కాలిఫోర్నియాలో భూకంపాలు—పెద్దది ఎప్పుడు వస్తుందో?
భూమి కంపించింది. గ్యాస్ లైన్లు పగిలిపోయాయి. భవంతులు కూలిపోయాయి. మంటలు ఉద్ధృతమయ్యాయి. అది లాస్ ఏంజెల్స్‌లో యిటీవల జరిగిన భూకంపమా? కాదు. అది సాన్ ఫ్రాన్సిస్కోలో ఏప్రిల్18, 1906లో జరిగిన భూకంపం. ఆ భూకంపం, దాని తర్వాత మూడు రోజులపాటు చెలరేగిన మంటలు నగర నడిబొడ్డులోని 512 బ్లాకులను నిర్మూలం చేసి, 700 మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి.
అలాంటి దుర్ఘటనలు ఎందువల్ల సంభవిస్తాయి?
శాస్త్రజ్ఞులు ప్లేట్ టెక్టోనిక్స్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ, ఎందువల్ల అలా సంభవిస్తాయో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నెమ్మదిగా కదులుతూ, కొన్ని సార్లు ఒకదాని కిందికి మరొకటి వేగంగా దొర్లే 20 గట్టి భూపలకలపైన లేక శిలాపలకలపైన భూమి ఉపరితలం ఉందని వారు చెబుతారు. పసిఫిక్ రాతిపలకలు నెమ్మదిగా ఉత్తరానికి కదిలి, వేగంగా దక్షిణ అమెరికా రాతిపలకల వైపు దొర్లుతాయి. ఈ రెండు పలకల మధ్య దొర్లే ప్రాంతాన్ని సాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అంటారు. అది గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా నుండి ఉత్తరాన 1046 కిలోమీటర్ల వరకు వ్యాపించి, సాన్ ఫ్రాన్సిస్కోకు సమీపాన పసిఫిక్ మహాసముద్రంలో అప్రత్యక్షమౌతుంది.
మీ చేతి గోళ్ళు ఒక సంవత్సరానికి ఎంత వేగంగా పెరుగుతాయో లేదా కొన్ని సెం. మీ. పెరగడానికి ఎంత కాలం పడుతుందో అదే వేగంలో యీ రాతిపలకలు చాలా నెమ్మదిగా కదులుతాయి. అనేక సంవత్సరాల తర్వాత రాతిపలకలు ఒకదాని కింద మరొకటి దొర్లడానికి ప్రయత్నిస్తుండగా దగ్గరికి అతుక్కుని, ఒత్తిడి కలుగుతుంది. అప్పుడు పెద్దగా పేలితే విడుదలయ్యేంత శక్తితో అవి పగిలిపోతాయి.
సాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ లాస్ ఏంజెల్స్‌కు ఈశాన్యదిశగా 53 కిలోమీటర్ల పొడవుగా ఉంటూ, సాన్ ఫ్రాన్సిస్కోకు సమీపాన పసిఫిక్ మహాసముద్రంలో చొచ్చుకొనిపోతుంది. కాలిఫోర్నియావాసులు మరిపెద్ద భూకంపాన్ని గూర్చి చెప్పుకోవడంలో ఆశ్చర్యమేమైనా ఉందా?
సాన్ ఫ్రాన్సిస్కో
ఈ 1906లో జరిగిన భూకంపం తర్వాత, సాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ యొక్క ఉత్తర చివరి భాగం నిమ్మళంగానే ఉంది. అక్టోబరు 17, 1989 సాయంకాలం 5 గంటలకు సుమారు ఐదు కోట్ల అమెరికావాసులు టి.వి.లో బేస్‌బాల్ ఆటను చూస్తున్నారు. ఆకస్మికంగా, టి.వి. కెమెరాలు ఎగిరిపడ్డాయి. దక్షిణ సాన్ ఫ్రాన్సిస్కోకు కొన్ని వందల కిలోమీటర్ల దూరాన, సాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ రెండు వైపులు, పరస్పరం వేగంగా ఢీకొని భూమి కంపించగా, 63 మంది చనిపోయారు, రహదారులు ధ్వంసమయ్యాయి. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి, అనేకులు నిరాశ్రయులయ్యారు. కాని, ముందుగా చెప్పబడినట్లు, 8 పాయింట్ల తీవ్రతతో వస్తుందని ఎదురుచూసిన పెద్ద భూకంపంకన్నా ఎంతో తక్కువ శక్తితో ఆ భూకంపం వచ్చింది.
క్రితం, 1985, వసంత కాలంలో, అమెరికా జియోలజికల్ సర్వే ప్రవచించిందేమంటే, లాస్ ఏంజెల్స్‌కు, సాన్ ఫ్రాన్సిస్కోకు మధ్యనున్న, పాకెఫీల్డ్ అనే చిన్న నగరానికి సమీపాన, 1988 నుండి ఐదు సంవత్సరాల్లోగా 6 పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించవచ్చు. ఎదురుచూస్తున్న యీ భూకంపం రాకముందే భూమి కదలికలను అధ్యయనం చేయడం ద్వారా భూకంపాలను ముందుగా చెప్పవచ్చని, భూకంపం సంభవించకముందే బహుశా గంటలు లేదా కొన్ని రోజుల ముందే హెచ్చరిక యివ్వవచ్చని ఆశించారు. ఈ అధ్యయనానికి అయిన ఖర్చు, నూట యాభై లక్షల డాలర్లు. కాని భూకంపం రాలేదు. అమెరికా జియోలజికల్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న విలియమ్ ఎల్జ్వర్త్ ఒకసారి యిలా చెప్పాడు, “భూకంపాలను గూర్చి యిచ్చే వివరణ సరైన విజ్ఞాన శాస్త్రం కాదు.”
లాండెర్స్లో భూకంపం
అలా జూన్ 28, 1992న, దక్షిణ కాలిఫోర్నియా మోజావె ఎడారిలో లాండెర్స్కు సమీపాన జనవాసం తక్కువగా ఉన్న ప్రాంతంలో 7.5 పాయింట్ల తీవ్రతతో ఆకస్మికంగా భూకంపం సంభవించింది. ఈ భూకంపాన్ని గురించి టైమ్ పత్రిక యిలా చెప్పింది: “భయానకమైన కొన్ని సెకండ్లలోనే అది రోడ్లను చెల్లాచెదరు చేసింది, పార్కింగ్ స్థలాలను చిందరవందర చేసింది, అనేక విధాలుగా ప్రకృతి రమణీయమైన ఎన్నో దృశ్యాలను మార్చివేసింది. అయితే, అద్భుత రీతిగా అది ఒకే ఒక్క ప్రాణాన్ని బలి తీసుకుంది.” ఈ పరిమాణంలోని భూకంపం స్వల్ప నష్టమే కలిగించింది.
కాబట్టి యిది కూడా పెద్ద భూకంపం కాదు. నిజానికి, ఈ కంపం సాన్ ఆండ్రియాస్ ఫాల్ట్‌లో కాదు గాని చుట్టుప్రక్కల ఉన్న ఏదో ఒక చిన్న సమాంతర భ్రంశంలో కలిగింది.
అయినప్పటికీ, బిగ్ బియర్కు సమీపాన జరిగిన చిన్న భూకంపంతోపాటు, లాండెర్స్లో జరిగిన భూకంపం బహుశా దగ్గరలో ఉన్న సాన్ ఆండ్రియాస్ ప్రాంతాలను కూడా మేల్కొలిపి ఉంటుంది. సాన్ ఆండ్రియాస్ దక్షిణప్రాంతం గుండా వెళ్తున్న శిలాపలకలు ఒకవేళ తర్వాతి 30 సంవత్సరాల్లో పగిలిపోయే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు చెప్పారు. అది, ఎంతోకాలంగా భయపడుతున్న, లాండెర్స్ భూకంపం కన్నా ఐదు రెట్లు శక్తిమంతమైన 8 పాయింట్ల తీవ్రత గల భూకంపానికి దారి తీయవచ్చు.
లాస్ ఏంజెల్స్
ఈ సంవత్సరం, జనవరి 17న, ఉదయం 4 గం. 31 నిమిషాలకు లాస్ ఏంజెల్స్‌లో భూమి కంపించింది. లాస్ ఏంజెల్స్‌లో ఎక్కువ జనసమ్మర్థం గల సాన్ ఫెర్నాండో ఉపరితలానికి 18 కిలోమీటర్ల దిగువన, ఒక రాతిపలక 5.5 మీటర్ల లోతులో చొచ్చుకొని ఉన్న భూగర్భ భ్రంశంతో పాటు కదిలిందని అనుకున్నారు. పది సెకండ్లలో 6.6 పాయింట్ల తీవ్రత గల యీ భూకంపం, 57 మందిని పొట్టన పెట్టుకుంది. విషాదకరంగా, కూలిపోతున్న ఒక భవంతిలో 16 మంది మరణించారు. తప్పించుకున్న ఒక మనిషి పడిపోయిన వాహనాల పార్కింగ్ స్థలంలో 20 టన్నుల కాంక్రీట్ క్రింద 8 గంటలు యిరుక్కుపోయాడు. ఒక పెద్ద రహదారి ధ్వంసం కావడం నగర దక్షిణాన ఉన్న ముఖ్యమైన మార్గాలను ఆటంకపరచింది. చర్చీలు, పాఠశాలలు, దుకాణాలు, పెద్ద ఆసుపత్రులు మూసివేయబడ్డాయి. తరచూ జరుగుతున్నట్లు, తక్కువ ఆదాయం గల కుటుంబాలు భూకంపాలను తట్టుకొనే ఆధునిక నిర్మాణ పద్ధతులను స్థిరపరచకముందు కట్టిన పురాతన యిండ్లలో జీవించడం వలన కష్టపడ్డాయి.
చిన్న భూగర్భ భ్రంశాలు, నేరుగా పెద్ద పట్టణం కింద కంపించడం వలన వచ్చే సమస్యలను కూడా యీ భూకంపం స్పష్టం చేసింది. ప్రజల మాటకొస్తే భూకంప కేంద్రంలో నివసించే వారికి ఎలాంటి భూకంపమైనా పెద్ద భూకంపమే!
ఖచ్చితమైన స్థానిక భవన నిర్మాణ నిబంధనావళి లేనట్లయితే, వినాశనం మరింత పెద్దదిగా ఉండేది. తర్వాతి భూకంపం నుండి సులభంగా తప్పించుకొనే పాఠాలను ప్రతి భూకంపం నేర్పిస్తుంది. ముందటి భూకంపాల తర్వాత దృఢపర్చబడిన ఓవర్ బ్రిడ్జులు యీసారి భూకంపాన్ని తట్టుకున్నాయి, కాని మిగిలినవి తట్టుకోలేకపోయాయి. అయితే, పెద్ద భూకంపం—నిజంగా పెద్ద భూకంపం పెద్ద పట్టణాన్ని కుదిపేసినట్లయితే, అది నిజంగా పరీక్షే అవుతుంది. లాస్ ఏంజెల్స్‌లో మరొక సారి భూకంపం వస్తుందా?
రెండవ పెద్ద భూకంపం వస్తుందా?
‘అమ్మో, వద్దు! మరొకటి వద్దు! ఒకటే చాలు! అయినా, కొందరు భూగర్భ శాస్త్రజ్ఞులు సమీప భవిష్యత్తులో ఒక పెద్ద భూకంపం రావచ్చని అనుకుంటున్నారు. జనవరి 22, 1994న, న్యూ సైంటిస్ట్ పత్రిక యిలా చెబుతుంది: “సాన్ ఆండ్రియాస్ ఫాల్ట్‌లో ఎదురుచూస్తున్నట్లుగా, మునుపెన్నటికన్నా సమూల నాశనం చేసే “పెద్ద భూకంపానికి” లాస్ ఏంజెల్స్ క్రిందిబాగాన చొచ్చుకుపోతున్న అపాయకరమైన భూగర్భ భ్రంశాలు కారణం కాగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. . . . ప్రాముఖ్యంగా, లాస్ ఏంజెల్స్ భూగర్భపు ప్రాంతంలో సమాంతరమైన భ్రంశాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే, సాన్ ఆండ్రియాస్ భూగర్భ భ్రంశం ఆ రాష్ట్రంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఆవరించి, లాస్ ఏంజెల్స్‌కు పశ్చిమాన వంపు తిరిగి, అక్కడ ఎక్కువ ఒత్తిడికి కారణమౌతుంది. ఎలాగైనా, పసిఫిక్ రాతిపలకపై ఉన్న వలస వెళ్తున్న భూమి పొర ప్రయాణం చేసి ఆ వంపును దాటి, దాని ఉత్తరానికి కొనసాగుతుంది.”
పసిఫిక్ రాతిపలకలు కదలడంతో, లాస్ ఏంజెల్స్ భూగర్భ ప్రాంతంలో సృష్టించబడిన సమాంతర భ్రంశాల్లో ఒకటి యీ సంవత్సర తొలి భాగంలో భూకంపం సంభవించడానికి కారణమైంది. ఆ భూకంపాన్ని గూర్చి, న్యూ సైంటిస్ట్ పత్రిక అది జరిగిన వారం తర్వాత మొదటి నివేదికగా యిలా చెప్పింది: “ఎక్కడైతే శిలాపలకలు ఒక దానిపై ఒకటి దొర్లడానికి ప్రయత్నం చేస్తాయో, అక్కడే ఒత్తిడి కలిగి భూకంపం జరుగడానికి కారణమౌతుందని శాస్త్రజ్ఞులు యిప్పటికీ నమ్ముతారు. గత వారపు భూకంపంలో, శాంటా సూసాన పర్వతాలకు ఉత్తరాన, భూకంప కేంద్రం దాదాపు 40 సెంటీమీటర్లు [1.6 అంగుళాలు] పైకిలేచి, అదే సమయాన ఉత్తరం వైపుకు 15 సెంటీమీటర్లు [6 అంగుళాలు] కదిలింది.”
కాల్టెక్నందలి కెర్రీ సే అనే భూగర్భ శాస్త్రజ్ఞుడు, చిన్న సమాంతర భ్రంశాలు కూడా లాస్ ఏంజెల్స్ భూగర్భ ప్రాంతాన్ని తగులుతూ వెళ్ళడం, సాన్ ఆండ్రియాస్లో యిప్పటికి ఎదురుచూస్తున్న 8 పాయింట్ల భూకంపమంతటి అపాయకరమైనదేనని భావిస్తున్నాడు. లాస్ ఏంజెల్స్‌ను మనస్సులో ఉంచుకొని, సే యిలా అడుగుతున్నాడు: “నిజంగా యీ నగర దిగువన 8 పాయింట్ల పెద్ద భూకంపం వస్తుందా?” ఇది దానిలో నివసిస్తున్న లక్షలాదిమందికి భయాన్ని కలిగించే ప్రశ్న!
ఇతరులు తుఫాను, వరదలు, గాలివానలతో జీవిస్తున్నట్లే, కాలిఫోర్నియా వాసులు భూకంపాలతో జీవిస్తున్నట్లు అనిపిస్తుంది.
[22వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
లాస్ ఏంజెల్స్ భూగర్భ ప్రాంతంలో సమాంతర భూగర్భ భ్రంశాలు
సాన్ ఆండ్రియాస్ భ్రంశం
లాస్ ఏంజెల్స్
పసిఫిక్ మహాసముద్రం
[21వ పేజీలోని చిత్రం]
లాస్ ఏంజెల్స్‌లో 1994లో జరిగిన భూకంపంలో నాశనమైన రహదారులు
[క్రెడిట్ లైను]
Hans Gutknecht/Los Angeles Daily News
[23వ పేజీలోని చిత్రం]
ఈ సంవత్సరంలో జరిగిన భూకంపంలో గ్యాస్ లైన్లు పగిలి పైకి లేచిన మంటలు
[క్రెడిట్ లైను]
Tina Gerson/Los Angeles Daily News
[24వ పేజీలోని చిత్రం]
లాస్ ఏంజెల్స్‌లోని యీ భాగంలో 6.6 పాయింట్ల తీవ్రతతో విరుచుకుపడిన పది సెకండ్లపాటు భూకంపంలో కూలిపోయిన రహదారులు
[క్రెడిట్ లైను]
Gene Blevins/Los Angeles Daily News