లోకాన్ని కుదిపివేస్తున్న పుస్తకం
పుస్తకం: ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్. “బైబిలు తరువాత మరే రచన ఇంతగా ప్రభావితం చేయలేదు” అని మానవ శాస్త్రజ్ఞుడైన ఆష్లీ మాంటాగూ అన్నాడు.
రచయిత: “ఇంగ్లాండులోని అతి ప్రమాదకరమైన వ్యక్తి” అని ఆ కాలంలో కొందరి చేత పిలువబడిన చార్ల్స్ డార్విన్.
విషయం: పరిణామ సిద్ధాంతం. “ప్రకృతి వరణం,” “యోగ్యతమముల సార్థక జీవనము” మరియు “పరిణామము” వంటి అనేక పదాలు మరియు పదబంధాలు నేడు బాగా వాడుకలో ఉన్నాయి. అయితే ఈ సిద్ధాంతం మీ భాషనే కాకుండా మరి ఎక్కువగా ప్రభావితం చేసిందా?
ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్ (జాతుల ఉత్పత్తి) అనే పుస్తకాన్ని చార్ల్స్ డార్విన్ 1859లో విడుదల చేసినప్పుడు ఆయన విజ్ఞాన శాస్త్ర మరియు మత పరిధుల్లో తీవ్రమైన వివాదాన్ని రేకెత్తించాడు.a ఆ వివాదం ఆర్థిక మరియు సాంఘిక రంగాలను కూడా ప్రభావితం చేసి, నేటికీ అంటే, 136 సంవత్సరాల తరువాత కూడా కొనసాగుతుంది.
డార్విన్ వ్రాసిన ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్ గురించి, ఎ స్టోరీ ఔట్లైన్ ఆఫ్ ఎవల్యూషన్లో సి. డబ్ల్యూ. గ్రిమ్స్ ఈ విధంగా చెబుతున్నారు: “ముద్రించబడిన మరే పుస్తకం కూడా ఆలోచించే ప్రజల్లో ఇంత వివాదాన్ని లేవదీయలేదు. మానవ చరిత్రలో పరిణామంలా మరే విషయం కూడా పారంపర్య విశ్వాసాలను సవాలు చేయలేదు, ప్రకృతి ప్రపంచాన్ని మార్చలేదు, మానవుని ఆలోచనా విధానాన్ని మలచి, మార్చి, అంతగా స్థిరపడలేదు.”
నిజమే, పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినది డార్విన్ కాదు; ఆ తలంపు పురాతన గ్రీసులోను ఉండేది. డార్విన్ కంటే ముందు జీవించిన 18వ శతాబ్దంలోని అనేకులు ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్ విస్తృతంగా అంగీకరించబడేందుకు మార్గాన్ని సుగమం చేశారు.
అయితే, పరిణామాన్ని గూర్చిన ఆధునిక తలంపుకు డార్విన్ పుస్తకమే ఆధారమైంది. పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రంలో విప్లవం కన్నా అధికమైన దానిని రేకెత్తించింది గనుక, అది లోకాన్ని కుదిపివేసింది, నిజంగా విభ్రాంతి కలిగించింది. అది తుపానువలె సమాజం యొక్క పునాదులను అంటే మతాన్ని, విజ్ఞానశాస్త్రాన్ని, రాజకీయాన్ని, ఆర్థిక పరిస్థితిని, సాంఘిక జీవనాన్ని, చరిత్రను మరియు భవిష్యత్తును గూర్చిన దృక్కోణాన్ని మార్చివేసింది.
ఇప్పటికి దాదాపు ఒక శతాబ్దం ముందునుండి ఈ సిద్ధాంతం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసింది? అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? దాని నుండి లభించిన వారసత్వమేమిటి? తరువాయి శీర్షికలు ఈ ప్రశ్నలను పరిశీలిస్తాయి.
[అధస్సూచీలు]
a డార్విన్ పుస్తకం యొక్క పూర్తి పేరు ఆన్ ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్ బై మీన్స్ ఆఫ్ నాచురల్ సెలక్షన్, ఆర్ ది ప్రివెషెన్ ఆఫ్ ఫేవర్డ్ రేసెస్ ఇన్ ది స్ట్రగ్గిల్ ఫర్ లైఫ్.