కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 9/8 పేజీలు 19-25
  • జీవితం సులభతరం కానప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జీవితం సులభతరం కానప్పుడు
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు
  • అనారోగ్యం వలన ఆపబడడం
  • ఒక ఆటంకము
  • చివరకు, మళ్లీ పాఠశాలకు
  • మతాన్ని గురించిన ఆసక్తి
  • మరొక ఆటంకం
  • పాఠశాలలో పరిస్థితి అంత సులభంగా లేదు
  • రక్తం విషయంలో నా యథార్థతను కాపాడుకోడం అంత సులభంగా లేదు
  • గ్రాడ్యుయేషన్‌, తర్వాత బాప్తిస్మం
  • రక్తం వివాదాన్ని మళ్లీ ఎదుర్కోవడం
  • మరొక ఆటంకము
  • జీవితం యింకా సులభతరం కాలేదు
  • మాంత్రికులు కాదు, దేవుళ్లూ కాదు
    తేజరిల్లు!—1994
  • మా విశ్వాసం పరీక్షకు గురైనప్పుడు మేం ఒంటరిగా లేము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • అతడు వదిలిపెట్టలేదు
    తేజరిల్లు!—1998
  • రక్తం విషయంలో దేవుని అభిప్రాయం సరైనదని నేను తెలుసుకున్నాను
    తేజరిల్లు!: రక్తం విషయంలో దేవుని అభిప్రాయం సరైనదని నేను తెలుసుకున్నాను
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 9/8 పేజీలు 19-25

జీవితం సులభతరం కానప్పుడు

నేను జీవిత వాస్తవాలను ఎదుర్కోడానికి వత్తిడి చేయబడినప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నేటి ప్రపంచంలో జీవితం వాస్తవంగా అసంతోషకరంగా ఉందని మీరు నాతో ఏకీభవిస్తారు. వాస్తవానికి—మనందరికీ కూడా అది అలాగే ఉంది. మనమందరం అనారోగ్యులమౌతాం. నిజమే, కొంతమంది ఏదో పెద్ద జబ్బు రాకపోయినా ముసలివాళ్లవుతారు, కానీ అప్పుడు మనమందరం మరణించాల్సిందే.

బహుశా మరణాన్ని గురించి నేనాలోచించవలసిన దానికంటే ఎక్కువగానే ఆలోచిస్తానేమో. నేనెందుకలా ఆలోచిస్తున్నానో, మరి నాకు సంభవించిన దానివల్ల నేనొక విధంగా ఎలా ప్రయోజనం పొందానో, నన్ను వివరించనివ్వండి.

నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు

నేను 1968 సెప్టెంబరులో న్యూయార్క్‌, బ్రూక్లిన్‌నందు జన్మించాను, ఐదుగురు పిల్లల్లో నేను ఆఖరు దాన్ని. మా నాన్న వికలాంగుడు, మమ్మల్ని పోషించడానికి మా అమ్మ క్యాషియర్‌గా పనిచేసేది. నాకు తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు, నా కడుపు ఒకవైపు ఎత్తుగా ఉందని అమ్మ గమనించింది. ఆమె ఆ ప్రాంతంలోని వైద్య కేంద్రానికి నన్ను తీసుకెళ్లింది. డాక్టరు పరీక్ష చేసి పెద్ద గడ్డ ఉందని చెప్పింది, కొన్ని రోజుల తర్వాత, నన్ను కింగ్స్‌ కౌంటీ ఆసుపత్రిలో చేర్పించారు.

అమ్మ వెళ్లిపోయిన తర్వాత, నాకు భయం వేసింది గనుక నేను ఏడ్చాను. మర్నాడు లేత నీలం రంగు బట్టలు ధరించిన యిద్దరు మనుష్యులు నన్ను ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. రికవరీ రూమ్‌లో స్పృహలోకి వచ్చే ముందు నేను చూసిన చివరి విషయమేమంటే, నా తలపై మసక వెలుతురునిస్తున్న బల్బు, నా నోటిపై ఏదో పెట్టబడటమే అని నాకు జ్ఞాపకముంది. డాక్టర్లు, విల్‌మ్స్‌ ట్యూమర్‌ను (క్యాన్సర్‌లో ఒక రకం), నా మూత్ర పిండాల్లో ఒక దానిని, నా కాలేయంలో కొంత భాగాన్ని విజయవంతంగా తీసివేశారు.

నేను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఐదు వారాలు గడిపాను. ప్రతి రోజు డాక్టర్లు డ్రెస్సింగ్‌ మార్చేవారు. వాళ్లు డ్రెస్సింగ్‌కు ఉపయోగించే టేపును తీసిన ప్రతిసారి నేను అరిచేదాన్ని. నా నొప్పిని తగ్గించడానికి, నా అవధానాన్ని ప్రక్కకు మళ్లించేందుకు డాక్టర్లు ఎవరైనా ఒకతన్ని రప్పించేవారు. ఆ వ్యక్తి నాతో కప్పలను గురించి ఎన్నో సంగతులు చెప్పడం నాకు బాగా జ్ఞాపకముంది.

ఇంటెన్సివ్‌ కేర్‌లోనుండి బయటకు వచ్చిన తర్వాత, నేను నాలుగు వారాలు ఆసుపత్రిలో గడిపాను. ఆ సమయంలో, రేడియేషన్‌ చికిత్సలు ప్రారంభించబడ్డాయి. రేడియేషన్‌ వలన కాదుగానీ—నేను నా కడుపుపై బోర్లా పడుకోవాలి, శస్త్ర చికిత్స వలన నా కడుపుపైన కలిగిన గాయం యింకా మానలేదు గనుక, అవి చాలా బాధాకరంగా ఉండేవి. రేడియేషన్‌ చికిత్సలు ప్రతిరోజు, సోమవారం నుండి శుక్రవారం వరకూ యివ్వబడేవి.

నేను 1977 నవంబరు చివరి భాగంలో ఆసుపత్రినుండి విడుదల చేయబడిన తర్వాత, నేను బయటి రోగిలా రేడియేషన్‌ చికిత్స పొందడంలో కొనసాగాను. ఈ చికిత్సలు ముగిసినప్పుడు, నేను కెమోథెరపీ పొందడం ప్రారంభించాను. ప్రతిరోజు సోమవారం నుండి శుక్రవారం వరకు, నేను ఉదయాన్నే లేచి ఆసుపత్రికి వెళ్లి శక్తివంతమైన మందులు ఎక్కించుకోవలసి ఉండేది. డాక్టరు ఒక నరంలో సూదిని గుచ్చి అందులో మందును ఎక్కించేవాడు. నాకు సూదులంటే భయంగా ఉండేది మరి నేను ఏడ్చేదాన్ని, కానీ నా ఆరోగ్యం బాగుపడాలి గనుక నేను అదంతా భరించాలని అమ్మ నాకు చెప్పింది.

కెమోథెరపీ చికిత్సలకు భయంకరమైన సైడ్‌ ఎఫెక్టులుంటాయి. అది నాకు వికారం కలిగించేది, నేను తరచుగా వాంతి చేసుకునే దాన్ని. నాకు రక్తం తక్కువైంది, నా వెంట్రుకలన్నీ రాలిపోయాయి.

అనారోగ్యం వలన ఆపబడడం

ఆ తర్వాతి వసంతకాలంలో, ఈస్టరు ఆదివారం నాడు, మేము చర్చికి వెళ్లడానికి సిద్ధపడుతున్నాము, అప్పుడు నాకు రక్తం తక్కువైనందుకు నాకు ముక్కులో రక్తంరావడం మొదలైంది. నా తల్లిదండ్రులు అన్ని రకాలుగా ప్రయత్నించారు, కానీ రక్తం ఆగడంలేదు. నా ముక్కుకు గాజుగుడ్డ పెట్టికట్టడం ద్వారా డాక్టరు రక్తాన్ని ఆపారు, కానీ రక్తం నోటినుండి రావడం మొదలైంది. రక్తం పోవడంతో నేను చాలా బలహీనమైనందుకు, నన్ను ఆసుపత్రిలో చేర్చారు. నాకు ఇన్ఫెక్షన్‌ అవ్వకుండా ఉండడానికి, నన్ను చూడడానికి వచ్చేవాళ్లు గ్లోవ్స్‌, మొహానికి మాస్కు, తమ బట్టలపై ఒక గౌనును ధరించాల్సి ఉండేది. ఒక వారంలో నాలో రక్తం వృద్ధి అయ్యింది గనుక నేను ఆసుపత్రి నుండి విడుదల చేయబడ్డాను.

కెమోథెరపీ వెంటనే మొదలుపెట్టబడింది. నేను పాఠశాలకు హాజరవ్వలేను, నేనెంతో ఒంటరిగా ఉన్నట్లు భావించేదాన్ని. నా స్నేహితులతో కలిసి వాళ్లతో బయట ఆడుకోలేకపోతున్నాను. నేను కెమోథెరపీ పొందుతున్నప్పుడు లేక అది పొందడం ఆపిన తర్వాత మరీ వెంటనే నేను పాఠశాలకు వెళ్లకూడదని నా డాక్టరు భావించాడు గనుక, నాకు యింట్లోనే పాఠాలు చెప్పబడేవి.

నేను ప్రతి వేసవికాలంలో వెళ్లేలా ఈసారి కూడా జార్జియాలోని మా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మల దగ్గరికి వెళ్లాలని యిష్టపడ్డాను, కానీ నేను వెళ్లడానికి అనుమతింపబడలేదు. అయితే, క్యాన్సర్‌ రోగులు, న్యూజెర్సీలోని అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌కు వెళ్లే ఏర్పాటు మాత్రం ఆసుపత్రి వారు చేశారు. నాకు తర్వాత నీరసమనిపించినా, నేను ఎంతో ఆనందించాను.

నేను 1978 చివరిబాగంలో కెమోథెరపీ తీసుకోడం ముగించాను కానీ నేను మొత్తానికి మూడు సంవత్సరాలకంటే ఎక్కువకాలం యింట్లోనే పాఠాలు చెప్పించుకునేదాన్ని. నేను తిరిగి 1981 జనవరిలో పాఠశాలకు వెళ్లినప్పుడు, యింట్లో ఎంతో కాలం చదువుకున్న తర్వాత అక్కడికి అలవాటుపడడం అంత సులభమనిపించలేదు. కొన్నిసార్లు నా తరగతి గదిని వెదుకుకోడంలో నేను దారి మర్చిపోయేదాన్ని. అయినా, నాకు పాఠశాల నచ్చింది. ప్రాముఖ్యంగా నేను సంగీతం, టైపింగ్‌, జిమ్‌ తరగతులను యిష్టపడ్డాను. కొంతమంది పిల్లలు స్నేహపూర్వకంగా ఉండేవాళ్లు, కానీ యితరులు నన్ను ఎగతాళి చేసేవారు.

ఒక ఆటంకము

“నీవు గర్భంతో ఉన్నావా?” అని పిల్లలు నన్ను అడగడం ప్రారంభించారు. నా కడుపు ఉబ్బి ఉన్నందుకు వాళ్లలా అడిగేవారు. నా కాలేయం మళ్లీ పెరగడమే కారణం గనుక, చింతించ వద్దని డాక్టరు చెప్పాడు. అయితే, నేను మార్చిలో పరీక్షకు వెళ్లినప్పుడు, డాక్టరు నన్ను ఆసుపత్రిలో ఉంచాడు. నేను ఏడుపు మొదలుపెట్టాను—నేను కేవలం రెండున్నర నెలలు మాత్రమే పాఠశాలకు హాజరవ్వగలిగాను.

నా కాలేయంలోని ఒక కంతి (ట్యూమర్‌) నుండి చిన్న భాగం తీసుకోడానికి బయాప్సీ చేశారు. బయాప్సీ అయిన తర్వాత మేల్కొన్నప్పుడు నేను చూసిన మొదటి వ్యక్తి అమ్మే. ఆమె ఏడుస్తోంది. నాకు మళ్లీ క్యాన్సర్‌ వచ్చిందని, కంతిని తీసేయడానికి వీలుకానంత పెద్దగా ఉంది గనుక దాన్ని చిన్నగా చేయడానికి నాకు కెమోథెరపీ యివ్వబడాలని ఆమె నాకు చెప్పింది. నాకింకా 12 సంవత్సరాలే.

కెమోథెరపీ ఆసుపత్రిలో యివ్వబడేది, అంటే నేను కొన్ని వారాలకొక సారి రెండు లేక మూడు రోజులకొరకు వెళ్లవలసి వచ్చేది. ఎప్పటిలాగే, నాకు వికారం, వాంతులు వచ్చేవి. ఆహారం రుచించేది కాదు, నా వెంట్రుకలన్నీ రాలిపోయాయి. కెమోథెరపీ చికిత్స 1981వ సంవత్సరమంతా కొనసాగింది. ఈమధ్యలో, ఏప్రిల్‌లో నేను యింట్లో పాఠాలు నేర్చుకోడం ప్రారంభించాను.

మరి 1982 తొలి భాగంలో, శస్త్ర చికిత్స కొరకు నేను ఆసుపత్రిలో చేర్చబడినప్పుడు, నేనెంత బలహీనంగా ఉన్నానంటే బరువు చూసే యంత్రంపై ఎక్కడానికి, దానినుండి దిగడానికి నర్సులు నాకు సహాయం చేయవలసి వచ్చేది. కెమోథెరపీ కంతిని చిన్నగా చేసింది, కాబట్టి సర్జన్లు నా కాలేయంలో మరొక భాగంతోపాటు దాన్ని తీసేయగల్గారు. మళ్లీ నేను ఆసుపత్రిలో దాదాపు రెండు నెలల వరకూ ఉన్నాను. 1982 మధ్యభాగంలో, నాకు కెమోథెరపీ యివ్వడం ప్రారంభించారు, అది 1983 తొలి భాగం వరకూ కొనసాగింది.

ఈ సమయమంతటిలో నేను పాఠశాలకు వెళ్లలేక పోయాను గనుక నేను దుఃఖించాను. కానీ నా వెంట్రుకలు పెరగడం మొదలయ్యాయి, నాకిప్పుడు మళ్లీ హాయిగా ఉంది. నేను జీవించి ఉన్నందుకు ఆనందించాను.

చివరకు, మళ్లీ పాఠశాలకు

నేను 1981లో కొంతకాలం చదివిన తరగతిలోనే జూనియర్‌ హై స్కూల్‌నుండి పట్టభద్రురాలినయ్యేందుకు నా హోమ్‌ ట్యూటర్‌ నాకొరకు ఏర్పాటు చేసింది. దాని గురించి నేను ఎంతో సంభరపడిపోయాను; నా స్నేహితులను కలవడం, క్రొత్త స్నేహితులను చేసుకోడం ఎంతో సరదాగా ఉంటుంది. జూన్‌ 1984లో గ్రాడ్యుయేషన్‌ రోజు వచ్చినప్పుడు, నేను నా స్నేహితులు, ఉపాధ్యాయుల ఫోటోలు తీశాను, ఈ ప్రత్యేక సందర్భాన్ని జ్ఞాపకముంచుకోడానికి నా కుటుంబీకులు నా ఫోటోలను తీశారు.

ఆ వేసవిలో నేను జార్జియాలోని మా అమ్మమ్మ వాళ్లను దర్శించడానికి వెళ్లి వేసవిలో చాలాకాలం అక్కడే గడిపాను. నేను ఆగస్టు చివరి భాగంలో తిరిగి వచ్చినప్పుడు, పాఠశాలకు వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది. అవును, నేను చివరకు పాఠశాలకు వెళ్తున్నాను. నేనెంత సంభరపడిపోయానో!

మతాన్ని గురించిన ఆసక్తి

డాన్‌ మరియు క్రేగ్‌ యితర విద్యార్థులకంటే భిన్నంగా ఉన్నారు, నేను వారిపట్ల ఆకర్షితురాలినయ్యాను. నేను వాళ్లకు క్రిస్టమస్‌ బహుమతులను యిచ్చినప్పుడు, మేమా సెలవు దినాన్ని ఆచరించమని వాళ్లు చెప్పారు. “మీరు యూదులా?” అని నేనడిగాను. వాళ్లు యెహోవాసాక్షులని, క్రిస్టమస్‌ వాస్తవానికి క్రైస్తవత్వానికి సంబంధించినది కాదని క్రేగ్‌ వివరించాడు. ఆ అంశాన్ని గురించి చదవడానికి అతను నాకు వాచ్‌టవర్‌ మరియు అవేక్‌! పత్రికలను యిచ్చాడు.

ఎంతో వేరుగా ఉందనిపించిన వారి మతాన్ని గురించి నాకు ఆసక్తి కలిగింది. నేను చర్చికి వెళ్లినప్పుడు, మేము ఒకే విషయం పదే పదే చెప్పబడటాన్ని వినే వాళ్లము: ‘యేసుక్రీస్తును విశ్వసించండి, బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు మీరు పరలోకానికి వెళ్లగల్గుతారు.’ కానీ అది మరీ సులభంగా అనిపించింది. సంగతులు మరీ సులభంగా ఉన్నాయంటే, మీరు అతి తెలివిపరులైనా అయ్యుండాలి, లేక ఎక్కడో ఏదో లోపమన్నా ఉండాలని నేను విశ్వసించాను. నేను అతి తెలివైనదాన్ని కానని నాకు తెలుసు, కాబట్టి చర్చి బోధించేదాంట్లో ఏదో లోపముందని నేను భావించాను.

తుదకు క్రేగ్‌ మా భోజనవిరామ సమయంలో నాతో బైబిలు పఠించడం మొదలుపెట్టాడు. ఒక రోజు అతను యెహోవాసాక్షుల సమావేశానికి నన్ను ఆహ్వానించాడు, నేను వెళ్లాను. నేను క్రేగ్‌ను కనుగొని, అతను, అతని కుటుంబంతోపాటు కూర్చున్నాను. నేను చూచినదాన్నిబట్టి నేను ఎంతో ముగ్ధురాలినయ్యాను—వేర్వేరు జాతుల ప్రజలు ఐకమత్యంతో కలిసి ఆరాధిస్తున్నారు—మరి నేను విన్న దానినిబట్టి కూడా నేనెంతో ముగ్ధురాలినయ్యాను.

క్రేగ్‌, నేను క్రొత్త తరగతులకు వెళ్లినప్పుడు, మాకిద్దరికి ఒకే సమయంలో భోజనవిరామం ఉండేదికాదు గనుక మేమిక కలిసి బైబిలును పఠించడానికి వీలుకుదిరేది కాదు. క్రేగ్‌వాళ్ల అమ్మ నాతో పఠనం చేయవచ్చునేమో అని కనుక్కోడానికి మా అమ్మను దర్శించింది, కానీ అమ్మ వద్దని చెప్పింది. తర్వాత, నేను క్రైస్తవ కూటాలకు హాజరవ్వడానికి ఆమె నాకు అనుమతినిచ్చింది. కాబట్టి నేను ఫోన్‌బుక్‌లో యివ్వబడిన రాజ్య మందిరం యొక్క నంబరుకు ఫోన్‌ చేసి, కూటాలు ఆదివారం ఉదయం 9:00 గంటలకు ప్రారంభమౌతాయని తెలుసుకున్నాను. ముందు రోజు, నాకు రాజ్యమందిరానికి వెళ్లే దారి తెలియాలని నేను దాదాపు 30 బ్లాకులు నడిచివెళ్లాను.

మరుసటి ఉదయం నేను అక్కడికి వెళ్లినప్పుడు, నేను వేరొక రాజ్యమందిరం నుండి వచ్చానా అని నన్ను ఒక వ్యక్తి అడిగాడు. నేను మొదటిసారి దర్శిస్తున్నానని, కానీ నేను కొద్ది కాలమే పఠించానని అతనికి చెప్పాను. తను, తన భార్యతో కలిసి కూర్చోమని అతను నన్ను దయాపూర్వకంగా ఆహ్వానించాడు. కూటాలు చర్చికంటే ఎంతో వేరుగా ఉన్నాయి. ప్రశ్న-జవాబుల కార్యక్రమ సమయంలో వ్యాఖ్యానించాలని అనేకులు ఎంతో ఆసక్తితో ఉండడం నన్ను ఆశ్చర్యపర్చింది. చిన్న పిల్లలు వ్యాఖ్యానించారు. నేను నా చేయి ఎత్తి ఒక ప్రశ్నకు జవాబిచ్చాను. ఆ సమయంనుండి, నేను కూటాలకు హాజరవ్వడం కొనసాగించాను, బైబిలు సత్యాలను అర్థం చేసుకోడంలో అభివృద్ధిచెందడం మొదలుపెట్టాను.

మరొక ఆటంకం

డిశంబరు 1986లో, ఉన్నత పాఠశాలలోని నా చివరి సంవత్సరంలో, నేను యథాప్రకారం పరీక్ష కొరకు వెళ్లాను. నా కుడి ఊపిరితిత్తిలో డాక్టరు గమనించినది అతను అనుమానించేలా చేసింది, కాబట్టి అదనపు ఎక్సరే కొరకు నన్ను పిలిచారు. ఏదో అనుమానించవలసినది ఉందని నేను తెలుసుకొన్నప్పుడు, నేను ఏడవడం మొదలుపెట్టాను.

బయాప్సీ చేశారు; నా ఊపిరితిత్తిలోనుండి కంతి యొక్క ఒక ముక్కను తీయడానికి డాక్టరు ఒక సూదిని ఉపయోగించాడు. అది క్యాన్సర్‌ కంతేనని తేలింది. వాస్తవానికి, నా గుండె ధమనులవద్ద ఉన్న ఒక పెద్ద కంతితో కలిపి, మూడు కంతులు ఉన్నాయి. వైద్యునితో చర్చించిన తర్వాత, శస్త్రచికిత్సకు ముందు కంతిని చిన్నగా చేయడానికి నేను రెండు పరిశోధనాత్మక కెమోథెరపీ మందులను తీసుకోవాలని మేము నిర్ణయించాము. దాని పర్యవసానాలు మామూలే—వెంట్రుకలు పూర్తిగా రాలిపోవడం, వికారం, వాంతవ్వుతుండడం, రక్తం తగ్గిపోవడము.

మొదట్లో నేను కృంగిపోయాను, కానీ తర్వాత నేను యెహోవాకు చాలా ప్రార్థించాను, అది నన్ను బలపర్చింది. ఆరు నెలలకంటే తక్కువ సమయంలోనే నేను గ్రాడ్యుయేషన్‌ ముగించవలసి ఉంది. నా ఉపాధ్యాయులు అర్థం చేసుకుని, నాపట్ల ఎంతో దయగా ఉన్నారు; నేను నా డాక్టరు వద్దనుండి డాక్టరుసర్టిఫికేట్‌ ఒకటి పెట్టి, నా స్కూల్‌ వర్క్‌ సరిగ్గా చేస్తే చాలని వాళ్లు చెప్పారు.

పాఠశాలలో పరిస్థితి అంత సులభంగా లేదు

నేను అంత అనారోగ్యంగా ఉన్నప్పుడు నా క్లాస్‌ వర్క్‌ చేయడమనే సవాలుతోపాటు, నా తల వెంట్రుకలు రాలిపోవడం మొదలైంది. నేను విగ్గు కొన్నప్పుడు, స్కూల్‌ పిల్లలు నా వెంట్రుకలు చాలా అందంగా ఉన్నాయని చెప్పారు—అది విగ్గని వాళ్లు గుర్తించలేదు. అయితే, ఒక పిల్లవాడు మాత్రం గుర్తించాడు. నేను తరగతి గదిలోకి వచ్చిన ప్రతిసారీ, బోర్డుపైన అతను “విగ్‌” అనే పదాన్ని రాసి, అతను అతని స్నేహితులు నవ్వి తమాషా పట్టించేవారు. వారలా ఏడిపించడం నన్ను కృంగదీసింది.

తర్వాత, క్రిక్కిరిసి ఉన్న ఒక వరండాలో, వెనుకనుండి ఎవరో నా తలపైనుండి విగ్గును లాగేశారు. నేను వెంటనే తిరిగి దాన్ని తీసుకున్నాను, కానీ డజన్లమంది పిల్లలు నా బోడి తలను చూశారు, నేనెంతో నొచ్చుకున్నాను. నేను మెట్లదగ్గరకెళ్లి ఏడ్చాను. కొంతమంది విద్యార్థుల ముఖాలనుబట్టి జరిగిన దాన్నిగురించి వారు బాధపడ్డారని నేను మర్నాడు గమనించాను. నా విగ్గును లాగడానికి ఒక అమ్మాయి ఒక పిల్లవానికి డబ్బు యిచ్చిందని నా తరగతి వాళ్లు నాకు చెప్పారు.

రక్తం విషయంలో నా యథార్థతను కాపాడుకోడం అంత సులభంగా లేదు

కెమోథెరపీ చికిత్సతో, నా రక్తం చాలా తగ్గిపోయింది. పరిస్థితిని యింకా క్షీణింపజేయడానికి, నా ముక్కులోనుంచి కూడా రక్తం వస్తుంది, కొన్నిసార్లు రోజుకు రెండు లేక మూడుసార్లు వస్తుంది. నేనింకా బాప్తిస్మం తీసుకోలేదు, కానీ నేను దృఢ నిశ్చయం చేసుకున్నాను, యెహోవాసాక్షుల్లో ఒకరిగా నేను రక్తాన్ని అంగీకరించనని చెప్పాను. (అపొస్తలుల కార్యములు 15:28, 29) నేను చనిపోవడం తనకు యిష్టంలేదని చెప్పమని నా పెద్దక్క తన చిన్న కూతురిని ప్రోత్సహించింది. నన్ను రక్తం తీసుకోమని చెబుతూ, నాన్న ఎంతో వ్యాకులత చెందారు, మరి నేను రక్తం తీసుకుంటే దేవుడు నన్ను క్షమిస్తాడని అమ్మ నాకు ఎంతగానో చెప్పింది.

అదే సమయంలో, అంత తక్కువ రక్తంతో నాకు గుండెపోటు లేక యింద్రియ దౌర్బల్యం కలుగవచ్చని డాక్టర్లు నన్ను హెచ్చరించారు. నేను దృఢంగా నిశ్చయించుకున్నాను గనుక, ఒకవేళ నేను చనిపోతే వాళ్లు బాధ్యులు కాదని చెప్పే ఒక పత్రంపై వాళ్లు నాచేత సంతకం చేయించుకున్నారు. త్వరలోనే నేను యింటికి తిరిగి వెళ్లి, పాఠశాలకు వెళ్లగలిగేంత మేరకు కోలుకున్నాను. అయితే, నాకు రక్తం తక్కువగా ఉంది గనుక, నేను కెమోథెరపీకి బదులు, రేడియేషన్‌ చికిత్స తీసుకోవాలని డాక్టర్లు నిర్ణయించారు. నేను ఈ చికిత్సను 1987 ఏప్రిల్‌ చివరి భాగం నుండి జూన్‌ తొలి భాగం వరకు ప్రతి రోజు పాఠశాల తర్వాత తీసుకునేదాన్ని.

గ్రాడ్యుయేషన్‌, తర్వాత బాప్తిస్మం

గ్రాడ్యుయేషన్‌ ఒక ప్రత్యేక సందర్భంగా ఉంది. ఒక డ్రెస్‌ కొనడానికి నా పెద్దక్క నాకు సహాయం చేసింది, నేను ఒక క్రొత్త విగ్గును కొన్నాను. గ్రాడ్యుయేషన్‌ సమయంలో మా అమ్మా, నా యిద్దరు అక్కలు వచ్చారు, తర్వాత మేమందరం కలిసి ఒక జ్ఞాపకముంచుకునేంత మంచి భోజనాన్ని ఆస్వాదించాము.

ఆ సమయంలో, నేను కెమోథెరపీ లేక రేడియేషన్‌ చికిత్సలు పొందడంలేదు. కానీ కొన్ని వారాల తర్వాత, డాక్టరు మమ్మల్ని పిలిచి, మళ్లీ కెమోథెరపీ చికిత్స పొందడానికి రమ్మని చెప్పాడు. ఒక వారంలో నేను న్యూయార్క్‌ పట్టణంలోని యాంకీ స్టేడియంలో జరిగే యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి హాజరవ్వబోతున్నాను గనుక నాకు వెళ్లాలనిపించలేదు. అయితే, చికిత్స తీసుకోమని అమ్మ చెప్పింది. కాబట్టి నేను చికిత్స పొందాను.

సమావేశ సమయంలో నేనెంతో సంబరంగా ఉన్నాను, ఎందుకంటే శనివారం, జూలై 25, 1987న నేను బాప్తిస్మం తీసుకోబోతున్నాను. బాప్తిస్మం తీసుకునే స్థలమైన ఒర్చార్డ్‌ బీచ్‌వరకు మాకు పోలీసు రక్షణ ఉంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆ రోజు కార్యక్రమం కొరకు నేను స్టేడియంకు వచ్చాను. ఆ సాయంత్రం నేనెంతో అలసిపోయాను కానీ, ఆదివారం ఉదయం నేను సిద్ధపడి సమావేశ చివరి దినానికి హాజరయ్యాను.

రక్తం వివాదాన్ని మళ్లీ ఎదుర్కోవడం

మర్నాడు మధ్యాహ్నం నాకు [39 డిగ్రీల సెల్సియస్‌] జ్వరం, ఒక మూత్ర పిండం ఇన్ఫెక్ట్‌ అయ్యి, రక్తం తగ్గిపోయినందుకు నేను ఆసుపత్రిలో చేర్చబడ్డాను. నేను రక్తం ఎక్కించుకుంటానని ఉన్న ఫారమ్‌లో సంతకం చేయకపోతే, తను కోర్టు ఉత్తరువు తెచ్చి నాకు బలవంతంగా రక్తాన్ని ఎక్కిస్తానని డాక్టరు నన్ను భయపెట్టాడు. నేనెంతో భయపడ్డాను. నా కుటుంబీకులు నన్ను ఒత్తిడి చేస్తున్నారు; నా పెద్దక్క నాకు తన రక్తాన్ని యిస్తానని కూడా చెప్పింది, కానీ నేను వద్దని చెప్పాను.

నేను దృఢంగా ఉండడానికి నాకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థన చేశాను. నా రక్తం ఎక్కువయ్యింది, రక్తం ఎక్కించుకోవాలన్న ఒత్తిడి తగ్గింది, అందుకు నేనెంతో కృతజ్ఞురాలిని. నేను కెమోథెరపీ తీసుకోడం కొనసాగించవలసి ఉన్నా, మందును ఎక్కించడానికి నాకిక సరైన నరాలు మిగిలిలేవు. కాబట్టి నా మెడఎముక క్రింద ఒక చిన్న రంధ్రం చేసి అక్కడ ఒక ట్యూబ్‌ను పెట్టి దాని ద్వారా మందును పంపడానికి ఒక సర్జన్‌ ఏర్పాటు చేశాడు.

నా ఊపిరి తిత్తిలోని కంతిని తీసేయడాన్ని గురించి చర్చించబడినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరెప్పుడూ తాను రక్తాన్ని ఉపయోగించనని ఆ సర్జన్‌ చెప్పాడు. అమ్మ అంగీకరించమని ఎంతో చెప్పింది గనుక, నేను సరేనన్నాను. కానీ తర్వాత నేను బాధపడ్డాను, ఎందుకంటే అది వాస్తవానికి రక్తాన్ని అంగీకరించడమే. రక్తాన్ని ఉపయోగించనని హామీ యిచ్చే సర్జన్‌ కొరకు నేను వెంటనే వెదకడం ప్రారంభించాను. నా అన్వేషణ నిరాశాజనకంగా కనిపించింది, కానీ నేను తుదకు ఒకరిని కనుగొన్నాను, శస్త్రచికిత్స 1988 జనవరిలో నిర్ణయించబడింది.

నేను బ్రదుకుతానని డాక్టరు హామీ యివ్వలేదు. వాస్తవానికి, శస్త్రచికిత్సకు ముందు రోజు, ఆయన నా గదికి వచ్చి యిలా చెప్పాడు: “నేను పద్ధతి ప్రకారం చేయడానికి ప్రయత్నిస్తాను.” నేనెంతో భయపడ్డాను; నాకింకా కేవలం 19 సంవత్సరాలే, నేను చనిపోవాలని యిష్టపడటం లేదు. అయితే, ఆ మూడు కంతులు, అలాగే నా ఊపిరి తిత్తిలో మూడింట రెండొంతులు విజయవంతంగా తీసేయబడ్డాయి. మరి ఆశ్చర్యకరమైన విషయమేమంటే నేను కేవలం ఒక వారం మాత్రమే ఆసుపత్రిలో ఉన్నాను. యింట్లో రెండున్నర నెలలు కోలుకున్న తర్వాత, నేను కెమోథెరపీ, అవే పర్యవసానాలతో తీసుకోడం ప్రారంభించాను.

ఈ సమయానికల్లా మా నాన్న కూడా క్యాన్సర్‌తో రోగగ్రస్థుడయ్యాడు, కొన్ని నెలల తర్వాత ఒక రాత్రి, పడక గదిలో ఆయన చనిపోయి ఉన్నట్లు అమ్మ కనుగొన్నది. ఆయన మరణం తర్వాత, సెక్రటేరియల్‌ ట్రైనింగ్‌ కొరకు నేను వ్యాపార పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాను. నేను భౌతికంగా, విద్యా పరంగా, మరి ఆత్మీయంగా వృద్ధిచెందుతున్నాను, నేను సహాయ పయినీర్‌గా (తాత్కాలిక పూర్తి-కాల పరిచారకురాలు) కూడా సేవ చేశాను.

మరొక ఆటంకము

ఏప్రిల్‌ 1990, జార్జియా, ఆగస్టాలో నేను మా పెద్దన్న వివాహవిందుకు హాజరయ్యాను. అక్కడునప్పుడు నా పెద్దన్న యిలా అన్నాడు: “నీ కాలు నిజంగా చాలా పెద్దగా ఉంది.”

“అది ఏమిటని నీవంటావు?” అని నేనడిగాను.

“నాకు తెలియదు,” అని అతను జవాబిచ్చాడు.

“అది బహుశా కంతి అయ్యుంటుంది,” అని నేనన్నాను.

న్యూయార్క్‌ పట్టణానికి తిరిగి వచ్చిన తర్వాత, నేను డాక్టరు వద్దకు వెళ్లాను. లోకల్‌ అనస్తేషియా యివ్వబడి, బయాప్సీ తీయబడినప్పుడు నా ఎడమ కాలులో విల్‌మ్స్‌ కంతి ఉందని తేలింది. ఎముకకు కంతి ప్రాకలేదని పరీక్షలు తెలిపాయి, కానీ కంతి తీసేయలేనంత పెద్దది. కాబట్టి ఎప్పటిలా కెమోథెరపీ కొనసాగింది.

కొంత కాలానికి నేను వాంతి చేసుకోవడం ఆపుకోలేక పోయాను; నా ప్రేగుకు ఏదో అడ్డం వచ్చింది. అత్యవసర శస్త్రచికిత్స దాన్ని బాగుపర్చింది. అయితే, నా ప్రేగులు మెలి తిరిగాయి, మరోసారి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంది. నా హిమోగ్లోబిన్‌ శాతం నాలుగుకు పడిపోయింది, డాక్టరు యిలా చెప్పడం మొదలెట్టాడు: “నీవు రక్తం తీసుకోవాలి. నీవు చనిపోబోతున్నావు. నీవు ఉదయం వరకూ బ్రతికుండకపోవచ్చు.” నాకు శ్మశానాన్ని గురించి, చనిపోడాన్ని గురించి పీడకలలు వచ్చాయి.

అక్టోబరుకల్లా కంతిని తీసేయడానికి వీలయ్యేంతగా నేను కోలుకున్నాను. వాళ్లు నా మోకాలు క్రింది భాగంలో 70 శాతం తీసేశారు. నేను మళ్లీ నడవగలనా అన్నది ఒక సందేహం. నేను న్యూయార్క్‌ పట్టణంలో ప్రయాణించడానికి నేను నడవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి, చికిత్స, పట్టుదల, వీటి సహాయంతో నేను నడవడం మొదలెట్టాను—మొదట వాకర్‌తో, తర్వాత కర్రలతో, ఆ తర్వాత కేనుతో, చివరగా కాలి బ్రేస్‌తో నడిచాను. ఈ బ్రేస్‌ నేను యింటింటి పరిచర్యలో బైబిలును ఉపయోగించడానికి అనువుగా నా చేతులను కాళీగా ఉంచింది. కెమోథెరపీ యివ్వబడుతున్నప్పుడు, నేను 27 కిలోలకు తగ్గిపోయాను; నేను 155 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నాను, సాధారణంగా 54 కిలోల బరువుంటాను. నా బరువు పెరిగి నా కాలు పెరగడం మొదలైనప్పుడు, ఆ బ్రేస్‌ను డాక్టర్లు పెద్దగా చేస్తూ పోయారు. చివరకు నేను నా మామూలు బరువుకు చేరుకున్నప్పుడు, వాళ్లు నాకొరకు క్రొత్తదాన్ని చేసిచ్చారు.

జీవితం యింకా సులభతరం కాలేదు

నేను 1992 వేసవికల్లా, మంచి ఆరోగ్యంతో ఉండి, వీలైతే సహాయ పయినీర్‌ సేవ చేయాలని కూడా ఎదురుచూస్తున్నాను. నవంబరులో, నేను అందుకున్న ఒక ఉత్తరం నేనెంతో సంతోషించేలా చేసింది. నా జీవితానుభవాలు యితరులకు ప్రోత్సాహకరంగా ఉండగలవని, అవేక్‌!లో ప్రచురించడానికి వాటిని చెప్పమని నన్ను ఆ ఉత్తరం ఆహ్వానించింది. నా సంతోషం మరుసటి వారానికల్లా దుఃఖంగా మారింది.

యథావిధిగా చేసే చెస్ట్‌ ఎక్స్‌రే నాకున్న మంచి ఊపిరితిత్తిలో కంతి ఉందని చూపించింది. నేను ఏడ్చి, యింకొంత ఏడ్చాను. నేను ఒక మూత్ర పిండాన్ని, నా కాలేయంలో కొంత భాగాన్ని, నా కుడి ఊపిరితిత్తిలో చాలా భాగాన్ని, నా కాలులో కొంత భాగాన్ని పోగొట్టుకున్నాను, కానీ రెండు ఊపిరితిత్తులను పోగొట్టుకుని ఎవ్వరూ బ్రతుకలేరు. మళ్లీ నా కుటుంబీకులు, నా స్నేహితులు నాకు మద్దతునిచ్చారు, నేను ఆ వ్యాధితో మరోసారి పోరాడడానికి నిశ్చయించుకున్నాను.

కంతిని చిన్నదిగా చేయడానికి కెమోథెరపీ యివ్వడం మొదలైంది. వాటిని తీసేసి ఊపిరితిత్తిని రక్షించవచ్చని ఒక డాక్టరు భావించాడు. మార్చి 1993లో నేను ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లాను. వాళ్లు ఒకసారి చూసి మళ్లీ కుట్లేసేశారని నేను తర్వాత తెలుసుకున్నాను. ఊపిరితిత్తిని తీయకుండా కంతిని వాళ్లు తీయలేకపోయారు. అప్పటినుండి నేను కంతిని నిర్మూలం చేయడానికి తీవ్రమైన కెమోథెరపీ తీసుకుంటున్నాను.

మరి నేను మరణాన్ని గూర్చి ఎందుకంత ఎక్కువగా ఆలోచిస్తానో మీకిప్పుడు తెలిసిందా? నా జీవితం సులభతరంగా ఉండివుంటే, మనమెందుకు చనిపోతాం, మరి భవిష్యత్తు కొరకు ఏ నిరీక్షణ ఉందని నేను ఆలోచించి ఉండేదాన్నా? నాకు తెలియదు. అయితే, మనం జీవిస్తామా లేక మరణిస్తామా అన్నది కాదుగానీ, మనకు నిత్య జీవాన్ని యివ్వగలవాడైన యెహోవా దేవుని ఆశీర్వాదాలను పొందుతామా లేదా అన్నదే ఎంతో ప్రాముఖ్యమని నేను కచ్చితంగా చెప్పగలను. ఆయన నూతన లోకంలో జీవించగల నిరీక్షణను గురించి తలంచుతూ, నా భారాలను ఆయనపై వేస్తూ, నేను కల్గివున్న నమ్మకాలనే కల్గివున్న స్నేహితులతో సన్నిహితంగా ఉండడం నన్ను కాపాడింది.—కీర్తన 55:22; ప్రకటన 21:3, 4.

ఇతర యౌవనులకు మంచి ఆరోగ్యం ఉందని నేను సంతోషిస్తున్నాను. దాన్ని అనవసరమైన వాటి కొరకుకాక, యెహోవా సేవలో జ్ఞానవంతంగా ఉపయోగించడానికి నేను చెప్పిన వృత్తాంతం వాళ్లలో చాలామందిని కదిలిస్తుందని నేను ఆశిస్తున్నాను. దేవుని నూతన లోకంలో మంచి ఆరోగ్యాన్ని అనుభవించడం ఎంత గొప్పగా ఉండవచ్చు! అందులో డాక్టర్లు, ఆసుపత్రులు, సూదులు, ట్యూబుల అవసరం ఉండదు—అవును, జబ్బుదై మరణిస్తున్న ఈ పాత లోకాన్ని జ్ఞాపకం చేయడానికి ఏది మిగిలి ఉండదు.—కేథీ రోబర్‌సన్‌ చెప్పినది. (g94 8/22)

[21వ పేజీలోని చిత్రం]

జూనియర్‌ హైస్కూల్‌ నుండి నేను ఉత్తీర్ణురాలినైనప్పుడు

[23వ పేజీలోని చిత్రం]

న్యూయార్క్‌ ప్రాంతీయ సమావేశమందు ఆహారసేవలో సహాయం చేస్తున్నప్పుడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి