కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 9/8 పేజీలు 4-8
  • పెరిగిపోతున్న శరణార్థుల సంఖ్య

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పెరిగిపోతున్న శరణార్థుల సంఖ్య
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమస్య ఎందుకు తీవ్రతరమౌతోంది?
  • అనవసరమైన కోట్లాదిమంది
  • విషయాలను ఏది సంక్లిష్టం చేస్తుంది?
  • ద్వేషం మరియు భయం
  • ‘సంతోషంతో యెహోవాను సేవించేలా’ పరదేశులకు సహాయం చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • పరిష్కారం ఏమిటి?
    తేజరిల్లు!—1996
  • శరణార్థుల ఆటుపోట్లు—లక్షలమంది యుక్రెయిన్‌ను వదిలి వెళ్లిపోయారు
    అదనపు అంశాలు
  • దుర్ఘటన యొక్క ఫలితం
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 9/8 పేజీలు 4-8

పెరిగిపోతున్న శరణార్థుల సంఖ్య

మానవ చరిత్రలో అధికభాగం యుద్ధాలు, కరవులు మరియు హింస వలన కలంకితమైంది. దాని ఫలితంగా, ఆశ్రయం కావలసిన ప్రజలు ఎల్లవేళలా ఉన్నారు. గతంలో, అవసరతలో ఉన్న వారికి దేశాలు మరియు ప్రజలు ఆశ్రయమిచ్చారు.

ఆశ్రయాన్ని అందించే చట్టాలను, ప్రాచీన ఆజ్‌టెక్‌ వారు, అష్షూరీయులు, గ్రీకులు, హెబ్రీయులు, ముస్లిమ్‌లు మరియు ఇతరులు గౌరవించారు. గ్రీకు తత్వవేత్తయైన ప్లాటో, 23 శతాబ్దాల పూర్వం ఇలా వ్రాశాడు: “తన తోటి దేశస్థుల నుండి, తన కుటుంబంనుండి వేరు చేయబడిన విదేశీయుడు, మనుష్యులనుండి మరియు దేవుళ్లనుండి కూడా అత్యధిత ప్రేమ పొందవలసిన వాడు. కాబట్టి విదేశీయుల ఎడల ఎలాంటి తప్పు జరుగకుండా అన్ని జాగ్రత్తలనూ తీసుకోవాలి.”

ఇరవయ్యవ శతాబ్ది కాలంలో, శరణార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మిగిలిన 15 లక్షల శరణార్థుల ఎడల శ్రద్ధ వహించాలనే ప్రయత్నంలో, ఐక్యరాజ్య సమితి శరణార్థి హైకమిషనర్‌ (UNHCR) 1951లో స్థాపింపబడింది. అప్పుడున్న శరణార్థులు తమకు ఆశ్రయమిచ్చిన సమాజాల్లో త్వరలో ఓ భాగమైపోతారన్న ఆలోచన ఆధారంగా, ఆ కార్యాలయం మూడు సంవత్సరాలు పని చేస్తుందని భావించడం జరిగింది. దాని తర్వాత ఆ సంస్థను మూసివేయవచ్చని అనుకున్నారు.

అయితే, దశాబ్దాల కాలంలో శరణార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 1975 కల్లా వారి సంఖ్య 24 లక్షలకు చేరుకుంది. 1985లో ఆ సంఖ్య ఒక కోటి ఐదు లక్షలయ్యింది. 1995 కల్లా, UNHCR నుండి రక్షణ మరియు సహాయం పొందుతున్న ప్రజల సంఖ్య రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షలకు చేరుకుంది!

ప్రచ్ఛన్న యుద్ధం తర్వాతి యుగం ప్రపంచవ్యాప్త శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుందని అనేకులు నిరీక్షించారు; కానీ అది అలా చేయలేదు. బదులుగా, దేశాలు చరిత్ర సంబంధంగా లేక జాతి సంబంధంగా చీలిపోయాయి, అది పోరాటానికి కారణమైంది. యుద్ధాలు చెలరేగే కొలది, తమ ప్రభుత్వాలు తమను కాపాడలేవనీ లేక కాపాడవనీ తెలుసుకుని ప్రజలు పారిపోయారు. ఉదాహరణకు, 1991లో ఇంచుమించు 20 లక్షలమంది ఇరాక్‌ వారు పొరుగు దేశాలకు పారిపోయారు. అప్పటినుండి, 7,35,000 మంది శరణార్థులు పూర్వపు యుగోస్లేవియా నుండి తరలి వెళ్లారని అంచనా వేయబడింది. తర్వాత, 1994లో రువాండానందు జరిగిన అంతర్యుద్ధం, ఆ దేశంలోని 73 లక్షలమంది ప్రజల్లో సగంకంటే ఎక్కువమందిని తమ ఇళ్లు వదలి పారిపోయేందుకు ఒత్తిడి చేసింది. దాదాపు 21 లక్షలమంది రువాండా వారు సమీపానున్న ఆఫ్రికా దేశాల్లో తల దాచుకున్నారు.

సమస్య ఎందుకు తీవ్రతరమౌతోంది?

శరణార్థుల పెరుగుతున్న సంఖ్యకు తోడ్పడే కారకాలు అనేకం ఉన్నాయి. ఆఫ్‌ఘనిస్థాన్‌, సొమాలియా వంటి కొన్ని ప్రాంతాల్లో జాతీయ ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. ఇది ప్రజలు భయాందోళన చెంది పారిపోయేలా చేస్తూ, అడ్డు లేకుండా పల్లె ప్రాంతాలను దోచుకునే సాయుధ పౌరసేన చేతుల్లోకి ఆధిపత్యమంతా పోయేలా చేసింది.

ఇతర ప్రాంతాల్లో జరిగే గొడవలు సంక్లిష్టమైన జాతిపర లేక మతపర వ్యత్యాసాలపై ఆధారపడి ఉంటాయి, అలాంటి సందర్భంలో గొడవలు చేసే పక్షాల ముఖ్య ఉద్దేశం పౌర జనాభాను వెళ్లగొట్టడమే అయ్యుంటుంది. పూర్వపు యుగోస్లేవియాలోని యుద్ధానికి సంబంధించి, 1995 మధ్య భాగంలో ఓ ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ఇలా విలపించాడు: “అనేకమంది ప్రజలకు, ఈ యుద్ధానికిగల కారకాంశాలను అంటే ఎవరు యుద్ధం చేస్తున్నారు, ఈ యుద్ధానికిగల కారణాలు ఏమిటి అనే విషయాలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఒక వైపునుండి సామూహిక నిర్గమనం జరుగుతుంది, మూడు వారాల తర్వాత మరో వైపునుండి సామూహిక నిర్గమనం జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకోవలసిన ప్రజలకు కూడా దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.”

అత్యంత ప్రమాదకరమైన ఆధునిక ఆయుధాలు—మల్టీ-లాంచ్‌ రాకెట్‌లు, క్షిపణులు, ఫిరంగులు మరియు అలాంటివే ఇతరములు—మారణహోమానికి తోడువచ్చి గొడవలను అధికం చేస్తాయి. దాని ఫలితం: మరింత ఎక్కువమంది శరణార్థులు. ఇటీవలి కాలాల్లో, ప్రపంచపు శరణార్థుల్లో దాదాపు 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలనుండి అభివృద్ధి చెందుతున్నవైనప్పటికీ ఆశ్రయాన్ని వెదికే వారి ఎడల శ్రద్ధవహించడానికి సమర్థవంతంగాలేని పొరుగు దేశాలకు పారిపోయారు.

అనేక గొడవల్లో, ఆహార కొరత సమస్యకు దోహదపడుతుంది. ప్రజలు ఆకలిగొని ఉన్నప్పుడు, ఆహార సరఫరా తెచ్చే వాహనాలు బహుశ అడ్డగింపబడిన కారణంగా వారు తరలి వెళ్లేందుకు ఒత్తిడి చేయబడతారు. ద న్యూయార్క్‌ టైమ్స్‌ ఇలా పేర్కొంటోంది: “హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో, క్షామం మరియు యుద్ధం యొక్క కలయిక ఆ భూమిని ఎంతగా నాశనం చేసిందంటే అది ఇక జీవనోపాధిని ఎంతమాత్రం అందించలేదు. పారిపోతున్న లక్షలమంది ప్రజలు క్షామాన్ని తప్పించుకునేందుకు పారిపోతున్నారా లేక యుద్ధాన్ని తప్పించుకునేందుకు పారిపోతున్నారా అనేది అనవసరమైన విషయం.”

అనవసరమైన కోట్లాదిమంది

ఆశ్రయాన్ని అందించాలనే ఆలోచన సూత్రప్రాయంగా గౌరవింపబడినప్పటికీ, శరణార్థుల అత్యధిక సంఖ్య దేశాలకు భయాన్ని కలిగిస్తుంది. ఈ పరిస్థితి ప్రాచీన ఐగుప్తులోని పరిస్థితిని పోలివుంది. యాకోబు మరియు ఆయన కుటుంబం ఏడు సంవత్సరాల క్షామం యొక్క విధ్వంసాన్ని తప్పించుకునేందుకు ఐగుప్తులో తలదాచుకోవాలని అనుకున్నప్పుడు వారు ఆహ్వానింపబడ్డారు. వారు “దేశములోని మంచి ప్రదేశమందు” ఉండేందుకు ఫరో అనుమతించాడు.—ఆదికాండము 47:1-6.

అయితే, సమయం గడిచే కొలది ఇశ్రాయేలీయులు ఎంత ఎక్కువ అయ్యారంటే, “వారున్న ప్రదేశము వారితో నిండి యుండెను.” ఐగుప్తీయులు ఇప్పుడు కఠినంగా ప్రతిస్పందించారు, అయినప్పటికీ “ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది [ఇశ్రాయేలీయులు] విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడిరి.”—నిర్గమకాండము 1:7, 12.

అదే విధంగా, నేడు శరణార్థుల సంఖ్య పెరిగే కొలది దేశాలకు వారంటే ‘అసహ్యంగా’ ఉంది. దేశాలు చింతించడానికిగల ముఖ్య కారణం ఆర్థికపరమైనదే. కోట్లాదిమంది శరణార్థులకు ఆహారాన్ని, బట్టలను, ఇళ్లను ఏర్పాటు చేయాలంటే, వారిని కాపాడాలంటే ఎంతో డబ్బు కావాలి. 1984 నుండి 1993 మధ్యలో, UNHCR యొక్క సాంవత్సరిక వ్యయం 44.4 కోట్ల అమెరికన్‌ డాలర్లనుండి 1.3 కోట్ల అమెరికన్‌ డాలర్లకు పెరిగింది. ఆ డబ్బులో అధిక భాగం ధనిక దేశాలు విరాళంగా ఇచ్చినదే, ఆ దేశాల్లో కొన్ని తమ స్వంత ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నాయి. దానం చేసే దేశాలు కొన్నిసార్లు ఇలా ఫిర్యాదు చేస్తాయి: ‘మా స్వంత వీధుల్లో ఉన్న ఇళ్లులేని వాళ్లకు సహాయం చేయడంలోనే మేము ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ సమస్య తరిగే బదులు పెరిగేలాగే ఉన్నప్పుడు పూర్తి గ్రహంలోని ఇళ్లులేని వారి ఎడల మేమెలా బాధ్యత వహించగలం?’

విషయాలను ఏది సంక్లిష్టం చేస్తుంది?

ధనిక దేశాన్ని చేరుకోగలిగే శరణార్థులు, ఆర్థిక కారణాలనుబట్టి అదే దేశానికి తరలి వచ్చిన అనేక వేల మంది ప్రజల ద్వారా తమ పరిస్థితి సంక్లిష్టం చేయబడి ఉందని తరచూ కనుగొంటారు. ఈ ఆర్థిక ప్రవాసులు, యుద్ధాన్ని లేక హింసను లేక క్షామాన్ని తప్పించుకునేందుకు పారిపోతున్న శరణార్థులు కారు. బదులుగా, వారు శ్రేష్ఠమైన జీవితాన్ని, అంటే పేదరికం లేని జీవితాన్ని వెదుక్కుంటూ వచ్చిన వారు. వారు తరచూ శరణార్థులమని చెప్పుకుని, ఆశ్రయాన్నిచ్చే సంస్థలకు అబద్ధపు రుజువులను చూపించి ఇబ్బంది కలిగిస్తారు గనుక, వాస్తవంగా శరణార్థులైనవారు నిష్పక్షపాత శ్రద్ధ పొందడాన్ని వీరు కష్టతరం చేస్తారు.a

శరణార్థుల మరియు ప్రవాసుల ప్రవేశాన్ని సంవత్సరాలుగా ధనిక దేశాల్లోకి పారి వచ్చిన, ప్రక్క ప్రక్కగా వెళ్లే రెండు ఏరులతో పోల్చడం జరిగింది. అయితే, అత్యంత కట్టుదిట్టమైన వలస చట్టాలు ఆర్థిక ప్రవాసుల ఏరును అడ్డగించాయి. అలా వారు శరణార్థుల ఏరులో ఒక భాగమయ్యారు, ఈ ఏరు ఓ వరదను సృష్టించేంతగా పొంగిపొర్లింది.

ఆశ్రయం కొరకైన తమ విన్నపాలను తనిఖీ చేసేందుకు అనేక సంవత్సరాలు పడతాయని తెలిసి, ఎటువైపైనా తమదే విజయమని ఈ ఆర్థిక ప్రవాసులు తర్కిస్తారు. ఆశ్రయం కొరకైన తమ విన్నపం అంగీకరింపబడితే వారు గెలిచినట్లే, ఎందుకంటే వారు భాగ్యవంతమైన ఆర్థిక పరిస్థితిలో ఉండవచ్చు. వారి విన్నపం నిరాకరింపబడితే కూడా వారు గెలిచినట్లే, ఎందుకంటే ఆ సరికల్లా వారు కొంత డబ్బు ఆర్జించి ఉంటారు మరియు తమతో తీసుకు వెళ్లేందుకు ఏదైనా ఒక కౌశలాన్ని సంపాదించి ఉంటారు.

అత్యధిక సంఖ్యలో శరణార్థులు, ఆర్థిక ప్రవాసులతోపాటు తరలి వస్తుండగా, అనేక దేశాలు వారిని ఆహ్వానించడం మాని, వారి మొహానే తలుపులు మూసేస్తున్నాయి. పారిపోయి వచ్చే వారి విషయమై కొన్ని దేశాలు తమ సరిహద్దులను మూసేశాయి. ఇతర దేశాలు ప్రవేశపెట్టిన చట్టాలు మరియు పద్ధతులు అంతే ప్రభావవంతంగా శరణార్థులను లోనకు రానివ్వడంలేదు. ఇంకా ఇతర దేశాలు శరణార్థులు ఏ దేశాలనుండి వచ్చారో వారిని తిరిగి ఆ దేశాలకు బలవంతంగా పంపించాయి. ఓ UNHCR ప్రచురణ ఇలా పేర్కొంటోంది: “వాస్తవమైన శరణార్థుల మరియు ఆర్థిక ప్రవాసుల సంఖ్యల్లోని విపరీతమైన పెరుగుదల, ఆశ్రయాన్నిచ్చే 3,500 సంవత్సరాల పురాతన సాంప్రదాయంపై తీవ్రమైన భారాన్ని కలిగించింది, అలా అది కూలిపోడానికి సిద్ధమయ్యేలా చేసింది.”

ద్వేషం మరియు భయం

శరణార్థుల సమస్యలను అధికం చేసేది విదేశీయుల ఎడల విముఖత అనే భూతం, అంటే విదేశీయులంటే భయం మరియు వారి పట్ల ద్వేషం. బయటి వారు తమ జాతీయ గుర్తింపుకు, సంస్కృతికి మరియు ఉద్యోగాలకు ముప్పు వాటిల్లజేస్తారని అనేక దేశాల్లోని ప్రజలు నమ్ముతారు. అలాంటి భయాలు కొన్నిసార్లు దౌర్జన్యం రూపంలో వ్యక్తమౌతాయి. శరణార్థులు (ఆంగ్లం) అనే పత్రిక ఇలా చెబుతుంది: “యూరప్‌ ఖండం ప్రతి మూడు నిమిషాలకు ఒక జాతి సంబంధ దాడిని వీక్షిస్తుంది—ఆశ్రయాన్ని వెదికే వారి కొరకైన రిషప్షన్‌ కేంద్రాలు చాలా తరచుగా ఆ దాడికి గురౌతుంటాయి.”

మధ్య యూరప్‌లోని ఒక పోస్టరు తీవ్ర వైరుద్య భావాలను వ్యక్తం చేస్తుంది, ఆ వైరుద్య భావం భూమిపైనున్న అనేక దేశాల్లో అత్యధికంగా ప్రతిధ్వనింపబడుతుంది. క్రోధంతో కూడిన దాని వర్తమానం విదేశీయుని వైపు గురిపెట్టబడింది: “వాళ్లు మా దేశమనే శరీరంపైగల అసహ్యమైన మరియు బాధాకరమైన పుండు. ఎలాంటి సాంస్కృతిక, నైతిక లేక మతపర నమ్మకాలు లేని ఓ జాతీయ గుంపు, దొంగిలించే మరియు దోచుకొనే దేశదిమ్మరి మూక. రోతగా, పేలతో ఉన్న వీళ్లు వీధుల్లో, రైల్వే స్టేషన్‌లలో ఉంటారు. తమ చింపి పీలికలను మూటకట్టుకుని మరెప్పుడూ రాకుండా వాళ్లను వెళ్లిపొమ్మనండి!”

అత్యధికులైన శరణార్థులు “మరెప్పుడూ రాకుండా వెళ్లిపోవాలనే” ఇష్టపడతారన్నది వాస్తవం. వారు ఇంటికి వెళ్లాలని తపించిపోతుంటారు. తమ కుటుంబాలతో, స్నేహితులతో ప్రశాంతమైన, మామూలు జీవితాలను గడపాలని వారి హృదయాలు వేదన చెందుతాయి. అయితే వారు వెళ్లేందుకు వారికే ఇల్లూ లేదు.

[అధస్సూచి]

a 1993లో, పశ్చిమ యూరప్‌లోని ప్రభుత్వాలు, ఆశ్రయాన్ని వెదుకుతూ వచ్చే వారి విషయాలను పరిశీలించి, వారు లోనకు ప్రవేశించడానికి అనుమతించేందుకు 1,160 కోట్ల అమెరికన్‌ డాలర్లను ఖర్చు చేశాయి.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

శరణార్థుల దుస్థితి

“లక్షలాదిమంది శరణార్థ పిల్లలు ప్రతి రాత్రి పస్తులే పడుకుంటారని మీకు తెలుసా? లేక ప్రతి ఎనిమిది మంది శరణార్థ పిల్లల్లో ఒక పిల్లాడు మాత్రమే పాఠశాలకు వెళ్తాడని మీకు తెలుసా? ఈ పిల్లల్లో అనేకులు సినిమాకు లేక పార్కుకు ఎన్నడూ వెళ్లలేదు, వస్తు ప్రదర్శనాశాలకు అసలే వెళ్లలేదు. అనేకమంది ముళ్లతీగలు కంచెలుగా ఉన్న శిబిరాల్లో లేక ఏకాంత శిబిరాల్లో పెరుగుతారు. వారు ఎద్దును లేక కుక్కను ఎన్నడూ చూడలేదు. అనేకమంది శరణార్థ పిల్లలు పచ్చగడ్డి అంటే తినే పదార్థమనే అనుకుంటారుగాని దానిపై పరిగెత్తి గంతులేయవచ్చని వారికి తెలియదు. శరణార్థ పిల్లలను చూడటం నా ఉద్యోగంలోని అతి బాధాకరమైన భాగం.”—సాడాకో ఓగాటా, ఐక్యరాజ్య సమితి శరణార్థి హైకమిషనర్‌.

[క్రెడిట్‌ లైను]

U.S. Navy photo

[8వ పేజీలోని బాక్సు/చిత్రం]

యేసు ఓ శరణార్థిగా ఉన్నాడు

యోసేపు మరియలు తమ కుమారుడైన యేసుతోపాటు బేత్లెహేములో నివసించే వారు. తూర్పు దేశపు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి మరియు బోళమును కానుకలుగా తెచ్చారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఒక దేవదూత యోసేపుకు కనబడి, “హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని” చెప్పాడు.—మత్తయి 2:13

వెంటనే వారు ముగ్గురూ ఓ పరాయి దేశంలో ఆశ్రయాన్ని వెదికారు—వారు శరణార్థులయ్యారు. యూదులకు రాజు అవుతాడని ఎవరి గురించి ప్రవచింపబడిందో ఆయన స్థలాన్ని గురించి జ్ఞానులు తనకు నివేదించలేదని హేరోదు మండిపడ్డాడు. యేసును చంపాలన్న వ్యర్థ ప్రయత్నంలో, బేత్లెహేములోను దాని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని చిన్న బాలురను చంపమని అతను తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు.

దేవుని దూత మళ్లీ యోసేపుకు కలలో కనిపించే వరకూ యోసేపు మరియు ఆయన కుటుంబం ఐగుప్తులోనే ఉండిపోయారు. “నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలుదేశమునకు వెళ్లుము; శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని” దూత చెప్పాడు.—మత్తయి 2:20.

తాము ఐగుప్తుకు పారిపోక ముందు నివసించిన యూదయలో స్థిరపడాలని యోసేపు అనుకున్నాడని రుజువులు చూపుతున్నాయి. కాని అలా చేయడం ప్రమాదకరమని ఆయన కలలో హెచ్చరింపబడ్డాడు. అలా దౌర్జన్యం జరుగుతుందనే ముప్పు మరోసారి వారి జీవితాలను ప్రభావితం చేసింది. యోసేపు, మరియ మరియు యేసు గలిలయకు ఉత్తరం వైపు ప్రయాణించి, నజరేతనే గ్రామంలో స్థిరపడతారు.

[7వ పేజీలోని చిత్రాలు]

ఇటీవలి సంవత్సరాల్లో కోట్లాదిమంది శరణార్థులు తమ జీవితాలను కాపాడుకునేందుకు ఇతర దేశాలకు పారిపోయారు

[Credit Lines]

Top left: Albert Facelly/Sipa Press

Top right: Charlie Brown/Sipa Press

Bottom: Farnood/Sipa Press

[Picture Credit Line on page 4]

Boy on left: UN PHOTO 159243/J. Isaac

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి