తల్లిదండ్రులారా—మీ పిల్లలకు సలహాదారులై యుండండి
తల్లిదండ్రులు తమ కుమారులు, కుమార్తెలకు శ్రేష్ఠమైనవాటిని ఇవ్వాలని కోరుకుంటారు. వాస్తవానికి, క్రైస్తవ అపొస్తలుడైన పౌలు, తమ పిల్లలను దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచాలని తండ్రులకు ఉపదేశించాడు. (ఎఫెసీయులు 6:4) ప్రాచీన కాలంనాటి రాజైన సొలొమోను పిల్లలకు యిలా సలహా ఇచ్చాడు: “మీ తండ్రి, మీ తల్లి చెప్పేదానిని శ్రద్ధగా వినండి. వారి బోధలు మీ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతాయి.”—సామెతలు 1:8, 9, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్.
విద్యాభ్యాసం కొరకు తల్లిదండ్రులు చేసిన ఏర్పాట్లలో పాఠశాలలు ఏ పాత్రను నిర్వహిస్తాయి? మరి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయుల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి?
తల్లిదండ్రులు, మరియు ఉపాధ్యాయుల పాత్రలు
“తల్లిదండ్రులే, . . . తమ స్వంత పిల్లల విద్యాబోధన పనిలో అతి ప్రాముఖ్యమైన వారు,” అని డోరీన్ గ్రాంట్ నొక్కి చెబుతుంది. ఆమె, ఇంటి వాతావరణంపై పాఠశాల కలిగున్న ప్రభావాన్ని గూర్చిన అధ్యయనానికి రచయిత్రి. కానీ తల్లిదండ్రులుగా, ఆ విషయాన్ని అంగీకరించడం మీకు చాలా కష్టమనిపించవచ్చు.
బహుశా మీరు పాఠశాలకు వెళ్లిన సమయానికి ఇప్పటికి బోధించే పద్ధతిలో ఎంతో మార్పు వచ్చిందని మీరు గమనించవచ్చు. ఈ రోజుల్లో, పాఠశాలలందు ఒకప్పుడు అసలు తెలియని విషయాలైన, మీడియా స్టడీస్, హెల్త్ ఎడ్యుకేషన్, మైక్రోఎలెక్ట్రానిక్స్ వంటి విషయాలు ఉండవచ్చు. ఇది కొంతమంది తల్లిదండ్రులు పాఠశాలతో వీలైనంత తక్కువ సంబంధాన్ని తాము కల్గివుండడానికి దారితీసింది. “తల్లిదండ్రులు తమ పిల్లల ఉపాధ్యాయులతో మాట్లాడటం, ఆత్మాభిమానంగల పెద్దలు అనేకమంది తాము ఐదు సంవత్సరాల వాళ్లమని, నాలుగు అంగుళాలు ఎత్తు ఉన్నామని భావించేలా చేస్తుందని,” హెల్ప్ యువర్ చైల్డ్ త్రూ స్కూల్ అనే పుస్తకంలో డా. డేవిడ్ లేవిస్ వ్రాస్తున్నారు. “కష్టాలను లేక ఇబ్బందులను గూర్చి ఉపాధ్యాయులతో సమాన పరిధిలో చర్చించడానికి బదులు, కొందరు పిల్ల తరహాగా ప్రవర్తిస్తారు.”
వాస్తవానికి, కొంతమంది తల్లిదండ్రులు కేవలం గంభీరమైన సమస్యలు తలెత్తితేనే తమ పిల్లల ఉపాధ్యాయులను కలుస్తారు. మరి అందులో చాలా వరకూ కూడా, ఫిర్యాదు చేయడానికే. అయితే, తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సహకరించడం ద్వారా తమ పిల్లల విద్యకు ఎంతగానో మద్దతును ఇవ్వగలరు, మరి చాలామంది అలా చేస్తున్నారు.
తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమంటే మీ పిల్లవాడు పాఠశాల వద్ద ఏమి నేర్చుకుంటున్నాడో మీరు పరిశీలించి, ఆ విషయాలపట్ల శ్రద్ధ చూపాలి. ఎందుకలా చేయాలి? ఎందుకంటే, ఉపాధ్యాయులు తమ వృత్తిపర బాధ్యతగా, మీ పిల్లలపై నైతికపరమైన ప్రభావాన్ని కలిగి ఉంటారు. వాళ్లు కలిగి ఉండే విలువలు వారి విద్యార్థులను ప్రభావితం చేస్తాయి, ఎందుకంటే పిల్లలు ఉపాధ్యాయులను తాము అనుకరించవలసిన మాదిరులుగా భావిస్తారు. వాళ్ల పనిలో భాగంగా, అనేకమంది ఉపాధ్యాయులు తమ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి సహకారాన్ని ఆనందంగా అంగీకరిస్తారు.
దక్షిణ జర్మనీలోని ఒక ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రులకు యిలా వ్రాశాడు: “ఉపాధ్యాయులమైన మాకు స్పష్టంగా అర్థమైన విషయమేమంటే, గడిచిన ఏ సంవత్సరానికంటే కూడా, ఇప్పుడున్న పిల్లలందరూ, ప్రాముఖ్యంగా [జర్మనీనందు, ఆరేళ్ల వయస్సులో] పాఠశాలకు వెళ్లడం ప్రారంభించిన వాళ్లు, చాలా వరకు దయాదాక్షిణ్యం లేనివాళ్లు, సరిగ్గా పెంచబడని వాళ్లు. చాలామంది పూర్తిగా అదుపు తప్పిన వాళ్లు, హద్దులు తెలియని వాళ్లు; తప్పు చేశామన్న భావనే లేదు; అతి స్వార్ధపరులు, సంఘ విద్రోహులు; మరి స్పష్టమైన కారణం లేకుండానే కోపోద్రేకులై, [ఇతరుల] గొంతు నులుముతూ తంతారు.”
ఆ విద్యావేత్త యిలా చెప్పడం కొనసాగించాడు: “ఉపాధ్యాయులుగా మాకు దానివల్ల చాలాకష్టం కలుగుతున్నా, మేము ఫిర్యాదు చేయదల్చుకోలేదు. అయితే మేము, మా పూర్తి ప్రయత్నాల తర్వాత కూడా, పాఠశాల తన స్వంతగా పిల్లలకు విద్య బోధించి పైకి తీసుకురాలేదని తెలుసుకున్నాము. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు ముందుకువచ్చి, మీ పిల్లలను పెంచడంలో మీకై మీరు ఎక్కువ భాగం వహించమని, మరి వాళ్ల వ్యక్తిత్వాన్ని పెంపొందించడం కొరకు, వాళ్లకు ప్రవర్తనా నియమావళిని నేర్పించడం కొరకున్న మీ [బాధ్యతను] దూరదర్శినికి లేక వీధులకు ఇవ్వద్దని మేము మిమ్మల్ని ప్రోత్సహించాలని భావిస్తున్నాము.”—ఐటలిక్కులు మావే.
ఉపాధ్యాయులు, సహకారం కొరకు అలా విన్నపం చేసినా, అనేకమంది తల్లిదండ్రులు సహాయం చేయడానికి యింకా విముఖంగానే ఉన్నారు. “వాళ్లు శ్రద్ధలేనివారు, పని ఎక్కువ కలిగి ఉండటం లేక నమ్మకం తక్కువగా ఉండటం వలన అలా విముఖంగా లేరని,” డేవిడ్ లేవిస్ చెబుతున్నారు, “కానీ వాళ్ల దృఢమైన నమ్మకమేమంటే, ఒక పిల్లవాడు తన పాఠశాల చదువులో ఎంత చురుకుగా లేక ఎంత మందకొడిగా ఉన్నా, అది అతని పెంపకంలో ఎంతమాత్రం ప్రభావం చూపదు, అతనిలో పుట్టుకనుండే ఉన్న సామర్థ్యాలపైన మాత్రమే అది ఆధారపడి ఉంటుంది.” కానీ ఈ నమ్మకం ఎంతమాత్రం నిజంకాదు.
ఇంట్లోని సమస్యలు పిల్లవాని పాఠశాల చదువును తరచుగా ఎలా ప్రభావితం చేస్తాయో, అలాగే ఇంట్లో ఉండే మంచి వాతావరణం అతని చదువును చాలా వరకు ప్రయోజనకరంగా ప్రభావితం చేయగలదు. “విద్యలో విజయానికి, అపజయానికి కూడా పాఠశాలకంటే కుటుంబమే ఎక్కువగా దోహదపడగలదని” ఒక విద్యాపర సర్వే ముగించింది. హౌ టు హెల్ప్ యువర్ చైల్డ్ త్రూ స్కూల్ అనే పుస్తకం యిలా అంగీకరిస్తుంది: “ఎంతో పని తొందరగల తల్లిదండ్రులైనా వాళ్లు గుర్తించవలసిన విషయమేమంటే వాళ్ల దృక్పథం—వాళ్లు చూపే ఆసక్తి, ప్రోత్సాహం, వాళ్లిచ్చే మద్దతు, వాళ్లు దగ్గర్లో లేకపోయినా—పిల్లల అభివృద్ధికి చాలా ప్రాముఖ్యం కాగలదు.”
అలాంటప్పుడు మీరు మీ పిల్లవాని ఉపాధ్యాయులతో మంచి సహకారాన్ని ఎలా సాధించగలరు?
మీ పిల్లలకు సలహాదారులై యుండండి
(1) మీ పిల్లవాడు పాఠశాలందేమి నేర్చుకుంటున్నాడో ఆ విషయాల్లో మీరు పూర్తి ఆసక్తి కలిగి ఉండండి. మీ పిల్లవాడు పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడే ఆసక్తి చూపడానికి సరైన సమయం. సాధారణంగా యౌవనస్థులకంటే చిన్న పిల్లలే తల్లిదండ్రుల సహాయాన్ని ఎక్కువగా అంగీకరిస్తారు.
మీ పిల్లవానితో కలిసి పుస్తకాలు చదవండి. “నేర్చుకోడంలో దాదాపు 75 శాతం చదవడం ద్వారానే జరుగుతుందని,” డేవిడ్ లేవిస్ అంటున్నారు. ఆ విధంగా మీ పిల్లవాడు చక్కగా చదివే మంచి సామర్థ్యాన్ని పొందడానికి మీరు ముఖ్యమైన నడిపింపునివ్వగలరు. చదవడానికి ఇంటివద్ద సహాయం పొందిన పిల్లలు, పాఠశాలలో ప్రత్యేకంగా చదివించే ఉపాధ్యాయుల సహకారంపొందే పిల్లలకన్నా ఎక్కువ అభివృద్ధి చెంది ఉంటారని పరిశోధన తెలియజేస్తుంది.
అదే విధంగా, మీరు మీ పిల్లవానికి వ్రాయడం, యింకా లెక్కలు చేయడం కూడా నేర్పవచ్చు. “ప్రాథమిక లెక్కలు చెప్పడానికి మీరు లెక్కల్లో దిట్ట అయి ఉండనవసరం లేదని” విద్యావేత్త అయిన టెడ్ రాగ్ వ్యాఖ్యానిస్తున్నాడు. అయితే, ఈ అంశాల్లో మీకు వ్యక్తిగతంగా సహకారం అవసరమైతే, మీ పిల్లవాడు నేర్చుకునే విషయంపై నిజమైన ఆసక్తి కనపర్చడానికి ప్రతిభ లేకపోవడం మిమ్మల్ని ఆపుజేయనివ్వకండి.
(2) పాఠ్య ప్రణాళిక విషయమై మీ పిల్లవాని ఉపాధ్యాయున్ని సంప్రదించండి. పాఠశాల వివరణిక చదవడం ద్వారా, మీ పిల్లవానికి ఏమి నేర్పిస్తారో తెలుసుకోండి. పాఠశాలలు తెరవక మునుపే దాన్ని పరిశీలించడం ద్వారా, సమస్యలు తలెత్తగల విషయాలు ఏవని మిమ్మల్ని అప్రమత్తులను చేస్తుంది. తరువాత, తల్లిదండ్రులుగా మీరు కలిగున్న కోరికలను ఎలా గౌరవిస్తారు అనే విషయాలను చర్చించడానికి ఉపాధ్యాయున్ని దర్శించడం మంచి సహకారానికి మార్గం సుగమం చేయగలదు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో పరిచయాన్ని పొందడానికి పాఠశాల నిర్వహిస్తున్న మీటింగుల ద్వారా లాభం పొందండి. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి, తమ పిల్లల తరగతి జరుగుతున్నప్పుడు తరగతిని గమనించడానికి నియమించిన రోజులలో పాఠశాలను దర్శించి, మీ పిల్లవాని ఉపాధ్యాయులతో మాట్లాడండి. అలాంటి సంప్రదింపులు, ప్రాముఖ్యంగా సమస్యలు తలెత్తినప్పుడు చాలా విలువైనవిగా ఉండగలవు.
(3) మీ పిల్లవాడు తనకు నచ్చిన ఐచ్భిక విషయాలను ఎన్నుకోడానికి సహాయం చేయండి. మీ పిల్లవాడికి ఏ అంశాలు నచ్చుతాయి, ఏవి నచ్చవు అనే విషయాన్ని తెలుసుకోండి. యోగ్యమైన లక్ష్యాలను గురించి మాట్లాడండి. లభించగల ఐచ్ఛిక విషయాలనన్నింటిని గురించి తెలుసుకోడానికి ఉపాధ్యాయున్ని సంప్రదించండి. సబ్జెక్టులను ఎన్నుకునే విషయంలో వాళ్లు సలహా ఇవ్వగలరు.
స్పష్టంగా సంభాషించడం ద్వారా చెడు భావాలను అరికట్టవచ్చు. అనేక పాఠశాలలు, తెలివైన విద్యార్థులపై ఉన్నత విద్య చేపట్టమని ఒత్తిడి తెస్తారు. కానీ క్రైస్తవ పరిచర్యను తమ ప్రవృత్తిగా చేపట్టాలని ఎంపిక చేసుకున్న విద్యార్థులు సాధారణంగా దీర్ఘకాలం ఉండే విశ్వవిద్యాలయ విద్యాభ్యాసం పొందరు. దానికి బదులుగా, వాళ్లు అనుబంధ విద్యాభ్యాసాన్ని పొందడానికి ఇష్టపడితే, వాళ్లు ఉద్యోగాన్ని పొందడానికి సహాయపడే అంశాలను చదవడానికి ఇష్టపడతారు. తమను గురించి ఎక్కువగా ఆలోచించుకునే ఉపాధ్యాయులు కొన్నిసార్లు దీనిని తాము నేర్పినదానినంతా నిరాకరించడమని తప్పుగా భావించవచ్చు. మీ పిల్లవాడు ఎంచుకున్న రంగంలో మీ పిల్లవాడు అధిక విద్య పొందగల అవకాశాలను గురించి మీరు సహనంతో ఉపాధ్యాయులకు వివరించడం, క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలు నేర్చుకుంటూనే ఉండాలని ఇష్టపడుతున్నారని ఉపాధ్యాయులు నమ్మకంగా ఉండడానికి వీలుకల్గిస్తుంది.a
సరైన పద్ధతి
విజయవంతమైన భాగస్వామ్యాలు సత్సంభాషణపై ఆధారపడి ఉంటాయని జ్ఞాపకం ఉంచుకోడం ద్వారా మీరు మీ పిల్లవాని విద్య విషయంలో ఎంతో బాధను, క్షోభను తప్పించుకోవచ్చు.—“తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సత్సంభాషణకు మార్గాలు” అనే శీర్షికగల బాక్సును చూడండి.
ఫిర్యాదు చేయడానికి, విమర్శించడానికి బదులు, ఉపాధ్యాయులను సంప్రదించి, వారితో సహకరించడం ద్వారా మీ పిల్లలకు సలహాదారులై యుండండి. మీరు అలా చేయడం ద్వారా మీ పిల్లవాడు పాఠశాలనుండి ఎంతో శ్రేష్ఠమైనది పొందడానికి వానికి సహాయం చేస్తారు.
[అధస్సూచీలు]
a క్రైస్తవ పరిచర్యను తమ ప్రవృత్తిగా ఎన్నుకుని, పూర్తికాల పరిచారకులుగా సేవచేసే యెహోవాసాక్షులకు, పయినీర్ సేవాపాఠశాలలో రెండు వారాల కోర్సుకు హాజరు కాగల అవకాశం ఉంది. వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ ఏర్పాటు చేస్తున్న, మిషనరీలనుగా తయారు చేయడానికి సహాయపడే, ఐదు నెలల మిషనరీ ట్రైనింగ్ కోర్సుకు వెళ్లడానికి కొందరు తర్వాత అర్హత పొందుతారు.
[10వ పేజీలోని బాక్సు]
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సత్సంభాషణకు మార్గాలు
1. మీ పిల్లవాడి ఉపాధ్యాయులతో పరిచయమేర్పర్చుకోండి.
2. ఏదైనా ఫిర్యాదు చేసే ముందు మీరు చెప్పబోయే వాస్తవాలను మరోసారి సరిచూసుకోండి.
3. బాధగా ఉన్నా లేక కోపం వచ్చినా, ఉపాధ్యాయునితో మాట్లాడే ముందు ఎప్పుడూ స్థిమితపడండి.
4. ఉపాధ్యాయున్ని కలిసే ముందు, మీరు అడగాలని అనుకుంటున్న ప్రశ్నలను వ్రాసుకోండి, మీరు చేరాలనుకుంటున్న గమ్యాలను పట్టిక వేసుకోండి.
5. మీ స్థానాన్ని దృఢంగా, స్పష్టంగా చెప్పండి, తర్వాత ఏదైనా సమస్యను అధిగమించడానికి ఏ ఆచరణాత్మక చర్యలు తీసుకోవచ్చో చూడడానికి ఉపాధ్యాయునితో సహకరించండి.
6. మిమ్మల్ని మీరు ఉపాధ్యాయుని స్థానంలో ఉంచుకొని ఆలోచించండి. అతని స్థానంలో మీరు ఉంటే ఏమి చేసేవారో ఆలోచించండి. సంతృప్తికరమైన ఫలితం కొరకు సంప్రదించడానికి ఇది మీకు సహాయం చేయగలదు.
7. శ్రద్ధగా విని, అవసరమైనప్పుడు మాట్లాడండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే, ప్రశ్నలడగడానికి భయపడకండి. వాళ్లు చెబుతున్న విషయాన్ని మీరు అంగీకరించకపోతే, అంగీకరించడం లేదని చెప్పండి, మీరెందుకలా భావిస్తున్నారో మర్యాద పూర్వకంగా వివరించండి.
—డా. డేవిడ్ లేవిస్ వ్రాసిన హెల్ప్ యువర్ చైల్డ్ త్రూ స్కూల్, అనే పుస్తకంపై ఆధారపడినది.
[9వ పేజీలోని చిత్రం]
మీ పిల్లవానితో కలిసి చదవండి
[9వ పేజీలోని చిత్రం]
పాఠశాల పాఠ్య ప్రణాళికను చర్చించడానికి ఉపాధ్యాయులను దర్శించండి
[9వ పేజీలోని చిత్రం]
మీ పిల్లవాడు ఐచ్ఛిక విషయాలను ఎన్నుకోడానికి సహాయం చేయండి