కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 6/8 పేజీలు 11-13
  • సీసీ ఈగ ఆఫ్రికాకు ఓ శాపమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సీసీ ఈగ ఆఫ్రికాకు ఓ శాపమా?
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అది రక్తం పీలుస్తుంది
  • అది జంతువులను చంపుతుంది
  • అది ప్రజలను చంపుతుంది
  • దాని పక్షాన ఓ మాట
  • పండ్ల మీద వాలే చిన్న ఈగ గాలిలో చేసే విన్యాసాలు
    సృష్టిలో అద్భుతాలు
  • చిన్ని ప్రాణులు ఎగరటంలో ఉద్దండులు
    తేజరిల్లు!—1999
  • కీటక సంక్రమిత వ్యాధులు పెరుగుతున్న సమస్య
    తేజరిల్లు!—2003
  • పరాన్న జీవుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి!
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 6/8 పేజీలు 11-13

సీసీ ఈగ ఆఫ్రికాకు ఓ శాపమా?

నైజీరియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

పశ్చిమ ఆఫ్రికాలోని ఒక గ్రామీణ ప్రాంతానికి మేము ఇటీవలనే తరలి వెళ్లాము. మా చుట్టూ ఉష్ణమండల అడవి ఉంది. ఓ మధ్యాహ్నం నా భార్య చిన్న గదిలోకి (క్లోజెట్‌లోకి) వెళ్లిన వెంటనే “ఇక్కడో జోరీగ ఉంది” అని అరిచింది!

ఆ ఈగ చిన్న గదిలోనుండి స్నానాల గదిలోకి దూసుకెళ్లింది. నేను ఓ కీటకనాశిని క్యాన్‌ పట్టుకుని దాని వెనకాలే వెళ్లి, తలుపు మూశాను. ఆ ఈగ ఎక్కడా కనిపించలేదు. అకస్మాత్తుగా అది నా మొహంకేసి ఎగిరింది. అది నాపై దాడి చేస్తోంది! నా చేతులు ఆడిస్తూ, దాన్ని కొట్టేందుకు నేను విఫల ప్రయత్నం చేశాను. అది కిటికీ వైపుకు దూసుకెళ్లింది. కిటికీకున్న మెష్‌ దాన్ని అడ్డగించింది. ఆ ఈగ దానిపై వాలింది.

నేను గురి చూసి ఆ ఈగపై కీటకనాశినిని కురిపించా. సాధారణంగా అలా సూటిగా దాడి చేయడం ఎలాంటి ఈగనైనా తక్షణమే చంపుతుంది. అయితే ఈ ఈగని మాత్రం అది చంపలేకపోయింది. అది మళ్లీ పైకెగిరి, స్నానాల గదిలో అంతటా జుమ్మని తిరుగసాగింది.

ఇది గట్టి పిండమే సుమా! కీటకనాశిని తన ప్రతాపం చూపుతుందని, ఆ ఈగ త్వరలోనే నేలకొరుగుతుందనీ నేను గట్టిగా నమ్మాను. అయితే అది పడలేదు. అది మరోసారి వాలినప్పుడు, నేను రెండవ సారి స్ర్పే చేశాను. అది మళ్లీ ఎగిరిపోయింది.

ఇదెక్కడి భయంకరమైన ఈగ? మరో రెండుసార్లు సూటిగా దాడి చేశాక, తుదకు అది చచ్చింది.

నేను నా కళ్లజోడు ధరించి, ఆ ప్రాణిని జాగ్రత్తగా పరిశీలించాను. అది మామూలు ఈగకంటే పెద్దగా ఉంది, కానీ జోరీగ అంత పెద్దగా లేదు. దాని రెక్కలు దాని వీపుపై ఒకదానికి మరొకటి అడ్డంగా ఉన్నాయి, ఒక సాధారణ ఈగ కంటే మరింత ఆధునిక హంగును అవి దానికి ఇస్తున్నాయి. దాని నోటి భాగంలో ఒక పొడుగాటి సూదివంటి మొన ఉంది.

“ఇది జోరీగ కాదు. ఇది సీసీ ఈగ” అని నా భార్యను పిలిచి చెప్పాను.

ఆ ఈగను దానికున్న 1 కోటి 17 లక్షల చదరపు కిలోమీటర్ల ఆఫ్రికా సామ్రాజ్యం నుండి అంటే సంయుక్త రాష్ట్రాల కంటే పెద్ద స్థలంనుండి వెళ్లగొట్టాలని చేయబడుతున్న ప్రయత్నాల కష్టాన్ని ఆ ఎన్‌కౌంటర్‌ నాకు తెలియజేసింది. ప్రజలు దాన్నెందుకు నిర్మూలించాలని కోరుకుంటున్నారు? దానిపై మూడు నిందలు మోపబడ్డాయి. మొదటి నింద:

అది రక్తం పీలుస్తుంది

సీసీ ఈగలు 22 రకాలు ఉన్నాయి. అన్నీ కూడా సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రికా భాగంలో నివసిస్తున్నాయి. ఆడవి, మగవీ కూడా, వెన్నెముకగల ప్రాణుల రక్తాన్ని పీలుస్తాయి, ఒకసారి కుట్టినప్పుడే తమ బరువుకంటే మూడంతల రక్తాన్ని పీలుస్తాయి.

అవి ఆఫ్రికాలోని వాటిని, బయటి వాటిని—అంటే మేసే జంతువుల విస్తృత శ్రేణిని రుచి చూస్తాయి. అవి ప్రజలను కూడా కుడతాయి. అది కుట్టడం లోతైన, రక్తాన్ని పీల్చే గాటు, అది పదునుగా, నొప్పి కలిగించేదిగా ఉంటుంది. అది దురద పుట్టిస్తుంది, నొప్పి కూడా కలిగిస్తుంది. అది దద్దు కలిగిస్తుంది.

సీసీ ఈగలు తమ పనిలో నిపుణతగలవి. అవి మీ తల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేయవు. అవి తూటాల్లా ఒకరిపైకి దూసుకు వచ్చి, అంతేవేగంతో ఆగి, అవి ఎవరిమీద వాలుతున్నాయో వారికి తెలియనంత సున్నితంగా వాళ్ల మొహాలపై వాలగలవు. అవి దొంగల్లా ఉంటాయి; అవి కొంత రక్తాన్ని దొంగిలించాయని అవి వెళ్లిన తర్వాతే కొన్నిసార్లు మీకు తెలుస్తుంది, అప్పుడు మీకు మిగిలిందల్లా మీకు కలిగిన నష్టాన్ని బేరీజు వేసుకోవడమే.

అవి సాధారణంగా అనాచ్ఛాదిత శరీర భాగాన్ని ఇష్టపడతాయి. (అవి నా మెడ వెనక భాగాన్ని ఇష్టపడతాయని నాకు అనిపిస్తుంది!) అయితే కొన్నిసార్లు, అవి పంట్లామ్‌ కాలులోకి లేక చొక్కా చేతిలోకి పాకిపోయి అప్పుడు కుట్టాలని కూడా తీర్మానించుకోవచ్చు. లేక వాటికి ఇష్టమనిపిస్తే అవి బట్టలు ఉన్న పై భాగంనుండి కూడా కుట్టగలవు, ఓ ఖడ్గమృగం యొక్క దళసరి చర్మాన్ని చీల్చగల ఈ కీటకానికి, బట్టలపైనుండి కుట్టడం ఓ లెక్క కాదు.

సీసీ ఈగ తెలివైనదే కాక జిత్తులమారిది కూడా అని ప్రజలు దాన్ని నిందిస్తారు. ఒకసారి నేను ఈ ఈగనొకదాన్ని కీటకనాశినితో చంపేందుకు ప్రయత్నించాను, అది మా చిన్న గదిలోకి ఎగిరి వెళ్లి, నా స్విమ్మింగ్‌ లాగులో దాగింది. రెండు రోజుల తర్వాత నేను ఆ లాగును వేసుకున్నప్పుడు అది నన్ను రెండుసార్లు కుట్టింది! మరోసారి ఒక సీసీ ఈగ నా భార్య పర్సులో దాగింది. ఆమె ఆ పర్సును ఆఫీసుకు తీసుకెళ్లింది, ఆమె తన చేతిని లోనకు పెట్టినప్పుడు అది ఆమె చేతిని కుట్టింది. అది ఆ గది అంతా ఎగిరి, ఆఫీసు ఉద్యోగులకు మహా కష్టాన్ని కలిగించింది. దాన్ని కొట్టాలని ప్రయత్నిస్తూ అందరూ తమ పని ఆపేశారు.

సీసీ ఈగపై మోపబడిన మొదటి నింద ఏమంటే అది నొప్పి కలిగించే విధంగా కుట్టి రక్తాన్ని పీలుస్తుంది. రెండవ నింద:

అది జంతువులను చంపుతుంది

సీసీ ఈగల్లో కొన్ని రకాలు, ట్రిపానోసోమాలు అనే చిన్ని పరాన్నజీవుల ద్వారా వచ్చే వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. ఈ వ్యాధి ఉన్న జంతువు రక్తాన్ని సీసీ ఈగ త్రాగినప్పుడు అది ఆ పరాన్నజీవులున్న రక్తాన్ని త్రాగుతుంది. అవి ఆ ఈగ లోపల అభివృద్ధి చెంది ఎక్కువ అవుతాయి. ఆ ఈగ మరొక జంతువును కుట్టినప్పుడు, ఈ పరాన్నజీవులు ఈగ నుండి ఆ జంతువు రక్తప్రసరణలోకి వెళ్తాయి.

ఆ వ్యాధిని ట్రిపానోసోమియాసిస్‌ అంటారు. జంతువుల్లో వచ్చే ఈ రోగాన్ని నగానా అని పిలుస్తారు. నగానా పరాన్నజీవులు ఆఫ్రికాలోని అనేక జంతువుల రక్తప్రసరణలో వృద్ధి చెందుతాయి, ప్రాముఖ్యంగా దుప్పిలు, దున్నపోతులు, పొద పందులు, లేళ్లు, జింకలు మరియు ఆఫ్రికాపందుల్లో ఉంటాయి. ఆ పరాన్నజీవులు ఈ జంతువులను చంపవు.

అయితే ఈ పరాన్నజీవులు ఆఫ్రికాకు వలస వచ్చిన జంతువులైన ఒంటెలు, కుక్కలు, గాడిదలు, మేకలు, గుర్రాలు, కంచర గాడిదలు, ఎద్దులు, పందులు మరియు గొర్రెలను నాశనం చేస్తాయి. జాతీయ భూగోళశాస్త్రం (ఆంగ్లం) అనే పత్రిక ప్రకారం, నగానా రోగం ప్రతి సంవత్సరం 30 లక్షల జంతువులను చంపుతుంది.

సీసీ ఈగలు విపరీతంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా నివారించడాన్ని తూర్పు ఆఫ్రికా వారైన మాసాయ్‌ వంటి మంద కాపరులు నేర్చుకున్నారు, అయితే క్షామం మరియు మేత లేకపోవడం కొన్నిసార్లు దీన్ని అసాధ్యం చేస్తాయి. ఇటీవలనే సంభవించిన క్షామంలో, తమ 600 జంతువులను ఒకే దగ్గర ఉంచిన నాలుగు కుటుంబాలు, దినానికి ఒకటి చొప్పున ఆ ఈగ వలన తమ జంతువులను కోల్పోయారు. వారిలోని ఒక కుటుంబ పెద్ద అయిన లెసలాన్‌ ఇలా చెప్పాడు: “మాసాయ్‌లమైన మేము ఎంతో ధైర్యంగల ప్రజలము. మేము సింహాన్ని చీల్చేస్తాం, దాడి చేస్తున్న దున్నపోతును అడ్డుకుంటాం. నల్ల మాంబాను ఎదిరిస్తాం, కోపంతో ఉన్న ఏనుగుని ఎదుర్కొంటాం. అయితే ఓర్కీంబై [సీసీ ఈగ] విషయంలో? మేము నిస్సహాయులం.”

నగానా రోగాన్ని నయం చేయగల మందులు ఉన్నాయి, అయితే వాటిని పశువుల వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలని కొన్ని ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. అలా చేయడానికి మంచి కారణం ఉంది, ఎందుకంటే తక్కువ మోతాదులో మందును ఇవ్వడం జంతువుకు ప్రమాదం కలిగించడం మాత్రమే కాక మందులకు లొంగని పరాన్నజీవులను ఉత్పన్నం చేస్తాయి. పొదల్లో ఉన్న మందకాపరి, మరణించబోతున్న తన జంతువులకు చికిత్స చేసేందుకు పశువుల వైద్యున్ని సరైన సమయానికి కనుగొనడం కష్టం కావచ్చు.

సీసీ ఈగ రక్తాన్ని పీలుస్తుంది మరియు జంతువులను చంపే వ్యాధిని వ్యాపింపజేస్తుందని దానిపై మోపబడిన మొదటి రెండు నిందలు నిర్ధ్వందంగా నిరూపించబడ్డాయి. అయితే మరొకటి ఉంది. మూడవ నింద:

అది ప్రజలను చంపుతుంది

నగానా ట్రిపానోసోమా మనుష్యులను పీడించదు. కానీ, సీసీ ఈగ మనిషి నుండి మనిషికి మరో విధమైన ట్రిపానోసోమాను మోసుకొస్తుంది. ఈ విధమైన ట్రిపానోసోమియాసిస్‌ను అతినిద్రా వ్యాధి అని అంటారు. అతినిద్రా వ్యాధిగల వ్యక్తి ఎక్కువగా నిద్రపోతుంటాడని భావించకండి. ఆ వ్యాధి హాయి గొలిపే నిద్రనివ్వదు. అది అనారోగ్యం, విసుగు మరియు కొద్దిగా జ్వరం రావడంతో ప్రారంభమౌతుంది. దాని తర్వాత దీర్ఘకాల మగత, తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు, ధాతువులు వాయడం మరియు కాలేయము, ప్లీహము ఉబ్బడం జరుగుతుంది. చివరి దశల్లో, ఆ పరాన్నజీవి కేంద్ర నాడీమండలంలోనికి చొచ్చినప్పుడు రోగి మానసిక స్థితి మెల్లిగా నశిస్తుంది, అకస్మాత్తుగా అంగవైకల్యం వస్తుంది మరియు కోమాలోనికి జారుకుంటాడు, చివరకు మరణిస్తాడు.

ఈ శతాబ్దం తొలి భాగంలో, అతినిద్రా వ్యాధి వ్యాపించి ఆఫ్రికా ఖండాన్ని నాశనం చేసింది. 1902 నుండి 1905 మధ్యకాలంలో, విక్టోరియా సరస్సు వద్ద ఈ వ్యాధి 30,000 మందిని చంపింది. ఆ తర్వాతి దశాబ్దాల్లో ఈ వ్యాధి, కమెరూన్‌, ఘానా మరియు నైజీరియాకు వ్యాపించింది. అనేక గ్రామాల్లో ప్రజల్లోని మూడింట ఒక వంతుమందికి ఈ వ్యాధి సోకింది, అందుకు నదీ లోయల్లోని ప్రజలను ఎక్కువ సంఖ్యలో తరలించాల్సి వచ్చింది. సంచార జట్లు వందల వేల మంది ప్రజలకు చికిత్స చేశాయి. 1930 ముగింపు వరకూ కూడా ఈ తెగులు అంతమొంది మరణించలేదు.

నేడు ఈ వ్యాధి ప్రతి సంవత్సరం దాదాపు 25,000 మంది ప్రజలను పీడిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రికా భాగంలోని 36 దేశాల్లోని ఐదు కోట్లకంటే ఎక్కువమంది ప్రజలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అతినిద్రా వ్యాధికి చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకమైనదే అయినప్పటికీ, దాన్ని నయం చేసేందుకు మందులు ఉన్నాయి. ఆ వ్యాధిని నయం చేసేందుకు ఇటీవలనే ఎఫ్‌లార్నీథైన్‌ అనే పేరుగల ఒక క్రొత్త మందును కనిపెట్టారు—40 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా కనిపెట్టిన మందు.

సీసీ ఈగకు మరియు అది మోసుకొచ్చే వ్యాధికి విరుద్ధంగా మానవులు ఒక సుదీర్ఘ పోరాటాన్ని సలిపారు. సీసీ ఈగను నిర్మూలించాలన్న ఒక ప్రచారదాడిని గురించి విన్స్‌టన్‌ చర్చిల్‌ 1907లో ఇలా వ్రాశాడు: “దాని చుట్టూ ఓ చిక్కని వల నిర్దాక్షిణ్యంగా అల్లబడుతోంది.” గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే, చర్చిల్‌ యొక్క “చిక్కని వల”లో పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయన్నది స్పష్టం. పరాన్న జీవశాస్త్రం యొక్క పునాదులు (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా పేర్కొంటోంది: “ఇప్పటి వరకూ, సీసీని నిర్మూలించాలని 80 సంవత్సరాలపాటూ జరిగిన ప్రయత్నాలు, సీసీ యొక్క వ్యాప్తిపై ఎంతో తక్కువ ప్రభావాన్ని చూపాయి.”

దాని పక్షాన ఓ మాట

అమెరికా కవి ఓగ్‌డెన్‌ నాష్‌ ఇలా వ్రాశాడు: “దేవుడు తన అపార జ్ఞానంతో ఈ ఈగను చేశాడు, అయితే దాన్నెందుకు చేశాడో మనకు చెప్పడం మరిచాడు.” అన్నిటికీ సృష్టికర్త యెహోవాయే అన్నది వాస్తవమే అయినప్పటికీ, ఆయనకు మతిమరుపు ఉందన్న విషయం ఎంతమాత్రం వాస్తవం కాదు. ఎన్నో విషయాలను మనకై మనమే కనుగొనాలని ఆయన ఉంచాడు. సీసీ ఈగ విషయమేమిటి మరి? ఈ ప్రతినాయకుని పక్షంలో ఏదైనా చెప్పవచ్చా?

దాని పక్షాన ఇంతవరకూ ఉన్న అతి దృఢమైన మద్దతు ఏమంటే, పశువులను నాశనం చేయడంలోని దాని పాత్ర ఆఫ్రికాకు చెందిన వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలను కాపాడేందుకు తోడ్పడింది. ఆఫ్రికాలోని విస్తారమైన ప్రాంతాలు పశ్చిమ అమెరికాలోని గ్రాస్‌లాండ్స్‌ వంటివే—ఆ భూమే సాధు జంతువులకు తగినంత మేత ఇవ్వగలదు. అయితే సీసీ ఈగ మూలాన, ఆఫ్రికాకు చెందిన మేసే జంతువులను చంపని ట్రిపానోసోమాల ద్వారా సాధు జంతువులు చంపబడుతున్నాయి.

సీసీ ఈగ గనుక ఉండకపోతే, ఆఫ్రికాకు చెందిన విస్తారమైన వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాల స్థానంలో పశువుల మందలు వచ్చేవని అనేకమంది విశ్వసిస్తున్నారు. “నేను సీసీని సమర్థిస్తాను” అని, బోట్స్‌వానా వన్య ప్రాణి సంరక్షణ కేంద్రంలో గైడ్‌గా పనిచేస్తున్న విల్లీ నీకెర్క్‌ అంటున్నాడు. “సీసీని నిర్మూలించారో పశువులు విజృంభిస్తాయి, పశువులు ఆఫ్రికాను కొల్లగొడతాయి, అవి ఈ ఖండాన్నంతా ఓ పెద్ద బీడు భూమిగా మారుస్తాయి.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఆ ఈగ ఇక్కడే ఉండాలి.”

అయితే అందరూ ఆ విషయంలో అంగీకరించకపోవచ్చు. ట్రిపానోసోమియాసిస్‌ వలన తన పిల్లలు లేక పశువులు పీడింపబడటం చూసే వ్యక్తిని ఈ తర్కం ఎంతమాత్రం ఒప్పించదు. తనను తాను పోషించుకునేందుకు ఆఫ్రికాకు పశువులు అవసరం అని వాదించే వాళ్లను కూడా ఇది ఒప్పించలేదు.

అయిననూ, ప్రకృతిలో సీసీ ఈగ పోషించే పాత్రను గురించి ఇంకా ఎంతో ఎక్కువ నేర్చుకోవలసిన అవసరం ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దానికి విరుద్ధంగా ఉన్న నిందలు ఎంతో దృఢమైనవిగా కనిపించినప్పటికీ, ఏదైనా ఒక తీర్పు తీర్చడం తొందరపాటు పని కావచ్చు.

ఈగల గురించి మాట్లాడుతుండగా, ఓ ఈగ ఇప్పుడే గదిలోకి వచ్చింది. అది సీసీ ఈగో కాదో చూసి వస్తాను ఉండండి.

[Picture Credit Line on page 11]

Tsetse fly: ©Martin Dohrn, The National Audubon Society Collection/PR

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి