కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 6/8 పేజీలు 14-16
  • మర్రి చెట్టు—ఒక చెట్టే ఓ వనం అవుతుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మర్రి చెట్టు—ఒక చెట్టే ఓ వనం అవుతుంది
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మతం మరియు మర్రి
  • ఓ మర్రి చెట్టు ఎక్కుదాం పదండి
  • ప్రతి ఒక్కరు తమ అంజూరపు చెట్టు క్రింద కూర్చుంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • కలకత్తా—చైతన్యంగా ఉండే వైరుద్ధ్యాల నగరం
    తేజరిల్లు!—1998
  • “యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
తేజరిల్లు!—1996
g96 6/8 పేజీలు 14-16

మర్రి చెట్టు—ఒక చెట్టే ఓ వనం అవుతుంది

భారతదేశంలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

ఓ వనంలో సాధారణంగా ఎన్నో చెట్లుంటాయి. అయితే, కేవలం ఒక చెట్టే ఓ వనం కావడాన్ని మీరు చూశారా? మర్రి చెట్టు ఎంతో అసాధారణమైన చెట్టు, అది ఐదు ఎకరాలకంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేంత వరకూ అలా విస్తరిస్తూనే ఉంటుంది! అది పెరగడం ఎలా ప్రారంభిస్తుంది? అది నిజంగా ఓ వనం అని పిలువబడేంత వరకూ దానంతటదే ఎలా విస్తరిస్తూ ఉంటుంది?

మర్రి, మొరాసే కుటుంబానికి లేక మల్బరీ కుటుంబానికి చెందుతుంది మరియు అర్టికేల్స్‌ అని పిలువబడే పుష్పించే వృక్ష క్రమంలోనిది. అందులో దాదాపు 800 రకాల మేడి చెట్లు ఇమిడివున్నాయి. మర్రి పండ్లను తిన్న కోతులు, పక్షులు లేక గబ్బిలాల మలంలోని విత్తనాల నుండి మర్రి, లేక బెంగాల్‌ ఫిగ్‌ తన సుదీర్ఘ జీవితాన్ని ప్రారంభిస్తుంది.

అతిధేయి చెట్టు కొమ్మల్లో ఆ విత్తనాలు అంకురిస్తాయి, సందుల్లో ఉన్న కుళ్లిన ఆకులవంటి జీవ పదార్థంలో వేర్లు పోషింపబడతాయి. తేమ ఎక్కువగా ఉండటం, క్రొత్త చెట్టు వేర్లు త్వరగా పెరిగేందుకు దోహదపడుతుంది; “బాధిత” చెట్టు కాండం చుట్టూ అవి బలపడి, భూమిలోకి పెరిగిపోతాయి. అవి తమ శక్తిలోను, పరిమాణంలోను దృఢపడుతుండగా, అతిధేయి చెట్టుకు గాలి అందకుండా చేసి దాన్ని అణగద్రొక్కుతాయి. గొంతు పిసికి చంపేసే మేడి అనే పేరు వీటికి అందువలననే వచ్చింది.

ఇప్పుడు విస్తరించేందుకు మర్రి సిద్ధంగా ఉంది. తల్లి కాండం మొదలు నుండి వేర్లు పెరగడమే కాదు, కొమ్మలు అడ్డంగా పెరిగే కొలది, వాయుగత వేర్లు వాటినుండి పెరిగి నేల వైపుకు వచ్చి భూమిలో పాతుకుపోతాయి. అలా ఓ వనం యొక్క ఉనికి ప్రారంభమౌతుంది.

ఉష్ణమండల ఆఫ్రికాలో మరియు భారతదేశంలో కనుగొనబడే మర్రి, పెద్దగా బల్లపరుపుగా ఉండే దాని ఆకులతో మనుష్యులకు జంతువులకు కూడా అది గొడుగులా నీడనిచ్చేందుకు తోడ్పడుతుంది. భారతదేశంలోని ఒక చెట్టు ఎంత పెద్దగా ఉందంటే, అది 20,000 మంది ప్రజలకు నీడను ఇవ్వగలదని చెప్పబడుతోంది. దాని పండ్లు మనుష్యులు తినేందుకు మంచివి కావు, దాని కలప కూడా మెత్తగా, రంధ్రాలు కలిగి ఉంటుంది; అయితే, బర్డ్‌లైమ్‌ అని పిలువబడే ఒక తెల్లని, జిగట పదార్థం దాని బోదె నుండి వస్తుంది, పక్షులను పట్టుకునేందుకు అది ఉపయోగించబడుతుంది.

మర్రి చెట్టు ఎంతకాలం జీవిస్తుంది? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒక చెట్టు 600 ఏళ్లకంటే ఎక్కువ కాలంనుండి ఉందని అంచనా వేయబడింది; ఇతర పేరెన్నికగల, కాపాడబడిన చెట్లు 250 సంవత్సరాలకంటే పూర్వానివి. మర్రి చెట్టు పెరుగుదల, విస్తరణ అలా కొనసాగుతూనే ఉంటుంది.

తెలిసిన అతి పెద్ద మర్రి చెట్టు శ్రీలంకలో ఉందని చెప్పబడుతోంది. ఆ ఒకే తల్లి చెట్టుకి అంటుకుని 350 పెద్ద కాండాలు, 3,000 కంటే పైగా చిన్న కాండాలు ఉన్నాయి. భారతదేశంలోని ఒక చెట్టుకు 1,100 ఊడ వేర్లు ఉన్నాయి, దాని శాఖలు ఐదు ఎకరాలకంటే ఎక్కువ విస్తీర్ణానికి వ్యాపించి ఉన్నాయని ఇటీవల కొలవబడి, ఆ దేశంలోని అతి పెద్ద చెట్టుగా కనుగొనబడింది. దానికి ఎలాంటి నష్టం కలుగకుండా దాన్ని నిత్యమూ నలుగురు సాయుధులు కాపాడుతున్నారు. భారతదేశంలోని ఇతర ప్రఖ్యాత మర్రి చెట్లలో, బెంగుళూరు వద్ద ఐదు ఎకరాల స్థలాన్ని ఆక్రమించిన చెట్టు కూడా ఇమిడివుంది, అది పట్టణస్థులకు ఇష్టమైన పిక్‌నిక్‌ స్థలం. రన్తంబోర్‌ వన్య మృగాల పార్క్‌లోని మరొక భీకరాకారంగల చెట్టు కూడా అందులో ఇమిడివుంది. 500 సంవత్సరాల పూర్వం ఓ మొగల్‌ సామ్రాట్‌ వ్రాతల్లో ప్రస్తావించబడిన ఈ చెట్టు, పార్క్‌లోని పులులకు ఇతర వేటాడే జంతువులకు ఓ ఆట స్థలంగా, వేటాడే స్థలంగా ఉండటంతో పాటూ పక్షులు, గబ్బిలాలు, పాములు, ఉడతలు మరియు వేలాది ఇతర చిన్న జంతువులకు అలాగే కీటకాలకు నీడనిస్తుంది.

బహుశ భారతదేశంలోని అందరికీ తెలిసిన మర్రి చెట్టు, కలకత్తాలోని జాతీయ ఔషధి శాస్త్ర తోటలో ఉన్న 240 సంవత్సరాల పూర్వపు చెట్టే అయ్యుండవచ్చు. 24.5 మీటర్ల కంటే ఎత్తున్న ఈ చెట్టు మూడు ఎకరాల స్థలాన్ని ఆక్రమిస్తుంది, దీనికి 1,800 కంటే ఎక్కువ వాయుగత వేర్లున్నాయి మరియు దాని శాఖలు 420 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణానికి వ్యాపించి ఉన్నాయి. ఇది నిజంగా ఓ వనమే!

మతం మరియు మర్రి

ప్రాచీన కాలం నుండి కూడా ప్రజలు చెట్లను పూజించారు. మర్రి చెట్టు మినహాయింపబడలేదు; భారతదేశంలో అది నేడు కూడా పవిత్రమైన దానిగా పరిగణింపబడుతుంది. పవిత్రమైన చెట్లు ప్రత్యేక దేవతలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని నమ్మబడుతుంది—మర్రి విషయంలో, అది విష్ణుదేవున్ని సూచిస్తుంది. ఒక చెట్టుని నాటి, నీళ్లు పోసి, దాన్ని కాపాడితే ఆ చెట్టు సూచిస్తున్న దేవతకు పూజగా భావించబడుతుంది.

ప్రాచీన పాలినేషియా సమాజాల్లో కూడా, మర్రి చెట్టును పవిత్రమైన దానిగా భావించేవారు. చతురాకార ప్లాజాలో లేక టోహువాలో మతపర వేడుకలు జరుగుతాయి, దానికి చుట్టూ ఇళ్లు ఉంటాయి. ఆ ప్లాజాకు ఒక చివర పవిత్ర మర్రితో పాటు సాధారణంగా ఒక మందిరం ఉంటుంది, తెగలోని మరణించిన ప్రముఖ సభ్యుల ఎముకల మూట, ఆ మర్రి కొమ్మలకు వ్రేలాడుతుంటుంది.

ఈ గొప్ప చెట్టుకు దాని పేరును మొదట యూరప్‌ వారు పెట్టారు. పర్షియా సింధుశాఖ మరియు భారతదేశంలో, సూర్యుని మండే ఎండనుండి వ్యాపారులు తమ సరుకుని కాపాడుకునేందుకు, వారు నీడనిచ్చే ఈ చెట్టు క్రింద కూర్చునే వారని తొలి యూరప్‌ ప్రయాణీకులు చూశారు. హిందూ కుల వ్యవస్థలో, వ్యాపారులు, వైశ్యులు అని పిలువబడే ముఖ్య విభాగానికి మరియు బనియాలు అనబడే క్రింది కులానికి చెందినవారు. వీరు ధాన్యం మరితర కిరాణా సరుకులు అమ్మడంలో ప్రముఖులు. ఒక బనియా తన సరుకును నీడనిచ్చే ఈ చెట్టు క్రింద అమ్ముతాడని గమనించిన ఈ విదేశీయులు ఆ చెట్టును బన్యన్‌ అని పిలిచేందుకు దారి తీసింది.

ఆ దినాల్లో బనియాలు తమ డబ్బును పెట్టుకునేందుకు లోపల జేబులుగల, చేతులు లేని నూలు చొక్కాని సాధారణంగా ధరించేవారు. చల్లగా, ఉతికేందుకు సులభంగా ఉండే ఈ చేతులు లేని చొక్కాని (వెస్ట్‌) బనియా వ్యాపారులు ఎంత తరచుగా వాడేవారంటే ఈ వస్త్రానికి బన్యన్‌ అనే పేరు పెట్టబడింది, తర్వాత పురుషులు ధరించే ఎలాంటి వెస్ట్‌ లేక లోన వేసుకునే చొక్కానైనా సూచించేందుకు కూడా అదే పేరు ఉపయోగింపబడేది. భారతదేశంలో, పురుషులు లోన ధరించే చొక్కాకు ఇప్పటికీ ఆ పేరే ఉపయోగింపబడుతుంది, అలాగే పని చేస్తున్నప్పుడు ఈ విధమైన వస్త్రాన్ని ధరించే బనియాల అలవాటు కూడా నేటికీ ఉంది.

ఓ మర్రి చెట్టు ఎక్కుదాం పదండి

మీరు ఓ మర్రి చెట్టు ఎక్కి దాని మధ్యకి వెళ్లాలని ఇష్టపడతారా? దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్‌ను మీరు సందర్శించి ఉంటే, మీరు ఎక్కగలిగే వారు. బేగంపేట విమానాశ్రయానికి దగ్గర్లో, నగరం నడిబొడ్డున ఉన్న మచాన్‌, ఓ ట్రీటాప్‌ రెస్టరెంట్‌ అంటే చెట్టుపైనున్న రెస్టరెంట్‌, అది మర్రి చెట్టు మరియు దాని ప్రక్కనే ఉన్న మేడిచెట్టు వంటి రావి చెట్టు యొక్క పటిష్ఠమైన కొమ్మల్లో నిర్మింపబడింది. దళసరి త్రాడుతో చేసిన నిచ్చెనను ఎక్కి, అక్కడక్కడా కొమ్మలమీదుగా ఉన్న ప్లాట్‌ఫారమ్‌లను దాటి వెళ్లండి. మీరు ఇప్పుడు నిలిచివున్న కట్టడం వెదురు బొంగులు, కొబ్బరి ఆకులు మరియు త్రాళ్లతో చేయబడింది. వేర్వేరు స్థాయిల్లో కట్టబడివున్న రెండు భోజన గదులలోని ఒకదానిలోకి, అంటే పైనున్న గదిలోకి ప్రవేశించినప్పుడు కనిపించే, పిరమిడ్‌ ఆకారంలోని వెదురు బొంగుల కప్పు సూర్యుని నుండి, వర్షం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీరిప్పుడు భూమినుండి తొమ్మిది మీటర్ల ఎత్తున ఉన్నారు. చక్కని కేన్‌ కుర్చీలు, బల్లలు మరియు కొండజాతి గోడ అలంకరణలు మీరు వనంలో ఉన్నారనే భావాన్ని కలిగిస్తాయి.

మీరు కూర్చోగానే, మోగ్లి అని పిలువబడే మెన్యూ కార్డ్‌ మీకు అందించబడుతుంది, ద జంగిల్‌ బుక్‌లో ఉండే రడ్‌యార్డ్‌ కిప్లింగ్‌ యొక్క కథలను చదివే పాఠకులకు అదెంతో సుపరిచితమైన పేరు. వన వాతావరణానికి ఇది కూడా తోడొస్తుంది. మరి ఇప్పుడు, మర్రి చెట్టు మధ్యలో భోజనాన్ని ఆస్వాదించే ఈ వినూత్న అనుభవాన్ని చవిచూసేందుకు సన్నద్ధులవ్వండి. హైదరాబాద్‌ ప్రసిద్ధి గాంచిన మహత్తరమైన మసాలా బిరియానీని, కబాబ్‌లను మరియు ఇతర వివిధ రకాల పదార్థాల వంటి కొన్ని కమ్మని భారతీయ వంటకాలను ఆస్వాదించండి.

మీ భోజనం ముగిసిన తర్వాత, త్రాడు నిచ్చెన మీదుగా జాగ్రత్తగా దిగి చిన్న జలపాతాన్ని, తామర కొలనును చూసి అతి విశాలమైన మర్రి చెట్టు పందిరిలో కట్టబడిన విశిష్టమైన ట్రీటాప్‌ రెస్టరెంట్‌లో నుండి వెళ్లండి. ఈ చెట్టు విస్తరించి, విస్తరించి, విస్తరించి ఆ ఒక్క చెట్టే ఓ వనం అవుతుంది.

[15వ పేజీలోని చిత్రాలు]

ఒక మర్రి చెట్టు ఓ వనం అయ్యింది

పైన: కలకత్తా నందలి జాతీయ ఔషధి శాస్త్ర తోటలోని మర్రి చెట్టు యొక్క దగ్గరి చిత్రం

[16వ పేజీలోని చిత్రం]

కలకత్తా నందలి జాతీయ ఔషధి శాస్త్ర తోటలోని మర్రి చెట్టు

[16వ పేజీలోని చిత్రం]

మచాన్‌, హైదరాబాద్‌ నందలి మర్రి చెట్టుపై ఉన్న ఒక రెస్టరెంట్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి