గ్వామ్‌లో నిగూఢమైన వ్యాధులు
గ్వామ్‌లోని తేజరిల్లు! ప్రతినిధి
ఆమెకు అనుమానం వచ్చింది. అయినప్పటికి, “మీ నాన్నకు లిటికో, బాడిగో అనే వ్యాధులు ఉన్నాయని పరీక్షలన్నీ నిర్థారిస్తున్నాయి,” అని డాక్టరు చెప్పిన మాటలు ఆమె ఎంతో ఖంగుతినేలా చేశాయి. అవి రెండూ ప్రాణాంతకమైనవని ఆమెకు తెలుసు.
ప్రపంచమంతటిలో, గ్వామ్‌లోనే అమెరికాకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా యీ వ్యాధి ప్రబలివుంది. కాని, యీ స్త్రీ తండ్రి జీవితాన్ని చివరికి బలిగొనే యిటువంటి భయానకమైన వ్యాధులేవి? వాటికి గల కారణాలేవి? అతడు బ్రతికి ఉన్నంత కాలం సహించడానికి తోడ్పడేందుకు ఆమె ఏం చేయగలదు?
లిటికో, బాడిగో అంటే ఏమిటి?
లిటిగో, బాడిగో అనేవి నాడీ కండరాల వ్యవస్థను బలహీనపరచే వ్యాధులు. లిటికో వైద్య ప్రపంచంలో యమియోట్రాఫిక్ లాటెరల్ స్ల్కెరోసిస్ (ఎఎల్‌ఎస్), లేదా లూ గెరిగ్స్ వ్యాధి అని పిలువబడుతుంది. ప్రసిద్ధ న్యూయార్క్ యాంకీ బేస్‌బాల్ ఆటగాడైన లూ గెరిగ్ 1941లో యీ వ్యాధివలన చనిపోయినప్పుడు అది అతని పేరిట పిలువబడింది. ఎఎల్‌ఎస్‌కు లిటికో అనేది స్థానిక పేరు.
ఎఎల్‌ఎస్ వెన్నుపాములోని చాలక నాడీకణాలను, నరాలను బాధిస్తుంది. చేతులు, కాళ్ళు, గొంతు కండరాలు నెమ్మదిగా, క్రమంగా చచ్చుపడిపోతాయి. అయినప్పటికీ, కొంతకాలం వరకు, స్పర్శాజ్ఞానం, అలాగే పునరుత్పత్తి శక్తి, మల మూత్రాశయ విసర్జనా నియంత్రణ చక్కగానే పని చేస్తాయి. నిజానికి, ఎఎల్‌ఎస్ రోగులకు చాలా మంది పిల్లలు పుట్టారు. ఒక స్త్రీ తన 43వ ఏట చనిపోక ముందు, పద్నాలుగు సంవత్సరాలుగా ఎఎల్‌ఎస్‌తో బాధపడుతూనే ఆరోగ్యంగా ఉన్న ఆరుగురు పిల్లలను ప్రసవించింది. అయినప్పటికీ, ఎఎల్‌ఎస్ ఎక్కువవుతున్న ఘట్టాల్లో మూత్రాశయ వ్యాధులు, శ్వాసకోశముల వాపు, శ్వాసనిశ్వాసలు సరిగ్గా లేకపోవడం వలన రోగం ముదిరి మరణానికి దారి తీస్తాయి. తరచూ 35 నుండి 60 ఏండ్లలోపు వయసున్న పెద్దల్లో ఎఎల్‌ఎస్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. గ్వామ్‌లో దీనికి బాధితులైనవారిలో 19 ఏండ్ల అమ్మాయి అందరికన్నా చిన్నది.
ఆ ప్రాంతంలో మెదడు క్షీణించడం అనేదానికి ఉపయోగించే పదం బాడింగ్. వైద్యశాస్త్ర సంబంధంగా పార్కిన్‌సోనిజమ్-డిమినిష్యా అని పిలుస్తారు, పార్కెన్‌సన్జ్, ఆల్సహిమర్జ్ వ్యాధుల కలయిక అని అది వివరించబడుతుంది. మొదట పార్కెన్‌సన్జ్ లక్షణాలు గాని (కదలికలు నెమ్మదిగా ఉండడం, కండరాల బిగుసుకుపోవడం, వణుకుడు) లేదా మానసిక మార్పులు (జ్ఞాపకశక్తి కోల్పోవడం, అయోమయంగా అనిపించడం, వ్యక్తిత్వంలో మార్పులు) మొదట కలుగవచ్చు. కొన్నిసార్లు, రెండు వ్యాధుల లక్షణాలు ఒకేసారి కనిపించవచ్చు. వృద్ధి అయిన ఘట్టాల్లో, రోగి టిష్యూలో అల్సర్ రావడం, మలమూత్ర నియంత్రణ లేకపోవడం, ఎముకలు నిస్సత్తువవడం, ఎముకలు విచ్ఛిన్నం కావడం, ఎర్రరక్త కణాలు తగ్గిపోవడం చివరికి వ్యాధుల వలన చనిపోవడం జరుగుతుంది.
లిటికో, బాడిగో అనే రెండూ రెండు వ్యాధులుగా అని పరిగణించబడుతున్నాయి. అయినప్పటికీ, అవి విభిన్న లక్షణాలు గల ఒకే వ్యాధి అని కొందరు నమ్మడానికి పరిశోధన నడిపింది.
నిగూఢత ఎక్కువవుతుంది
పరిశోధించబడ్డ పెద్ద సమస్యలు యీ క్రింద యివ్వబడ్డాయి: (1) ఎఎల్‌ఎస్, మరియు పి.డి.కి బాధితులైన వారిలో మారియాన దీవుల్లో నివసించే అసలైన కెమెరో ప్రజలు 98 శాతం కాగా, గ్వామ్‌లో నివసించిన ఫిలిప్పినో ప్రజలు ఎందుకు తక్కువ శాతం మంది ఉన్నారు? (2) ఈ వ్యాధులు ఎక్కువగా ఉన్న యితర ప్రాంతాలు యీ రేఖాంశంపైనే ఎందుకున్నాయి? (3) ప్రతిచోట రోగులకు ఏదో ఒక రోగమే ఉండగా మారియాన దీవుల్లోని బాధితులకు ఎఎల్‌ఎస్, పి.డి., రెండూ ఉన్నాయెందుకని? (4) ఈ బాధితుల కేంద్రనాడీ వ్యవస్థలోకి పెద్ద ఎత్తున అల్యూమినియం చొచ్చుకొని పోతున్నదెందుకని? (5) మెదడు కణాల్లో ఎక్కువ అల్యూమినియం ఉన్నచోట, జింకు తక్కువగా ఉంటుందెందుకని? యిసుకలోను, నీటిలోను ఎక్కువగా అల్యూమినియం, మాంగనీసు, యినుము ఉంటాయి గాని, కాల్షియం, మాగ్నేసియం, జింక్ తక్కువగా ఉంటాయని పశ్చిమ పసిఫిక్‌లో, యీ వ్యాధి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జరిపిన అధ్యయనాలు చూపిస్తున్నాయి.
నిగూఢతను తొలగించాలన్న ప్రయత్నం
గ్వామ్, జపాన్, కెనడాల్లోని పరిశోధకులు యీ నిగూఢమైన వ్యాధులను గూర్చిన నిజాలను వెలికి తీయడానికి చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశారు. ఈ పరిశోధనా గుంపులు తయారుచేసిన అనేక సిద్ధాంతాల్లో, విభిన్న నిజాలు వ్రాయబడ్డాయి: అవేవంటే, యివి అరుదుగా వంశపారంపర్యమైనవి, నెమ్మదిగా వైరసులు సోకడం, దీర్ఘకాలంగా కొద్దిపాటి విషపూరితమైన లోహాన్ని ఉపయోగించడం మూలంగా వచ్చేవి.
ఒక ఫార్మకాలజిస్ట్ యీ విధంగా చెబుతున్నాడు, మెదడు కణాల్లో రెండు నుండి మూడు మిల్లీగ్రాముల అల్యూమినియం ఉంటే అది మెదడు సాధారణ ప్రవర్తనకు భంగం కలిగించగలదు. ఇసుక, నీరు నుండి మాత్రమే కాక, బేకింగ్ పౌడర్‌లోను, కేక్, పాన్‌కేక్ మిశ్రమాల్లోను, అమ్మడానికి తయారు చేసే పిండి, గడ్డకట్టించిన పిండి, పులుపును విరిచే కొన్ని మందులు, దుర్గంధాన్ని పోగొట్టే వస్తువుల్లో, మందుల్లో అల్యూమినియం ఉంటుంది. అలాగే అల్యూమినియం పొట్లాల్లో, వంట పాత్రల్లో, ముఖ్యంగా వాటిలో ఆమ్ల, క్షార గుణాలు గల ఆహార పదార్థాలను వండేటప్పుడు, అవి అల్యూమినియాన్ని పీల్చుకుంటాయి.
నాడీశాస్త్రజ్ఞుడును, అరుదైన యీ వ్యాధుల చికిత్సలో నిపుణుడునైన డా. క్వాన్-మిన్ యిలా అన్నాడు: “నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలజికల్ అండ్ కమ్యూనికేటివ్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ అనే సంస్థ గత 30 సంవత్సరాలకు పైగా చేసిన సమగ్రమైన అధ్యయనాలు మానవ జాతి ఎరిగి ఉన్న ఎక్కువ ప్రాణాంతకమైన, కేంద్ర నాడీవ్యవస్థకు వినాశనకరమైన, మోసకరమైన వ్యాధులకు కారణమైన వాటి మర్మాన్ని వెలికి తీసుకురాలేకపోయారు. అయినప్పటికి, అరుదైన వంశపారంపర్య కారణం, నెమ్మదిగా వైరసు సోకడంకన్నా, దీర్ఘకాలంగా విషపూరితం చేసే లోహమే కారణమని ఎక్కువగా నమ్ముతున్నట్లు ఆయన నొక్కి చెబుతున్నాడు. ఇప్పటికీ, పరిశోధన కొనసాగుతూనే ఉంది. పరిష్కారం దొరికే వరకు ఒకరు చేయగలిగిందేమంటే, సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయడం, బాధితులైనవారికి ఎంతో సహాయకరంగా ఉండడము.
ఏమి నిరీక్షించాలి, ఎలా తట్టుకోవాలి
వారు తెలుసుకున్న రోగ లక్షణాలు భయపెట్టేవైనా, విషాదకరమైనవైనా, గ్వామ్‌లో ఇంటర్వ్యూ చేసిన కుటుంబాల దృక్పథం అంగీకరించదగినది. దానికి చికిత్స లేదని వారికి తెలుసు.
రోగికి, అతని కుటుంబానికి అమితమైన ఆశాభంగము, నిరాశ ఉంటుంది. ఒక పి.డి. బాదితునితో, అతన్ని ఎక్కువ బాధ కలిగించింది ఏమిటని అడిగినప్పుడు అతనిలా అన్నాడు: “సవ్యంగా మాట్లాడలేకపోవడం, యింటి చుట్టూ నడవలేకపోవడం నాకు ఎంతో నిరాశను కలిగిస్తుంది.” వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు, జ్ఞాపశక్తి లోపించడం కుటుంబ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తాయి. టిష్యూలో అల్సర్ రావడం, మలమూత్ర నియంత్రణ లేకపోవడం, వారిని పరామర్శించడం మరింత కష్టతరం చేస్తాయి. ఎఎల్‌ఎస్ రోగి మానసికంగా మెలకువగా ఉంటాడు కాబట్టి, అతడు సహకరిస్తూనే ఉంటాడు, కాని రోగం ముదురుతున్న సమయంలో అతడు పూర్తిగా నిస్సహాయుడౌతాడు.
ఎఎల్‌ఎస్ లేదా పి.డి. రోగికి ఊపిరి పీల్చుకోడం కష్టంగా ఉన్నప్పుడు శ్వాస పీల్చుకునే పంపు తరచూ అవసరమౌతుంది. ఆహారం మెత్తనిదై ఉండాలి, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొనగల్గేందుకు గొంతు లోపలికి చిన్న చెంచాలతో ఆహారం పెట్టాలి. ఊపిరి పీల్చడం కష్టంగా ఉన్నప్పుడు, ఆక్సిజన్ అవసరమౌతుంది.
హోమ్ కేర్ సర్వీస్ ఏజన్సీ శారీరక చికిత్స చేయడం, వ్యాధి సోకకుండా అదుపులో ఉంచడం, భావోద్రేక సంబంధమైన మద్దతునివ్వడం వంటి సేవలనందిస్తుంది. వారి అవసరతల్లో, బ్రేస్‌లను, స్ప్లింట్లను, స్ప్రింగున్న పడకలను, చాపలను, చక్రకుర్చీలను, మలమూత్రాలను తీసివేసే పాత్రలను అందించేందుకు గ్వామ్ లిటికో అండ్ బాడిగో అస్సోసియేషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఈ 1970 నుండి కండరాల బిగువును తగ్గించి, నెమ్మదిగా కదలడాన్ని వృద్ధిచేసే ఎల్-డోపతో పి.డి. రోగులకు చికిత్స చేస్తున్నారు. దురదృష్టవశాత్తు, చిత్తవైకల్యానికి, ఎఎల్‌ఎస్ రోగులకు ఫలవంతమైన మందు లేదు.
సాధారణంగా యీ రోగంతో బాధపడుతున్నప్పుడు, ముఖ్యంగా కుటుంబంలో మంచి సహకారం చాలా అవసరం. తన తండ్రిని, తల్లిని, వేరే ఆరుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన ఓ మహిళ తన కుటుంబాన్ని ప్రశంసిస్తూ యీ విధంగా చెబుతుంది: “సహాయం చేయడానికి వాళ్ళందరూ మంచివాళ్ళు.” రోగియైన తన సహోదరి భర్తనుండి లభించిన సహాయాన్ని గూర్చిన మధురస్మృతిని గూర్చి చెబుతూ ఆమె యిలా అన్నది: “ఆయన ఎంతో ప్రేమను కనబరచాడు! ప్రతిరోజు ఆయన ఆమెను వీల్‌చెయర్‌లో కూర్చోబెట్టి నడిపించేవాడు.”
ఒక మహిళ తన తల్లిని పరామర్శించడానికి అవివాహితగా ఉండాలని తీర్మానించింది. ఎఎల్‌ఎస్ మూలాన తన కుటుంబం అప్పటికే ముగ్గురిని కోల్పోయింది, మిగిలినవారిలో ఆ లక్షణాలు కనబడడం మొదలుపెట్టాయి. మరొక స్త్రీ 24 కన్నా ఎక్కువ సంవత్సరాలు పక్షవాతంతో బాధపడింది. ఆమెకు ముగ్గురు కూతుళ్ళు, వారిలో యిద్దరు ఆమెను సరిగ్గా పరామర్శించడం కోసం బడి చదువు మానేశారు. ఆమెను పగలు రాత్రి ప్రతి 30 నిమిషాలకు అటు యిటు తిప్పుతూ ఉండేవారు. రోగులను నిరంతరం కనిపెట్టవలసిన అవసరం ఉండడం వలన, వాళ్ళ అవసరతలు తీర్చగల తర్ఫీదు పొందిన సిబ్బంది ఉన్న ఆసుపత్రుల్లో వాళ్ళను చేర్పించడం అవసరమని కొన్ని కుటుంబాలు గ్రహించాయి.
ఎఎల్‌ఎస్, పి.డి.ని విజయవంతంగా ఎదుర్కున్న కుటుంబాలు యీ సలహాలను యిస్తున్నాయి: ప్రేమ చూపించాలి, ఖచ్చితంగా ఉండాలి. రోగితో అసహనంగా ఉండకూడదు లేదా రోగి నుండి అమితంగా ఆశించకూడదు. దేవునియందు విశ్వాసముంచాలి. తరచూ ప్రార్థించాలి. రోగితో కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం గడిపేందుకు కొన్ని ప్రత్యేక సమయాలను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడప్పుడు రోగులను షికారుకు తీసుకు వెళ్ళాలి, గ్రామాల్లోని సామాజిక విందులకు, వినోదాలకు వెళ్ళడానికి అతనికి సహాయం చేయాలి; కుటుంబంలో రోగి ఉన్నందుకు సిగ్గుపడకూడదు; బాధితులు తరచూ ఒంటరిగా ఉంటారు కాబట్టి, వారిని దర్శించడానికి పిల్లలను, మనమళ్ళను, మనమరాండ్రను, స్నేహితులను ప్రోత్సహించాలి.
వైద్య శాస్త్రం యీ రోగాలకు ఖచ్చితమైన కారణాలను తెలుసుకోలేకపోగా, బాధితులకు, వారి కుటుంబాలకు నిరీక్షణ ఉంది. త్వరలోనే దేవుని నూతన లోకంలో అన్ని వ్యాధులు, వేదన, మరణం శాశ్వతంగా తీసివేయబడతాయని బైబిలు చూపిస్తుంది. వీటికి బదులుగా, నిత్యజీవమనే నిరీక్షణతో పరిపూర్ణ మనస్సూ శరీరాలు ఉంటాయి. చనిపోయిన ప్రియమైనవారు కూడా భూమిపై జీవించడానికి పునరుత్థానులౌతారు. దయచేసి, దేవుని వాక్యమైన బైబిలును రోగులైన యీ ప్రియమైన వారికి చదివి వినిపించండి, అలా వారు ముందున్న అద్భుతమైన నిరీక్షణను గురించి నేర్చుకోగలరు.—కీర్తనలు 37:11, 29; యెషయా 33:24; 35:5-7; అపొస్తలుల కార్యములు 24:15; ప్రకటన 21:3-5.
[26వ పేజీలోని చిత్రం]
కుటుంబ సభ్యులు ప్రాణాంతకమైన యీ రోగాన్ని ఎదుర్కోవడం ఒక సవాలుగా భావిస్తారు