మీ ఆరోగ్యాన్ని ఏది నిర్ణయిస్తుంది—మీరేమి చేయగలరు
శ్రమదాత బియ్యాన్ని లేదా పిండిని సంచిలో వేసినట్లు, ఆరోగ్యాన్ని ఇవ్వలేడు. అది సంచిలో లభ్యం కాదు ఎందుకంటే అది సరుకు కాదు కాని ఒక స్థితి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధంగా నిర్వచిస్తుంది, “ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, సామాజిక పరిపూర్ణ క్షేమముగల స్థితి.” అయితే ఆ క్షేమము యొక్క స్థాయిని ఏది నిర్ణయిస్తుంది?
ఒక సాధారణ ఇల్లు కలప పలకలతోను, చీలలతోను మరియు ఇనుప రేకులతోను నిర్మించబడి ఉండవచ్చు, కాని విభిన్న భాగాలు తరచూ నాలుగు మూలల నిలువు స్తంభాలపై ఆధారపడి ఉంటాయి. అలాగే, మన ఆరోగ్యం కూడా అనేక ప్రభావాలచేత నిర్ణయించబడుతుంది. కాని అవన్నీ నాలుగు “మూలల”తో ముడిపడి ఉంటాయి. అవి ఏవనగా (1) ప్రవర్తన, (2) పరిసరం, (3) వైద్య సంరక్షణ మరియు (4) శరీర నిర్మాణం. మీరు స్తంభాల నాణ్యతను పెంచి మీ ఇంటిని బలపరుచుకోగలిగినట్లే, ఈ ప్రభావం గల కారణాంశాలను మెరుగుపరచుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. ప్రశ్న ఏంటంటే, పరిమిత వనరులతో అలా ఎలా చేయగలరు?
మీ ప్రవర్తన మరియు మీ ఆరోగ్యం
నాలుగు కారణాంశాల్లో, మీ ప్రవర్తన ముఖ్యంగా మీ అదుపులో ఉండేదే. దాన్ని మెరుగుపరచుకోవడం మూలంగా అది మీకు సహాయపడగలదు. నిజమే, పేదరికం మీ ఆహారంలోను అలవాట్లలోను మీరు చేసుకోగల మార్పులను పరిమితం చేయగలదు, కాని లభ్యమయ్యే వాటిని ఉపయోగించుకోవడం ద్వారా, మీరు గొప్ప మార్పు చేసుకోగలరు. క్రింది ఉదాహరణను గమనించండి.
తల్లి తన బిడ్డకు తన పాలివ్వడమా లేదా సీసా పాలివ్వడమా అనే రెండు ప్రత్యామ్నాయాలు కలిగివుంది. ఐక్యరాజ్య సమితి బాలల నిధి చెప్పేదేమంటే, తల్లి పాలివ్వడం “శారీరకంగాను మరియు ఆర్థికంగాను శ్రేష్ఠమైన ఎంపిక.” నిపుణులు చెప్పేదేమంటే, బిడ్డకు “శ్రేష్ఠమైన ఆరోగ్యకరమగు ఆహారమైన,” తల్లిపాలు “సరియైన పెరుగుదలకు అవసరమైన కచ్చితమగు పరిమాణంలో ప్రొటీన్లను, క్రొవ్వును, లేక్టోజ్ను, విటమిన్లను, ఖనిజాలను మరియు కొద్దిపాటి రసాయనిక కారకాలను సమపాళ్ళలో” ఇస్తుంది. తల్లిపాలు రోగాన్ని ఎదిరించి పోరాడే ప్రొటీన్లను, ప్రతిరక్షకాలను తల్లి నుండి బిడ్డలోనికి రవాణా చేస్తూ, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని, బిడ్డకు సరైన ప్రారంభాన్ని అందిస్తుంది.
ముఖ్యంగా సరైన ఆరోగ్యరక్షణ సౌకర్యాలు లేని ఉష్ణమండల ప్రాంతాల్లో తల్లిపాలే శ్రేష్ఠం. సీసాపాలవలె, డబ్బు కూడబెట్టాలనే తపనతో తల్లిపాలు పలచన చేయబడవు, దాని తయారీలో పొరపాట్లు జరుగవు, అవి శుభ్రమైన చోటనుండి వస్తాయి. దానికి విరుద్ధంగా, “పేద సమాజంలో తల్లి పాలు మాత్రమే త్రాగే బిడ్డకన్నా సీసాపాలు త్రాగే బిడ్డ దాదాపు 15 రెట్లు అతిసార వ్యాధివలన, నాలుగు రెట్లు ఊపిరితిత్తుల వ్యాధి మూలంగా చనిపోయే అవకాశం ఉంది,” అని కెనడియన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ హెల్త్ నుండి వచ్చిన సినెర్జీ అనే వార్తాలేఖ చెబుతుంది.
ఆర్థిక లాభం కూడా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, పాల పొడి చాలా ఖరీదైనది. ఉదాహరణకు బ్రెజిల్లో బిడ్డకు సీసా పాలివ్వడానికి పేద కుటుంబం యొక్క నెలసరి ఆదాయంలోని ఐదవ వంతు ఖర్చు కావచ్చు. తల్లిపాలివ్వడం వలన ఆదాచేయగల డబ్బు తల్లితో సహా కుటుంబంలోని అందరికీ మంచి ఆహారం లభ్యం కాగలదు.
ఈ లాభాలన్నింటితో పాటు, పాలివ్వడం ఉల్లాసంగా ఉంటుందని మీరనుకోవచ్చు. అయితే, ఫిలిప్పియన్స్లోని హెల్త్ వర్కర్లు నివేదించేదేమంటే తల్లి పాలివ్వడం “భయంకరమైన రీతిగా అంతరించిపోయింది,” మరియు బ్రెజిల్‌లోని అధ్యయనం చూపించేదేమంటే శ్వాసకోశ వ్యాధుల వల్ల కలిగే పిల్లల మరణాలకు సంబంధించిన కొన్ని కారణాల్లో ఒకటి “తల్లి పాలివ్వకపోవడమే.” అయినప్పటికి, మీ శిశువు ఆ విధి నుండి తప్పించుకోగలదు. మీ ముందు ఎంపిక ఉంది.”
బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షించాలన్న తల్లి ప్రయత్నాలు తరచూ కుటుంబ సభ్యుల హానికరమైన ప్రవర్తన వల్ల నిష్ఫలమవుతున్నాయి. నేపాల్‌లోని ఒక తల్లిని ఉదాహరణగా తీసుకోండి. ఆమె ఒక తేమగల గదిలో తన భర్తతోను, మూడేండ్ల కూతురుతోను ఉంటుంది. ఆ చిన్న గది వంటసామానుతోను సిగరెట్టు పొగతోను నిండిపోయి ఉంటుందని పానోస్కోప్ పత్రిక వ్రాస్తుంది. బిడ్డ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతుంది. ఆ తల్లి ఇలా నిట్టూర్చుతుంది, “నా భర్త పొగ త్రాగడాన్ని ఆపలేను, నేను నా భర్తకోసం సిగరెట్టును, నా బిడ్డ కోసం మందును కొంటున్నాను.”
విచారకరంగా, ఎప్పటికన్నా అధికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అనేక మంది ప్రజలు కనీస ఆదాయాన్ని పొగత్రాగి వృథాచేయడంతో ఆమెకున్నటువంటి సందిగ్ధావస్థ మరింత సర్వసాధారణమౌతుంది. నిజానికి, ఐరోపాలోగాని లేదా అమెరికాలోగాని ఒకరు పొగ త్రాగడం ఆపివేస్తుంటే, లాటిన్ అమెరికాలోను లేదా ఆఫ్రికాలోను ఇద్దరు పొగ త్రాగడం మొదలు పెడుతున్నారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఎక్కువ నిందార్హమని రాకెన్వెల్బస్కౌడ్ అనే డచ్ పుస్తకం చెబుతుంది. “వార్సిటీ: మంచి ప్రశాంత భావనకు” మరియు “గోల్డ్ లీఫ్: ప్రముఖులైన వ్యక్తులకు చాలా ప్రాముఖ్యమైన సిగరెట్టులు,” అనేటటువంటి ప్రకటనలు, పొగ త్రాగడమనేది అభివృద్ధితోను మరియు సంపదతోను ముడిపడి ఉందని పేద ప్రజలను నమ్మిస్తుంది. అయితే వాస్తవమది కాదు. అది మీ డబ్బును వృథాచేస్తూ, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
దీనిని పరిశీలించండి. ఒక వ్యక్తి సిగరెట్టు త్రాగే ప్రతిసారి అతడు తన జీవిత ఆయుష్షులో పది నిమిషాలను తగ్గించుకుంటున్నాడు, గుండె ఆగిపోవడానికి మరియు రక్తధమనులు పగిలిపోయే ప్రమాదాన్ని, అలాగే శ్వాసనాళం, గొంతు, నోటి క్యాన్సర్లు మరియు ఇతర వ్యాధులు కలిగే ప్రమాదాలను పెంచుకుంటున్నాడు. యు.ఎన్. క్రానికల్ అనే పత్రిక ఈ విధంగా చెబుతుంది: “పొగాకును ఉపయోగించడం మానివేయడం అనేది ప్రపంచంలోని అకాల మరణాన్ని, అంగవైకల్యాన్ని పారద్రోలడానికి నివారించగల ఒకే ఒక్క పెద్ద కారణం.” “నివారించగల కారణం” అని దయచేసి గమనించండని అది చెబుతుంది. మీరు పొగత్రాగడం మానివేయ గలర.
నిజమే, మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక ప్రవర్తనా ఎంపికలు ఉన్నాయి. యెహోవాసాక్షుల రాజ్య మందిరంలోని గ్రంథాలయంలో మీరు చదవగలిగే కొంత సమాచారం ఈ శీర్షికలోని 11వ పుటలో ఇవ్వబడింది. నిజమే, మీ అంతట మీరే తెలుసుకోవడానికి ప్రయత్నం అవసరం. అయినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు ఈ విధంగా అంటున్నాడు: “తమ ఆరోగ్య పరిస్థితులను గూర్చి తెలిసిన విద్యావంతులైన జ్ఞానం గల ప్రజలతో చేరకుండా మీరు ఆరోగ్యంగా ఉండలేరు.” కాబట్టి ఆరోగ్యాన్ని పెంపొందించే ఈ ఉచిత చర్యను గైకొనండి: అదేమంటే, మీకై మీరే విద్యావంతులుకండి.
ఆరోగ్యం మరియు ఇంటి పరిసరం
మీ ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది మీ ఇల్లు మరియు మీ పరిసరప్రాంతమేనని ది పూర్ డై యంగ్ అనే పుస్తకం చెబుతుంది. నీటి మూలంగా మీ పరిసరప్రాంతం మీ ఆరోగ్యానికి పెద్ద అపాయకరంగా ఉండగలదు. కావలసినంత నీళ్ళు లేకపోవడం వలన, మురికి నీటి వలన అంటు వ్యాధులు, చర్మవ్యాధులు, విరేచనాలు, కలరా, అతిసారము, టైఫాయిడ్ మరియు ఇతర వ్యాధులు వస్తాయి.
మీరు చేతులు కడుక్కోవడానికి పంపు తెరిస్తే సరిపోయే పరిస్థితయితే, తమ ఇండ్లలో నీటి పంపులు లేని ప్రజలు నీళ్ళు తెచ్చుకోవడానికి ఎంత సమయం వెచ్చించవలసి ఉంటుందో ఊహించడం మీకు కష్టంగా ఉండవచ్చు. తరచూ 500 కన్నా ఎక్కువ మంది ఒకే నీటి పంపును ఉపయోగిస్తున్నారు. అందువలన వేచి ఉండవలసి వస్తుంది. కాని తక్కువ ఆదాయం గల ప్రజలు ఎక్కువ గంటలు పనిచేస్తారు, మరి వేచి ఉండడాన్ని గూర్చి ఎన్విరోన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇన్ థర్డ్ వరల్డ్ సిటీస్ అనే పుస్తకం ఇలా చెబుతుంది, వేచి ఉండడమనేది “సంపాదించడానికి ఉపయోగించగల సమయాన్ని తీసుకుంటుంది.” సమయాన్ని వృథాచేయకుండా ఉండడానికి ఆరుగురు సభ్యులున్న కుటుంబంలో అందరూ కలిసి రోజుకు 30 కన్నా తక్కువ బకెట్ల నీళ్ళు తరచూ తెస్తుంటారు. అయితే అప్పుడు ఆహార పదార్థాలను, గిన్నెలను కడగడానికి, బట్టలుతుక్కోడానికి మరియు వ్యక్తిగత శుభ్రతకు ఆ నీళ్ళు సరిపోవు. దాని ఫలితంగా తమ కుటుంబ ఆరోగ్యానికి హానికరమైన పేలను, ఈగలను ఆకర్షించే పరిస్థితులకు ఇది నడుపుతుంది.
ఈ పరిస్థితిని గూర్చి ఆలోచించండి. దూరంగా ఉన్న ఉద్యోగస్థలానికి వెళ్ళడానికి మీరు సైకిలుపై ఆధారపడుతున్నట్లయితే ప్రతివారం దాని చెయిన్‌లో నూనె పోయడానికి, బ్రేకులను సరిచేసుకోవడానికి, లేక ఊసలను మార్చడానికి వెచ్చించే సమయాన్ని వృథా చేయడమని ఎంచుతారా? లేదు, ఎందుకంటే శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం చేసి మీరు కొంత సమయాన్ని మిగిల్చినప్పటికీ, తర్వాత సైకిలు పాడైనప్పుడు మీరు ఒక రోజు పనంతా నష్టపోవలసి వస్తుందని మీరు గ్రహిస్తారు. అలాగే, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావలసినంత నీటిని తెచ్చుకోకుండా మీరు కొన్ని గంటలను, ప్రతివారం కొంత డబ్బును సంపాదించుకోవచ్చు, కాని, పారిశుద్ధ్యము లేనందువల్ల మీ ఆరోగ్యం తర్వాత పాడైనప్పుడు మీరు అనేక రోజులను, డబ్బును కోల్పోవచ్చు.
కావలసినంత నీళ్ళు తెచ్చుకోవడాన్ని మీ కుటుంబ పథకంగా చేసుకోగలరు. స్థానిక సంస్కృతి ప్రకారం తల్లి, పిల్లలు మాత్రమే నీళ్ళు మోస్తున్నప్పటికీ, శ్రద్ధగల తండ్రి నీళ్ళు మోయడంలో తాను కూడా చెయ్యి వేయడానికి వెనుకంజవేయడు.
అయినప్పటికీ, నీళ్ళు ఇంటికి చేరుకున్న తరువాత, వాటిని ఎలా శుభ్రంగా ఉంచవచ్చు అనే రెండవ సమస్య తలెత్తుతుంది. ఆరోగ్య నిపుణుల సలహా ఏంటంటే: త్రాగే నీళ్ళను, ఇతర అవసరాలకు ఉపయోగించే నీళ్ళను ఒకేచోట ఉంచకూడదు. నీళ్ళు ఉంచే పాత్రకు సరిగ్గా అమరే మూతతో మూయాలి. నీటిని కొంతసేపు కదలకుండా ఉంచాలి, అలా మలినాలు అడుగుకు చేరుకుంటాయి. నీటిని తీసుకునేటప్పుడు వ్రేళ్ళతో వాటిని ముట్టకూడదు, పెద్ద పిడి ఉన్న కప్పుతో నీళ్ళను తీసుకోవాలి. ఏదైనా బ్లీచింగ్ సొల్యూషన్‌తో పాత్రను క్రమంగా శుభ్రం చేయాలి, తర్వాత దానిని మంచి నీళ్ళతో కడగాలి. మరి వర్షపు నీరు? నిజంగా అది యాదృచ్ఛికమే (వర్షం పడితేనే!), నిలువ చేసే టాంకులో వర్షపు నీటితో పాటు మురికి నీరు రాకుంటే, మరి టాంకును కీటకాలు, ఎలుకలు మరియు ఇతర జంతువుల బారి నుండి భద్రంగా ఉంచినట్లయితే అది మంచి నీరుగా ఉండగలదు.
నీళ్ళు మంచివేనా అని మీకు సందేహమున్నప్పుడు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ఇచ్చేదేమంటే మీరు దానికి సోడియమ్ హైపోక్లోరైట్ లేదా కాల్షియం హైపోక్లోరైట్ వంటి క్లోరిన్‌ను విడుదలచేసే పదార్థాన్ని కలపవచ్చు. అది పని చేస్తుంది, అది చౌకైనది కూడా. ఉదాహరణకు, పెరూనందు సగటు కుటుంబంలో ఈ పద్ధతికి ఒక సంవత్సరానికి రెండు డాలర్ల కన్నా తక్కువే ఖర్చవుతుంది.
ఆరోగ్యం మరియు ఆరోగ్య సంరక్షణ
తరచూ పేద వారికి రెండు రకాల ఆరోగ్య సంరక్షణలను గూర్చి మాత్రమే తెలుసు: (1) లభ్యమే కాని కొనుక్కోలేనివి మరియు (2) కొనుక్కోవచ్చు కాని లభ్యంకానివి. సావో పాలోలోని దాదాపు 6,50,000 మంది పేటనివాసుల్లో ఒకరైన డానా మారియా మొదటి దాని గూర్చి (వాన్‌డర్ పత్రికలో) ఇలా వివరిస్తుంది: “మాకు, మంచి ఆరోగ్య సంరక్షణ అంటే విలాస వస్తువుల సంతలో చూడడానికి కిటికీలలో ప్రదర్శించబడే వస్తువులాంటిదే. మేము దాన్ని చూడగలం, కాని దానిని మేము పొందలేము.” అయితే, నిజంగా హార్ట్ బైపాస్ శస్త్ర చికిత్సలను, మార్పిడులను, క్యాట్ స్కాన్లను చేసే మరితర హైటెక్ మందులను అందజేసే ఆసుపత్రులున్న నగరంలో డానా మారియా నివసిస్తుంది, అయితే ఆమె వీటిని పొందలేదు.
పొందలేని ఆరోగ్య సంరక్షణ అనేది సంతలోని విలాస వస్తువులా అయితే, పొందగలిగే ఆరోగ్య సంరక్షణ అనేది, వినియోగదారులు ఒకే సమయంలో వచ్చి ఒకరినొకరు నెట్టుకుంటూ కొనుక్కునే చౌకబారు వస్తువులాంటిది. దక్షిణాఫ్రికాలోని ఒక వార్తా నివేదిక ఈ విధంగా పేర్కొంది: ‘రోగులు డాక్టర్ని చూపించుకోవడానికి క్యూలో రెండు రోజులు నిలబడవలసి వస్తుంది. పడకలు లేవు. ప్రజా ఆసుపత్రుల్లో మూలధనం, మందు, ఆహారమూ లేవు. ఆరోగ్యసంరక్షణ విధానం దురవస్థలో ఉంది.
ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ క్రమంగా రోగ నివారణయనే తన పని నుండి వ్యాధులను నివారించడంలోను, అదుపులో పెట్టడంలోను ప్రజలను విద్యావంతులను చేస్తూ, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పూనుకుంది. సరైన పోషణ, మంచి నీరు, ప్రాథమిక పారిశుద్ధ్యము వంటి ప్రాథమిక ఆరోగ్య పరిస్థితిని పెంపొందించే కార్యక్రమాల వలన “భూవ్యాప్తంగా ఆరోగ్యంలో పెద్ద మార్పే వచ్చిందని” యు.ఎన్. క్రానికల్ చెబుతుంది. ఈ కార్యక్రమాలు మీకు మేలు చేస్తున్నాయా? ఏదైనా ఒకటి చేస్తుండవచ్చు. ఏది? ఇ.పి.ఐ. (ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యూనైజేషన్).
“ఇంటిని, గ్రామాన్ని సందర్శిస్తూ ఎక్కువ పరిచయస్థులుగా ఉండే పోస్టుమ్యాన్ స్థానాన టీకాలిచ్చేవారు వచ్చారు,” అని ఇ.పి.ఐ. నివేదిక పేర్కొంటుంది. గత దశాబ్దంలో, అమెజాన్ నది నుండి హిమాలయాల వరకు టీకాలు ఇవ్వబడ్డాయి. అలా 1990నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధంగా నివేదించింది. ప్రపంచంలోని శిశువుల్లోని 80 శాతం మందికి 6 ప్రాణాంతక వ్యాధులను అరికట్టడానికి టీకాలు వేయబడ్డాయి.a ఇ.పి.ఐ. సంవత్సరానికి, 30 లక్షల కన్నా ఎక్కువ మంది పిల్లల ప్రాణాలను రక్షిస్తుంది. కుంటివారయ్యే అవకాశమున్న 4,50,000 మంది ఇప్పుడు నడవగలరు, పరుగెత్తగలరు, ఆడగలరు. కాబట్టి, వ్యాధులను నివారించడానికి అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు ఇప్పించాలనే వ్యక్తిగత తీర్మానాన్ని తీసుకుంటారు.
కొన్నిసార్లు మీరు వ్యాధిని నివారించలేరు, అయినప్పటికీ మీరు దానిని అదుపులో ఉంచగలరు. “ఆరోగ్య సంరక్షణలోని సగం కన్నా ఎక్కువ స్వయం సంరక్షణ లేక కుటుంబమిచ్చే సంరక్షణ వల్ల కలుగుతుంది,” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. అలాంటి స్వయం రక్షణాల్లో సామాన్యమైన ఒకటి ఓరల్ రిహైడ్రేషన్ (ఒ.ఆర్.ఎస్), అది ఉప్పు, పంచదార మరియు శుభ్రమైన నీటితో కలిసిన ఖరీదులేని మిశ్రమము.
అతిసార వ్యాధి వలన కలిగే జలశూన్యతకు ఒ.ఆర్.ఎస్ ఉపయోగంతోపాటు ఓరల్ రిహైడ్రేషన్ థెరపీ ఫలవంతమైన చికిత్స అని అనేకమంది ఆరోగ్య సంరక్షకులు పరిగణిస్తున్నారు. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందుతున్న దేశాల్లో 1.5 అరబ్‌ల (150 కోట్ల) అతిసార వ్యాధులను అదుపులో ఉంచేందుకు పది సెంట్ల ఖరీదు గల ఒ.ఆర్.ఎస్. ఉప్పు మిశ్రమాలను ఉపయోగించినట్లయితే, ప్రతి సంవత్సరం అతిసార వ్యాధుల వలన మరణించే 32 లక్షల మంది పిల్లల్లోని అనేకుల ప్రాణాలు కాపాడబడగలవు.
అలా జరిగేదే కాని, కొన్ని దేశాల్లోని అతిసారవ్యాధుల విరుగుడు మందుల ఉపయోగాన్ని గూర్చి ఎస్సెన్షియల్ డ్రగ్స్ మోనిటర్ అనే ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్తాలేఖ ఇలా చెబుతుంది, అది “ఒ.ఆర్.ఎస్ ఉపయోగం కన్నా చాలా సాధారణమై ఉన్నది.” కొన్ని అభివృద్ధిచెందుతున్న దేశాల్లో, ఉదాహరణకు, అతిసారవ్యాధిని చికిత్స చేసేందుకు తరచూ ఒ.ఆర్.ఎస్ కన్నా మందులను ఎక్కువగా ఉపయోగిస్తారు. “అవసరమైన ఈ మందుల ఉపయోగానికి చాలా ఖర్చవుతుంది,” అని వార్తాలేఖ చెబుతుంది. పేద కుటుంబాలు వీటి కొరకు ఆహార పదార్థాలను కూడా అమ్మవలసి వస్తుంది. అంతేకాక, అతిసారవ్యాధి విరుగుడు మందులకు ఆచరణాత్మక విలువ లేదని, కొన్ని అపాయకరమైనవని అది తాకీదునిస్తుంది. “డాక్టర్లు ఇలాంటి మందులను రాసివ్వకూడదు, . . . కుటుంబాలు వాటిని కొనకూడదు.”
మందులను రాసిచ్చే బదులు, అతిసారవ్యాధిని చికిత్స చేసేందుకు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ క్రింది సలహాలను ఇస్తుంది. (1) గంజినీళ్ళు లేదా టీ వంటి మరిన్ని ద్రవాలను పిల్లలకిస్తూ జలశూన్యతను నివారించాలి. (2) బిడ్డ ఇంకా జలశూన్యంగా అవుతున్నట్లయితే, సహాయం కొరకు ఒక హెల్త్ వర్కర్‌కి చూపించాలి, ఒ.ఆర్.ఎస్తో బిడ్డకు చికిత్స చేయాలి. (3) వ్యాధి ఉన్న సమయంలోను, ఆ తర్వాత కూడా సాధారణంగా బిడ్డకు ఆహారం ఇవ్వాలి. (4) బిడ్డకు తీవ్రమైన జలశూన్యత ఉన్నట్లయితే, వానికి నరాల్లోకి ద్రవాన్ని ఎక్కించాలి.b
ప్యాకెట్లుగా చేయబడిన ఒ.ఆర్.ఎస్ మీరు పొందలేనట్లయితే, ఈ విధానాన్ని జాగ్రత్తగా చేపట్టండి: ఒక చెంచాడు ఉప్పును, ఎనిమిది చెంచాల నిండా పంచదారను, ఒక లీటరు (200 మిల్లీ లీటర్ల చొప్పున ఐదు కప్పుల నిండా) శుభ్రమైన నీటిని బాగా కలపండి. విసర్జనం చేసిన ప్రతిసారి ఒక కప్పు నిండా ఇవ్వాలి, చిన్న పిల్లలకు అర కప్పు ఇవ్వాలి. ఈ విషయాన్ని గూర్చిన ఎక్కువ సమాచారం కొరకు 10వ పుటలోని బాక్సు చూడండి.
నాలుగవ కారణాంశమైన మన శరీర నిర్మాణం విషయమేంటి? అది ఎలా ప్రభావితం చేయబడగలదు? తరువాయి శీర్షిక ఆ ప్రశ్నను చర్చిస్తుంది.
[అధస్సూచీలు]
a ఆరు ఏవనగా ధనుర్వాతం, పొంగు, పోలియోమైలైటీస్, టెటనస్, క్షయవ్యాధి మరియు కోరింత దగ్గు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసేదేమంటే, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎయిడ్స్ చంపుతున్న వారికన్నా ఎంతో ఎక్కువ మందిని చంపుతున్న హెపటైటిస్ బిని కూడా వ్యాధినిరోధక కార్యక్రమాల్లో చేర్చాలి.
b బిడ్డ పొట్టపై చర్మాన్ని లాగండి. చర్మం యథాస్థితికి తిరిగి రావడానికి రెండు సెకండ్లకన్నా ఎక్కువ సమయం పడితే బిడ్డకు విపరీతమైన జలశూన్యత ఉందన్నమాట.
[8,9వ పేజీలోని బాక్సు]
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ—అది ఎలా పని చేస్తుంది?
ఈ ప్రశ్నకు జవాబు కనుక్కొనేందుకు, దక్షిణాఫ్రికాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డా. మిఖాయేల్ ఓకారోల్తో తేజరిల్లు! మాట్లాడింది. కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.
‘ఆరోగ్యం కొరకు వైద్య చికిత్సపై ఆధారపడిన ఆరోగ్య సంరక్షణా విధానం మనకు సంప్రాప్తమైంది. మీరు రోగగ్రస్తులైతే, మీరు వైద్యుని దగ్గరకు వెళ్ళండి. మీరు రెండు సీసాల విస్కీ త్రాగారన్న వాస్తవాన్ని మర్చిపోండి. మీరెన్నడూ శరీరాభ్యాసం చేయలేదని మర్చిపోండి. మీరు డాక్టరు దగ్గరికి వెళ్ళి, “డాక్టరుగారు, నన్ను నయం చేయండి,” అని అడగండి. డాక్టరు మీకు నోట్లో ఏదో మందు వేస్తారు. చేతికి సూది మందు ఇస్తారు. ఏదో కోసేస్తాడు. లేదా ఏదో అతికిస్తాడు. మీరు అర్థం చేసుకునేలాగా నేను టూకీగా మాట్లాడుతున్నాను, కాని ఇలాంటి చికిత్సా విధానం ఎప్పటినుండో ఉంది. మనం పొరపాటున సామాజిక సమస్యలను వైద్య సమస్యలుగా మార్చుకున్నాము. ఆత్మహత్య, కుపోషణ మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగం అనేవి వైద్య సమస్యలుగా మారాయి. కాని అవి ఆ సమస్యలు కావు. అవి ఆరోగ్య సమస్యలు కూడా కావు. అవి ఆరోగ్య మరియు వైద్య పర్యవసానాలతో కూడిన సామాజిక సమస్యలు.
‘అయితే, గత 20 సంవత్సరాలుగా, ప్రజలు ఈ విధంగా చెప్పారు, “ఆగి ఆలోచిద్దాం. మనం పనులను తప్పుడు మార్గంలో చేస్తున్నాము. మన దృష్టిలో ఆరోగ్యమంటే ఏమిటో మనం పునర్నిర్వచించవలసిన అవసరముంది.” అభివృద్ధి చెందిన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విధానానికి ఆధారమైన కొన్ని సూత్రాలు (ఇలాంటివి) క్రింద ఉన్నాయి:
‘వ్యాధిని నయం చేయడం కన్నా నివారించడమే మరి ఎక్కువ కనికరంతో కూడినది మరియు దీర్ఘకాలం ఉండేది. ఉదాహరణకు, కారణాలను నివారించకుండా గుండె శస్త్ర చికిత్స చేసే క్లినిక్‌లను తెరవడం ఈ సూత్రానికి భిన్నమే. దాని అర్థం వ్యాధులు వస్తే నయం చేయవద్దని కాదు. మీరు తప్పకుండా అలా చేయాలి. మీ వీధిలో ఉన్న గుంట ప్రతివారం ప్రమాదాలకు కారణమౌతున్నట్లయితే, గుంటలోపడి కాళ్ళు ఇరగ్గొట్టుకున్న ఆ మనిషికి మీరు చికిత్స చేస్తారు, కాని మరింత ప్రయోజనకరమైన పని ఆ గుంటను పూడ్చివేయడమే.
‘మరొక సూత్రమేమంటే, మీ ఆరోగ్య వనరులను ఫలవంతంగా ఉపయోగించాలి. ఒక సమస్య ఇంట్లోనే పరిష్కరించగలదైతే దానిని క్లినిక్ వరకు తీసుకువెళ్ళడం. లేదా క్లినిక్‌కి వెళ్తే సరిపోయేదానిని పెద్ద ఆసుపత్రి వరకు తీసుకువెళ్ళడం సూత్రానికి భిన్నం. లేదా ఆరు నెలలు తర్ఫీదు పొందినవారికి బదులుగా యూనివర్సిటీలో పది సంవత్సరాలు తర్ఫీదు పొందిన డాక్టరును టీకాలు ఇవ్వడానికి బయటికి పంపడం ఈ సూత్రానికి విరుద్ధం. ఆ డాక్టరు దేనికొరకు తర్ఫీదు పొందాడో దానికి అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉండాలి. ఇదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెబుతుంది: ప్రజలను విద్యావంతులను చేయండి, వ్యాధులను నివారించండి, మీ ఆరోగ్య వనరులను తెలివిగా ఉపయోగించండి.’
[10వ పేజీలోని బాక్సు]
కలరాకు మరొక ఒ.ఆర్.ఎస్
కలరా రోగులను చికిత్స చేసేటప్పుడు స్టాండర్డ్ గ్లూకోస్ ఒ.ఆర్.ఎస్ (ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్)కు బదులుగా గంజినీటి ఒ.ఆర్.ఎస్‌ను ఉపయోగించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు సిఫారసు చేస్తుంది. గంజినీటి ఒ.ఆర్.ఎస్తో చికిత్స చేయబడిన కలరా రోగులకు స్టాండర్డ్ ఒ.ఆర్.ఎస్ ఇవ్వబడిన రోగుల కన్నా కొద్దిపాటి మల విసర్జనతో 33 శాతం తక్కువ విరేచనాలు అవుతాయి. ఒక ఔన్సు పంచదార కలిపి వండిన రెండు మూడు ఔన్సుల బియ్యం పిండికి బదులు గంజి ఆధారంగా ఒ.ఆర్.ఎస్‌ను తయారు చేయవచ్చు.—ఎస్సన్షియల్ డ్రగ్స్ మోనిటర్.
[11వ పేజీలోని బాక్సు]
ఇంకా చదవడానికి . . .
ప్రవర్తన: “మంచి ఆరోగ్యం—దాని కొరకు మీరేమి చేయగలరు?”—తేజరిల్లు!, (ఆంగ్లం) డిశంబరు 8, 1989. “పొగాకుకు, మీ ఆరోగ్యానికి—నిజంగా ఏమైనా సంబంధముందా?”—తేజరిల్లు!, (ఆంగ్లం) జూలై 8, 1989. “సజీవంగా ఉండేందుకై పిల్లలకు సహాయం చేయుట”—తేజరిల్లు!, (ఆంగ్లం) సెప్టెంబరు 22, 1988. “మద్యం మీ శరీరంలో ఏమి చేస్తుంది”—తేజరిల్లు!, (ఆంగ్లం) మార్చి 8, 1980.
పరిసరం: “పరిశుభ్రత అనే సవాలును ఎదుర్కొనుట”—తేజరిల్లు!, (ఆంగ్లం) సెప్టెంబరు 22, 1988. “శుభ్రంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి!” తేజరిల్లు!, (ఆంగ్లం) సెప్టెంబరు 22, 1977.
ఆరోగ్యసంరక్షణ: “ప్రాణాలను సంరక్షించే ఇతర పద్ధతులు”—తేజరిల్లు!, (ఆంగ్లం) సెప్టెంబరు 22, 1988. “ఉప్పు పానీయం ప్రాణాలను రక్షిస్తుంది!”—తేజరిల్లు!, (ఆంగ్లం) సెప్టెంబరు 22, 1985.
[7వ పేజీలోని చిత్రం]
నీళ్ళు పట్టుకోవడానికి వేచి ఉండవలసి వస్తుంది, అదొక పని
[క్రెడిట్ లైను]
Mark Peters/Sipa Press
[9వ పేజీలోని చిత్రం]
కావలసినంత సురక్షితమైన నీరు—మంచి ఆరోగ్యానికి తప్పనిసరి
[క్రెడిట్ లైను]
Mark Peters/Sipa Press