యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
లైంగిక వేధింపు—నన్ను నేనెలా రక్షించుకోగలను?
అనిత చురుగ్గా, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే 16 ఏండ్ల అమ్మాయి. అయితే, తన పాఠశాలలో జరిగిన ఇటీవల సంఘటనలను గూర్చి చెప్పేటప్పుడు ఆమె తన ముఖం చిట్లించుకుంది. “అందరికీ తెలిసిన ఒక అబ్బాయి నడవలో ఉన్న నా దగ్గరికి వచ్చి నన్ను అమర్యాదగా ముట్టుకోవడం మొదలెట్టాడు. అతని ఈ చేష్టలకు చాలా మంది అమ్మాయిలు అసమ్మతి తెలుపలేదు— వారు అతని పనులకు తబ్బిబ్బయిపోయారు, కాని నేనలా కాలేదు! నన్ను ముట్టుకోవద్దని అతనితో మర్యాదగా చెప్పినా ప్రయోజనం కలుగలేదు. నేను నిజంగానే అన్నానని అతడు తలంచలేదు” అని ఆమె గుర్తు చేసుకుంటుంది.
అనిత దుస్థితి ఏ మాత్రం అసాధారణం కాదు. బైబిలు కాలాల్లో కూడా లైంగిక వేధింపు సాధారణమేనన్నది స్పష్టం. (రూతు 2:8, 9 15 పోల్చండి.) అది నేడు మరింత భీతిగొలిపేంతగా ప్రబలి ఉంది. “కొందరు మగవారు నా శరీరాన్ని గూర్చి అశ్లీలంగా వ్యాఖ్యలు చేశారు” అని యౌవనారంభంలో ఉన్న ఒకమ్మాయి చెబుతుంది. అయితే తరచూ, వేధింపు అనేది మాటలకు మించి పోతుంది. “ఉద్యోగ స్థలంలో కొందరు నన్ను ముట్టుకోవడానికి లేదా నన్ను లాగడానికి ప్రయత్నం చేశారు” అని కూడా ఆమె చెబుతుంది. రానె అనే పేరున్న యౌవనారంభంలోని అమ్మాయి తేజరిల్లు!తో ఈ విధంగా చెప్పింది: “ఉద్యోగ స్థలంలో వేధింపు ఎంత మితిమీరిపోయిందంటే, నేను ఉద్యోగం వదిలిపెట్టవలసి వచ్చింది.”
ఇటీవలి ఒక సర్వే నివేదించినదేమంటే 8 నుండి 11వ గ్రేడుల్లోని 81 శాతం విద్యార్థులు తాము కనీసం ఒక్కసారైనా లైంగికంగా వేధించబడ్డామని చెబుతున్నారు. అలా “చెప్పిన వారిలో 65 శాతం మంది అమ్మాయిలు, 42 శాతం మంది అబ్బాయిలు లైంగిక విధంగా ముట్టుకొనబడ్డారని లేక విసురుగా లాగబడ్డారని, గిల్లబడ్డారని” యు.ఎస్.న్యూస్ అండ్ వర్ల్‌డ్ రిపోర్టు చెబుతుంది. అవును, అమ్మాయిలు అలాగే అబ్బాయిలు కూడా గురవుతున్నారు. యౌవనారంభంలోని ఒక అబ్బాయి తండ్రి ఈ విధంగా గుర్తుచేసుకుంటున్నాడు: “నా కొడుకు పాఠశాలలోని అమ్మాయిలకు ఎంత ధైర్యమని నేను ఆశ్చర్యపోయాను. వాడికి దాదాపు 12 ఏండ్లున్నప్పటి నుండి డేటింగ్ చేయడానికి ఎడతెగక ఫోన్లు, ఆహ్వానాలు, అశ్లీల సలహాలు వంటి చెప్పలేనివెన్నెన్నో అందేవి.”
కోపం రేకెత్తించే ఈ ప్రవర్తనను పట్టించుకోక పోవడం సులభమే. ఒక యువతి ఈ విధంగా చెప్పింది: “కొన్నిసార్లు అది హాస్య భావంలో చేయబడింది.” కాని క్రైస్తవులకు అది తమాషా కాదు! లైంగిక వేధింపు అనేది యెహోవా ఖండించే లైంగిక అవినీతిలోకి తరచూ వశీకరించవచ్చు అని వారికి తెలుసు. (1 కొరింథీయులు 6:9, 10) అంతేకాక, యువతులతో “పూర్ణపవిత్రతతో” మెలగాలి అని దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తుంది. (1 తిమోతి 5:2) అది ‘సరసోక్తులను’ కూడా నిషేధిస్తుంది. (ఎఫెసీయులు 5:3, 4) కనుక, క్రైస్తవ యౌవనస్థులు లైంగిక వేధింపును సహించకూడదు! మీరు దానికి గురి కాకుండా మిమ్మల్ని మీరెలా రక్షించుకోగలరు? అన్నది ప్రశ్న. నివారణా చర్యలను గూర్చి మాట్లాడుకుందాం.
వేధింపును తప్పించుకొనే మార్గాలు
క్రైస్తవ నడవడికకు మంచిపేరును సంపాదించుకోండి. “మనుష్యుల . . . . యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” అని యేసు బోధించాడు. (మత్తయి 5:16) మీరు విశ్వసిస్తున్నదానిని గూర్చి మీ తోటి విద్యార్థులతోను, తోటి ఉద్యోగస్థులతోను చెప్పుకోవడం ఇలా చేయడానికి ఒక మార్గం. మీరు దృఢమైన విశ్వాసము, ఉన్నత నైతిక ప్రమాణాలు ఉన్నవారని వారికి తెలిస్తే, మీరు వేధింపుకు గురయ్యే సాధ్యత తక్కువగా ఉంటుంది.
మీ వస్త్రధారణ, కేశాలంకరణ ఎలా ఉందో మీకై మీరే గమనించండి. బైబిలు కాలాల్లో కొన్ని రకాల వస్త్రధారణ నైతికతలేని స్త్రీలను సూచించేది. (సామెతలు 7:10 పోల్చండి.) అలాగే నేడు కూడా, ఉద్రేకాలను రేకెత్తించేటటువంటి విధానాలు మిమ్మల్ని మీ తోటివారి మధ్య ఖ్యాతిగాంచేటట్లు చేయవచ్చు, కాని అవి వారికి తప్పుడు సందేశాన్ని అందించగలవు. వ్యతిరేక లింగం నుండి కోరదగని శ్రద్ధను మీరు ఆకర్షిస్తున్నట్లు మీ అంతట మీరే కనుగొనవచ్చు. ఒక అమ్మాయి తనకు ఎక్కువ వయస్సు కనిపించేలా మేకప్ చేసుకుంటే కూడా అలాంటి సమస్యే తలెత్తుతుంది. ‘అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే అలంకరించుకొనుడి’ అన్నది బైబిలు సలహా.—1 తిమోతి 2:9.
మీ సహవాసులను జాగ్రత్తగా ఎంచుకొనుడి. (సామెతలు 13:20) అంతేకాదు, మీ సహవాసులెవరన్న దానినిబట్టి మీరెవరనే దానిని ప్రజలు తీర్పు తీరుస్తారు. మీ స్నేహితులు ఎక్కువ సమయం వ్యతిరేక లింగంలోనున్న వారిని గూర్చి మాట్లాడేవారని తెలియబడుతున్నట్లయితే, ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకోగలరు.—ఆదికాండము 34:1, 2 పోల్చండి.
సరసాలాడకండి. స్నేహపూర్వకంగా మెలగడంలో తప్పేమీ లేదన్నది నిజమే, అయినప్పటికీ, తదేకంగా చూడడాన్ని, ముట్టుకోవడాన్ని వ్యతిరేక లింగవ్యక్తులు సులభంగా అపార్థం చేసుకోగలరు. సంభాషణను కొనసాగించేందుకు ఒకరిని ముట్టుకోవలసిన అవసరం లేదు. బంగారు సూత్రాన్ని పాటించి, మీతో ఎలా—మర్యాదగా, గౌరవంగా మెలగాలని మీరు కోరుకుంటారో మీరు కూడా వారితో అలాగే మెలగండి. (మత్తయి 7:12) కేవలం తమాషా కొరకు వ్యతిరేక లింగవ్యక్తుల శ్రద్ధను ఆకర్షించాలని ప్రయత్నించడం మానండి. అలా చేయడం నిర్దయగాను తప్పుద్రోవ పట్టించేదిగాను ఉండడమే కాక, అపాయకరమైనదిగాను ఉంటుంది. “ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?” అని బైబిలు సామెతలు 6:27 నందు అడుగుతుంది.
మీరు గురైనట్లయితే
నిజమే, మీ వస్త్రధారణలో, మీ కేశాలంకరణలో లేదా మీ ప్రవర్తనలో సరైన మార్పులు అవసరమున్నప్పటికీ, ఇతరులు మీపై చెయ్యి వేసే లేదా అశ్లీల సూచనలనిచ్చే హక్కు లేదు. ముస్తాబయ్యే విధానంలోను, ప్రవర్తనలోను మంచి మాదిరికరంగా ఉన్న కొందరు యౌవనస్థులు కూడా గురయ్యారు. మీకు ఇలా జరిగినట్లయితే మీరేమి చేయాలి? ఇక్కడ కొన్ని సలహాలు ఇవ్వబడ్డాయి.
స్థిరంగా నిరాకరించండి. కొందరు లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి నిజంగా ఇష్టపడుతున్నప్పుడు లేదు అని చెబుతారని అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు వారికి నిశ్చయము కలిగించేంత వరకూ అర్ధహృదయంతో వద్దు అని చెప్పినా దాని భావం సరేనని లేదా కొంత సాధ్యత ఉందనే దాడిచేసేవారు భావిస్తారు. మీ మాట కాదంటే కాదు అనే ఉండాలి అని యేసు ఇచ్చిన సలహా ఈ విషయంలో ఎంతో ఆచరణయోగ్యము. (మత్తయి 5:37) చిలిపిగా నవ్వవద్దు, సిగ్గుపడుతున్నట్లు ప్రవర్తించవద్దు. మీ మాటలకు వ్యతిరేకమైనది వెలిబుచ్చేందుకు మీ శరీర కదలికలను, స్వరాన్ని లేదా ముఖ కవళికలను అనుమతించవద్దు.
కోపాన్ని వెలిబుచ్చండి. లైంగికంగా హింసించేవారు, తరచూ, తమ ఎరలు వ్యతిరేకించుటకు సిద్ధం కాకపోవడంపై ఆధారపడతారు. అయితే, బైబిలు కాలాల్లో, లైంగిక ఆక్రమాన్ని ఎదిరించే హక్కు, నిజానికి బాధ్యత ఇశ్రాయేలు స్త్రీలకు ఇవ్వబడింది. (ద్వితీయోపదేశకాండము 22:23, 24) అలాగే నేడు కూడా, అమర్యాదగా ముట్టుకోబడడం లేదా ముద్దులాడబడడం పెద్ద సమస్య కాదు అని తలంచకూడదు. అది తప్పు, ఒక వ్యక్తిగా మరియు ఒక క్రైస్తవురాలిగా మీ హోదాపై దాడి చేయడమే. మీరు దానిని ఎదిరించకుండా ఉండనవసరం లేదు! ‘చెడ్డదాని నసహ్యించు కొనుడి’ అని బైబిలు బోధిస్తుంది!—రోమీయులు 12:9.
అమర్యాదగల ప్రవర్తనను తప్పించుకునే ఒక మార్గము మీ కోపాన్ని వెలిబుచ్చి, మిమ్మల్ని వేధించేవాణ్ని భయపెట్టడమే; బహుశా అతడు ఆపవచ్చు. మొదట పేర్కొనబడిన అనిత అనుభవాన్ని గుర్తు చేసుకోండి. దాడి చేయడానికి వచ్చినవానితో ఆపమని మర్యాదగా చెప్పడం వల్ల ప్రయోజనం కలుగలేదు. “నన్ను ముట్టుకోవద్దు! అని అతని స్నేహితుల ఎదుట బిగ్గరగా చెప్పి అతనిని భయపెట్టవలసి వచ్చింది. ఫలితమేమిటి? అతని స్నేహితులందరూ అతన్ని చూసి నవ్వారు. అతడు కొంచెం సేపు నిశ్చేష్టుడై అలా ఉండిపోయాడు, కాని కొన్ని రోజుల తరువాత అతడు తన ప్రవర్తనకు క్షమాపణ కోరాడు, తరువాత మరొకరు నన్ను వేధించడానికి వచ్చినప్పుడు నన్ను కాపాడాడు కూడా” అని అనిత మనకు చెబుతుంది.
మాటలు పని చేయనట్లయితే, మీరు అతని దగ్గర నుండి దూరంగా నడిచి వెళ్ళిపోతే సరిపోతుంది—లేక పరుగెత్తినా సరిపోతుంది. పారిపోవడం అసాధ్యమైతే, ఉపద్రవాన్ని అరికట్టడానికి మీరు అవసరమైన దేనినైనా ఉపయోగించవచ్చు. ఒక క్రైస్తవ బాలిక ఇలా నిష్కపటంగా చెప్పింది: “ఒకబ్బాయి నన్ను లాగడానికి చూసినప్పుడు, నేను నాకు చేతనైనంత గట్టిగా అతనిని పిడికిలితో గుద్ది, పరుగెత్తాను!” దీనర్థం వేధించేవాడు మళ్ళీ ప్రయత్నించడని కాదు. కాబట్టి మీరు కొంచెం సహాయం పొందడానికి ఇష్టపడవచ్చు.
ఎవరితోనైనా చెప్పండి. “అదే నేను చివరికి చేయవలసి వచ్చింది. నేను మంచి మిత్రుడని అనుకున్న ఒక అబ్బాయి నన్ను బాధపెడుతూ ఉన్న పరిస్థితిలో నా తలిదండ్రులను సలహా అడిగాను. అది ఒక ఆటా అన్నట్లుగా, నేను ఎంతగా ఎదిరించానో, అతడు అంత ఇదిగా ఉద్ధృతమయ్యాడు” అని 16 ఏండ్ల ఏడ్రియెన్ ఒప్పుకుంది. ఏడ్రియెన్ తలిదండ్రులు ఆచరణాత్మకమైన సలహాను ఇచ్చారు, అది ఆ సమస్యను మరింత విజయవంతంగా ఎదుర్కోడానికి ఆమెకు సహాయపడింది.
ఎర అవ్వడం వల్ల కలిగే కలవరం, భయం, అవమానం వంటి భావోద్రేక సంబంధమైన ఏ పర్యవసానాలనైనా ఎదుర్కోవడానికి కూడా మీ తలిదండ్రులు మీకు సహాయపడగలరు. ఆక్రమణం మీ పొరపాటు కాదన్న నిశ్చయతను వారు మీకిస్తారు. మిమ్మల్ని భవిష్యత్తులో కాపాడేందుకు సహాయపడే చర్యలను కూడా వారు తీసుకోవచ్చు.
ఉదాహరణకు, ఈ సమస్యను గూర్చి మీ ఉపాధ్యాయునికో లేక పాఠశాల అధికారులకో చెప్పడం ప్రయోజనకరమని వారు తీర్మానించవచ్చు. అమెరికాలోని అనేక పాఠశాలలు పిల్లల మధ్య లైంగిక వేధింపును గూర్చిన సమస్యలను పరిష్కరించే సరైన యోచనలను నిర్ణయించారు, ఫిర్యాదులను చాలా గంభీరంగా తీసుకుంటున్నారు.
నిజమే పాఠశాల ఉద్యోగస్థులందరూ సానుభూతిగలవారు కారు. “మా పాఠశాలలో ఉపాధ్యాయులు తిడతారు, పిల్లల కన్నా అన్యాయంగా ఉంటారు. సహాయం కొరకు ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియదు” అని 14 ఏండ్ల ఎర్లీషా చెబుతుంది. ఆమె వేధించబడినదని నివేదించినప్పుడు, ఆమె మరీ సున్నితమైన స్వభావం గలదని నిందించబడడంలో ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ ఎర్లీషా వదిలిపెట్టలేదు. ఆ అబ్బాయే గిల్లిన, ముద్దుపెట్టుకున్న మరో ఆరుగురు అమ్మాయిలను ఆమె కూడగట్టుకుంది. “నిజంగా సమస్య ఉందని ప్రిన్సిపల్‌ను నమ్మించేందుకు మేము ఆరుగురం కావలసి వచ్చింది” అని ఆమె చెబుతుంది. చివరికి, ఆమె ఆ అసభ్య ప్రవర్తనను ఆపేలా చేయగలిగింది.
మద్దతు కొరకు దేవుని తట్టుకు తిరగండి. మీరు పాఠశాలలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మీరు సింహపు గుహలో వేయబడినట్లు భావిస్తున్నట్లయితే, యెహోవా దేవుడు ప్రవక్తయైన దానియేలును అక్షరాలా సింహపు గుహ నుండి రక్షించాడని గుర్తుకు తెచ్చుకోండి. (దానియేలు 6:16-22) యెహోవా మీకు కూడా సహాయపడగలడు. మీరు పాఠశాలలో ఎదుర్కునే ఒత్తిళ్ళను ఆయన అర్థం చేసుకుంటాడు. పరిస్థితి ఇంకా విషమించిపోతే, సహాయం కొరకు ఆయనను వేడుకోవచ్చు, అవసరమైతే మీరు ఆయన పేరును బిగ్గరగా పిలువవచ్చు! మీరు సత్య దేవుని సేవకులని తెలియబడేందుకు భయపడకండి, కలవరపడకండి. “తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును” అని నమ్మకస్థులైన యెహోవా దాసులకు బైబిలు వాగ్దానం చేస్తుంది.—కీర్తనలు 97:10.
ఇది అద్భుతమైన విడుదలను హామీ ఇవ్వదు. మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు మీరు చేయగలిగింది చేయాలి. బైబిలు సూత్రాలను అనుసరించండి. మీ మాటల్లోను, మీ అలంకరణలోను మితంగా ఉండండి. వ్యతిరేక లింగవ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆ విధంగా చేయడం ద్వారా, మిమ్మల్ని మీరు లైంగిక వేధింపు నుండి రక్షించుకునేందుకు మీరు ఎంతో చేయగలరు.
[20వ పేజీలోని చిత్రం]
అమర్యాదగా వ్యవహరించబడుతున్నప్పుడు, అర్ధ హృదయంతో ఉండకండి; మీ మాట ‘కాదంటే కాదు గానే’ ఉండనివ్వండి!