పోరాటం జయించబడుతుందా?
“ఈ గ్రహాన్ని చూసుకోండి, మనకున్నది ఇది ఒక్కటే.” అది, ప్రకృతి ప్రపంచవ్యాప్త నిధికి అధ్యక్షుడైన, బ్రిటన్ రాకుమారుడు ఫిలిప్ చేసిన స్పష్టమైన అభ్యర్థనే.
వేల సంవత్సరాల క్రితం కీర్తన గ్రంథకర్త ఇలా వ్రాశాడు: “ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.” (కీర్తన 115:16) దేవుడు భూమిని మనకు గృహంగా ఇచ్చాడు మరి మనం దాన్ని చూసుకోవాలి. జీవావరణం అంటే అదే.
అక్షరార్థంగా “జీవావరణశాస్త్రం” అంటే, “గృహాన్ని గూర్చిన పరిశీలన.”a ది అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ ఇచ్చిన నిర్వచనాల్లో ఒకటి, “సంరక్షణ ద్వారా నివారించే దృష్టితో లేక పునఃస్థాపించే దృష్టితో, ఆధునిక నాగరికత వల్ల పర్యావరణంపై కలిగే హానికరమైన ప్రభావాలను గూర్చిన పరిశీలన.” మామూలు మాటల్లో చెప్పాలంటే, జీవావరణశాస్త్రం అంటే మానవుడు ఏ హాని చేశాడో కనుగొని, దాన్ని బాగు చేసేందుకు మార్గాలను కనుగొనడమే. వీటిలోని రెండూ కష్టమైన పనులే.
మూడు నిర్వివాదమైన జీవావరణశాస్త్ర సత్యాలు
గ్రహంతో శాంతిని కల్గివుండడం అనే తన పుస్తకంలో బారీ కామ్మనర్, అనే జీవ శాస్త్రజ్ఞుడు, దుర్వినియోగపరచడాన్ని భూమి ఎందుకు తట్టుకోలేదో వివరించే జీవావరణ సంబంధిత మూడు సులభమైన నియమాలను సూచిస్తున్నాడు.
ప్రతి ఒక్కటీ ఇతర వాటన్నింటితోను సంబంధం కల్గివుంది. ఎలాగైతే పాడైన పన్ను మన శరీరమంతటిపై ప్రభావం చూపిస్తుందో, అలాగే ఒక సహజ వనరుకు జరిగిన నష్టం పర్యావరణ సమస్యల క్రమాన్నంతటిపై ప్రభావం చూపుతుంది.
ఉదాహరణకు, గత 40 సంవత్సరాల్లో, అటు కట్టెలకొరకుగానీ ఇటు కలప ఉత్పత్తుల కొరకు గానీ నేపాల్ యొక్క 50 శాతం హిమాలయ అడవులు నరికివేయబడ్డాయి. చెట్లన్నీ నరికివేయబడిన తర్వాత, ఋతుపవన వర్షాలు కురిసినప్పుడు ఆ పర్వతాల మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. పైనేల లేకుండ, క్రొత్త మొక్కలు నాటుకోలేవు, అంతేకాకుండ పర్వతాలు అనావృతమైపోయాయి. అటవీ నిర్మూలనం కారణంగా, ప్రతి సంవత్సరమూ నేపాల్ కొన్ని లక్షల టన్నుల పైమట్టిని కోల్పోతోంది. మరియు సమస్యలు నేపాల్‌కు మాత్రమే సంబంధించినవి కావు.
ఒకనాడు బంగ్లాదేశ్‌నందలి చెట్లు పీల్చుకునే కుంభవృష్టి, నేడు బోడైపోయిన పర్వతాలమీదుగా క్రిందకు పారి అలా సముద్ర తీర ప్రాంతంవైపుకు వెళుతోంది, అక్కడ అవి విపత్కర వరదలకు కారణమౌతున్నాయి. గతంలో ప్రతి 50 సంవత్సరాలకు బంగ్లాదేశ్‌లో ఓ విపత్కర వరద వచ్చేది; అయితే ఇప్పుడు ప్రతి 4 సంవత్సరాలకూ లేక అంతకంటే తక్కువ సమయంలోనే వస్తోంది.
ప్రపంచంలోని ఇతర భాగాల్లో, అటవీ నిర్మూలనం ఎడారి తయారయ్యేందుకు మరియు స్థానిక వాతావరణంలో మార్పులు సంభవించేందుకు నడిపింది. మానవుడు పాడుచేసే సహజవనరుల్లో అడవులు కేవలం ఒక్కటి మాత్రమే. విస్తృతమైన మన జీవావరణ వ్యవస్థలో ఒకదానితో ఒకటి పెనవేసుకునే భాగాలను గూర్చి జీవావరణశాస్త్రజ్ఞులకు ఇంతవరకూ కొంతమాత్రమే తెలుసు గనుక, తీవ్రమైన నష్టం జరిగిన తర్వాతగానీ ఓ సమస్య కనిపించదు. వ్యర్థపదార్థం తీసివేసే విషయంలోనూ ఇది వాస్తవమే, అది జీవావరణ యొక్క రెండవ నియమాన్ని చక్కగా ఉదాహరిస్తుంది.
ప్రతీదీ ఎక్కడికో ఒకచోటికి వెళ్లాల్సిందే. చెత్త పారేయడమన్నదే లేని ఒక ఇల్లు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మన గ్రహం మూసుకుని ఉండే, అలాంటి సృష్టే—మన వ్యర్థపదార్థాలన్ని భూగృహం చుట్టూ ఎక్కడో ఒక చోట ఉండిపోవాలి. ఓజోను పొర కొద్దిగా నాశనమౌడం, అంత హానికరం కాని కొన్ని క్లోరోఫ్లోరోకార్బన్ల (CFC లు) వంటి వాయువులు సహితం పూర్తిగా గాలిలో మాత్రమే కలిసిపోవని చూపిస్తోంది. ఆకాశమూ నదులూ మహాసముద్రాల్లోకి వదిలివేయబడే అపాయకరం కాగల వందలకొలది పదార్థాల్లో CFC లు కేవలం ఒకవర్గం మాత్రమే.
నిజమే, “తక్కువ జీవశ్రేణి” (బయోడిగ్రేబుల్) అని పిలువబడే కొన్ని పదార్థాలు సహజ పద్ధతివల్ల కొంతకాలానికి చివికిపోయి కలుపుకోబడతాయి, కానీ మిగిలినవి అలా కాదు. ప్రపంచమందలి సముద్ర తీరాల్లో, అనేక దశాబ్దాల వరకూ అలాగే ఉండే ప్లాస్టిక్ డబ్బాలు చిందరవందరగా కనిపిస్తాయి. సాధారణంగా ఎక్కడో పూడ్చివేయబడే కర్మాగారాల విషపూరిత వ్యర్థపదార్థాలు పెద్దగా కనిపించవు. కంటికి కనబడకపోయినా అవి మన మనస్సులనుండి కూడా పోతాయన్న హామీ ఏమీ లేదు. అయినప్పటికీ అది భూగర్భ జలాశయాలకు దిగిపోయి మానవునికీ జంతువులకూ తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగించగలదు. “ఆధునిక పరిశ్రమ ఉత్పత్తి చేసే రసాయనాలన్నింటితో ఏమి చేయాలో మాకు తెలియడం లేదు.” అసలు ఏవి ఉత్పత్తవుతున్నాయి ఎక్కడికి వెళుతున్నాయి అన్న విషయం కూడా మాకు తెలియదు” అని బుడాపెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలోని హంగరీకి చెందిన ఓ శాస్త్రజ్ఞుడు ఒప్పుకున్నాడు.
అన్నింటికన్నా అతి ప్రాణాంతమైన వ్యర్థపదార్థం, అణు విద్యుత్ కేంద్రాల ఉపోత్పత్తైన అణుధార్మిక వ్యర్థపదార్థమే. అప్పటికే కొంత మహా సముద్రాల్లో వేయబడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వేవేల టన్నుల అణు వ్యర్థపదార్థం తాత్కాలికంగా నిల్వచేయబడుతోంది. అనేక సంవత్సరాలుగా వైజ్ఞానిక పరిశోధన జరిపినప్పటికీ, వాటిని భద్రంగానూ శాశ్వతంగానూ నిల్వచేసేందుకు లేక పారేసేందుకు ఏ పరిష్కారమూ కనుగొనబడలేదు మరియు ఇక రానున్న భవిష్యత్తులో ఉన్నట్లు కనిపించడంలేదు. ఈ జీవావరణ సంబంధిత టైమ్ బాంబులు ఎప్పుడు ప్రేలుతాయో ఎవరికీ తెలియదు. ఈ సమస్య పోనేపోదు—ఈ వ్యర్థపదార్థం రానున్న శతాబ్దాల వరకూ లేక వేల సంవత్సరాలవరకూ, లేక దేవుడు చర్య తీసుకునేంత వరకూ అణుధార్మికంగా ఉంటుంది. (ప్రకటన 11:18) వ్యర్థపదార్థాన్ని పారేయడంలో మానవుడు కనపర్చే అజాగ్రత్త, జీవావరణంలోని మూడవ నియమాన్ని జ్ఞాపకం చేస్తుంది.
ప్రకృతి దాని మార్గాన్ననుసరించనివ్వండి. మరో మాటలో, మానవుడు తాను మరింత మంచిదని భావించినవాటితో సహజ విధానాలను అలక్ష్యంచేసేందుకు ప్రయత్నించకుండా వాటితో సహకరించాల్సిన అవసరముంది. కొన్ని కీటక నాశకాలు నిత్య ఉదాహరణగా ఉన్నాయి. వాటిని తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు కలుపు మొక్కలు అదుపు చేసేందుకు మరియు వినాశనకర క్రిములను నశింపజేసేందుకు సహాయపడ్డాయి. పుష్కలమైన పంటలు తప్పకుండా వస్తాయన్నట్లు అనిపించేది. కానీ అంతా తారుమారైంది. కలుపు మొక్కలూ కీటకాలూ ఒకదాని తర్వాత మరో కీటక నాశకానికి నిరోధకశక్తిని పెంచుకున్నాయి, అంతేకాకుండ ఆ కీటక నాశకాలు, కీటకాల సహజ పరభక్షులకూ జంతువులకూ చివరికి మానవునికి కూడా విషపూరితమయ్యాయని స్పష్టమైంది. బహుశ మీరు కీటక నాశని విషానికి గురైవుండవచ్చు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనీసం 10 లక్షలమంది బాధితుల్లో మీరు ఒకరన్నమాట.
చివరి సందిగ్ధతేమిటంటే, భవిష్యత్తులో ఈ కీటకనాశకాలు పంట దిగుబడిని కూడా మెరుగుపర్చకపోవచ్చనే అధిక రుజువే. అమెరికాలో, కీటకనాశక మందుల్లో అకస్మాత్ అభివృద్ధి ప్రారంభమవ్వకముందుకన్నా ఇప్పుడే కీటకాలు కోతను అధికంగా నాశనం చేస్తున్నాయి. అదే విధంగా, ఆగ్నేయాసియాలోని వరిపంటలను ఈ కీటకనాశకాలు ఏమాత్రం అధికం చేయడంలేదని ఫిలిప్పీన్స్‌లో ఉన్న అంతర్జాతీయ వరి పరిశోధక ఇన్‌స్టిట్యూట్ కనుగొంది. వాస్తవానికి, కీటకనాశకాలపై అంతగా ఆధారపడని ఇండొనేషియా ప్రభుత్వం వారి సౌజన్యంతో ఏర్పాటైన కార్యక్రమం, 1987 నుండి కీటకనాశకాల ఉపయోగాన్ని 65 శాతం తగ్గించి నప్పటికీ వరి దిగుబడిలో 15 శాతం పెరుగుదలను సాధించింది. ఆపకుండా, ప్రతి సంవత్సరమూ ప్రపంచ వ్యవసాయదారులు కీటకనాశకాలను విరివిగా ఉపయోగిస్తున్నారు.
పైన చెప్పబడిన మూడు జీవావరణ నియమాలూ తప్పులెందుకు జరుగుతున్నాయో వివరించేందుకు సహాయపడతాయి. ఇతర ప్రాముఖ్యమైన ప్రశ్నలేమిటంటే, ఇప్పటికే ఎంతో నష్టం జరిగింది, దాన్ని సరిచేయవచ్చా?
ఎంత నష్టం జరిగింది?
దీనితోవున్న ప్రపంచ పటం, (8-9 పేజీలను చూడండి) కొన్ని ప్రాముఖ్యమైన పర్యావరణ సమస్యలనూ మరియు అవి తీవ్రంగా ఉన్న ప్రాంతాలనూ ఉన్నతపరుస్తోంది. స్పష్టంగా, సహజ తావు లేకపోవడం వల్లగానీ ఇతర విషయాలవల్లగానీ మొక్కలూ లేక జంతు జాతులు అంతరించిపోతున్నప్పుడు జరిగిన హానిని మానవుడు సరి చేయలేడు. ఓజోను పొర తరిగిపోవడం వంటి ఇతర నష్టాలు అప్పటికే సంభవించాయి. ఇలా ఎడతెరపిలేకుండా పర్యావరణం క్షీణించిపోవడం విషయమేమిటి? దాన్ని ఆపేందుకు లేక కనీసం దాన్ని తగ్గించేందుకు అవసరమైన పురోగతి సాధించబడిందా?
జీవావరణ నష్టంలో అతి ప్రాముఖ్యమైన గాజ్‌లు వ్యవసాయమూ మత్స్యపరిశ్రమలే. ఎందుకు? ఎందుకంటే వాటి దిగుబడి మంచి పర్యావరణంపై ఆధారపడివుంటుంది మరియు మన జీవితాలు విశ్వసనీయమైన ఆహార పంపకాలపై ఆధారపడివుంటాయి గనుకనే.
రెండు రంగాలూ తరిగిపోయే సూచనలను కనపరుస్తున్నాయి. చేపలను పట్టే ఓడలు చేపలకు తీవ్రమైన హానికల్గించకుండా పది కోట్ల టన్నుల కంటే ఎక్కువ చేపలు పట్టలేవని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయసంస్థ లెక్కవేసింది. 1989 నందు ఈ మొత్తం దానికంటే మించిపోయింది, మరి అనుకున్నట్లుగానే తర్వాతి సంవత్సరం 40 లక్షలకు తగ్గిపోయింది. చేపలను పట్టే కొన్ని ప్రాంతాలు తగ్గిపోవడం చాలా ఎక్కువైంది. ఉదాహరణకు, పూర్వోత్తర అట్లాంటిక్‌లో చేపలను పట్టడం గత 20 సంవత్సరాల్లో 32 శాతం తగ్గింది. ముఖ్యమైన సమస్యలు, చేపలను అధికంగా పట్టడడం, మహాసముద్రాలను కలుషితం చేయడం మరియు చేపలు గ్రుడ్లు పెట్టే ప్రాంతాలను నాశనం చేయడమే.
ఈ ప్రమాదకరమైన ధోరణి పంట దిగుబడిలో ప్రతిబింబిస్తోంది. 60 లు మరియు 70 లల్లో మెరుగొందిన పంటల రకాలూ అలాగే సాగు చేయడం మరియు రసాయనిక క్రిమికీటకనాశకాలూ ఎరువులూ ప్రపంచవ్యాప్తంగా ధాన్య దిగుబడి గణనీయంగా పెరిగేలా చేశాయి. ఇప్పుడు క్రిమికీటకనాశకాలు మరియు ఎరువులూ వాటి శక్తిని కోల్పోతున్నాయి మరియు నీటి కొరతా కాలుష్యం కూడా పంట తగ్గిపోయేందుకు దోహదపడ్డాయి.
ప్రతి సంవత్సరమూ ఆహారం తినేందుకు 10 కోట్ల మంది ఇంకా ఉన్నప్పటికీ, గత శతాబ్దంలో వ్యవసాయ భూమి సంపూర్ణంగా తగ్గింది. అంతేకాకుండ ఈ సాగుచేయదగిన నేల దాని సారాన్ని కోల్పోతోంది. గత 20 సంవత్సరాలుగా క్షరణం, వ్యవసాయదారులకు 50,000 కోట్ల టన్నుల పైమట్టి లేకుండా చేసిందని వరల్డ్ వాచ్ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేస్తోంది. ఆహార దిగుబడి తరగడం ప్రారంభమైంది. “1984 మరియు 1992 మధ్య కాలంలో, ప్రతి వ్యక్తికీ ధాన్య ఉత్పాదనలో 6 శాతం తగ్గడం, నేడు ఎంతో కలతపర్చే ప్రపంచ ఆర్థిక ధోరణి కావచ్చు” అని 1993 ప్రపంచ పరిస్థితి అనే నివేదిక వ్యాఖ్యానించింది.
స్పష్టంగా, మానవుడు పర్యావరణాన్ని అలక్ష్యం చేయడం వల్ల కోట్లాదిమంది జీవితాలు ఇప్పటికే అపాయంలో ఉన్నాయి.
మానవుడు సమస్యలను పరిష్కరించగలడా?
తప్పెందుకు జరుగుతుందన్న విషయాన్ని నేడు అర్థం చేసుకున్నప్పటికీ, దాన్ని బాగు చేయడం అంత సులభం కాదు. 1992 లో ఎర్త్ సమ్మిట్‌లో ముందుంచిన సమగ్ర ప్రతిపాదనలను అమలుపర్చడంలోనే ప్రథమ కఠినత ఉంది. ఎక్కువ డబ్బు అవసరమవ్వడం—కనీసం ఒక సంవత్సరానికి 60,000 కోట్ల అమెరికన్ డాలర్లు అవసరమౌతుంది. అసలైన త్యాగాలు కూడా అవసరం కావచ్చు—ఎక్కువగా వ్యర్థపర్చకుండా ఉండడమూ ఎక్కువగా పునరుపయోగించడం, నీటినీ శక్తినీ కాపాడుకోవడం, ప్రైవేటు వాహనాలకు బదులు ప్రజా వాహనాలను ఉపయోగించడం, మరి అన్నింటికంటే కష్టంగా తమ స్వంత గృహాన్ని గూర్చి కాకుండా గ్రహాన్ని గూర్చి ఆలోచించడం వంటి త్యాగాలు అవసరమౌతాయి. జల జీవావరణ వ్యవస్థను పునఃస్థాపించే అమెరికా కమిటీకి అధ్యక్షుడైన జాన్ కేరిన్స్ జూనియర్ ఈ సమస్యను ఒక్క మాటలో ఇలా చెప్పాడు: “మనం చేయగల పనిని గూర్చి నేను ఆశావాదంతో ఉన్నాను. మనం చేసే పనిని గూర్చి నేను నిరాశావాదంతో ఉన్నాను.”
మొత్తం శుభ్రపర్చేందుకు అయ్యే ఖర్చు ఎంతంటే, అనేక దేశాలు బిల్లు చెల్లించాల్సిన రోజునే వాయిదా వేసేందుకు ఇష్టపడుతున్నాయి. ఆర్థిక సంక్లిష్టత సమయంలో, పర్యావరణ సంబంధిత చర్యలు ఉద్యోగాలకు అపాయంగానూ లేక ఆర్థికతకు భంగం కల్గించేవిగాను దృష్టించబడుతున్నాయి. క్రియలకన్నా నోటి మాట ఎంతో చౌక. భూమి ఎడల శ్రద్ధ వహించడం అనే పుస్తకం, ఇప్పటివరకున్న ప్రతిస్పందనను, “ఫెళఫెళమనే ఉరుముల్లాంటి మాటల తర్వాత అనావృష్టివంటి నిష్క్రియల” వంటిదిగా ఉందని వర్ణించాడు. అయితే పరిస్థితి ఇలా కాళ్లీడుస్తున్నప్పటికీ, సమయమిస్తే, నూతన సాంకేతికత ఈ గ్రహపు అనారోగ్యాలకు వేదనరహిత చికిత్సను కనుగొనగలదా? లేనేలేదు.
ఓ సమిష్టి వాజ్ఞ్మూలంలో, అమెరికా జాతీయ వైజ్ఞానిక అకాడమీ మరియు లండన్ రాయల్ సొసైటీ నిర్మొహమాటంగా ఇలా అంగీకరించాయి: “జనాబా పెరుగుదలను గూర్చి ప్రస్తుతం ముందుగానే చెప్పబడుతున్న మాటలు కచ్చితమేనని నిరూపించబడితే మరియు ఈ గ్రహంపై మానవుని చర్యలో ఏ మార్పూ లేకపోతే, అటు పర్యావరణ శాశ్వత అథఃపతనాన్ని ఇటు ప్రపంచంలోని అధికభాగంలో నిరంతరం పెరిగే పేదరికాన్ని విజ్ఞాన శాస్త్రమూ సాంకేతికత నివారించలేకపోవచ్చు.”
ఎక్కడా పారేయలేని అణు వ్యర్థపదార్థాల భయకంపిత సమస్య, విజ్ఞాన శాస్త్రం సర్వ శక్తిమంతం కాదని జ్ఞాపకం చేస్తుంది. అణుధార్మిక వ్యర్థపదార్థాన్ని శాశ్వతంగా దాచే భద్రమైన స్థలం కొరకు వైజ్ఞానికులు 40 సంవత్సరాలనుండీ వెదుకుతున్నారు. ఈ అన్వేషణ ఎంత కష్టమని తేలిందంటే, ఇటలీ, అర్జెంటీనా వంటి దేశాలు, అతి త్వరలో అంటే 2040 వ సంవత్సరం వరకూ వారలాంటి ప్రాంతాన్ని కనుగొనరనే నిర్ణయానికొచ్చారు. ఈ విషయంలో అత్యంత ఆశాభావంగల దేశమైన జర్మనీ, 2008 కల్లా తమ పథకాలకు తుది రూపమిస్తామనే ఆశిస్తోంది.
అణు వ్యర్థపదార్థం ఎందుకంత సమస్యగా ఉంది? “ఏ వైజ్ఞానికుడు కానీ లేక ఇంజినీరు కానీ, అణుధార్మిక వ్యర్థపదార్థాన్ని ఎంత జాగ్రత్తగా దాచినా, ఏదోకనాడు అపాయకరమైన మోతాదుల్లో అది బయటకు పొక్కదని చెప్పలేడు” అని భూగర్భ శాస్త్రజ్ఞుడైన కోనరడ్ క్రౌస్కోఫ్ వివరిస్తున్నాడు. వ్యర్థ పదార్థాలను పారవేయడంలోగల కష్టాన్ని గూర్చి ఎంతో ముందుగా హెచ్చరికలను ఇచ్చినప్పటికీ, రేపటి సాంకేతికత్వం ఒక పరిష్కారాన్ని తీసుకువస్తుందని భావిస్తూ ప్రభుత్వాలూ అణుశక్తి పరిశ్రమలూ ఏమీ పట్టనట్టుగా ముందుకు సాగిపోయాయి. ఆ రేపు ఎన్నడూ రాలేదు.
పర్యావరణ సంక్లిష్టతకు సాంకేతికత్వం సత్వర పరిష్కారాన్ని ఇవ్వలేకపోతే, మరే ఎంపికలు మిగిలి ఉన్నాయి? చివరకు కలిసికట్టుగా గ్రహాన్ని కాపాడే అవసరత దేశాలను బలవంతం చేస్తుందా?
[అధస్సూచి]
a ఒయికోస్ (ఇల్లు, గృహం) మరియు లోజియా (పరిశీలన) అనే గ్రీకు పదాల నుండి వచ్చింది.
[[7వ పేజీలోని బాక్సు]
నవీకరించగల శక్తి ఆధారాల అన్వేషణ
చమురు పూర్తిగా లేకపోయేంతవరకూ లేక వాటి ధరలు పెరిగేంతవరకూ మనలో అనేకులం శక్తిని చులకనగా తీసుకుంటాము. అయితే, కాలుష్యానికి గల అత్యంత ముఖ్యమైన కారణాల్లో శక్తి వినియోగం ఒకటి. శక్తిలో అధిక శాతం కట్టెలూ లేక శిలాజములు కాలడం నుండి వస్తుంది—ఈ పద్ధతి, వాతావరణాన్ని కోటానుకోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్‌తో నింపుతోంది మరియు ప్రపంచ అడవులను అత్యధికంగా నాశనం చేస్తుంది.
మరో ఎంపిక అణు శక్తి, ప్రమాదాలు జరుగుతాయనే భయంవల్ల మరియు అణుధార్మిక వ్యర్థపదార్థాలను దాచడంలోని కష్టంవల్ల ప్రజల అనంగీకారానికి మరింత లోనౌతోంది. ఇతర ప్రత్యామ్నాయాలు, నవీకరించగల శక్తి ఆధారాలు అని పిలువబడుతున్నాయి, ఎందుకంటే అవి లభ్యమయ్యే శక్తి ఆధారాలకు ముడిపెట్టబడివుంటాయి గనుక అవి విరివిగా లభ్యమౌతాయి. ఇలాంటివి ఐదు ప్రాముఖ్యమైన రకాలున్నాయి.
సౌరశక్తి. వేడిచేసుకునేందుకు దీనిని సులభంగా పట్టవచ్చు, అంతేకాకుండ ఇజ్రాయల్ వంటి కొన్ని దేశాల్లో నీటిని వేడిచేసేందుకు అనేకమంది ఇళ్లల్లో సౌర పానల్స్ ఉన్నాయి. విద్యుత్తును పొందేందుకు సూర్యున్ని ఉపయోగించడం ఎంతో కఠినం, అయితే ఆధునిక ఫోటోవోల్‌టైక్ సెల్లులు ఇప్పటికే పల్లెప్రాంతాల్లో విద్యుచ్ఛక్తిని అందిస్తోంది మరియు దానికెంతో తక్కువ ఖర్చౌతుంది.
పవన విద్యుత్తు. ప్రపంచంలో గాలి ఎక్కువగా వీచే ప్రాంతాల్లో బారీ గాలిమరలు విస్తృతంగా ఉన్నాయి. ఇది ఎయిలియన్ శక్తి అని పిలువబడుతోంది, అది అందించే విద్యుచ్ఛక్తి ధర తగ్గిపోయింది మరి కొన్ని ప్రాంతాల్లోనైతే శక్తినందించే సాంప్రదాయ విధానాలకంటే ఇప్పుడు తక్కువ ఖర్చౌతుంది.
జలవిద్యుత్తు. అప్పటికే ప్రపంచ విద్యుచ్ఛక్తిలో 20 శాతం జలవిద్యుత్తు కేంద్రాలనుండి వస్తోంది, అయితే వర్థమాన దేశాల్లో మంచి ఫలితాలనిచ్చే ప్రాంతాలు అప్పటికే పాడు చేయబడ్డాయి. పెద్దపెద్ద ఆనకట్టలు కూడా ఎంతో జీవావరణ నష్టాన్ని కలిగించగలవు. ప్రత్యేకంగా అభివృద్ధి చెందే దేశాల్లో శ్రేష్ఠమైన ఆశ, అనేక చిన్న జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించడమేనన్నట్లు కనిపిస్తుంది.
భూతాపన విద్యుత్తు. ఐస్‌లాండ్ మరియు న్యూజీలాండ్ వంటి దేశాలు, తమ భూమిలోని “వేడినీటి విధానాన్ని” కనుగొనగల్గాయి. భూగర్భంలోని అగ్నిపర్వత చర్య నీటిని వేడి చేస్తుంది, అది ఇళ్లను వేడి చేసేందుకు మరియు విదుచ్ఛక్తిని ఉత్పాదించేందుకూ ఉపయోగపడుతుంది. ఇటలీ, జపాన్, మెక్సికో, ఫిలిప్పీన్స్ మరియు అమెరికా ఈ సహజ శక్తిని కొంతమేరకు వృద్ధి చేశాయి.
తరంగ విద్యుత్తు. విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ మరియు రష్యా వంటి కొన్ని దేశాల్లో సముద్ర తరంగాలు ఉపయోగించబడుతున్నాయి. అయితే, తక్కువ ధరకు ఈ శక్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రాంతాలే అందిస్తున్నాయి.
[8,9వ పేజీలోని బాక్సు/చిత్రం]
ప్రపంచ ముఖ్య పర్యావరణ సమస్యల్లో కొన్ని
అడవుల వినాశనం. ప్రపంచంలోని మూడువంతుల సమశీతోష్ణ అడవులూ మరియు సగం ఉష్ణమండల అడవులూ ఇప్పటికే పోయాయి, అంతేకాకుండ గత దశాబ్దంలో అటవీ నిర్మూలనం భయకంపితం చేసేంతగా పెరిగింది. ప్రతి సంవత్సరం, ఉష్టమండల అడవులు 1,50,000 నుండి 2,00,000 చదరపు కిలోమీటర్లు, అంటే సుమారు ఉరుగ్వే అంత ప్రాంతం నాశనమౌతోందని తాజా అంచనా.
విషపూరితమైన వ్యర్థపదార్థాలు. ప్రస్తుతం తయారు చేయబడుతున్న 70,000 రసాయనాల్లో విషపూరితమైనవాటి కోవలోకి చేర్చబడ్డాయి. ప్రతి సంవత్సరమూ ఒక్క అమెరికాలోనే 24 కోట్ల టన్నుల విషపూరితమైన వ్యర్థపదార్థాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. వివరాలు లేకపోవడం ప్రపంచవ్యాప్త మొత్తాన్ని లెక్కించడాన్ని అసాధ్యం చేస్తుంది. అంతేకాకుండా, 2000 సంవత్సరానికల్లా తాత్కాలిక ప్రాంతాల్లో నిలువచేయబడిన అణుధార్మిక వ్యర్థపదార్థాలు దాదాపు 2,00,000 టన్నులకు చేరుకుంటుంది.
భూ క్షీణత. ప్రపంచ ఉపరితల ప్రాంతంలో మూడవవంతు ఎడారయ్యే అపాయముంది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, కేవలం 20 సంవత్సరాల్లో సహారా ఎడారి 350 కిలోమీటర్లకు పెరిగింది. ఇప్పటికే కోట్లకొలది ప్రజల జీవనోపాధి అపాయంలో ఉంది.
నీటి కొరత. సుమారు రెండు వందల కోట్ల మంది ప్రజలు నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఈ కొరతను మరింత తీవ్రం చేస్తూ, నీటి వనరులు తగ్గిపోవడంవల్ల వేలకొలది బావులు ఎండిపోతున్నాయి.
అంతరించిపోయే అపాయంలో ఉన్న జాతులు. సంఖ్యలు కొంత అనుమానకరమైనప్పటికీ, 5,00,000 కి 10,00,000 కి మధ్య జాతుల జంతువులూ మొక్కలూ కీటకాలూ 2000 సంవత్సరానికల్లా అంతరించిపోతాయని వైజ్ఞానికులు అంచనావేస్తున్నారు.
వాతావరణ కాలుష్యం. 100 కోట్ల మంది, పొగమసి అణువులున్న లేక సల్ఫర్‌డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువుల స్థాయి ఆరోగ్యానికి అపాయకరంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని 1980 ల తొలి భాగంనందు జరిపిన ఐక్యరాజ్య సమితి పరిశీలన కనుగొంది. గత దశాబ్దంలో త్వరితంగా పెరిగిన నగరాలు నిస్సంకోచంగా, ఈ సమస్యను మరింత విషమింపజేసాయి. అంతేకాకుండా, ప్రతి సంవత్సరమూ 2,400 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడువబడుతోంది, ఈ “హరితగృహం వాయువు” భూగోళాన్ని వెచ్చగా చేయగలదని భయపడుతున్నారు.
[చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
అటవీ నిర్మూలనం
విషపూరితమైన వ్యర్థపదార్థాలు
వాతావరణ కాలుష్యం
నీటి కొరత
అపాయంలోనున్న జాతులు
భూ క్షీణత
[Credit Lines]
Mountain High Maps™ copyright© 1993 Digital Wisdom, Inc.
Photo: Hutchings, Godo-Foto
Photo: Mora, Godo-Foto