పాఠశాలలో మీ పిల్లలకున్న సమస్యలను ఎదుర్కోడానికి సహాయపడండి
క్షీణిస్తున్న ప్రపంచ పరిస్థితులు మన పిల్లలతో సహా, మనందరిని ప్రభావితం చేస్తున్నాయి. దేవుని వాక్యమైన బైబిలు, మన దినాల్లో “అపాయకరమైన కాలములు” రాగలవని, మరి “దుర్జనులును వంచకులును . . . అంతకంతకు చెడిపో” గలరని కచ్చితంగా ప్రవచించింది. (2 తిమోతి 3:1-5, 13) కాబట్టి, విద్యా బోధన అనేక ఇబ్బందులతో కూడినదిగా ఉంది, విద్యార్థులేమో తమ తల్లిదండ్రులు అరుదుగా ఎదుర్కొన్న పరిస్థితులతో పోరాడుతున్నారు. తమ పిల్లలు సమస్యలను ఎదుర్కోడానికి సహాయపడేందుకు తల్లిదండ్రులేమి చేయగలరు?
స్నేహితుల ఒత్తిడి
అనేకమంది పిల్లలు కొన్నిసార్లు స్నేహితుల ఒత్తిడికి గురౌతారు. ఒక యౌవన ఫ్రెంచ్ విద్యార్థి యిలా వాపోతున్నాడు: “తల్లిదండ్రులు, సంఘం తాము చేయగలిగినదంతా చేస్తారు, కానీ అది సరిపోదు. పాడైపోయిన యౌవనులు తమతోపాటు ఇతర యౌవనులను ఈడ్చుకుపోతారు. . . . తమ పిల్లలను అదుపు చేయని తల్లిదండ్రులు అసలు తల్లిదండ్రులే కారు.”
బాధ్యతగల తల్లిదండ్రులు, పాడుచేసే స్నేహితుల ఒత్తిడిని తట్టుకోడానికి అవసరమైన అంతర్గత శక్తిని అందించే ఆత్మీయ లక్షణాలను తమ పిల్లలు వృద్ధిపర్చుకోడానికి సహాయపడేందుకు ప్రయత్నిస్తారు. “మా పిల్లవాడు ఆత్మ విశ్వాసం పెంపొందించుకునేందుకు సహాయపడటానికి మేము ఎంతో తీవ్రంగా కృషి చేస్తాం, అలా చేస్తే వాళ్లు తమ స్నేహితుల అంగీకారాన్ని పొందే అవసరముందని భావించరు. ఇతర పిల్లల్లా ఉండడం వాళ్లకు ప్రాముఖ్యం కానప్పుడు, మాకది అవసరం లేదని చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు అలా మాకు అవసరం లేదని చెప్పడం వాళ్లకు సులభం అవుతుందని,” ఒక తండ్రి వివరిస్తున్నాడు. క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తన పిల్లలకు నేర్పడానికి, స్కూల్లోని పాత్రలను పోషించేందుకు తన కుటుంబం కొరకు ఈ తండ్రి సమయాన్ని వెచ్చిస్తాడు, అంటే విద్యార్థి, ఉపాధ్యాయులు లేక తోటి విద్యార్థి పాత్రలను పోషించి, వాస్తవంగా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయో, మరి వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆ మార్గాలను ప్రదర్శిస్తారు. మద్దతునిచ్చే తండ్రిగా ఉండండి, మీ పిల్లవాడు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోడానికి సహాయం చేయండి.
అసభ్యకరమైన భాష
నైతిక కట్టడలు ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్నందున, అసభ్యకరమైన భాష సర్వసామాన్యమయ్యింది. అనేక దేశాల్లో అనేకమంది దూరదర్శిని తిలకించే సమయంలో వచ్చే కార్యక్రమాల్లో కూడ అది తరచుగా వినిపిస్తుంది. అందునుబట్టి, పాఠశాల ఆట స్థలాలు, వరండాలు, తరగతి గదులు అసభ్యకరమైన మాటలతో ప్రతిధ్వనిస్తుంటాయి.
కొంతమంది ఉపాధ్యాయులు తాము తిట్లు తిట్టడాన్ని సమర్ధించుకుంటూ, ఆ విధంగా వాళ్ల విద్యార్థులు అటువంటి భాషపట్ల తమ స్వంత దృక్పథాన్ని ఏర్పర్చుకుంటారని వాదిస్తారు. కానీ అలాంటి పద్ధతి, విద్యార్థులు ఈ నీచ పదాలను ప్రతిదిన సంభాషణలోని అంగీకరించదగిన భాగంగా అలవాటు చేసుకోడానికి వీలు కలిగిస్తుంది.
ఒక జ్ఞానవంతుడైన తండ్రి అలాంటి పదాలను కుటుంబంలో ఉచ్చరించడం ఎందుకు అనుమతింపబడదో దయాపూర్వక పద్ధతిలో వివరిస్తాడు. తరగతి గదిలో అసభ్యకరమైన భాషాసమస్య ఉందేమో ముందే గమనించడానికి గానూ, అతను తన పిల్లవాడు ఏ పుస్తకాలను చదువుతాడు అనేది తెలుసుకోడానికి పాఠ్యక్రమాన్ని తనిఖీ చేసి, ఒకవేళ ఎన్నుకోబడిన పుస్తకాలు ఏవైనా అసభ్యకరమైన భాషను లేక లైంగిత దుర్నీతిని కలిగి ఉంటే, బహుశా అతను ఆ పుస్తకానికి బదులు సరైన విషయాలు కలిగి ఉన్న మరొక పుస్తకాన్ని ఎన్నుకోమని తన పిల్లవాని ఉపాధ్యాయునికి విన్నపం చేయవచ్చు. సమతూకం కలిగి వారిని సంప్రదించడం సహేతుకతను ప్రదర్శిస్తుంది.—ఫిలిప్పీయులు 4:5.
లైంగిక దుర్నీతి మరియు మాదకద్రవ్యాలు
పరిశోధనలు వెల్లడి చేసేదేమంటే, చాలామంది తల్లిదండ్రులు “ఇంటివద్ద [జననాంగ విద్యను] గురించిన అంశాన్ని ప్రస్తావించడానికి తాము చాలా సిగ్గుపడతామని లేక ఇబ్బందిపడతామని,” ఒప్పుకున్నారు. బదులుగా, తమ పిల్లలకు లైంగిక విషయాలను గూర్చిన సరైన సమాచారాన్ని ఇవ్వడానికి వాళ్లు పాఠశాలలపై ఆధారపడతారు. కానీ లండన్‌లోని ది సండే టైమ్స్ వార్తాపత్రిక నివేదించేదేమంటే, ఒక అనుభవంగల ఉపాధ్యాయుని ప్రకారం, నేడు ఎక్కువగా ఉన్న యౌవన గర్భిణుల సంఖ్య, “ఒక నైతిక సమస్యే కానీ కుటుంబ నియంత్రణా పద్ధతులు తెలియక కాదు.” తమ పిల్లలు పాటించాలని కోరుకునే ప్రవర్తనా నియమాలను ఏర్పర్చడానికి తల్లిదండ్రులే మంచి స్థానంలో ఉన్నారు.
మాదకద్రవ్యాలను దుర్వినియోగం చేయడం విషయంలో కూడా అది నిజమే. తల్లిదండ్రుల నడిపింపు లేకపోవడం సమస్యను ఇంకా జటిలంచేస్తుంది. “పిల్లవానికి కుటుంబ జీవితం ఎంత అయిష్టంగా తయారయితే, తన కొరకు ఒక ప్రత్యామ్నాయాన్ని కనుగొనడానికి ప్రయత్నించే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. మాదక ద్రవ్యాలను [తీసుకోవడం] తరచూ అందులో ఒకటి” అని ఫ్రాంకోస్కోపి 1993 పేర్కొంటోంది. టాక్సికోమనీ ఏ ప్రివాన్షియన్ జోనెష్ (డ్రగ్ యూజ్ అండ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ యూత్) అనే సంస్థాపనానికి అధ్యక్షురాలైన మెష్లెన్ శాబాన్ డెల్మా, “ఒక తల్లిగా ఉండడం చాలా కష్టం,” అని ఒప్పుకుంటోంది. “మీరు నిత్యం జాగ్రత్తగా ఉండాలి; ఏదో తప్పు దొర్లిందని తల్లిదండ్రులను హెచ్చరించడానికి తరచూ మాదక ద్రవ్యాలు ఒక మార్గం. ఒకవేళ ఒక యౌవనుడు తన తల్లి లేక తండ్రి తనపట్ల శ్రద్ధ చూపడం లేదని భావిస్తే, అప్పుడు అతనికి మాదక ద్రవ్యాలు యిస్తే, అవి తన సమస్యకు అద్భుతమైన పరిష్కారాలుగా కనిపించవచ్చు.”
ఒక కెనడా దేశపు తండ్రి, తమ యౌవన కుమార్తె పాఠశాల విషయాల్లో తను, తన భార్య, ఎలా నిజమైన ఆసక్తిని కనపరుస్తారో యిలా వివరిస్తున్నాడు: “మేము నాడీన్ను పాఠశాలకు కార్లో తీసుకెల్తాం, తీసుకొస్తాం. ఆమెను కార్లో ఎక్కించుకున్న వెంటనే, సంభాషణ ప్రారంభమౌతుంది, అందుమూలంగా ఆమె ఆ రోజు ఎలా గడిపిందో బయటపడుతుంది. ఏదైనా కొంత గంభీరమైన విషయం ఉన్నట్లు మాకు అనిపిస్తే, దాన్ని గురించి అప్పుడైనా మాట్లాడతాం లేక రాత్రి భోజన సమయంలోనైనా లేదా కుటుంబ చర్చ సమయంలోనైనా దాన్ని ప్రస్తావిస్తాం.” అలాగే మీరు కూడా నిస్సంకోచంగా సంభాషించడం ద్వారా మీ పిల్లవానియెడల స్వచ్ఛమైన శ్రద్ధ, ప్రేమను ప్రదర్శించవచ్చు.
వేధించడం మరియు దౌర్జన్యం
వేధించడం, “పాఠశాల సమస్యల్లోని మోసకరమైన వాటన్నింటిలో ఒకటని,” మౌరీన్ ఒకోనర్ హౌ టు హెల్ప్ యువర్ చైల్డ్ త్రూ స్కూల్ అనే పుస్తకంలో పేర్కొంటుంది. “అది దాని బాధితులకు ఎంత బాధను కలిగిస్తున్నా, వాళ్లు దాన్ని గురించి పెద్దవాళ్లకు చెప్పడానికి తరచుగా అయిష్టతను చూపిస్తారు, ఎందుకంటే వాళ్లకు ‘పిరికివారు’ అనే పేరు పడిపోతుందనే భయం ఉంటుందని” కూడా ఆమె పేర్కొంటుంది.
కొందరు ఉపాధ్యాయులు వేదించడాన్ని మామూలు ప్రవర్తనగా దృష్టిస్తారన్నది దుఃఖకరమైన విషయము. కానీ అనేకమంది ఇతరులు, విద్యావేత్త అయిన పీట్ స్టీఫెన్‌సన్‌తో ఏకీభవిస్తారు, వేధించడం “ఒక విధమైన దురభ్యాసమని, వేధించే వాళ్లు అలా కొనసాగడం వాళ్లకు కూడా మంచిది కాదని,” అతడు నొక్కి వక్కాణిస్తున్నాడు.
మీ పిల్లవాడు వేధింపుకు గురైతే మీరేం చేయగలరు? “చాలా ప్రాముఖ్యమైన భద్రతనిచ్చేది, [బాధితుడు] జీవించే పెద్దల సమాజమే అయ్యుండాలని” ఒకోనర్ వ్రాస్తుంది. సానుభూతి చూపించే ఉపాధ్యాయునితో సంగతులను చర్చించండి. మీరిద్దరు కూడ అటువంటి విపరీత ప్రవర్తనను అనంగీకారమైన దానిగా పరిగణిస్తున్నారని ఇది మీ పిల్లవానికి ఊరట కల్గిస్తుంది. అనేక పాఠశాలలు వేధింపుకు వ్యతిరేకంగా స్పష్టమైన పథకాలను ప్రవేశపెట్టాయి, ఆ పథకాలను ఉపాధ్యాయులు తరగతిలో బాహాటంగా చర్చిస్తారు.
నటెలీ తన మతం విషయమై వేధింపుకు గురయ్యింది. “నేను ఒక యెహోవాసాక్షిని అయినందుకు అవమానింపబడ్డాను, మరి నా పుస్తకాలను కొన్నిసార్లు చింపేసే వారు,” అని ఆమె చెబుతోంది. సమస్యను పరిష్కరించడానికి, ఆమె తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది, వారు తన ఉపాధ్యాయులతో మాట్లాడమని ఆమెకు సలహా ఇచ్చారు. ఆమె అలా చేసింది. “నన్ను వేధిస్తుండిన తోటి విద్యార్థుల తల్లిదండ్రులకు టెలిఫోను చేయడానికి నేను చొరవ తీసుకున్నాను,” అని ఆమె చెబుతోంది. “నేను వాళ్లకు సమస్యను వివరించగలిగాను గనుక, ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. అలా నేను నా ఉపాధ్యాయుల, అలాగే నా తోటి విద్యార్థుల్లో అనేకమంది నమ్మకాన్ని చూరగొన్నాను.”
కొన్నిసార్లు, తల్లిదండ్రులు వాళ్ల పిల్లవాడు వేధింపబడటం లేదు గానీ వాడే ఇతర విద్యార్థులను వేధిస్తున్నాడని తెలుసుకుంటారు. అలాంటప్పుడు, ఇంట్లో ఏమి జరుగుతుందో వాళ్లు పరిశీలించడం మంచిది. “విపరీత ప్రవర్తనను ఎక్కువగా ప్రదర్శించే పిల్లలు, తల్లిదండ్రులు గొడవలను సరైన రీతిలో పరిష్కరించని కుటుంబాలనుండి వచ్చినవారు. దౌర్జన్యపూరిత ప్రవర్తన అభ్యసించిన పద్ధతే,” అని లండన్‌లోని ది టైమ్స్ వార్తాపత్రిక నివేదిస్తుంది.
కొన్ని ప్రాంతాల్లో దౌర్జన్యం చాలా విపరీతంగా పెరుగుతోంది. రాజకీయ అలజడి పాఠశాలకు వెళ్లడానికి వీల్లేకుండా చేసినప్పుడు, తటస్థతను విలువైనదిగా ఎంచే పిల్లలు, కొన్ని సందర్భాల్లో ఇంట్లోనే ఉండడం జ్ఞానవంతమని కనుగొన్నారు. కానీ వాళ్లు పాఠశాలలో ఉన్నప్పుడు గొడవ మొదలైతే, వాళ్లు యుక్తిగా అక్కడినుండి బయటపడి అంతా సద్దుమణిగేంత వరకు ఇంట్లోనే ఉంటారు.
ఉపదేశలోపం
ఉపదేశలోపం, సమస్యలను తెచ్చినప్పుడు మీ పిల్లవానికి మరియు, పిల్లవాని ఉపాధ్యాయులకు మధ్య సత్సంభాషణ సహాయం చేయగలదు. “మేము మా పాపను తన పాఠాలపట్ల అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండమని ప్రోత్సహిస్తాము,” అని ఒక దంపతులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఉపాధ్యాయులు ఏదైనా అంశాన్ని ఆసక్తికరంగా వివరించలేకపోతే, పిల్లలు త్వరగా ఆసక్తి కోల్పోతారు. పరిస్థితి అలా ఉన్నట్లు మీ పిల్లవాడు కనుగొంటే, ఉపాధ్యాయునితో ఏకాంతంగా మాట్లాడమని అతన్ని ఎందుకు ప్రోత్సహించ కూడదు?
మీ పిల్లవాడు కొన్ని ప్రశ్నలను సిద్ధపర్చడానికి సహాయం చేయండి. ఆ ప్రశ్నలకు జవాబు లభించినప్పుడు పాఠం యొక్క అంశాన్ని అర్థం చేసుకోవడం, నేర్పిన దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోడం సులభం చేస్తుంది. ఒక అంశంలో ఎల్లకాలం నిలిచే నిజమైన ఆసక్తి ఉంటుందని ఇది హామీ ఇవ్వదు. చాలావరకూ తల్లిదండ్రులుగా మీ మాదిరిపై ఆధారపడి ఉంటుంది. మీ పిల్లవానితో అతని పాఠాలను చర్చించడం ద్వారా మీరు శ్రద్ధను కలిగి ఉన్నారని చూపించండి, ఉపాధ్యాయుడు ఇచ్చిన హోంవర్క్‌ను చేయడానికి సహాయం చేయండి.
పాఠశాలలో, విచ్ఛిన్నమైన కుటుంబాలనుండి, లేక దురభ్యాసకరమైన, అశ్రద్ధగల పరిస్థితులనుండి వచ్చిన పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్లకు తరచుగా ఆత్మ విశ్వాసం మరియు ఆత్మ గౌరవం ఉండవు. వాళ్లు మంచి పరిస్థితులుగల పిల్లలతో కలిసిపోతారు. అనేకమంది తల్లిదండ్రులు, పాఠశాలలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కోడానికి తమ పిల్లలకు ఎడతెగక సహాయం చేయాలని గ్రహిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో వ్యవహరించే తీరు విషయమేమిటి? వాళ్లు ఏ విధమైన సంబంధాన్ని వృద్ధిపర్చుకోవాలి, ఎలా?
[7వ పేజీలోని బాక్సు]
మీ పిల్లవాడు వేధించేవారి బాధితుడా?
నిపుణులు తల్లిదండ్రులకు సలహా ఇచ్చేదేమంటే తమ పిల్లలను సంగతులను తెలిపే సూచనల కొరకు గమనించాలి: ఆమె/అతడు బడికి వెళ్లాలంటే నిరాసక్తి చూపుతూ, తోటి విద్యార్థులతో కలవకుండా ఉంటూ, ఇంటికి దెబ్బలు తగిలించుకొని లేక బట్టలు చింపుకొని వస్తున్నాడా?
వాస్తవంగా ఏంజరిగిందో మీకు చెప్పమని మీ పిల్లవాన్ని ప్రోత్సహించండి. వేధింపు సమస్యగా ఉందో లేదో కనుక్కోడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. విషయమదే అయితే, ఒక దయగల ఉపాధ్యాయునితో మాట్లాడండి.
మీ పిల్లవాడు ఎదుర్కునేందుకు సహాయం చేయడానికి అతను నమ్మదగిన తోటి విద్యార్థికి దగ్గరగా ఉండమని, వేధింపు మళ్లీ జరగగల స్థలం, పరిస్థితి నుండి దూరంగా ఉండమని సలహా ఇవ్వండి. నవ్వి ఊరుకోగలవారు, అలాగే క్లిష్ట పరిస్థితులను యుక్తిగా తప్పించుకోగల పిల్లలు తరచుగా వేధింపబడకుండా తప్పించుకుంటారు.
అతిగా కంగారు పడకండి, ప్రతీకారాన్ని ప్రోత్సహించకండి.