పరిపూర్ణమైన ఆరోగ్యం కేవలం ఒక స్వప్నమేనా?
మీరు ఎప్పుడైనా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారా లేక మీకు పెద్ద శస్త్రచికిత్స ఏదైనా జరిగిందా? అలాగైతే, ఇప్పుడు మీరు జీవితాన్ని మరింత ఎక్కువ విలువైనదిగా ఎంచుతారు. అయితే మీ భౌతిక పరిస్థితి ఏదైనప్పటికీ, పరిపూర్ణ ఆరోగ్యాన్ని కల్గివుండడం సాధ్యమని మీరు విశ్వసిస్తున్నారా? క్యాన్సర్ లేక హృద్రోగం వంటి క్షీణింపజేసే అనారోగ్యాలు ఎంతో ఎక్కువగా ఉన్నందు వల్ల అది అసంభవమని మీకు అనిపించవచ్చు. వాస్తవానికి, మనలో అనేకులం అప్పుడప్పుడూ అనారోగ్యానికి గురౌతుంటాం. అయినప్పటికీ, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండగలమనేది ఒక స్వప్నం కాదు.
అనారోగ్యంతో, మరణంతో పోరాడేందుకు కాక, మానవుడు చక్కని ఆరోగ్యంతో జీవితాన్ని అనుభవించేందుకు సృష్టించబడ్డాడు. కాబట్టి, పాపాన్నీ మరణాన్నీ నిరర్థకం చేసేందుకు, పరిపూర్ణ ఆరోగ్యానికీ, నిత్యజీవితానికీ ఆధారంగా క్రీస్తు యేసు విమోచన క్రయధన బలిని యెహోవా ఏర్పాటు చేశాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త లోకంలో నిత్యమూ జీవించే వారు, అనారోగ్యాలతో వృద్ధాప్యంతో పోరాడరు. అలాంటి పరిస్థితి రానై ఉంటే, అనారోగ్యాలు ఏమౌతాయి?
అనారోగ్యం నుండి ఉపశమనం
యేసుక్రీస్తు రోగులను స్వస్థపర్చిన విధానం మనకు ఒక నమూనానుంచుతుంది. అటువంటి స్వస్థతలను గురించి ఇలా చెప్పబడింది: “గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయనవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.” (మత్తయి 11:3-5) అవును, యేసును సమీపించిన అంగవికలురందరూ “స్వస్థతనొందిరి.” (మత్తయి 14:36) దాని ఫలితంగా, “మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి.”—మత్తయి 15:31.
వాస్తవంగానే, నేడు ఎవరూ అలాంటి స్వస్థతలు చేకూర్చలేకపోయినప్పటికీ, దేవుని పరిపాలన క్రింద మానవజాతి మానసిక, భౌతిక రుగ్మతలన్నింటి నుండీ స్వస్థతపొందినదై పరిపూర్ణతకు తీసుకురాబడుతుందని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు. “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె”ను అన్న దేవుని వాగ్దానం ప్రకటన 21:3, 4 నందు వ్రాయబడి ఉంది.
ఎలాంటి మందుల కర్మాగారం గానీ లేక ఆసుపత్రులూ, సర్జరీలు లేక థెరపీల అవసరంగానీ లేని లోకాన్ని ఒక్కసారి ఊహించుకోండి! అంతే కాకుండా, పునరుద్ధరించబడిన పరదైసులో, కృంగుదలా మానసిక అనారోగ్యాలు గతించిన సంగతులై ఉంటాయి. జీవితం నిజంగానే ఆనందమయంగా ఉంటుంది; మరి అందులో ఆనందమనేది శాశ్వతంగా ఉంటుంది. వాస్తవానికి, దేవుని అనంతమైన శక్తి శరీర పునరుత్పత్తి ప్రక్రియలు చక్కగా పని చేసేలా చేస్తుంది, మరి విమోచన క్రయధన బలి ప్రయోజనాలు పాపం యొక్క బలహీనపరిచే ప్రభావాన్ని తీసివేస్తాయి. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”—యెషయా 33:24.
దేవుని రాజ్యం క్రింద పరిపూర్ణమైన భౌతిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అనుభవించడం అంటే, అదెంతటి మహత్తరమైన నిరీక్షణ ! మీరు సమతూకం గల ఆరోగ్యవంతమైన జీవిత విధానాన్ని ఇప్పుడు కలిగి ఉండగా, దేవుని క్రొత్త లోకం యొక్క దీవెనల కొరకు ఎదురు చూడండి. ‘పక్షిరాజు యౌవనమువలె మీ యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో మీ హృదయమును’ యెహోవా తృప్తిపరచును గాక!—కీర్తన 103:5.