సత్ప్రవర్తన “నూతన నైతికత”చే తిరస్కరించబడిందా?
‘కీడు మేలనియు, చీకటి వెలుగనియు, చేదు తీపి అనియు ఎంచుకొనువారికి శ్రమ.’—యెషయా 5:20.
సత్ప్రవర్తన, నైతిక విలువలలో 20వ శతాబ్దము గొప్ప మార్పులను వీక్షించింది. రెండు ప్రపంచ యుద్ధాల తరువాత వచ్చిన దశాబ్దాలలో, క్రమేణా పాత విధానంలోని విలువలు క్రమముగా పనికిరానివిగా దృష్టించబడ్డాయి. మారుతున్న పరిస్థితులు, మానవ ప్రవర్తనా రంగములో క్రొత్త సిద్ధాంతాలు, వైజ్ఞానిక శాస్త్రము కలిసి పాత పద్ధతులన్నీ ఇక ఎంతమాత్రము పనికిరావని ఒక నిర్ధారణకు వచ్చాయి. ఒకప్పుడు ఉన్నతముగా ఎంచబడిన సత్ప్రవర్తన అనవసరమైన భారంగా త్రోసివేయబడింది. ఒకప్పుడు గౌరవించబడిన బైబిలు నిర్దేశక సూత్రాలు పాతకాలానికి చెందినవిగా తిరస్కరించబడ్డాయి. 20వ శతాబ్దానికి చెందిన స్వతంత్రించబడిన అత్యంత ఆధునిక వ్యక్తుల సమాజానికి వారి యథేష్టతకు అవి చాలా ఎక్కువగా నిర్బంధాన్ని కలిగించేవిగా ఉన్నాయి.
మానవ చరిత్రలో ఈ మలుపును చూసిన సంవత్సరము 1914. ఆ సంవత్సరమునుగూర్చి, మొదటి ప్రపంచయుద్ధాన్ని గూర్చి చరిత్రకారుల వ్రాతలు చూపేదేమంటే 1914 ఒక ప్రబలమైన మార్పు తెచ్చిన సంవత్సరంగా ప్రకటించబడింది, మానవ చరిత్రలోని యుగాలను విభజింపజేసేదిగా గుర్తించబడింది. రోరింగ్ ట్వెంటీస్ అనే సమయంలో ప్రజలు యుద్ధము ముగిసిన వెంటనే వారు యుద్ధం జరిగే కాలంలో కోల్పోయిన ఆనందాన్ని పూరించటానికి ప్రయత్నించారు. పాత పద్ధతులు, అసౌఖర్యమైన నైతిక నిర్బంధాలు త్రోసివేయబడి, హాస్య ఆర్భాటానికి ఒక మార్గమును ఏర్పాటుచేసింది. నూతన నైతికత, యథేచ్ఛగా శరీరాశలు తీర్చుకోవడం, ఏదైనా చెల్లుతుందనే భావనను స్థాపించాయి. ఈ నూతన నైతిక పద్ధతి అనివార్యమైనరీతిగా సత్ప్రవర్తనలో ఒక మార్పును తెచ్చింది.
చరిత్రకారుడైన ఫెడిరిక్ లేవిస్ అలెన్ దానిపై యిలా వ్యాఖ్యానించాడు: “ఈ విప్లవంయొక్క మరొక ఫలితమేదనగా ఆ సత్ప్రవర్తన కేవలము భిన్నంగా మారటంకాదు, అయితే—అది కొన్ని సంవత్సరాలకు—అమర్యాదగా మారింది . . . ఈ దశకంలో ఆతిధ్యమిచ్చేవారిలో . . . వారి అతిధులు వచ్చినప్పుడైనా లేక వెళ్లేటప్పుడైనా వారితో మాట్లాడడానికి ప్రయత్నించరు; నాట్యంతోకూడిన విందులు చేసే సమయాల్లో ఆహ్వానించకుండానే ప్రవేశించటము అంగీకరించబడిన అలవాటుగా మారింది, భోజన సమయాలకు ప్రజలు ‘ఆలస్యముగా రావటము ఫ్యాషన్‌గా మారింది, క్షమాపణకూడా కోరకుండా, కాలుతున్న సిగరెట్టులు అలాగే విడిచివెళ్లడము, వాటి బూడిదంతా కార్పెట్పైననే విడిచిపోవడము చేసేవాళ్లు. పాత హద్దులు తొలగిపోయాయి, క్రొత్తవి స్థాపించబడలేదు, ఈలోగా మర్యాదలేనివారు తమకు యిష్టమొచ్చినట్లు ప్రవర్తించసాగారు. యుద్ధము ముగిసిన తరువాత వచ్చిన పది సంవత్సరాలు మర్యాదలేని దశకంగా భవిష్యత్తులో పిలువబడవచ్చును. . . . ఆ దశకము మర్యాదలేనిదిగా వున్నందున, అది చాలా అసంతోషకరమైనదిగా ఉండెను. పాత పద్ధతులతోసహా జీవితానికి ఔన్నత్యాన్ని, అర్థానిచ్చే విలువలుకూడ గతించి పోయాయి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ విలువలను త్వరగా ప్రవేశపెట్టలేము.”
ఔన్నత్యమును, జీవితానికి అర్థమును ఇచ్చు ప్రత్యామ్నాయ విలువలను యింతవరకు కనుగొనలేదు. తరువాత వాళ్లు వాటిని వెదకలేదు. రోరింగ్ట్వెంటీస్ అనే కాలంలో నైతిక నిర్బంధాలు, ఏదైనా చేయవచ్చు అనే జీవన విధానము ప్రజలకు ఉత్తేజము కలిగించి బాగా నచ్చింది. వాళ్లు నైతికతను ప్రక్కకు నెట్టివేయలేదు; కేవలము వాటిని సరిదిద్దుటకు చూశారు, కొద్దిగా సడలించారు. ఆ తరువాత దానినే నూతన నైతికతగా పిలిచారు. దాని ప్రకారముగా ప్రతిఒక్కరి దృష్టిలో వాళ్లకు యోగ్యమైనదిగా కన్పించినది చేస్తారు. అతడే శ్రేష్ఠుడని తలస్తాడు. అతనికి యిష్టమైనదే అతడు చేస్తాడు. అతని సొంతమార్గమే అతడు అనుసరిస్తాడు.
లేక అతడు అలా ఆలోచిస్తుంటాడు. వాస్తవానికి, మూడు వేల సంవత్సరాల క్రితం, జ్ఞానియైన సొలొమోను రాజు యిలా చెప్పాడు: “సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.” (ప్రసంగి 1:9) దానికి కొంచెము ముందు, న్యాయాధిపతుల కాలములో, ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రానికి విధేయులుగా వుండాలా లేదా అనే విషయంలో స్వేచ్ఛను కలిగియుండిరి: “ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను.” (న్యాయాధిపతులు 21:25) అయితే అధిక శాతము మంది ధర్మశాస్త్రాన్ని పాటించేందుకు అయిష్టతను చూపారు. యీవిధంగా నాటుటద్వారా, ఇశ్రాయేలు జనాంగము వందల సంవత్సరాలు విపత్తును కోసింది. అదేరీతిగా, ఈనాడు జనాంగాలుకూడ శతాబ్దాల వేదనను మరియు బాధను అనుభవించాయి—అయితే మిక్కిలి చెడ్డది యింకా రావల్సివుంది.
మరొక పదముకూడ ఆ నూతన నైతికతను విశేషంగా గుర్తిస్తుంది అదేమనగా “సాపేక్షతత్త్వము.” వెబ్స్టర్స్ నైంత్ న్యూ కాలేజియేట్ డిక్షనరీ దాన్ని యిలా నిర్వచిస్తుంది: “నీతిశాస్త్ర సత్యాలు వ్యక్తులపైన, గుంపుల అధికారముపైన ఆధారపడివుంటాయి అనే దృష్టి.” ఒకమాటలో చెప్పాలంటే సాపేక్షతత్త్వ శిష్యులు వాళ్లకు ఏది మంచిది అన్పిస్తే అదే వాళ్లకు నీతిశాస్త్రముగా పరిగణిస్తారు. ఒక వ్రాతగాడు సాపేక్షతత్త్వంను యింకా పొడిగిస్తూ యిలా చెప్పాడు: “సాపేక్షతత్త్వము, ఉపరిభాగము క్రింద చాలాకాలం దాగియుండి, అది 1970 దశకంలో పైకితేలి నేనే మొదట అనే తత్త్వజ్ఞానంగా వ్యాప్తిచెందింది; అది యిప్పుడు 1980వ దశకంలో బాగా డబ్బును ఆర్జించి విలాసాలపై ఖర్చుపెట్టే వారిలో కన్పిస్తుంది. మనం యిప్పటికి పారంపర్యాచార విలువలను నోటితో చెబుతాంగాని, అవి ఆచరణలోకి వచ్చేసరికి, మనకు ఏది మంచిదో అదే న్యాయమైనదిగా భావిస్తున్నాము.”
దానిలోనే సత్ప్రవర్తనకూడ యిమిడివుంది—‘నాకు తగినదైతే, నేను దానిని చేస్తాను; తగినది కాకపోతే, నేను చేయను. నీకు అది సత్ప్రవర్తనగా వుండవచ్చు కాని నాకు అది సరిగా ఉండదు. అది నా ప్రత్యేక వ్యక్తిత్వమును పాడుచేస్తుంది, నేను బలహీనునిగా కనబడునట్లు చేస్తుంది. నన్ను నిస్సహాయునిగా చేస్తుంది.’ స్పష్టంగా, అటువంటి వ్యక్తులకు కేవలం వారి మొరటు చర్యలకే యిది పరిమితము కాదుగాని ప్రతిదినములోని మంచిపద్ధతులైన ‘ప్లీజ్, ఐ యామ్ సారీ, ఎక్స్క్యూస్మీ, థ్యాంక్యూ, నీ కోసం నేను తలుపు తెరవనా, ఫర్వాలేదు, నా స్థలములో కూర్చో, నీ కోసం ఆ బరువు నేను మోయనా’ అనేవి కూడ యిమిడివున్నాయి. యివి, మరికొన్ని పదములు మానవులతో మన సంబంధాలను మృదువుగా సాగిపోయేలా చేసి సంతోషాన్నివ్వగలవు. ‘అయితే యితరులయెడల సత్ప్రవర్తన చూపాలంటే,’ ‘నేను శ్రేష్టునిగావుండాలనే నా ప్రస్తుత జీవితవిధానంపైన వ్యతిరేక ప్రభావమును చూపుతుంది’ అని నేనే-మొదట అని నమ్మేవ్యక్తి అభ్యంతరము చెపుతాడు.
సాంఘిక తత్త్వవేత్త జేమ్స్ క్యూ. విల్సన్ ఈనాడు, ప్రబలిన సంఘర్షణ, నేరప్రవృత్తికి కారణము “అవహేళనతో ‘మధ్యతరగతి విలువలు,’ అని పిలువబడినవి అంతరించడం” అని వివరించాడు. మరియు ఆ నివేదిక యిలా కొనసాగింది: “ఈ విలువలు అంతరించి పోవడం—నైతిక సాపేక్షతత్త్వము పెరిగిపోవడం—అధికంగా పెరిగిన నేరస్థాయితో సంబంధము కలిగియుంది.” స్వయం వ్యక్తీకరణ ఎంత అమర్యాదకరమైనదిగా లేక నొప్పించేదిగా వున్నప్పటికీ, దానికి ఎటువంటి అడ్డంకునైనా నిరాకరించే ఆధునిక పోకడతో యిది కచ్చితంగా సంబంధాన్ని కలిగివుంది. మరొక సాంఘిక తత్త్వవేత్త జారెడ్ టైలర్: “మన సమాజము త్వరితగతిన ఆశానిగ్రహమునుండి వ్యక్తిగతముగా వారిని వారే వ్యక్తపరుచుకొను తత్త్వానికి మారింది, చాలామంది ప్రజలు పాతకాలపు విలువలను అణిచివేసేవిగా ఉన్నట్లు తిరస్కరిస్తున్నారు.”
సాపేక్షతత్త్వాన్ని పాటిస్తున్నట్లయితే మీ వ్యక్తిగత ప్రవర్తననుగూర్చి మీరే నిర్ణయిస్తారు, మరొకరి తీర్పును లేదా దేవుని తీర్పునుకూడ ప్రక్కకు త్రోసివేస్తారు. ఏది న్యాయమైనదో, ఏది తప్పో మీకు మీరే నిర్ణయించుకుంటారు, ఏదేనులో మొదటి మానవ జంట దేవుని శాసనమును తిరస్కరించి, తమకుతామే ఏది మంచిదో, ఏది చెడ్డదో నిర్ణయించుకొన్నట్లుగా వుంటుంది. ఆ సర్పం హవ్వను మోసగించి, దేవునికి అవిధేయురాలై, నిషేధింపబడిన ఫలమును తిన్నట్లయితే, అపుడు యీ విధంగా మారవచ్చు అని ఆమె నమ్మేటట్లు చేసింది: “మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై” ఉంటారని చెప్పింది. అంతే హవ్వ ఆ ఫలముల్లో కొన్ని తీసుకొని తాను తిని, కొన్ని ఆదాముకుకూడ యిచ్చింది, అతడు తిన్నాడు. (ఆదికాండము 3:5, 6) ఆదాము హవ్వలు వాటిని తినాలని తీసుకున్న నిర్ణయం వారికి విపత్తును, మరి వారి సంతానానికి దుఃఖాన్ని తెచ్చింది.
రాజకీయనాయకుల్లోను, వ్యాపారస్తుల్లోను, క్రీడాకారుల్లోను, వైజ్ఞానికుల్లోను నోబుల్ బహుమతి పొందిన వ్యక్తిలోను, ఒక మతగురువులోను కనుగొన్న అవినీతిగూర్చి ఒక విస్తృతమైన వివరణను యిచ్చిన, ఒక పరిశీలకుడు హర్వార్డ్ బిజినెస్ పాఠశాలలో యిచ్చిన ఒక ప్రసంగములో యిలా చెప్పాడు: “ఈనాడు మనదేశములో మనమనుభవిస్తున్న దానినే నేను స్వభావ సంక్షోభమని పిలుస్తాను, పారంపర్యాచారముద్వారా వచ్చిన పాశ్చాత్య నాగరికతలో అంతర్గత ప్రతిబంధాలను, అంతర్గత సద్గుణాలను, బయటకు రాకుండ అణిచివేస్తూ, మన నీచమైన స్వాభావిక ప్రవృత్తిని సంతృప్తిపరుస్తున్నాము.” ఆయన యింకా యిలా కొనసాగించాడు “యీ పరిసరాల్లో వింతైనవిగా తోచే పదాలనుగూర్చి ధైర్యము, గౌరవము, కర్తవ్యము, బాధ్యత, కరుణ, సభ్యమర్యాద—యీ పదాలన్నీ దరిదాపుగా ఉపయోగరహితమై పోయాయి.”
యూనివర్సిటీ కాంపస్లల్లో 1960వ దశాబ్దంలో, కొన్ని వివాదాలు విస్ఫోటించాయి. అనేకులు ‘దేవుడు లేడని, దేవుడు మరణించాడని, ఎక్కడ ఏమి లేదని, సర్వశ్రేష్ఠ విలువలు ఎక్కడలేవని, జీవితము పూర్తిగా అర్థరహితమని, జీవితంలోని శూన్యాన్ని అధిగమించాలంటే ఒకటే మార్గము వీరోచిత వ్యక్తివాదము’ అని కొందరు వాదించారు. హిప్పీలు పైన చెప్పిన దానిద్వారా ప్రభావితులై జీవితములోని శూన్యాన్ని జయించాలంటే ‘ముక్కుద్వారా కోకైన్ పీల్చటం, మారిజూనా పీల్చటం, విస్తృత ప్రేమ కలాపాల్లో పాల్గొనటం, తద్వారా వ్యక్తిగత శాంతిని పొందటానికి ప్రయత్నించారు.’ కాని వాళ్లు దాన్ని ఎన్నటికీ పొందలేకపోయారు.
సంస్థీకరించబడిన బహిరంగ ప్రదర్శనలు 60వ దశాబ్దంలో జరిగాయి. అవి కేవలం భ్రాంతులేకాదు గాని, అమెరికన్ సంస్కృతి వాటిని చేర్చుకొని చివరకు నేనే మొదట దశాబ్దము అనేది 1970లో ఉత్పన్నమయినది. మనం ఆ దశాబ్దంలోనికి కాలిడుతుండగా టామ్ ఉల్ఫ్, అనే సాంఘిక విమర్శకుడు, దాన్ని “నా దశకము” అని పిలిచాడు. దీన్నే క్రమేణా 80వ దశకంలో, కొంతమంది విరక్తిగా, “పేరాశ అనే సువర్ణయుగము” అని పిలిచారు.
ఇదంతాకూడ సత్ప్రవర్తనతో ఏ సంబంధమును కలిగివుంది? యిదంతా మిమ్మల్ని మీరే ప్రధమ స్థానంలో వుంచుకొనుటను గూర్చినదైయున్నది, అలా వుంచుకొంటే, మీరు యితరుల ముందు త్వరగా లోబడలేరు, వారిని ప్రధమవారిగా ఎంచలేరు, యితరులతో మంచి ప్రవర్తనను ప్రదర్శించలేరు. మిమ్మల్ని మీరే ప్రధమ స్థానములో వుంచుకొనుటద్వారా, మీకు మీరే, యథేచ్ఛగా ఒక విధమైన స్వయం-ఆరాధనను, అదే నా ఆరాధనను చేస్తున్నట్లవుతుంది. ఎవరైయితే అలా చేస్తారో వారిని బైబిలు ఎలా వివరిస్తుంది? అతడిని “విగ్రహారాధికుడైయున్న లోభి,” అని ‘ధనాపేక్షను, విగ్రహారాధన’ అని చూపుతుంది. (ఎఫెసీయులు 5:5; కొలొస్సయులు 3:5) అటువంటివారు వాస్తవంగా ఎవరిని ఆరాధిస్తారు? “వారి కడుపే వారి దేవుడు.” (ఫిలిప్పీయులు 3:19) నీతిబాహ్య ప్రత్యామ్నాయ జీవిత వైఖరులే అనేకులు ఎంపిక చేసికొని వాటినే నీతిగా భావించేవారి జీవన విధానంవలన కలిగే మరణకరమైన పర్యవసానాలు యిర్మీయా 10:23లో చెప్పబడిన మాటలు సత్యమని నిరూపించాయి: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”
బైబిలు ముందుగానే వీటన్నిటిని గ్రహించుటకొరకు “అంత్య దినాలను” ఒక హెచ్చరికగా చిత్రించుచు ప్రవచించింది, అదే 2 తిమోతి 3:1-5 లో న్యూ ఇంగ్లీష్ బైబిల్లో యిలా వ్రాయబడింది: “మీరు వాస్తవాన్ని ఎదుర్కోవాలి: యుగసమాప్తినందు లోకమంతా బాధలతోకూడిన సమయముగా వుంటుంది. మనుష్యులు తమను, ధనమును తప్ప మరొక దానిని ప్రేమించరు; స్వార్థము; వాళ్లే అహంకారులు, డంబములు పలికేవారు, మరియు దూషించెడివారు; తల్లిదండ్రులపై గౌరవము లేనివారు, కృతజ్ఞతలేనివారు, దైవభక్తిలేనివారు, అపవిత్రులు; పట్టువిడువక ద్వేషించేవారు, దుష్ప్రచారకులు, త్రాగుబోతులు, మరియు ఉగ్రులు, మంచితనమునకు దూరముగా వుండువారు, విశ్వాసఘాతకులు, సాహసకృత్యాలు చేసేవాళ్లు, స్వయం ప్రధానత్వములో విర్రవీగెవాళ్లు. దేవుని స్థానములో వినోదములను వుంచు మనుష్యులు, మానవులను పైపైన మతమును కాపాడుతూ వాస్తవానికి దాన్ని ఖండనచేసే స్థానములో నిలుబడేవాళ్లు. యిటువంటి వారిని దూరముగా వుంచుడి.”
దేవుని పోలికగా, ఆయన ప్రతిబింబముగా, సృష్టించబడిన మనము దానినుండి చాలాదూరము కొట్టుకొని పోయాము. ఆయన సంభావ్య లక్షణాలైన ప్రేమ, జ్ఞానము, న్యాయము మరియు శక్తి మనలో యింకా వున్నా అవి సమతుల్యతను కలిగిలేకపోవటము మరియు వక్రీకరించబడటము జరిగింది. మార్గము తిరగటానికి మొదటి మెట్టు పైన పేర్కొన్న బైబిలు వాక్యములోని చివరి వచనములో తెలియజేయబడింది. “యిటువంటి వారిని దూరముగా వుంచుడి.” క్రొత్త వాతావరణాన్ని వెతకండి, అది మీ అంతర్గత భావాలను మార్పు చేయగలదు. దీనిపై ఉపదేశించుచు జ్ఞానయుక్తమైన మాటలు కొన్ని సంవత్సరాల క్రితం డోరతీ తామ్సన్చే వ్రాయబడిన ది లేడిస్ హోమ్ జర్నల్ నందు వున్నాయి. బాల్యనేరాలను అధిగమించాలంటే, యౌవనస్థుని మెదడుకన్న అతని భావాలకు తర్ఫీదునివ్వాలి అని చెబుతూ ఆమె యిలా వ్యాఖ్యానించింది:
“పెద్దైన తరువాత వుండే అతని చర్యలు, దృక్పథాలు బాలుడుగా ఉన్నపుడుండే చర్యలు, దృక్పథాలే ఎక్కువగా నిర్ణయిస్తాయి. అయితే యివి మెదడుద్వారా కాదుగాని, అతని భావాలద్వారా ఉత్తేజపరచబడతాయి. ప్రేమించటానికి, ప్రశంసించటానికి, ఆరాధించటానికి, మనస్సులో వుంచుకొనటానికి మరియు త్యాగము చేయటానికి అతనికి పురికొల్పు లేక శిక్షణ యివ్వబడిన దాన్నిబట్టి అతడు చేస్తాడు. . . . దీనంతటిలో సత్ప్రవర్తన ఒక ముఖ్యపాత్రను వహిస్తుంది, మంచి ప్రవర్తనకు యితరులయెడల ఆసక్తిని వ్యక్తపరచుటలో తక్కువైన కావచ్చు లేక ఎక్కువైన కావచ్చు. . . . అంతర్గత భావాలు బాహ్య ప్రవర్తనపై ప్రతిబింబిస్తాయి, అయితే బాహ్య ప్రవర్తనకూడ అంతర్గత భావాలను వృద్ధిచేసికోటానికి తోడ్పడుతుంది. యితరులయెడల శ్రద్ధ కనపర్చేటపుడు హానికరంగా తలంచటం కష్టతరంగా వుంటుంది. ఆరంభంలో మంచి ప్రవర్తన బాహ్యంగా కనబడేదిగా వుండవచ్చు, అవి అరుదుగా అలా కొనసాగుతాయి.”
ఆమె యింకా పరిశీలించింది ఏమంటే అసాధారణ పరిస్థితులలో తప్ప, మంచితనమైనా, చెడ్డతనమైనా “మెదడుచే ప్రభావితం కాదుకాని, అది భావోద్రేకాలచేతనే ప్రభావితమౌతుంది” మరియు “నేరస్థులు వారిలోని ధమనులు కఠినపడుటవలన కాదుగాని, హృదయమును కఠినపరచుకొనుటవలన మాత్రమే అలా తయారవుతారు.” భావోద్రేకము మన ప్రవర్తనపై ప్రభావము చూపుతుంది గాని మనస్సుపైకాదు, మనము ఎలాంటి శిక్షణపొందుతామో, మనము ఎలాంటి చర్యలు చేస్తామో, అది మొదట వత్తిడి క్రింద చేసినా, మీ అంతర్గత భావాలపైన ప్రభావమును చూపుతూ, మీ హృదయాన్నే మార్చివేస్తుంది.
ఏమైనప్పటికి, ఒక వ్యక్తియొక్క అంతర్గత హృదయాన్ని మార్చటానికి అత్యుత్తమమైన ప్రేరేపిత సూత్రమును బైబిలు యిస్తుంది.
మొదటిదిగా ఎఫెసీయులు 4:22-24: “కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.”
రెండవదిగా కొలొస్సయులు 3:9, 10, 12-14: “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొనియున్నారు. కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.”
చరిత్రకారుడైన విల్ డురాంట్ యిలా చెప్పాడు: “అతి గొప్ప సవాలు కమ్యూనిజానికి వ్యతిరేకంగా వ్యక్తిత్వవాదము అనికాదు, యూరపుకు వ్యతిరేకంగా అమెరికా అనికాదు, తూర్పుకు విరుద్ధముగా పశ్చిమ దేశాలనికాదు, అది మానవులు దేవుడు లేకుండ జీవించగలరా అనే పెద్ద ప్రశ్న.”
విజయవంతమైన జీవితం జీవించాలంటే, మనం ఆయన ఉపదేశాన్ని లక్ష్యపెట్టాలి. “నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”—సామెతలు 3:1-6.
దయ మరియు యితరులయెడల మంచి ప్రవర్తనను కలిగియుండుట కొన్ని శతాబ్దములుగా నేర్చుకొన్నది అధికబరువుకాదు. బైబిలు నిర్దేశకసూత్రాలు పాతకాలానికి చెందినవి కానేకాదు, అయితే అవి మానవజాతికి నిత్యరక్షణను కలుగజేసేవిగా నిరూపించుకొంటాయి. ‘యెహోవా యొద్ద జీవపు ఊట కలదు,’ కావున యెహోవాలేకుండా, వాళ్లు జీవితం కొనసాగించలేరు.—కీర్తన 36:9. (g94 7/22)
[11వ పేజీలోని చిత్రం]
మనము ప్రవర్తించే విధానము, మొదట బలవంత పెట్టినట్లుండినను, అది అంతర్గత భావాలపై ప్రభావము చూపుతూ, హృదయాన్ని మారుస్తుంది
[10వ పేజీలోని బాక్సు]
భుజించే సమయంలో ప్రజలు అనుకరించగల సత్ప్రవర్తనను చక్కగా అనుకరించాలి
సిడార్ వాక్స్వింగ్స్, అందమైనవి, చక్కటి ప్రవర్తనను కలిగినవి, ఎంతో సాంఘికమైనవి, ఒక పెద్ద పొద నిండా పండిన బెర్రిపండ్లతో అన్ని కలిసి విందు చేస్తున్నాయి. కొమ్మతోపాటుగా ఒక పంక్తిగా వుండి, అవి పండును తింటాయి, అయితే ఏది ఏమి అసహ్యముగాకాదు. ఒక నోటినుంచి, మరొకనోటికి, ఒక బెర్రిపండును అందించుకుంటాయి, ఆఖరిపండునుకూడ ఆహ్లాదకరమయినరీతిగా భుజిస్తాయి. అవి ఎన్నటికి వాటి “పిల్లల”ను మరిచిపోవు, అలసిపోకుండ ఆహారాన్ని తీసుకొనివస్తూ, బెర్రి తరువాత బెర్రిని, ఆకలిగొనిన నోళ్లన్నీకూడ తృప్తిపడే పర్యంతము చేస్తాయి.
[క్రెడిట్ లైను]
H. Armstrong Roberts
[8వ పేజీలోని చిత్రం]
కొందరు యిలా చెబుతారు: ‘బైబిలును, నైతిక విలువలను చెత్తకుండీలో వెయ్యండి’
[9వ పేజీలోని చిత్రం]
“దేవుడు చనిపోయాడు”
“జీవితానికి అర్థమే లేదు!”
“మారిజునాపొగ త్రాగండి, కోక్‌ను పీల్చండి”
[Picture Credit Line on page 7]
Left: Life; Right: Grandville