పరిణామ సిద్ధాంత ఫలితాలు
పందొమ్మిదవ శతాబ్దారంభంలో, మతం మరియు విజ్ఞానశాస్త్రం శాంతియుతమైన స్నేహబంధాన్ని కలిగివుండేవి. ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్ ప్రచురించబడడానికి రెండు సంవత్సరాల ముందు, జీవలోకం “యోచనను, జ్ఞానాన్ని, గొప్పతనాన్ని” చూపిస్తుందని మరియు ప్రకృతి చరిత్ర లక్ష్యం “విశ్వసృష్టికర్త తలంపులను” విశ్లేషించడమేనని జీవశాస్త్రజ్ఞుడును, హార్వార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరునైన లూయిస్ అగాసిస్ వ్రాశారు.
అగాసిస్ అభిప్రాయం అసాధారణమైనదేమీ కాదు. అనేకమంది ప్రజలు విజ్ఞానశాస్త్రం మరియు మతమూ సామరస్యం గలవిగా దృష్టించారు. విజ్ఞానశాస్త్రం కనుగొన్నవి తరచూ మహోన్నత సృష్టికర్త ఉన్నాడనే దానికి రుజువులుగా దృష్టించబడేవి. అయితే మతానికి విజ్ఞానశాస్త్రానికి మధ్య సూక్ష్మమైన అగాధం ఏర్పడడం మొదలైంది.
శంకావాదం పెరుగనారంభించింది
చార్ల్స్ లెయిల్స్ యొక్క ప్రిన్సిపిల్స్ ఆఫ్ జియోలజీ మొదటి సంపుటి 1830లో విడుదలై, బైబిలులోని సృష్టి వివరణపై అనుమానాన్ని రేకెత్తించింది. అక్షరార్థంగా ఆరు రోజుల్లో సృష్టి జరిగి ఉండే సాధ్యత లేదని లెయిల్ వాదించాడు. “బైబిలు తప్పనే ఇప్పటికీ ఊహించలేని తలంపును ప్రపంచంలోని అందరినీ నమ్మించినందుకు లెయిల్స్ పుస్తకాలు ఎలా చూసినా కొన్ని విషయాల్లో ఎక్కువ బాధ్యత వహిస్తాయి” అని వైద్యుడైన ఫ్రెడ్ హోయిలె వ్రాశాడు.a
అలా శంకావాదానికి పునాది వేయబడింది. అనేకుల మనస్సుల్లో ఇక ఎన్నటికీ విజ్ఞానశాస్త్రం మరియు బైబిలు పొందుపరచబడలేవు. ఎంపిక చేయవలసి వచ్చినప్పుడు అనేకులు విజ్ఞానశాస్త్రాన్ని ఎన్నుకున్నారు. “బైబిలులోని పాత నిబంధన గ్రంథమందలి మొదటి అధ్యాయాలను లెయిల్ పుస్తకం అనుమానంలో ముంచేసింది, డార్విన్ పుస్తకం వాటి స్థానాన్ని వహించింది” అని ఫ్రెడ్ హోయిలే వ్రాశారు.
బైబిలును దేవుని వాక్యంగా అంగీకరించడానికి ఇష్టపడని వారికి తగ్గ సమయంలో ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్ వచ్చింది. మానవునికి విజ్ఞానశాస్త్రానికి మధ్య అప్పటికే ప్రేమాయణం మొదలైంది. విజ్ఞానశాస్త్ర వ్యామోహంలో పడిన ప్రజలు దాని వాగ్దానాలు మరియు విజయాల చేత వశీకరించబడ్డారు. ప్రేమాభ్యర్థన చేస్తున్న రసికునివలె, విజ్ఞానశాస్త్రం దూరదర్శిని, సూక్ష్మదర్శిని, ఆవిరి యంత్రం, తరువాత విద్యుత్తు, టెలిఫోను, వాహనాలు వంటి క్రొత్త కానుకల వర్షాన్ని మానవునిపై కురిపించింది. అప్పటికే సాంకేతిక విద్య పారిశ్రామిక విప్లవాన్ని పోషించింది, అది సామాన్య మానవునికి అపూర్వమైన వస్తుసంబంధమైన లాభాలను చేకూర్చింది.
దానికి భిన్నంగా, మతం అభివృద్ధికి ఆటంకంగా దృష్టించబడింది. విజ్ఞానశాస్త్రం యొక్క సత్వర మార్పులతో సర్దుకుపోలేని విధంగా అది ప్రజలను మత్తులో ముంచేసిందని కొందరు భావించారు. నాస్తికులు తమ అభిప్రాయాలను బిగ్గరగా, ధైర్యంగా ప్రకటించడం మొదలెట్టారు. నిజానికి, రిచార్డ్ డాకెన్స్ వ్రాసినట్లు, “జ్ఞానంతో తృప్తిపొందిన నాస్తికునిగా ఉండడాన్ని డార్విన్ సాధ్యం చేశాడు.” రక్షణ కొరకు మానవుని క్రొత్త నిరీక్షణగా విజ్ఞానశాస్త్రం మారుతూ వచ్చింది.
మొదట, మతనాయకులు పరిణామ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. అయితే దశాబ్దాలు గడిచిపోగా, మొత్తం మీద క్రైస్తవ మతనాయకులు పరిణామం మరియు సృష్టి కలయికను అంగీకరిస్తూ ప్రజాభిప్రాయానికి లొంగిపోయారు. మరి 1938 న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రికలోని వార్తాశీర్షిక ఈ విధంగా ప్రకటించింది: “ఇంగ్లాండు చర్చి నివేదిక సృష్టిని గూర్చిన పరిణామవాదాన్ని సమర్థిస్తుంది.” న్యూయార్క్ ప్రధాన గురువు క్రింద ఉండే ఒక కమీషన్ చేసిన నివేదిక ఈ విధంగా చెప్పింది: “ఆదికాండము 1, 2 అధ్యాయాల్లోనుండి తీయబడిన సృష్టి వివరణల నుండి పరిణామ సిద్ధాంతానికి ఏ అభ్యంతరం తేబడ లేదు. ఎందుకంటే, ఇవి పౌరాణిక కథలనుండి తీసుకొనబడ్డాయి, అవి మనకు చరిత్రాత్మక విలువను కాదుగాని, ప్రతీకాత్మక భావాన్నే కలిగి ఉన్నాయి అని విద్యావంతులైన క్రైస్తవుల మధ్య సాధారణంగా అంగీకరించబడింది.” ప్రధానగురువు కమీషన్ ఈ విధంగా చెబుతూ ముగించింది: “మీకిష్టమైన విధంగా మీరు భావించండి, అయినప్పటికీ క్రైస్తవులుగా కొనసాగండి.”
అనేకుల దృష్టిలో, బైబిలును పరిణామంతో పొందుపరచే ప్రయత్నాలు బైబిలు యొక్క విశ్వసనీయతను తగ్గించడమే చేసింది. దాని ఫలితంగా బైబిలును గూర్చిన అనుమానం సర్వవ్యాప్తమై, ఇప్పటికీ అలాగే ఉంది, కొందరు మత నాయకులకు కూడా ఉంది. బైబిలు విజ్ఞానశాస్త్ర యుగానికి ముందు వ్రాయబడినది, కాబట్టి అది ప్రతికూల అభిప్రాయాన్ని, అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పిన కెనడాలోని పరిపాలక గురువు వ్యాఖ్యానాలు ఒక ఉదాహరణ. యేసు జననం మరియు పునరుత్థానాలను గూర్చి, బైబిలులో “చరిత్రాత్మక తప్పులు” మరియు “వట్టి అతిశయోక్తులు” ఉన్నాయి అని ఆయన చెప్పాడు.
కాబట్టి మతగురువులతో సహా అనేకులు వెంటనే బైబిలు మీద అపనమ్మకం కలిగించడానికి వేగిరపడ్డారు. అయితే ఆ శంకావాదం ఎక్కడికి నడిపింది? దానికి బదులు ఏ నిరీక్షణ ఇవ్వబడింది? బైబిలులో నమ్మకం సన్నగిల్లడంతో, కొందరు తత్త్వశాస్త్రం వైపుకు మరియు రాజకీయాల వైపుకు చూశారు.
తత్త్వశాస్త్రంపై మరియు రాజకీయాలపై ప్రభావం
ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్ మానవ ప్రవర్తనను గూర్చిన ఒక సరిక్రొత్త దృక్కోణాన్ని అందించింది. ఏ కారణాన ఒక దేశం మరో దేశాన్ని జయించగలగడంలో సఫలమౌతుంది? ఒక జాతి మరో జాతిపై ఎందుకు అధికారం చెలాయిస్తుంది? ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్ అనే పుస్తకం ప్రకృతి వరణం మరియు యోగ్యతమముల సార్థకజీవనం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తూ 19వ శతాబ్దంలోని ప్రముఖ తత్త్వజ్ఞానులను చైతన్యవంతులను చేసిన వివరణలను ఇచ్చింది.
ఫ్రెడ్రిక్ నెచె (1844-1900) మరియు కార్ల్ మార్క్స్ (1818-1883) అనే తత్త్వజ్ఞానులు రాజకీయాలపై గొప్ప ప్రభావాన్ని చూపారు. ఇద్దరూ పరిణామ సిద్ధాంత వ్యామోహంలో పడ్డారు. “డార్విన్ పుస్తకం ప్రాముఖ్యమైనది, చరిత్రలో సాంఘిక పోరాటానికి సహజ విజ్ఞానశాస్త్ర ఆధారంగా అది నాకు సహాయపడుతుంది” అని మార్క్స్ అన్నాడు. చరిత్రకారుడైన విల్ డ్యూరంట్ “డార్విన్ బిడ్డ” అని నెచెను పిలిచాడు. ఫిలోసఫీ—ఆన్ ఔట్‌లైన్ హిస్టరీ అనే పుస్తకం నిచె విశ్వాసాల్లో ఒకదానిని ఈ విధంగా సంగ్రహపరచింది: “బలవంతులు, ధైర్యవంతులు, అధికారాన్ని చూపేవారు, గర్విష్ఠులు భవిష్యత్తు సమాజానికి తగినవారై ఉంటారు.”
డార్విన్ నమ్మినది, తన స్నేహితునికి వ్రాశాడు—భవిష్యత్తులో “ప్రపంచమంతటా ఉన్న లెక్కలేనన్ని తక్కువ జాతులు ఉన్నతమైన నాగరికమైన జాతులచేత నిర్మూలం చేయబడతాయి.” మిగిలిన దేశాలపై ఐరోపా విజయాన్ని ఒక దృష్టాంతంగా ఉపయోగించి, దీన్ని “మనుగడ కొరకైన పోరాటము”నకు ఆపాదించాడు.
శక్తిమంతులైనవారు ఇలాంటి మాటలను స్వప్రయోజనాని కొరకు ఉపయోగించుకోడానికి వేగిరపడ్డారు. ది ఔట్ లైన్ ఆఫ్ హిస్టరీ అనే పుస్తకంలో హెచ్.జి. వెల్స్ ఈ విధంగా వ్రాశాడు: “తాము మనుగడ కొరకు పోరాడినందువల్లే బ్రతికి ఉన్నామని, ఆ పోరాటంలో బలమైన మరియు కుయుక్తిగలవారు బలహీనులైనవారిని తమను నమ్ముకునేవారిని ఓడిస్తారని పందొమ్మిదవ శతాబ్దాంతంలోని జీవించిన అధికారం గల ప్రజలు నమ్మేవారు. తాము బలవంతులును వీరులును నిర్దయులును ‘ఆచరణాత్మక బుద్ధిగలవారుగాను,’ అహంకార భావమును కలిగినవారుగాను ఉండాలని కూడా వారు నమ్మారు.”
ఆ విధంగా, తత్త్వశాస్త్ర, సాంఘిక మరియు రాజకీయ భావాల్లో “యోగ్యతమముల సార్థక జీవనము” అనే దాని అర్థం తరచూ అసంగతంగా తీసుకొనబడింది. “మరి కొందరి మాటకొస్తే, యుద్ధం ‘జీవుల మనుగడకు అత్యవసరం’” అయ్యింది అని మైల్‌స్టోన్స్ ఆఫ్ హిస్టరీ అనే పుస్తకం చెబుతుంది. తరువాతి శతాబ్దంలో “డార్విన్ తలంపులు జాతి ఆధిక్యత అనే హిట్లరు సిద్ధాంతానికి ముఖ్య భాగంగా మారింది” అని ఈ పుస్తకం చెబుతుంది.
నిజమే, డార్విన్‌గాని, మార్క్స్ గాని లేదా నిచె గాని తమ తలంపులు ఎలా అన్వర్తించబడతాయి, లేదా దుర్వినియోగం చేయబడుతాయి అని చూడడానికి జీవించి లేరు. నిజానికి, మనుగడ కొరకు పోరాడడం మానవుని జీవిత విధానాన్ని మెరుగుపరుస్తుందని వారు నిరీక్షించారు. ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్‌లో డార్విన్ ఈ విధంగా వ్రాశాడు, “శారీరక మరియు మానసిక సామర్థ్యాలు పరిపూర్ణతకు చేరుకోవడానికి సహాయపడతాయి.” దీనితో అంగీకరిస్తూ చివరికి, ‘మొత్తం మానవ జాతి యొక్క మనస్సులు పరిణమించడం’ జరుగుతుంది; ‘ప్రతిఒక్కరు ఒకే లక్ష్యం కొరకు కలిసి పనిచేస్తారు’ అనే సిద్ధాంతాన్ని ఇరవైయవ శతాబ్దంలోని మత గురువు మరియు జీవశాస్త్రజ్ఞుడునైన ప్యెర్ టెయర్ డి చార్డిన్ ప్రతిపాదించాడు.
దిగజారిపోవడమే, అభివృద్ధి కాదు
అలాంటి అభివృద్ధి జరిగినట్లు మీకనిపించిందా? క్లింగింగ్ టు ఎ మిత్ అనే పుస్తకం డి చార్డిన్ యొక్క ఆశావాదంపై ఇలా వ్యాఖ్యానించాడు: “మానవ రక్తసిక్తమైన చరిత్రను గూర్చి మరియు దక్షిణ ఆఫ్రికాలోని జాతి విచక్షణ వంటి జాతి విధానాలను పూర్తిగా మరిచిపోయి ఉండవచ్చు. ఆయన ఈ లోకంలో జీవించనివాడిలా కనిపిస్తున్నాడు.” ఐక్యతలోనికి వచ్చే బదులు, ఈ శతాబ్దంలోని మానవజాతి అసాధారణమైన వర్గీయ మరియు జాతీయ విభేదాలను అనుభవించింది.
మానవుడు పరిపూర్ణతకు ఎదుగుతాడు, లేదా అభివృద్ధినైనా సాధిస్తాడు అని ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్‌లో ఇవ్వబడిన నిరీక్షణ నెరవేరనే లేదు. ఆ నిరీక్షణ కాలంతోపాటు గతించిపోతోంది, ఎందుకంటే పరిణామాన్ని అంగీకరించినప్పటి నుండి మానవ కుటుంబం తరచూ అనాగరికతలోనికి దిగజారిపోయింది. ఆలోచించండి: పది కోట్లకన్నా ఎక్కువ మంది ప్రజలు ఈ శతాబ్దంలో జరిగిన యుద్ధాల్లో మరణించారు, దాదాపు ఐదు కోట్ల మంది రెండవ ప్రపంచ యుద్ధంలోనే చనిపోయారు. రువాండా మరియు మునుపటి యుగోస్లావియా వంటి ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వర్గీయ ఊచకోతను కూడా పరిగణించండి.
దానర్థం గత శతాబ్దాల్లో యుద్ధాలు మరియు క్రూరకృత్యాలు జరుగనే లేదనా? కాదు, నిశ్చయంగా జరిగాయి. అయితే పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించడం, మనుగడ కొరకు క్రూరమైన పోరాటం కావాలన్న మానసిక వైఖరి, యోగ్యతమముల సార్థక జీవనము అనే ఈ తలంపు మానవుని జీవిత విధానాన్ని మెరుగుపర్చడానికి సహాయపడలేదు. అయితే, మానవుని సమస్యలకన్నిటికీ పరిణామ సిద్ధాంతాన్ని నిందించలేకపోయినప్పటికీ, అది మానవ కుటుంబాన్ని మరింత ద్వేషంలోనికి, నేరాల్లోకి, హింసలోనికి, అనైతికతలోనికి, పతనానికి త్రోసివేసింది. మానవులు జంతువుల నుండి వచ్చారని సర్వవ్యాప్తంగా అంగీకరించబడినందువల్ల, అనేకానేకమంది ప్రజలు మృగాల్లాగే ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు.
[అధస్సూచీలు]
a నిజానికి, అక్షరాల ఆరు రోజుల్లో (144 గంటల్లో) భూమి సృష్టించబడిందని బైబిలు బోధించడం లేదు. ఈ అపార్థాన్ని గూర్చిన అదనపు సమాచారం కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ఇన్‌కార్పొరేటెడ్ ప్రచురించిన “జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తకం 25-37 పేజీలు చూడండి.
[7వ పేజీలోని చిత్రం]
‘డార్విన్ పుస్తకం చరిత్రలో సాంఘిక పోరాటానికి విజ్ఞాన శాస్త్ర ఆధారంగా నాకు సహాయం చేసింది.’—కార్ల్ మార్క్స్
[6వ పేజీలోని చిత్రం]
‘తక్కువ జాతులు ఉన్నత నాగరిక జాతుల చేత రూపుమాపబడుతాయి.’—చార్ల్స్ డార్విన్
[Picture Credit Line on page 6]
U.S. National Archives photo
[Picture Credit Line on page 6]
Copyright British Museum