సున్నితమైన మన గ్రహం దాని భవిష్యత్ విషయమేమిటి?
రెండు వందల సంవత్సరాల క్రితం, అమెరికన్ రాజనీతిజ్ఞుడైన పాట్రిక్ హెన్రీ ఇలా చెప్పాడు: “భవిష్యత్తును గూర్చి చెప్పాలంటే గతాన్ని విశ్లేషించడం తప్ప మరో మార్గమున్నట్లు నాకు తెలియదు.” గతంలో మానవుడు పర్యావరణాన్ని కాలిక్రింద వేసి త్రొక్కాడు. అతడు మంచిగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడా? ఇప్పటివరకూ, సూచనలేవీ ప్రోత్సాహకరంగా లేవు.
ప్రసంశనీయమైన పురోగతి కొంతమేరకు సాధించబడినప్పటికీ, అది కారణాలను కాకుండా సూచనలను ప్రస్తావిస్తూ పైపైన మాత్రమే జరిగింది. ఒక ఇంటికి చెదలు పట్టినట్లైతే, దాని చెక్కపనిపైన పెయింటు వేయడం అది కూలిపోకుండా ఆపదు. బారీ నిర్మాణ మరమ్మతు మాత్రమే దానిని కాపాడగలదు. అదే విధంగా, మానవుడు ఈ గ్రహాన్ని ఉపయోగించే విధానంలోకూడా పునఃనిర్మాణం అవసరం. నష్టాన్ని నియంత్రించడం మాత్రమే సరిపోదు.
అమెరికాలో 20 సంవత్సరాల పర్యావరణ నియంత్రణను విశ్లేషించి, “పర్యావరణంపై జరిగిన దాడిని ఫలవంతంగా నియంత్రించడం జరగదు, కానీ దాన్ని నివారించాలి” అని ఓ నిపుణుడు నిర్ధారించి చెప్పాడు. స్పష్టంగా, కాలుష్యం వల్ల కలిగే చెడు ప్రభావాలను సరిచేయడం కన్నా దాన్ని నివారించడమే ఎంతో శ్రేష్ఠం. అయితే అలాంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మానవ సమాజంలోనూ మరియు ముఖ్యమైన వ్యాపారాల దృష్టికోణంలోనూ ఓ స్థూలమైన మార్పు అవసరం. భూమి ఎడల శ్రద్ధ వహించాలంటే, “ఇప్పుడున్న విలువలకూ ఆర్థికవ్యవస్థకూ మరియు సమాజాలకూ భిన్నమైనవి” అవసరమని భూమి ఎడల శ్రద్ధ వహించడం అనే పుస్తకం చెబుతోంది. గ్రహాన్ని రక్షించేందుకు మార్చవల్సిన కొన్ని విలువలేవి?
సంక్షోభానికిగల పాతుకుపోయిన కారణాలు
స్వార్థం. పర్యావరణాన్ని కాపాడే చర్యల్లో అవసరమైన మొదటిది ఏదంటే స్వార్థపరులైన మానవుల ఆసక్తికంటే గ్రహ సంబంధిత ఆసక్తులను ముందుంచడమే. అయినప్పటికీ తమ సంపన్న జీవిత విధానం, ముందు తరాలవారి సమయానికల్లా ఈ గ్రహం నాశనం చేయగల్గినప్పటికీ, దాన్ని త్యజించేందుకు చాలా తక్కువ మంది ఇష్టతను కనపరుస్తారు. పశ్చిమ యూరప్ దేశాల్లో అతి కలుషిత దేశమైన నెదర్లాండ్స్ ప్రభుత్వం, కాలుష్య వ్యతిరేక చర్యగా కారు ప్రయాణాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించింది, విస్తృతమైన వ్యతిరేకత ఈ పథకాన్ని చెడగొట్టింది. ప్రపంచంలోని రోడ్లన్నింటిలోకెల్లా డచ్ రోడ్లు అతి ఇరుకువైన్నప్పటికీ, వాహనాలుగలవారు తమ స్వాతంత్ర్యాన్ని త్యాగంచేసేందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు.
స్వీయాసక్తి, అటు నిర్ణయాలు తీసుకునేవారినీ అలాగే మామూలు ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తుంది. తమ ఓటుకు ముప్పుతెచ్చే ఏ పర్యావరణ పాలసీని అమలుపర్చాలన్నా రాజకీయ నాయకులు విముఖతను కనపరుస్తారు మరియు తమ లాభాలకూ ఆర్థిక ఉన్నతికీ అపాయకరంకాగల ఏ కార్యాచరణ పథకాలనైనా పారిశ్రామికవేత్తలు అడ్డుకుంటారు.
పేరాశ. అటు లాభాలను ఇటు ఆదాచేయడాన్ని ఎంపిక చేసుకోవల్సి వచ్చినప్పుడు, సాధారణంగా డబ్బుదే పైచేయి అవుతుంది. శక్తివంతమైన పరిశ్రమలు, కాలుష్య నియంత్రణను తగ్గించేందుకు మరియు మొత్తానికే ప్రభుత్వ విధులను తప్పించుకునేందుకూ దారిని సరాళం చేసుకుంటాయి. ఓజోను పొరకు వాటిల్లిన నష్టం దీనిని ఉదాహరిస్తోంది. చివరకు 1988 మార్చిలో అమెరికాలోని ఒక ప్రముఖ రసాయన కంపెనీ అధ్యక్షుడు ఇలా పేర్కొన్నాడు: “ఇప్పుడు, CFC ల విడుదలను నాటకీయంగా తగ్గుదలను చేయవల్సిన అవసరముందని విజ్ఞానశాస్త్రం స్పష్టంగా సూచించడంలేదు.”
అయితే, అదే కంపెనీ క్లోరోఫ్లోరోకార్బన్లన్నింటినీ (CFC లు) ఉత్పత్తిచేయడం మానేయాలని సిఫారసు చేశారు. మనస్సు మార్చుకున్నారా? “పర్యావరణం పాడౌతోందా లేదా అన్న విషయానికీ దానికీ ఏ సంబంధమూలేదు” అని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమపు (యు.ఎన్.ఇ.పి.) డైరక్టర్‌జనరల్ ముస్తాఫా టొల్బ వివరించారు. “అదంతా ఎవరు ఎవరిమీద [ఆర్థిక] పైచేయిని పొందుతారన్న విషయాన్ని [గూర్చే].” చరిత్రలో మానవుడు కారణభూతుడైన అతి ఘోరమైన పర్యావరణ విపత్తుల్లో ఓజోను పొర నాశనము ఒకటని నేడు అనేకమంది వైజ్ఞానికులు గ్రహించారు.
అజ్ఞానం. మనకు తెలియనివి మనకు తెలిసిన దానికన్నా ఎంతో ఎక్కువగా ఉన్నాయి. “ఉష్ణమండల వర్షపాత అడవుల్లోని జీవాన్ని గూర్చి మనకు చాలా కొంచెమే తెలుసు. ఆశ్చర్యకరంగా, చంద్రుని పైనున్న వాటిని గూర్చి మనకు ఎక్కువ తెలుసు—ఎంతో ఎక్కువ తెలుసు” అని మిస్సోరి బొటానికల్ గార్డెన్ డైరెక్టరైన పీటర్ హెచ్. రావెన్ వివరిస్తున్నారు. వాతావరణం విషయం కూడా అంతే. ఈ గ్రహపు వాతావరణాన్ని ప్రభావితం చేయకుండా మనం ఎంత కార్బన్‌డయాక్సైడ్‌ను ఆకాశంలోకి పంపించగలము? ఎవరికీ తెలియదు. అయితే టైమ్ పత్రిక చెప్పినట్లుగా, “ఫలితమేమిటో తెలియకుండా, రాగల పరిణామాలు అసలు ఆలోచించేందుకే అతి భయానకంగా ఉన్నప్పుడు అలాంటి పెద్ద ప్రయోగాలకు ప్రకృతిని గురిచేయడం నిర్లక్ష్యమే.”
యు.ఎన్.ఇ.పి. అంచనాల ప్రకారం, ఈ దశాబ్దాంతానికల్లా పాడైన ఓజోను పొర చివరికి, ప్రతి సంవత్సరమూ లక్షల సంఖ్యలో క్యాన్సర్ కేసులకు కారణమౌతుంది. పంటలపై మత్స్యాలపై వాటి ప్రభావం ఏమిటో ఇప్పటికీ తెలియదు, కానీ అది చెప్పుకొనదగినదిగా ఉంటుందని అపేక్షించబడుతోంది.
దూరదృష్టిలేని దృక్కోణాలు. ఇతర విపత్తుల్లా కాకుండా, పర్యావరణ సమస్యలు మనపై చల్లచల్లగా వచ్చిపడతాయి. ఇది, శాశ్వత నష్టం జరగకముందే పొందికగల చర్యలను తీసుకునే గట్టి ప్రయత్నాలకు అవరోధాలనేర్పరుస్తుంది. మన ప్రస్తుత స్థితి గ్రహాన్ని కాపాడడం అనే పుస్తకం 1912 మునిగిపోయిన టైటానిక్ లోని చావుకు సిద్ధంగా ఉన్న ప్రయాణీకులతో పోల్చింది: “రాగల విషాదకర సంఘటన ఎంత మేరకు ఉంటుందన్న విషయాన్ని గూర్చి కొందరికి మాత్రమే తెలుసు.” రాజకీయ నాయకులూ వ్యాపారస్తులూ వాస్తవాన్ని ఎదుర్కొని స్వల్పకాలీన ప్రయోజనాలను చూసే బదులుగా ప్రయోజనాత్మక దీర్ఘకాలిక పురోభివృద్ధిని సాధించగలిగేందుకు ఆలోచించినప్పుడు మాత్రమే గ్రహం రక్షించబడుతుందని ఆ రచయితలు విశ్వసిస్తున్నారు.
స్వార్థపూరిత భావాలు. 1992 ఎర్త్ సమ్మిట్‌లో, “ఈ సమస్య ప్రపంచవ్యాప్తమైనది, దాని పరిష్కారమూ ప్రపంచవ్యాప్తమైనదే” అని స్పెయిన్ ప్రధాన మంత్రియైన ఫెలిపే గొంజాలెజ్ చెప్పాడు. నిజమే, ప్రపంచవ్యాప్తంగా సమ్మతమైన పరిష్కారాలను కనుగొనడం భీతిగొలిపే పనే. ఎర్త్ సమ్మిట్‌కి వచ్చిన అమెరికా ప్రతినిధి నిక్కచ్చిగా ఇలా చెప్పాడు: “అమెరికా జీవితవిధానం మార్పు చేయగలిగినది కాదు.” మరో వైపు ఇండియా పర్యావరణ శాస్త్రవేత్తైన మేనకా గాంధీ, మరోవైపున “తూర్పు దేశాల్లో 125 మంది పిల్లలు భుజించేంత ఆహారాన్ని పాశ్చాత్య దేశాల్లోని ఒక్క బిడ్డ భుజిస్తాడని” ఫిర్యాదు చేసింది. “ఇంచుమించు, తూర్పు ప్రాంతమంతటిలోని పర్యావరణ క్షీణతంతా పాశ్చాత్యుల ఆహార భక్షణంవల్లనే జరుగుతోందని” ఆమె చెప్పింది. పర్యావరణాన్ని మెరుగుపర్చేందుకు మరలా మరలా చేసే అంతర్జాతీయ ప్రయత్నాలు, స్వార్థపూరితమైన జాతీయాసక్తులవల్లనే కుప్పకూలిపోయాయి.
ఈ ప్రధాన సమస్యలున్ననూ భవిష్యత్తు వైపు నమ్మకంతో చూసేందుకు కారణాలున్నాయి. వాటిలో ఒకటి మన గ్రహపు తేరుకొను స్వీయరక్షణా శక్తే.
భూ స్వస్థత
మానవ శరీరంలాగే భూమికి దానంతటదే స్వస్థమయ్యే అద్భుతమైన సామర్థ్యం ఉంది. ఇందుకు గత శతాబ్దంలో గణనీయమైన ఉదాహరణ జరిగింది. ఇండోనేషియాలో అగ్నిపర్వత దీవైన క్రకాటవు (క్రకటోవ) మహాఘోషతో ప్రేలింది, అది దాదాపు 5,000 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. సుమారు 21 ఘనపు కిలోమీటర్ల స్థూలద్రవ్యం ఆకాశంలోకి చిమ్మబడింది, అంతేకాకుండా మూడింట రెండొంతుల ద్వీపం, సముద్రంలో కనుమరుగైపోయింది. తొమ్మిది నెలల తర్వాత, జీవముందనేందుకు ఏకైక రుజువుగా ఓ అతిసూక్ష్మమైన సాలీడు కనిపించింది. నేడు ఆ దీవంతా ఉష్ణమండల చెట్లతో పుష్కలంగా ఉంది. అది వందలకొలది పక్షులూ సస్తనజంతువులూ పాములు మరియు కీటకాల జాతులకు ఇల్లుగా ఉంది. ఊజంగ్ కూలాన్ జాతీయ పార్కులో భాగంగా ఈ దీవి అనుభవించే రక్షణ వల్ల, ఈ స్వస్థత మరింత మద్దతును పొందింది.
మానవుడు చేసిన నష్టాన్ని కూడా తీసివేయవచ్చు. కావల్సినంత సమయాన్నిస్తే భూమి దానంతటదే బాగుపడుతుంది. అసలు ప్రశ్నేమిటంటే, భూమికి కావల్సినంత విరామాన్ని మనుష్యులు దానికి ఇస్తారా? అన్నదే. బహుశ ఇవ్వకపోవచ్చు. అయితే మన గ్రహం దానంతటదే స్వస్థమయ్యేందుకు అనుమతించేందుకు తీర్మానించుకున్న వ్యక్తి మాత్రం ఒకరున్నారు—దాన్ని సృష్టించిన వాడే.
“భూమి ఉల్లసించునుగాక”
మానవుడు భూమిని నశింపజేయాలని దేవుడు ఎన్నడూ ఉద్దేశించలేదు. ఏదెను వనాన్ని ‘సేద్యపర్చి, దాన్ని కాపాడుకోమని’ ఆయన ఆదాముతో చెప్పాడు. (ఆదికాండము 2:15) పర్యావరణాన్ని కాపాడే విషయంలో యెహోవాకు గల శ్రద్ధ, ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నియమాల్లో కూడా ప్రదర్శితమై ఉంది. ఉదాహరణకు, ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి—సబ్బాతు సంవత్సరంలో భూమిని బీడు విడవమని చెప్పాడు. (నిర్గమకాండము 23:10, 11) ఇశ్రాయేలీయులు దీన్నీ మరితర దైవిక ఆజ్ఞలను పలుమార్లు అలక్ష్యం చేసినప్పుడు, బబులోనీయులు ఆ భూమిని నిర్మానుష్యం చేసేందుకు అనుమతించాడు. ఆ తర్వాత “విశ్రాంతి దినములను దేశము అనుభవించువరకు,” వారు దానిని 70 సంవత్సరాలు నిర్మానుష్యంగా ఉండేలా విడిచిపెట్టారు. (2 దినవృత్తాంతములు 36:21) ఈ చారిత్రాత్మక సంఘటన దృష్ట్యా, మానవుని పర్యావరణ దాడులనుండి భూమికి స్వాస్థ్యాన్ని ప్రాప్తింపజేసేలా దేవుడు “భూమిని నశింపజేయువారిని నశింపజేయు” ను అని బైబిలు చెప్పడంలో ఆశ్చర్యం లేదు.—ప్రకటన 11:18.
అయితే, ఆ చర్య మొదటి మెట్టు మాత్రమే. జీవ శాస్త్రవేత్తైన బార్రి కామ్మనర్ సరిగ్గానే చెప్పినట్లుగా, ఈ గ్రహం తప్పించుకోవడం “ప్రకృతితో యుద్ధంచేయడాన్ని మానుకోవడంపై మరియు మన మధ్య యుద్ధాన్ని మానుకోవడంపై సమంగా ఆధారపడివుంది.” ఆ గమ్యాన్ని చేరుకునేందుకు, భూమ్మీది ప్రజలు ఒకరి ఎడల ఒకరు శ్రద్ధవహించేందుకూ తమ భూగృహాన్ని చూసుకునేందుకు ‘యెహోవాచేత ఉపదేశము నొందాలి.’ దాని ఫలితంగా, వారి శాంతి ‘అధికం’ అవుతుంది.—యెషయా 54:13.
జీవావరణ విధానాల నవీకరణ జరుగుతుందని దేవుడు అభయమిస్తున్నాడు. క్రూరంగా వ్యాపించే బదులుగా, ఎడారులు “ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును.” (యెషయా 35:1) ఆహార కొరత స్థానంలో, ‘భూమిపై సస్య సమృద్ధి కలుగును.’ (కీర్తన 72:16) కాలుష్యంవల్ల మరణించే బదులు, భూమిలోని నదులు ‘చప్పట్లు కొడతాయి.’—కీర్తన 98:8.
అలాంటి మార్పు ఎప్పుడు జరుగుతుంది? “యెహోవా రాజ్యము చేయు” సమయంలోనే. (కీర్తన 96:10) దేవుని పరిపాలన భూమ్మీదున్న ప్రతి జీవికీ ఆశీర్వాదాన్నిచ్చే హామీనిస్తుంది. “భూమి ఉల్లసించునుగాక” అని కీర్తన గ్రంథకర్త చెబుతున్నాడు. “సముద్రమును దానిలోని సమస్తమునూ ప్రతిధ్వనించును గాక; పొలాలూ దానిలో ప్రతిదీ ఆనందించును. అప్పుడు అడవిలోని చెట్లన్నీ ఆనందంతో పాడును.”—కీర్తన 96:11, 12, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్.
తన సృష్టికర్త ద్వారా ఆశీర్వదించబడిన మరియు నీతియుక్తంగా పరిపాలించబడే భూమికి మహనీయమైన భవిష్యత్తు ఉంది. బైబిలు దీని ఫలితాలను ఇలా వర్ణిస్తోంది: “కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి భూమిలోనుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును.” (కీర్తన 85:10-12) ఆ దినం తెల్లవారుతుండగా మన గ్రహం శాశ్వతంగా అపాయం నుండి బయటపడుతుంది.
[13వ పేజీలోని చిత్రం]
మానవ శరీరంలా, భూమి దానంతటదే స్వాస్థ్యం పొందే అద్భుతమైన సామర్థ్యం కల్గివుంది