వ్యాధి మరియు మరణములకు వ్యతిరేకముగ పోరాటము అది విజయవంతమగుచున్నదా?
వ్యాధి ఇక లేదు, మరణము ఇక లేదు! చాలా మంది ప్రజలకిది ఆశాజనితమైన ఆలోచన మాత్రమేనన్నట్లు ధ్వనించవచ్చును. వైద్యుడు మరియు బాక్టీరీయాలజిలో ఆచార్యుడునైన వేడ్. డబ్ల్యు. ఆలివర్ వ్రాసినట్లుగా: “మొట్టమొదట చరిత్ర లిఖించబడినప్పటినుండి, లెక్కించలేనంతగ వ్యాధి మానవ భవితవ్యమును మార్చివేసినది. . . గొప్ప అంటు వ్యాధులు భయంకరమైన వేగముతో మానవునిపై విరుచుకుపడెను. . . రోగము శాశ్వతముగ తన కర్కశ పాదమిడెను.”
ఒక సమూలమైన మార్పు తథ్యమని నమ్ముటకు కారణమేమైన కలదా? వ్యాధిని పూర్తిగా లేకుండ చేయునంత సమీపములో వైద్య శాస్త్రము కలదా? అలాగే బహుశా మరణమును కూడ?
రోగముపై పోరాటములో వైద్యులు మరియు పరిశోధకులు నిర్వివాదాంశముగ చెప్పుకోదగినంత కృషిచేశారు. ఎట్టకేలకు 19వ, శతాబ్దము అంతమునకు కలరాను విజయవంతముగ నయము చేయగలుగుటయెడల లేక భయంకర మసూచిపై టీకాను కనుగొనుటయెడల ఏ వ్యక్తి కృతజ్ఞత తెల్పకుండ నుండలేడు. ఆ టీకాను తక్కువ ప్రమాదకరమైన ఆవు-మసూచి పుండు నుండి 1796 లో ఎడ్వర్డ్ జెన్నెర్చే తయారుచేయబడినది. 1806లో అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రెసిడెంట్ థామస్ జెఫర్సన్, అనేకుల భావములను వ్యక్తపర్చుచూ జెన్నెర్కు యిట్లు వ్రాసెను: “మీది ఆదరణకరమగు ప్రతిబింబము. అందుచేత మీరు జీవించిరను సంగతిని మానవ జాతి ఎన్నడును మరచిపోలేదు. భయంకర మసూచి ఉండెనని చరిత్ర వలననే రానున్న ప్రజలు తెలుసుకొందురు.
అంతేగాక డిఫ్తీరియా మరియు పోలియో మైలిటీస్ వంటి జబ్బుల విషయములో విజయవంతమైన వైద్యపరిశోధనను కూడ ఉపకారమనే కృతజ్ఞతతో చెప్పవచ్చును. గుండెజబ్బు, కేన్సరును నయముచేయుటలో యీ మధ్య సాధించిన అభివృద్ధిని మెచ్చుకొనని వారు ఎవరూ ఉండరు. అయినను గుండెజబ్బు, కేన్సరువలన ప్రజలింకా చనిపోతూనే ఉన్నారు. రోగము మరియు వ్యాధి పూర్తిగా తీసివేయవలెనను ఆశయము చేజారిపోతునట్లే అయినది.
“క్రొత్త” జబ్బులు!
నమ్మశక్యముగానట్లుగ, క్యాట్ (CAT) స్కాన్స్, మరియు రీకన్‌ష్ట్రక్షన్ సర్జరీ వంటివి రావటము చూసిన నేటి తరము “క్రొత్త” జబ్బులు కోకొల్లలుగ పుట్టకొచ్చుటను కూడ చూసినది. అవేవనగా లీజియన్నైర్స్ జబ్బు, టాక్సిక్ షాక్ సిండ్రోమ్ మరియు విస్తృతముగ ప్రచారము చేయబడిన సంహారిణి ఎయిడ్స్ (AIDS) అనబడుచున్నది.
ఈ జబ్బులు ఎంత క్రొత్తవని చాలమంది యిట్టే అడుగుచున్నారు. యు.యస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్టులోని ఒక వ్యాసమిట్లు వ్యాఖ్యానించుచున్నది. అదేమనగా చాలాకాలమునుండి చుట్టు ప్రక్కలనున్న జబ్బులను స్పష్టముగ కనుగొని కొన్ని సందర్భములలో క్రొత్తపేర్లు యివ్వబడుచున్నవి. ఉదాహరణకు లీజియన్నైర్స్ జబ్బు 1976లో గుర్తించబడినది. కాని అది యింతకుముందు వైరల్ నిమోనియా అని తప్పుగా గుర్తించబడియుండవచ్చును. అలాగే టాక్సిక్ షాక్ సిండ్రోమ్‌ను స్కార్లెట్ జ్వరమని లోగడ పొరబడియుండవచ్చును.
అయినను అనేక రోగములు నిర్వివాదాంశముగ క్రొత్తవిగానే అగపడుచున్నవి. వీటిలో బాగా తెలిసినది ఎయిడ్స్ అనుటలో ఎట్టి సందేహములేదు. కృంగదీయునట్టిది మరియు మరణకరమగు యీ జబ్బును 1981లో గుర్తించి పేరు పెట్టిరి. అంతగా తెలియని మరొక “క్రొత్త” జబ్బు బ్రెజిలియన్ పర్ప్యూరిక్ జ్వరము. ఇది బ్రెజిల్లో 1984లో గుర్తించబడినది. దీని మరణములు 50 శాతమని అంచనా వేయబడినది.
స్వస్థత కనుచూపు మేరలో లేదు
అందువలన మానవుడు శక్తికొలది ప్రయత్నించినను, పూర్తిగా శాశ్వతమైన స్వస్థత మానవ రోగములకు కనుచూపు మేరలో ఎక్కడా లేదు. 1900 సంవత్సరము నుండి మానవుల సగటు ఆయుర్దాయము 25 సంవత్సరములు పెరిగెననుట వాస్తవమే. కాని యీ మార్పు కేవలము వైద్యనైపుణ్యతలతో పసితనములో లేక చిన్నవయసులో మరణించు ప్రమాదములను తగ్గించినందున వచ్చినది. మానవుని ఆయుర్దాయము ప్రాథమికముగ బైబిలు యొక్క “మూడు యిరువది సంవత్సరములు ఆపై పది”నకు సమీపముననే ఉన్నది.—కీర్తన 90:10, కింగ్ జేమ్సు వర్షన్.
అందువలననే, 1987 డిశంబరులో తన 114వ, ఏట అన్నా విలియమ్స్ మరణించినప్పుడు అదొక వార్త అయినది. మిస్ విలియమ్స్ మరణముపై వ్యాఖ్యానిస్తూ, ఒక వ్యాసకర్త యిట్లు వ్రాసెను: “శాస్త్రజ్ఞులు, 115 నుండి 120 సంవత్సరములు మానవ ఆయుర్దాయమునకు బహుశ అంతిమ హద్దని తలంచవచ్చును. అలా ఎందుకుండవలయును? మానవ శరీరము 70, 80 లేక 115 సంవత్సరముల తరువాత ఎందుకు మరణించవలయును?”
మానవ జీవకణములు 50 సార్ల వరకు మాత్రమే విడిపోవు శక్తిగలవని కనబడుచున్నట్లు వైద్యశాస్త్రజ్ఞులు 1960వ, దశకములో కనుగొనిరి. ఒకసారి యీ హద్దుచేరిన తరువాత ఆ జీవకణములను జీవింపజేయుట కేమి చేయలేమన్నట్లున్నది. ఇది మునుపటి విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతమును వ్యతిరేకించుటకు దారితీయును. సరైన పరిస్థితులు కల్పించినచో మానవ జీవకణములు నిరంతరము జీవింప గలవనునది మునుపటి సిద్ధాంతము.
దానితోపాటు చాలమేరకు మానవ బాధ మానవ కల్పితమేనని గుర్తెరుగుట. ఒక పరిశోధకుడు మంచి అవగాహనతో యిట్లు ముగించెను: “జీవరసాయన వైద్యపునాదుల మీద మాత్రమే రోగములు జయింపబడుటలేదు. రోగముయొక్క చరిత్ర సామాజిక మరియు నైతిక విషయాలతో చాల సన్నిహితముగ ముడిపడియున్నది.”
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యిట్లు గమనించెను: “మనపై గాయములను మనమే చేసికొన్నాము. రోగమునకు కారణమైన వాటిని మొదటగా తొలగించుకొనుటకు బదులు, విజ్ఞాన శాస్త్రము, డాక్టర్లు మరియు ఆస్పత్రులు స్వస్థతను కనుగొనునని నమ్మితిమి. ప్రాణమును కాపాడునట్టి వైద్యచికిత్సా సదుపాయములు లేకుండ మనమేమి చేయలేక పోదుమనుమాట వాస్తవమే. కాని స్పష్టముగ మాట్లాడుకున్నచో అవి మన ఆరోగ్యమును పెంచవు—అవి మనము చనిపోకుండ ఆపును. . .. తన్నుతాను నాశనము చేసికొనునట్లుగా పొగత్రాగువానికి అలవాటైన బలమైన కోరిక, అలాగే త్రాగుబోతు మనసు, శరీరములపై నిరుద్యోగముయొక్క ప్రభావము యివన్ని కొన్ని “క్రొత్త జబ్బులు.” మన జీవితములను ముంచి వేసి మన ఆర్థికాధారములను ఖాళీచేయునట్టి “రోడ్డు ప్రమాదముల అంటువ్యాధిని” మనమెందుకు అనుమతిస్తున్నాము?
వ్యాధి, రోగము, బాధ, మరియు మరణము ఆవిధంగా మనతోనే ఉన్నవి. అయినను, వ్యాధి యిక ఉండని, మరణము యిక ఉండని ఒక సమయము కొరకు మంచి నమ్మకముతో ముందుకు చూచుటకు కారణమున్నది. అన్నింటికన్న మిన్నగా, ఆ సమయము అతి సమీపములోనున్నదని నమ్ముటకు అన్నివిధములా కారణమున్నది. (w91 6/15)
[4వ పేజీలోని బాక్సు]
“ఐగుప్తుయొక్క జబ్బులు”
ముందు కాలములనుండి మానవులు రోగముపై పోరాడి అపజయమొందిరని బైబిలులో కూడ లిఖించడిబనది. ఉదాహరణకు, మోషే “ఐగుప్తుయొక్క సమస్త చెడురోగముల”ను గూర్చి మెలకువతో పలికెను.—ద్వితీయోపదేశకాండము 7:15.
వీటిలో బోదకాలు, అతివిరేచనవ్యాధి, మసూచి, ఒరు బీజవ్యాధి, కంటి జబ్బులు ఉన్నట్లున్నవి. ధర్మశాస్త్ర సంబంధముగా అభివృద్ధి చెందిన ఆరోగ్య సూత్రములు పాటించుట వలన మోషే ప్రజలు చాలవరకు ఆ జబ్బుల నుండి తప్పించుకొనిరి.
అయినప్పటికిని ఐగుప్తులో తైలముపూసి భద్రపర్చిన మానవ శవములను చాలా జాగ్రత్తగ పరిశీలించినప్పుడు “ఐగుప్తుయొక్క జబ్బుల”నేకములు గుర్తించబడెను. వీటిలో కీళ్ళవ్యాధి, స్పాండిలైటీస్ పళ్లకు సంబంధించిన వ్యాధులు, అపెండిసైటీస్ వాత సంబంధరోగము కలవు. ఎబెర్స్ పాపిరస్ అని తెలియబడుచున్న పూర్వపు ఒక ప్రభుత్వ వైద్య గ్రంథము కంతులవ్యాధి, కడుపు నొప్పులు, కాలేయపు జబ్బులు, షుగరు, కుష్టు, కండ్లకలక మున్నగువాటిని కూడ తెల్పుచున్నది.
పూర్వము ఐగుప్తులోని వైద్యులు యీరోగములపై పోరాడుటకు తమ శక్తికొలది కృషి చేసిరి. వారి వైద్యరంగములో వారు నిపుణులైరి. గ్రీకు చరిత్రకారుడైన హేరోదత్తు యిట్లు వ్రాసెను: “దేశము (ఈజిప్టు) నిండా వైద్యులే; ఒకడు కంటిరోగములకు మాత్రమే చికిత్సచేయును. మరొకడు తల, పళ్లు, కడుపు, లేక లోపలి భాగములకు చికిత్సచేయును. కాని ఐగుప్తు “మందు” చాలవరకు వాస్తముగ మతపరమైన బూటక వైద్యమేగాని విజ్ఞాన వైద్యశాస్త్ర సంబంధమైనది కాదు.
ఆధునిక వైద్యులు రోగముపై పోరాటములో ఎక్కువ విజయముననుభవిస్తున్నారు. అయినను, వైద్య పరిశోధకుడైన జెస్సిడాబ్సన్ ఆలోచనను రేకిత్తుంచునట్టి యీ ముగింపుకు వచ్చెను:
“గతించిన కాలములోని రోగములను గూర్చి చదివి మనమేమి నేర్చుకొనగలము? ఉన్న సాక్ష్యముయొక్క సమీక్షనుండి వచ్చు సాధారణ ముగింపు ఏదనగా పురాతన వ్యాధులు, మరియు బాధలు నేడున్న వాటికన్న గుర్తించతగినంతగా భిన్నముగా లేవు. . . ఎంతో ఓర్పుతో కూడిన పరిశోధనా ప్రయత్నములు మరియు నైపుణ్యములు వ్యాధి నిర్మూలనను ఏమిచేయలేదన్నట్లే ఉన్నది.”—డిసీజ్ ఇన్ ఏన్షియంట్ మ్యాన్.