వికలాంగున్ని—అయినా వాహనం నడిపేందుకు సమర్థున్ని
“నేను కారు నడపగలను!” ఈ మాటలు మీకు విశేషంగా ఉండకపోవచ్చు, కానీ అవి నాపై నిర్దిష్టమైన ప్రభావాన్ని చూపాయి. ఆ మాటలు పలికిన 50 సంవత్సరాల వ్యక్తి, నా ఎదుట నేలపై ఉన్నాడు. అతను చిన్న బాబుగా ఉన్నప్పుడే అతనికి పోలియో వచ్చింది గనుక, అతని కాళ్లు అంతగా పెరగలేదు. అవి చిన్నగా, నిరుపయోగంగా ఉండి అతని శరీరం క్రింద మడిగి ఉన్నాయి. అయినప్పటికీ, సంవత్సరాలుగా అతను తన చేతుల సహాయంతోనే ప్రయాణించడం ద్వారా అతను శక్తివంతమైన చేతులనూ భుజాలనూ పెంచుకున్నాడు. అతనికి తనపై జాలి ఎంతమాత్రం లేకపోవడం—ప్రాముఖ్యంగా, తాను వాహనాన్ని నడుపగలనని సగర్వంగా చెప్పేటప్పుడు అతని స్వరంలో ధ్వనించిన ఆనందం—నేను సిగ్గుపడేలా చేశాయి.
నాకు 28 ఏళ్లున్నప్పుడు నాకు పోలియో వచ్చింది. ఇక కర్రలు లేకుండా నేను ఎంతమాత్రం నడవలేనన్న వార్త నన్ను కృంగదీసింది. ఈ వ్యక్తి యొక్క సరళమైన మాటలు, నేను నా కృంగుదలను ఎదుర్కొనేందుకు నాకు సహాయం చేశాయి. నాతో నేను ఇలా తర్కించుకున్నాను, నాకంటే తీవ్రంగా వికలాంగుడైన ఈ వ్యక్తి తన అవిటితనం నుండి పైగి ఎదగగలిగినప్పుడు, నేను ఎందుకు ఎదగలేను? నేను కూడా మళ్లీ కారు నడిపిస్తానని అక్కడే తీర్మానించుకున్నాను!
అదంత సులభం కాదు
అది దాదాపు 40 సంవత్సరాల పూర్వపు సంగతి. అప్పట్లో, వికలాంగునిగా కారు నడపాలంటే ఎంతో ధైర్యం కావాలి. నా అవసరాలకు తగినట్లు మార్చబడిన నా కారు ఎంతో చమత్కారమైనది! నా ఎడమ చంక క్రింద ఒక కర్ర బిగించడం జరిగింది, అది క్రిందున్న క్లట్చ్ పెడల్ వరకూ ఉంటుంది. నేను నా ఎడమ భుజాన్ని ముందుకు కదపడం ద్వారా నేను క్లట్చ్ను బిగించేవాన్ని. ఆ ఆక్సిలరేటర్ చేతితో ఆపరేట్ చేసే లివర్, అది తొలి టీ ఫోర్డ్ మాడల్ నుండి తీయబడింది, మరి బ్రేకు కూడా చేతి లివర్ ద్వారానే వేయబడేది. నేను వాహనం నడపడాన్ని మీరు ఊహించుకోగలరా? నా భుజం ముందుకూ వెనక్కీ కదిలేది, నా ఎడమ చేయి స్టీరింగ్ తిప్పేది మరియు బ్రేక్ వేసేది, నా కుడి చేయి స్టీరింగ్ తిప్పడం, ఆగ్జిలరేట్ చేయడం మరియు చేతితో సూచనలు చేయడంలో నిమగ్నమై ఉండేది! (ఆస్ట్రేలియాలో మేము రోడ్డుకు ఎడమ వైపున వాహనాలు నడుపుతాం.) అప్పట్లో కార్లకు ట్రాఫిక్-ఇండికేటర్ బ్లింకర్లు అంటే వాహనం ఎటువైపు మరలబోతుందో సూచించేందుకు అప్పుడప్పుడూ వెలిగే లైట్లు ఉండేవి కావు.
విసుగు పుట్టించే ఉపకరణాలతో కారు నడిపే ఆ రోజులు గతించిపోయాయని నేనెంతో సంతోషిస్తున్నాను. నేడు, ఆటోమేటిక్ పరికరాలు మరియు ఫింగర్ టిప్ టర్న్ ఇండికేటర్లతో అంటే వాహనం ఎటువైపు మరలబోతుందో సూచించేందుకు అప్పుడప్పుడూ వెలిగే లైట్లను ఆన్ చేసేందుకు చేతి వేళ్లతో నొక్కగల స్విచ్‌లతో వాహనాన్ని నడపడం ఎంతో సులభమైంది. సాంకేతిక పరిజ్ఞానం అనేకమంది వికలాంగులు వాహనం నడిపేందుకు వీలు కలిగించాయి. సాధారణంగా ఉపయోగించే కొన్ని పరికరాలు 20వ పేజీలోని బాక్సులో వివరించబడ్డాయి.
నా వ్యక్తిగత సలహాలు
మీరు వికలాంగులై ఉండి, వాహనం నడపగలిగేలా ఒక వాహనాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, ఈ రంగంలోని నిపుణులను మీరు సంప్రదించాలని నేను సలహా ఇస్తున్నాను. డ్రైవర్‌గా మీ భద్రతను మరియు మీ ప్రయాణీకుల భద్రతను కాపాడేందుకు ఆ యంత్రంలోని పరికరాలన్నిటినీ అతను పర్యవేక్షించగలడు. ప్రమాదం జరిగే సాధ్యత ఉన్నందుకు, గుర్తింపబడిన భీమా కంపెనీలో మీ వాహనాన్ని పూర్తిగా భీమా చేయించడం చాలా ప్రాముఖ్యం.
మామూలుగా, మీరు వాహనం నడుపుతున్నప్పుడు ఎవరినైనా ఒకరిని మీ వెంట తీసుకెళ్లడం జ్ఞానయుక్తమైన పని. ఒక ప్రాచీన సామెత యుక్తిగా ఇలా సలహా ఇస్తోంది: “ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును.” (ప్రసంగి 4:9, 10) మీరు ప్రమాదానికి గురైతే, వాహనంలో సమస్యలు వస్తే లేక టయర్‌లో గాలిపోతే, ఎవరైనా తోడుగా ఉండటం ఎంతో సహాయకరంగా ఉంటుంది. వికలాంగులైన డ్రైవర్లు కొందరు తమ కారులో సెల్యులార్ టెలిఫోనును పెట్టుకుంటారు. అలా అవసరమైనప్పుడు వారు ఒంటరిగా వాహనం నడుపగలరు, మరింత ధైర్యంగా కూడా ఉండగలరు.
వికలాంగుడైన డ్రైవర్, మోటరిస్టుల సేవా సంస్థలో చేరడం కూడా ఎంతో వివేకమైన పని, అలా సహాయం కొరకు కోరితే రాత్రయినా పగలైనా త్వరితంగా ప్రతిస్పందన లభిస్తుంది. సాంవత్సరిక రుసుము సాధారణంగా తక్కువగానే ఉంటుంది—అది అందించగల మనశ్శాంతికి చెల్లించే ఈ రుసుము ఎంతో తక్కువే.
వికలాంగులైన డ్రైవర్లమైన మనం మన పరిమితులను అంగీకరించి దానికి తగినట్లు వాహనం నడపాలన్న విషయం స్పష్టమే. మనం ఇతరులంత మంచిగా నడపగలమని నిరూపించుకునేందుకు దురుసుగా నడపవలసిన అవసరం లేదు. బదులుగా, అనేకమంది వికలాంగుల వాహనాల మీద, “వికలాంగుడైన డ్రైవర్—జాగ్రత్త” వగైరా గమనికలు వ్రాసి ఉంటాయి. వికలాంగుడైన డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఇతరులకంటే కొంత నెమ్మదిగా నడిపేందుకు ఇది కేవలం ఒక గమనిక మాత్రమే. ఇతరులు వారికి దూరంగా ఉండాలని దీని అర్థం కాదు. వాస్తవానికి, నాకు తెలిసినంత మేరకు అనేక సందర్భాలలో వికలాంగుడైన వ్యక్తి బ్రేకులు వేసేందుకు, ప్రాముఖ్యంగా ఆధునిక పరికరాల రాకతో, అవిటితనం లేని డ్రైవర్లకంటే ఎక్కువ సమయమేమీ తీసుకోడు.
వాహనం నడపాలా వద్దా—ఓ బాధ్యతగల నిర్ణయం
మీరు వికలాంగులై ఉండి, వాహనం నడపాలని ఇష్టపడుతుంటే, మీరు ఈ విషయాన్ని ఎంతో గంభీరంగా పరిగణించాలి. మొదట మీ వైద్యున్ని, మీ కుటుంబ సభ్యులను సంప్రదించండి. మీరు ఇలాంటి ప్రశ్నలను కూడా పరిశీలించవచ్చు: నేను వాహనం నడపడం ప్రాముఖ్యమా? ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే నేను దాన్ని తట్టుకోగలనా? నాలోని ఎలాంటి భయాలనైనా నేను అధిగమించగలనా? దాని ప్రయోజనాలేమిటి? వాహనం నడపగల నా సామర్థ్యం, నేను మళ్లీ పనిలోకి వెళ్లేందుకు తోడ్పడగలదా? ఇతర ప్రజలతో నేను ఎక్కువగా కలిసిపోయేందుకు అది నాకు సహాయం చేయగలదా?
వాహనం నడపడం ఎప్పుడు మానేయాలో తెలుసుకోవడం కూడా ప్రాముఖ్యమే. వికలాంగుడైనా కాకపోయినా, ఏ డ్రైవరైనా వివేచనాశక్తి మరియు వేగం తగ్గుతుండగా ఆ నిర్ణయాన్ని తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. మీకు ఆ సమయం వచ్చినప్పుడు, మీరు మిమ్మల్ని మాత్రమే పరిగణించుకోరు. మీరు ప్రేమించే మీ కుటుంబ సభ్యులు, మీ పొరుగువారి మరియు రోడ్డుపై నడిచే మీ తోటి మానవుని సంగతేమిటి? వికలాంగులుగా మీరు కారు నడపడం వారికి వాస్తవంగా ప్రమాదకరం కాగలదా?
నా స్వదేశమైన ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాల్లో, 65 సంవత్సరాలకు ఎక్కువ వయస్సుగల ప్రతి వికలాంగుడైన డ్రైవరూ తన డ్రైవింగ్ లైసన్స్‌ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే రిన్యూ చేసుకోగలడు, అది కూడా అతనికిగల డ్రైవింగ్ సామర్థ్యాన్ని ఇంకా క్షీణింపజేసే వైద్య సమస్యలు లేవని వైద్యుని వద్దనుండి ధృవపత్రాన్ని తెచ్చిన తర్వాతే ఇవ్వబడుతుంది.
నా కారు, నా పరిచర్య
త్వరగా అభివృద్ధి చెందుతున్న నేటి యుగంలో, కొన్ని దేశాల్లోని క్రైస్తవులకు స్వయంచలన వాహనం ముఖ్యావసరంగా మారింది. వేల కొలది, బహుశ లక్షలాది మంది ప్రజల వద్దకు దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను తీసుకెళ్లేందుకు కార్లు వారికి సహాయం చేశాయి. (మత్తయి 24:14) అవిటితనం ఉన్న నావంటి వారి విషయంలో ఇది ప్రాముఖ్యంగా వాస్తవం. నా వ్యక్తిగత అవసరతలకు తగినట్లు మార్చబడిన నా వాహనం ప్రమాదాలు, అనారోగ్యం మరియు అన్ని విధాలైన అవిటితనాలు లేని ఒక క్రొత్త లోకం రాబోతుందన్న నా నమ్మకాలను గురించి ఇతరులకు చెప్పేందుకు నాకు తోడ్పడుతుంది. (యెషయా 35:5, 6) కొందరు వికలాంగులు పూర్తికాల సువార్తికులుగా కూడా సేవ చేసేందుకు వీలుకలిగింది.
అమెరికాలోని లోవానందలి ఒక యెహోవాసాక్షి చక్రాల కుర్చీలోనే ఉంటూ, అనేక సంవత్సరాల వరకూ అలా సేవ చేయగలిగింది. తన వ్యాను తనకు ఎంతో సహాయం చేయగలిగిందని ఆమె చెబుతుంది; ఆమెను వ్యాన్‌లోకి పైకి ఎత్తే ఒక హాయిస్ట్ వంటి ప్రత్యేక కంట్రోల్‌ను ఒక తోటి సాక్షి రూపొందించాడు. ఒకసారి కార్లోకి వచ్చిన తర్వాత ఆమె చక్రాల కుర్చీలోనుండి డ్రైవర్ సీటులోకి మారుతుంది. ఆమె ఇలా చెబుతోంది: “ఈ విధంగా నేను బయటకు వెళ్లి, క్రమంగా ప్రజల ఇళ్లను దర్శించగల్గుతున్నాను, నేను సాధారణంగా అనేక బైబిలు పఠనాలను నిర్వహించగలుగుతున్నాను.”
నేను పరిచర్యలో పూర్తికాల సేవ చేయలేకపోతున్నప్పటికీ, నా అవసరాలకు తగినట్లు మార్చబడిన నా వాహనం ప్రకటనా పనిలో నాకెంతో గొప్ప తోడుగా ఉంది. అనేక సంవత్సరాలుగా నేను కర్రల ఆధారంగానే ఇంటింటికీ వెళ్లేవాన్ని, అయితే సమయం గడిచే కొలది నా రెక్కలు, భుజాలపై ఎక్కువ భారం పడేది. కాబట్టి నాకు కొంత సులభంగా ఉండే పరికరాన్ని నేను వెదకవలసి వచ్చింది. నేను పట్టణంలో సేవ చేస్తున్నా లేక పల్లె ప్రాంతంలో సేవ చేస్తున్నా, డ్రైవ్వేలుగల ఇళ్లను నేను ఎన్నుకుంటాను, అలా నేను వాళ్ల తలుపు వరకూ వాహనాన్ని తీసుకెళ్లగల్గుతాను.
నేను మొదటిసారి సందర్శించేటప్పుడు సాధారణంగా నేను కారు దిగి కర్రల ఆధారంగా తలుపు వద్దకు వెళ్తాను, నేను అక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని వాళ్లకు వివరిస్తాను. ఒకవేళ ఇంటి యజమాని వర్తమానం ఎడల కొంత ఆసక్తి చూపితే, నేను కొంత స్నేహాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాను అలా నా తదుపరి సందర్శనాల సమయంలో నేను వచ్చానని వాళ్లకు తెలియజేసేందుకు నా కారు హారన్‌ను మోగించే ధైర్యం చేయగల్గుతాను, అప్పుడు వాళ్లే నా వద్దకు రావాలి.
ఇలా చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. అసౌకర్యంగా భావించే బదులు, చాలామంది ఇంటి యజమానులు కొద్ది నిమిషాలు నాతోపాటు కారులో కూర్చునేందుకు అంగీకరిస్తారు, అలా మేము కష్టతరమైన వాతావరణం నుండి కాపాడబడి హాయిగా మాట్లాడుకోగలం. నా సందర్శనాలను ఆహ్వానించి, ప్రోత్సాహకరమైన బైబిలు వర్తమానాన్ని గురించి చర్చించేందుకు ఎదురుచూసే మరియు ఇటీవలి కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను అందుకునేందుకు ఇష్టపడే ఇంటి యజమానులు చాలామంది ఉన్నారు.
వికలాంగులైన ప్రతి వ్యక్తికి భిన్నమైన పరిస్థితులు ఉంటాయన్నది వాస్తవమే. వాహనం నడపడంవల్ల నాకు కల్గిన ప్రయోజనాలు మీకు కూడా కలుగవచ్చు—తిరిగి నెలకొన్న నమ్మకం, స్వేచ్ఛ, ఇతరులకు సహాయం చేయగల అవకాశం మరియు “నేను కారులో అలా బయటకు వెళ్తున్నా!” అని చెప్పగలగడం ద్వారా లభించే గొప్ప ఆనందం.—సీసల్ డబ్ల్యు. బ్రూన్ చెప్పినది.
[20వ పేజీలోని బాక్సు]
వికలాంగుల కొరకు కార్లు ఎలా మార్చబడతాయి
వికలాంగులైన డ్రైవర్లు అనేకమంది, తమ కాళ్లతో చేయలేని పనులను తమ చేతులతో చేస్తారు. ప్రాముఖ్యంగా చేతితో నియంత్రించగలిగే విధానం సౌలభ్యంగా ఉంటుంది. అది, స్టీరింగ్ చక్రం క్రింద చక్కగా సర్దుకుని ఉండే లివర్, అది స్టీరింగ్ కాలమ్ నుండి బయటకు వస్తుంది. ఒక స్టీల్ రాడ్ ఈ లివర్నుండి, బ్రేక్ పెడల్ వరకూ వెళ్తుంది. ఈ లివర్‌ను ముందుకు నెట్టడంతో బ్రేకులు వేయబడతాయి.
ఈ యూనిట్ నుండే, ఆక్సిలరేటర్‌కు ఒక కేబుల్ జోడించబడుతుంది. ఆ లివర్ రెండు వైపులనుండి పని చేయాల్సి ఉంటుంది: ముందుకు కదిపితే బ్రేకులు వేస్తుంది, పైకి లాగితే ఆగ్జిలరేట్ చేస్తుంది. దానికి కొంత శక్తి కావాలి. చేతితో నియంత్రించే ఈ విధానం యొక్క కచ్చితమైన ప్రయోజనం ఏమంటే, మామూలు పద్ధతిలో వాహనాన్ని నడిపేందుకు ఇది ఇతరులకు ఎంతమాత్రం ఆటంకం కలిగించదు. దానికి తోడు, ఈ భాగాన్ని ఇతర కార్లలోకి సులభంగా మార్చుకోవచ్చు.
తమ చేతుల్లో ఎక్కువ శక్తిలేని వారికి, ఇలా చేతితో నియంత్రించే మరొక పద్ధతి ఉంది. అది దీని వలెనే పని చేస్తుంది, బ్రేకులు వేసేందుకు ముందుకు కదపాల్సి ఉంటుంది, అయితే ఆగ్జిలరేషన్ కొరకు క్రిందికి దింపాల్సి ఉంటుంది, కేవలం చేతి బరువుతోనే ఆగ్జిలరేషన్ పని చేయగలదు.
చక్రాల కుర్చీల సంగతేమిటి?
వికలాంగులైన డ్రైవర్లకు మరొక సమస్య ఎదురౌతుంది: చక్రాల కుర్చీని అతను ఏమి చేయాలి? అనేకమంది యౌవన డ్రైవర్లు రెండు తలుపులుండే కూపేను కొంటారు, డ్రైవర్ సీటు వెనుక ఉండే స్థలంలో తమ చక్రాల కుర్చీని ఎత్తి పెట్టేందుకు అది వారికి వీలు కలిగిస్తుంది. అయితే, దీని కొరకు రెక్కల్లోను మరియు భుజాల్లోను చాలా శక్తి ఉండాలి. అంత బలంగా లేని వారు, తమ వాహనంలో కుర్చీని పెట్టడంలో సహాయం చేయగలిగే, స్నేహపూర్వకమైన వారు ఎవరైనా అటునుండి వెళ్తుంటే వారి కొరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
దానికిగల మరో ప్రత్యామ్నాయం చక్రాల కుర్చీని ఎత్తేది, అది కారు మీద ఉండే పెద్ద ఫైబర్‌గ్లాస్ డబ్బా. ఒక బటన్‌ను నొక్కితే, చక్రాల కుర్చీని కప్పీల సహాయంతో డబ్బాలో పెట్టే విధంగా ఒక చిన్న మోటరు ఆ డబ్బాను నిలబెడుతుంది. కుర్చీని పెట్టిన వెంటనే ఆ డబ్బా మళ్లీ బల్ల పరుపుగా అవుతుంది. ఆస్ట్రేలియాలో లభ్యమయ్యే, అలాంటి ఎత్తే పరికరాన్ని ఒక దాన్ని, కారుకున్న సిగరెట్ లైటర్‌కు సులభంగా జోడించవచ్చు.
చక్రాల కుర్చీని ఎత్తే పరికరానికిగల ఒక లోపం ఏమంటే, దాని వలన వచ్చే గాలి ఒత్తిడిని కారు భరించాల్సి ఉంటుంది, అందుమూలంగా ఇంధనం వ్యయం 15 నుండి 20 శాతం వరకూ పెరుగుతుంది. దానికి తోడు, ఆ పరికరం యొక్క ఖరీదే ఎంతో ఎక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ, ఎత్తే పరికరాలు అందించే స్వేచ్ఛనుబట్టి అనేకులు వాటిని ఉపయుక్తమైన వాటిగా పరిగణిస్తారు. వికలాంగురాలైన ఒక స్త్రీ ఇలా పేర్కొన్నది: “నాతో ఎవరూ లేకుండానే లేక నా గమ్య స్థానంలో నా చక్రాల కుర్చీని క్రిందకు దింపడానికి సహాయం చేసేందుకు ఎవరైనా లేకుండానే నేను ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లగలను.”
[19వ పేజీలోని చిత్రం]
నేను నా కారులోనుండే సాక్ష్యమివ్వగలను