ప్రకృతి భాష్పాలు
అది అరుణోదయం, గాలి చల్లగా, నిలకడగా ఉంది. ప్రతి ఆకు మరియు గడ్డిపోచ నీటి బిందువులతో, అరుణ కిరణాలతో తళుక్కు తళుక్కుమంటోంది. పచ్చని వృక్షాదులు సూర్యునికి శుభవందనాలు చెబుతూ ఆనందబాష్పాలు రాల్చుతున్నాయా అన్నట్లు అనిపిస్తుంది. నీటిబిందువు కవులను, ఫొటోగ్రాఫర్‌లను ప్రేరేపించడంలో ఆశ్చర్యం లేదు.
అయినప్పటికీ, మంచు మానవ ఆత్మకు నవోత్తేజాన్ని కలిగించడం కన్నా ఎక్కువే చేస్తుంది. ఈ వాతావరణ దృశ్యం ధ్రువ ప్రాంతాల్లో తప్ప భూగ్రహమంతటా సాధారణమే, అది జీవాన్ని నిలబెట్టే తేమను కలిగివున్న కంబళి. వాతావరణం రాత్రిపూట నిశ్చిత పరిస్థితుల్లో చల్లబడేటప్పుడు, నీరు ఆవిరయ్యే ఉష్ణోగ్రతలో చేరుకునేలా యెహోవా దానిని సృష్టించాడు. ఈ ఉష్ణోగ్రతలో గాలి ఇక తన తేమను అంటిపెట్టుకోలేదు, చుట్టూ ఉన్న గాలికన్నా చల్లగా ఉండే ఉపరితలాల్లోకి అది దానిని వదులుతుంది. దప్పిగొన్న మొక్కలు తమ ఆకుల ద్వారా తమకున్న బరువంత నీటి బిందువులను త్రాగుతాయి. దానిలో ఎక్కువ శాతాన్ని నేలలో నిలువ ఉంచేందుకు వ్రేళ్ళద్వారా పంపిస్తాయి.
బైబిలు దేశాల్లో, వేసవి ఎక్కువ ఉన్నచోట, మొక్కలకు నీటి వనరులు నిజంగా ఈ మంచే. అలా బైబిలులో మంచు అనేది తరచూ పంటలు పండడంతోను, మంచు లేకపోవడం కరవుతోను ముడిపెట్టబడుతుంది.
మంచు అన్నప్పుడు మరింత వ్యక్తిగతమైన భావం కూడా ఉండగలదు. మోషే తన ఎడబాటు సమయంలోని పాటలో ఈ విధంగా వ్రాశాడు: “నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.” (ద్వితీయోపదేశకాండము 32:2) ఆయన మానవులందరిలోకి మిక్కిలి సాత్వికుడు గనుక, సహజంగానే ఆయన తన మాటల్లో కూడా మృదుత్వము, నెమ్మది కలిగి ఉన్నాడన్నది నిశ్చయమే. (సంఖ్యాకాండము 12:3) మంచు లేదా వాన చినుకుల వలె, ఆయన మాటలు హానికలిగించకుండా హృదయానికి చేరుకునేవి.
ఈ సారి మీరు అరుణోదయ మంచు యొక్క అంటే ప్రకృతి బాష్పాల అతీవ సౌందర్యాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపడి, మంచు యొక్క సృష్టికర్తకున్న సంభ్రమాశ్చర్యం కలిగించే జ్ఞానాన్ని గూర్చి తలంచవచ్చు.