ప్రపంచ పరిశీలన
టివి చూడని కుటుంబాలు
టివి చూడని కుటుంబాలనుండి వచ్చిన పిల్లలు ఎక్కువమంది ఉన్న ఒక పాఠశాలలో, టివి ఎక్కువగా చూచే కొద్దిమంది పిల్లలను తాము సుళువుగా గుర్తించగల్గుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. “కేజీ క్లాసు పిల్లలు సూపర్ హీరో ఆటలు ఆడుతూ, చంపి నరికి పొడిచినట్లు నటన చేస్తే, వారు టివి చూస్తున్నారని స్పష్టమైన నిదర్శనమని,” ఒక నిపుణురాలు వివరించింది. టివి చూడడం మానేసిన వాళ్లు ప్రయోజనాలను పొందుతున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. “మునుపు చాలావరకు, నాన్న పనికి వెళ్లక ముందు ఆయనను మేము చూసేవారం. తర్వాత ఆయన యింటికి వచ్చినప్పుడు ఆయన మాతోపాటు టివి చూసేవారు, తర్వాత మేము ‘గుడ్‌నైట్ నాన్నా,’ అని చెప్పి వెళ్లి పడుకునేవారము అంతే. ఇప్పుడు మాత్రం మేము ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నాము, మేమిప్పుడు నిజంగా సన్నిహితంగా ఉన్నామని,” 17 సంవత్సరాల బాలిక చెప్పింది. ఆమె యింకా యిలా చెప్పింది: “నాకు కుటుంబం ఏర్పడినప్పుడు, నేను టివి కొనను.” (g94 8/22)
చెత్తతో బిల్డింగులు నిర్మింపబడుతున్నాయా?
చైనా తన చెత్తను పడేయడంలో ఒక క్రొత్త పద్ధతిని కనుగొన్నది. పర్యావరణం మరియు పరిశుభ్రతను గురించిన బీజింగ్ పరిశోధనా ఇన్‌స్టిట్యూట్, చెత్తను బంకమన్నుతో కలిపి యిటుకలు తయారు చేసే పద్ధతిని యిటీవలనే కనుగొన్నది. చైనా టుడే అనే పత్రిక, నిర్మాణ పరిశ్రమ ద్వారా ఉపయోగించదగిన “ఉత్తమ శ్రేణి యిటుకలుగా,” ఆ ఉత్పాదనను పరిశ్రమ వర్ణించింది. కొద్ది నెలల్లోనే, ఒక యిటుకల ప్లాంటు, “46,884 టన్నుల చెత్తను ఉపయోగించి,” 5 కోట్ల 40 లక్షల యిటుకలను తయారు చేసింది. 1,000 నుండి 2,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కాల్చిన తర్వాత, ఆ యిటుకలు “మామూలు యిటుకలకంటే ఎంతమాత్రం అపరిశుభ్రమైనవి కావని,” చెప్పబడుతోంది. (g94 8/22)
ప్రమాదకరమైన బ్యాటరీలు
“ప్రివెంట్ బ్లైండ్‌నెస్ ఉతాహ్ సంస్థ తెల్పిన ప్రకారం” అమెరికాలో, “ప్రతి సంవత్సరం బ్యాటరీలు పేలడం వలన 6,000 మంది ప్రజల కార్నియా కాలుతుంది లేక వాళ్లు కళ్లజబ్బుకు గురౌతున్నారు.” వాహనాన్ని నడిపేవాళ్లు తమ వాహనాన్ని జంప్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదాల్లో అనేకం జరుగుతాయని స్నో కంట్రీ అనే పత్రిక నివేదిస్తుంది. బ్యాటరీనుండి వచ్చే నిప్పురవ్వలు గాలిలోని వాయువులకు మంట పుట్టించగలవు. ప్రమాదాన్ని అరికట్టడానికి జంప్ స్టార్ట్ చేసేటప్పుడు, “బ్లాక్ కేబుల్, బ్యాటరీ యొక్క నెగెటివ్ టర్మినల్‌కు బదులు, ఎక్స్‌పోజ్‌డ్ బోల్ట్‌వంటి పెయింట్ వేయని మెటల్‌కు కనెక్ట్ చేయబడి ఉండాలని పత్రిక చెబుతోంది. ప్రేలుడుకు దారి తీయడానికి వీలు కల్గజేసే విద్యుత్ మంటలు చెలరేగే ఆస్కారాన్ని తగ్గిస్తుంది.” దానికితోడు, కేబుల్‌లను చిక్కులేకుండా ఉంచాలి, మరి “జంప్ స్టార్ట్ చేసేటప్పుడు వాహనాన్ని నడిపేవాళ్లు రక్షణకరమైన కళ్లజోడును ధరించాలి.” (g94 8/22)
పూల శక్తి
మడగాస్కర్ ద్వీపంలోని చెట్లు, అవి కలిగున్న వైద్యపరమైన విలువనుబట్టి స్థానికులచేత ఎంతో విలువైనవిగా ఎంచబడుతున్నాయి. వేర్వేరు పూలనుండి తీయబడిన పదార్థాలు “జ్వరం, ఎగ్జీమాయేకాక కంతులవంటి వాటిని కూడా” బాగుపర్చడానికి ఉపయోగింపబడుతున్నాయని ఆఫ్రికా—ఎన్విరాన్‌మెంట్ & వైల్డ్‌లైఫ్ అనే పత్రిక నివేదిస్తుంది. అందమైన ఆర్చిడ్ కూడా ఉపయోగకరమైనదే. ఉదాహరణకు, (ఆంగ్రేసమ్ ఎబర్నేసమ్) అనే ఒక మొక్క వైరల్ ఇన్పెక్షన్స్‌ను తీసేయడానికి మరియు మృతపిండ స్రావాలను అరికట్టడానికి ఉపయోగింపబడేది. యిటీవలనే, లుకేమియాను నయం చేయగల మందుకు మూలం ఆ ద్వీపంలో కనుగొనబడింది—అదే రోసీ పెరివింకిల్ (కెథరాంతస్ రోసియస్). కానీ ఈ పూలనుండి ప్రజలు ఎంత కాలంవరకు ప్రయోజనం పొందగలరు? “చెట్లు నరకడం, వ్యవసాయం మరియు మైనింగ్ వంటి వాణిజ్య పద్ధతుల ద్వారా ప్రతిరోజు చెప్పలేనన్ని కనుగొనబడని జాతుల మొక్కలు అంతరిస్తున్నాయి” గనుక “వాటిని కాపాడడానికి పోరాడుతున్నామని,” ఆ నివేదిక వాపోతుంది. (g94 8/22)
పోగొట్టుకున్న కండరాలు
డైటింగ్ చేసేవారు ప్రాముఖ్యంగా శరీరంలోని క్రొవ్వును పోగొట్టుకోవాలన్న ప్రయత్నంలో కండరాలను కూడా పోగొట్టుకుంటే, డైటింగ్ ప్రమాదకరం కాగలదు. “మనం అనుదినం చేసే అనేక పనులకు కండరాలు ఎంత అవసరమంటే—మీరు దాన్ని పోగొట్టుకోకూడదని,” ఆరోగ్య విషయాలను గురించి వ్యాసాలు వ్రాసే రచయితైన వేన్ వెస్ట్‌కోట్ వివరిస్తున్నాడు. డైటింగ్ చేయని వాళ్లకు కూడా ఒకవేళ రోజంతా కూర్చునివుంటే కండరాలు కోల్పోయే ప్రమాదముంది. కూర్చునే గడిపే వ్యక్తి, ప్రతి పది సంవత్సరాలకు దాదాపు రెండు కిలోగ్రాముల కండరాలను కోల్పోయి, 7 కిలోగ్రాముల క్రొవ్వును పొందుతాడని అంచనా వేయబడింది. “స్నానాలగదిలోని స్కేలుపై, అది [5 కిలోగ్రాముల] బరువు పెరిగిన సమస్యను (15 పౌండ్లు [7 కిలోగ్రాముల] క్రొవ్వు 5 పౌండ్ల [2 కిలోగ్రాముల] కండరాల బరువును తీసివేస్తే) చూపిస్తుందని,” డా. వెస్ట్‌కోట్ గమనించారు. కానీ వాస్తవానికి అది 20 పౌండ్ల [9 కిలోగ్రాముల] సమస్య (15 పౌండ్లు [7 కిలోగ్రాముల] క్రొవ్వు ఎక్కువ అవ్వడంతోపాటు 5 పౌండ్లు [2 కిలోగ్రాముల] కండరాలు తగ్గిపోతున్నాయి).” ఆరోగ్యాన్ని మరియు దారుఢ్యాన్ని కలిగి ఉండడానికి, వ్యాయామ కార్యకలాపాలు అలాగే శక్తిని పెంచే నియంత్రణ చాలా అవసరమని చెప్పబడుతోంది. (g94 8/22)
ఇండియాలో పొగాకు ఉపయోగించేవారు
“ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇండియాలో 15 సంవత్సరాల వయస్సు పైబడినవారితో 14 కోట్ల 20 లక్షల పురుషులు, 7 కోట్ల 20 లక్షల స్త్రీలు పొగాకును క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారని,” బ్రిటిష్ మెడికల్ జర్నల్ చెబుతోంది. “పేద ప్రజలు ఆకలిని చంపుకోడానికి పొగాకు నములుతారని,” కూడా నివేదిక చెబుతోంది. పొగాకును ఉత్పత్తి చేయడంలో ఇండియా, చైనా మరియు అమెరికా తర్వాత మూడవది, మరి వేలాదిమంది ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది గనుక, పొగాకు ఇండియాకు ఆర్థికపరంగా ఎంతో ప్రాముఖ్యం. అయితే, నోటి క్యాన్సర్ అలాగే గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క సంఘటనలు ఐసిఎమ్‌ఆర్‌కు (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్) వ్యధను కల్గిస్తున్నాయి. జర్నల్ నివేదిస్తున్నట్లు, “పొగాకు ఉపయోగానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే రోగులకు చికిత్స చేయడానికయ్యే ఖర్చు పొగాకు పరిశ్రమ ద్వారా ఆర్జించిన ధనాన్ని మించిపోతుందని,” ఐసిఎమ్‌ఆర్ చెబుతోంది. పొగాకు ఉపయోగించడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలను గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేయాలని, మరి పొగాకు సేద్యాన్ని క్రమ క్రమంగా ఆపి వేయాలని, ప్రత్యామ్నాయ పంటలను ప్రవేశపెట్టాలని, వైద్యులు మరియు ప్రభుత్వేతర గుంపుల వారు కోరుతున్నారు. (g94 8/22)
క్రొత్తగా జన్మించిన శిశువుల వెంట్రుకలలో టాక్సిన్‌లు కనుగొనబడ్డాయి
పొగ త్రాగే వారు వదిలిన పొగను, పొగ త్రాగని గర్భవతులైన స్త్రీలు పీల్చుకుంటే అది పిండం వరకు చేరుతుందని చూపించే జీవశాస్త్రీయ రుజువులు యిప్పుడు లభ్యమౌతున్నాయని కెనడా, టోరెంటో యొక్క ది గ్లోబ్ అండ్ మెయిల్ వార్తాపత్రిక చెబుతుంది. క్రొత్తగా జన్మించిన శిశువు తల వెంట్రుకల సాంపుల్‌లు వాటిలో నికోటైన్ మరియు దాని ఉప ఉత్పత్తి అయిన కొటినెన్ శాతం ఉన్నట్లు కనుగొనబడిందని, ది హాస్పిటల్ ఫర్ సిక్ చిల్డ్రెన్‌లో క్లినికల్ పార్మకాలజిస్ట్ అయిన డా. గిడియన్ కోరెన్ నేతృత్వంలోని పరిశోధక గుంపు తెలియజేసిన విషయాలు సూచిస్తున్నాయి. పొగ త్రాగని తల్లులు యింట్లో లేక పని స్థలంలో రెండు గంటలవరకు యితరులు వదిలిన పొగకు గురి అయ్యారు. డా. కోరెన్ ప్రకారం, యితరులు వదిలిన పొగను క్రమంగా పీల్చుకోడం, “రోజుకు రెండు నుండి నాలుగు సిగరెట్లు త్రాగడంతో” సమానం. ఈ క్రొత్త పరిశోధన “పొగాకు పొగను పీల్చుకోడం, పిల్లల నడవడి, ప్రజ్ఞకు సంబంధించిన అభివృద్ధిని ప్రభావితం చేయగలదని సూచించిన పూర్వపు అధ్యయనాలకు మరింత ప్రాధాన్యతను చేకూర్చుతుందని,” కూడా ది గ్లోబ్ చెబుతుంది. “మనం ప్రస్తుతం జీవిస్తున్న వ్యాజ్యగ్రస్త వాతావరణాన్ని పరిగణిస్తే, ఒక 10 లేక 20 సంవత్సరాల్లో పసిబిడ్డలు, తాము గర్భంలో ఉన్నప్పుడు పొగాకు పొగ వలన తమకు హాని కలిగించినందుకు తమ తల్లిదండ్రులపై కేసు పెట్టకుండా ఉంటారని నేను మీకు హామీ యివ్వలేనని,” డా. కోరెన్ హెచ్చరిస్తున్నారు! (g94 9/8)
దుకాణాలను దోచుకోడం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది
చిలీ, సాంటియాగోలోని “దొంగల పాఠశాలకు” చెందిన “పట్టభద్రులు,” మాంట్రియల్, టొరెంటో, కెనడా మరియు కొన్ని అమెరికా దేశాలలో క్రియాశీలులై వున్నారని, కెనడా దేశపు వార్తాపత్రికైన లాక్ట్యుయాలిటె నివేదిస్తుంది. ఆ “పాఠశాల,” జేబులు కొట్టడం, దుకాణాల్లోని వస్తువులను దొంగిలించడం వంటి వాటిలో చిట్కాలు నేర్పుతుంది, కెనడా దేశపు రాజ్యాంగం మరియు పోలీసు పద్ధతుల్లో విద్య అందిస్తుంది. “పట్టభద్రులు” గుంపులుగా పనిచేస్తారు, అబద్ధపు పత్రాలను వెంటబెట్టుకెళ్తారు, మరి తాము దొంగిలించిన వస్తువులను దాచుకోడానికి ప్రత్యేకంగా లైనింగ్ ఉన్న దుస్తులు, గిఫ్ట్ వ్రాపింగ్‌లు వాళ్లకు సమకూర్చబడ్డాయి. మాంట్రియల్ జిల్లా సమాజం పోలీసులు, 1991 నుండి ఆ నెట్‌వర్క్‌ను కనుగొని దొంగిలింపబడిన దుస్తులను అనేకసార్లు పట్టుకున్నారు. యిటీవలనే వాళ్లు చిలీకి వెళ్లడానికి ప్రయాణమైన బట్టలున్న ఒక డబ్బాను పట్టుకోవడం వారు పట్టుకున్న వాటిలోకెల్లా పెద్దది. అయితే పోలీసులు, దుకాణాదారులిద్దరికీ, సంస్థీకరింపబడిన దొంగతనాల యీ అంతర్జాతీయ నెట్‌వర్క్ ఛేదించలేని సవాలుగా నిలిచింది. “అది వాళ్లకు ప్రాముఖ్యం కాదుగనుక,” అంతర్జాతీయ పోలీసుల సహకారం పొందడం కష్టమని, లాక్ట్యుయాలిటెలో సూచింపబడిన మాంట్రియల్‌లోని ఒక డిటెక్టివ్ చెప్పాడు. (g94 9/8)
ప్రపంచవ్యాప్త శరణార్థుల సమస్య
గత 1992లో, ఒక దినంలో దాదాపు 10,000 మంది ప్రజలు శరణార్థులయ్యారు. ఐక్యరాజ్యసమితి శరణార్థ రాయబార కార్యాలయం (యుఎన్‌హెచ్‌సిఆర్) ప్రచురించిన క్రొత్త పుస్తకమైన ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ రెఫ్యూజీస్ ఉద్ఘాటిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 1992లో 1 కోటి 82 లక్షల మంది శరణార్థులు ఉండేవారు, అది 20 సంవత్సరాల పూర్వం ఉన్నదానికంటే ఎనిమిదంతలు ఎక్కువ. అదనంగా 2 కోట్ల 40 లక్షలమంది ప్రజలు తమ స్వంత దేశంలో నిరాశ్రయులయ్యారు. మొత్తానికి, భూమిపైనున్న 130 మంది ప్రజల్లో 1 వ్యక్తి తన దేశంనుండి బలవంతంగా వెళ్లిపోవలసి వస్తుంది. యుఎన్‌హెచ్‌సిఆర్ పత్రికైన రెఫ్యూజీస్ యిలా చెబుతోంది: “నిజమైన శరణార్థులు అలాగే ఉపాధి కొరకు తరలివెళ్లేవారిరువురి సంఖ్య ఎంతో తీవ్రంగా పెరగడం—3,500 సంవత్సరాల పురాతనమైనదైన శరణార్థి పునరావాస పరంపరపై ఎంతో గంభీరమైన వత్తిడి కలిగించి, అది కూలిపోయేలా చేస్తుంది.” (g94 9/8)
మీరు నిద్రమత్తుగలవారా?
మీకు రాత్రుల్లో తగినంత నిద్ర లభిస్తుందా? దాన్ని కనుగొనే మంచి మార్గమొకటుందని ఒక పరిశోధకుడు చెబుతున్నాడు, అదేమంటే సుష్టుగా భోంచేసి, వెచ్చగా ఉండే గదిలో విసుగుపుట్టించే ప్రసంగం వినడానికి వెళ్లండి. మీకు మంచి విశ్రాంతి లభించి ఉంటే, మీకు విసుగు, చిరాకు కలుగుతుందే గాని, మీకు నిద్రమత్తు అనిపించదు. ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ప్రకారం, 10 కోట్లమంది అమెరికా వాస్తవ్యులకు సరైన నిద్ర లభించదని నిపుణులు అంచనా వేశారు. అనేకమంది ప్రజలకు రాత్రుల్లో, ఎనిమిది నుండి ఎనిమిదిన్నర గంటల నిద్ర కావాలి; 17 నుండి 25 సంవత్సరాల వారికి అంతకంటే ఎక్కువేకావాలి. అనేకమంది ప్రజలు తమకు అవసరమైనంతకంటే తక్కువ నిద్ర పోయినా బ్రతకగల్గుతున్నారు, కానీ తక్కువ నిద్రించే వాళ్లు తప్పులు చేసే అవకాశముంది. వాళ్లు “నిద్ర అప్పును” కూడా కూడబెట్టుకుంటారు. “వారాంతాల్లో తమ యౌవనస్థులు మధ్యాహ్నం వరకూ పడుకుంటారని తల్లిదండ్రులు వాళ్ల ‘సోమరితనాన్ని’ గురించి వాపోతారు, కానీ ఈ యౌవనస్థుల్లో చాలామంది, కేవలం వారమంతా తాము చదువుకోడానికి తక్కువ నిద్ర పోయినప్పుడు ఏర్పడిన నిద్ర అప్పును తీర్చుకోడానికి ప్రయత్నిస్తుంటారని,” ట్రిబ్యూన్ చెబుతోంది. (g94 9/8)