లైంగిక వేధింపు—మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోగలరు
“ప్రతి దినం తనకు లభించే లైంగిక ప్రతిపాదనలతో ఏ స్త్రీ కూడా పోరాడవలసిన అవసరం లేదని” పత్రికా సంపాదకురాలైన గ్రెట్చన్ మార్గన్సన్ అంటోంది, “అయితే అసభ్యమైన ప్రవర్తన లేని పూర్వకాల ఉద్యోగ వాతావరణం ఉండాలని ఒక స్త్రీ అపేక్షించడం కూడా సహేతుకం కాదు.” ఉద్యోగ స్థలాన్ని సురక్షితమైన స్థలంగా చేయాలని యజమానులు మరియు న్యాయస్థానం చేసిన ప్రయత్నాలు కొన్ని మంచి ఫలితాలను తెచ్చాయన్న విషయాన్ని మెచ్చుకోవలసిందే. ఉదాహరణకు, దావా వేయడం ద్వారా వచ్చే చిక్కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యజమానులు మరియు ఉద్యోగస్థులు ఉద్యోగ స్థలంలోని పర్యావరణాన్ని మెరుగుపరచుకోడానికి ప్రయత్నించేందుకు పురికొల్పింది. ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే వేధింపు చర్యలను ఎదుర్కునేందుకు అనేక కంపెనీలు అంతర్గత ప్రక్రియలను వృద్ధి చేశారు. ఉద్యోగ స్థలంలో కలిగి ఉండవలసిన సరైన ప్రవర్తనను గురించి ఉద్యోగస్థులకు శిక్షణ ఇచ్చేందుకు మీటింగులు మరియు సెమినార్లు జరుపబడుతున్నాయి.
నిజానికి, కంపెనీ పాలసీలను మరియు ప్రాంతీయ న్యాయవిధులను తెలుసుకుని, అనుసరించడమే జ్ఞానయుక్తం. (రోమీయులు 13:1; తీతు 2:9) బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం కూడా సహాయకరంగా ఉంటుందని క్రైస్తవులు కనుగొన్నారు. మీ తోటి ఉద్యోగస్థులతో వ్యవహరించేటప్పుడు ఈ ప్రేరేపిత నడిపింపు సూత్రాలను అనుసరించడం, మీరు లైంగిక వేధింపుకు బాధితులు లేదా ఆ నేరస్థులు కాకుండా నివారించడంలో సహాయం చేసేందుకు ఎంతో చేయగలదు.
పురుషులు కలిగి ఉండాల్సిన సరైన ప్రవర్తన
పురుషులు స్త్రీలతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని పరిశీలించండి. స్త్రీలను తగలకుండా జాగ్రత్తపడమని అనేకమంది నిపుణులు అంటున్నారు. స్నేహపూర్వకంగా వెన్ను తట్టడం కూడా సులభంగా అపార్థం చేసుకోవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. “తగలడాన్ని న్యాయనిర్ణేతలు గంభీరమైన విషయంగా పరిగణిస్తారు” అని శ్రామికుల న్యాయవాది ఫ్రాంక్ హార్టీ పేర్కొంటున్నాడు. ఆయనిచ్చే సలహా ఏంటి? “కరచాలనానికి మించి ఎక్కువేమీ చేయకండి.” ఈ విషయంలో అన్ని వేళలా అన్వయించబడగల నియమాన్ని బైబిలు కూడా అందించడం లేదన్నది నిజమే.a అయితే, ప్రస్తుత న్యాయపరమైన, నైతికపరమైన పర్యావరణం దృష్ట్యా—ప్రాముఖ్యంగా, తాము మాట్లాడేటప్పుడు తమకు తెలియకుండానే ఇతరులను తగిలే స్వభావంగల వారు—జాగ్రత్త వహించడం మంచిదే.
అలాంటి సలహాలను అనుసరించడం ఎల్లవేళలా సులభం కాదన్న విషయాన్ని ఒప్పుకోవలసిందే. ఉదాహరణకు, గ్లిన్ స్పెయిన్ సంస్కృతిగలవాడు. “మా సంస్కృతిలో ప్రజలు ఇతరులను కౌగిలించుకుంటారు, అయితే ఇక్కడ, అంటే అమెరికాలో అలా కాదు. మా కుటుంబంలో మేము తరచూ స్నేహితులకు ముద్దుపెట్టి ఆహ్వానిస్తాము, అయితే ఇక్కడ అలా త్వరపడి చేయవద్దని మాకు హెచ్చరించబడింది” అని ఆయన చెబుతున్నాడు. అయితే, ఈ విషయంలో బైబిలు సూత్రాలు సహాయకరంగా ఉంటాయని నిరూపించబడ్డాయి. అపొస్తలుడైన పౌలు యౌవన తిమోతికి ఇలా సలహా ఇచ్చాడు: “అన్నదమ్ములని యౌవనులను, తల్లులని వృద్ధస్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవనస్త్రీలను హెచ్చరించుము.” (1 తిమోతి 5:1, 2) అశ్లీలంగా, అవాంఛనీయంగా, కామాతురతతో తగలడాన్ని అది నిషేధించదా?
ఆ సూత్రాన్నే సంభాషణకు కూడా అన్వయించవచ్చు. అందుకే, సరైన రీతిలో బైబిలు ఇలా చెబుతుంది: “మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.” (ఎఫెసీయులు 5:3, 4) మీరు మాట్లాడే ముందు ఒక ప్రశ్నను గురించి పరిశీలించండి అని లైంగిక వేధింపు న్యాయవాది కాథీ సినాయ్ సలహా ఇస్తోంది: “అలాంటి పరిస్థితి మీ తల్లి, చెల్లి లేక కుమార్తెకు ఎదురవ్వాలని మీరు కోరుకుంటారా?” అసహ్యమైన ద్వందార్థపు మాటలు, మాట్లాడే వాళ్లనూ వినే వాళ్లనూ అవమానిస్తాయి.
వేధింపును నివారించడం
వేధింపుకు గురికాకుండా నివారించేందుకు ఒకరు ఎలా ప్రయత్నించగలరు? యేసు తన శిష్యులను వారి మొదటి ప్రకటనా నియామకానికి పంపే సమయంలో వారికిచ్చిన సలహాలను ఈ సందర్భంలో అన్వయించవచ్చు: “ఇదిగో తోడేళ్లమధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.” (మత్తయి 10:16) ఎట్టి పరిస్థితుల్లోనూ, ఒక క్రైస్తవురాలు నిస్సహాయురాలు మాత్రం కాదు. బైబిలు మనకు ఇలా నిశ్చయతను ఇస్తుంది: “జ్ఞానము నీ హృదయమున జొచ్చును . . . బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును.” (సామెతలు 2:10, 11) కాబట్టి, మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకునేందుకు మీకు సహాయపడగల కొన్ని బైబిలు సూత్రాలను పరిశీలిద్దాం.
1. మీరు మీ తోటి ఉద్యోగస్థులతో ఎలా ప్రవర్తిస్తున్నారో పరిశీలించుకోండి. మనం విముఖంగా లేక ప్రతికూలంగా ఉండాలని దాని అర్థం కాదు, ఎందుకంటే “అందరితో సమాధానమును . . . కలిగియుండుటకు ప్రయత్నించుడి” అని బైబిలు మనల్ని పురికొల్పుతుంది. (హెబ్రీయులు 12:14; రోమీయులు 12:18) అయితే, “సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి” అని బైబిలు క్రైస్తవులను అప్రమత్తులను చేస్తుంది గనుక, ప్రాముఖ్యంగా వ్యతిరేక లింగ వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, వ్యాపారసరళిగల ప్రవర్తనను కలిగి ఉండటం ఎంతైనా జ్ఞానయుక్తం. (కొలొస్సయులు 4:5) “తమ పాత్రలకు తగిన ఆహ్లాదకరమైన దృక్పథానికి మరియు లైంగిక నిర్మొహమాటాన్ని సూచించగల ఒక విధమైన స్నేహానికి మధ్యగల నిర్దిష్టమైన తేడాను నేర్చుకొనమని” ఎలిజబేత్ పోవెల్ వ్రాసిన లైంగిక ఒత్తిడికి ప్రతిగా ప్రతిస్పందించడం (ఆంగ్లం) అనే పుస్తకం, ఉద్యోగస్థులను పురికొల్పుతుంది.
2. మర్యాదపూర్వకంగా వస్త్రాలు ధరించండి. మీరేమి ధరిస్తారో అది ఇతరులకు ఒక వర్తమానాన్ని అందిస్తుంది. పూర్వం బైబిలు కాలాల్లో, కొన్ని ప్రత్యేక విధాలైన వస్త్రాలు ధరించడం ఆ వ్యక్తిని అనైతిక వ్యక్తిగా లేక కామాతురతగల వ్యక్తిగా గుర్తించేది. (సామెతలు 7:10) నేడు కూడా తరచూ అదే విషయం వాస్తవం; బిగుతైన, ధగ ధగలాడే లేక వెల్లడి చేసే బట్టలు తప్పుడు అవధానాన్ని ఆకర్షించగలవు. నిజమే, తమకేది నచ్చితే అది ధరించే హక్కు తమకుందని కొందరు భావించవచ్చు. అయితే రచయిత్రి ఎలిజబేత్ పోవెల్ చెబుతున్నట్లు, “డబ్బు దొంగిలించడం తప్పుకాదని భావించే ప్రజల మధ్య మీరు పని చేస్తుంటే, మీ పర్సు బయటకు కనిపించేలా ఉంచుకోవద్దని నేను అంటాను. . . . సమాజం యొక్క దృక్పథంలోని . . . బలహీనతలను మీరు గుర్తించి, వారి చేత బాధింపబడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు ప్రయత్నించాలి.” అలా బైబిలు సలహా నేటికీ పనికి వస్తుంది. “అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు [సభ్యతగల, NW] వస్త్రములచేతనే . . . అలంకరించుకొనవలెను” అని అది స్త్రీలకు ఉద్బోధిస్తుంది. (1 తిమోతి 2:9, 10) మర్యాదపూర్వకంగా వస్త్రాలు ధరించండి, అప్పుడు చెడు మాటలకు లేక సంభాషణకు మీరు ఎక్కువగా గురికాకపోవచ్చు.
3. మీ సహవాసులెవరో చూసుకోండి! లైంగిక దాడికి గురైన దీనా అనే యౌవన స్త్రీని గురించి బైబిలు మనకు చెబుతుంది. దీనా, చెడు ప్రవర్తన గలవారని తెలిసిన స్త్రీలను అంటే కనాను “దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను” గనుక ఆమె అతన్ని ఆకర్షించింది, తుదకు అతను ఆమెపై దాడి చేశాడు! (ఆదికాండము 34:1, 2) అదే విధంగా నేడు కూడా అసభ్యమైన విషయాలను చర్చిస్తారని పేరుగాంచిన తోటి ఉద్యోగస్థులతో మీరు క్రమంగా ముచ్చటిస్తే—లేక వారి మాటలు వింటే—లైంగిక ప్రతిపాదనలను మీరు అంగీకరిస్తారని కొందరు అనుకోవచ్చు.
దీని అర్థం మీరు మీ తోటి ఉద్యోగస్థులను పూర్తిగా అలక్ష్యం చేయాలని మాత్రం కాదు. అయితే సంభాషణ లజ్జాకరమైన రూపుదాలిస్తే, మీరు అక్కడి నుండి ఎందుకు వచ్చేయకూడదు? ఆసక్తికరంగా, ఉన్నత నైతిక ప్రమాణాలను కలిగి ఉన్న వారిగా పేరుపొందడం తమను వేధింపునుండి కాపాడేందుకు తోడ్పడుతుందని అనేకమంది యెహోవాసాక్షులు కనుగొన్నారు.—1 పేతురు 2:12.
4. వేధింపుకు గురి చేయగల పరిస్థితులను నివారించండి. అమ్నోను అనే యౌవనస్థుడు, తామారు అనే యౌవనురాలిని అనుభవించేందుకు ఆమెతో ఒంటరిగా ఉండే విధంగా ఎలా పథకం వేశాడో బైబిలు మనకు చెబుతుంది. (2 సమూయేలు 13:1-14) వేధించేవారు నేడు కూడా అదే విధంగా ప్రవర్తించవచ్చు, బహుశా వారి క్రింది ఉద్యోగిని మత్తుపానీయాన్ని పుచ్చుకునేందుకు లేక ఎలాంటి కారణాలూ లేకుండానే పని సమయం తర్వాత ఉండమని చెప్పడం వంటివి చేయవచ్చు. అలాంటి ఆహ్వానాల విషయమై అప్రమత్తంగా ఉండండి! బైబిలు ఇలా చెబుతుంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.”—సామెతలు 22:3.
మీరు ఒకవేళ వేధింపబడితే
ఒక స్త్రీ నిష్కళంకంగా ప్రవర్తించినప్పటికీ కొందరు పురుషులు అసభ్యంగా ప్రవర్తిస్తారన్నది వాస్తవమే. మీతో అలా ప్రవర్తించినప్పుడు మీరు ఎలా ప్రతిస్పందించాలి? దాన్ని అంతటినీ భరించడం మంచిదని కొందరు సిఫారసు చేస్తారు. ‘ఆఫీసులో లైంగికత జీవితంలోని మసాలా!’ అని ఒక స్త్రీ చెబుతుంది. అయితే, అలా అసభ్యంగా అవధానం పొందడాన్ని తమాషాగా లేక పొగడ్తలుగా భావించే బదులు, నిజ క్రైస్తవులు దానికి దూరంగా ఉంటారు. వారు ‘చెడ్డదాని నసహ్యించుకొంటారు,’ అలాంటి ప్రతిపాదనల ఉద్దేశం సాధారణంగా ఒకరిని లైంగిక దుర్నీతి వైపుకు నడిపేందుకే అని వారు గుర్తిస్తారు. (రోమీయులు 12:9; 2 తిమోతి 3:6 పోల్చండి.) క్లుప్తంగా చెప్పాలంటే, ఆ కఠినమైన ప్రవర్తన వారి క్రైస్తవ ఘనతకు ఒక అవమానం వంటిది. (1 థెస్సలొనీకయులు 4:7, 8 పోల్చండి.) మీరు అలాంటి పరిస్థితులతో ఎలా వ్యవహరించగలరు?
1. స్థిరంగా ఉండండి! ధైవభక్తిగల పురుషుడైన యోసేపు, అనైతిక ప్రతిపాదనలకు ఎలా ప్రతిస్పందించాడో బైబిలు మనకు చెబుతుంది: “అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి—తనతో శయనించుమని చెప్పెను.” ఆ సమస్య దానంతటదే పరిష్కరింపబడుతుందని నిరీక్షిస్తూ, యోసేపు కేవలం ఆమె ప్రస్తావనలను అలక్ష్యం చేశాడా? ఎంతమాత్రం కాదు! “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని” అంటూ ఆయన ఆమె ప్రస్తావనలను ధైర్యంగా నిరాకరించాడని బైబిలు చెబుతోంది.—ఆదికాండము 39:7-9.
యోసేపు ప్రవర్తన స్త్రీపురుషులకు ఇరువురుకీ చక్కని ఉదాహరణగా ఉంది. అసభ్యమైన సంభాషణను లేక వేధించే ప్రవర్తనను అలక్ష్యం చేయడం లేక అంతకంటే ఘోరంగా, దాని వలన భయపడటం దాన్ని ఎంతమాత్రం తగ్గించదు; బదులుగా, భయం లేక సంకోచం దాన్ని మరింత ఎక్కువ చేస్తుంది! అత్యాచారం చేసే వాళ్లు తరచూ, “దాడి చేసినప్పుడు ఒక స్త్రీ పోరాడి ఎదిరిస్తుందా లేదా అనేందుకు” లైంగిక వేధింపును “ఒక కొలమానంగా ఉపయోగిస్తారు; ఆమె వేధింపబడినప్పుడు ఒకవేళ ఎదిరించకుండా, భయపడుతూ ఉంటే ఆమెపై దాడి చేసినప్పుడు కూడా ఎదిరించకుండా, భీతిచెందుతుందని వాళ్లు భావిస్తారని” అత్యాచార నివారణా సలహాదారురాలైన మార్తా లంగాలన్ హెచ్చరిస్తోంది. వేధింపు యొక్క మొదటి సూచన లభించినప్పుడే మీరు స్థిరంగా ఉండాలన్నది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఒక రచయిత్రి ప్రకారం, “వెంటనే మరియు స్పష్టంగా వద్దు అని చెప్పడం, వేధించే వాడు తన చెడు ప్రవర్తనను ఆపేందుకు తరచూ సరిపోతుంది.”
2. మీరు వద్దంటే వద్దు అన్నట్లే ఉండండి! తన కొండమీది ప్రసంగంలో యేసు అలా చెప్పాడు. (మత్తయి 5:37) వేధించే వాళ్లు తరచూ పట్టు విడువకుండా ఉంటారు గనుక, ఆయన వ్యాఖ్యానం ఈ సందర్భాలకు కూడా సరైనదే. మీరెంత స్థిరంగా ఉండాలి? అది పరిస్థితిపై మరియు వేధించే వాని ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది. మీ అభిప్రాయం అతనికి అర్థమయ్యేలా చేసేందుకు ఎంత స్థిరంగా ఉండాల్సిన అవసరముందో అంత స్థిరంగా ఉండండి. కొందరి విషయంలో, నెమ్మదైన స్వరంతో క్లుప్తంగా ఇచ్చే సూటైన వ్యాఖ్యానం చాలు. అతని కళ్లలోకి చూడండి. నిపుణులు ఈ క్రింది వాటిని సూచిస్తున్నారు: (ఎ) మీ భావాలను తెలుపండి. (“నీవు . . . చేయడం నాకు ఎంతమాత్రం నచ్చదు”) (బి) ఇబ్బంది కలిగించే ప్రవర్తనను ప్రత్యేకంగా చెప్పండి. (“. . . నీవు మోటైన, నీచమైన భాషను ఉపయోగించినప్పుడు . . . ”) (సి) ఆ వ్యక్తి ఏమి చేయాలని మీరు ఇష్టపడుతున్నారో స్పష్టంగా చెప్పండి. (“నీవు నాతో అలా మాట్లాడటం మానేయాలని నేను కోరుతున్నాను!”)
“ఎలాంటి పరిస్థితిలో కూడా మీరు కలహాన్ని ఆరంభించకండి. కలహాన్ని ఆరంభించడం (అవమానించడం, బెదిరించడం మరియు తిట్టడం, గుద్దడం, వేధించే వానిపై ఉమ్మి వేయడం) ఎదురుదాడిని ఉత్పన్నం చేస్తుంది. మౌఖిక దౌర్జన్యం ప్రమాదకరమైనది, మీపై వాస్తవంగా భౌతిక దాడి జరిగి మిమ్మల్ని మీరు కాపాడుకోవలసి వస్తేనే తప్ప, భౌతిక దౌర్జన్యానికి పాల్పడాల్సిన అవసరం లేదు” అని లంగాలన్ హెచ్చరిస్తోంది. “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు” అని చెబుతున్న రోమీయులు 12:17 నందలి బైబిలు మాటలతో అలాంటి ఆచరణాత్మక సలహా ఏకీభవిస్తుంది.
వేధింపును ఆపాలని మీరు ఎంతో కృషి చేసినప్పటికీ ఇంకా అలాగే కొనసాగితే అప్పుడెలా? లైంగిక వేధింపుతో వ్యవహరించేందుకు కొన్ని కంపెనీలు కొన్ని విధానాలను నియమించాయి. తరచూ, కంపెనీ ఫిర్యాదు విధానం ప్రారంభిస్తామన్న బెదిరింపు మాత్రమే, మిమ్మల్ని వేధించేవాడు వేధింపు మానుకునేందుకు సహాయపడవచ్చు. అయితే, అది అంతటితో ఆగకపోవచ్చు కూడా. సహానుభూతి చూపే సూపర్వైజర్ను కనుగొనడం పురుషులకైనా లేక స్త్రీలకైనా కష్టమే అన్నది దుఃఖకరమైన విషయం. ఉద్యోగిని ద్వారా వేధింపబడ్డానని చెబుతున్న గ్లీన్ ఫిర్యాదు చేసి చూశాడు. ఆయనిలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నేను ఆ విషయాన్ని నా బాస్‌కు చెప్పినప్పుడు నాకు ఎలాంటి సహాయమూ లభించలేదు. వాస్తవానికి, అతను అదంతా ఓ ఉల్లాసకరమైన విషయంగా భావించాడు. నేను ఎప్పుడూ ఆ స్త్రీని గమనిస్తూ, ఆమెను తప్పించుకుని పోవాల్సి వచ్చేది.”
కొందరు చట్టబద్ధమైన చర్యలు తీసుకుని చూశారు. కోర్టు గొడవల్లో పెద్ద మొత్తంలో ధనం లభించిందని మీరు వార్తల్లో చదివేది అంత సులభంగా లభించదు. దానికి తోడు, లైంగిక ఒత్తిడికి ప్రతిగా ప్రతిస్పందించడం అనే పుస్తకం ఇలా హెచ్చరిస్తుంది: “వేధింపులకు విరుద్ధంగా చట్టపర చర్యలు తీసుకునేందుకు విపరీతమైన భావోద్రేక శక్తి మరియు సమయం కావాలి; అవి భౌతికమైన అలాగే మానసికమైన ఉద్రిక్తతను కలిగిస్తాయి.” “ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము” అని మంచి కారణంతోనే బైబిలు హెచ్చరిస్తుంది. (సామెతలు 25:8) చట్టపరమైన చర్య యొక్క భావోద్రేక మరియు ఆత్మీయ వ్యయాన్ని లెక్కించి చూసిన తర్వాత, కొందరు వేరే ఉద్యోగాన్ని వెతుక్కోవడం మంచిదని అనుకున్నారు.
వేధింపు యొక్క అంతం
లైంగిక వేధింపు క్రొత్త విషయమేమీ కాదు. అపరిపూర్ణమైన, పన్నాగాలు పన్నే, పేరాశగల మానవ హృదయం ఎంత విశ్వవ్యాప్తమైనదో అదీ అంత విశ్వవ్యాప్తమైనదే. కమిషన్లు మరియు కోర్టు కేసులు సమాజంలోనుండి లైంగిక వేధింపును ఎన్నటికీ తొలగించలేవు. లైంగిక వేధింపును తొలగించాలంటే, ప్రాముఖ్యంగా ప్రజల హృదయాలు మారాల్సిన అవసరం ఉంది.
నేడు, దేవుని వాక్యం మరియు ఆయన ఆత్మ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో అలాంటి మార్పును తెస్తున్నాయి. యెషయా ప్రవక్త ముందే చెప్పినట్లు, తోడేళ్లు మరియు సింహాలు, గొర్రెలు మరియు దూడల వలె ప్రవర్తించేందుకు నేర్చుకున్నట్లు అది ఉంది. (యెషయా 11:6-9) ప్రజలతో బైబిలును పఠించడం ద్వారా, పూర్వం ‘తోడేళ్లుగా’ ఉన్న వారు దృఢమైన, నిత్యం నిలిచే వ్యక్తిత్వపు మార్పులను చేసుకునేందుకు యెహోవాసాక్షులు ప్రతి సంవత్సరం వేలాది మందికి సహాయం చేస్తున్నారు. “మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను” అనే లేఖనాధార ఆజ్ఞను ఈ ప్రజలు గైకొంటున్నారు.—ఎఫెసీయులు 4:22-24.
ఈ భూమి ఒక నాటికి బైబిలు ప్రమాణాలకు సరితూగే స్త్రీపురుషులతో నింపబడుతుంది. అన్ని విధాలైన చెడు ప్రవర్తన అంతమొందే ఆ దినం కొరకు, దేవునికి భయపడే ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. అంతవరకు వారు, నేటి రోత కల్గించే ఈ వాస్తవాలతో తమకు వీలైనంత శ్రేష్ఠంగా వ్యవహరిస్తారు.
[అధస్సూచి]
a ‘స్త్రీని ముట్టకుండటం’ గురించి 1 కొరింథీయులు 7:1 లో పౌలు ఇచ్చిన హెచ్చరిక మామూలుగా తగలడాన్ని కాక స్పష్టంగా లైంగిక సంబంధాన్ని సూచిస్తుంది. (సామెతలు 6:29 పోల్చండి.) ఆ సందర్భంలో, పౌలు అవివాహిత దశను ప్రోత్సహిస్తూ, లైంగిక దుర్నీతిలో పొల్గొనడాన్ని గూర్చి హెచ్చరిస్తున్నాడు.—జనవరి 1, 1973 (ఆంగ్లం) కావలికోటలోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.
[7వ పేజీలోని చిత్రం]
“అలాంటి పరిస్థితి మీ తల్లి, చెల్లి లేక కుమార్తెకు ఎదురవ్వాలని మీరు కోరుకుంటారా?”
[8వ పేజీలోని చిత్రం]
వ్యాపారసరళిగల ప్రవర్తన మరియు మర్యాదపూర్వకమైన వస్త్రధారణ ఒకరిని వేధింపు నుండి కాపాడేందుకు ఎంతో సహాయం చేయగలదు
[10వ పేజీలోని చిత్రం]
నిజ క్రైస్తవులు నేడు ఒకరితో ఒకరు గౌరవపూర్వకమైన పద్ధతిలో వ్యవహరించేందుకు నేర్చుకుంటున్నారు