మా పాఠకుల నుండి
ఆటబొమ్మలు “తల్లిదండ్రులూ—మీ పిల్లల ఆటబొమ్మలను జ్ఞానపూర్వకంగా ఎంపిక చేయండి” అనే చక్కని శీర్షికను చదవడం ముగించాను. (సెప్టెంబరు 8, 1994, ఆంగ్లం) తండ్రిగా, ఆ సమాచారాన్ని బాగా గుణగ్రహించాను. అయితే, ముందు జాగ్రత్తను గూర్చిన ఒక సలహాను నేను జత చేయాలనుకుంటున్నాను. తొట్టెలో లేక బకెట్టులో అతి తక్కువ ద్రవమున్నా, చిన్న పిల్లలు అందులో మునిగిపోయే సాధ్యత ఉందని బావి పాఠకులను హెచ్చరించండి.
ఇ. వి., అమెరికా
జ్ఞాపికను ప్రశంసిస్తున్నాము.—సంపాదకుడు
నా కుమారుడు కోరినది, నేను వద్దని చెప్పిన ఒక ఆటబొమ్మను గూర్చి నేను, వాడు మాట్లాడుకుంటున్నాము. చిన్నవాడు గనుక, నా వాదంతో ఏకీభవించడం వానికి కష్టంగా ఉంది. మేము మాట్లాడుకుంటుండగా వచ్చిన కవరును చింపి, అందులోని క్రొత్త తేజరిల్లు! పత్రికను మేము తీశాము. “మీ బిడ్డ ఆడుకుంటున్న ఆట బొమ్మ ఏదో మీకు తెలుసా?” అనే శీర్షికను చూసి మేమిద్దరం ఆశ్చర్యపోయాం. ఆ శీర్షికలు వాడ్ని ముగ్ధుడ్ని చేశాయి, నా వాదాన్ని వాడు అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు.
డబ్ల్యు. ఎఫ్., అమెరికా
ఈ శీర్షికలనుబట్టి మీకు కృతజ్ఞతలు. నాకు దాదాపు 13 ఏండ్ల వయస్సు, క్రీడా కార్యక్రమాలను, కళలను, హస్తకళలను మరియు పియానో వాయించడాన్ని ఇష్టపడతాను. నేను చిన్నగా ఉన్నప్పుడు, ఆటబొమ్మలను నా అంతట నేనే తయారు చేసుకునేవాడిని. వీడియో ఆటలకన్నా ఇలాంటివి చేయడమే నాకిష్టం, ఎందుకంటే ఏదో సాధించానన్న అనుభూతిని అవి కలిగిస్తాయి. ఈ పనులు ఎంత సరదాగా ఉంటాయో పిల్లలు అర్థం చేసుకోవడానికి ఈ శీర్షికలు వేరే పిల్లలకు సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను.
సి. ఎస్., అమెరికా
నీటిగుర్రం “అపాయము నుండి రక్షించిన నీటిగుర్రము!” (అక్టోబరు 8, 1994) ప్రచురించినందుకు కృతజ్ఞతలు. నీటిగుర్రం ఆ ఆఫ్రికా జింకను రక్షించిన విధాన్ని చదివినప్పుడు నా మనస్సు చలించిపోయింది. ఇప్పటి వరకూ నా దృష్టిలో నీటిగుర్రం అంటే నీటిలో పెద్ద శరీరంతో ఉండి లెక్కలేనన్ని తన పళ్ళను చూపించడానికి తన పెద్దనోరును తెరిచేదనే అభిప్రాయం ఉండేది. అలాంటి వన్య మృగాలను నేను ఇష్టపడతానని చెప్పి ఉండేదాన్ని కాను, కాని ఈ శీర్షిక నా అభిప్రాయాన్ని మార్చివేసింది.
వై. హెచ్., జపాన్
ఆలోచనా స్వాతంత్ర్యము తరచూ నా మనస్సు అదుపు లేకుండా అవాంఛనీయమైన తలంపులను గూర్చి ఆలోచిస్తూ ఉండేది. అందుకే “బైబిలు ఉద్దేశము: స్వతంత్రంగా ఆలోచించడాన్ని బైబిలు నిరుత్సాహపరుస్తుందా?” (జూన్ 8, 1994) అనే శీర్షికను నేను చదివినప్పుడు దిగ్భ్రమ చెందాను. ఒకరు ఇష్టపూర్వకంగా చెడు ప్రవర్తనను ఎంచుకుంటే యెహోవా దేవుడు దానిని పాపంగా దృష్టిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. నా మోసపూరితమైన తలంపులను చక్కదిద్దుకునేందుకు నాకు సూటిగా ఉపదేశమిచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు!
జె. పి., ఫిలిప్పైన్స్
ఒత్తిడి “బైబిలు ఉద్దేశము: ఒత్తిడిని ఎదుర్కోడానికి మీకేది సహాయపడగలదు?” (సెప్టెంబరు 8, 1994) అనే శీర్షికనుబట్టి మీకు చాలా కృతజ్ఞతలు. నేను క్రైస్తవునిగా పెరిగాను కాని, నా యౌవన తొలి ప్రాయంలో నేను సత్యాన్ని విడిచి పెట్టాను. ఇప్పటికి మూడు సంవత్సరాల క్రితం నేను తిరిగి వచ్చాను, కాని నేను ఒక అవిశ్వాసిని వివాహమాడాను. నేను చేసిన తప్పులను గూర్చి ఎడతెగక చింతిస్తూ ఉన్నాను. ఈ కారణం వల్లే నేను ఇంత ఒత్తిడికి గురౌతున్నానని నేను గ్రహించలేదు. గతాన్ని తవ్వుకోవడం మంచిది కాదని తెలుసుకోవడానికి మీరు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. ఇక నేను నా భవిష్యత్తు కొరకు పాటుపడాలి.
ఆర్. ఎల్., అమెరికా
‘అన్ని వయస్సుల్లోని ప్రజలు ఒత్తిడిని అనుభవిస్తున్నారని’ మీరు చెప్పారు. నాకు 21 ఏండ్లు, నేను తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నాను. కండరాల నొప్పి మరియు ఒత్తిడి మూలంగా వచ్చే పార్శ్వపునొప్పి వలన నేను ఎనిమిది నెలల్లోనే రెండు సార్లు ఆసుపత్రిపాలయ్యాను. నేను చాలా చిన్నవాడిని గనుక ఇలా నేను ఒత్తిడిని ఎదుర్కోలేనని ప్రతిసారి వైద్యులు చెప్పేవారు. అలా మీ శీర్షిక నాకు కొంత ఉపశమనాన్నిచ్చింది.
వి.పి., అమెరికా
భూగోళశాస్త్ర పాఠం నేను 11 ఏండ్ల అమ్మాయిని, “తేలుతున్న లేక్ టిటికాకా దీవులు” అనే శీర్షిక నాకు చాలా నచ్చింది. (జూన్ 22, 1994, ఆంగ్లం) భూగోళ శాస్త్ర తరగతిలో మా ఉపాధ్యాయురాలు లేక్ టిటికాకాలో ప్రజలు నివసించారా అని అడిగారు. నా తోటి విద్యార్థులందరూ లేదని చెప్పారు. తేజరిల్లు! చదివాను గనుక, నివసించారు అని నేను జవాబిచ్చాను. తనకు నేనో మంచి సాక్ష్యమిచ్చేందుకు నాకొక అవకాశాన్నిస్తూ నాకెలా తెలుసో చెప్పమని మా ఉపాధ్యాయురాలు నన్నడిగింది.
ఎస్. బి., ఇటలీ