విసుగు, కోపం, అలక్ష్యత, నిష్కపటత, ప్రసన్నత, సహాయ స్వభావం, ఆప్యాయత—అన్నీ బయల్పడతాయి. నిజమే, అంతరాయం కలిగినందుకు ఒకరు చిరాకు పడడం ఒక సహజ ప్రతిక్రియనే. మీరు జవాబిచ్చేటప్పుడు మంచి మర్యాద కొరకు, ఈ పరిస్థితిలో కొంచెం ఆగి “నవ్వు” మీ స్వరంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అనంగీకార స్వరంతో కాకుండానే మీరు అనంగీకారం వ్యక్తం చేయడం సాధ్యమే.
ఆలోచనాపూర్వక శ్రద్ధ, ఇంపైన కంఠస్వరాల కలయిక “వినువారికి మేలు” కలుగజేయగలదు, “అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన” మాటలకు తావివ్వగలదు.—ఎఫెసీయులు 4:29.
సంభాషణ లక్షణం
అవును, మనం ఉపయోగించే మాటల లక్షణం ప్రాముఖ్యం. మీరు ఈ క్రింది నియమాలతో ఏకీభవించి, వాటిని పాటిస్తారా? సహజంగా, చక్కగా, స్పష్టంగా మాట్లాడండి. గొణగవద్దు. అరవవద్దు—ఎక్కువ దూరంనుండి వచ్చిన కాల్ అయినా సరే. మీ మాటలను తడబడనివ్వవద్దు. పదాంశాలను పలకకుండా ఉండడం లేక దాటవేయడం చేయకండి; గందరగోళాన్ని కలుగజేసి, కోపాన్ని తెప్పించే “ఊతపదాలను” ఉపయోగించడం, అరిగిపోయిన రికార్డులా చెప్పిందే మరలా చెప్పడం చేయకండి. ఒకే పేలవంగా ఉండే స్వరంతో సంభాషించడం మానండి. సరైన విధంగా భావాన్ని నొక్కిచెప్పడం, స్వరభేదము సంభాషణను అర్థవంతంగా, వైవిధ్యభరితంగా, సేదదీర్చేవిగా చేస్తాయి. టెలిఫోను సంభాషణలో ఉన్నప్పుడు తినడము సంభాషణ లక్షణాన్ని మెరుగుపర్చదు లేక మంచి మర్యాదలను కనుపర్చదు.
పదాల ఎంపిక కూడా పరిగణించతగిందే. వివేచన అవసరము. వెంటనే అర్థమయ్యే మామూలు, సామాన్యమైన పదాలను ఉపయోగించండి. పదాల అర్థాలకు వివిధ రూపాలుంటాయి. అవి దయాపూర్వకంగా లేక క్రూరంగా, ఊరడింపుగా లేక కఠినంగా, ప్రోత్సాహకరంగా లేక మనస్సు విరిచేవిగా ఉండగలవు. ఒక వ్యక్తి చిరాకు పుట్టించకుండానే చమత్కారంగా ఉండగలడు, మొండిగా లేక మొరటుగా ఉండనక్కరలేకుండానే నిష్కపటంగా ఉండగలడు, కుటిలంగా ఉండనక్కరలేకుండానే యుక్తిగా ఉండవచ్చు. “దయచేసి,” “ధన్యవాదాలు” వంటి మర్యాదపూర్వకమైన మాటలు ఎప్పుడూ ఆదరణీయమైనవే. “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి” అని అపొస్తలుడైన పౌలు వ్రాసినప్పుడు దయాపూర్వకమైన, శ్రద్ధాపూర్వకమైన, రుచికరమైన మాటలు ఆయన మనస్సులో ఉన్నవి.—కొలొస్సయులు 4:6.
మంచి శ్రోతగా ఉండండి
మంచి సంభాషణా చతురునిగా ఉండేందుకు రహస్యమేమిటని తన తండ్రిని అడిగిన ఒక యౌవనస్థుని కథ ఒకటి ఉంది. “నా కుమారుడా, విను” అని అన్నాడు తండ్రి. “నేను వింటున్నాను” అని అన్నాడు కుమారుడు. “నాకింకా చెప్పు.” “చెప్పడానికి ఇంకేమీ లేదు” అని ప్రత్యుత్తరమిచ్చాడు తండ్రి. నిజానికి, ఆసక్తిగల, సహానుభూతిగల శ్రోతగా ఉండడం మంచి టెలిఫోను మర్యాదలకు కీలకమైన అంశమైయుంది.
ఒక సామాన్యమైన నియమాన్ని ఆచరించడంలో తప్పిపోవడం మీరు ఒక టెలిఫోను బోరుగా దృష్టించబడేలా పరిణమించగలదు. అదేమిటి? సంభాషణ అంతా మీరే చేయవద్దు. ఉదాహరణకు, మీరు ఇమిడివున్న అనవసరమైన సంభాషణ గురించి పూసగుచ్చి చెబుతున్నట్లుండే, అంతంలేని వివరణను ఇవ్వడంలో మునిగిపోకండి లేక చిన్నచిన్న బాధలు, ఆరోగ్య సమస్యలతో కూడిన వ్యక్తిగత చరిత్రతో కూడిన పొడవైన వివరణను ఇవ్వకండి. మరోసారి, అన్వయించుకోదగ్గ, సంక్షిప్తమైన బైబిలు నియమం, మనకీసారి శిష్యుడైన యాకోబు ఇస్తున్నాడు. “వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై యుండుడి.”—యాకోబు 1:19, జెరూసలేమ్ బైబిల్.
చివరి తలంపులు
ఈ టెలిఫోను మర్యాదల సందర్భంలోనే వచ్చే రెండు ఆఖరి ప్రశ్నలవైపు మన అవధానాన్ని త్రిప్పుదాం. టెలిఫోను ఉపయోగించే పద్ధతులను గూర్చి ఏమి చెప్పవచ్చు? అనవసరమైన కాల్లతో వ్యవహరించేందుకు సూచించబడిన మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా?
టెలిఫోనులో మాట్లాడుతున్నప్పుడు, లైనుకి అవతలివైపు స్వరం మధ్యమధ్య దూరమౌతున్నట్లు మీరు కనుగొన్నారా? దాదాపు రెండు సెంటీమీటర్లు దూరంలో పెట్టి మౌత్పీస్లోకి మాట్లాడాలన్నది ఇది మీకు గుర్తుకు తేవాలి. దానికి తోడు, బయటి శబ్దాలను అదుపు చేయడం మర్యాదకరంగా ఉంటుంది. మీరొక కాల్ చేసినప్పుడు, రాంగ్ నెంబరు రాకుండేలా జాగ్రత్తగా డయల్ చేయండి; మీరు మీ కాల్‌ను ముగించినప్పుడు, రిసీవర్‌ను క్రెడిల్పై సున్నితంగా పెట్టండి.
మీరెప్పుడైనా న్యూసెన్సు కాల్స్ బారినపడ్డారా? విషాదకరంగా, అటువంటివి ఎక్కువౌతున్నట్లు అనిపిస్తుంది. అసభ్యమైన, అనైతిక లేక, అశ్లీల భాషకు ఒకటే ప్రత్యుత్తరం—ఫోను పెట్టేయడం. (ఎఫెసీయులు 5:3, 4, పోల్చండి.) పిలిచిన వారు తమను తాము తెలియజేసుకోవడానికి నిరాకరించినప్పుడు కూడా అదే నిజమౌతుంది. ఒక కాల్ విషయంలో మీకు అనుమానంగా ఉంటే, హౌ టు రైట్ అండ్ స్పీక్ బెటర్ అనే ప్రచురణ, “ఒకవేళ ఒక అజ్ఞాత వ్యక్తి స్వరం, ‘ఎవరు మాట్లాడుతున్నారు?’ అని అడిగితే జవాబు చెప్పవద్దని,” మీ పథకాలను గురించి ఒక అపరిచితునితో చర్చించవద్దని మీకు సలహా ఇస్తుంది.
విశ్లేషణ చివరలో మంచి టెలిఫోను మర్యాదల కొరకు ఒక పొడవైన చిట్టా అక్కరలేదని తెలుసుకోవడం ఎంత బాగుంటుంది! ప్రజల మధ్య అన్ని వ్యవహారాలలో ప్రసన్నమైన, ప్రతిఫలదాయకమైన సంబంధాలు సాధారణంగా బంగారు సూత్రం అని పిలువబడుతున్న దానిని అన్వయించడం ద్వారా వస్తాయి. యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) మానవునికి వాక్శక్తిని బహుమానంగా ఇచ్చిన వ్యక్తిని ప్రీతిపర్చాలనే కోరిక కూడా క్రైస్తవులకు ఉంటుంది. కీర్తనల రచయిత ఇలా ప్రార్థించాడు: “యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.”—కీర్తన 19:14.