ఆమె అనేకుల జీవితాలను ప్రభావితం చేసింది
నవంబరు 19, 1994న కేథీ రోబర్సన్ 26 ఏండ్ల వయస్సులో ఆకస్మికంగా చనిపోయింది. ఆమె చనిపోయిన ఆ వారం వరకు క్రైస్తవ కూటాలకు మానక హాజరైంది. తొమ్మిదేండ్ల వయస్సు నుండి క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాన్ని గూర్చి సెప్టెంబరు 8, 1994 తేజరిల్లు!లో “జీవితం సులభతరం కానప్పుడు” అనే శీర్షికలో వ్రాయబడింది. ఆ శీర్షికను చదివిన తర్వాత, ప్రపంచ నలుమూలల నుండి అనేకులు ఉత్తరాలు వ్రాసి, కేథీ యొక్క ధైర్య సమేతమైన మాదిరి వారిని ఎలా ప్రభావితం చేసిందో వర్ణించారు.
యౌవనస్థులు దేవుని సేవించడానికి ప్రోత్సహించబడ్డారు
లవొదియ స్పెయిన్ నుండి ఈ విధంగా వ్రాసింది: “నాకు 16 ఏండ్లు, సహనాన్ని గూర్చిన కేథీ అనుభవాన్ని చదివినప్పుడు నేను ఏడ్చేశాను. చనిపోవడాన్ని గూర్చి నేను భయపడేదాన్ని, కాని ఆమె చెప్పినట్లు, ‘ఇప్పుడు మనం జీవిస్తున్నామా లేక మరణిస్తామా అన్నది కాదు గాని, మనకు నిత్య జీవాన్నివ్వగల యెహోవా దేవుని ఆశీర్వాదాన్ని పొందుతామా అన్నదే ప్రాముఖ్యమని’” నేను ఈ శీర్షిక ద్వారా గ్రహించాను.
జపాన్ నుండి మేరి ఈ విధంగా వ్రాసింది: “నాది దాదాపు కేథీ వయస్సే, అలాగే మేమిద్దరం ఒకే రోజు బాప్తిస్మం పొందినవారం గనుక, ఆమె అనుభవాన్ని చదివినప్పుడు ఒక సన్నిహిత స్నేహితురాలి నుండి వచ్చిన ప్రోత్సాహకరమైన లేఖను చదివినట్లు నాకనిపించింది. అనేకులు నిష్ఫలమైన వృత్తుల్లో కాక, జ్ఞానపూర్వకంగా యెహోవా సేవలో తమ ఆరోగ్యాన్ని ఉపయోగించుకొనేలా తన కథ పురికొల్పాలన్న ఆమె అపేక్ష, క్రమ పయినీరింగ్ [పూర్తి కాల సేవ] మొదలెట్టబోతున్న నన్ను ఉత్తేజపరచింది.”
ఇలాగే, యౌవనస్థులు తమ ఆరోగ్యాన్ని నిష్ఫలమైన వృత్తుల్లో కాక, యెహోవా సేవలో ఉపయోగించుకోవాలన్న కేథీ అపేక్ష “నాతో సహా వేల కొలది యౌవనస్థులను ప్రోత్సాహపరుస్తుందని” ఇటలీ నుండి నవోమీ వ్రాసింది. నవోమీ ఇంకా ఈ విధంగా వ్రాసింది: “ఆమెను కలిసేందుకు ఇవన్నీ గతించి పోయి క్రొత్త లోకం వచ్చేవరకు నేను వేచి ఉండలేను. నేను పాఠశాల విద్యాభ్యాసాన్ని ముగించిన వెంటనే పయినీరింగ్ మొదలుపెట్టబోతున్నాను.”
అమెరికానందలి ఫ్లోరిడా నుండి రాహెల్ ఈ విధంగా వ్రాసింది, “నాకు 18 ఏండ్లు, నేను కొంత కాలంగా క్రమ పయినీరింగ్ గురించి ఆలోచిస్తున్నాను. ‘జీవితం సులభతరం కానప్పుడు’ అనే శీర్షికను చదివినప్పుడు, నాలాంటి యౌవనస్థులు అలాంటి కష్టాలను భరిస్తున్నారని తెలుసుకోవడం నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. కేథీ చెప్పినట్లు, ‘నిష్ఫలమైన వృత్తుల్లో కాక, జ్ఞానపూర్వకంగా యెహోవా సేవలో’ నా ఆరోగ్యాన్ని ఉపయోగించుకునేందుకు ఆమె నన్ను పురికొల్పింది.”
మైక్రోనేషియాలోని చక్ దీవి నుండి కొందరు మిషనరీలు ఈ విధంగా వ్రాశారు: “ఇక్కడ మన పయినీర్లు చాలా పేదవారు. అయితే, రాబర్సన్ సహోదరి అనుభవం తమకున్న వాటిని ప్రశంసించడానికి వారికి సహాయపడింది. వారు పేదవారైనప్పటికీ, యెహోవాను పూర్తికాలం సేవించగలిగేలా తాము ఆరోగ్యమున్న శరీరాలతో ఆశీర్వాదించబడ్డారని వారు గుర్తించారు. వారికున్నవాటినిబట్టి కృతజ్ఞులై ఉండాలని, వారు తమ శక్తిని యెహోవా సేవలో ఉపయోగించాలనే మంచి జ్ఞాపిక అది.”
ఫ్రాన్సులో పయినీరు పాఠశాలకు హాజరౌతున్న 16 మంది విద్యార్థుల ఓ గుంపు కలువ పూవుల ఛాయా చిత్రాన్ని కేథీకి పంపుతూ ఇలా ప్రోత్సాహకరంగా వ్రాశారు: “మన సమయాన్ని మన గొప్ప సృష్టికర్త కొరకు ఉపయోగించాలన్న నీ ఉద్బోధను మరువలేము.”
ఫ్రాన్సు నుండి మరొక యౌవనస్థుడు ఈ విధంగా వ్రాశాడు: “యౌవనులును, సాతాను లక్ష్యములైయున్న మనము యెహోవా ఎడల యథార్థతతో ఉండడం కష్టతరమని మనం కొన్నిసార్లు భావిస్తాము. అయితే మనం ఇంత చక్కని, పురికొల్పే కథలను చదివి, కేథీ వంటి ఇతర యౌవనస్థులు కష్టాల్లోను తమ యథార్థతను కాపాడుకుంటున్నారని తెలుసుకున్నప్పుడు మనం సరిక్రొత్త బలాన్ని, ఉత్సాహాన్ని పొందుతాము. ఇదెంత చక్కని మాదిరి!”
అమెరికాలోని ఓహియో నుండి నెడెన్ ఈ విధంగా వ్రాసింది: “నాది దాదాపు నీ వయస్సే, మంచి ఆరోగ్యం కూడా ఉంది. నేను చాలా సార్లు చిన్న విషయాలు యెహోవా సేవలో జోక్యం కలిగించుకోవడానికి అనుమతించాను. నీ కథను చదవడం, నేను ఎంత అమూల్యమైన సమయాన్ని వృథా చేశానో గుర్తించి, నేను నా జీవితాన్ని గూర్చి గంభీరంగా ఆలోచించేలా చేసింది. నువ్వు నన్ను పురికొల్పావు.”
బ్రెజిల్‌లోని ఒక యువతి ఈ విధంగా చెప్పింది: “ఆమె నేరుగా నా హృదయాన్ని తాకి, మన దేవున్ని పూర్తిగా సేవించాలన్న నా కోరికను మరింత అధికం చేసింది.”
ఒక కెనడా యౌవనస్థురాలు ఈ విధంగా వ్రాసింది: “నాకు 15 ఏండ్లు. నాకు ఆటోయిమ్యూన్ హెపటైటిస్ ఉందని రెండు సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను. నా ఆరోగ్యం బాగోలేనప్పటికి, ఇంకా సమయముండగా, నేను కూడా యెహోవాను నమ్మకంగా సేవించవచ్చని, పూర్తిగా కోలుకునేందుకు దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త విధానం కొరకు నేను ఓపికతో ఎదురు చూడాలని కేథీ రోబర్సన్ అనుభవం ద్వారా గుర్తించాను.”
“అమెరికానందలి, న్యూ జెర్సీ నుండి జానెట్ ఈ విధంగా వ్రాసింది: “కష్టాలను అధిగమించిన ఆమె అనుభవాలు మరియు ఆమె చూపిన విశ్వాసం మనకే కష్టాలున్నా యెహోవా సేవలో మరింత చేయడంలో కొనసాగే ప్రయత్నంలో ఏకాగ్రతను నిలిపేందుకు మనకు సహాయపడతాయి. నా బైబిలు విద్యార్థుల్లోని కొందరు పాఠశాల చదువును పూర్తి చేసిన వెంటనే పయినీరు సేవను లక్ష్యంగా పెట్టుకోమని వారిని పురికొల్పేందుకు ఆమె అనుభవాన్ని ఉపయోగించాలని నేను అనుకుంటున్నాను.”
పెద్దవారు కూడా ప్రోత్సహించబడ్డారు
అమెరికానందలి, కాలిఫోర్నియా నుండి ఒక స్త్రీ ఈ విధంగా వ్రాసింది: “నువ్వు నిజంగా మన జీవితాల్లోని చిన్న విషయాలను ఒక ప్రక్కకు పెట్టి, జీవితాధారమైన ముఖ్య విషయమగు యెహోవాతో మనకు గల సంబంధం వైపుకు జీవితాన్ని మళ్ళించావు.” ఆమె ఇంకా ఇలా వ్రాసింది: “నా వయస్సు మళ్ళినప్పటికీ, నీ అనుభవాలు, నీ దృక్పథం నన్ను ఎంతగానో కదిల్చాయి, పురికొల్పాయి. నా జీవితంలో ముఖ్యమైనవాటిని పునఃసమీక్షించేందుకు అది నాకు సహాయపడింది.”
కాలిఫోర్నియా నుండి మరో ఉత్తరం ఈ విధంగా వచ్చింది: “నీవు అనుభవించిన శ్రమ అనేది నేను చదివి తెలుసుకున్న జర్మనీ లేదా మలావి లేదా మరే ప్రాంతంలోనైనా సహోదర సహోదరీలను అనుభవించినటువంటి పెద్ద శ్రమే. నాకు ఇప్పుడు 68 ఏండ్లు, కనుక నేను ఎన్నో అనుభవాలను కళ్ళారా చూశాను, విన్నాను, చదివాను. నీ కథ యౌవనస్థులకు మరియు వృద్ధులకు ఒకేలా ఆశీర్వాదకరంగా ఉంటుంది.”
అమెరికానందలి దక్షిణ కరోలినాలోని ఒక స్త్రీ ఇలా తనను పరిచయం చేసుకుంది: “నేను చిన్న పిల్లను కాను. నాకు దాదాపు 70 ఏండ్లు.” ఆమె ప్రశంసిస్తూ ఈ విధంగా వ్రాసింది: “నువ్వు మరొక యోబువి. యౌవనస్థులు, వృద్ధులు అందరూ నీ సహనాన్ని గమనిస్తారని నేను ఆశిస్తున్నాను.”
మరొక ఉత్తరం ఈ విధంగా ఉంది: “కేథీ విశ్వాసం, దృఢ నిశ్చయము నా హృదయాన్ని స్పృశించాయి. నాకు దాదాపు 57 ఏండ్లు, నేను పదవీ విరమణ తీసుకున్న తర్వాత యెహోవా సేవలో మరింత అధికంగా చేయాలన్నదే నా లక్ష్యాల్లో ఒకటై ఉండేది, కాని నాకు క్యాన్సర్ అని ఇటీవలే పరిశోధనల్లో తేలింది. నేను యౌవనస్థునిగా ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నేను యెహోవా కొరకు అధికంగా ఏమీ చేయలేక పోయానే అని ఎంతగా పశ్చాత్తాపపడుతున్నానో! ఆ ఆధిక్యతను ఎప్పుడు పెద్ద అనారోగ్యం వచ్చి తీసివేస్తుందో మనమెవ్వరమూ చెప్పలేము.”
ఒక క్రైస్తవ పెద్ద ఇలా వ్రాశాడు: “నా విశ్వాసాన్ని పరీక్షించే విధంగా, అనుకోని విధంగా జీవితం మలుపు తిరిగినప్పుడు చదువుకోవడానికిగాను, నేను ఈ అనుభవాన్ని నా ఫైలులో పెట్టుకోబోతున్నాను. ఈ విధానాంతం సమీపమౌతుండగా ప్రియమైన స్నేహితులు అనేక కష్టాలకు గురైనప్పుడు వారిని ప్రోత్సహించేందుకు నేను ఈ శీర్షికను కాపరి ఫైలులో కూడా పెట్టుకోబోతున్నాను.”
నిజానికి, మన ప్రపంచవ్యాప్త సహోదరత్వంలోని సభ్యుల విశ్వాస ధైర్యముల చేత మనం బలపరచబడుతున్నాము. (1 పేతురు 5:9) కేథీ చేసినట్లుగానే మనమందరం “మరణం ఇక ఉండదు” అనే బైబిలు వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నాము. (ప్రకటన 21:3, 4) “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు” అనే కాలం ఎంత గొప్పగా ఉంటుందో.—యెషయా 33:24.
[30వ పేజీలోని చిత్రం]
కేథీ రోబర్సన్