టాన్‌జానియాలో ఓ రాత్రి కలయిక
కెన్యాలోని యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశం తర్వాత, మేము ఉత్సాహంగా టాన్‌జానియాలో మేమే స్వయంగా ఫోటోలు తీయడం మొదలు పెట్టాము.
లేక్ మాన్యారా నేషనల్ పార్క్ మా మొదటి మెట్ట. మేము విభిన్న వన్యప్రాణులను—నీలి వర్ణపు కోతులను, గోధుమవర్ణపు ఆఫ్రికా జింకలను, దక్షిణాఫ్రికా ఎనుబోతులను, జీబ్రాలను మరెన్నింటినో చూసి ఆశ్చర్యపోయాము. మీరు నీటి గుర్రాలున్న కొలనును తిలకిస్తున్నారని ఊహించండి. మరొక వైపు మేస్తున్న జిరాఫీని, కొంత దూరాన గడ్డిలోవున్న సింహాన్ని మరియు ఎద్దువంటి జింకల (న్యూ) గుంపును చూస్తున్నారు.
ఎంగారోంగోరొ బిలము దగ్గరికి చేరుకున్న తర్వాత, మేము పగలు అగ్నిపర్వత చరియ (పేలిపోయిన అగ్ని పర్వత బిలము) దగ్గరకు వెళ్ళడానికి ఒక గైడ్‌ను, నాలుగు చక్రాల వాహనాన్ని అద్దెకు తీసుకున్నాము. అక్కడి నుండి కుదుపుతూ ప్రయాణం చేస్తున్న బండి మమ్మల్ని 600 మీటర్ల దూరాన ఉన్న ఆ బిలానికి తీసుకువెళ్ళింది. ఎంత చక్కని దృశ్యము! ఆ విశాలమైన సమతలమంతటా వన్యప్రాణులతో నిండిపోయింది. వలసకోసమన్నట్లు ఎద్దువంటి జింకలు కదిలి వెళ్తున్నాయి. జీబ్రాలు, దుప్పులు, థామ్‌సన్స్ మరియు చిన్న జింకలు విస్తారంగా ఉన్నాయి. ఒక స్టాపులో తలనిండా రోమం ఉన్న ఒక సింహం మా వాహనం నీడలో పడుకుంది. మేము దానికి అతి చేరువలో ఉన్నామని అది గమనించనే లేదు. తర్వాత దూరంలోనున్న నల్లని ఖడ్గ మృగాలను, సమీపంలోనున్న చెట్టు ఆకులను తింటున్న అడవి ఏనుగులను చూడడానికి ఆగాము. మేము బిలమునకు తిరిగి వెళ్తుండగా ముగ్ధమనోహరమైన అనేక మృగాలను గుర్తు చేసుకున్నాము. మేము చూడనివి ఏమైనా ఉన్నాయా?
అవును, నిజమే ఆఫ్రికా చిరుతపులి. అడవిలో ఒక్కదానినైనా చూడడమంటే, దాదాపు అద్భుతమే. ఫొటోగ్రాఫర్ ఎర్విన్ బార్ ఏమని వ్రాశాడంటే: “కొందరు వినోద యాత్రికులు అమిత ఉత్సాహంతో, శ్రద్ధతో చిరుతపులులను వెంబడిస్తారు. ఎందుకంటే వాటిని కనుగొనడం చాలా కష్టం, వాటిని ఫోటో తీసే సంగతి ఇక చెప్పనక్కర లేదు. చాలా మంది ప్రయాణీకులు జంతుశాలల్లో ఇటువంటి ఒక్కదాన్ని కూడా ఎన్నడూ చూడలేదు. నేను చేసిన 15 ప్రయాణాల్లో మొత్తం ఎనిమిది చిరుతపులులను నేను చూశాను, ఒక్కటి మాత్రమే ఫోటో తీయగలిగేంత దగ్గరలో కనిపించింది.”—ఇంటర్‌నేషనల్ వైల్డ్‌లైఫ్.
రాత్రయ్యేసరికి మరొక సమస్య మా మనస్సుల్లో మెదిలింది. లాడ్జ్‌లోని రిజర్వేషన్లు క్యాన్సల్ అయిపోయాయి, కాబట్టి మేము వసతుల కొరకు వెతుక్కోవలసి ఉంది. కాబట్టి మేము కటిక చీకటిలో మట్టి రోడ్డు గుండా వెళ్ళాము. అకస్మాత్తుగా ముందు సీటులో కూర్చున్న మా ఇద్దరి గుండెలు జల్లుమన్నాయి. మా బండి హెడ్‌లైట్ల ముందు గోధుమవర్ణంలో ఉన్నదేదో ఒకటి దూకింది. మేము వెంటనే బండిని ఆపేసి, ఆశ్చర్యంతో ఎగవూపిరి పీల్చుకున్నాం!
సరిగ్గా మా ముందు పెద్ద చిరుతపులి! వెనుక సీట్లలో కూర్చున్నవారు ఏదైనా అసౌకర్యంగా ఉన్నట్లు భావిస్తే, ఆ నిమిషంలోనే ఆ నిరాశ సమసిపోయింది. చిరుతపులి రోడ్డుకు కుడివైపుకు పరుగెత్తి, కదలకుండా ఉండిపోయింది. ఆ వెలుతురులో, అది మమ్మల్నందరినీ చూసి ‘ఏం చేయాలా?’ అని ఆలోచిస్తున్నట్లు కనిపించింది. ‘నేను లంఘించాలా, లేదా తెలియని “శత్రువు” నుండి వెనుదిరిగి, ఆ పొదలోకి పారిపోవడానికి ప్రయత్నించాలా?’
మా సహవాసుల్లో ఒకరైన ఆడ్రియన్, దూకడానికి సిద్ధంగానున్న బలమైన అందమైన ఈ చిరుతపులికి సమీపంగా, అంటే కేవలం ఒక మీటరు దూరంలో ఉన్నాడు. తన పూర్తి ఆటోమాటిక్ కెమెరాను తీసుకుంటూ “త్వరగా ఫ్లాష్ నాకిచ్చెయ్” అని నెమ్మదిగా అన్నాడు. “చప్పుడు చేయవద్దు” అని మెల్లగా హెచ్చరికలు వెనుక నుండి వినబడ్డాయి. కెమెరాను త్వరగా సిద్ధం చేసి, ఒక ఫోటో తీశాడు. కాని దాని ఫ్లాష్ వ్యాను లోపలే ఉండిపోయినందున, విఫలమయినట్లు అనిపించింది. ఫోటో తీయడానికి కెమెరా మళ్ళీ సిద్ధమయ్యేంతలో, కిటికీ అద్దాన్ని ఆడ్రియన్ నెమ్మదిగా దించాడు. ఆ చిరుతపులి బారెడు దూరంలోనే నిలబడి ఉంది, దాని తోక చివరి భాగం అప్రయత్నంగా కదిలింది, దాని కళ్ళు మెరిసిపోతున్నాయి.
మేము రెండవ ఫోటో తీసేసరికి, ఏం చేయాలో అది తీర్మానించుకుంది. అద్భుతమైన చిరుతపులి పొదలోనికి దూసుకు వెళ్ళి, కనుమరుగై పోయింది. మా వ్యాన్‌లో ఎంత ఉత్సాహంగా ఉందో! మరువలేని అనుభవం, ఇది ఎంతో అరుదు అని మాతో మా గైడ్ చెప్పాడు. ఆ రెండవ ఫోటో ఎంతో చక్కగా వచ్చినప్పుడు, దాన్ని చూసి మేము టాన్‌జానియాలోని ఆ ఉల్లాసకరమైన రాత్రి స్మృతులను మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకున్నాము.