“విషాద అనుభవానికి సమానమైన అవకాశం”
“యౌవనారంభంలో ఉన్న అమ్మాయిలకు విషయం అర్థం కావడంలేదు” అని ది టొరొంటో స్టార్ చెబుతుంది. ఏ విషయం? పొగత్రాగడమనేది ప్రాణాంతకమైన అలవాటు అనేదే. కెనడాలో 15 నుండి 19 ఏండ్ల వయస్సులోని అమ్మాయిలను అదే వయస్సులోని అబ్బాయిలతో పోల్చి అమ్మాయిల్లో 25 శాతం మంది పొగత్రాగుతుండగా, అబ్బాయిల్లో 19 శాతం మంది మాత్రమే పొగత్రాగుతున్నారని 1991వ సంవత్సర అధ్యయనం వెల్లడి చేసింది. పెద్దవారిలో కూడా పొగత్రాగే ఆడవారి సంఖ్య మగవారికన్నా మించిపోయింది. “స్త్రీలు పొగ త్రాగడం, విషాద అనుభవానికి సమాన అవకాశంగా మారింది” అని స్మోక్ ఫ్రీ కెనడా అనే సంస్థ సలహాదారులు పేర్కొన్నారు.
యౌవనారంభంలోని అమ్మాయిలు పొగత్రాగనారంభించేదెందుకని? జిజ్ఞాస, తోటివారి ఒత్తిడి మరియు తిరుగుబాటుతనం ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. అయితే, పొగత్రాగే ఆడవారు నాజూగ్గా ఉన్నట్లు చూపించే వాణిజ్య ప్రకటనల పరిశ్రమను నిర్లక్ష్యం చేయకూడదు. అవును, అనేకులు అతిగా తినడాన్ని తగ్గించే ప్రయత్నంలో పొగత్రాగుతారు, వారు దాన్ని ఆపితే లావెక్కుతారేమోనని భయపడుతారు. విషాదకరంగా, ఈ స్త్రీలు క్యాన్సర్ వచ్చే అపాయం కన్నా బరువెక్కే అపాయాన్ని గూర్చే వ్యాకులపడతారు. “ఊపిరితిత్తుల క్యాన్సర్ 20 సంవత్సరాల దూరంలో ఉంది. లావెక్కడమో సమీప భవిష్యత్తులోనే” అనే వారి దృక్పథాన్ని గూర్చి టొరొంటో యూనివర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన రాబర్ట్ కోమ్స్ టూకీగా చెప్పాడు.
సిగరెట్ త్రాగడాన్ని, స్వాతంత్ర్యంతో ముడిపెట్టడం ద్వారా కూడా పొగాకు పరిశ్రమ స్త్రీలను లక్ష్యంగా పెట్టుకుంటుంది. అయితే, “మరణమే తుది స్వాతంత్ర్యమని ఒకరు పరిగణిస్తున్నట్లయితే మాత్రమే, పొగత్రాగడం స్వాతంత్రాన్నిస్తుందని ఒకరు పరిగణించగలరు” అని ఇద్దరు యు.ఎస్ సర్జన్ జనరల్లకు మునుపటి సలహాదారిణియైన జేన్ కిల్బోర్న్ జ్ఞానయుక్తంగా చెప్పింది.