యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
దేవునిగూర్చి ఎందుకు మాట్లాడాలి?
“ప్రతిఒక్కరికి తమ సొంత మతమున్నది. మీరు మీ దేవుడి ప్రభావాన్ని యితరులపై ఒత్తిడి చేయడానికి ప్రయత్నించకూడదు.”—పద్నాలుగు సంవత్సరాల రాకేషే, గయానా.
“నేను నా తోటివారినుండి వచ్చే పరిహాసము విషయము సిగ్గుపడతాను కాబట్టి నేను దేవున్నిగూర్చి మాట్లాడడానికి సంకోచిస్తాను.”—పదిహేడు సంవత్సరాల రోహను, గయానా.
“మనము దేవున్నిగూర్చి మాట్లాడాలి ఆయన మన సృష్టికర్త, మనం మన జీవితాన్ని ఆయనకు అచ్చియున్నాము.”—పదమూడు సంవత్సరాల మార్కో, జర్మనీ.
ఒక యౌవనస్థుల గుంపు సంభాషణను మీరు జాగ్రత్తగా వింటే బహుశా మీరు ఒక విషాదకర ముగింపునకు రాగలరు: యౌవనస్థులలో అధికశాతము దేవున్నిగూర్చిన అంశము నిశ్చయముగా వారి సంభాషణలోకి రాదు. క్రీడలనుగూర్చి, దుస్తులనుగూర్చి, క్రొత్తగా వచ్చిన సినిమాలనుగూర్చి, లేదా వ్యతిరేకలింగ వ్యక్తులనుగూర్చి ప్రస్తావించండి, ఒక ఉత్సాహభరితమైన చర్చ ప్రారంభమవ్వడాన్ని మీరు సాధారణంగా చూస్తారు. తెగించి దేవున్నిగూర్చి చెప్పారో, అంతే, ఒక దట్టమైన పొగమంచులాగ వికారమైన నిశ్శబ్దము ఆవరిస్తుంది.
కొంతమంది యౌవనస్థులు దేవున్ని అసలు నమ్మరు. వాళ్లు ఆయన్ని చూడలేదు గనుక, ఆయన ఉనికిలో లేడని—ఆయననుగూర్చి మాట్లాడడం సమయాన్ని వృథా చేయడమని వారి భావము. అయినప్పటికీ, నాస్తికుల సంఖ్య యౌవనస్థులలో ఖచ్చితంగా తక్కువే. గాలప్ చేసిన సర్వే ప్రకారము, అమెరికాలోని 95 శాతం యౌవనస్థులు దేవుని నమ్ముతారు. వాస్తవానికి, గాలప్ యిలా ముగిస్తూ: “చాలామంది యౌవస్థులలో దేవున్నిగూర్చిన వారి నమ్మకము అస్పష్టమైన, ప్రత్యేకించబడిన సూత్రముపై కాదుగాని, వారి చర్యలను గమనిస్తూ తదనుగుణంగా శిక్షను లేక ప్రతిఫలమును యిచ్చే వ్యక్తిగత దేవున్ని నమ్ముతారు.” అయితే, చాలామంది యౌవనస్థులు వాళ్లు ఏమి నమ్ముతారో ఆ విషయాన్ని మాట్లాడడానికి ఎందుకు సంకోచిస్తారు?
ఎందుకు కొంతమంది సంకోచిస్తారు?
మతపరమైన ఆలోచనలను ఎవరికి వారే ఉంచుకోవాలిగాని వారి విశ్వాసాన్నిగూర్చి మాట్లాడడం సంస్కార సహితమైనదికాదని చాలామంది తలస్తారు. కొంతమంది యౌవనులను దేవున్నిగూర్చి చర్చించమనే ఆలోచనే కలవరపరుస్తుంది. ‘అది అంగీకరించబడే విషయముకాదు’ అని తర్కిస్తారు.
మీతోటి సహవాసుల అభిప్రాయమేమైనప్పటికీ, ఈ విషయంలో మీ స్థానమేమిటి? మీరు యెహోవాసాక్షులలో ఒకరిగా పెంచబడినట్లయితే ఈ ప్రశ్న ప్రాముఖ్యంగా యుక్తమైనది. ఎందుకు? సాక్ష్యమివ్వటము, దేవున్నిగూర్చి యితరులతో మాట్లాడటము, ఆ విశ్వాసానికి ఎంతో ప్రాముఖ్యమైయున్నది!—యెషయా 43:9, 10; మత్తయి 24:14.
ఇలా వున్నప్పటికీ, అప్పుడప్పుడు వారికి ఎదురయ్యే విరోధమునుబట్టి, కొంతమంది యౌవనసాక్షులు బహిరంగముగా ప్రకటించేపనిలో భాగము వహించడానికి వెనుకంజవేస్తారు—లేదా వారి తల్లిదండ్రులు సమ్మతిస్తేనే వాళ్లు పాల్గొంటారు. మరికొంతమంది పాల్గొంటారు గాని అలా చేస్తున్నప్పుడు వారిని ఏ పాఠశాల స్నేహితులూ చూడకూడదని లోలోపల అనుకుంటారు. పాఠశాలలోనైతే, కొందరు వారి మతపరమైన నమ్మకాలను ఒక రహస్యంగా వుంచుకోటానికి ప్రయత్నిస్తారు. తరచు వారి తోటి విద్యార్థులనుండి హేళనను పొందుతామేమోనని భయపడ్తుంటారు. “నేను దేవున్నిగూర్చి మాట్లాడడానికి భయపడేవాణ్ణి” అని యౌవనస్థుడైన రయన్ ఒప్పుకొన్నాడు, “నా సహవాసులు నన్ను మారు పేర్లు పెట్టి పిలిచేవారు గనుక నాకు ఆ సంభాషణను కొనసాగించటానికి ధైర్యము చాలకపోయేది.”
బైబిలులో యివ్వబడిన ప్రమాణముల ప్రకారంగా పూర్తిగా జీవించలేమని కొందరు భయపడ్తారు గనుక వెనుకంజ వేస్తారు. “యౌవనేచ్ఛల” వలన ఆకర్షితులై ఏదైనా తప్పుచేసే అవకాశమున్నది గనుక ఒక క్రైస్తవునిగా గుర్తింపును కలిగిలేకుండడమే మేలని ఆలోచిస్తారు.—2 తిమోతి 2:22.
కొంతమంది దేవున్నిగూర్చి మాట్లాడరు ఎందుకంటే వాళ్లు దానికి యోగ్యులు కారని భావిస్తారు. పందొమ్మిది సంవత్సరాల విల్టన్ యీ విధంగా వ్రాశాడు: “నా తోటివారితో దేవున్నిగూర్చి మాట్లాడడం కష్టంగా భావించాను ఎందుకంటే నేను ఆయననుగూర్చి చెప్పిన విషయాలను ప్రతివాదము చేయడానికి నాకు అంత అర్హతలేదని భావించాను. నా నమ్మకాల విషయమై సవాలు చేస్తే, నేను తృప్తికరమైన సమాధానాలు యివ్వలేనని భావించాను.”
ఒక క్రైస్తవ కర్తవ్యము
దేవున్నిగూర్చి మాట్లాడడానికి వెనుకంజ వేయడానికి మీరుకూడా అలాంటి కారణాలను కలిగివున్నారా? అయినట్లైతే, కేవలం మీరు మాత్రమే అలా భావించడంలేదు. యితర యౌవనులుకూడా యిదే భావాలతో పోరాటం సాగిస్తున్నారు. ఏమైనప్పటికీ, ఒకనిని నిరుత్సాహపర్చడానికి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ, దేవునిగూర్చి యితరులతో మాట్లాడుటకు బలవంతపెట్టే కారణాలున్నాయని అనేకులు గుణగ్రహించారు. వాటిలో కొన్ని ఏమిటి?
మొదట ప్రస్తావించబడిన యౌవనస్థుడైన మార్కో, దేవున్నిగూర్చి చక్కగా చెప్పాడు “ఆయన మా సృష్టికర్త మరియు మా జీవితాన్ని ఆయనకు అచ్చియున్నాము.” (ప్రకటన 4:11) ఔను, జీవము అనేది ఒక ప్రశస్తమైన బహుమానము. కీర్తనల రచయిత దేవున్ని గూర్చి యిలా చెప్పాడు: “నీయొద్ద జీవపు ఊట కలదు.” (కీర్తన 36:9) ఈ బహుమానాన్ని పొందికూడా, దానియెడల మీరు కృతజ్ఞతను చూపకూడదా?
యితరుల సమక్షములో యెహోవా దేవున్ని సుత్తించుట కృతజ్ఞత చూపించుటకు ఒక మార్గము. సూర్యుడు, చంద్రుడు, వర్షము, మనము పీల్చే గాలి మరియు మనము తినే ఆహారమునకు ఆయనే మూలాధారుడు. (అపొస్తలుల కార్యములు 14:15-17) “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతివరమును, పరసంబంధమైనది,” అని శిష్యుడైన యాకోబు చెప్పాడు. (యాకోబు 1:17) యీ బహుమానాలన్నింటి నిమిత్తమై మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారా? (కొలొస్సయులు 3:15) దేవున్నిగూర్చి మాట్లాడడంకన్నా మీ కృతజ్ఞతను వ్యక్తం చెయ్యడానికి శ్రేష్ఠమైన మార్గమేముంది?—లూకా 6:45.
నిజానికి, దేవుడు తననుగూర్చి మాట్లాడమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, క్రైస్తవులకు ఆజ్ఞాపిస్తూ: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని చెప్పాడు. (మత్తయి 28:19, 20) యీ బాధ్యతాయుతమైన పనిలో భాగం వహించటానికి యౌవనులు మినహాయింపబడలేదు. కీర్తనల రచయిత యిలా ఆజ్ఞాపిస్తున్నాడు: “యెహోవాను స్తుతించుడి . . . యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.” (కీర్తన 148:7, 12, 13) అయితే మీరు యీ పనిని భారంగా దృష్టించకూడదు. వాస్తవానికి, యిది ఒక ఆధిక్యత—నిజానికి మీరు “దేవుని జతపనివారు” కాగలరు.—1 కొరింథీయులు 3:9.
మీరు దానికి అర్హత లేనివారిగా భావిస్తే ఏమిటి? బైబిలు కాలాల్లోకూడా ప్రవక్తయైన యిర్మీయా అదే భావాలను కలిగియున్నాడు. “అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని” ఆయన పలికాడు. యెహోవా ప్రతిస్పందన ఏమిటి? “నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను.” (యిర్మీయా 1:6, 7) యెహోవా సహాయంతో యిర్మీయా దానిని 40 సంవత్సరాలపాటు చేసాడు!
అదేరీతిగా ఈనాటి క్రైస్తవులకుకూడ, వారి “యుక్తమైన అర్హత దేవునివలననే కలిగియున్నది.” (2 కొరింథీయులు 3:5) సహజంగానే మీరు సిగ్గుపడువారుగా, కలుపుగోలుతనము లేనివారుగా ఉంటే ధైర్యంగా మాట్లాడుటకు దేవుడు మీకు సహాయం చేస్తాడు. క్రైస్తవ సంఘంలోకూడా దేవుని వాక్యముయొక్క “యుక్తమైన అర్హత” గల బోధకులగుటకు మీకు సహాయపడే అనేక యేర్పాట్లున్నాయి. మీకు కొంత వ్యక్తిగత సహాయం అవసరముందని మీరు భావిస్తే, సంఘాధ్యక్షుల్లో ఒకరితో ఎందుకు మాట్లాడకూడదు? ఆ విషయం వ్యక్తిగత బైబిలు పఠన అలవాట్లను పెంపొందించుకోవడమో, లేదా యింకా అనుభవంగలవారితో పనిచెయ్యడమైనా కావచ్చు.
మీరు ఏమి సాధించగలరు
దేవుడ్నిగూర్చి మాట్లాడటం నిజమైన సాఫల్యభావమును యివ్వగలదు. ఎందుకంటే, మీ తోటివాళ్లలో చాలామంది జీవిత సమస్యలకు సమాధానాలకొరకు వెదుకుతూ అధిక ఆసక్తికలిగి వున్నారు. వారికి మార్గదర్శక లోపమున్నది, భవిష్యత్తునుగూర్చి స్పష్టమైన దృష్టిని వాళ్లు కలిగిలేరు. ‘మనమెందుకు యిక్కడ వున్నాము? మనమెక్కడికి వెళ్తున్నాము? లోకమంతా ఎందుకు యిన్ని బాధలతో నిండివుంది?’ అని వాళ్లు ఆలోచిస్తుంటారు. ఒక క్రైస్తవునిగా మీరు జవాబులను కలిగివున్నా, మీతోటివారికి ఆ జ్ఞానాన్ని తెలియజేయటానికి మీరు మంచి స్థానంలో వున్నారు. వాళ్లు మీతోనే వారి సమస్యలను చెప్పటానికి యిష్టపడతారు ఎందుకంటే పెద్దవాళ్లతో చెప్పేకన్నాకూడా వారి వయస్సులోవున్న వారితో మాట్లాడడానికి యిష్టపడతారు.
వాస్తవమే, కొన్నిసార్లు తిరస్కారాన్ని మీరు ఎదుర్కొనవలసి వస్తుంది. కాని బైబిలులోని సమాచారమును స్వీకరించునట్టి వ్యక్తులనుకూడ మీరు కనుగొనగలరు. ఒక యౌవనసాక్షి బస్సులో కూర్చొని తన వ్యక్తిగతకాపీయైన క్వశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్a అనే పుస్తకాన్ని చదువుతూవున్నది. తన ప్రక్కనే కూర్చొన్న అబ్బాయికూడ ఆమెతోపాటు చదవటము మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి ఒక్కసారి ఆశ్చర్యముతో “యిది చాలా మంచి పుస్తకము!” అని చెప్పాడు. “యీ పుస్తకము దేవునిగూర్చి చాలా చెపుతుంది. చాలామంది వ్యక్తులు మతమునందు ఆసక్తి కలిగిలేరు.” ఆ యౌవనసాక్షి యీ ఆవకాశమును వుపయోగించుకొని దేవుని నామము అనే అంశమునుగూర్చి లోతైనరీతిగా విషయాలను చర్చించింది.
నిజమే, మీరు క్రైస్తవునిగా గుర్తింపబడిన తరువాత ఆవిధంగా ప్రవర్తించ బద్ధులైవున్నారు. (1 పేతురు 2:12) అయితే మీ సమాచారమునకు మీ క్రైస్తవ నడవడికూడా యోగ్యతను జోడిస్తుంది. యౌవనస్థుడైన ఎరిక్‌యొక్క అనుభవాన్ని పరిశీలించండి. అతడు పాఠశాలలో యౌవనసాక్షుల శ్రేష్ఠమైన నడవడిద్వారా ప్రభావితుడయ్యాడు. యిది ఆసక్తితో దేవున్నిగూర్చి అధికంగా తెలుసుకోటానికి అతనిలో ఉత్సాహమును పుట్టించింది. అతనితో బైబిలు పఠనము ప్రారంభించబడింది, ఆయన యిప్పుడు బాప్తిస్మము పొందిన క్రైస్తవునిగా యెహోవాసాక్షుల ప్రపంచ ముఖ్య కార్యాలయంలో పనిచేస్తున్నాడు.
దేవున్నిగూర్చి మాట్లాడటము మీకు సహాయము చేస్తుంది. అది సంరక్షణను కలిగించటానికి తోడ్పడుతుంది. మీరు యెహోవాసాక్షుల్లో ఒకరని మీతోటివారు తెలిసికొన్నపుడు, వాళ్లు మిమ్ములను గౌరవిస్తారు. వాళ్లు మీయొక్క ఉన్నత నైతిక స్థాయిని గుర్తించినప్పుడు చెడుకార్యములో భాగము వహించటానికి వాళ్లు మిమ్మల్ని వత్తిడి చేయటానికి వెనుదీస్తారు, అదే అవకాశము చేసికొని మీరు ప్రత్యుత్తరముగా వాళ్లకు సాక్ష్యము యిస్తారని వాళ్లు తెలుసుకుంటారు.
అంటే, మీరు వాళ్లతో మాట్లాడిన ప్రతిసారికూడా లేఖనాలను ప్రసావించాలని దీని భావముకాదు. మీరు క్రీడల్లో, దుస్తుల్లో, లేదా సంగీతమునుగూర్చికూడా ఆసక్తి చూపి అపుడపుడు మాట్లాడవచ్చు. కాని జ్ఞాపకముంచుకోండి: “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.” (మత్తయి 12:34) మీరు హృదయములో నిజంగా దేవున్ని ప్రేమిస్తే, సహజంగానే మీరు ఆయననుగూర్చి మాట్లాడడానికి యిష్టపడతారు. మీరు యింకా ప్రభావవంతంగా అలాచేయటానికి రాబోవు శీర్షికలయందు కొన్ని మార్గాలు మీకొరకు చర్చించబడతాయి. (g94 9/22)
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిలు అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ఇంక్ ప్రచురించినది.
[19వ పేజీలోని చిత్రం]
మీరు బహిరంగ ప్రకటనాపనిలో భాగము వహించుచుండగా మీతోటి విద్యార్థులు చూసినపుడు మీరు సిగ్గుపడతారా?