మా పాఠకుల నుండి
మద్దతునిచ్చే తలిదండ్రులు “తలిదండ్రులారా—మద్దతునిచ్చేవారిగా ఉండండి!” అనే (ఆగష్టు 8, 1994) (ఆంగ్లం) శీర్షికల పరంపరకై మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇటీవల, నా చిన్న కూతురి పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు తలిదండ్రుల గుంపుతో, తలిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య మంచి సంభాషణ అనే విషయాన్ని చర్చించారు. నేను ఈ పత్రికను ప్రధాన అధ్యాపకురాలికి ఇచ్చాను, ఆమె దానిని వెంటనే చదివింది. రెండు వారాల తర్వాత నా కూతురు పాఠశాల నెలసరి వార్తాలేఖను తీసుకువచ్చింది. సమాజమంతా సమాచారం నుండి ప్రయోజనం పొందగలిగేలా మంచి సంభాషణను గూర్చిన ఆ శీర్షికలోని ఒక భాగం మళ్ళీ ముద్రించబడింది.
డబ్ల్యు. బి., అమెరికా
వోల్ఫిన్స్ గండుచేప/తిమింగల సంకరజాతిని గూర్చిన “తిమింగిలమా? గండు చేపా?—కాదు అది వోల్ఫిన్!” (ఫిబ్రవరి 22, 1994 [ఆంగ్లం]), అనే శీర్షికను చదివి ఆనందించాను. మీరు దీనిని “దేవుడు తన సృష్టిని సృష్టించేందుకు ఉపయోగించిన అద్భుతమైన శక్తిని తిలకించడం” అని అన్నారు. నేను దీనిని ఒప్పుకోను, ఎందుకంటే వాటికున్న సాధారణ పరిసరంలో సంపర్కం జరిగే అవకాశం ఉండదు.
కె.జి., అమెరికా
అలాంటి సంపర్కం సర్వసాధారణమనిగాని, లేదా దానికి దేవుడు బాధ్యుడని గాని మేము చెప్పలేదు. అయితే, ఇలాంటి అద్భుతమైన ప్రాణి ఉనికిలో ఉన్నందుకు ఆ ఘనతను మానవునికివ్వలేము. “దేవుడు తన సృష్టాన్ని వైవిధ్యంగా సృష్టించేందుకు ఉపయోగించిన శక్తి” వల్లే సంకరజాతి ఉనికిలో ఉంది. మా శీర్షిక దేవునికి తగిన ఘనతనిచ్చింది.—ఎడిటర్.
ప్రపంచ పరిశీలన తేజరిల్లు! ఎంతో జాగ్రత్తగా సిద్ధం చేయబడుతున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను ముఖ్యంగా “ప్రపంచ పరిశీలన” అనే భాగాన్ని ప్రశంసిస్తున్నాను. అది విభిన్న విషయాలను క్లుప్తంగా చర్చిస్తున్నప్పటికీ, అందులోని సహాయకరమైన సలహా, ఆసక్తికరమైన విషయాలు మరియు అభిప్రాయాలు నా అనేక అలవాట్లను మార్చుకోవడానికి సహాయపడ్డాయి. “ప్రపంచ పరిశీలన” అనేది చదవడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది.
టి. సి. సి. బ్రెజిల్
ఎయిడ్స్ మూడు సంవత్సరాలుగా నేను పూర్తికాల సేవకునిగా సేవ చేశాను. అయితే, ఇప్పుడు నా వల్ల కాదు. నాకు ఎయిడ్స్ వ్యాధి ఉంది. “ఎయిడ్స్ ఉన్నవారికి సహాయం చేయుట” అనే శీర్షికలో ఈ క్లిష్టమైన విషయాన్ని బహిరంగంగా చర్చించినందుకు మీకు కృతజ్ఞతలు. (మార్చి 22, 1994) మీరు అందరికీ అవసరమైన దానిని మనస్సులో ఉంచుకుంటారని నేను తెలుసుకోగల్గాను. దుఃఖించేవారి యెడల సానుభూతిని చూపించాలని ప్రోత్సహించి, “సహేతుకమైన ముందు జాగ్రత్తల”పై శ్రద్ధనిలిపిన ఈ శీర్షిక భాగాలను అనేకులు గమనించనట్లు కనిపిస్తుంది. దూరంగా ఉండడానికి ఈ శీర్షిక లైసెన్సు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. నేనేమీ చేయలేను, మరింత రోగగ్రస్తుడనైనప్పుడు, నిజంగా సహదరుల ప్రేమ మరియు మద్దతు అవసరమైనప్పుడు ఏమి జరుగుతుందా అని వ్యాకులపడుతున్నాను. వైరస్ సోకుతుందేమోనని నన్ను దర్శించడానికి కొందరు నిరాకరిస్తారా?
ఎమ్. ఎన్. అమెరికా
మీ నిష్కపటమైన వ్యాఖ్యానాన్ని మేము ప్రశంసిస్తున్నాము. ఎయిడ్స్ బాధితులకు మద్దతునివ్వడాన్ని నిరుత్సాహపరచాలన్నది మా ఉద్దేశం కాదు. నిజానికి, మేము ఇలా చెప్పాము: “ప్రస్తుత ఏకాభిప్రాయం మీద ఆధారపడి, సాధారణ స్పర్శ వల్ల ఎయిడ్స్ సోకదు. . . . ఎయిడ్స్ ఉన్న ప్రజలు చుట్టూ ఉండడం వల్ల ఒకరు అనవసరంగా భయపడనవసరం లేదు.” ఇవ్వబడిన సలహాలు ఎయిడ్స్ బాధితులతో సహానుభూతితో వ్యవహరించేవారికి కొంతవరకు సురక్షితభావాన్ని ఇస్తాయి.—ఎడిటర్.