లైంగిక వేధింపు—ఓ ప్రపంచవ్యాప్త సమస్య
రీనా వీక్స్ అనే పేరుగల యౌవన సెక్రటరీకి ఉద్యోగ స్థలంలోని పని ఒక పీడకలలా మారింది. నిజమే, ఆమెకు ఉద్యోగాన్నిచ్చిన లా ఫర్మ్‌కి ప్రతిష్ఠాత్మక పేరుంది మరియు రెండు డజన్లకంటే ఎక్కువ దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఆమె పేర్కొన్నట్లుగా, ఆమె ఎవరి కొరకు పని చేస్తుందో ఆ మనిషి ఆమెను పట్టుకోవడం, ముట్టుకోవడం మానడు. తీవ్ర అవమానకరమైన దాడులకు కఠినమైన, నీచమైన మాటలు తోడయ్యాయి.
సంవత్సరాల పూర్వం, ఈ విధమైన పరిస్థితుల్లోని స్త్రీలకు చాలా తక్కువ సహాయం ఉండేది—బహుశా ఉద్యోగాన్ని మానుకోవడం మాత్రమే ఒక మార్గం. సాక్షులు లేకపోవడంతో, ‘అతనికి విరుద్ధంగా ఆమె మాట’ మాత్రమే ఉందని కార్యాలయ అధికారం తీర్మానించి చెప్పి ఉంటుంది. స్త్రీ చెప్పే కథనం వినాలని సుముఖతను చూపిన వారు కూడా, ‘దాంట్లో అంత పెద్ద విషయం ఏముంది?’ అని అంటూ బహుశా సమస్యను త్రోసిపుచ్చి ఉండవచ్చు. అయితే కాలం మారింది. రీనా వీక్స్ కోపగించి, ఉద్యోగం మానేయడం కంటే ఎక్కువే చేసింది. ఆమె దావా వేసింది.
అమెరికా న్యాయస్థానం, ఆమె పూర్వపు బాస్ నుండి ఆమెకు దండనరూపమైన నష్టంగా 2,25,000 డాలర్లతోపాటు ఆమెకు కలిగిన భావోద్రేక కలతకు నష్టపరిహారంగా 50,000 డాలర్లను ఆమెకు ఇప్పించింది. తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలు మరియు లా ఫర్మ్‌ల అవధానాన్ని పొందే చర్యను తీసుకుంటూ, సమస్యను సరిచేయడంలో విఫలమైనందుకు దండనరూపమైన నష్టంగా అపారమైన 69 లక్షల డాలర్లను చెల్లించమని న్యాయస్థానం ఆ లా ఫర్మ్‌ను శాసించింది!
రీనా వీక్స్ కేసు ఆ తరహా కేసుల్లో అదొక్కటే కాదు. మరొక ఇటీవలి దావాలో (అమెరికా) జాతీయ చైన్ డిస్కౌంట్ దుకాణాలు ఇమిడివున్నాయి. తన సూపర్‌వైజర్ తన ఎడల అనేక నీచమైన బూతు వ్యాఖ్యానాలు చేశాడని పెగ్గీ కిమ్‌జీ అనే పేరుగల మరొక ఉద్యోగిని పేర్కొన్నది. 1993లో పెగ్గీ కిమ్‌జీ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, దావా వేసింది. తాను పోగొట్టుకున్న జీతానికి గౌరవవేతనంగా 1 డాలర్‌తోపాటు, అవమానం మరియు మానసిక వ్యథ విషయమై ఆమెకు 35,000 డాలర్లు చెల్లించడం జరిగింది. ఆమె పూర్వపు యజమాని ఆ వేధింపును సహించడం ద్వారా ప్రతికూలమైన ఉద్యోగ వాతావరణాన్ని సృష్టించాడని కూడా న్యాయస్థానం తీర్మానించింది. దానికి శిక్ష? నష్టపరిహారంగా ఐదు కోట్ల డాలర్లు!
పురుషుల ఆరోగ్యం (ఆంగ్లం) అనే పత్రిక ఇలా చెబుతుంది: “లైంగిక వేధింపును గూర్చిన కేసులు బ్యాక్టీరియా వలె తీవ్రంగా పెరిగిపోతున్నాయి. 1990లో, ఈఈఓసి [ఈక్వల్ ఎంప్లాయిమెంట్ ఆపర్‌ట్యూనిటీ కమీషన్] అటువంటి 6,127 ఫిర్యాదులతో వ్యవహరించింది; గత సంవత్సరంకల్లా [1993] సాంవత్సరిక మొత్తం దాదాపు 11,908కి, అంటే రెండంతలకు పెరిగింది.”
అధికార దుర్వినియోగం
న్యాయస్థానం పెద్ద మొత్తంలో ఇస్తున్న బహుమతులు వార్తల్లో ముఖ్యాంశాలు అవుతున్నప్పటికీ, చాలా కొన్ని కేసులు మాత్రమే కోర్టుగది వరకూ వెళ్తాయన్నదే వాస్తవం. వారు, కార్యాలయాల్లో, వీధుల్లో, బస్సుల్లో, మధ్యాహ్న భోజనశాలల్లో మరియు కర్మాగారాల్లో సాగుతున్న, అధికారం మరియు బెదిరింపుల అసహ్యమైన క్రీడలో పావులైన ఆ బాధితుల్లో అత్యధికులు, తమకు జరిగే ఈ అవమానాన్ని మౌనంగా సహిస్తున్నారు. కొన్నిసార్లు, శారీరక సంబంధాన్ని కలిగి ఉండమని బాహాటంగా బలవంతం చేయబడుతున్నారు. అయితే చాలాసార్లు, ఆ బలాత్కారంలో మోసపూరితమైన, అయిననూ సిగ్గులేనిరీతిలో నీచమైన క్రియలు ఇమిడివున్నాయి: అనవసరంగా లేక అనుచితంగా తగలడం, కామాతురతగల వ్యాఖ్యానాలు చేయడం, మోహపు చూపులు చూడడం.
కేవలం స్త్రీల అవధానాన్ని ఆకర్షించేందుకు కొందరు పురుషులు చేసే మొరటు ప్రయత్నమని తర్కిస్తూ, అలాంటి ప్రవర్తనను వేధింపు అని పిలిచేందుకు కొందరు నిరాకరిస్తారన్నది వాస్తవమే. అయితే అనేకులు, రచయిత్రి మార్తా లంగాలన్ వలె, అయుక్తమైన ప్రవర్తనను సమర్థించేందుకు చేయబడే అలాంటి ప్రయత్నాలను నిరాకరిస్తారు. ఆమె ఇలా వ్రాసింది: “అది వికారమైన ప్రేమయాచన కాదు, లేక అమర్యాదగల ప్రేమయాచన కాదు, లేక తమాషా ప్రేమయాచన కాదు, లేక ‘అపార్థం చేసుకున్న’ ప్రేమయాచన కాదు. అది స్త్రీలను ప్రీతిపరచేందుకు కాదు; అది పూర్తిగా వేరే కార్యానికి పనికి వచ్చే ప్రవర్తన. మానభంగం వలె, లైంగిక వేధింపు కూడా వారిని ఆకర్షించేందుకు కాక, వారిని బలాత్కరించేందుకు రూపొందించబడింది. . . . [అది] అధికారాన్ని వ్యక్తపర్చడమే.” అవును, తరచూ అలాంటి ప్రవర్తన కేవలం, ‘ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకున్న’ మరొక క్రూరమైన విధానం.—ప్రసంగి 8:9; ప్రసంగి 4:1 పోల్చండి.
సాధారణంగా స్త్రీలు లైంగిక వేధింపుకు, ఆనందంతో కాక అసహ్యం, కోపం మొదలుకొని కృంగిపోవడం మరియు అవమానం వంటి భావాలతో ప్రతిస్పందిస్తారు. ఒక బాధితురాలు ఇలా జ్ఞాపకం చేసుకుంటుంది: “ఆ పరిస్థితి నన్ను నాశనం చేసింది. నేను నా నమ్మకాన్ని, నా ధైర్యాన్ని, నా స్వగౌరవాన్ని మరియు నా వృత్తిపరమైన ఆశలను కోల్పోయాను. నా వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయింది. నేను సహజంగానైతే సంతోషంగా ఉండే మనిషిని. నేను కర్కషంగా, విముఖంగా మరియు సిగ్గుపడే దానిగా మారాను.” మరి నేరగాడు యజమాని లేక అధికారంలో ఉన్న వ్యక్తి అయితే, ప్రాముఖ్యంగా అప్పుడు ఆ వేధింపు మరి నీచమైన రూపాన్ని దాలుస్తుంది.
న్యాయస్థానాలు నేరస్థులకు శిక్ష విధించి, బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించడం ప్రారంభించాయంటే అందులో ఆశ్చర్యం లేదు. అమెరికా సుప్రీమ్ కోర్టు, అలాంటి దుష్‌ప్రవర్తనను పౌర హక్కుల ఉల్లంఘనగా వర్ణించింది గనుక, “ప్రతికూలమైనది లేక నీచమైనది” కాని ఉద్యోగ వాతావరణాన్ని నియంత్రించడం యజమానుల బాధ్యత అని చట్టం చెబుతోంది.
లైంగిక వేధింపును సహించే కంపెనీలు, ఉద్యోగుల నైతిక క్షీణత, ఎక్కువమంది పనికి హాజరు కాకపోవడం, తక్కువ ఉత్పత్తి మరియు అందుమూలంగా ఖాళీయైన ఉద్యోగాలను భర్తీ చేయడం వంటి వాటిని ఎదుర్కొనవలసి వస్తుంది. ఇక బాధితులు ఒకవేళ దావా వేయాలని తీర్మానించుకుంటే కలిగే ఆర్థికపరమైన అపార నష్టాన్ని గురించి ప్రస్తావించనక్కర్లేదు.
ఎంత ప్రబలమైంది?
లైంగిక వేధింపు ఎంత ప్రబలమైంది? అమెరికాలోని ఉద్యోగిణుల్లో సగంకంటే ఎక్కువమంది స్త్రీలు దాన్ని అనుభవించారని సర్వేలు సూచిస్తున్నాయి. ఓ పుస్తకం ఇలా పేర్కొంటుంది: “లైంగిక వేధింపు సర్వవ్యాప్త సమస్య. వెయిటెరెస్ దగ్గర నుండి కార్పొరేట్ట్ ఎగ్జిగ్యూటివ్ వరకూ, ప్రతి వృత్తిలోని స్త్రీలకూ ఇది సంభవిస్తుంది. కార్పొరేట్ట్ అధికారంలోని ప్రతి స్థాయిలోను మరియు ప్రతి విధమైన వ్యాపారం మరియు పరిశ్రమలోను అది జరుగుతుంది.” అయితే, ఈ సమస్య కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు. సూజన్ ఎల్. వెబ్ వ్రాసిన విద్యుత్‌ఘాతం: లైంగిక వేధింపు యొక్క ప్రపంచవ్యాప్త ప్రభావం (ఆంగ్లం) అనే పుస్తకం ఈ క్రింది గణాంక వివరాలను ఉదహరిస్తుంది:a
కెనడా: “10 మంది స్త్రీలలో నలుగురు, ఉద్యోగ స్థలంలో లైంగికంగా వేధింపబడ్డామని నివేదించినట్లు ఒక సర్వే చూపింది.”
జపాన్: “1991 ఆగస్టులో జరుపబడిన సర్వేకు ప్రతిస్పందించిన స్త్రీలలో 70 శాతం మంది” ఉద్యోగ స్థలంలో వేధింపును “అనుభవించారు. తాము ఉద్యోగానికి వెళ్లి, వచ్చే మార్గంలో లైంగికంగా వేధింపబడ్డామని తొంభై శాతంమంది చెప్పారు.”
ఆస్ట్రియా: “దాదాపు 31 శాతం మంది స్త్రీలు తీవ్రంగా వేధింపబడ్డారని 1986లోని సర్వే చూపింది.”
ఫ్రాన్స్: “సర్వే చేయబడిన 1,300 స్త్రీలలో 21 శాతం మంది తాము వ్యక్తిగతంగా లైంగిక వేధింపును అనుభవించామని చెప్పారని . . . 1991లోని ఒక అధ్యయనం కనుగొన్నది.”
నెదర్లాండ్స్: “[సర్వేకు ప్రతిస్పందించిన] వారిలో 58 శాతం మంది స్త్రీలు తాము వ్యక్తిగతంగా లైంగిక వేధింపును అనుభవించామని చెప్పారని” ఒక అధ్యయనం చూపింది.
కాలముల సూచన
ఉద్యోగ స్థలంలో బలవంతం చేయడం, వేధించడం క్రొత్త విషయాలేమీ కాదు. స్త్రీలు—కొన్నిసార్లు పురుషులు—బైబిలు కాలాల్లో కూడా అలాంటి అనాదరణకు గురయ్యారు. (ఆదికాండము 39:7, 8; రూతు 2:8, 9, 15) అయితే అలాంటి చెడు ప్రవర్తన ప్రాముఖ్యంగా మన దినాల్లో ప్రబలమైనట్లుంది. ఎందుకని?
ఒక విషయమేమంటే, ఇటీవలి సంవత్సరాల్లో స్త్రీలు రికార్డు సంఖ్యల్లో ఉద్యోగాల్లో ప్రవేశించారు. కాబట్టి ఎక్కువమంది స్త్రీలు అలాంటి దుష్‌ప్రవర్తన జరుగగల పరిస్థితులకు గురౌతున్నారు. అయితే, ఎంతో కాలం క్రితం బైబిలు ప్రవచించిన విషయం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది: “ఇది జ్ఞాపకం ఉంచుకోండి! అంత్య దినాల్లో కష్టతరమైన కాలాలు ఉంటాయి. మనుష్యులు స్వార్థాపరులై, పేరాశ కలిగి ఉంటారు, గొప్పలు చెప్పుకుంటూ, దురహంకారంగా ఉంటారు; వారు అవమానిస్తారు . . . ; వారు నిర్దయులుగా, కరుణలేని వారిగా, అపవాదులు పలికే వారిగా, దౌర్జన్యపూరితంగా మరియు క్రూరంగా ఉంటారు.” (2 తిమోతి 3:1-3, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్) లైంగిక వేధింపు ప్రబలమై ఉండటం, ఈ మాటలు నేడు నెరవేరుతున్నాయని అనేందుకు కేవలం ఒక రుజువు మాత్రమే. “లైంగిక వేధింపును గూర్చిన ఫిర్యాదులు ఎక్కువ కావడంతోపాటు సామాన్య సభ్యత విపరీతంగా తగ్గిపోతోంది. చెడుప్రవర్తన సర్వవ్యాప్తమైంది” అని పురుషుల ఆరోగ్యం అనే పత్రికలోని ఒక శీర్షిక పేర్కొనడం ఆసక్తికరంగా ఉంది.
లైంగిక వేధింపు ప్రబలమవ్వడం, 1960ల్లో ప్రపంచమంతటా వ్యాపించిన “క్రొత్త నైతికతను” కూడా ప్రతిబింబిస్తుంది. పారంపర్య నైతిక హద్దులను చేధించడంతోపాటు ఇతరుల హక్కులు మరియు భావాల ఎడల తీవ్రమైన నిర్లక్ష్య ధోరణి కూడా ఏర్పడింది. లైంగిక వేధింపుకుగల కారణాలు ఏవైనా, అది ఉద్యోగ స్థలంలోని ఒక క్రూరమైన వాస్తవం. తమను కాపాడుకునేందుకు స్త్రీపురుషులు ఏమి చేయగలరు? ఉద్యోగ స్థలంలో వేధింపు ఉండని సమయం ఎప్పటికైనా వస్తుందా?
[అధస్సూచి]
a పరిశోధకులు వేర్వేరు సర్వే పద్ధతులను, లైంగిక వేధింపును గూర్చిన వేర్వేరు నిర్వచనాలను ఉపయోగిస్తారు గనుక, గణాంక వివరాలు కొంత భిన్నంగా ఉండవచ్చు.
[4వ పేజీలోని బాక్సు]
లైంగిక వేధింపు—కల్పన మరియు వాస్తవం
కల్పన: లైంగిక వేధింపును గోరంతలను కొండంతలుగా చేసి చెబుతుంటారు. అది కేవలం మరో క్రొత్త ఫ్యాషన్, ప్రసార మాధ్యమాల వాణిజ్య ప్రకటనలు కలిగించిన పిచ్చి.
వాస్తవం: తాను బాధితురాలినని చెప్పుకోవడం ద్వారా మొత్తంమీద ఒక స్త్రీ పొందేది చాలా తక్కువ, పోగొట్టుకునేదే ఎక్కువ. వాస్తవానికి, అతి తక్కువమంది స్త్రీలే (ఒక సర్వే ప్రకారం 22 శాతంమంది మాత్రమే) తాము వేధింపబడ్డామని ఎవరికైనా చెప్పుకుంటారు. భయం, ఇబ్బంది, స్వనింద, గందరగోళం మరియు తమ న్యాయపర హక్కులను గురించి తెలియకపోవడం అనేకమంది స్త్రీల నోరు మూసేస్తుంది. కాబట్టి, ఈ సమస్యను గురించిన వాస్తవాలు ఎక్కువ బయటకు రావడం లేదని అనేకమంది నిపుణులు విశ్వసిస్తున్నారు.
కల్పన: తమపై అవధానం నిలిపితే అనేకమంది స్త్రీలు ఆనందిస్తారు. తాము వేధింపబడ్డామని చెప్పుకునే వారు కేవలం అతి సున్నితులు.
వాస్తవం: అలాంటి అమర్యాదకరమైన ప్రవర్తననుబట్టి స్త్రీలు అభ్యంతరపడ్డారని సర్వేలు ఎడతెగక చూపుతున్నాయి. ఒక సర్వేలో, “ఐదింట రెండు వంతులకంటే ఎక్కువమంది స్త్రీలు అలాంటి పనిని అసహ్యంగా భావించామని మరి మూడింట ఒకవంతు మంది కోపగించామని చెప్పారు.” వ్యాకులపడి, గాయపడినట్లు మరియు కృంగిపోయినట్లు భావించామని ఇతరులు చెప్పారు.
కల్పన: స్త్రీల వలె పురుషులు కూడా బాధితులే.
వాస్తవం: “వేధింపును గూర్చిన 90 శాతం కేసుల్లో స్త్రీలను పురుషులు వేధించారని, 9 శాతం వాటిలో స్వలింగ సభ్యులచేత వేధింపబడ్డారని . . . కేవలం 1 శాతం మాత్రమే స్త్రీలు పురుషులను వేధించారని” ఉద్యోగినుల జాతీయ సమాఖ్య (అమెరికా) పరిశోధకులు నివేదిస్తున్నారు.
[5వ పేజీలోని చిత్రం]
లైంగిక వేధింపు కేవలం లైంగికతను గురించినది మాత్రమే కాదు