ప్రపంచ పరిశీలన
అపాయంలోనున్న అతికాయులు
గాలపాగోస్ దీవుల్లోని అంతర్జాతీయంగా ప్రసిద్ధికెక్కిన అతికాయులైన తాబేళ్ళు అపాయంలోనున్న జీవులుగా సంరక్షించబడుతున్నాయి. అయితే ఇటీవల, ఈ పెద్ద సరీసృపాలు ఒక క్రొత్త అపాయాన్ని ఎదుర్కొంటున్నాయని స్పష్టమయ్యింది. గాలపాగోస్ దీవుల్లోని ఇసబెలా దీవికి అవతల నిప్పంటుకుని ఒక నెల వరకు రగులుకుంది. సంరక్షక పనివారు దీవి యొక్క ప్రశస్తమైన జీవులైన 6,000 తాబేళ్ళను కాపాడేందుకు కందకాలను త్రవ్వారు, వాటిలో 400 తాబేళ్ళను ప్రత్యేక వన్యమృగ రక్షణప్రాంతంలోనికి తరలించారు. తాబేళ్ళను నిప్పునుండి రక్షించడానికి కాదు గాని ముఖ్యంగా ప్రజల బారి నుండి రక్షించడానికే ఈ రెండవ పద్ధతి చేపట్టబడింది. ది యునెస్కో కొరియర్ ప్రకారం, “తాబేళ్ళను వేటాడం చట్టవిరుద్ధమైనప్పటికీ, అది అక్కడ వాడుకగా ఉన్న వృత్తి అన్నదే స్పష్టమే. తాబేళ్ళ మాంసం, ముఖ్యంగా ఆడ తాబేళ్ళ మాంసం మరియు వాటి రక్తం ఎంతో రుచిగా ఉండడమే గాక, దానిలో రోగనివారణ సత్వాలు కూడా ఉన్నాయని పరిగణించబడుతుంది.” అతికాయులైన ఈ నలభైరెండింటిని మానవులు తినగా మిగిలిన అవశేషాలను సంరక్షకులు కనుగొన్నారు.
మాదక ద్రవ్యాల వ్యాపారం పెద్ద వ్యాపారం
“అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దొంగవ్యాపారం ప్రతి సంవత్సరం 40,000 కోట్ల అమెరికా డాలర్లను గడిస్తూ, ఆసియాలోని రాజకీయ విధానాన్ని తలిక్రిందులు చేస్తూ, ప్రపంచంలో ఆయుధాల వ్యాపారం తరువాత లాభాలను గడించే రెండవ పెద్ద వ్యాపారంగా మారింది” అని ఆస్ట్రేలియా వార్తాపత్రికయైన ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ చెబుతుంది. ఇంత మొత్తం డబ్బు “దాదాపు ప్రతి ఒక్కరిని పాడుచేసే శక్తిగలది” అని ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్ చెబుతున్నారు. ప్రపంచంలోని 80 కంటే ఎక్కువ శాతం హెరోయిన్ మ్యాన్‌మార్, థాయిలాండ్, లావోస్‌ల సరిహద్దులకు సమీపాన ఉన్న గోల్డన్ ట్రయాంగిల్‌లోను, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్‌ల గోల్డన్ క్రెసెంట్ ఉత్పత్తి చేయబడుతున్నందువల్లే ఆసియా ప్రసిద్ధికెక్కింది. “మాదక ద్రవ్యాలు ఉగ్రవాదానికి ముఖ్య ఆర్థిక మద్దతుగా మారాయి” అని ఇంటర్‌పోల్స్ చీఫ్ డ్రగ్ ఆఫీసర్ చెప్పాడు.
వనితలను వేధించడం
“భర్తలు లేదా కలిసి జీవిస్తున్న పురుషులు స్త్రీలపై దాడి చేయడం ప్రపంచంలోని అతి సాధారణంగా కనిపించే హింస” అని ఐక్యరాజ్యసమితి నివేదికను గూర్చిన ఒక శీర్షికలో ది ఆస్ట్రేలియన్ అనే వార్తాపత్రిక చెబుతుంది. “ప్రపంచంలోని దాదాపు 25 శాతం మంది స్త్రీలపై హింసాత్మకంగా దాడి చేయబడింది” అని ఆ శీర్షిక వివరిస్తుంది. కొరియా రిపబ్లిక్, చిలి, థాయ్‌లాండ్, పాకిస్తాన్ మరియు పాపువా న్యూ గినియా వంటి కొన్ని దేశాల్లో ఈ రేటు ఇంకా ఎక్కువగా ఉంది. ఒక దేశంలో స్త్రీ జనాబాలోని దాదాపు 80 శాతం మందిపై అత్యాచారం చేయబడిందని ఐక్యరాజ్యసమితి యొక్క అదే నివేదికను గూర్చిన చర్చలో ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనే వార్తాపత్రిక ప్రకారం తెలియజేసింది. అనేకమంది బాధితులు ఎడతెగని భావోద్రేక హింసను కూడా సహిస్తున్నారు. ఇంట్లో జరిగే హింసను నిర్మూలం చేయడం చాలా కష్టం ఎందుకంటే, చాలావరకు అది ఎల్లప్పుడూ ఇంట్లోనే రహస్యంగా జరుగుతుంది. తరచూ స్నేహితులు, పొరుగువారు మరియు బంధువులు దానిని తెలియజేయడానికి వెనుకంజవేస్తారు.
“భూగోళవ్యాప్తమైన అత్యావశ్యకత”
భయపెట్టే విధంగా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ఎయిడ్స్ వ్యాధి అధికమౌతున్న దృష్ట్యా, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బూట్రస్ బూట్రస్-గాలి 42 దేశాల మరియు 5 మహాద్వీపాల అధ్యక్షులను మరియు ఆరోగ్యశాఖా మంత్రులను, “భూగోళ వ్యాప్త అత్యావశ్యకతా దశను ప్రకటించాలి” అని ఏడవ సాంవత్సరిక ప్రపంచ ఎయిడ్స్ దినం పారిస్‌లో జరుపుకొనబడుతుండగా ఎయిడ్స్‌ను గూర్చిన సమావేశంలో కోరాడు. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ రోగాలు అధికం కాకుండా నివారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, జూలై 1993 మరియు జూలై 1994 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల సంఖ్య 40 లక్షలకు చేరుకుంటూ, ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి కేసుల మొత్తం 60 శాతంగా పెరిగింది. నిష్ఠూరమైన ఆ నివేదికలో, ప్రస్తుత పెరుగుదల రేటులో ఎయిడ్స్ వ్యాధి నిజంగా “సమాజాలన్నింటి భవిష్యత్తును అపాయంలో పడవేస్తున్నాయి” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది మరియు అతి త్వరగా 2,000 సంవత్సరం నాటికి మూడు కోట్ల నుండి నాలుగు కోట్ల మంది వ్యక్తులకు ప్రాణాంతకమైన ఎయిడ్స్‌కు కారణమయ్యే హెచ్‌ఐవి వైరస్ సోకుతుందని కూడా ప్రవచించింది.
నాలుగు చక్రాల వాహనాన్ని నడపడం సురక్షితమైనదేనా?
ఎప్పుడైనా సరే, ముఖ్యంగా హిమంలోను, మంచులోను నాలుగు చక్రాల వాహనాన్ని నడపడం చాలా సురక్షితమని అనేకులు నమ్ముతారు. అయితే, “నాలుగు చక్రాల వాహనాలు ఆపే విషయానికి వచ్చేసరికి, రెండు చక్రాల వాహనాల కన్నా ప్రయోజనకరమైనవేమీ కావు” అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పత్రిక తెలియజేస్తుంది. ఇన్సూరెన్స్ అధికారుల అభిప్రాయం ప్రకారం, పేరుగాంచిన కొన్ని రకాల వాహనాలు నిజానికి “సగటు నష్టం వల్ల, ఢీకొనడం వల్ల చేసే క్లెయిమ్‌లకన్నా విపరీతంగా” నష్టాలను చేకూర్చుతాయి. రుజువుల ప్రకారం, అనేకమంది డ్రైవర్లు నాలుగు చక్రాల వాహనాన్ని నడిపేటప్పుడు అమిత ఆత్మ విశ్వాసం గలవారై, అనవసరంగా ప్రమాదాలను కొనితెచ్చుకుంటారన్నది స్పష్టం. మార్క్ షేన్ అనే లాస్‌ఏంజెల్స్‌లోని యు.సి.ఎల్.ఎ మెడికల్ సెంటర్‌లోని శాస్త్రజ్ఞుడు ఈ విధంగా పేర్కొన్నాడు, “సినిమాలు మరియు టి.వి ద్వారా ప్రజలు స్వాతంత్ర్యము మరియు స్వేచ్ఛా భావాలతో నాలుగు చక్రాల వాహనాలను ముడిపెడుతున్నారు.” చివరికి సురక్షితమైన డ్రైవింగ్‌కి చక్కని పాలసీ కాగల మంచి వివేచనను ఈ శక్తి మరియు అజేయ భావాలు ఆటంకపర్చగలవు.
గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని హెచ్చరించే క్రొత్త పరికరం
ఆస్ట్రేలియానందలి విక్టోరియాలోని శాస్త్రజ్ఞులు ఒక పరికరాన్ని కనుగొన్నారు, దాన్ని మెడ భాగంలోని ముఖ్య రక్త ధమనిపైనున్న చర్మం మీదుగా పెడితే, హృద్రోగాలు వచ్చే అపాయాన్ని అది సూచిస్తుంది. దానిని అరికట్టడానికి సర్జరీ చేయకుండానే, ప్రతి హృదయ స్పందన తరువాత రక్తప్రసరణ వేగాన్ని మరియు రక్త సమ్మర్దంలోని మార్పులను అది లెక్కిస్తుంది. “రోగియొక్క హృదయ నాడీవ్యవస్థయంతటి స్థితిస్థాపక స్థితిని” లెక్కించడానికి కంప్యూటర్‌ను ఉపయోగించవచ్చని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనే పత్రిక తెలియజేస్తుంది. ఒక వ్యక్తి యొక్క హృదయ నాడీ వ్యవస్థకు కలిగే ప్రమాదాన్ని నిర్ణయించే పాత పద్ధతులకన్నా ఈ పరికరం మరింత కచ్చితమైనదని వాగ్దానం చేయబడుతుంది. అమిత పరిమాణంలోని క్రొవ్వు, అమిత రక్తసమ్మర్దం అపాయానికి బలమైన సూచనలు కాగా, “ఈ కోవకు చెందినవారికెన్నడూ గుండెపోటు రానేలేదు” అని చెబుతూ, ఆ నివేదిక ఇలా కూడా చెప్పింది, “ఈ పరీక్షను ఉపయోగించడం వలన వారు క్రొవ్వును తగ్గించే ఖరీదైన మందులను వాడనవసరమూ లేదు లేదా కచ్చితమైన పథ్యము అవసరం లేదు.”
పెద్ద నగరంలో జీవితం
ఇంగ్లాండులోని లండన్ నగరం ఐరోపా ఖండమంతటిలోని అతి పెద్ద నగరమైనప్పటికి, ది ఇండిపెండెంట్ అనే వార్తాపత్రిక ప్రకారం, దానిలోని డెబ్బై లక్షల నివాసులు అందరూ అక్కడ జీవించడంలో సంతోషించడం లేదు. కాలుష్యం మరియు జనసమ్మర్దము వంటి చింతలతో పట్టణ జీవితం గత ఐదు సంవత్సరాలకన్నా విషమించిపోయిందని లండన్‌లో జరిగిన సర్వేలో ప్రతి ఏడుగురిలో ఆరుగురు నమ్ముతున్నారని తేలింది. వారు ఏ ప్రజలను నమ్ముతారని అడిగినప్పుడు, అంత నమ్మకం కలిగించని పోలీసులకన్నా, ఉపాధ్యాయుల కన్నా డాక్టర్లనే నమ్మవచ్చని 64 శాతం మంది అన్నారు. లండన్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో పనిచేస్తున్న వ్యాపారస్థులను నమ్మవచ్చని 2 శాతం మంది భావిస్తున్నారు. ఈ ప్రాంతం “నిజమైన ఆస్తిని సంపాదించకుండానే ఇతరుల ఖర్చుతో ధనవంతులయ్యే ప్రజలతో” నిండిపోయిందని దాదాపు 60 శాతం మంది నమ్ముతున్నారు.
“పండ్లను కూరగాయలను తినండి”
ఆహార సంపూరకాలుగా కెరోటెనాయిడ్స్‌ను భుజించాలని దశాబ్దాలుగా శాస్త్రజ్ఞులు సిఫారసు చేశారు. బెటా-కెరోటిన్ అనేది అందరికీ తెలిసిన కెరోటెనాయిడ్, అది గుండెనొప్పిని, గుండె పోటును, కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారించడానికి తోడ్పడుతుంది. అయినప్పటికీ, క్రొత్త అధ్యయనాలు బెటా-కెరోటిన్ వల్ల కలిగే అనేక ప్రయోజనాలను ప్రశ్నిస్తున్నాయి. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ఆహార శాస్త్రజ్ఞుడైన డా. పౌల్ లాచాన్స్ “ఒక్కో కెరోటెనాయిడ్ సంపూరకాన్ని తీసుకోకూడదని హెచ్చరించాడు.” “మనం ప్రకృతి నుండి కెరోటెనాయిడ్స్ మిశ్రమాన్ని పొందుతాము, మనం ఈ మిశ్రమాన్ని పొందడం ఎంత ముఖ్యమన్నది మనకిప్పటికీ తెలియదు” అని ఆయన వివరించాడు. “పండ్లలోని మరియు కూరగాయల్లోని సంరక్షక సత్వాలను గుర్తించేంతవరకు మనం వాటిని బిళ్ళలుగా గొట్టాల్లోకి ఎక్కించలేము” అని మరో పరిశోధకురాలైన డా. రెజీనా జీగ్లర్ సూచిస్తున్నారు. “‘పండ్లను కూరగాయలను తినండి’ అని అలవాటుగా తల్లులిచ్చిన సలహా వైపుకు అనేక మంది నిపుణులు తిరిగారు” అని టైమ్స్ చెబుతుంది.
హింసను ప్రేరేపించే ఆట బొమ్మలు
మంత్ర విద్యద్వారా కసరతు కళాయోధులుగా రూపాంతరం చెందే యౌవనారంభంలోని పిల్లల టి.వి కార్యక్రమం అమెరికాలోని పిల్లల్లో ఒక పిచ్చిగా మారింది. దూరదర్శిని పాత్రలు మైటీ మోర్ఫిన్ పవర్ రేంజర్స్‌గా పేరుగాంచారు. పవర్ రేంజర్స్ యొక్క హింసాత్మక క్రియలను అమితంగా అనుకరిస్తూ ఉండే చిన్న పిల్లల ప్రవర్తనను గురించి పాఠశాల అధికారులు చింతిస్తున్నారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించేదేమంటే, ఇటీవల అధ్యయనంలో 96 శాతం మంది “సర్వే చేయబడిన ఉపాధ్యాయులు మోర్ఫిన్‌ను అనుకరించిన క్రియలను చూశారని చెబుతున్నారు.” ఆ పిల్లల్లో కొందరి వయస్సు మూడేండ్లే. “చిన్న పిల్లలు అకస్మాత్తుగా వెర్రి ఆవేశంతో కయ్యానికి కాలు దువ్వే బాక్సర్‌లుగా మారుతారు” అని జర్నల్ చెబుతుంది. ఒక సంవత్సరంలో పవర్ రేంజర్ ఆటబొమ్మల అమ్మకాల ద్వారా నిరీక్షించబడుతున్న 30 కోట్ల డాలర్ల సంపాదనలో ఆ కార్యక్రమానికున్న ప్రజాదరణ ప్రతిబింబించబడింది.
విషపూరితమైన వాయువులు
అమెరికాలోని ఆరోగ్య నిపుణులు లెక్కలేనన్ని కార్బన్ మోనాక్సైడ్ (CO) విషపదార్థాలను గూర్చి చింతిస్తున్నారు. ఎమ్.ఎమ్.డబ్ల్యు.ఆర్ (మోర్బిడిటీ అండ్ మోరాలిటీ వీక్లీ రిపోర్టు) చెప్పేదేమంటే, “ఉద్దేశించని కార్బన్ మోనాక్సైడ్ విషపదార్థాల వల్ల ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 590 మరణాలు జరుగుతున్నాయి.” ఇందులో అనివార్యం కాని కార్బన్ మోనాక్సైడ్ విషపదార్థాల కేసులు లెక్కించబడలేదు. ఎందుకంటే ప్రాణాంతకమైన ఈ వాయువుకు రంగూ, వాసన, రుచీలేదు గనుక, దానిని కనిపెట్టడం చాలా కష్టం. ఈ వాయువు తలనొప్పికి, పైత్యానికి, నాడీ వ్యవస్థలో వైపరీత్యానికి, కోమాకు, మరణానికి దారితీస్తూ ప్రాణవాయువును కణాల్లోకి తీసుకువెళ్ళ గల రక్తం యొక్క శక్తిని బలహీనపరుస్తుంది. ఎమ్.ఎమ్.డబ్ల్యు.ఆర్ ప్రకారం “కార్బన్ మోనాక్సైడ్ అధికమయ్యేది ఇంట్లో ఏదైన దహన ప్రక్రియ వల్ల (ఉదాహరణకు, వేడి చేసుకోవడం, వంట చేసుకోవడం, లేదా వాహనం యొక్క మోటారును లేదా గ్యాస్ పవర్‌గల ఏదైనా పరికరాన్ని స్టార్టు చేయడం)—ముఖ్యంగా గాలి సరిగ్గా ప్రసరించనందువల్లనే కావచ్చు.”