యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
దేవుని నా స్నేహితున్ని చేసుకోవడం నాకు సహాయం చేయగలదా?
ఒక తరం ముందు నమ్మశక్యం కానివిగా ఉండిన ఒత్తిళ్లతో నేడు అనేకమంది యౌవనస్థులు పెరిగి పెద్దౌతున్నారు. 1,60,000 యౌవనులపై జరిపిన ఒక జాతీయ సర్వే యొక్క రచయితలు ఇలా వివరించారు: “తమ సమస్యలను గ్రహించని తలిదండ్రుల నుండి; తమ నమ్మకాన్ని హరించే నిరుత్సాహం, దుఃఖం నుండి; తాము దాన్ని ఎదుర్కొనలేమని భావించే ఒత్తిడినుండే తమ వ్యధ మొదలౌతుందని యౌవనస్థులు మనకు చెబుతారు.” యౌవనుల జీవితం కొన్నిసార్లు ఎంత బాధాకరంగా ఉంటుందో ఇతరులు ఎన్నటికీ అర్థం చేసుకోలేరని మీరు కూడా భావించవచ్చు.
మీరు సహాయాన్ని, భావోద్రేక మద్దతును పొందేందుకు మీకు సన్నిహిత స్నేహితులు ఉండవచ్చు, మరి అది కొంత ఉపశమనాన్ని ఇవ్వవచ్చు అన్నది వాస్తవమే. అయితే మీరు ఒంటరిగా ఎదుర్కొనవలసిన బాధాకరమైన కష్టాలు కొన్ని ఉన్నాయన్నది నిజం కాదా? “ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును,” అనేది కొన్నిసార్లు ఎంత వాస్తవమో. (సామెతలు 14:10) అయితే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నాడు, ఆయన తన స్నేహాన్ని మీకిస్తున్నాడు. అత్యంత బాధాకరమైన సమయాల్లో కూడా ఆయన స్నేహం ఎంతో గొప్ప సహాయకంగా ఉన్నట్లు అనేకమంది యౌవనులు గుర్తించారు.
దేవునితో స్నేహం
యెహోవా దేవునికి తాను ఏ విషయాన్నిబట్టి ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉందని ఒక యౌవనస్థురాలిని అడగటం జరిగింది. “మనం ఆయనను తెలుసుకుని, ఆయన సన్నిహిత స్నేహితులం కాగల్గినందుకేనని,” ఆమె సమాధానమిచ్చింది. అవును, విశ్వంలోకెల్లా చక్కని స్నేహాన్ని పొందడం సాధ్యమే! కీర్తనల గ్రంథకర్త ఇలా వ్రాశాడు: “యెహోవాతో సన్నిహితత్వమును, ఆయనయందు భయభక్తులు గల వారు పొందుతారు.”—కీర్తన 25:14, NW.
“యెహోవాతో సన్నిహితత్వము”—ఎంతటి అమూల్యమైన అవకాశం! ప్రత్యేకంగా స్నేహాన్ని చూపే వ్యక్తితో ఎవరితోనైనా మనస్సు విప్పి, ఆంతరంగిక విషయాలను మాట్లాడటమనే భావాన్ని ఆ మూల హెబ్రీ పదం తెలియజేస్తుంది. కావున, అది ప్రేమపై ఆధారపడిన సన్నిహిత సంబంధం, పరస్పర నమ్మకం మూలంగా ఏర్పడిన ఒక ఆధిక్యతయైన సన్నిహితత్వం. మిమ్మల్ని యథార్థంగా అర్థం చేసుకునే వారివలననే వ్యక్తిగా మీ నిజమైన విలువ పరిగణింపబడుతుందని, దేవున్ని స్నేహితునిగా కలిగివున్న వారిగా మీరు గుర్తిస్తారు. ఈ స్నేహం యొక్క ప్రయోజనాలేమిటి?
“బాల్యమునుండి నా ఆశ్రయము నీవే”
అనేకమంది యౌవనులు పైకి ధైర్యశాలులవలె కనిపించినా అంతర్గత విశ్వాసాన్ని కలిగి ఉండరు. “నేను నా అభిప్రాయాన్ని చెబుతాను, మరి ఇతరులు కూడా వాళ్ల అభిప్రాయం చెబుతారు, వెంటనే నా అభిప్రాయం మారిపోతుంది. నేను ఏది నమ్ముతున్నానో నాకే తెలియదని” 13 ఏళ్ల జూడీ విలపిస్తుంది. అయితే, విజయవంతంగా జీవించడానికి ప్రత్యేకమైన నడిపింపును మన పరలోకపు స్నేహితుడు తన వ్రాతపూర్వక వాక్యమైన బైబిలునందు అందజేస్తున్నాడు. వాస్తవానికి, బైబిలు పుస్తకమైన సామెతల గ్రంథంలో ఇవ్వబడిన సలహా, తమ త్రోవలను సరాళం చేసుకునేందుకు, “యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు” రూపొందించబడింది. (సామెతలు 1:1-4; 3:1-6) ఇది మీకు నమ్మకాన్ని ఇవ్వగలదు! జీవించడానికి గల శ్రేష్ఠమైన మార్గాన్ని మీరు తెలుసుకోగలరు.
బైబిలు, అలాగే ఈ పత్రికవంటి బైబిలు సహాయకాలు—స్నేహితులను ఎలా ఎన్నుకోవాలి అనే అంశం నుండి మీ తలిదండ్రులపట్ల సరైన దృక్పథం వరకూ—జీవితంలోని ప్రతి అంశంపై సలహాను అందిస్తాయి. (సామెతలు 1:8, 9; 13:20) అలాంటి నడిపింపును లక్ష్యపెట్టే వారు “మరణపాశములలోనుండి విడిపించ” బడతారు. (సామెతలు 14:27) ఉదాహరణకు, మే అనే పేరుగల ఒక అమ్మాయి తన అక్క బైబిలు సూత్రాలను తిరస్కరించడం చూసింది. ఆమె అక్క తన విచ్చలవిడి జీవితవిధానం వలన అకాల మరణానికి గురైంది. అలాంటి లైంగిక దుర్నీతిని తానెలా ఎదుర్కొనగల్గిందో మే వివరిస్తుంది: “నైతికతను గూర్చిన యెహోవా సూత్రాలను గురించి నేను స్పష్టంగా చూడగల్గుతున్నాను, అది నన్ను దృఢపర్చుతుంది. యెహోవా ఎంత నిజమైనవాడని మరి ఆయన మార్గం శ్రేష్ఠమైనదని నేను చూడటానికి ఈ సూత్రాలు నాకు సహాయం చేస్తాయి.”
అయితే, యెహోవాను స్నేహితునిగా కలిగి ఉండటంలో, ఆయన ప్రమాణాలను నేర్చుకోవడంకంటే ఎక్కువే ఇమిడి ఉంది. మీ జీవితంలో ఆయన వ్యక్తిగత ఆసక్తిని మీరు అనుభవించగలరు. తన యౌవనంనుండి దేవునిచేత బోధింపబడిన రాజైన దావీదును గురించి బైబిలు చెబుతుంది. దావీదు దేవుని స్నేహితుడయ్యాడు, ఆయన “అనేకమైన కఠినబాధలను” అనుభవించినప్పటికీ దేవుడు తన జీవితంలో చర్య తీసుకోవడాన్ని ఆయన వాస్తవంగా చూశాడు. తన విషయంలో దేవుని “ఆశ్చర్యకార్యముల” ను గురించి మరి తన జీవితంలో ఆయన చాపిన “బాహుబలమును,” లేక శక్తిని గురించి దావీదు మాట్లాడాడు. అలాంటి వ్యక్తిగత అనుభవాల ఆధారంగా, దావీదు ఇలా వ్రాశాడు: “నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.” (ఇటాలిక్కులు మావి, కీర్తన 71:5, 17, 18, 20) యెహోవా దీవెనను మీ జీవితంలో మీరు గ్రహిస్తుండగా మీరు కూడా అదేలాంటి నమ్మకాన్ని పొందవచ్చు. సవాళ్లు ఉన్నప్పటికీ, ఆయన నడిపింపును మీరు అనుసరించాలని మీరు కృషి చేస్తుండగా—మీరు వాస్తవంగా దేవునితో ఒక పటిష్ఠమైన సంబంధంలో నడుస్తుంటారు.—ఆదికాండము 6:9, పోల్చండి.
సరైన మార్గాన్ని అనుసరించేందుకు దేవుడు మనకు సహాయంచేస్తాడు
జీవితంలో ఎదురయ్యే శోధనలు, ఒత్తిళ్లన్నిటితో దేవుని నడిపింపును అనుసరించడం సులభం కాదు. యౌవనంలో మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తూ వేశ్యగా ఉండిన పెగ్గీ విషయంలో ఇది ప్రత్యేకంగా సత్యం. బైబిలును అధ్యయనం చేయడం ద్వారా ఆమె తన వ్యసనాన్ని అధిగమించగల్గి, నైతిక మార్పులు చేసుకోగల్గింది, మరి అలా ఆమె దేవునితో స్నేహాన్ని వృద్ధిపర్చుకుంది. అయితే, మాదక ద్రవ్యాల ద్వారా తాను విడుదల పొందాలని ప్రయత్నించిన అదే ఒత్తిళ్లను పెగ్గీ ఎదుర్కొనడంలో కొనసాగింది. తాను ఎలా దాన్ని అధిగమించడంలో కొనసాగగల్గిందని ఆమెను అడిగినప్పుడు, ఆమె ఇలా సమాధానమిచ్చింది: “యెహోవా ఆత్మ ద్వారా మాత్రమే అది జరిగిందని నేను చెప్పగలను.”
దేవుడు తన స్నేహితులకు తన పరిశుద్ధాత్మను లేక చురుకైన శక్తినిస్తాడని, తన ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి ఇది వారికి శక్తినివ్వగలదని పెగ్గీకి తెలుసు. (అపొస్తలుల కార్యములు 5:32; 1 కొరింథీయులు 6:9-11) “ఇప్పుడు కొన్ని సమయాల్లో ప్రాముఖ్యంగా నేను ఒంటరిగా ఉన్నప్పుడు మళ్లీ ఆ పాత భావాలు నాలో కలుగుతుంటాయి, అయితే నేను వెంటనే ప్రార్థించడం ప్రారంభిస్తాను. నేను నా జీవితంలో సాధించిన వాటన్నిటిలోకెల్లా, నా సమస్యలను అధిగమించగల సామర్థ్యతే నాకు చాలా ఉత్తేజకరంగా ఉంది.” “మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయు శక్తి” ని దేవుడు ఒక స్నేహితునిగా ఇచ్చి మనకు సహాయం చేయగలడని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరంగా ఉండగలదు.—ఎఫెసీయులు 3:20.
దీర్ఘశాంతం, సాత్వికం, ఆశానిగ్రహంవంటి లక్షణాలను వృద్ధిపర్చుకోడానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. (గలతీయులు 5:22, 23) ఇంకా, యెహోవాసాక్షుల సంఘాల్లో ఉన్న, పరిశుద్ధాత్మ ద్వారా నియమింపబడిన పెద్దలు లేక కాపరులు ఆచరణయోగ్యమైన సహాయాన్ని అందించేందుకు దేవునిచేత నియమింపబడ్డారు. పెగ్గీ ఇలా చెబుతుంది: “సంఘంనుండి, ప్రాముఖ్యంగా పెద్దల నుండి నాకు చాలా మద్దతు లభించింది. అది ఎంతో గొప్ప సహాయం.”
“నా హృదయమునకు ఆశ్రయ దుర్గము”
“నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.” ఇది సామెతలు 17:17 లో చెప్పబడిన మాట. ప్రాముఖ్యంగా “దుర్దశలో” స్నేహితుని సహాయం అవసరం. కీర్తనల గ్రంథకర్త అయిన ఆసాపు తీవ్రమైన భావోద్రేక వ్యధను అనుభవించాడు, అయినప్పటికీ ఆయన దేవునికి స్నేహితునిగా దగ్గరయ్యాడు. అలా, అంతరంగ బాధ వలన తన “హృదయము మత్సర” పడినప్పటికీ, ఆయనిలా అన్నాడు: “దేవుడు . . . నా హృదయమునకు ఆశ్రయ దుర్గము.” (కీర్తన 73:21, 26, 28) ఆసాపు ఏమి భావిస్తున్నాడో వాస్తవంగా అర్థంచేసుకున్న యెహోవా, ఆయనకు భావోద్రేక మద్దతును ఇచ్చాడు. ఆసాపు నమ్మకాన్ని, ధైర్యాన్ని కోల్పోకుండా ఉండేలా యెహోవా దృఢపర్చే ప్రభావాన్ని ఆయనపై చూపాడు.
కష్టాలప్పుడు మన పరలోక స్నేహితుడు మీకు కూడా ఆశ్రయదుర్గం వంటి పునాదిలా ఉండగలడు. ఒక యౌవనస్థురాలు వ్యక్తిగత అనుభవం ద్వారా దీన్ని తెలుసుకుంది. బోనీ 13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, తన చిన్న పల్లె పాఠశాలలోని కొంతమంది అమ్మాయిలు ఆమెను గురించి ఒక చెడ్డ, అబద్ధ వదంతిని పుట్టించారు. ఈ అబద్ధాన్ని అందరూ నమ్మినట్లనిపించింది బోనీకి. ఆమె తరగతిలోని వారు కొందరు ఆమెతో విముఖంగా ఉంటూ ఆమెకు అవమానకరమైన పేర్లు కూడా పెట్టి పిలువడం ప్రారంభించారు. “అనేక రాత్రులు నేను ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని. నేను లోలోపల ఎంత కుమిలిపోయానంటే నన్ను నేను చంపుకుందామని కూడా అనిపించిందని,” బోనీ వివరించింది. మద్దతు కొరకు ఆమె తన స్నేహితుల వైపు తిరిగింది. “నేను ప్రజలతో మాట్లాడాలని ప్రయత్నించాను, అయితే వాళ్లు అర్థం చేసుకున్నట్లు అనిపించలేదు. నా సమస్య అసలు పనికి రానిదన్నట్లు వారు ప్రవర్తించే వారు. కొన్నిసార్లు నేనెంతో ఒంటరిగా ఉన్నట్లు భావించాను.” అలాంటి కష్టకాలంలో ఆమె నిరీక్షణను కోల్పోకుండా ఉండేలా చేసిందేమిటి? ఆమె ఇలా కొనసాగిస్తుంది: “యెహోవా గనుక ఉండకపోతే, నన్ను నేను చంపుకునే దాన్నే. నేను ఆయన్నెంతో ప్రేమిస్తున్నాను. ఆయన నా శ్రేష్ఠమైన స్నేహితుడు.” తనను భావోద్రేకంగా నలగగొట్టిన ఆ అనుభవాన్ని ఎదుర్కొనేందుకు దేవునితో తనకుగల స్నేహమే సహాయం చేసిందని ఇప్పుడు ఆమెకు తెలుసు.
మనల్ని ఇతరులు అర్థం చేసుకోవాలని అనుకున్నంత అర్థం చేసుకోనప్పుడు, యెహోవా మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడని మరి ఏమి జరిగిందో కచ్చితంగా గుర్తిస్తాడని తెలుసుకోవడం ఎంత గొప్ప ఓదార్పో కదా. ఇంకా, మనపట్ల నిర్దయగా వ్యవహరించినప్పుడు లేక చివరకు మనలను దూషించినప్పుడు కూడా, మన స్నేహితుడు “కనికరము చూపు తండ్రి” అని తెలుసుకోవడం ఒక పెద్ద సహాయం. కొన్నిసార్లు మన స్వంత హృదయాలు మనల్ని ఖండించవచ్చు, అయితే “దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు.” (2 కొరింథీయులు 1:3, 4; 1 యోహాను 3:20) ఒక విషయాన్ని గూర్చిన యెహోవా దృక్కోణాన్ని తెలుసుకోవడం యథార్థంగా ఉపశమనాన్ని ఇవ్వగలదు. ఉదాహరణకు, 13 ఏళ్ల బాలుడు ముగ్గురు పురుషులచేత పాశవికంగా అత్యాచారం చేయబడ్డాడు. “ఆ పిమ్మట, నేనెంతో సిగ్గుగా భావించాను, నాకు జరిగిన దాని గురించి నన్ను నేను నిందించుకున్నాను. నేనెంతో కృంగిపోయానని,” అతను చెబుతున్నాడు. తర్వాత, మానభంగం అనే అంశంపై వాచ్‌టవర్ సొసైటీ యొక్క బైబిలు ఆధారిత ప్రచురణలలో అతను పరిశోధన చేయడం ప్రారంభించాడు. “నేను ఈ సమాచారం చదివిన తర్వాత, భావోద్రేకంగా కదలిపోయి ఏడ్చేశాను. నా భుజాలపైనుండి ఒక పెద్ద భారం తీసివేయబడినట్లుగా భావించాను. నేనొక బాధితున్ని మాత్రమే. యెహోవా, కుటుంబం మరియు స్నేహితులపై ఆధారపడటం ద్వారా ఈ వ్యధలోనూ నేను నిలదొక్కుకోగల్గాను.” ఆ బైబిలు ఆధారిత మాటలు ఎంతటి మద్దతును అందించాయో!
దేవునితో స్నేహం అనేక మార్గాల్లో సహాయపడగలదు! మనం జీవితంలో నిజమైన నమ్మకాన్ని కలిగి ఉండగలం, దేవుని మార్గాన్ని అనుసరించడానికి అంతర్గత శక్తిని వృద్ధి చేసుకోగలం, మరి కష్టకాలంలో ఆశ్రయదుర్గం వంటి ఆధారాన్ని కలిగివుండగలం. అయితే మనం అలాంటి స్నేహాన్ని ఎలా నిర్మించుకోగలం? ఈ పరంపరల్లోని రాబోయే శీర్షిక దీన్ని వివరిస్తుంది.
[13వ పేజీలోని చిత్రం]
దేవుడు ‘మీ ఆశ్రయ దుర్గము’ కాగలడు