మానాన్నగారు “ఆటంబాంబువల్ల జైలునుండి బయటపడ్డారు”
అది ఆగస్టు 6, 1945, ఉదయము 8:15 నిముషాలకు జపానులోని హిరోషిమాపై ఆటంబాంబు విస్పోటించి నగరాన్నంతటిని ధ్వంసంచేసి, వేలాదిమంది ప్రజలను చంపేసింది. మా నాన్నగారు చక్రవర్తిని ఆరాధించనందుకు, జపాను సైనికదళముకు మద్దతును యివ్వనందుకు, ఆయన ఆ సమయంలో హిరోషిమా జైలులో ఉన్నారు.
నాన్న మరువరాని ఆ ఉదయము ఏమి జరిగిందో అప్పుడపుడు వివరించేవారు. “నా జైలుగది లోకప్పుపై తటాలున వెలుగు ప్రకాశించింది,” అని ఆయన చెప్పేవారు. “ఆ తరువాత నేను పర్వతాలు అన్ని కూడ ఒకేసారి కూలిపోతే ఎటువంటి శబ్దము వస్తుందో అలాంటి ఘోరమైన ఘర్జనను విన్నాను. తక్షణమే ఆ జైలు గదంతా దట్టమైన అంధకారాన్ని కమ్ముకొన్నది. నా తలను నేను తలదిండులో దాచుకొని కన్పిస్తున్న దట్టమైన గ్యాస్పొగనుండి తప్పించుకోటానికి ప్రయత్నించాను.
“తరువాత ఏడు లేక ఎనిమిది నిముషాలకు, నా తలను దిండులోనుంచి ఎత్తిచూసేసరికి, ఆ ‘గ్యాస్’ చుట్టూ వ్యాపించి తగ్గిపోవటము చూశాను. మరొకసారి వెలుగు రావటము జరిగింది. అలమరాలోనున్న వస్తువులన్నీకూడ క్రిందపడ్డాయి, పైనుండి అధిక పరిమాణములో ధూళి పడింది, అంతా గందరగోళంగా చేసింది. జైలు చుట్టు పెద్ద గోడ వుండటమువల్ల, ఏ మంటలుకూడ బయటనుండి లోపలికి ప్రవేశించలేదు.
“మరల నేను కిటికీగుండా చూసేసరికి చాలా ఆశ్చర్యము కలిగించింది! జైలులోని వర్క్‌షాపులు మరియు కర్రతో చేసిన భవనాలన్నీ చూర్ణమై నేలమట్టము చేయబడ్డాయి. తరువాత నేను ముందున్న చిన్న కిటికి గుండా చూశాను. మా ముందున్న జైలు గదులన్నీ ముక్కముక్కలుగా విరిగిపోయాయి. తప్పించుకొన్న ఖైదీలందరూ సహాయార్థము కేకలు వేయసాగారు. అక్కడంతా భయం, గాభరా—ఆ దృశ్యమంతా తీవ్రమైన అవ్యవస్థ మరియు అధికభీతితో నిండిపోయింది.”
బాలునిగా నేను నాన్న చెప్పేదంతా ఉద్వేగంతో వినేవాడ్ని, ఆయన దాన్ని యిలా చెప్పేవారు “ఆటంబాంబువల్ల జైలునుండి బయటపడ్డాను.” ఆయన అన్యాయంగా నిర్బంధించబడ్డారు కాబట్టి, ఆయన అపరాధము చేసినట్లు భావించకుండా కథను వివరించేవారు. నాన్నకు వ్యతిరేకంగా మోపబడిన నేరాలను, ఆయన చెరలోనున్న సంవత్సరాల్లో ఎలా వ్యవహరించబడ్డారో చెప్పేముందుగా, అప్పుడు తోదిషా అని పిలువబడిన జపాన్‌లోని వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటితో నా తల్లిదండ్రులు ఎలా సహవాసం చేసారో, నన్ను వివరించనివ్వండి.
సంకల్పం కొరకు అన్వేషణ
నాన్నకు పుస్తకాలంటే చాలా యిష్టముండేది, దానిని ఆయన చిన్నతనమునుండి తనకుతానే చదువుకొని జీవిత పరిస్థితిని అభివృద్ధి చేసుకోడానికి ప్రయత్నించేవారు. జపానులో ఈశాన్యానవున్న ఇషినోమోరీ పట్టణంలోని తన యింటినుండి ఆయన ప్రాధమిక పాఠశాలలో ఐదవ తరగతి చదివేటపుడే పారిపోయారు. జపానుకు రెండుసార్లు ప్రధానమంత్రిగా వున్న, షిగినోబూ ఆకూమా యింటిలో పనిచేసేవానిగా వుండాలని నిర్ణయించుకొని, అక్కడికి ఒకవైపు ప్రయాణానికి సరిపోయే టిక్కెట్టు డబ్బుతో, టోక్యోకు వెళ్లే రైలు ఎక్కారు. కాని అక్కడికి చింకిపాతలు ధరించిన గ్రామీణ పిల్లవానిగా ఆకూమాగారి గృహములో ప్రవేశించేసరికి, పనికొరకు చేసిన ఆయన విన్నపము త్రిప్పికొట్టబడింది. తరువాత నాన్న పాలు అమ్మే దుకాణములో నివసించి అక్కడే పని చేసే ఉద్యోగాన్ని సంపాదించుకొన్నారు.
యౌవనస్థునిగా వున్నపుడే, మా నాన్నగారు రాజకీయ నాయకుల, విద్వాంసుల ప్రసంగాలకు వెళ్లుతుండేవారు. ఒక ప్రసంగములో బైబిలు చాలా ప్రాముఖ్యమైన పుస్తకమని చెప్పటము జరిగింది. కాబట్టి మా నాన్నగారు పూర్తి క్రాసు-రిఫరెన్సుతో అట్లాసును కలిగియున్న ఒక బైబిలును సంపాదించారు. ఆయన చదివిన దానిద్వారా గాఢంగా ప్రభావితులై, మానవజాతికంతటికి ప్రయోజనాన్ని తెచ్చే పనిని చేయటానికి కదిలింపబడ్డారు.
అనుకోనివిధంగా మానాన్నగారు తిరిగి యింటికి వచ్చి, ఏప్రిల్ 1931లో ఆయనకు 24 సంవత్సరాలున్నప్పుడు, 17 సంవత్సరాల వయస్సుగల హగీన్ను వివాహం చేసుకున్నారు. వివాహమైన కొద్దికాలానికే మా చిన్నాన్న తోదిషాచే ప్రచురింపబడిన సాహిత్యాన్ని పంపించాడు. ఆయన చదివినదానిద్వారా ప్రభావితుడై, టోక్యోలోని తోదిషాకు నాన్నగారు వ్రాశారు. జూన్ 1931లో సెండాయినుండి వచ్చిన మాట్స్ ఇషీ అనే పూర్తికాల సేవకురాలు ఇషీనోమోరీలో నాన్నగారిని దర్శించటం జరిగింది.a మానాన్నగారు ఆమెనుండి ది హర్ప్ ఆఫ్ గాడ్, క్రియేషన్, గవర్నమెంట్ పుస్తకాలతోపాటు మరి యితర పుస్తకాలను స్వీకరించారు.
జీవితంలో ఒక సంకల్పాన్ని కనుగొనుట
ఒకప్పుడు మానాన్నగారు ఆత్మ అమర్త్యమైనదని, దుష్టులు నిత్యము నరకాగ్నిలో కాల్చబడతారని, సృష్టికర్త త్రిత్వమై వున్నాడని, వివిధ రకాల చర్చీ బోధలను, అబద్ధమని తెలుసుకొన్నారు. (ప్రసంగి 9:5,10; యెహెజ్కేలు 18:4; యోహాను 14:28) ఈ లోకమంతా గతించిపోతుందనికూడ ఆయన గ్రహించారు. (1 యోహాను 2:17) ఆయన ఏమి చేయాలనేది తెలుసుకోటానికి, తోదిషాచే నియమించబడిన ప్రతినిధిని కలుసుకొన్నారు. ఆగస్టు 1931లో ఆయన మానాన్నగారిని కలవటము జరిగింది, వారి చర్చల ఫలితంగా, ఆయన బాప్తిస్మము పొంది, యెహోవాకు పూర్తికాల సేవకునిగా పని చేయాలని నిర్ణయించుకొన్నారు.
పొడిగించబడిన చర్చలద్వారా మాఅమ్మకూడ బైబిలునుండి ఆమె నేర్చుకున్నవి సత్యమని ఒప్పించబడింది. అక్టోబరు 1931లో ఆమె తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మము పొందింది. మానాన్న ఆస్తినంతటిని వేలం వేసినపుడు, బంధువులందరూ ఆయనకు మతిపోయిందని అనుకున్నారు.
పూర్తికాల సువార్తికులుగా జీవితం
వేలంనుండి వచ్చిన ధనమంతటినీ తన తల్లి దగ్గరనే వుంచి, 1931 నవంబరులో ఆయన, మాఅమ్మ కలిసి టోక్యోకి వెళ్లారు. వాళ్లు యితరులతో దేవుని రాజ్యసువార్తను గూర్చి ఎలా మాట్లాడాలో ఏలాంటి ఉపదేశాలను పొందకపోయినప్పటికీ, అక్కడికి వెళ్లిన తదుపరి రోజునుండి ప్రకటనాపనిని మొదలుపెట్టారు.—మత్తయి 24:14.
వాళ్ల జీవితము అంత సులభంగా సాగలేదు. ప్రాముఖ్యంగా పదిహేడు సంవత్సరాలున్న మాఅమ్మకు చాలా కష్టంగావుండేది. అక్కడ తోటి సహవాసులెవరూ లేరు, కూటాలు లేవు, సంఘముకూడ లేదు—ఉదయము 9.00 గంటలనుండి సాయంత్రము 4.00 వరకు కేవలం బైబిలు సాహిత్యాలను యింటింటికి పంచిపెట్టటమే వారి దినపట్టిక.
వాళ్ల ప్రకటనాపనిని టోక్యోనుండి క్యూబాకు 1933లో మార్చడమైంది. అక్కడ నేను 1934 ఫిబ్రవరి 9న, పుట్టాను. నేను పుట్టటానికి యింకా ఒక నెలవున్నంతవరకు మా అమ్మ ఉత్సాహంతో పరిచర్య చేస్తూనేవుంది. అ తరువాత నాతల్లిదండ్రులు యామాగుచీకి, యూబీకి, కూరోకి తరలి ఒక్కొక్క ప్రదేశములో ఒక సంవత్సరంపాటు ప్రకటనాపని చేస్తూ, చివరికి హిరోషిమాకు చేరారు.
నా తల్లిదండ్రులు నిర్బంధింపబడ్డారు
జపానీయుల సైనికదళము పెరుగుతున్న కొలది, వాచ్‌టవర్ సొసైటి ప్రచురణలు నిషేధించబడినవి, సాక్షులందరు ప్రత్యేక రహస్య పోలీసు సర్వీసు వారి పట్టుసడలని నిఘా క్రిందవుంచబడ్డారు. తరువాత, 1939 జూన్ 21న జపాను దేశములోని యెహోవాసాక్షుల పూర్తికాల సువార్తికులందరిని నిర్బంధించటము జరిగింది. అలా బంధింపబడిన వారిలో మా తల్లిదండ్రులుకూడ వున్నారు. ఇషీనోమోరీలో నివసిస్తున్న మా నాన్నమ్మ సంరక్షణకు నేను అప్పగించబడ్డాను. ఎనిమిది మాసాలు బంధించబడిన తరువాత, మా అమ్మ విడిపింపబడి అధికారుల పరిశీలన క్రింద ఉంచబడింది, చివరకు 1942లో సెండాయినందు నేను ఆమెను కలుసుకోగలిగాను.
ఈ సమయంలో, మానాన్న, తనతోపాటుగా వున్న యితర సాక్షులు, హిరోషిమా పోలీసుస్టేషన్లో రహస్య పోలీసులద్వారా ప్రశ్నించబడ్డారు. వాళ్లు చక్రవర్తిని ఆరాధించటానికి, లేదా జపాను సైనికదళానికి మద్దతు యివ్వటానికి నిరాకరించారు కాబట్టి ఆ సాక్షులు తీవ్రంగా కొట్టబడ్డారు. ఆ విచారణకర్త మానాన్నను యెహోవాను ఆరాధించటమునుండి కదిలింపలేకపోయాడు.
రెండు సంవత్సరాలకుపైగా కారాగారవాసం చేసిన తరువాత, మానాన్నపై విచారణ జరిగింది. ఈ సమావేశ సమయంలో, ఆ న్యాయాధిపతి: “ముయిరా, మహా ప్రభువైన చక్రవర్తి, ఆయన ఔన్నత్యాన్నిగూర్చి మీరు ఏమనుకుంటారు?” అని అడిగారు.
“మహాప్రభువైన చక్రవర్తికూడ ఆదామునుండి వచ్చినవాడే, మరణించేవాడే, అపరిపూర్ణ మానవుడే,” అని నాన్న జవాబిచ్చారు. ఆ స్టెనోగ్రాఫర్‌ను ఆ వివరణ ఎంతో ఆశ్చర్యచకితున్ని చేసినందువల్ల ఆయన దానిని నమోదు చేయలేకపోయాడు. మీకు తెలిసినట్లుగా, జపానీయులు ఆ కాలంలో చక్రవర్తిని ఒక దేవునిగా నమ్మేవారు. మానాన్నకు ఐదు సంవత్సరాలు జైలుశిక్ష వేయబడింది, ఆయన గనుక తన విశ్వాసమును విడిచిపెట్టకపోతే, మిగిలిన జీవితమంతాకూడ జైలులో ఉండవలసి వస్తుందని ఆ న్యాయాధిపతి చెప్పాడు.
తరువాత కొంతకాలానికే, 1941 డిశంబరులో, అమెరికాలోని హవాయినందలి పర్ల్ హార్బర్‌పై జపాను దాడిచేసింది. జైలులో ఆహారం కరువైంది, శీతాకాల సమయంలో, అక్కడ బట్టలు సరిగ్గా లేనందున నాన్న చాలా రాత్రుళ్లు చలితోను, జాగరణలతోను గడిపారు. ఆత్మీయ సహవాసమంతా తెగిపోయినప్పటికి, ఆయన ముందుకు సాగటానికి జైలులో గ్రంథాలయములోని బైబిలును, మరల మరల చదవటంద్వారా తన ఆత్మీయ బలాన్ని కాపాడుకొన్నారు.
బాంబు పడినప్పుడు
ఆగస్టు 6, 1945లో ఉదయకాలముననే ఒక ఖైదీ మా నాన్నగారితో పుస్తకాల మార్పిడిని కోరారు. యిది నిషేధించబడింది, కాబట్టి ఆ ఖైదీ అప్పటికే తన పుస్తకాన్ని హాలుమార్గము గుండా మానాన్న జైలుగదిలోకి జారవిడిచాడు, మానాన్న తన పుస్తకాన్ని ఆ ఖైదీ గదిలోనికి జారవిడిచారు. సాధారణంగా కదిలింపబడని తన పట్టికను అనుసరించే బదులు ఆ ఉదయాన మానాన్నగారు చదువుతున్నపుడు బాంబు పడింది. మాములుగా ఆ ఉదయకాల సమయంలో తన గదిలోనే మరుగుదొడ్డిని ఉపయోగించేవారు. ధ్వంసమైన తరువాత, నాన్న మరుగుదొడ్డి ప్రాంతమంతా నాశనము చేయబడి కూలిపోయిన శిథిలాలలో ఉండడం చూశారు.
మానాన్నగారు దగ్గరలోనున్న ఇవాకూనీ అనే జైలునకు తీసుకొని వెళ్లబడ్డారు. అక్కడకు వెళ్లిన వెంటనే, జపాను సామూహిక దళాలకు లొంగిపోయింది, యుద్ధము ముగిసిన గందరగోళం మధ్యలో ఆయన జైలునుండి విడిపించబడ్డారు. 1945 డిశంబరులో ఆయన ఇషీనోమోరీలోని తన యింటికి తిరిగి వచ్చారు. ఆయన ఆరోగ్యము పూర్తిగా పాడైపోయింది. ఆయనకు వయస్సు కేవలం 38, అయితే ఆయన ముసలివానిలా కనబడ్డారు. మొదట ఆయన మానాన్న అని నేను నమ్మలేకపోయాను.
ఇంకా ఆయన విశ్వాసము దృఢమైంది
జపానంతాకూడ గందరగోళ పరిస్థితిలోవుంది, నమ్మకముగా మిగిలిన సాక్షులంతా ఎక్కడికిచెదరి పోయారో మాకు తెలియదు. యెహోవాసాక్షుల ప్రచురణలు ఏవికూడ మాకు అందుబాటులో లేవు. అయినప్పటికి, నాన్నగారు నాకు నేరుగా బైబిలునుండి యెహోవా రాజ్య సత్యమునుగూర్చి, నూతనలోకమునుగూర్చి, సమీపించే హార్‌మెగిద్దోను యుద్ధమునుగూర్చి నేర్పేవారు.—కీర్తన 37:9-11, 29; యెషయా 9:6, 7; 11:6-9; 65:17, 21-24; దానియేలు 2:44; మత్తయి 6:9, 10.
కొద్దికాలము గతించిన పిదప, ఉన్నత పాఠశాలలో నున్నప్పుడు పరిణామ సిద్ధాంతమునుగూర్చి నేర్పించబడింది, దేవుడు ఉనికిలో ఉన్నాడనే విషయము గూర్చి సందేహించటము మొదలుపెట్టాను, మానాన్నగారు దేవుని ఉనికినిగూర్చి నన్ను ఒప్పించటానికి ప్రయత్నించేవారు. నేను నమ్మటానికి సంశయించినపుడు, చివరకు ఆయన యిలా అన్నారు: “లోకప్రజలలో చాలామంది యుద్ధానికి మద్దతునిచ్చారు, రక్తము చిందించిన అపరాధము కలిగియున్నారు. నా విషయంలోనైతే, నేను బైబిలు సత్యమునకు హత్తుకొని, సైనికదళానికి మద్దతునివ్వటంగాని, చక్రవర్తిని ఆరాధించటంగాని లేదా యుద్ధానికి మద్దతునివ్వటంగాని ఎప్పుడు చేయలేదు. అందుచేత నీకై నీవే జీవిత సత్యమార్గమేమిటో జాగ్రత్తగా గమనించి దానిలో నీవు నడుచుకో.”
మానాన్నగారు నేర్పిన జీవించిన విధానమును, నేను పాఠశాలలో నేర్చుకొన్నవాటితో పోల్చిచూసినపుడు, ఆ పరిణామ సిద్ధాంతము అర్థవంతమైన ఆలోచనా విధానము కాదని నేను చూడగల్గాను. అయినను ఏ పరిణామ సిద్ధాంతికూడ తన నమ్మకాలకొరకు ప్రాణానికి ప్రమాదము తెచ్చుకోలేదు, మానాన్న తాను కలిగియున్న విశ్వాసంకొరకు చనిపోటానికి యిష్టపడ్డారు.
యుద్ధం ముగిసిన, ఐదు సంవత్సరాలకంటే ఎక్కువకాలము గడిచిన తరువాత మార్చి 1951లో ఒకరోజున, మానాన్నగారు ఆషీ అనే వార్తాపత్రికను చదువుతున్నారు. ఆకస్మాత్తుగా ఆయన పెద్దగా అరిచారు: “అరే, వాళ్లు వచ్చారు, వాళ్లు వచ్చారు!” ఆయన నాకు పేపరు చూపారు. ఓసాకాకు ఐదుగురు యెహోవాసాక్షుల మిషనరీలు అప్పుడే వచ్చినట్లుగా ఒక శీర్షిక అక్కడవుంది. సంతోషముతో గెంతుతూ, మానాన్నగారు వార్తాపత్రికను సంప్రదించి, టోక్యోలో యెహోవాసాక్షులు ఒక బ్రాంచి కార్యాలయాన్ని స్థాపించారని తెలుసుకొన్నారు. దాని అడ్రసు సంపాదించి ఆ బ్రాంచిని దర్శించారు, అలా మళ్లీ యెహోవా సంస్థతో సహవాసం తిరిగి ఏర్పడింది.
మరణ పర్యంతం నమ్మకంగావుండుట
మాకుటుంబము 1952లో సెండాయికి మారింది. వాచ్‌టవర్ సొసైటి మిషనరీలు డొనాల్డ్ మరియు మాబెల్ హస్లేట్కూడ అదే సంవత్సరం మారారు, వాచ్‌టవర్ పఠనము చేసికోటానికి ఒక అద్దె యిల్లు తీసుకొన్నారు. మొదటిసారి కూటానికి నలుగురు మాత్రమే హాజరయ్యారు—హాస్లేట్ భార్యాభర్తలు, మానాన్న మరియు నేను. తరువాత, షీనీచీ, మాసాకో టోహారా, అడీలైన్ నాకో, లిలియా సమ్సన్లు మిషనరీలుగా హాస్లేట్లతో సిండిలో కలిశారు.
మా కుటుంబము ఈ మిషనరీల సహవాసంతో, దేవుని వాక్యము, సంస్థనుగూర్చిన జ్ఞానమునందు అభివృద్ధి పొందారు. యుద్ధకాలంలో సంభవించిన వాటివలన మాఅమ్మ తన విశ్వాసమునందు కదిలింపబడింది, త్వరలోనే మాతో కలిసి కూటాలకు రావటము, ప్రాంతీయసేవలో భాగము వహించటం ఆరంభించింది. నేను యెహోవాదేవునికి సేవచేయాలని కదిలింపబడి నా జీవితాన్ని సమర్పించుకొని, ఏప్రిల్ 18, 1953లో బాప్తిస్మము తీసుకొన్నాను.
యుద్ధానికి ముందు నాన్న సేల్స్‌మాన్‌గా ఇన్సూరేన్స్ కంపెనీలో పనిచేసారు. నిర్బంధింపబడిన తరువాత ప్రభావాలను లక్ష్యపెట్టకుండ, అంటే కిడ్నీ అస్వస్థత, అధిక రక్తపోటుకూడ కలిగివున్నను, ఆయన పూర్తికాల పరిచర్య తిరిగి ఆరంభించాలని బలమైన కోరిక కలిగియుండేవారు. నేను బాప్తిస్మము తీసుకొన్న సమయములోనే పయినీరింగ్ మొదలుపెట్టారు. పయినీర్‌గా ఎక్కువకాలము కొనసాగటానికి అనారోగ్యము ఆటంకపరచినప్పటికీ, పరిచర్యయెడల ఆయన ఆసక్తిద్వారా కదిలించబడి నేను యూనివర్సిటీకి వెళ్లటం మానివేసి పూర్తికాల పరిచర్యను నా వృత్తిగా చేపట్టాను.
ఇసామూ సుగీరా అనే యౌవనస్థుడు నాగొయానుండి వచ్చాడు, ఆయనే నాతోటి పనివానిగా నియమితుడయ్యాడు. మే 1, 1955న క్యూషూ ద్వీపమున బిపూలో ప్రత్యేక పయినీర్లుగా మేము మా పరిచర్యను ఆరంభించాము. అప్పుడు ఆ ప్రాంతమంతటా కేవలం కొద్దిమంది సాక్షులే వున్నారు. యిపుడు, 39 సంవత్సరాలు ముగిసిన తరువాత, ఆత్మీయంగా పెరిగే 15 సర్క్యూట్లను, 18,000 మంది సాక్షులను మేము కలిగివున్నాము. జపాను మొత్తంలో, యిపుడు దాదాపుగా 2,00,000 మంది సాక్షులున్నారు.
ఇసామూకు నాకు అమెరికాలోని వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు హాజరవ్వమని 1956 వసంతఋతువులో ఆహ్వానాలు వచ్చాయి. మేము సంతోషంతో పొంగిపోయాము. అయినప్పటికీ, ప్రయాణానికి సిద్ధపడుతుండగా శారీరక పరీక్షను తీసుకొన్నపుడు, వైద్యులు నాకు క్షయరోగమున్నదని కనుగొనటం జరిగింది. నేను గొప్ప నిరాశతో, సెండాయిలోని యింటికి తిరిగొచ్చాను.
అప్పటికే నాన్నగారి ఆరోగ్యం క్షీణించింది, ఆయన యింటిలోనే మంచంపై విశ్రాంతి తీసుకొంటున్నారు. మా అద్దె యిల్లు కేవలం తొమ్మిది చదరపుమీటర్ల టాటామీ గది, మానాన్నకు నాకు ప్రక్కప్రక్కనే పక్కలు వేయబడ్డాయి. అప్పుడు నాన్నగారు ఉద్యోగం చేయలేరు, మా ఆర్థికావసరతలను చూడడంకొరకు మాఅమ్మకు చాలాకష్టమైంది.
జనవరి 1957లో, వాచ్‌టవర్ సొసైటీకి అప్పుడు వైస్ ప్రెసిడెంట్గావున్న ఫెడిరిక్ డబ్ల్యూ. ఫ్రాంజ్, జపాను దర్శించారు, క్యటూలో ప్రత్యేక సమావేశము ఏర్పాటుచేయబడింది. మా అమ్మను సమావేశానికి హాజరుకమ్మని నాన్న బలవంతము చేసారు. మమ్మల్ని అనారోగ్య పరిస్థితిలో వదలివెళ్లుటకు యిష్టపడకపోయినప్పటికీ, ఆమె నాన్నకు విధేయురాలై సమావేశానికి వెళ్లింది.
అటు తరువాత వెంటనే నాన్న పరిస్థితి రోజురోజుకు క్షీణించటం ప్రారంభమైంది. మేము ప్రక్కప్రక్క పడుకొని వుండడంవలన, నేను చింతించటం ఆరంభించి, మనలను మనము పోషించుకోటం ఏలాగని నేను ఆయనను అడిగాను. దానికి ఆయన యిచ్చిన సమాధానము: “మనము యెహోవా దేవుడ్ని ఆరాధిస్తున్నాము, మన ప్రాణాలను ప్రమాదానికి గురిచేసుకున్నాము, ఆయన అద్వితీయ దేవుడు. నీవెందుకు చింతిస్తావు? మనకేమి అవసరమో వాటిని యెహోవా తప్పిపోకుండా అందించగలడు.” ఆయన చాలా మృదువుగా నాకు బుద్ధిచెపుతూ, యిలా అన్నారు: “నీలో నీవే దృఢమైన విశ్వాసాన్ని పెంపొందించుకో.”
మార్చి 24, 1957న మానాన్నగారు నెమ్మదిగా తన అంతిమ శ్వాసను విడిచారు. ఆయన అంత్యక్రియల తరువాత నేను ఆయన పనిచేసిన విషయాలన్నీ వారితో పరిష్కరించటానికి ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లాను. నేను అక్కడినుండి వచ్చేస్తుంటే, ఆ బ్రాంచి మేనేజరు ఒక పేపరు సంచీని అందిస్తూ యిలా అన్నాడు: “యిది మీ తండ్రిగారిది.”
ఇంటికి తిరిగివచ్చిన తరువాత చాలా పెద్ద మొత్తంలో ధనం లోపలున్నదని, నేను తెలుసుకొన్నాను. కొంతకాలము పిదప నేను మేనేజరును దానిగూర్చి అడిగితే, అది నాన్న జీతములోంచి ప్రతి మాసము తనకు తెలియకుండ తగ్గించబడిన ప్రిమియం డబ్బు అని నాకు వివరించాడు. అలా నాన్న మాటలు, “మనకేమి అవసరమో వాటిని యెహోవా తప్పకుండా అందజేస్తాడు,” అనేవి సత్యమని రుజువయ్యాయి. యిది యెహోవా సంరక్షణా శ్రద్ధనుగూర్చిన నా విశ్వాసాన్ని గొప్పగా బలపరచింది.
దశాబ్దాలుగా కొనసాగిన సేవ
ఆ డబ్బుద్వారా వస్తుదాయక సహాయంతో యింటిదగ్గర వుండి స్వస్థత పొందడంపై ఏకాగ్రత నిలిపాను. ఒక సంవత్సరం తరువాత, 1958లో, మాఅమ్మ నేనుకూడ ప్రత్యేక పయినీర్లుగా నియమితులైనాము. ఆ తరువాత, నేను ప్రయాణకాపరిగా జపానులో పనిచేసాను, తరువాత 1961లో న్యూయార్క్‌నందలి బ్రూక్లిన్‌లోని ప్రధాన కార్యాలయమునందు జరిగే పదినెలల గిలియడ్ పాఠశాలకు హాజరయ్యే ఆధిక్యత నాకు కలిగింది.
నేను జపానుకు తిరిగి వచ్చిన తరువాత, మరల ప్రయాణకాపరిగా సంఘాలకు సేవచేయడం ఆరంభించాను. తరువాత, 1963లో నేను యాసూకో హాబాను వివాహమాడాను, ఆమె టోక్యోలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో పనిచేస్తుంది. 1965 వరకు ఆమె నాతో ప్రయాణకాపరి పనిలో చేరింది, దానిలో కొనసాగుతుండగా మేము టోక్యోలోని బ్రాంచి కార్యాలయములో పని చేయటానికి ఆహ్వానింపబడ్డాము. అప్పటినుండి మేము యిద్దరం కలిసే సేవచేస్తున్నాము—మొదటిగా టోక్యో ప్రాంతంలోని బ్రాంచినందు, అటుతరువాత నూమాజూ, యిపుడు ఇబీనాలో వున్నాము.
మా అమ్మ 1965 వరకు ప్రత్యేక పయినీర్‌గా వుంది. అప్పటినుండి ఆమె చాలామంది బైబిలు సత్యాలను అంగీకరించుటకు సహాయం చేస్తూ చురుకుగా పనిచేస్తూనేవుంది. యిపుడు ఆమెకు 79 సంవత్సరాలు కాని పోల్చిచూస్తే ఆరోగ్యంగానేవుంది. ఆమె యిక్కడకు దగ్గరలోనే వుంటూ ఎబీనా బ్రాంచి కార్యాలయానికి సమీపంలోవున్న మా సంఘానికే హాజరవుతూండటంవల్ల మాకానందంగానే వుంది.
హిరోషిమాపై పడిన ఆటంబాంబునుండి మానాన్నగారు రక్షించబడినందుకు నిజంగా మేము యెహోవాదేవునికి కృతజ్ఞతను తెలియజేస్తున్నాము. ఆయన తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. నూతనలోకంలో ఆయనను ఆహ్వానించాలని, ఆయన చూడాలని ఎంతగానో యిష్టపడిన యుద్ధమైన హార్‌మెగిద్దోను నుండి మేము ఎలా తప్పించుకొన్నామో ఆయనకు వివరించాలని నాకు కోరికగావుంది. (ప్రకటన 16:14, 16; 21:3, 4)—అని ట్సుటోమూ ముయిరా చెప్పారు. (g94 10/8)
[అధస్సూచీలు]
a మాట్స్ ఇషీయొక్క జీవిత కథ కోసం దయచేసి ది వాచ్‌టవర్ మే 1, 1988, 21-5 పేజీలను చూడండి.
[12వ పేజీలోని చిత్రం]
తమ కుమారుడైన ట్సుటోమూ ముయిరాతో కాట్సువో మరియు హగినో ముయిరా
[16వ పేజీలోని చిత్రం]
ట్సుటోమూ ముయిరా జపాన్ బ్రాంచి కార్యాలయములో పనిచేస్తున్నాడు
[Picture Credit Line on page 14]
Hiroshima Peace and Culture Foundation from material returned by the United States Armed Forces Institute of Pathology