అందరికీ పరిపూర్ణ ఆరోగ్యం
ప్రవర్తన, పరిసరం, ఆరోగ్య సంరక్షణల్లాగే, మన శరీర నిర్మాణం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలదు. ఆ నిర్మాణం పారంపర్యం వలన మరియు వ్యాధివలన ప్రభావితం చేయబడుతుంది, జన్యు సంబంధమైన మన లోపం కొంత కాలం తర్వాత ప్రత్యక్షం కావచ్చు.
“మీరు ఆరోగ్యంగా జీవిస్తారా, దీర్ఘకాలం జీవిస్తారా, అసలు జీవిస్తారా అనే వాటిని చాలా మట్టుకు మీరు జన్మించే సమయాన మీ చుట్టూ ఉన్న జీవావరణం నిర్ణయిస్తుంది.”
తలనొప్పి, బిగుసుకుపోయే కండరాలు, నరాల నిస్సత్తువ, నలిగిన ఎముకలు, గుండెపోట్లు, లేక మరితర రోగాలు మనకు ప్రతిరోజు గుర్తు చేసేదేమంటే, మన ఆరోగ్యాన్ని బలహీనమైన శరీరం మరియు మెదడు ప్రభావితం చేస్తాయి. అంతటా వ్యాపించి ఉన్న ఆరోగ్య సమస్యలకు మూల కారణాలేంటి?
మూలకారణం
సా.శ. మొదటి శతాబ్దంలో జీవించిన లూకా అనే పేరుగల ఒక వైద్యుడు యేసుక్రీస్తు గురించి వ్రాసిన ప్రేరేపిత జీవితకథలో ఈ ప్రశ్నకు ఈ విధంగా జవాబిస్తున్నాడు. లూకా ఈ విధంగా వ్రాస్తున్నాడు, ఒక రోజు పక్షవాతంగలవాడొకడు బాగు చేయబడతాడనే నిరీక్షణతో యేసు ముందుకు తేబడ్డాడు. యేసు పక్షవాతం గలవానితో ఈ విధంగా చెప్పాడు: ‘నీ పాపములు క్షమింపబడియున్నవి.’ తర్వాత, తనకు నిజంగా పాపములను క్షమించే అధికారం ఉందని చూపించడానికి యేసు ఆ మనిషిని ఈ విధంగా ఆజ్ఞాపించాడు: ‘నీవు లేచి నీ మంచమెత్తుకొని, నీ యింటికి వెళ్లుము.’ ఆ మనిషి లేచి వెళ్ళాడు! దాని ఫలితంగా, స్వస్థపరచబడడాన్ని చూసిన వారు ‘అందరును విస్మయమొంది, దేవుని మహిమపరచిరి.’—లుకా 5:17-26.
యేసు ఏ పాపమును సూచించాడు? మనమెందుకు రోగగ్రస్తులమవుతున్నామో, వృద్ధులమౌతున్నామో, చనిపోతున్నామో అర్థం చేసుకోవడానికి ఆ జవాబు మనకు తోడ్పడుతుంది. ‘ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినదని’ నిశ్చయముంది గనుక, మనం జవాబు కొరకు బైబిలువైపు చూడగలము. (2 తిమోతి 3:16; 2 పేతురు 1:21) మొదటి మానవుడైన ఆదాము పరిపూర్ణ ఆరోగ్యంతో సృష్టించబడ్డాడని అది మనకు చెబుతుంది. ఆయన తన సృష్టికర్తకు విధేయత చూపించినంత కాలం మంచి ఆరోగ్యాన్ని అనుభవించాడు.
అయినప్పటికి, ఆదాము దేవుని నియమాన్ని ఉల్లంఘించడాన్నే ఎన్నుకున్నాడు. అవిధేయునిగా ఉండడం ద్వారా మరియు ఉద్దేశపూర్వకంగా తన సృష్టికర్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా అతడు పాపం చేశాడు. దాని ఫలితంగా, అతడు అపరిపూర్ణుడై, వ్యాధిగ్రస్తుడై కొంత కాలం తర్వాత మరణించాడు. కాబట్టి, పాపమే ఆదాము రోగానికి, మరణానికి కారణము.
జన్యుశాస్త్ర నియమాల ప్రకారం కొన్ని వ్యాధులు తల్లిదండ్రులనుండి పిల్లలకు సంక్రమించినట్లే, అపరిపూర్ణత మరి దాని ఫలితమైన వ్యాధి ఆదాము నుండి అతని సంతతియైన మానవ జాతికి సంక్రమించాయి. కాబట్టి, వ్యాధులన్నీ ఆదాము యొక్క మొదటి పాపఫలితాలే. (ఆదికాండము 2:17; 3:1-19; రోమీయులు 5:12) తప్పించుకునే మార్గముందా?
తప్పించుకునే మార్గం
పాపం వలన అనగా ఆదాము దేవుని నియమానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంవలన పరిపూర్ణ ఆరోగ్యం కాస్తా అనారోగ్యంగా మారింది. పాపాన్ని తీసివేయడం ద్వారా మాత్రమే అనారోగ్యం, పరిపూర్ణ ఆరోగ్యంగా మారడం సాధ్యమవుతుంది. (రోమీయులు 5:18, 19) ఎలా? మరొక పరిపూర్ణ మానవుడు, ఆదాము పరిపూర్ణుడుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో, కచ్చితంగా అలాంటివాడే తన జీవాన్ని క్రయధనంగా ఇవ్వవలసి ఉన్నది. “ప్రాణమునకు ప్రాణము” అంటే జీవానికి జీవము అనేది దేవుని నియమము.—ద్వితీయోపదేశకాండము 19:21.
అయితే, ఆదాము యొక్క పాపభరితులైన సంతతివారెవ్వరు కూడా అలాంటి క్రయధనాన్ని ఇవ్వలేకపోయారు. కాబట్టి, యెహోవా తానే ప్రేమపూర్వకంగా తన కుమారుడైన యేసును “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా” అతని ప్రాణాన్నివ్వడానికి, తద్వారా “మనము ఆయన ద్వారా జీవించునట్లు,” మనకు ఆయనను దయచేశాడు.—మత్తయి 20:28; 1 యోహాను 4:9; కీర్తన 49:7.
యేసు భూమిమీద ఉన్నప్పుడు, “నీ పాపములు క్షమించబడినవని” పక్షవాతము గలవానితో చెప్పగా, స్వస్థత పొందిన ఆ వ్యక్తి ఇంటికి నడిచి వెళ్ళాడు, అలా, పాపములను తీసివేయడానికి తన తండ్రియైన యెహోవా తనకు అధికారమిచ్చాడని చూపించాడు. యేసుక్రీస్తు బధిరులను, అంధులను, సకల విధములైన వ్యాధిగ్రస్తులను తక్షణమే స్వస్థపరుస్తూ దేవుని నుండి పొందిన అధికారాన్ని ఉపయోగించాడు.
యేసు చేసిన ఈ అద్భుతమైన స్వస్థతలను గూర్చి బైబిలు ఈ విధంగా చెబుతుంది: ‘బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచిరి.’ (మత్తయి 15:30, 31) మరింత గమనించదగినదేమంటే, యేసు మృతులను కూడా సజీవులుగా చేయగలిగాడు. బైబిలు ఇటువంటి అనేక పునరుత్థానాలను గూర్చి చెబుతుంది.—లూకా 7:11-16; 8:49-56; యోహాను 11:14, 38-44.
యేసు అధికారానికి మించిన రోగాలు ఏమీ లేవని ఈ అద్భుతమైన స్వస్థతలు మనకు హామీ ఇస్తున్నాయి. దేవుడు తనకిచ్చిన ఈ అధికారాన్ని ఆయన మళ్ళీ ఉపయోగిస్తాడా? మనం ప్రయోజనం పొందగలమా?
పరిపూర్ణ ఆరోగ్యం నిశ్చయం
యేసు పరలోకమందు ఇప్పటికే దేవుని పరలోక ప్రభుత్వంలో రాజుగా ఏలుతున్నాడని బైబిలు ప్రవచనాలు చూపిస్తున్నాయి. ఇప్పుడున్న మానవ ప్రభుత్వాలన్నింటినీ తీసివేసి భూమియంతటా పరిపాలించమని దేవుడు ఆయనకు అధికారమిచ్చాడు. (కీర్తన 110:1, 2; దానియేలు 2:44) యేసు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన నెరవేరబోతుంది: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:10) ఆ పరలోక రాజ్య పరిపాలనక్రింద, ఈ భూమి ఎడలగల దేవుని చిత్తములోని ఒక భాగం, మానవ కుటుంబం కొరకు ఆరోగ్య పరిస్థితులను అద్భుతంగా మెరుగుపర్చడమై ఉంటుంది.
అప్పుడు, అక్షరార్థ భావంలోను, ఆత్మీయ భావంలోను, “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును. చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులు వేయును. మూగవాని నాలుక పాడును.” “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”—యెషయా 33:24; 35:5, 6.
దేవుని పరలోక ప్రభుత్వం క్రింద, పరిపూర్ణ ఆరోగ్యం అంటే మనం ఇప్పుడు మరణిస్తున్నట్లు అప్పుడు ప్రజలు మరణించవలసిన అవసరం ఉండదు. దేవుని వాక్యం ఈ విధంగా వాగ్దానం చేస్తుంది: ‘ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందును.’ “దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.” (యోహాను 3:16; రోమీయులు 6:23) అవును, ఎంతో కాలం క్రిందట ప్రేరేపిత కీర్తన ఈ విధంగా వాగ్దానం చేసింది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) యేసు భూమి మీద ఉన్నప్పుడు చేసినట్లే, అప్పుడు మృతులను పునరుత్థానం చేసి, పరిపూర్ణ ఆరోగ్యం నుండి ప్రయోజనం పొందడానికి ఆయన వారికి అవకాశమిస్తాడు. బైబిలు ఈ విధంగా వాగ్దానం చేస్తుంది: ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.’—అపొస్తలుల కార్యములు 24:15.
రాజ్యపాలన క్రింద అలా అనారోగ్యానికి కారణమైన ఆహార కొరత ఇక ఎన్నడూ ఉండని విధంగా భూమి తానే ఫలవంతంగా మారుతుంది. బైబిలు ప్రవచనము మనకు ఈ విధంగా చెబుతుంది: “ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు.” (యెహెజ్కేలు 34:27) “అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.” (కీర్తన 67:6) “దేశములో . . . . సస్య సమృద్ధి కలుగును.” (కీర్తన 72:16) “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పములవలె పూయును.”—యెషయా 35:1.
దేవుని నూతన లోకంలో ఉండే పరిస్థితిని క్లుప్తంగా చెబుతూ, బైబిల్లోని చివరి ప్రవచన పుస్తకం ఈ విధంగా ప్రకటిస్తుంది: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.”—ప్రకటన 21:4.
‘అది నమ్మశక్యం కాదు’ అని మీరంటారా? అయితే, దీనిని గూర్చి తలంచండి. ఆదాము పాపి కాకముందు, అతడు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండేవాడు. ఆ సమయంలో ఎవరైనా ఒకరు ఆదాముతో మాట్లాడి, ఒకరోజు భూమియంతా వేదనతోను వ్యాధులతోను వృద్ధులైన ప్రజలతోను నిండి ఉంటుందని చెప్పడానికి సాధ్యమైందని ఊహించండి. ఆదాముకు అది నమ్మనశక్యంగా ఉండేదని మీరు తలంచరా? అయినా నేడు అది నిజము.
దానికి భిన్నంగా, దేవుని రాజ్యం క్రింద పరిపూర్ణ ఆరోగ్యం అనేది నిజమౌతుంది. యెహోవా వాక్యం ఈ విధంగా హామీ ఇస్తుంది: “ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి.” (ప్రకటన 21:5) ‘దేవుడు అబద్ధమాడజాలడు’ గనుక ఏమి జరగబోతుందని దేవుడు చెబుతున్నాడో అది జరుగుతుంది.—హెబ్రీయులు 6:18.
రానైవున్న ఈ ఆశీర్వాదాలను అనుభవించడానికి నిశ్చయత కలిగి ఉండేందుకు మీరిప్పుడు ఏమి చేయగలరు? పరిపూర్ణ ఆరోగ్యానికి మరియు నిత్యజీవానికి మార్గమేమిటో యేసు తన తండ్రికి చేసిన ప్రార్థనలో స్పష్టం చేశాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.
మీ గృహంలో ఉచిత బైబిలు పఠన కార్యక్రమం కావాలని యెహోవాసాక్షులను అడగండి. దేవుని అద్భుతమైన వాగ్దానాలను గూర్చి ఎక్కువగా పఠించడానికి మీకు సహాయపడేందుకు వారు సంతోషిస్తారు. పరిపూర్ణ ఆరోగ్యానికి వెళ్ళే మార్గంలో ఇది మీ మొదటి మెట్టు!
[14వ పేజీలోని చిత్రం]
దేవుని నూతన లోకంలో, మానవులందరూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తారు